నీలమత పురాణం-89

9
7

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]’నీ[/dropcap]లమత పురాణం’ ప్రధానంగా నాగుల పురాణం. నీలుడు నాగుల పెద్ద. ‘నీలమత పురాణం’ పరిశీలిస్తూంటే ఒక ఆలోచన కలుగుతుంది.  బహుశా, మన దేశంలో, ఎలాగయితే ప్రతి కులానికీ ఒక పురాణం ఉందో,  ఆ కుల ఆవిర్భావాన్ని బ్రహ్మతో, సృష్టి ఆవిర్భావంతో ముడి పెట్టడం ఉందో, అలాగే ప్రతి జాతికీ ప్రాచీన భారతంలో ఒక పురాణం ఉండి ఉండేదేమో అనిపిస్తుంది. ప్రాచీన కాలంలో పురాణాలు మౌఖికంగానే ఒకరి నుంచి మరొకరికి, ఒక తరం నుంచి మరొక తరానికి అందేవి. ‘రాత’ వచ్చాక రాత ప్రతులు తయారయ్యాయి. కానీ రాత ప్రతులలో పొరపాట్లు, చేర్పులు, మార్పులు జరిగేవి. దీనితో ఒక పురాణం పలు విభిన్నమైన ప్రతులలో లభ్యమౌతోంది. నీలమత పురాణంపై పరిశోధించి డాక్టరేట్ పొందిన డాక్టర్ వేద్‌కుమారి దాదాపుగా మూడు ప్రతులు లభ్యమవుతున్నట్టు రాశారు. ఆ మూడు ప్రతులలో అక్షరాలలో తేడాలు, భావంలో తేడాలను పరిశీలించి, పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి ప్రతి ప్రాచీన భారత రాత ప్రతి విషయంలో ఒకటే. దీనికి తోడు ఎన్నో అమూల్యమైన గ్రంథాలు, వ్రాత ప్రతులు విదేశీ ముష్కరుల దాడుల్లో అంతూ పొంతూ లేకుండా పోయాయి. అనేకం తగలబడిపోయాయి, బూడిదైపోయాయి. వాటిని కంఠస్థం చేసినవారి కుత్తుకలు తెగిపోయాయి. లేదా వారు బలవంతాన మతం మారడం వల్లనో, ప్రాణభయం వల్లనో, మరే బలహీనత వల్లనో మతం మారటం వల్ల ఆయా కంఠస్థ శాస్త్రాలు, గ్రంథాలు అదృశ్యం అయ్యాయి. కాబట్టి భారతీయ చరిత్ర గురించి ‘ఇంతే’ అని ఖచ్చితంగా దేన్ని గురించీ చెప్పటం కుదరదు. లభ్యమైన గ్రంథాలు, శాస్త్రాల ఆధారంగా విశ్లేషించి ‘ఇది అయి ఉండవచ్చు’ అనుకోవటమే తప్ప నిర్ధారణగా చెప్పటం కష్టం.

‘నాగు’ల గురించి విదేశీయులు విస్తృతమైన పరిశోధనలు చేశారు. నాగ పూజ, దానికి సంబంధించిన పూజా విధానాలు, పలు దేశాలలో నాగ పూజ ఆవిర్భావం వంటి విషయాల పరిశోధనలను ‘ఓఫియోలేట్రియా’ అంటారు. అయితే ప్రపంచంలో ఇతర నాగరికతలలో ‘నాగ పూజ’కూ, భారతదేశంలో ‘నాగ పూజ’కూ తేడా ఉంది. ఇతర నాగపూజలలో ‘నాగు’ లను దుష్టమైనవిగా, పాపులుగా, చెడుకు ప్రతీకగా, సాతానుగా భావిస్తారు. అందుకే 1889లో ప్రచిరితమయిన ‘ఓఫియోలేట్రా’ అనే పుస్తకంలో (రచయిత ఎవరో తెలియదు) ఆరంభంలోనే నాగులను ఎందుకు పూజిస్తారో తెలియదని, ఇది తెలుసుకుంటే గాని అతి అసహ్యకరమైన, జుగుప్స కలిగించే దుష్టజీవిని ప్రపంచవ్యాప్తంగా అనాగరిక ప్రజలు ఎందుకు పూజించేవారో తెలుస్తుందంటూ ఆరంభమవుతుంది. భయంతోనో, అది దగ్గర రాకూడదనో నాగులను పూజించేవారు ప్రజలని తీర్మానిస్తారీ పుస్తకంలో. కానీ భారతీయ ధర్మంలో నాగులను భక్తితో పూజించటం కనిపిస్తుంది. భయం తోటో, జుగుప్స తోటో పూజించే లక్షణం భారతీయ ధర్మంలో లేదు. భయాన్ని జయించటం, జుగుప్సను అధిగమించటం భారతీయ ధర్మంలో ప్రధాన లక్షణం. ఎందుకంటే ఈ విశ్వమంతా ఈశ్వరుడే అయినప్పుడు దేన్ని చూసి భయపడాలి? దేన్ని అసహ్యించుకోవాలి?

‘నీలమత పురాణం’ ప్రకారం కశ్మీరు సతీసరోవరం జలంతో నిండి ఉండేది. గరుడుడి నుండి రక్షణ పొందేందుకు సతీసరోవరాన్ని ఆశ్రయించమన్న భగవానుడి ఆజ్ఞను అనుసరించి నాగులు కశ్మీరు చేరారు. కశ్యపుడు సతీసరోవరం నుండి నీటిని వెడలనడిపి, జలోద్భవుడనే రాక్షసుడిని సంహరింప చేసిన తరువాత కశ్మీరుకి మానవులను రప్పించాడు. వారితో సహజీవనం చేసేందుకు నాగులు ఒప్పుకోలేదు. దాంతో ఆరు నెలలు పిశాచాలతో, ఆరు నెలలు మనుషులతో సహవాసం చేయమని కశ్యపుడు శపించాడు. నాలుగు యుగాల తర్వాత శాపం ఉపసంహరించిన కశ్యపుడు మనుష్యులతో సహజీవనం చేయమన్నాడు. నాగులు ఒప్పుకున్నాయి. అప్పుడు మానవులు చేయాల్సిన పూజలు, పాటించాల్సిన విధులు, నియమాలు, విధానాలు అన్నీ నీలుడు చెప్తాడు. మిగతావాటిని బృహదశ్వుడు వివరిస్తాడు. 80% ‘నీలమత పురాణం’ చెప్పింది నీలుడే. అంటే ‘నాగులు’ మనం భయం పడవల్సినవి, అసహ్యించుకోవాల్సినవి కావు. వాళ్ళు ‘slithering creature’  అన్న నాగును మనం ‘భుజంగం’ అని పూజిస్తాం. ‘నాగు’ అన్నది వేరే లక్షణాలున్న మనుషుల్లోని ఒక ప్రత్యేక జాతి అనుకోవాల్సి వస్తుంది. ‘నీలమత పురాణం’లో ‘సదాంగుళుడు’ అనే నాగు మానవ స్త్రీలను ఎత్తుకుపోతుంటే, నీలుడు అతడిని కశ్మీరం నుంచి బహిష్కరించాడు. ‘దార్వ’ దేశంలో ‘ఉషీరక’ పర్వతంపై నివసించాడు సదాంగుళుడు.

‘విశ్వగశ్వ’ అనే రాజు నుంచి మహాపద్ముడనే నాగు ‘చంద్రపుర’ను పొంది, ఆక్రమించాడు. నీలమత పురాణంలో 603 నాగుల పేర్లున్నాయి. నాగుల పూజా విధానాలున్నాయి. కాబట్టి ‘నాగులు’ అన్న పేరును బట్టి ‘పాములు’గా భావిస్తున్నా  ‘నాగులు’ పాములు అని ఖచ్చితంగా అనుకునే వీలు లేదు. అలా అనుకుంటే నాగులు దేవుడిని పార్థించటం ఏమిటి? మానవ స్త్రీలను ఎత్తుకుపోవటం ఏమిటి? నాగులను పూజించటం ఏమిటి? అన్న సందేహాలు ఉదయిస్తాయి. ఆ వెంటనే మనవాళ్ళంతా ‘అభూత కల్పన’లలో అగ్రశ్రేణి అన్న చులకన భావం కలుగుతుంది. కానీ నీలమత పురాణంలో నాగుల ‘పడగ’ తప్ప మరో వర్ణనలో వారు ‘పాము’లు అన్న భావన రాదు. ‘విష కోరల’ ప్రసక్తి రానే రాదు. పైగా, నాగుల వర్ణన, ఇతర వీరుల వర్ణన లాగే ఉంటుంది. ఈ వర్ణనలు చూసి కొందరు ఈ నాగులు ఆర్యేతరులన్న అభిప్రాయం కూడా వ్యక్తపరిచారు. గమనించాల్సిందేంటంటే, నాగులు మనుషుల్లాంటి వారయితే, వారు ఆర్యేతరులు. కాకపోతే, పురాణాలు అభూత కల్పనలు!

వేదంలో ‘నాగు’ల ప్రస్తక్తి ప్రత్యక్షంగా లేదు కాబట్టి, ఆర్యుల శత్రువులను దుష్టులు అంటుంది వేదం కాబట్టి, నాగులు ఆర్యుల శత్రువులని తీర్మానించారు. వృత్రాసురుడిని నాగుగా భావించి వారంతా నాగపూజలు చేసే వారని భావించారు. శతపథ బ్రాహ్మణంలో వృత్రుడిని నాగు అని, దానవుడని అన్నారు కాబట్టి ఈ ఆలోచనను నిర్ధారించేశారు. పైగా మహాభారతంలో దానవ నాయకుడిని వృత్రుడన్నారని, అతడిని ‘కాలేయుడు’ అన్నారని, కాబట్టి నాగులు ఆర్యుల శత్రువులని నిర్ధారించారు. అధర్వ వేదం, తైత్తరీయ సంహిత, తైత్తరీయ బ్రాహ్మణం, చాందోగ్యోపనిషత్తు, గృహ్య సూత్రాలలో ‘నాగ పూజ’ ప్రసక్తి ఉంది కాబట్టి ఇవి ఆర్యులు, ఆర్యేతరుల పూజా విధానాలను కలుపుకోవటంలో భాగం అని తీర్మానించారు. ఆన్ని ఊహలు వాళ్ళవే. నాగులు పుక్కిటి పురాణం అన్నదీ వాళ్ళే. నాగులు ఆర్యేతరులు అన్నదీ వాళ్ళే. వృత్రాసుర జాతి నాగ పూజ చేసేవారు అన్నదీ వాళ్ళే. ‘నాగ పూజ’ ఆర్యేతరులపై విజయం సాధించిన ఆర్యులు, వారిని తమలో కలుపుకోవటంలో భాగం అన్నదీ వాళ్ళే. ఇందులో పురాణాలు, భారతీయ శాస్త్రాల ప్రసక్తి లేనే లేదు. ఒకటి ఊహించి, ఆ ఊహ నిజమనుకుని, దాన్ని నిజమే అని నిర్ధారించి, స్థాపించటం కనిపిస్తుంది.

‘నీలమత పురాణం’ చదువుతుంటే  నాగులకూ, మానవులకు నడుమ ఎలాంటి ఘర్షణ కనబడదు. నాగులు అనుచితంగా ప్రవర్తిస్తే వారిని నాగుల రాజు శిక్షించటం కనిపిస్తుంది. మనుషులు నాగులను గౌరవించటం పూజించటం కనిపిస్తుంది. ఒక నాగుకి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు రాజు తన నగరాన్ని, ప్రజలతో సహా వదిలి వెళ్ళటం కనిపిస్తుంది. అంతే తప్ప, నాగులను అణచివేసి, గెలిచి, వారి పద్ధతులను తమలో మిళితం చేసుకుని, తాము కూడా వారి పూజలను నిర్వహించటం కనబడదు. గెలిచినవాడు ఓడినవాడిన తన బానిస చేసుకుని మార్చటం అర్థం చేసుకోవచ్చు, కానీ ఓడినవాడి పద్ధతులను అనుసరించటం అర్థవిహీనం. ఇది జరగాలంటే యుద్ధం కాదు, గెలుపోటములు కాదు, గెలుపు ఓటముల ప్రసక్తి లేని  పరస్పర  గౌరవం, స్నేహ సౌహార్ద్ర భావనలు కావాలి.  వసుధైక కుటుంబకం అన్న అవగాహన కావాలి. అంతా ఒక్కటే అన్న విశ్వాసం కావాలి. ఇదే భారతీయధర్మం. ఇదే భారతీయత. ఇదే సనాతనధర్మం. ఇదే నీలమత పురాణం.

(ముగింపు త్వరలో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here