నీలమత పురాణం-94

2
5

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

యత్రో స్రీణామపి కిమపరం జన్మభాషావదేవ।
ప్రత్యావాసాం విలసతి వచః సంస్కృతం ప్రాకృతం చ॥

(విక్రమాంకదేవ చరిత్ర, బిల్హణుడు)

[dropcap]’నీ[/dropcap]లమత పురాణం’ చదువుతుంటే కొట్టొచ్చినట్టు కనబడేది  ప్రాచీన కశ్మీరంలో మహిళల స్థానం. సాధారణంగా, భారతీయ ధర్మంలో మహిళలను అణచివేశారని, వంటింటికి పరిమితం చేశారని, మహిళలకు స్వేచ్ఛ లేక ఇనుప సంకెళ్ళలో బంధించారని వ్యాఖ్యలు, దూషణలు వింటూంటాం. కొందరు వేదికలెక్కి మనువు స్త్రీల బలాత్కారాన్నిప్రోత్సహించాడని ఆవేశంతో ఊగిపోతూ అనృతాలు అవలీలగా అనేస్తూంటారు. ఇంకొందరు మాటి మాటికీ భారతీయ ధర్మం ఒక్కటే మహిళలను నీచంగా చూసిందనీ దూషిస్తూంటారు. వీళ్ళ వాదనలూ, ఆవేశపు అరుపులు, శాపనార్థాలు వింటుంటే నిజంగా భారతీయ ధర్మం స్త్రీలకు ఎంత అన్యాయం చేసిందోనన్న భావన కలుగుతుంది. కానీ నీలమత పురాణం చదువుతుంటే అత్యంత ఆశ్చర్యం కలుగుతుంది. మన చరిత్రను మన దృష్టితో చూడలేని మన దౌర్భాగ్యం మనసు గ్రహిస్తుంది.

కశ్మీరు ఆవిర్భావం నుంచీ వర్ణిస్తుంది నీలమత పురాణం. కశ్మీరు ప్రజల సాంస్కృతిక జీవనాన్ని వర్ణిస్తుంది. ఎక్కడ కూడా మహిళలు తక్కువ అన్న ఆలోచన కూడా కనబడదు. మహిళలు వంటింటికే పరిమితం అనీ, భర్తల సేవలు చేయటం, పిల్లల్ని కని పెంచటానికే పరిమితం అనీ, పురుషుడి భోగ్య వస్తువు స్త్రీ అని ఎక్కడా లేదు. పురుషులని తప్పు దారి పట్టిస్తుందనీ, నరకానికి రహదారి అనీ లేదు. కశ్మీరంలో మహిళలు అన్నింటిలో స్వేచ్ఛని అనుభవించారు. ఇది నీలమత పురాణం, రాజతరంగిణిలలో మాత్రమే కాదు, బిల్హణుడు రాసిన విక్రమాంకదేవ చరిత్రలో కూడా కశ్మీరీ మహిళల అందాన్నీ, పాండిత్యాన్ని పొగడడం కనిపిస్తుంది. సంస్కృత, ప్రాకృత భాషలలో వారు నిష్ణాతులనీ, చక్కగా మాట్లాడతారన్న వ్యాఖ్య కనిపిస్తుంది.

నీలమత పురాణంలో మహిళలు స్వేచ్ఛగా సమాజంలో తిరగటం కనిపిస్తుంది. పలు సందర్భాలలో మహిళలు స్నేహితులతో, బంధువులతో వనాలలో విహరించటం, కొండ కోనలలో ఆడటం వంటి  ప్రస్తావనలుంటాయి. భర్త ‘స్త్రీ సహాయేన’ వన విహారాలు చేయటం, రాత్రిళ్ళు చంద్రదర్శనాలు చేయటం వంటివి ఉంటాయి. కశ్మీరులో ప్రవహించే స్వచ్ఛమైన నీటి ప్రవాహంలో కశ్మీరు మహిళలు విహరించటాన్ని నీలమత పురాణం ప్రస్తావిస్తుంది. ప్రతి పండుగలో మహిళలు పురుషులతో సమానంగా పాల్గొనడం కనిపిస్తుంది. కౌముది మహోత్సవంలో రాత్రి పూట వెన్నలలో భర్తతో కలిసి యజ్ఞం చేయటాన్ని నీలమత పురాణం వివరిస్తుంది. రాత్రంతా సంగీత, సాహిత్య, నృత్య కార్యకలాపాలతో ఆనందించటం తెలుస్తుంది. భర్త, బంధువులు, స్నేహితులు, భృత్యులు అందరితో ఆడి పాడడం ఉంది. పెద్ద వారిని పూజించటం ఉంది. విందు భోజనాలతో అందరితో హాయిగా పాల్గొంటుంది. ముఖ్యంగా పంటలు పండించటం ఆరంభించేటప్పుడు సంగీతం, నృత్యాలతో జరిపే పూజలలో అందరి కన్నా ముందు ఉండేది మహిళలే. పురుషుడు పొలంలో పూజలు చేస్తుంటే మహిళ ఇంట్లో నాలుగు గోడల మధ్య కూర్చోవటం ప్రాచీన కశ్మీరంలోనే కాదు ప్రాచీన భారతంలో కూడా లేదు. ‘ఇరామంజరి’ పూజ లోనయితే మహిళలందరికీ పూలు, పూలమాలలు సమర్పించి పూజించటం ఉంది. మహిళలు పళ్ళు, పూల తోటలకి వెళ్ళి పళ్ళు, పూల చెట్లను పూజిస్తారు. అవకాశం దొరికినప్పుడల్లా మహిళలు నదులు, సరస్సులలో ఆడమని చెప్పటం కనిపిస్తుంది. ‘క్రీడితవ్యం విశేషేణ కుమారీభిస్తథా జలే‘ అంటుంది నీలమత పురాణం. హాయిగా జలాలలో ఆడుకోవాలిట మహిళలు. అంటే ఎక్కడా మహిళలు ఇల్లు దాటకూడదని, వంటింటికి పరిమితమని, పురుషుల చెప్పుచేతలలో ఉండాలని లేదు. ముఖ్యంగా పిశాచాలను పూజించే సమయంలోనైతే ఒళ్ళంతా బురద పూసుకుని పిశాచాలను ఆహ్వానించి నచ్చిన వారితో గడపవచ్చనీ ఉంది. మహీమాన ఉత్సవాలలో మహిళలు అందంగా అలంకరించుకుని పురుషులతో క్రీడించవచ్చని ఉంది.

స్త్రీభార్భావ్యం ప్రహ్పెష్టాభిః సువస్త్రాభి స్తథైవ చ।
భూషణైర్భూషితా భిశ్చ క్రీడిత్వం నరై సహ॥

శుభ్రవస్త్రాలు ధరించి, అందంగా అలంకరించుకుని ‘నరులతో క్రీడించాలి’ అంటుంది నీలమత పురాణం. భర్త, బంధువులు అంటూ నియమ నిబంధనలు ప్రకటించదు. ఇక ప్రతి పండుగ సందర్భంలో, ప్రతి ఉత్సవంలో మహిళలను పూజించాలని, వారికి బహుమతులు సమర్పించాలని ప్రత్యేకంగా నొక్కి వక్కాణించటం కనిపిస్తుంది. అంతే కాదు, తన స్నేహితుడి భార్యకి కూడా బహుమతులు ఇవ్వాలి అని స్పష్టంగా ఉంది. స్నేహితుడి భార్యకు బహుమతులు ఇవ్వటం మామూలు సమాజంలో కుదరని పని. ఎంతో విశ్వాసం, స్వేచ్ఛ, నిజాయితీ ఉన్న సమాజంలోనే ఇది సాధ్యం. అలాంటి వాతావరణం ప్రాచీన భారతీయ సమాజంలో ఉండేదని నీలమత పురాణం స్పష్టం చేస్తోంది. మదన త్రయోదశి పర్వం రోజు భర్త భార్యకు తప్పనిసరిగా స్నానం చేయించాలి. భార్యను ఇంటికి దీపంగా వర్ణిస్తుంది నీలమత పురాణం. కశ్మీరు మహిళలు అందానికి, సౌభాగ్యానికి, ఆరోగ్యకరమైన కుటుంబ వాతావరణానికి పెట్టింది పేరు అంటుది నీలమత పురాణం. మహిళలు అందంగా అలకరించుకోవడాన్ని ‘ప్రతికర్మ’ అంటుంది నీలమత పురాణం.

మహిళలకి ప్రత్యేక పర్వాలు కూడా కశ్మీరంలో ఉండేవి. చందోత్సవం మహిళకి ప్రత్యేకం. ఆ దైవాన్ని మహిళలే పూజించాలి. రజస్వల కశ్మీరాదేవికి స్నానం మహిళలే చేయించాలి. ‘చతుర్థా త్రీవయ’ మహిళల పండుగ.

నీలమత పురాణంలో దేవీదేవతల పేర్లు కలిపి చెప్పటం కనిపిస్తుంది. నీలమత పురాణంలో కనిపించినంతమంది మహిళా దేవతలు ఇతర పురాణాల్లో అరుదుగా కనిపిస్తారు. అశోకిత, శ్యామా, దుర్గ, శ్రీ, కరీశిని, భద్రకాళి, భేద, కపింజలి, సురేశ్వరి, భద్రేశ్వరి, గౌతమేశి, కళాశిలా, ఉద్యోగశ్రీ, గవాక్షి, చండిక, గౌరి, సువిజయ, శాకుని, బ్రహ్మచారిణి, చక్రేశ్వరి, గృహదేవి… ఇలా అడుగడుగునా మహిళా దేవతల ప్రస్తావన వస్తుంది. ఇక నదులన్నీ దేవీ స్వరూపాలే. ఉమాదేవి వితస్థ, అదితి త్రికోటి, శచి హర్షపదం, దితి చంద్రావతి, లక్ష్మి విశోక… ఇలా మహిళా దేవతలు నదుల రూపం ధరించి కశ్మీరులో ప్రవహిస్తూ కశ్మీరును పవిత్రం చేస్తున్నారు. కశ్మీరు భూములని సస్యశ్యామలం చేస్తున్నారు. అసలు కశ్మీరు దేశమే ఉమాదేవి స్వరూపం.

నీలమత పురాణంలో నృత్యం చేసి గానం చేసే మహిళలను అత్యంత భక్తిభావంతో, శ్రద్ధగా, గౌరవంగా, పవిత్రంగా ప్రస్తావించటం కనిపిస్తుంది. అంతే కాదు, ఇలాంటి స్త్రీల వైపు దుష్టపు దృక్కులు ప్రసరించరాదని, వారిని పవిత్రంగా చూడాలని కశ్మీరీ సాహిత్యంలో పలు సందర్భాలలో కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏదైతే ‘దేవదాసి’ వ్యవస్థ  అని మనం ఈసడించుకుంటున్నామో, దాన్ని ప్రస్తావించుకుని సిగ్గుపడుతున్నామో, మనల్ని మనం దూషించుకుంటూ నేరస్తులుగా భావించుకుంటున్నామో,  ప్రాచీన కాలంలో ఆ వ్యవస్థ  విదేశీయుల ప్రభావంతో  మలినం కాకముందు అత్యంత పవిత్రము, గౌరవప్రదము, పూజనీయము అయిన వ్యవస్థ అన్నమాట. కల్హణుడు, క్షేమేంద్రుడు, సోమదేవుడు వంటి కశ్మీరీ సాహిత్యవేత్తలు ఈ వ్యవస్థను ఎంతో పవిత్రంగా ప్రస్తావించారు.

కశ్మీరంలో స్త్రీలు సమాజంలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను అనుభవించారని ప్రాచీన కశ్మీరు చరిత్రను ఒక్కసారి పైపైన స్పృశించినా తెలుస్తుంది. శ్రీకృష్ణుడితో యుద్ధంలో కశ్మీర రాజు మరణిస్తాడు. కశ్మీరును ఆక్రమించమని మంత్రులు సూచిస్తే, శ్రీకృష్ణుడు ఒప్పుకోడు. ‘కశ్మీరాః పార్వతీ‘ అంటాడు. కశ్మీరు పార్వతి. కాబట్టి రాజు శివాంశజుడు. అలాంటి పవిత్ర కశ్మీరంపై చెడు దృష్టి ప్రసరించవద్దు అని గర్భవతిగా ఉన్న రాణి యశోవతికి రాజ్యాధికారం అప్పజెప్తాడు. ఆమె చక్కగా పాలిస్తూ, తన సంతానం పెరిగి పెద్ద అయ్యాక, రాజ్యం అతనికి అప్పగిస్తుంది. అప్పటి నుంచి కశ్మీరం సుల్తానుల అధీనంలోకి వచ్చేవరకు ఎంతోమంది మహిళలు కశ్మీరాన్ని పాలించారు. రాణి సుగంధాదేవి, రాణి రత్నమతి, రాణి సూర్యప్రభ, రాణి అనంతప్రభ, రాణి అమృతప్రభ, రాణి హంస, రాణి లల్లా, రాణి అంజనా వంటివారు కశ్మీరు చరిత్రలో కీలకపాత్ర పోషించారు. రాణి డిద్దా దేవి నలభై ఏళ్ళు రాజ్యం చేసి కశ్మీరు చరిత్రలో మణిహారంలా నిలుస్తుంది. కశ్మీరు చివరి రాణి కోటరాణి.  తన సైన్యాన్ని ఓడించి, తనను కాంక్షించిన సుల్తానుకు  తన ప్రేగులను కానుకగా పంపిన ధీశాలి. కానీ కశ్మీరం ఇస్లాంమయం అవటంతో పదిహేనవ శతాబ్దం నుంచీ కశ్మీరు మహిళ, ఇతర ప్రాంతాలలోని భారతీయ మహిళలానే పరదా మాటున దాగింది.

(ముగింపు వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here