నీలవేణి

0
8

[box type=’note’ fontsize=’16’] తోటి జంటలు ఆనందంగా ఉంటున్నారని భ్రమసి, వారిలా ఉండడని తన భర్తని అపార్థం చేసుకుని తాను తీసుకున్న నిర్ణయాన్ని ఆ భార్య ఎందుకు మార్చుకుందో ‘నీలవేణి’ కథలో చెబుతారు ముమ్మిడి శ్యామలా రాణి. [/box]

[dropcap]“నీ[/dropcap]లవేణమ్మా!.. అమ్మగారు బోజనానికి రమ్మంటున్నారు” అని రంగమ్మ అనగానే, చదువుతున్న నవల ‘ప్రేమా! జోహార్లు’ కోపంగా ప్రక్కన పెట్టి “ఇంకోసారి నీలవేణమ్మా అని పిలిచావో ఊరుకునేది లేదు” అని రయ్యమని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళింది.

“అరగంట నుండి పిలుస్తున్నాను ఏం చేస్తున్నావే! ఎప్పుడు చూసినా టి.వి చూడడం, నవలలు చదవడం ఇవి తప్ప మరో లోకం లేదు. వారం రోజులలో పెళ్ళి పెట్టుకొని పని నేర్చుకుందాం, పెళ్ళయినాక భర్తకి వండి పెట్టాలి, ఎలా వండి పెడదామో ఏమిటో అన్న ఆలోచనే లేదు. ఇప్పటి నుండి అయినా నా దగ్గర వంట నేర్చుకో నీలవేణీ” అంది పద్మావతి.

“అబ్బబ్బ.. అలా సాగదీస్తూ నీలవేణీ అని పిలవకపోతే మద్దుగా ప్రేమగా ఆ వెదవ పేరుని కట్ చేసి పిలవొచ్చుకదా మమ్మీ!” అంది.

చిన్నగా నవ్వింది పద్మావతి.

“నాకు ఒక ప్రక్క వళ్లు మండిపోతుంటే నవ్వుతావెందుకమ్మా? అయినా లోకంలో లక్షల పేర్లు ఉండగా ఈ వెధవ పేరే దొరికిందా? ఎవరు చూసినా పేరు సాగదీస్తూ పిలుస్తారు.. అన్నట్లు ముందు రంగమ్మకి చెప్పు.. నీలవేణమ్మా అని పిలవొద్దు అని” అంది కోపంగా.

“అంత చక్కటి పేరుని వెధవ పేరు అంటావేమిటే! ఇరవై ఏళ్ళు వచ్చినా మంచి ఏమిటో చెడు ఏమిటో నీకు తెలియడం లేదు. అయినా ఇది నీ తప్పు కాదులే!.. వెధవ సినిమాలు, సీరియల్స్ కొన్నాళ్లు చూడడం మానేయ్!.. ముందు అన్నం తిను.. నాకు బోలెడు పని ఉంది!” అంది.

కంగారుగా రంగమ్మ పరిగెత్తుకొని వచ్చి అంది.

“అమ్మా! పోస్టు వచ్చిందమ్మా.. సంతకం పెడితే కవర ఇస్తాడట” అంది రంగమ్మ.

“ఎవరు సంతకం పెట్టాలే!..” అంది పద్మావతి.

భయంగా నీలవేణి వైపు చూసి “అది… అది” అంది రంగమ్మ.

“అబ్బబ్బ.. ఎవరి సంతకం అంటే చెప్పవేం?” అంది చిరాగ్గా పద్మావతి.

“పోస్టు నీలవేణమ్మగారికమ్మా” అంది గబాలున రంగమ్మ..

ఆ మాట విని కోపంగా నీలవేణి చూసేంతలో “ఎవరండీ నీలవేణీ? ఉన్నారా ఇంట్లో” అన్నాడు గుమ్మం దగ్గర నుండి పోస్టుమాన్!

కోపంగా రంగమ్మ వైపు చూసి గుమ్మం వైపు గబగబా నడిచింది నీలవేణి.

***

కళ్యాణ మండపం అంతా పెళ్ళి వారితో నిండిపోయింది.

నీలవేణిని స్నేహితులు ఆటపట్టిస్తున్నారు… నీలవేణి హాయిగా నవ్వుతుంది.. “అన్నట్లు వీళ్ళ ఆయన దీనిని ఏమని పిలుస్తారంటావ్? కొంపదీసి అందరూ పిలిచినట్లు నీలవేణీ అని పిలుస్తాడా లేక…” అని రమ్య అంటుండగానే “ఏడ్చావ్? అతనేమైనా పప్పుసుద్ద అనుకుంటున్నావా? సాఫ్ట్‌వేర్ ఇంజనీరు.. అందులోకి పుట్టి పెరిగింది హైద్రాబాద్! పబ్స్, పార్టీలలో తిరిగే మనిషై ఉంటాడు. దీనిని పూర్తిగా మోడ్రన్‌గా మార్చేస్తాడు ఏమో.. ఇక దీనిని నీలూ అనో, వేణు అనో పిలుస్తాడో లేక ఇంకా మంచి ముద్దు పేరు పెడతాడో? ఎనీవే మన నీలూ చాలా లక్కీ ఫెలో” అంది నళిని. వాళ్ళ మాటలతో ఊహలోకంలోకి వెళ్ళిపోయింది నీలవేణి..

పెళ్ళయిపోయింది.. గుమ్మాల దగ్గర ఒకరి పేర్లు ఒకరు చెప్పి ఇంటిలోకి వెళ్ళే చోట తెగ సిగ్గు పడిపోసాగింది నీలవేణి.

నీలూ, విజయ్ కలిసి వచ్చారు అని చెబుతాడా లేక వేణి, విజయ్ కలిసి వచ్చారు అని చెబుతాడా? ఆలోచనల్లో పడింది నీలవేణి.

“నేను నీలవేణి కలిసి వచ్చాం” అన్న మాట విని షాకయింది నీలవేణి..

వళ్ళు మండిపోయింది నీలవేణికి.. కోపంగా క్రీగంట విజయ్ వైపు చూసింది నీలవేణి.

ఏదో ఘనకార్యం చేసిన వాడిలా నవ్వుతూ నీలవేణి వైపు చూడడం చూసి, చప్పున ముఖం తిప్పుకుంది నీలవేణి.

మొదటి రాత్రి… మంచంకి ప్రక్కగా నిలబడిందే కాని ఆలోచనల్లో పడింది నీలవేణి…

విజయ్‌ని అనవసరంగా అపార్థం చేసుకుంటుంది ఏమో! అంత మందిలో తనని ముద్దుగా ప్రేమగా పిలవడం ఎందకని, అలా పూర్తి పేరు పెట్టి పిలిచి ఉంటారు అనుకొని మనసుని సమాధాన పరచుకొంది నీలవేణి.

తను కోరుకున్నట్లు అందమైనవాడు, పెద్ద ఉద్యోగస్తుడు, అన్నీ ఉన్న విజయ్‌తో పెళ్ళయింది.. హాయిగా లైఫ్‌ని ఎంజాయ్ చెయ్యాలి! సన్నగా దగ్గు వినిపించడంతో ఆలోచనల నుండి తేరకొని చటుక్కున తల తిప్పి విజయ్ వైపు చూసింది.

“రా! నీలవేణీ! అలా నిలబడిపోయావేం? ఇప్పుడు మనం భార్యాభర్తలం.. నా దగ్గర సిగ్గు, మొహమాటం ఎందుకు? అన్నట్లు నీలవేణీ!.. ఉండుండి దగ్గు వస్తుంది. నీళ్లు తేడా చేసాయి ఏమో? కాఫ్ సిరప్ ఉందా నీలవేణీ?”

నీలవేణీ అని మాటకి ముందు వెనుక పేరు చేర్చి, తొలి రాత్రి ప్రేమగా దగ్గరకు తీసుకు మాటా మంతీ అయినా కాకుండానే సాగదీస్తూ నీలవేణీ కాఫ్ సిరప్ కావాలని అడుగుతాడేం? అనుకొంది.

“నీలవేణీ!.. నన్ను ఎదురుగా పెట్టుకొనే ఏమిటో ఆలోచనల్లో పడ్డావ్? కాఫ్ సిరప్ లేదా? అన్నట్లు పాలు చల్లారిపోయినట్లున్నాయి? ఇంకో గ్లాసు తీసుకు రాలేదా?” అని విజయ్ అనగానే ఆశ్చర్యంతో నోట మాట రాలేదు నీలవేణికి. ఇదెక్కడి మనిషి. పాలు తాగడానికి రెండు గ్లాసులు కావాలా? ఇలా షాక్ మీద షాక్‌లు ఇస్తున్నాడేంటి? అనుకుంది.

“నీలవేణి! పాలు తాగేసేయ్.. నాకు రాత్రి పూట పాలు తాగే అలవాటు లేదు..” అని విజయ్ అనగానే ఒళ్లు మండిపోయి “నాకు అలవాటు లేదు” అంది.

“అనవసరంగా పాలు వేస్ట్ చేయడం ఎందుకు?” అని పాల గ్లాసు అందుకొని గటగటా తగేసి, “ఇంట్లో పాడి ఉందా నీలవేణీ పాలు చాలా బాగున్నాయి. మా హైద్రాబాదులో ఇంత మంచి పాలు దొరకవు” అన్నాడు.

నీలవేణికి భూమి గిర్రున తిరిగుతున్నట్లు అనిపించింది.

“లైటు ఉంటే నిద్ర పట్టదు నీలవేణీ!.. లైటు ఆఫ్ చేసి రా! ” అని విజయ్ అనగానే తెల్లబోయింది నీలవేణి. లైటు ఆర్పకపోతే నిద్ర పట్టదా? ఛ! ఛ! ఏ మనిషి? ఇదెక్కడి విడ్డూరం? ఏదో పాతికేళ్ళ బట్టి కాపురం చేస్తున్న భర్యతో మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడు.

“నీలవేణీ!… ఇలా రా? అంత దూరంగా పడుకున్నావేం?” అని నీలవేణి చేయి పట్టుకున్నాడు.

నీలవేణి కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. దుఃఖంతో వెక్కిళ్ళు పడసాగింది.

తను అనుకున్నది ఏమిటి? జరుగుతున్నది ఏమిటి?

“నీలవేణీ!.. అరె!.. అలా ఏడుస్తున్నావు ఏమిటి? ఛ!.. ఛ!.. ఎందుకు? నన్ను చూస్తుంటే భయంగా ఉందా?”

“ఒ.కె.. ఒ.కె.. నేను నిన్ను బాధపెట్టను.. సరేనా? నీకు నేనంటే భయం పోయినప్పుడు.. ఒ.కె.. ఒ.కె.. గుడ్ నైట్ నీలవేణీ” అని ప్రక్కకు తిరిగి పడుకున్నాడు విజయ్!

***

రోజులు గడుస్తున్నాయి చాలా భారంగా నీలవేణికి. తన మనసులో ఉన్న చిన్న చిన్న కోరికలు విజయ్‌తో ఎలా చెప్పాలో తెలియక సతమమవసాగింది నీలవేణి.

“నీలవేణీ! ఆఫీసుకి వెళుతున్నాను. తలుపువేసుకో? అన్నట్లు నా ఫ్రెండ్సు నలుగురు డిన్నర్‌కి వస్తారని చెప్పాను గుర్తుందా? అరె నేను ఒక ప్రక్క మాట్లాడుతుంటే వినిపించుకోవేం? నీకు ఊహలోకంలో విహరించడం అలవాటు కదూ నీలవేణీ ? ”

“చాల్లేండి.. ఊహాలోకం ఒక్కడే నా మొహానికి తక్కువ?” అంది కోపంగా

“నీలవేణీ!.. సరదాగా అన్నాను.. సీరియస్ అయిపోయావ్ ఏమిటి?..” అన్నాడు నవ్వుతూ.

“విజయ్.. ప్రతీ నిమిషం నీలవేణీ!.. నీలవేణీ! … అని సాగదీస్తూ పిలవకండి.. ఎన్నో కలలు కన్నాను… ప్చ్.. కనీసం ప్రేమగా ముద్దుగా నీలూ అనో వేణీ.. అని కూడా పిలిపించుకోలేకపోయాను.. ఆపీసు నుండి వస్తూ పూలో, అప్పడప్పుడు అలా బయటకు తీసుకు వెళ్ళడమో, సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లో ఏవో ఒకటి చెయ్యాలనో, తేవాలనో ఏం తెలియని మనిషిని మిమ్మలనే చూసాను” అంది కోపంగా నీలవేణి!

ఒక్క నిమిషం ఆశ్చర్యంగా చూసి అన్నాడు… “నేను నీ పేరు పెట్టి పిలవడం నీకు బాధగా ఉందా?.. నిజం చెప్పనా నీలవేణీ! నీ పేరంటే నాకు చాలా ఇష్టం!..”

“ఇక నిన్న నేను చాలాసార్లు బయటకు వెళదామా అన్నాను. బజారుకి వెళదామా? షాపింగ్ ఏమైనా చేస్తావా? అన్నాను.. ఇక పూలు.. నేను.. నేను.. ఎప్పుడు కొనలేదు.. అలాంటివి నిజం చెప్పాలంటే నాకు తెలియదు. అయినా గార్డెన్‌లో చాలా పూలచెట్లు ఉన్నాయి కదా? కావాలంటే పెట్టుకుంటావులే అనుకున్నాను… అనవసరంగా లేనిపోనివి ఊహించుకొని బాధపడకు నీలవేణీ” అన్నాడు.

“మీరు.. మీరు ఇంకేం మాట్లాడకండి.. మీకు భార్యకి సరదాగా పూలు తీసుకు రావడమే కాదు ఏం కావాలో… తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించరు.

నిన్న సినిమాలో హీరో ఫ్యాక్టరీ నుండి వస్తూ బుట్టడు మల్లెపూలు హీరోయిన్‌కి తెచ్చాడు.. ఆ పూలు చూసి హీరోయిన్ కళ్ళల్లో కోటి కాంతులు కనబడతాయి. ప్చ్.. అవన్నీ మీకు అర్థం కాదు లెండి.

ఇక హీరోయిన్ పేరు పాత పేరు పార్వతి.. హీరో ఎంతో వినసొంపుగా పారూ.. అని పిలుస్తాడు.. మా ఫ్రెండ్ పేరు సరోజిని.. వాళ్ళ ఆయన సరూ… సరూ.. అని పిలుస్తాడట. ఆఫీసు నుండి వస్తూ దాని కిష్టమైన స్వీటు తెస్తాడుట. ప్చ్.. అయినా పిచ్చిదానిని.. ఇవన్నీ మీకు ఎందుకు చెప్పడం.. నేను.. నేను.. ఆడదాని నేనండి.. నాకు కోరికలుంటాయి…” అనగానే గభాలున దగ్గరకు వెళ్ళి.. “నీలవేణీ.. నేను.. నేను.. నిన్ను నాకు తెలియకుండానే బాధపెడుతున్నట్టున్నాను.. ఇక మీదట నీ మనసు సంతోషం పెట్టడానికి ప్రయత్నిస్తాను నీ.. ల.. వేణీ” అని ఏదో తప్పు చేసిన వాడిలా తలదించుకున్నాడు.

నిర్లిప్తంగా నవ్వి అంది.. “నమ్మమంటారా?.. రాత్రంతా తల నొప్పితో బాధపడ్డాను.. అయినా అదేం పట్టించుకోకుండా ఫ్రెండ్స్‌ని తీసుక వస్తానంటున్నారు, మనసులో నుండి ప్రేమ పుట్టుకు రావాలండి.. క్రొత్తగా నేర్చుకుంటే రావు..” అని బాధగా కళ్లు మూసుకుంది…

ఏం చేయలో తెలియని వాడిలా క్రాఫ్‌లోకి వేళ్ళు దూర్చి వెనక్కి అనుకొని. ఒక్క క్షణం శూన్యంలోకి చూసి.. “మరి నేను వెళతాను నీలవేణీ” అని ఏదో గుర్తు వచ్చిన వాడిలా కంగారుగా “నీలూ.. నీలూ” అన్నాడు..

డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ చేయాలనుకుంటుండగా నళిని వచ్చింది. ఫ్రెండ్‌ని చూసి సంతోష పడి కబుర్లులో పడింది. నీలవేణి మాటాల్లో నిరాశ – నిస్పృహలు చూసి ఆశ్చర్యపోయింది నళిని. సాయంకాలం వరకు ఇద్దరూ కబుర్లలో పడ్డారు. రమేష్ ట్రాన్స్‌ఫరయి వచ్చాడని, విజయ్, రమేష్ ఒకే ఆఫీసని తెలిసి నీలవేణీ నళిని తెగ పొంగిపోయారు. ఒక్క క్షణం రమేష్ తనని విడిచి ఉండడని, వంటలో కూడా హెల్ప్ చేస్తాడన, నల్లీ..నల్లీ అంటూ విసిగిస్తాడని సంతోషంగా నళిని చెప్పడం చూసి బాధపడతుంది నీలవేణి..

“విజయ్‌కి ఏమైనా బేడ్ హేబిట్స్ ఉన్నాయా, ఇంటికి లేటుగా వస్తాడా, సినిమాలకి, షాపులకు తీసుకు వెళ్ళడా” అని అడిగింది నళిని… అదేం లేదని నీలవేణి చెప్పడంతో, “నీ ప్రాబ్లమ్ ఏమిటో నాకర్థం కావడం లేదు” అని “బాధపడకే ప్రతీ సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అన్నట్లు మొఖం కడుకుంటాను” అని వాష్ బేసిన్ దగ్గరకు నడిచింది.

నళిని సెల్ రింగ్ కావడంతో ఫోను ఎత్తింది నీలవేణి. “హాయ్ డార్లింగ్ నల్లీ!.. హే ఆర్‌యూ..? ప్రొద్దునుండి ఫోను చేయలేదేం?… అన్నట్లు సాయంకాలం నేను ఇంటికి వచ్చేటప్పటికి నా కిష్టమైన వైట్ శారీ కట్టుకుని రెడీగా ఉండు.. నిన్ను ఒక చోటుకి తీసుకు వెళదాను” అని గబగబా రమేష్ మాట్లాడుతుండడంతో కంగారుగా “నేను.. నల్లీ ఫ్రండ్‌ని .. వన్ మినిట్” అని కంగారుగా “నల్లీ నీకు ఫోను” అంది.. గబాలున వచ్చి ఫోను అందుకొని..

“ఛ.. పొండి.. యూ.. నాటీ.. ఇంటికి రండి.. మీ పని చెబుతాను.. అని నవ్వుతూ ఫోను పెట్టేసింది.

“మరి నేను వెళతానే” అని నళిని బయలుదేరబోతున్నంతలో ఫోను రింగ్ కావడంతో “ఒక్క నిమిషం ఉండవే.. ” అని ఫోను ఎత్తి విజయ్ గొంతు విని “ఆ చెప్పండి” అంది నీలవేణి.

“డిన్నర్‌కి నా ఫ్రెండ్స్ రావడం లేదు.. నువ్వు భోంచెయ్యి.. మరి ఉంటాను” అని ఫోను పెట్టిసాడు విజయ్…

విషయం తెలుసుకొని.. “ఇంకా మీ ఆయనకు నీ మీద ప్రేమ లేదంటావు ఏమిటి.. నీకు తలనొప్పి అని అన్నావని ఫ్రెండ్సని తీసుకురావడం లేదు.. అయినా ఈసారి అన్నయ్యగారిని చూసిగాని నేనేం మాట్లాడలేను” అని నవ్వుతూ ఇంటికి వెళ్ళిది నళిని..

నళిని మాటలకి ఆలోచనల్లో పడింది.. విజయ్‌కి తనంటే ప్రేమ ఉంది.. కాని పాపం ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నాడు. కాని తను బాధపడుతున్నానని.. ఇప్పుడిప్పుడే మారడానికి ప్రయత్నిస్తున్నాడు విజయ్.. హుషారుగా వంటింటిలోకి వెళ్ళి విజయ్‌కి ఇష్టమైన జీడిపప్పు పకోడి చేసి ఎదురు చూడసాగింది. ఆలశ్యంగా ఇంటికి వచ్చిన విజయ్ చెప్పిన కారణం విని షాకయింది.. తన ఫ్రెండ్స్ బోజన ప్రియులని, చికెన్ బిరియాని అంటే పడిచస్తారని, సన్‌డే నీలవేణి చేసిన చికెన్ బిరియాని అస్సలు బాగోలేదని.. అందుకనే వాళ్ళని హోటల్‌కి తీసుకు వెళ్ళానని చెప్పాడు.

మనసు బాగోక నళిని ఇంటికి వెళ్ళింది నీలవేణి.. టి.వి చూస్తూ సజ్జ నిండా ఉన్న పూలని మాలకట్టడం చూసి అంది నీలవేణి “ఒక్కదానివి!.. ఇన్ని పూలు ఎందుకు” అంది “ఏం చెప్పమంటావ్.. మా ఆయనకి మల్లెపూలు నేను తల నిండా పెట్టుకొని.. ఇంకా మిగిలితే..” అని సిగ్గుపడిపోతూ “రావే.. హాయిగా కబుర్లు చెప్పకుందాం” అని బెడ్ రూమ్‌లోకి తీసుకువెళ్ళి కప్ హోర్డులో నుండి ఆల్‌బమ్స్ తీసి చూడమని ఇచ్చింది.. “అన్నట్లు కాఫీ కలిపి స్నాక్స్ తెస్తాను.. ” అని “టిఫిన్ చేసేసావు కదూ” అంది.. లేదు అనగానే “పది గంటలవుతుంది ఇంకా టిఫిను చేయలేదా, ఏం ఈ రోజు టిఫిను వండలేదా?” అంది నళిని..

“పెసరట్టు ఉప్మా చేసాను” అంది.

“అంత మంచి టిఫిను చేసి తినలేదా?.. కొంపదీసి మీ ఆయన, నువ్వు పోట్లాడుకున్నారా?” అంది కంగారుగా నళిని.

“అదేం లేదు.. సుష్టుగా ఉప్మా, పెసరట్టు తిని ఆఫీసుకి వెళ్ళాడు” అంది నీలవేణి.

“చెప్పానుగా విజయ్ గురించి, నేను టిఫిన్ తిన్నా లేదా? ఏది ఆయనకు అక్కరలేదు” అని.. “ఇక ఆ విషయం వదిలేయ్! నువ్వు టిఫిన్ చేసావా?.. ఏమిటోనే ఇప్పుడు ఆకలేస్తుంది. తినడానికి ఏమైనా ఉందా” అని నీలవేణి అనగానే చప్పున వెళ్లి నీలవేణి చెయ్యి పట్టుకొని.. “సారీయే!.. నీ బాధ నాకు అర్థమైంది.. ఛ!.. ఛ!.. ఈసారి మీ ఇంటికి వచ్చినప్పుడు అన్నయ్య గారిని గట్టిగా అడిగేస్తాను.. రావే!.. టిఫిను చేద్దువుగాని..” అని చెయ్యి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకు వెళ్లింది.

“మరి నువ్వో” అనగానే “పీకలదాక తిన్నానే! తినకపోతే రమేష్ ఒప్పుకోడుగా” అని ఏదో గుర్తు వచ్చిన దానిలా మౌనంగా ప్లేటులో హాట్‌పాక్‌లోని ఇడ్లీలు, చట్నీ వడ్డించింది నళిని. టిఫిన్ తింటూ హాలులో గోడనున్న ఫోటోలు చూసింది.. నళిని భుజాల మీద రమేష్ చేతులు వేసి ఒక ఫోటో, లాన్‌లో నళినిని దగ్గరగా పట్టుకొని రమేష్ నవ్వుతూ తీయించుకున్న ఫోటో చూసి.. ‘అదృష్టవంతురాలు నల్లీ..’ అనుకుంది మనసులో నీలవేణి.

ఇంటికి వచ్చిన నీలవేణి దిగులుగా మంచం మీద వాలిపోయింది. గదిలోకి వచ్చిన విజయ్ మంచం మీద పడుకున్న నీలవేణిని చూసి.. “వంట్లో బాగుందా లేదా?.. ఓకె.. ఓకె.. పడుకో” అని గదిలో నుండి వెళ్ళడం చూసి గభాలున లేచి.. “నాకేం దుక్కముక్కలా ఉన్నాను.. అన్నట్లు చేతిలో ఆ ప్యాకెట్టు ఏమిటి” అంది.. “అది చీర నీలవేణి” అని.. ఒక్క నిమిషం తడబడి.. “ఆఫీసులో ఏవరో అతను చీరలు అమ్ముతున్నాడు” అన్నాడు. గభాలున పాకెట్టు అందుకొని, తీసి చీర చూసింది. మెరూన్ రంగు ఎంబ్రాయిడరీ షిఫాన్ చీర చూసి మనసులో అనుకుంది ‘నాకు మెరూన్ రంగు ఇష్టమని కనిట్టిసాడున్నమాట విజయ్.. అమ్మో.. ఏమిటో అనుకున్నాను.. చాలా తెలివైనవాడు’ అని మురిసిపోతూ “ఎంతండి చీర” అంది. “మూడు వేలు” అని చెప్పగానే “అమ్మో అంత ఖరీదా” అంది. “ఎంత ఖరీదైనా పరవాలేదు నీకు నచ్చితే చాలు నీ..ల..వే..ణీ” అని కంగారుగా “నీల.. నీలూ” అన్నాడు.

పాపం విజయ్.. తన కోసం తనని సంతోషపెట్టడం కోసం మారుతున్నాడు..

“మీకు నచ్చినప్పుడు నాకు నచ్చకపోవడం ఏమిటి థాంక్యూ విజయ్” అంది.

“అలా ఏం అనుకోకు.. నా ముఖం నాకు చీరల సెలక్షన్ ఏం తెలుసు. ఆ చీరలమ్మే వాడే అన్నాడు చాలా మంచి చీర, ఈ రంగు ఏవరైనా సరే లైక్ చేస్తారు సార్..! అమ్మగారికి తప్పక నచ్చుతుందంటేనే ఈ చీర తీసుకున్నాను. ఒక వేళ నీకు నచ్చకపోతే చీర రిటర్న్ చేస్తానని కూడా చెప్పాను” అని విజయ్ అనగానే చేతిలో నున్న చీర గబాలున మంచం మీద పడేసి గబగబా అడుగులు బయటకు వేసి, భగవంతుడా!.. ఇటువంటి జడపదార్థంతోనా నాకు పెళ్ళయింది అనుకుంది నీలవేణి.

ఆఫీసు నుండి వచ్చిన విజయ్ కోపంగా అటు ఇటు తిరగడం చూసి మనసులో అనుకుంది నీలవేణి.

మహానుభావుడికి ఏమయిందో.. కారాలు, మిరియాలు నూరుతున్నాడు. ఈ కళ కూడ ఉందన్నమాట!.. అనుకుంది. ఏదో గుర్తు వచ్చినదానిలా అంది.

“మనం బయటకు వెళ్ళాలండి.. ఈ రోజు నళిని పుట్టిన రోజు.. దానిని సర్‌ప్రైయిజ్ చేద్దామని ఈ ప్లాన్ వేసాను.. ఇక్కడ మనకు సారీ మీకు కాదు నాకు ఎవరున్నారు? నళినాయేగా.. అక్కడకు వెళ్ళి, వాళ్ళిద్దరిని తీసుకొని హోటల్‌కి వెళదాం? ఏమంటారు” అంది..

విజయ్ కనుబొమలు ముడిపడ్డాయి.. మొహం అదోలా అయింది. ఒళ్లు మండిపోయింది “మీ కిష్టం లేకపోతే నళినీ ఇంటికి వెళ్ళొద్దు లెండి” అంది.

కంగారుగా అన్నాడు “ఛ!..ఛ!.. అదేం లేదు నీలవే..ణీ ఈ రోజు ఆఫీసులో చిన్న డిస్టర్బెన్స్ అయింది. అన్నట్లు అతను ఈ రోజు.. ఆఫీసుకి రాలేదు. ఒక వేళ మీ ఫ్రెండ్ వాళ్ళు ఊరిలో ఉన్నారో లేదో” అనగానే కొంచం కోపంగానే అంది నీలవేణి

“నల్లీ వాళ్ళు ఎక్కడికి వెళలేదు.. ఒకవేళ వెళ్ళినా నాకు ఫోను చేసి చెబుతుంది. అందరూ మనలా ఉండరు కదా? వాళ్ళ ఆయనకి అదంటే ప్రాణం ! దాని పుట్టిన రోజు అని ఏకంగా సెలవే పెట్టేసాడన్నమాట! అదృష్టవంతురాలు” అంది.

“పద నీలవేణీ.. సారీ నీలూ వెళదాం!” అని అనడంతో ఇద్దరూ కలిసి నళిని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. క్రొత్త చీర కట్టుకొని తల నిండా పూలు పెట్టుకొని ఉన్న నళిని చూసి “హాయ్ నల్లీ..! హేపీ బర్త్‌డే” అంది. విజయ్ కూడా చెప్పాడు. “థాంక్యూ..! థాంక్యూ!.. అన్నయ్యగారూ రండి” అని ఆహ్వానించింది. “సారీ నీలూ!.. సమయానికి రమేష్ లేకుండా అయింది.. అర్జంటుగా కంపెనీ పని మీద క్యాంప్ వెళ్ళాడు” అనగానే “అయో బర్త్‌డే రోజున పాపం మీవారు లేకుండా అయింది” అని నీలవేణి అనగానే “అబ్బే.. అదేంలేదే! మనిషి లేరన్న మాటే గాని ఇదిగో క్రొత్త చీర కొనిచ్చారు.. స్వీట్సు కొని ఇంట్లో తెచ్చిపెట్టారు. అన్నట్లు ఒక్కదానిని బోరు ఫీలవుతానని సీడీలు తెచ్చి సినిమాలు చూడమన్నారు.. ప్రొద్దునుండి ఇప్పడికి ఎన్నో సార్లు ఫోను చేసారు” అని నవ్వుతూ నళిని చెబుతుంటే కాస్త చూసయినా నేర్చుకోండి అన్నట్లు నీలవేణి విజయ్ వైపు చూసింది.

నళిని అన్న మాటలే చెవిలో మారుమ్రోగసాగాయి నీలవేణిలో. తన జీవితం అన్నాయం అయిపోయింది.. ఎదురింటి గిరి వనజ కాపురం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఎప్పుడు సరదాగా సంతోషంగా నవ్వుతూ అందరిని నవ్విస్తుంటాడు గిరి.. అక్కయ్యగారు మా వనూ చూడండి, ఇలా చేసింది, అలా చేసిందని వనజని ఏడిపిస్తుంటాడు… ఎక్కడ చూసినా.. అందరూ సంతోషం సరదాగా ఉన్నారు… తన కాపురమే ఇలా ఏడ్చింది అనకొని ఏదో ఆలోచన వచ్చిన దానిలా గబగబా వెళ్ళి పెట్టిలో చీరలు సర్దుకొని, హాలులోకి వచ్చి విజయ్‌తో అంది.. “నేను.. ఊరు వెళ్ళుతున్నాను..” అంది “ఇంత సడన్‌గా ప్రయాణం పెట్టుకున్నావేం నీలవే..ణీ.. సారీ నీలూ!” అనగానే “ఎందుకో.. దేనికో చెప్పమంటారా? మిమ్మలను చిన్న విషయంలో కూడ మార్చలేకపోయాను.. ” అందుకు అంది కోపంగా.

“నన్ను మార్చలేకపోయావా? ఏ విషయంలో నీలవేణీ?” అనగానే వస్తున్న కోపాన్ని ఆపుకొని.. “ఎందుకో? ఏమిటో మీతో చెప్పినా ఆ గోడతో చెప్పినా ఒకటే.. అయినా ఒకటా? రెండా? లక్షాతొంభై ఉన్నాయి.. నన్ను వెళ్ళనీయండి. కొద్ది రోజులయినా మనశ్శాంతిగా ఉంటుంది” అనగానే.. “నీల..వేణీ.. నిన్న నా ప్రవర్తనతో చాలా బాధపెడుతున్నానన్నమాట!.. నిన్ను ఎంతో సుఖపెడుతున్నాననుకున్నాను. సో సారీ. నీలవేణీ వెళ్ళు. మీ ఇంటికి వద్దు అనడం లేదు. సిటిలో హోటల్స్ అన్నీ రేపటి నుండి స్ట్రయిక్ అట బోజనానికి ఇబ్బంది అని.. అయినా.. నేను ఎలాగో అలాగ మేనేజ్ చేసుకుంటాను. వెళ్ళు నీ..ల..వేణీ” అన్నాడు.

విజయ్ మాటలకి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు నీలవేణికి. రమ్‌మని కోపంగా పెట్టి తీసుకొని హాలులోకి వచ్చేటప్పటికి.. పరిగెత్తుకొని ఏడుస్తూ నళిని వచ్చి, నీలవేణీ చెయ్యి పట్టుకొని “నీలూ.. నా బ్రతుకు మగిసిపోయింది. మా ఆయన బంగారం అనుకున్నాను కాని నా జీవితం నాశనం చేసే దుర్మార్గుడని తెలియలేదు. నువ్వు, అన్నయ్యగారే నన్ను కాపాడాలి” అని నళిని అనగానే ”ఏమయిందే? ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు?” అంది.

“జరగకూడనిదే జరిగిపోతుందే!.. ఇన్నాళ్ళు నల్లీ! అంటూ నా చుట్టు తిరిగుతూ దొంగనాటకాలు ఆడాడు రమేష్! పయోము విషకుంభం రమేష్” అని నళిని అనగానే “నల్లీ ఏమిటి నువ్వు చెబుతున్నది” అంది నీలవేణి.

“నీలవేణీ ఆవిడ బాగా అసిలిపోయి ఉన్నారు ముందు నీళ్లు తాగనీ” అని గ్లాసులో నీళ్ళు తెచ్చి ఇచ్చి “వేడిగా కాఫీ తెచ్చి ఇవ్వు” అన్నాడు విజయ్

“ఇప్పుడు నాకేం వద్దు అన్నయ్యగారూ! ఆఫీసులో శిల్ప అనే అమ్మాయి ఉందట కదా? దానికి ఎవరు లేరట!.. అది ఈయననే నమ్ముకుందట. దానిని గుడిలో పెళ్ళి చేసుకొని తీసుకు వస్తాను. అరిచి అల్లరి చేయడం కాని…. గొడవ పెట్టడం కాని చేసావో డైవర్సు ఇస్తాను.. నోరు ముసుకొని ఉండు అని ఏకంగా శిల్పని ఇంటికి తీసుకు వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చి గుడికి వెళ్ళారు. నాకు ఉన్నది అమ్మ మాత్రమే. హార్ట్ పేషంట్.. ఏం చెయాలో తెలియక ఇక్కడకు వచ్చాను. అన్నయ్యగారు మీరే ఏదైనా సహాయం చేయాలి” అంది ఏడుస్తూ నళిని.

నళిని మాటలు విని ఆశ్చర్యపోయింది నీలవేణి.

“మీరు అనవసరంగా కంగారు పడకండి నళినిగారు. భార్య ఉండగా మరో స్త్రీని వివాహం చేసుకోవడం చట్టరీత్యా నేరమే కాదు సంఘం కూడా హర్షించదు. మొన్న మీ బర్తడే రోజున కూడా.. శిల్ప, రమేష్ శలవు పెట్టి ఇద్దరూ కలిసి తిరిగడం కనిపించింది..

శిల్పను రమేష్ దగ్గర నుండి ఎలా తప్పించాలో నాకు తేలుసు.

అవసరమయితే పై అదికారులకు కానిఫిడెన్స్ వ్రాసి శిల్పని ఈ ఊరిలో లేకుండా చేస్తాను” అనగానే “అన్నయ్యగారూ.. మీరు .. నాపాలిట దేవుడు. ఆ భగవంతుడే మీ రూపంలో సహాయపడుతున్నాడు” అని విజయ్ కాళ్ళకి నమస్కారించబోతుండే కంగారుగా లేవనేత్తి “నన్ను మీరు మరీ పొగిడేయకండి. సమాజంలో మనం అందరము మనుషులం. ఎక్కడో ఏదో మనకు కనిపించని చోట అన్యాయం జరుగుతుంటే పరిగెత్తుకొని వెళ్ళలేక పోయినా ఎదురుకుండా అన్యాయం జరుగుతుంటే మనిషన్నవాడు అన్యాయాన్ని అరికట్టకపోతే ఎలాగండి?..” అన్నాడు.

“నీలవేణీ.. మీ ఫ్రెండ్ బాధపడుతుంటే ధైర్యంగా ఉండమని చెప్పవే?” అన్నాడు. కంగారుగా చూసి నోటనాట రాక నళిని చెయ్యి పట్టుకుంది.. “కమాన్ రండి” త్వరగా అని కారు తీయడానికి వెళ్ళేటప్పటికి ఎదురింటి ముందు అంబులెన్స్ ఆగడం.. కంగారుగా ఏవరో మనిషిని మొసుకోని అంబలెన్స్‌లో పెట్టడం ఆ తరువాత గిరి ఎక్కడం చూసి ఆశ్చర్యంగా, వాచ్‌మెన్ వైపు చూసి అంది “ఏం జరిగింది వాచ్‌మన్? ఎవరికి వంట్లో బాగుండ లేదు?” అంది నీలవేణి.

“ఆ గిరిగారికి వళ్ళు కొవ్వెక్కిందమ్మా.. పాపం అమ్మగారిని అనుమానంతో వేదిస్తుంటాడు.. అమ్మగారి బావగారు వచ్చారు బాగా అమ్మగారిని అనుమానించి వేపుకు తినగానే ఊరేసుకున్నారు అమ్మగారు. కొన ఊపిరితో ఉంటే హాస్పిటల్‌కి తీసుకు వెళుతున్నాడు దిక్కుమాలిన చచ్చినోడ” అన్నాడు.

కాళ్ళు వణుకుతుంటే వెళ్ళి కారులో కూర్చుంది నీలవేణి. కారు వెళ్ళి గుడి ముందు ఆగింది. ఆ గుడిలో పంతులుగారు తప్ప ఎవరు లేరు.

కారు దిగి గబగబా గుడిలోకి అడుగులు వేసాడు విజయ్! వెనకాలే నళిని, నీలవేణి నడిచారు.. మంగళస్తూత్రం చేతిలోకి తీసుకోబోతున్న రమేష్ నళిని, రమేష్, నీలవేణిని చూసి షాక్ అయ్యాడు. విజయ్‌ని చూసి “గుడ్ ఈవినింగ్ సార్!..” అంది భయంగా శిల్ప.

విజయ్‌లో ఆవేశం పెల్లుబికింది. “శిల్పా.. అనవసరంగా నిన్ను వీధిలో పెట్టి అల్లరి చేసే పరిస్థితి తెచ్చుకోకు.. నీకు ఎవరు లేకపోతే పెళ్ళయి ఒక ఇంటివాడైన మగాడే కావాలా? అతనికి భార్య సంసారం ఉన్న సంగతి గుర్తు లేదా?.. అయినా ఇవన్నీ నీకు చెప్పడం అనవసరం!.. మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో! లేకపోతే పోలీసులు వస్తారు.. చట్టరీత్యా ఈ వివాహం చెల్లదు. అంతేకాదు.. నీ ఊద్యోగం ఊడిపోయి రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోకు.. నువ్వు వేసిన వలలో నువ్వే చిక్కుకునే పరిస్థితిలో ఉన్నావ్!.. ఏం నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం” అని గంబీరంగా అంటున్న విజయ్ వైపు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది నీలవేణి.

గబాలున విజయ్ దగ్గరకు వచ్చి రెండు చేతులు జోడించి అంది శిల్ప.. “క్షమించండి సార్!” అని తన తప్పుని ఒప్పుకొని గబగబా అక్కడ నుండి వెళ్ళిపోయింది శిల్ప.. సిగ్గుతో తల వంచాడు రమేష్!

“అన్నయ్యగారూ!” అని గబాలున వంగి విజయ్ కాళ్ళకి దండం పెట్టింది నళిని..

కంగారుగా ప్రక్కకు తప్పుకుని “అదేటమ్మా ఎదురుకుండా గుడిలో దేవుడిని పెట్టుకొని నాకు దండం పెడతున్నావే” అనగానే..

“ఎక్కడైతే స్త్రీ గౌరవించ పడుతుందో అక్కడ… అన్నారు పెద్దలు. కనిపించని దేవునికి దండం పెట్టేకన్నా.. ఎదురుగా కనిపిస్తున్న మీరే నాకు దేవుడిగా కనిపిస్తున్నారు. ఏమే నీలూ నువ్వు చాలా అదృష్టవంతురాలివి. అన్నయ్యగారిని ఇన్నాళ్ళు అర్థం చేసుకోలేకపోయావు. నిజం చెప్పాలంటే నీ పతి అందరిలాంటి సామాన్యుడు కాడే.. నీ పతి దేవుడు” అంది.

కారులో విజయ్ నీలవేణి ఇంటికి బయలుదేరారు.

“అన్నట్లు నువ్వు ఊరు వెళతానన్నావు కదూ? వంట కూడ చేయలేనట్లుంది.. పోనీ ఒక పని చేద్దాం.. హోటల్‌లో భోం చేసి ఇంటికి వెళ్ళి పెట్టి తీసుకొని, నిన్ను స్టేషనులో డ్రాప్ చేస్తాను నీలవేణీ” అని కంగారుగా… “సారీ సో నీలూ..” అన్నాడు.

“విజయ్ ప్లీజ్.. అలా పిలవకండి.. నీలవేణీ అనే పిలవండి. హోటల్ వద్దు.. ఊరూ వద్దు.. క్షణంలో వంట చేస్తాను” అని నీలవేణి అనగానే..

ఆశ్చర్యంగా అన్నాడు విజయ్..

“అదేంటి నీలూ! నాలుగు రోజులు ఊరెళ్ళి వస్తానన్నావు కదా ?… ఊరు వెళ్ళవా?” అన్నాడు.

“విజయ్ ప్లీజ్ ఇంకోసారి నీలూ అంటే ఒప్పుకోను. నీలవేణీ అనే పిలవండి.. మీలాంటి.. బంగారం లాంటి భర్తని విడిచి పెట్టి నాలుగు రోజులు కాదండి, నాలుగు నిమిషాలు కూడా దూరంగా ఉండలేను” అని గబాలున దగ్గరిగా జరిగి విజయ్ భుజం మీద తలవాల్చింది నీలవేణి.

మరోసారి నీలవేణి చెబుతున్నది ఏమిటో అర్థం గాక, కుడి చేత్తో డ్రైవ్ చేస్తూ ఎడం చెయ్యి చాచి నీలవేణి భుజం మీద వేసాడు విజయ్ !

హాయిగా కళ్ళు మూసుకుంది.. చల్లని వెన్నల్లో కారు రయ్‌మని పోసాగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here