నీలో మరోసారి జీవించాలని!

0
8

[dropcap]ప్రా[/dropcap]పంచికమైన ఏ బాధలూ నా దరి చేరని
నిజంగా అమృతప్రాయమే అయిన ఆ దశలో..
నువ్వు నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావు!

ఆనాటి జ్ఞాపకాలు మదిలో కదలాడుతోంటే
మనసు పలవరిస్తూ పులకించిపోగా..
నేటి దుస్థితిని దీనంగా అనుభూతిస్తూ..
గుండె బరువెక్కిపోతోంది!

బ్రతుకు తెరువు గురించి ఆరాటాలు లేవు..
జీవన పోరాటాలూ లేవు!
గతం తాలూకూ వ్యథలు లేవు..
భవిష్యత్తును ఊహించుకునే భయాలూ లేవు!

గాలిపటంలా పిల్లగాలులతో కలిసి..
స్నేహబృందంతో విహరించిన మధురానుభూతులు!
కడ శ్వాస వరకూ కళ్ళల్లో కదలాడే..
కమ్మని కలల్లాంటి జ్ఞాపకాలు కదా అవి!

ప్రశాంత సాగరంలో తరంగాల సౌందర్యం..
ఎన్నో దశాబ్దాల తపస్సు అనంతరం
మహర్షులు పొందే ప్రశాంతత..
నీ కౌగిలిలో దాగి వున్న నిశ్శబ్దం..
అపురూపమైన జీవన సంగీతాన్ని
ఆస్వాదించేలా చేసింది కదా అప్పుడు!

నా జీవన ఆకాశంలో తేలియాడిన మేఘమాలికలు
హృద్యంగా వీచిన పిల్లతెమ్మెరల చందాన..
అలా వచ్చి ఇలా వెళ్ళిపోయావేమిటి!?
జీవన పోరాటంలో అలిసి సొలసిన వేళ..
నా హృదయ సౌందర్యాన్ని ఎందరో గాయపరిచిన వేళ..
అన్నింటినీ.. అందరినీ..
జీవితం మధ్యలో తెగిపోయిన బంధాలుగా
తలచాను.. మరచాను..!

కానీ.. గుండెను పెనవేసుకుపోయిన నీ బాంధవ్యాన్ని
మరచిపోవడం సాధ్యం కాదు కదా!?
దశాబ్దాల క్రితం ఎడబాసిన మా స్నేహబృందమంతా
ఆత్మీయ కలయిక పేరుతో కలసిన వేళ..
నీ ఒడిలో విశ్రమించి..
నీ హృదయ మైదానంపై ఆటలాడుకుని
సేద దీరిన జ్ఞాపకాలను ఆనందంగా పంచుకున్నాం!

క్షణం కూడా విడిపోకుండా కలిసి తిరిగిన కాలం
క్షణాల్లోనే మాయమైనట్లు..
మాయదారి యవ్వనం జీవితాన్ని కాటేసింది!
బాధ్యతా పర్వతాలను తలపై మోస్తూ
ఒకరి కన్నీళ్ళను మరొకరం తుడుచుకోకుండా
పట్టణాలకు.. నగరాలకు.. దేశ విదేశాలకు..
పొట్ట చేతపట్టుకుని చెల్లాచెదురైపోయాం!

మళ్ళీ ఇప్పుడు.. ఇలా..
గడిచిపోయిన కాలాన్ని గుర్తు చేసుకుంటూ
జీవన యానంలో ఎదురైన బాధల్ని చెప్పుకుంటూ
ఎదల్ని పెనవేసుకొని ఏడ్చేశాం..!

అప్పుడెప్పుడో పోగొట్టుకున్న అద్భుత ప్రపంచం
మళ్ళీ కళ్ళెదుట సాక్షాత్కరించింది..!
ఆత్మకథా గ్రంథాలను ముందరేసుకున్నాం..
ఒక్కొక్క పేజీ తిప్పేసుకున్నాం..
ఓ పేజీలో హాయిగా నవ్వుకునే సంఘటనలు!
మరో పేజీలో కళ్ళు చెమర్చే సన్నివేశాలు!!
మరికొన్ని పేజీలలో హృదయ విదారక దృశ్యాలు!!!

జీవితం పేజీలన్నీ తిరగేశాక..
ముగింపు పేజీలో మాత్రం..
అందరమూ ఏకాభిప్రాయాన్నే వ్యక్తీకరించాం!
మళ్ళీ ఒకసారి నీ ఒడిలో విశ్రమించాలనీ..
అక్కడే వుండిపోయి హాయిని అనుభూతించాలనీ!

ఓ.. నా తీయని బాల్యమా!
నీ జ్ఞాపకాల మధురిమలను ఆస్వాదిస్తూ
ఎంత కాలం గడిపినా..
అది..
నీలో మరోసారి జీవించడమే కదా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here