నీలో నేను

1
8

[dropcap]నీ[/dropcap]లో రహస్యాన్ని
శృతి మించితే అసహ్యాన్ని!
జుగుప్సని, బాధామయ శకలాన్ని!
హైస్పిరిట్స్‌తో నీ చెంతకు వస్తానా –
నిర్లిప్తంగా నీ చూపు
నిస్తేజంగా నీ నవ్వు
నిర్వికారంగా నీ మాటలు –
ఆత్మీయతను ఉరి తీస్తున్నట్టుంటాయి
నిర్దయగా, నిర్ద్వందంగా నీలోకి
నన్ను నిరాకరించినప్పుడు
స్నేహ పరీమళం స్తంభించి పోతుందేమోననే అనుమానం
అర్ధ శరీరాలమై కలిసి
అర్థవంతమైన మధురిమలను
పంచుకోవాల్సిన జీవితం –
అనర్థంగా పరిణమిస్తుందేమో
అర్థాంతరంగా ముగిసి పోతుందేమోననే భయం!
నువ్వు నాకివన్నీ వద్దనుకుంటావు
నీలోకి… లోలోకి…
అంతర్ముఖవై, ఒంటరి కుందేలైపోతావు
అయినా దయామయ హృదయం
దేనికీ అడ్డుచెప్పని మొహమాటం!
ప్రియతమా –
మర్రిలా ఎదిగి నిలవాల్సిన చెలిమి చెట్టు
వెర్రి గాలికి కూలిపోనీయకు!
నా ముందు మాటగా నువ్వుండాలి
నా బ్రతుకు బాటగా, బాసటగా నిలవాలి
నా వెలుగు పాటలా సాగాలి
కామాపేక్షలేని కమ్మని స్నేహాన్ని
ఇక కొనసాగిద్దాం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here