నీలి నీడలు – ఖండకావ్యం – పరిచయం

    0
    4

    [box type=’note’ fontsize=’16’] “నీలి నీడలు” అనే ఖండకావ్యంలో మొత్తం ఏడు ఖండికలు ఉన్నాయి. ప్రతి ఖండికలో ఆణిముత్యాల వంటి పద్యాలు ఉన్నాయి. ‘చేతన‘ అనే కలంపేరుతో ప్రస్తుత సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలను ప్రజలకు తెలిపి, జాగృతపరుస్తారు కవి మేడిపల్లి వేంకట లక్ష్మీ నారాయణ. [/box]

    సుమ సుగంధం

    [dropcap]లో[/dropcap]కంలో సాహిత్యము, సమాజమూ ఈ రెండూ అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. సాహిత్యసృష్టి సమాజం ద్వారా జరుగుతుంది. సమాజం సాహిత్యం వల్ల పురోభివృద్ధి చెందుతుంది. పరిశీలిస్తే, సత్సాహిత్యంలో ఆనాటి సామాజిక స్థితిగతులు స్పష్టంగా కనిపిస్తాయి. అభ్యుదయానికి, మానవ విలువలు పెంపొందటానికి సాహిత్యం ఎల్లప్పుడు అవసరమే. మంచి సమాజం యేర్పడాలంటే, మంచి సాహిత్యం తప్పక కావాలి. అంటే సామాజిక స్పృహ కలిగిన ఉత్తమ రచనల వలన మానవ వికాసం ఆవిర్భివిస్తుందన్న మాట.

    సమాజంలో జరుగుతున్న అవినీతినీ, అన్యాయాన్నీ, అక్రమాలను ఖండించి, నైతిక విలువలను పెంపొదిస్తుంది కవి కలం. తాడిత పీడిత దళిత స్త్రీ వర్గ బాధలను, మూఢాచారాలను, ఇంకనూ పలు సామాజిక రుగ్మతలను గుర్తించి వాటికి తగిన పరిష్కార మార్గాలను లోకానికి అందిస్తుంది. మంచిని ప్రబోధిస్తుంది. జనాన్ని జాగృత పరుస్తుంది.

    ఈ కావ్యంలో కవి శ్రీ మేడిపల్లి లక్ష్మీ నారాయణగారు కొన్ని సామాజిక సమస్యలను గైకొని, వాటి వల్ల కలిగే అనర్థాలను తేటతెల్లం చేస్తూ పరిష్కార మార్గాలను సూచించారు. సామాజిక చైతన్యాన్ని కలిగించే రచనలు చేశారు కనుకనే, వీరు ‘చేతన’ పేరుతో సుప్రసిద్ధులైనారు. వీరు బహుగ్రంథకర్తలు. లబ్దప్రతిష్ఠులైన పండితులు. తమ మదిలో మెదిలో ప్రతి మంచి విషయాన్ని, పద్యరూపంలోకి మలచి, పదిమందికి అందజేస్తుంటారు.

    ఈ కావ్యం పేరు “నీలి నీడలు”. ఇది ఖండకావ్యం.  దీనిలో మొత్తం ఏడు ఖండికలు ఉన్నాయి. ప్రతి ఖండికలో ఆణిముత్యాల వంటి పద్యాలు ఉన్నాయి. పద్యాలు సులభశైలిలో ఉంటాయి. ప్రస్తుత సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలను ప్రజలకు తెలిపి, జాగృతపరుస్తారు కవి.

    మొదటి ఖండిక ‘వరకట్నం’. ఈ ‘వరకట్నం’ ధనికులింట మొదట పుట్టి, క్రమంగా పేదల యిళ్ళలో ప్రవేశించి బాధ కలిగిస్తున్నదని చెపుతారు కవి. ఒకనాడు ఆడపిల్ల జన్మిస్తే లక్ష్మిగా భావించి సంతోషించేవారనీ, కానీ నేడు ఈ వరకట్న దురాచారం వల్ల స్త్రీ శిశువులు పుట్టవద్దని కోరుకుంటున్నారని కవి ఆవేదన వెలిబుచ్చారు. “అత్తగారాడబడుచులు అతివలయ్యు సాటివారి కన్యాయంబు సల్పుచుండె” అని వాపోతారు. “మొలతాడు గట్టిన మొఱకు కుఱ్ఱకునైన వరశుల్క మిమ్మంచు బలుకుతున్నర”ని దురాచారపరుల దుర్బుద్ధిని ఎండగడతారు చేతన గారు.

    ‘మద్యపానము’ అనే ఖండికలో, “దేశ గౌరవంబు నాశంబు జేయక, మాతృదేవి కీర్తి మంట గలప, యేల భారీతీయు లీ హీనమైనట్టి మద్యపానమునకు మరకు కొనిరో?” అంటూ ప్రశ్నిస్తారు. “జవసత్వములన్ తరుగంగ జేసి, మద్యము నరజాతిని పిప్పిజేసి నాశము జేయున్” అని వాస్తవాన్ని వివరిస్తారు. ఇంకా మద్యం వల్ల కలిగే కష్టనష్టాలను ఈ ఖండికలో కవి విపులంగా తెలియజేశారు. చివరి పద్యంలో “మద్యపానంబు మానుడో మనుజులారా!” అంటూ ప్రజలను జాగృతపరిచారు.

    “జూదము” అనే మూడవ ఖండికలో, జూదమాడి ఓడిపోయిన నలుడు, ధర్మరాజులను గుర్తు చేస్తారు. ఈ జూదమనే వ్యసనం వల్ల మానవులు ఎట్టి బాధలకు గురియవుతారో వివరిస్తారు. జూదములోని రకాలన్నింటినీ దెల్పి వాటి వల్ల కలిగే వ్యథలను తెలుపుతారు. ఈ దుష్ట వ్యసనాన్ని అరికట్టకపోతే, “నరుల జీవితాలు నాశనమగును” అంటూ హెచ్చరిస్తారు.

    “విద్వేషాలు” అనే ఖండికలో మతాల మధ్య మంటలు రేపుతూ, శాంతి జీవనానికి భంగం కలిగిస్తూ, స్వార్థపరులు భరతధాత్రిని రక్తసిక్తం చేస్తున్నారని ఆవేదనని వెలిబుచ్చారు. మతపు చిచ్చులో తన కన్నపిల్లలు మాడిపోతుంతే, “భరతమాత గుండె పగిలిపోదె?” అని బాధగా ప్రశ్నిస్తారు కవి.

    ఐదవ ఖండిక “వ్యభిచార వృత్తి” అనేది. దీనిలో వివాహ వ్యవస్థను గూర్చి కొంత చెప్పి, శ్రీరాముని ఏకపత్నీ వ్రతాన్ని ప్రస్తావించారు. బహుభార్యావిధానం, ఉంపుడుకత్తెలు, భోగినులు, దేవదాసీలు సమాజంలో ప్రవేశించిన రీతిని తెల్పారు. తర్వాత ఈనాటి సమాజంలో ప్రేమల గూర్చి వివరించారు. ఈ వ్యభిచారం వల్ల ‘ఎయిడ్స్’ ప్రబలే ప్రమాదమున్నదని ప్రజలను కవి హెచ్చరించారు.

    “అస్పృశ్యత” అన్నది దీనిలోని ఆరవ ఖండిక. ఈ ఖండికలో పద్యాలు, భావాలు జాషువా గారి కవిత్వాన్ని పోలి ఉంటాయి. “వాడు నడువ నేల బీడుగా మారునా? మనము త్రొక్క భూమి మంచిదగున?” అని ప్రశ్నిస్తారు. “వాడు త్రవ్విన ఆ బావి పనికి వచ్చు, వాదు మాత్రము మనలకు పనికి రాడు” అని వ్యంగ్య బాణాలు సంధించారు. ఆనాడు కొందరిని పంచములుగా చెప్పి వెలివేయుటకు గల కారణములను కవి చక్కగా ఊహించారు. “సమత మమత తోడ సామరస్యంబున మెలగదలతురేని మేలు కలుగు” అంట్టూ తమ ఆకాంక్షను తెలియజేశారు.

    ఈ కావ్యంలో చివరి ఖండిక “మూఢాచారములు”. ప్రాణులను హింసింది, దేవతలకు బలి చేయటాన్ని మూఢాచారంగా తెలుపుతూ, దీని వలన ప్రజల అజ్ఞానం వెల్లడవుతున్నదంటారు. సాటి ప్రాణులను చంపే హక్కు మానవుల కెవరిచ్చారంటారు. ఇది ‘దనుజ చర్య’ అని కవి నిరసిస్తారు. క్షుద్రశక్తులు, చాతబడులు, చిలుక జోస్యం, చేతి రేఖలు, సోది మొదలగు మూఢాచారాలను తెగడారు. జాతకాలు, వాస్తు, పూనకాలు, గాలి ధూళి సోకటం మొదలైన వాటిని అవాస్తవాలుగా కొట్టిపారేశారు.

    కావ్యం చివరలో,

    “ఇట్టి నీలి నీడ లింకెంత మాత్రము

    వసుధ జనులపైన వాలకుండ

    విజ్ఞులైన వారు విజ్ఞానమందించి

    యిలను జనుల మేలు కొలుపవలయు”

    అంటూ చక్కని ప్రబోధాన్ని అందించారు.

    ఈ విధంగా ఈ ఖండకావ్యాన్ని సామాజికాంశములతో రచించి, ప్రజలకెంతో మేలు కలగజేసిన చేతన గారు బహుధా ప్రశంసనీయులు.

    – ముదిగొండ శ్రీరామశాస్త్రి, ఖమ్మం.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here