[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
[dropcap]నీ[/dropcap]లమత పురాణంలో ప్రధానంగా గమనించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. కశ్మీరు ఆవిర్భావం, అందుకు సంబంధించిన భూగర్భ శాస్త్ర, భౌగోళిక శాస్త్ర అంశాలను గతంలో విపులంగా చర్చించాము కాబట్టి మళ్ళీ వాటిని ప్రస్తావించటం పునరుక్తి అవుతుంది. ఇది కాక, గమనించాల్సిన ప్రధాన అంశాలలో ‘పండుగలు’ ఒకటి.
భారతీయ ధర్మంలో ‘ప్రతి రోజూ పండుగ’ అన్న భావం ఉంది. జీవితంలో ప్రతి రోజునూ భగవద్దత్తంగా భావించి దాన్ని ఆనందంగా, సంబరంగా, ధర్మబద్ధంగా గడపాలన్న భావన అడుగడుగునా కనిపిస్తుంది. అంటే ‘జీవితం ఒక పండుగ’, ‘life is a celebration’ అన్న మాట. కానీ ప్రస్తుత సమాజంలో గమనిస్తే ‘బ్రతుకు భారం’ అనిపిస్తుంది. అడుగడుగునా భయాలు, సంశయాలు, భారమైన బాధలు, అందోళనలు, చిరాకులతో ‘జీవితం ఒక శిక్ష’, ‘మరణం ఒక విముక్తి’ అన భావన కలుగుతుంది. ఇతర నాగరికతల వారు జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తుంటే మనం మాత్రం జీవితాన్ని మోయలేని బరువును మోస్తూ బ్రతుకుతున్నట్టు అనిపిస్తుంది. అర్థం లేని ఆంక్షల అడుగున నలిగిపోతున్నట్టు అనిపిస్తుంది. కానీ నీలమత పురాణంలోని పండుగలు జరుపుకునే విధానాన్ని పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
ఆశ్వయుజ మాసం పౌర్ణమి రోజున ‘నికుంభ’ పూజ జరుపుతారు. నికుంభుడు ఒక పిశాచం. ఈ తేదీన మానవుల శరీరాల్లోకి నికుంభుడు, అతని పిశాచ అనుచరగణాలు ప్రవేశిస్తాయని నమ్మకం. ఒక రోజంతా ఈ పిశాచాలు మానవ శరీరంలో ఉంటాయి. ఈ రోజును ‘కౌముది’ పండుగ దినంగా కూడా భావిస్తారు. కౌముది విగ్రహం తయారు చేస్తారు. పిల్లలు, గర్భిణీ స్త్రీలు తప్ప మిగతా అంతా రోజంతా ఉపవాసం ఉంటారు. చంద్రదర్శనం కావటంలో ఉపవాసం వదిలేస్తారు.
హోమం చేసి రుద్రుడు, చంద్రుడు, ఉమాదేవి, స్కంద, నందిని వంటి దేవతలను అర్చించాలి. మరుసటి రోజు ఉదయం ఒక రకంగా free for all, అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తించవచ్చు. ఎగరవచ్చు, దుంకవచ్చు, ఆడవచ్చు, పాడవచ్చు, ఒకరిపై ఒకరు బురద జల్లుకోవచ్చు. స్వేచ్ఛగా బూతులు వాడవచ్చు. ఇష్టం వచ్చినట్టు అడ్డు అదుపు లేకుండా ప్రవర్తించవచ్చు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు మనుషులు కారు. మనిషి శరీరంలో ఒదిగిన పిశాచాలు. అందుకని ఆరోజు బహిరంగంగా లైంగికపరమైన మాటలు మాట్లాడవచ్చు. అర్హులైన, ఇష్టమైన స్త్రీలను లైంగిక చర్యకు ప్రేరేపించవచ్చు. ఆ రోజంతా ఇలాగే అరుపులు, కేకలు, ఆటలు, పాటలతో గడపాలి. సాయంత్రం కాగానే శుభ్రంగా స్నానం చేయాలి. కేశవుడిని అర్చించాలి. అలా చేయని వాళ్ళు పిశాచాలే కాబట్టి వాళ్ళని దూషించాలి.
ఈ పండుగ జరుపుకునే విధానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక రోజంతా విచ్చలవిడిగా ప్రవర్తించే వీలును కల్పిస్తుందీ పండుగ. ఆ రోజు వాళ్ళ శరీరాల్లో పిశాచాలు ప్రవేశించాయి కాబట్టి వాళ్ళు పిశాచాల్లాగా ప్రవర్తించవచ్చు. సాయంత్రం అయ్యేసరికి పిశాచాల్ని వదిలించుకుని మామూలుగా అయిపోవాలి. దైవాన్ని ప్రార్థించాలి. పిశాచాల ప్రవర్తననకూ, మానవుల ప్రవర్తనకూ తేడా స్పష్టంగా చూపిస్తూ నిర్ణీత దినం తమలోని పిశాచాన్ని వదిలించుకుని మామూలుగా అయిపోయే వీలును కల్పిస్తోందీ పండుగ.
భారతీయులు జీవితాన్ని అనుభవించటం తెలియని వారు, నియమ నిబంధనల బరువున అణగిపోతూ నిస్పృహతో జీవితాన్ని భారంగా గడిపేవారు అన్న భావనను పటాపంచలు చేస్తాయి కశ్మీరంలో నీలమత పురాణం ప్రదర్శించిన పండుగలు. వీధులు వీధులు దీపాలంకరణలు చేయడం, సామూహిక నృత్యగానాలు, పెద్ద చిన్న, బీదా ధనవంతులు అన్న భావం లేకుండా అందరూ కలసి ఆనందంగా చేసుకునే పండుగలు, సామూహిక భోజనాలు వంటివన్నీ చూస్తుంటే ప్రాచీనకాలంలో భారతదేశం ఈనాడు మన చరిత్రకారులు వర్ణిస్తున్నట్టు లేదేమోనన్న భావాన్ని కలిగిస్తుంది.
భారతదేశంలో అభివృద్ధి చెందిన కళలు, భారతదేశంలో సృజించిన సాహిత్యం, సంగీతం, నృత్యం వంటివి చూస్తే జీవితాన్ని అనుభవించటం, జీవితం నుండి అనుక్షణం ఆనందరసాన్ని జుర్రుకోవటం, అదీ ధర్మబద్ధంగా, భారతీయులకు తెలిసినట్టు మరెవరికీ తెలియదనిపిస్తుంది.
ఇక పండుగల రోజు నాట్యాలు చేయటం, పురాణ గాథల పఠనం, వాటిని నాటకాలుగా ఆడటం వంటివాటితో పాటు తాగేవాళ్ళు తాగవచ్చు, పాటలు పాడే వాళ్ళు పాడవచ్చు అనటం కూడా ఈ ఆలోచనను బలపరుస్తుంది. అంతే కాదు, కశ్మీరులో ఏ ఒక్కరూ కూడా కడుపు నిండా తిండి లేకుండా, ఆనందంగా పండుగ జరుపుకోకుండా ఉండకూడదని చెప్తూ దానం విషయంలో అన్యాయం కూడదని చెప్పటం, నిత్య జీవితంలోని ఆనందాలను ధర్మబద్ధం చేస్తూ, ధర్మాన్ని నిత్యజీవితంలో ఆనందాలతో ముడివేస్తూ ధర్మమార్గంలో జీవించటం, ఆనందించటం, ఆనందం పంచటం అనేది సామాజిక కర్తవ్యం, వ్యక్తిగత బాధ్యత అన్న సత్యాన్ని ప్రజలకు చేరువ చేయటం స్పష్టంగా కనిపిస్తుంది.
(ముగింపు త్వరలో)