“నీంద్” : నిద్ర

0
5

[box type=’note’ fontsize=’16’] “వొక అనుభూతి గాఢతలోకి తీసుకెళ్ళే దృశ్యాలున్న దీన్ని తప్పకుండా చూడతగ్గ చిత్రమని చెప్పడానికి వెనుకాడను” అంటున్నారు పరేష్ ఎన్. దోషినీంద్‘ సినిమాని సమీక్షిస్తూ. [/box]

లత పాడింది మరచిపోగలమా? అనిశెట్టి పినిశెట్టి లకు మొక్కకుండా వుండగలమా?

నిదురలోన గతమునంతా నిముషమైనా మరచిపోరా
కరుణలేని ఈ జగాన కలతనిదురే మేలురా.
నిదురపోరా. తమ్ముడా.

ఈ వారం చూసిన సినెమాలు నచ్చలేదు. దీప్తీ నావల్ పేరు చూసి నీంద్ అన్న లఘు చిత్రం చూశాను. నచ్చింది. మొదటి సారి దీనికి నేను సమీక్ష వ్రాయగలనా అనిపించింది.

ఇది సినెమా, కవిత్వం అన్న రెండు ప్రక్రియలను కలుపుకుంటూ సాగుతుంది. కవిత్వంలో అనివార్యంగా పదాలు చేసే పని తెర మీద దృశ్య(ముఖ్యంగా), శబ్ద (ఒకప్పుడు మూకీలు కూడా వచ్చాయి) చిత్రాలు చేస్తాయి. ఇప్పుడు కవి తన కవిత చెబుతూ మనల్ని ఆ పదాల ఊతం ఇచ్చి తాను కోరుకున్న లోకానికి, ప్రాంతానికీ తీసుకెళ్తాడు. పంచేంద్రియాలు కలుగచేసే ఆ అయిదు చైతన్యాల ప్రపంచంలో విహరించి వొక కొత్త అనుభూతిని పొందుతాము. ఆ తర్వాతే మిగిలినవి; వివేచన వగైరా. అదే సినెమా దగ్గరికి వస్తే ఉదాహరణకి అండ్రీ టార్కొవ్స్కీ చిత్రాలు చూస్తే వొక అడవిలోని దృశ్యం, భోరున వాన ఇదే కొన్ని క్షణాలపాటు కదలకుండా చూబిస్తాడు. అతను చెప్పింది ఏమీ వుండదు, మనం విన్నదీ ఏమీ వుండదు. అక్కడ అర్థం చేసుకోవడం కంటే ముఖ్యం వొకానొక అనుభూతికి లోను కావడం. అక్కడా అంతే, ఆ అనుభవం తర్వాతే దాని గురించిన వ్యాఖ్యానమో, మరొకటో. అయితే ఈ చిత్రంలో వొక వస్తువు, వాహికగా కవితలు, దాన్ని కళ్ళ ముందు పరిచే దృశ్యాలు అన్నీ కలిసి పనిచేస్తాయి. దీప్తీ నావల్ స్వరం అదనంగా. అన్నట్టు మరో ఇద్దరితో పాటు ఆమె కూడా ఇందులో కవితలు వ్రాసింది.

ఈ ఆధునిక యుగంలో మనిషికి కరువైనది చాలా విలువైన నిద్ర. వొక రోజంతా రకరకాల వొత్తిళ్ళలో గడిచిన తర్వాత వొక నిద్రే మర్నాటికి మళ్ళీ శక్తిని చేకూర్చేది. అది కాస్తా కరువైతే మనిషి బ్రతకలేడు. యోగా, మెడిటేషన్, మందులు, వేన్నీళ్ళ స్నాన, వెచ్చని పాలు ఇలాంటి వంద పధ్ధతులు పాటించిన తర్వాత కూడా నిద్ర రాని వాళ్ళు దీప్తీ నావల్ సాయం తీసుకుంటారు. వారు ఆమెకు తమ సమస్య చెప్పి, కొన్ని అదనపు వివరాలు చెబితే ఆమె ప్రత్యేకంగా ఆ మనిషికోసం వో కవిత వ్రాసి స్కైప్ లో వినిపిస్తుంది. ఈమె కవిత చదువుతుండగానో, చదివిన తర్వాతనో ఆ వ్యక్తికి నిద్ర వచ్చేస్తుంది. ఇంత మంది క్లైంట్స్ లో వొకే వొక్కడు దీప్తీ ని దగ్గరగా భావిస్తాడు. నా గురించి ఏం తెలుసని నువ్వు అలా మాట్లాడుతావు అంటుంది. అతను మొండివాడు. ఆమెకు ఏమీ పాలుపోదు. అతని కాల్స్ కి స్పందించదు. అది తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకుంటాడు. వొక్క నిద్ర లేమి మనిషిని పిచ్చి వాడిని చేయడమే కాదు, మరణం వరకూ ఈడ్చుకెళ్తుంది.

మంచి కవితలు, దాన్ని దీప్తీ అందంగా చెప్పడం; వాటికి తగ్గట్టుగా దర్శకుడు దృశ్యాల రూపకల్పన చెయ్యడం : అన్నీ బాగున్నాయి. గాజు గోడల మధ్య బందీ లాంటి భావన మీద అల్లిన కవిత నడుస్తుండగా అక్వేరియంలో చేప పిల్లలని చూపించడం. చుక్కలు పొడిచిన రాత్రి ఆకాశం వచ్చే కవితకు నేపథ్యంలో చీకటి, ఫోర్ గ్రౌండ్ లో ఆమె, మధ్యలో మంచం మీద పడుకున్న అతను, పైన (దేనికో కనబడదు గాని) వేళ్ళాడుతున్న లాంతర్లు. ఇలా చాలా దృశ్యాలున్నాయి, వొక అనుభూతి గాఢతలోకి తీసుకెళ్ళేవి.

దర్శకుడు శుభజీత్ దాస్గుప్తా. ఇతని గురించి యేమీ తెలీదు గాని, గుర్తు పెట్టుకోతగ్గ పేరు.

సగం చూసిన ఆ OTT Originals కంటే ఈ లఘు చిత్రమే ఎక్కువ సంతృప్తిని ఇచ్చింది. ఇంతకంటే వివరంగా చెప్పే శక్తి నాకు లేదు. కాని ఇది తప్పకుండా చూడతగ్గ చిత్రమని చెప్పడానికి వెనుకాడను. This is in YouTube.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here