నీరజ్ జ్ఞాపకాల బిడారు

0
12

[శ్రీ మిలన్ ప్రభాత్ గుంజన్ రచించిన ‘నీరజ్ కీ యాదోం కా కారవాం’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు డా. టి. సి. వసంత.]

[dropcap]ప్ర[/dropcap]పంచ కవి, యుగ పురుషుడు శ్రీ గోపాల్ దాస్ నీరజ్ గారి పుత్రుడు, కవి శ్రీ మిలన్ ప్రభాత్ (గుంజన్) రచించిన ‘నీరజ్ కీ యాదోంకా కారవాం’ (నీరజ్ జ్ఞాపకాల బిడారు) అనే పుస్తకంలో నీరజ్ అభిమానులకి, పాఠకులకి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. పుస్తకం మీద అట్ట ఎంతో ఆకర్షణీయంగా ఉంది. పండు ముసలి నీరజ్ గారి ఫోటో ఉంది. అంత వృద్ధులైనా ఆయన ముఖంలో తేజస్సు ఏ మాత్రం తగ్గలేదు. ఆయన జీవితాంతం కొన్ని సత్యాలను తెలుసుకుని, వాటిని ఆచరిస్తూ బతికారు. అందరి కోసం ప్రేమబాట వేసారు.

‘మిత్రులారా! ప్రతి నిమిషం ఆఖరి నిమిషం అనే బతకండి.

అసలు ఆఖరి నిమిషం ఏదో ఎవరు తెలుసుకోగలిగారు?

చాటుగా ఏడ్చి.. ఏడ్చి.. ముత్యాలను వ్యర్ధంగా పోగొట్టుకునే వాళ్ళలారా!

ఏవో కొన్ని కలలు పండకపోతే, జీవితమే లేదు అని అనుకోవద్దు’.

నీరజ్ గారికి కవి జన్మపై ఎంత అభిమానమో..

కవి జన్మించినప్పుడు, ధరణి ఒడి అయింది

చంచల పవనం ఉయ్యాల ఊపింది

తుమ్మెదలు చేసిన ఝుంకారం నలువైపులా ప్రతిధ్వనించింది

ముత్తయిదువు కోయిల సోహర్ పాడడానికి వేం చేసింది.

~

181 పుటల ఈ పుస్తకంలో 27 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయం పేరులో విలువైన పెన్నిధి ఉంది – ప్రస్తావన, ఏక్ భూల్ (ఒక పొరపాటు) అభావగ్రస్త్ బచ్‌పన్ (లేమిగ్రస్త బాల్యం)ఏటా ప్రవాస్ (ఏటా ప్రయాణం), బచ్‌పన్ కీ యాదేం ఏవం సంఘర్ష్ కా ప్రారంభ్ (బాల్యం జ్ఞాపకాలు, సంఘర్షణ), మృత్యు నే దియా ఆశీర్వాద్ (మృత్యువు ఇచ్చిన ఆశీస్సులు), జీవన సంఘర్ష్ ఏవం కావ్యయాత్రా (జీవిత సంఘర్షణ – కావ్య యాత్ర) మేరా జన్మ తథా అలీగఢ్ కీ మధుర్ యాదేం (నా జన్మ, అలీగఢ్ మధుర జ్ఞాపకాలు), పాపా కే సాథ్ కవి సమ్మేళన్ (నాన్నగారితో కవి సమ్మేళనాలు), అపనా ఘర్ ఔర్ బచ్‌పన్ కీ యాదేం (మా ఇల్లు, నా చిన్ననాటి జ్ఞాపకాలు), గర్మీయోం కీ రాతేం ఔర్ కహానీయాం (ఎండాకాలం రాత్రులు, కథలు – గాధలు), ఫిల్మ్ సఫర్ కీ కుఛ్ ఝలకియాం (చలనచిత్ర యాత్ర – కొన్ని మెరుపులు), లక్కీ కార్ ఔర్ మధుర్ యాదేం, (లక్కీ కారు, మధుర జ్ఞాపకాలు), హరిద్వార్ మే బితాయే హఁసీ దిన్ ఔర్ కుఛ్ యాదేం (హరిద్వార్‌లో గడిపిన మంచి రోజులు, కొన్ని జ్ఞాపకాలు), గర్మీయోం మే పహడ్ కే మజే (ఎండాకాలంలో కొండలలో ఆనందం) ఏక్ కవి కా జ్యోతిష్ జ్ఞాన్ (ఒక కవి జ్యోతిష్య జ్ఞానం). హోలీ ఔర్ దివాలీ పర్ పరివార్ కో ఇకఠా కర్‌నా, (హోలీ, దీపావళి పండగులలో కుటుంబాన్ని ఒక చోట చేర్చడం), బహు పసంద్ కర్‌నే కా ఫిల్మ్ ‘అందాజ్’ (అందరు ఇష్టపడే సినిమా ‘అందాజ్’), అకేలేపన్ కా దర్ద్ తథా మా కీ మృత్యు (ఒంటరితనం బాధ, తల్లి మరణం), అటల్‌జీ సే ఖాస్ సంబంధీ (అటల్ గారితో ప్రత్యేకమైన సంబంధం), వ్యక్తిత్వ్ కే విభిన్న రూప్ (వ్యక్తిత్వం – వివిధ రూపాలు), కవి స్వభావ్ (కవి స్వభావం), ప్రగతిశీల్ దృష్టికోణ్ (అభ్యుదయ దృష్టికోణం), అలీగఢ్ మే కవితా పాఠ్ న కరనేకా నిర్ణయ్ (అలీగడ్‌లో కావ్య పఠనం చేయనన్న నిర్ణయం), ముఫ్త్ హుయె బద్‌నామ్ (అనవసరంగా చెడ్డ పేరు), జీవన్ కే కుఛ్ అన్ ఛుయే పహలూ (జీవితంలో స్పర్శించని కొన్ని పార్శ్వాలు), ఆధ్యాత్మ్ పర్ చర్చా (ఆద్యాత్మికత – చర్చ), మృత్యు కా పూర్వాభాస్ (మృత్యువు – పూర్వాభాస).

రచయిత ముందుమాట (ఉపోద్ఘాతం, ప్రస్తావన) లో తన తండ్రిగారి గురించి వెన్నతో తడిపిన వాక్యాలను ప్రయోగించారు.

“మా నాన్నగారు పద్మభూషణ్, పద్మశ్రీ, సాహిత్య వాచస్పతి, గీత్ గంధర్వ్, డాక్టర్ ఆఫ్ లెటర్స్, టాగూర్ వచస్పతి, సాహిత్య శిరోమణి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో అవార్డులతో, బిరుదులతో అలంకరింపబడిన (అన్ని అవార్డుల పేర్లు ఇక్కడ ఉల్లేఖించడం కష్టం) డా. గోపాల్ దాస్ నీరజ్. హిందీ సాహిత్యంలో ఒక శక్తివంతమైన సంతకం, కావ్య ప్రేమికులు ఎంతో గౌరవాభిమానలతో అను నిత్యం ఉచ్చరించే నామం – నీరజ్. కావ్య జగత్తులో ఒక ధృవతారగా 70 సంవత్సరాల నుండి తన స్థానం నుండి ఎప్పుడు కదలని మెదలని అన్నింటకన్నా తేజోవంతమైన తారగా ఈనాటికి నిలిచిన ఒక మహానీయుడు.”

కాలాతీత రచనలు చేసిన రచయిత రచనలలో మానవీయ సంవేదన చిత్రణ, సమాజంలో పాతుకుపోయిన అవకతవకలు, అసమానతలపైన ఆక్రోశం కనిపిస్తాయి. ఎన్ని సార్లు గీతాలు విన్నా, కావ్య కౌశలాన్ని ప్రశంసించకుండా ప్రజలు ఉండలేరు.

కవి స్వరం సుమధురంగా ఉందనే కారణంగా ప్రసిద్ధ కవి దినకర్ ‘హిందీ కీ వీణా’ అని ప్రశంసించారు. శ్రీ భదంత్ ఆనంద్ కౌసల్యాయన్ – మారుమోగే కంఠం అని గమనించి ‘అశ్వఘోష్’గా కవికి బిరుదు ఇచ్చారు.

కొందరు కవితలలో ఆధ్యాత్మికతను చూసి, కబీర్ లాగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పే సహజ భాషను ఉపయోగించారని సంత్ కవి అని అంటే; మరికొందరు ప్రేమ – శృంగారం చిత్రణ ఇంత బలంగా ఎవరు చేయలేరు కాబట్టి నీరజ్ ‘ప్రేమ్ – శృంగార్ కవి’ అని అన్నారు.

కుటుంబం అంతా కలిసి ఉండాలనే కోరిక – నీరజ్ త్యాగం:

బాల్యంలోనే తండ్రి పోగొట్టుకున్న పిల్లవాడు నీరజ్. తన పైన ఒక అన్న, ఇద్దరు తమ్ముళ్ళు. తల్లి, నాయనమ్మ, తాతయ్య, తక్కిన బంధువులు. సరైన తిండి, గూడు లేక అల్లాడిన కుటుంబం. ఇటావా నుండి ఏటా వరకు ప్రయాణం చేయాల్సి వచ్చింది. కాయస్థులు చదవుకుని గుమస్తా పని చేయాలని పెద్దవాళ్ళకి ఒక మూఢ నమ్మకం. నీరజ్ నాన్నగారు స్వర్గస్థులవడం వలన నెలకి వచ్చే ఆదాయం లేకుండా పోయింది. పైగా బాబా బ్రజకిషోర్ భోజనప్రియులు కావడం వలన తాము సుష్టుగా తినే వాళ్ళు, అవతలి వాళ్ళకి పెట్టే వాళ్ళు. అంతో ఇంతో ఉన్న ఆస్తి కూడా కరిగిపోయింది. మేనత్త ఆశ్రయం ఇచ్చింది.

నామకరణం – జ్యోతిష్కుల నమ్మశక్యం గాని భవిష్యవాణి:

పండితులు ‘గోపాల్ దాస్’ అని నామకరణం చేసారు. పిల్లవాడికి విశ్వఖ్యాతి లభిస్తుందని ఘంటాపథంగా చెప్పారు. తండ్రి నీడ త్వరలోనే కరువు అవుతుందని చెప్పారు. ఎప్పుడు ఉదరరోగంతో బాధపడుతాడని చెప్పారు. జగత్ ప్రసిద్ధుడవుతాడంటే ఎవరు లేశ మాత్రం నమ్మలేదు. కాని భవిష్యవాణి నిజం అయింది. ఎన్నెనో బిరుదులు వచ్చాయి. భారతదేశంలోనే కాదు విదేశాలలో కూడా నీరజ్ గీతాలు పాడుకునేవారు. నీరజ్ సుందర రూపానికి – ఎప్పుడు వాడిపోని నీరజీయ గీత పుష్పాల వైపు ఎందరో స్త్రీ – పురుషులు ఆకర్షితులయ్యారు. నీరజ్ ఒక యుగపురుషుడు.

మేనత్త ఇంట్లో చేదు అనుభవం:

మేనత్త, మేనత్త భర్త ఎంతో మంచివాళ్ళు. కాని వాళ్ళ యింట్లో జరిగిన ఒక సంఘటనకి అన్నదమ్ములిద్దరు జీవితాంతం బాధపడ్డారు. ఆ ఇంట్లో పెళ్ళి జరుగుతోంది. ఇంతలో ఒక మహిళ తన బంగారం గొలుసు పోగొట్టుకుంది. ఇల్లంతా గాలించారు. ఎక్కడ దొరకలేదు. అందరు ఇంటి వాళ్ళే. వాళ్ళు ఆలోచించారు. బయట నుండి వచ్చిన వాళ్ళు ఈ ఇద్దరు అన్నదమ్మలు. వాళ్ళ పెట్టా బేడా కూడా గాలించారు. కాని ఏమీ దొరకలేదు. మేనత్త ఇంటివాళ్ళు పిల్లలు ఇటువంటి పని చేయరు అని ఎంత చెప్పినా వినలేదు. అన్నదమ్ములిద్దరు ఇక అక్కడ ఉండదలుచుకోలేదు. అక్కడి నుండి పిల్లలు సైకిల్ మీద ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి ఇటావా చేరుకున్నారు. జరిగిదంతా చెప్పారు. అందరు ఎంతో బాధపడ్డారు.

పెద్దలు చెప్పిన మాట విని నీరజ్ మళ్ళీ ఏటాకి:

నీరజ్ అన్నయ్య మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి ఏ మాత్రం ఇష్టపడలేదు. పిల్లల మనస్సుల్లో పడ్డ అభిప్రాయాలు అంత తొందరగా సమసిపోవు. నీరజ్ తన కుటుంబం కోసం చదువుకోవాలి, సంపాదించాలి, కుటుంబాన్ని పోషించాలి అన్న ఆలోచనతో ముందడుగు వేశారు. ఇంట్లో ప్రతీదీ కరువే. అయినా కుటుంబమంతా కలిసి ఉంటోదన్న సంతోషం ఉంది.

నాలుగు పైసల కోసం యమున నదిలో ఈత:

హిందువులలో ఒక నమ్మకం ఉంది. నదిలో నాణెం వేస్తూ ఏదైనా కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నీరజ్, అన్నదమ్మలు నదిలో ఈదడంలో ఎంతో ప్రావీణ్యులు. ఆ ఊరు యమునా నదికి అతి దగ్గర. ట్రైన్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసే వాళ్ళు. ట్రైన్ లోని ప్రయాణికులు నదిలో పైసలు వేసేవాళ్ళు. పిల్లలు ఈదుతూ ఆ పైసలను చేజిక్కుంచుకునే వాళ్ళు. అంతో ఇంతో జేబు ఖర్చుకి వచ్చేవి.

నది ఒడ్డున కూర్చున్న చిన్న తమ్ముడిని తాబేలు ఈడ్చుకు వెళ్ళడం:

యమున నది ఒడ్డున తాబేళ్ళు ఉంటాయి. మనిషినైనా, దేనినైనా సరే లాక్కెళ్తాయి. మాంసాన్ని తింటాయి. నీరజ్ తమ్ముడిని నది ఒడ్డున కూర్చోపెట్టారు. తక్కిన తమ్ముళ్ళతో నదిలోకి ఈతకి వెళ్ళిపోయారు. కొంత సమయం అయ్యాక చూస్తే తమ్ముడు ఒడ్డున లేడు. గాలింపు మొదలయింది. తమ్ముడి కాలుని తాబేలు కొరికేసింది. అక్కడ గాయం అయింది. ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. గాయం నయం అయింది. కాని అక్కడ పెద్ద మచ్చ పడ్డది.

నీరజ్‌కి దేవుడిచ్చిన వరం స్మరణ శక్తి:

స్కూల్‌లో నీరజ్ ఎప్పుడు ప్రథమ శ్రేణిలోనే ఉండేవారు. గురువులందరికి ప్రియ శిష్యుడు. కాని ఒకసారి స్కాలర్‌షిప్‌కి కావాల్సిన మార్కులు రాలేదు. కొన్ని మార్కులు తక్కువ వచ్చాయి. ఇంట్లో ఎప్పుడు బీదరికమే. గురువు దగ్గరికి పోయి తన పరిస్థితి చెప్పి, స్కాలర్‍షిప్ రాకపోతే తన చదువు ఆగిపోతుందని రెండు మార్కులు పెంచమని అర్థించారు. అట్లా చేయడం తప్పు అంటూ తన ఫీజు కట్టారు గురువుగారు. “గోపాల్, ఎప్పుడు మన ప్రేమే మనకు మంచి ఫలితం ఇస్తుంది. నీవు ఇక ఎప్పుడు ఫస్ట్ రావాలి. ఎందుకంటే జగత్తంతా పోటీ ఎక్కువ అయింది. కవిగా అయినా సరే టీచరుగా అయినా సరే మొదటి శ్రేణిలోనే..” అన్నారట. నీరజ్ జీవితాంతం ఇదే బాటలో నడిచారు. ఆయన జీవితంలో ఇది మూల మంత్రం. అందుకే ఆయన కలం నుండి ఈ పంక్తులు వచ్చాయి.

ఒక రోజైనా సరే తాజ్ అయి బతుకు

అటల విశ్వసం అయి బతుకు

అమర యుగగీతం అయి బుతుకు

నీవు కేవలం పూజరిగా కాదు, భగవంతుడై బతుకు

ఒకొక్కసారి సైన్స్‌కి కూడా అందని, మెడికల్ సైన్స్, రీసర్చుకు అందని ఏ ఆధారం లేని చమత్కారాలు జీవితంలో జరుగుతాయి.

కుక్కకాటు – ఒక చెప్పులు కుట్టేవాడు ఇచ్చిన మందు – బతికి బట్టకట్టిన నీరజ్:

ఆ రోజుల్లో కుక్క కరిస్తే రేబిస్ వస్తుందన్ని జ్ఞానం ఎవరికీ లేదు. ఇంజెక్షన్లు లేవు. చిన్నప్పుడు నీరజ్‍ని కుక్క కరిచింది. ఇంటివాళ్ళు కాని, బయటవాళ్ళు కాని, స్వయం బాలకుడు నీరజ్ కాని అంతగా గమనించలేదు. నీళ్ళను చూసినా నిప్పుని చూసినా నీరజ్ వింత చేష్టలు చేయడం మొదలుపెట్టారు. భయపడేవారు. కేకలు వేసేవారు. ఇదంతా కుక్కకాటు వలననే అని అందరు తెలుసుకున్నారు. ఇంటి వైద్యం మొదలు పెట్టారు. పసుపు కారం కలిపి గాయం అయిన చోట రాసారు. కాని లాభం లేకపోయింది. మేనత్త, మామయ్య చాలా బాధపడ్డారు. ఇంతలో ఊళ్ళో ఒకతను, దగ్గరలోనే ఉన్న ఊళ్ళో ఒక చెప్పులు కుట్టేవాడు ఉన్నాడు, అతడు కుక్కకాటుకి మందు ఇస్తాడు అని చెప్పాడు.

“సమయానికి తీసుకు వచ్చారు. చాలా మంచిది అయింది” అని అతడు రెండు పొట్లాలు మందు ఇచ్చాడు. “మందు వెసుకున్నాక పిల్లవాడిని ఒక గదిలో పడుకోపెట్టాలి. సూర్యరశ్మి ఏ మాత్రం తగలకూడదు” అని చెప్పాడు. 72 గంటలు గది లోపల బాలుడు నీరజ్ ఉన్నాడు. గదికి తాళం వేసారు. ఆ తరువాత అనేక సార్లు విరేచనాలు అయ్యాయి. కుక్కకాటు చెడు ప్రభావం తగ్గిపోయింది. ఆ తరువాత అందరు చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళ్ళారు. కొంత డబ్బు ఇద్దాం అనుకునన్నారు. కాని అతడు తీసుకోవడానికి నిరాకరించాడు. “ఇది నా గురు ప్రసాదం. ఏదైనా తీసుకుంటే నా మందు పని చేయదు” అని అన్నాడు. నీరజ్‌కి అది పునర్జన్మ. జీవితాంతం అతడికి ఋణపడి ఉన్నాననుకునే వారు నీరజ్.

కౌమార దశలో నీరజ్ మనస్సులో – దగ్గరలో ఉండే ఒక అమ్మాయి పైన ఆకర్షణ పెరిగింది. కాని వాళ్ళది బీద కుటుంబం. ఇంకా నీరజ్ చదువుకోవాలి, ఉద్యోగం చేయాలన్న దృష్టితో పిల్ల వైపు వాళ్ళు పెళ్ళి చేయడానికి నిరాకరించారు. నీరజ్ నిమిష నిమిషం బాధపడేవారు. అంతే లోపలి బాధ కవితా రూపం ధరించింది. ఆయన రాసిన మొట్ట మొదటి కవిత-

నాది ఎంత ఏకాంతవాస జీవితం!

ఏ చెట్టు పైన అయినా పిట్టల జోడి కూర్చుని ఉంటే

వాటికి ఎక్కడ దిష్టి తగులుతుందో అన్న భయం

వాటి వంక చూసేవాడినే కాదు..

ఆ అమ్మాయికి పెళ్ళయిపోయింది. నీరజ్ మెల్లిమెల్లిగా మరచి పోడానికి ప్రయత్నించారు. నీరజ్ పేరుప్రతిష్ఠలు ధనం సంపాదించారు. ఒక రోజు ఉదయం ఊరికి వెళ్ళాడు. అక్కడ నీరజ్ ప్రేమ గురించి తెలిసిన ఒక బంధువు ఆ అమ్మాయి ఇక్కడే ఉందని చెప్పాడు. కలవాలనుకుంటే తీసుకెళ్తానని చెప్పాడు. నీరజ్ కలవడానికి వెళ్ళారు. తలుపులు తెరుచుకున్నాక చూస్తే వయస్సు కన్నా ముందే ముసలిగా అయిపోయిందామె. మురికి బట్టలు ధరించిన తన ప్రియరాలిని చూసారు. తన కళ్ళను తనే నమ్మలేకపోయారు. భర్త రైల్వేలో పని చేసేవాడని, ఆరోగ్యం సరిగా లేక ఇంట్లోనే ఉంటున్నాడని, అర్దికంగా చాలా దిగజారిపోయామని ఆమె చెప్పింది. తన జీవితం చివరి వరకు నీరజ్ ఇదీ ఒక జీవిత పాఠమే అని నమ్మారు.

తిండి తిప్పల కోసం ఉరుకులు – పరుగులు:

ఇంట్లో ఆరుగురి బాధ్యత నీరజ్ కోమలమైన భుజాల మీద పడ్డది. అందరిని కలిపి ఉంచి కడుపు నిండా తినడం, అవతలి వాళ్ళకు సహాయం చేయడం ఆయన ధ్యేయం. అక్కడ ఒక టైప్‌రైటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఉండేది. యజమాని ఒక టైప్ రైటర్‌ని అద్దెకి ఇచ్చాడు. కచేరికి టైప్ రైటర్‌ని నెత్తి మీద పెట్టుకుని తీసుకు వెళ్ళేవాడు నీరజ్. సాయంత్రం దాకా టైప్ చేసి అంతో ఇంతో సంపాదించాడు. అమ్మ తండ్రి, తాతయ్య కోసం రబడీ తీసుకు వెళ్లేవాడు. తాతయ్య ఎప్పుడు అడిగేవారు “ఎంత సంపాదించావు?”, “ఇవాళ రోజు కన్నా ఎక్కువే సంపాదించాను” అని యువకుడు నీరజ్ చెప్పగానే తాతయ్య ఆశీర్వదించేవారు.

క్రికెడ్, బాట్‌మింటన్, హాకీ ఆటలు కాకుండా గిల్లీ దండా, దాగుడుమూతలు:

క్రికెట్ మొదలైన ఆటలు డబ్బుతో కూడినవి. గిల్లీ దండా – హైజంప్, దాగుడుమూతలు లాంటి ఆటలకు డబ్బుతో అంత పని లేదు. అందుకే నీరజ్ ఈ ఆటలే ఎక్కువగా ఆడేవారు. నీరజ్ బాధపడ్డారే కాని అంతగా క్షోభపడేవాడు కారు.

పల్లెటూళ్ళలో భూత ప్రేత కథలు – మంత్ర తంత్రాలు – భూతాలను వశపరచుకోవడం:

నీరజ్, తక్కిన స్నేహితులు కలిసి భూతలను వశం చేసుకోవాలని; సిద్ధి పొందితే తాము ఏ పనైనా చేయగలుగుతామని అనుకున్నారు. దీని కోసం రాత్రి శ్మశానంలో నరుల పుర్రెలతో పాలు, బియ్యం పొసి పరమాన్నం వండాలి. విశ్వంభర పండిత్ అనే పండితుడు అఘోరిల దగ్గరికి వెళ్ళి ఒక పుర్రె, సాంబ్రాణి, మాయ మంత్రాలు రచించి ఉన్న పుస్తకం మొదలైన వాటిని తీసుకు వచ్చారు. శ్మశానంలో రాత్రి తంత్ర సాధన చేయాలి. అందరు అక్కడికి వెళ్ళారు. అనుష్ఠానం మొదలయింది. పరమాన్నం తయారు చేసారు. సాధన మొదలయింది. ఆ స్నేహితుల్లో ఒక అబ్బాయి పండిత్‌ని పట్టించాలన్న దురాలోచనలో పండిత్ ఇంట్లో వాళ్ళకి ఇదంతా చెప్పాడు. భూతం ఏదో రూపంలో వస్తుందని అప్పుడు దాని ముఖాన వేడి వేడి పరమాన్నాన్ని విసిరి వేయాలని చెప్పారు. పండిత్ తండ్రి అక్కడికి వచ్చాడు. సాధనలో ఉన్న పండిత్ తండ్రి ముఖాన వేడి వేడి పరమాన్నం వెదజల్లాడు. చివరికి తండ్రి కొడుకు చెయ్యి పట్టుకుని లాక్కుంటూ వెళ్ళిపోయాడు. వృద్ధుడయ్యాక కూడా నీరజ్ ఈ విషయం గురించి తన కొడుకు గుంజన్‌కి చెబుతూ ఉండేవారు.

దేవకీ నందన్ ‘చంద్రకాంత్ సంతతి’ – రచన

ఇందులో గదాధర్ సింహ్ – భూత్‌నాథ్ అనే పాత్ర ఉంది. పాత్ర భూత్‌నాథ్ ఎంతో సాహసవంతుడు. ఆ రోజుల్లో రేడియో, టెలివిజన్ ఏవీ లేవు. అందరు కలిసి కూర్చుని ఇటువంటి కథలు చెప్పుకుని కబుర్లతో కుడుపు నింపుకునే వాళ్ళు.

ఈ కథలో ఇళ్ళు – దర్వాజాలకు ఉండే బొమ్మలు చక్రాలు అవి అటు ఇటు తిరుగాడతాయి. ఒకసారి చీకట్లో నడుస్తుంటే ఒక అబ్బాయి గుంటలో పడిపోయాడు. పెద్దగా కేకలు పెట్టాడు. భూత్‌నాథ్ శిష్యుడు మాయా సరోవరంలో పడిపోయాడు. అందరిని లేపారు. భూతనాథ్ శిష్యుడు అని అందరు పరిహాసం చేస్తూ నవ్వసాగారు.

మృత్యువు ఇచ్చిన ఆశీర్వాదం:

ఒక రోజు అంధకారం కల ఒక రాత్రి

నాకు ఈ ప్రాణదీపాన్ని ఇచ్చింది

ప్రవాహంలో వెలిగింది, ఆవై ఒడ్డునా వెలిగింది

ఎన్నోసార్లు హృదయం విశ్వాంధకారాన్ని తోసేసింది.

నీరజ్ నాయనమ్మ చెప్పిన ప్రకారం, నీరజ్ నాలుగేళ్ళ పిల్లవాడు. తల్లి నీరజ్‍కి తినడానికి పదార్థం పెట్టింది. తరువాత తన పని చేసుకోవడం మొదలుపెట్టింది. గిన్నె ముందు కూర్చున్న నీరజ్ నువ్వు తిను.. తిను అంటూ అరుస్తున్నాడు. కుక్కో పిల్లో అయి ఉంటుందిలే అని ఆమె అనుకుంది. అయినా తలుపులు మూసి ఉన్నాయి, ఏం వస్తాయి అనుకుంది. తీరా చూస్తే అక్కడ నీరజ్‍కి అతి దగ్గరగా ఒక పాము ఉంది. అంతే పిల్లవాడు నీరజ్‌ని తీసుకుని బయటకు పరుగెత్తుకుని వెళ్ళిపోయింది. ఇట్లా నీరజ్ మృత్యువు నుండి ఎన్నోసార్లు బయటపడ్డారు. నమ్మశక్యం కాని దుర్ఘటనల నుండి ఆయన బయటపడి పండు ముసలి అయి జీవించారు.

జీవితంలో ఒడిదుడుకులు – కావ్య యాత్ర:

ఢిల్లీలో ప్రభుత్వ సప్లై విభాగంలో టైపిస్ట్‌గా ఉద్యోగం దొరికింది. జీతం 67 రూపాయలు. నలభై రూపాయలు ఇంటికి పంపించేవారు. 27 రూపాయలు తన కోసం అట్టిపెట్టుకునేవారు. దగ్గర ఉన్న డబ్బు ఖర్చులకి సరిపోవడం లేదు. రెండో రోజు దాకా ఆకలి వేయకూడదని ఒక పూట పూరీలు తినేవారు. జ్యోతిష్కులు చెప్పిన మాట నిజం కాసాగింది.

ఢిల్లీలో జరిగే కవి సమ్మేళనంలో పాల్గొనడం ఎక్కవ కాసాగింది. 1944లో గాంధీ, జిన్నాల మీటింగ్ సిమ్లాలో జరిగింది.

ఆజ్ మిలా గంజా జల్ జమ్-జమ్ సే (ఇవాళ గంగాజలం జమ్-జమ్‍తో కలిసింది) నీరజ్ రాసిన ఈ కవిత విని హఫీజ్ జలంధరి ఎంతగానో ప్రభావితుడయ్యాడు. సాహబ్ జాదే ఏం చేస్తున్నావు? అని అడిగాడు. నీరజ్ టైపిస్ట్‌గా పని చేస్తున్నాని చెప్పాడు. ఆయన సాంగ్స్ అండ్ పబ్లిసిటీ ఆఫీసులో ఉద్యోగం ఇచ్చారు. 110 రూపాయలు జీతం.

కలకత్తాలో దుర్భిక్షం – కుక్కలు – మనుషులు తిండి కోసం తన్నుకోవడం:

నీరజ్ కలకత్తాలో ఘోరాతి ఘోరమైన దృశ్యాలను చూసాడు. రొట్టె కోసం కుక్కలతో మనుషులు పొట్లాడం చూసాడు. బాధ, కోపం రెండు కలిగాయి. బ్రిటీష్ వాళ్ళను కలవర పెట్టే ఒక కవిత రాసాడు.

మై విద్రోహీ హుఁ జగమే విద్రోహ్ కరనే ఆయా హుఁ

క్రాంతి – క్రాంతి కా సరల్ సునహారా రాగ్ సునానే ఆయా హుఁ..

(నేను తిరుగుబాటుదారుడిని, తిరుగుబాటు చేయడానికి వచ్చాను. విప్లవం – విప్లవం సరళ బంగారు రాగాన్ని ఆలపించడానికి వచ్చాను.)

కలెక్టర్ భుఖారీ నీరజ్‌ని ఉద్యోగం నుండి తీసివేయమని జలంధర్‌కి కబురు పంపారు. పోలీసులు నీరజ్‌ని గాలిస్తున్నారని ఢిల్లీకి రావద్దని చెప్పమని చెప్పాడు. నీరజ్ ఎదురుకుండా రెండే దారులు – తన మనోభావాలని వ్యక్తం చేయకూడదు, ఉద్యోగామైనా మానేయ్యాలి. ప్రభుత్వం ఎదుట తలవంచేదే లేదని రాజీనామా చేసి కాన్‌పూర్‌కి వెళ్ళిపోయారు.

పైళ్ళయ్యాక జీవితంలో స్థిరత్వం – 17 నవంబర్ 1945:

నీరజ్ భార్య పైసా పైసా దాచి పెట్టి ఇల్లు నడిపేవారు. చివరి వరకు ఆవిడ తన కోసం అంటూ ఒక్క పైసా ఖర్చు పెట్టేవారు కాదు. 1949లో ఇంటర్‌మీడియట్, 1951లో బి.ఎ ప్రథమ శ్రేణిలో పాసయ్యారు నీరజ్. మళ్ళీ ప్రయివేట్ ఉద్యోగంలో చేరారు.

నీరజ్ తాతయ్య స్వతంత్ర సేనాని. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. పోలీసులు ఆయనని గాలించేవాళ్ళు. నీరజ్ భార్య ఆ ఇంటికి పెద్ద కూతురు. ఆమె తరువాత నలుగురు తమ్ముళ్ళు. ఆమె హైస్కూల్ పరీక్ష ఇచ్చింది. కాని ఫెయిల్ అయింది. షేక్‌స్పియర్ నాటకాలు ఒథెలో, మాక్‌బెత్ నీరజ్‌కి బైహార్ట్. ఆయన పుస్తకం చూడకుండా మొత్తం అప్పచెప్పేవారు. భార్య ఎక్కడైనా తప్పులు ఉంటే చెప్పేది. నీరజ్ భార్య జీవితాంతం ఆయనకు తోడు నీడ అయి నిలిచింది.

చనా (సెనగలు) కోసం చిన్నప్పుడు కొడుకు తండ్రి వెంటబడటం:

కాన్‌పూర్‌లో నెహ్రు నగర్ లో ఉంటున్న రోజులు.

నీరజ్ కల్పనా లోకంలో పడిపోతే పక్కన ఏం జరుగుతున్నదీ తెలిసే కాదు. ఊహాలోకంలో విహరించడం ఆయన నైజం, గుణం. ఆ రోజు కొడుకు “నాన్నా! చనా తీసుకో” అంటు అడిగాడు. ఆయన పట్టించుకోలేదు. పైగా కొడుకు చెంపపైన ఓ దెబ్బ వేసారు. ఆ తురవాత కొడుకుని ఎత్తుకుని పశ్చాత్తాపపడ్డారు. అదే ఆఖరిసారి. కొడుకు వలన ఎంత నష్టం వచ్చినా ఎప్పుడు కొడుకుని కోప్పడలేదు.

కాన్‌పూర్‌లో ఒక మైదానం ఉండేది. అక్కడ బావి ఉండేది. అప్పటికే నీరజ్ కవిగా ప్రసిద్ధి పొందారు. జిల్లా సుచల్ అధికారి పదవి వదిలేసి ఎమ్.ఎ చదివారు. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు. మధ్య దారిలో బీద, కూలీవాళ్ళ ఇళ్ళు ఉండేవి. నీరజ్ అక్కడ ఆగి పుస్తకాలు కింద పెట్టి గోళీకాయలు కొని వాళ్ళతో ఆడేవారు. అసలు ఆయన ఎప్పుడు ఎవరి కులగోత్రాలు కాని, మతాలను కాని చూడలేదు. ఆయన దృష్టిలో అందరు సమానమే. కొడుకు గుంజన్ కూడ ఇదే రీతిలో జీవితాంతం నడిచాడు.

ఒక గోరువంకపై ఎంతో ప్రేమ – పంజరంలోని పిట్టకు పల్కులు నేర్పడం:

నీరజ్ ఒక రోజు గోరువంకని తీసుకు వచ్చారు. రోజంతా పిల్లవాడు గుంజన్ ఇరవై నాలుగు గంటలు పాపా.. పాపా.. అంటూ పిలుస్తూ ఉండేవాడు. మైనా కూడా ఈ పల్కులనే నేర్చుకుంది. నీరజ్ ఇంటికి రాగానే పాపా.. పాపా అంటూ అరిచేది. ఆయన దానిని నిమిరేదాకా ఊర్కునేది కాదు. గోరింక ఒక రోజు తెల్లారే సరికి పంజంరంలో చనిపోయి ఉంది. నీరజ్ కళ్ళు చెమర్చాయి.

అలీగఢ్ ఇంట్లో సాహిత్య వాతావరణం:

ఇంటికి రకరకాల మాగజైన్లు వచ్చేవి. కవులు వచ్చేవారు. అందరు వాళ్ళ వాళ్ళ కవితలు చదివేవారు. చర్చించేవాళ్ళు. సలహాలు ఇచ్చేవారు. తప్పులు దిద్దుకునేవాళ్ళు. ఎవరు ఏమీ అనుకునేవాళ్ళే కాదు. షహర్‌యార్, రాహీ మసుమ్ రజా, రవీంద్ర భ్రమర్ మొదలైన వాళ్ళు వచ్చేవాళ్ళు. తరువాత షహర్‌యార్ సాహెబ్ ఉమరావ్‌జాన్ సినిమాకి గజళ్ళు రాసారు. రాహీ మసుమ్ రజా మహాభారత్‌కి సంభాషణలు రాసారు. నీరజ్ కూడా ఎన్నో సినిమా పాటలు రాసారు.

కవి సమ్మేళనాలు:

అజ్ జమానే కో ఖబర్ కర్‌దో కీ ‘నీరజ్’ గా రహా హై

~

‘జో ఝుకా హై వహ్ ఉఠే అబ్ సర్ ఉఠాయె

జో రూకాహై వహ్ చలె నభ్ చూమ్ ఆయె

జో లుటా హై వహ్ నయే సపనే సజాయే

జుల్మ్-శోషణ్ కో ఖులీ దేకర్ చునౌతీ

ప్యార్ అబ్ తలవార్ కో బహలా రహా హై

అబ్ జమానే కో ఖబర్ కరదో.’

(ఇప్పుడు ప్రపంచానికి చెప్పేసేయి – నీరజ్ పాడుతున్నాడు. తల వంచిన వాడు ఇప్పుడు ఇక తల యెత్తుకోవాలి. ఆగినవాడు, ఆకాశాన్ని ముద్దు పెట్టుకు రావాలి. దోపిడీ చేయబడ్డవాడు, కొత్త కలలను కనాలి. అత్యాచారం, శోషణలను బాహటంగా ఖండించాలి. ప్రేమ ఇప్పుడు కత్తిని ఆనందింపచేస్తోంది. ఇప్పడు ప్రపంచానికి చెప్పేసేయి.)

నీరజ్ లాగానే కొడుకు గుంజన్ పాడేవాడు.

నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కి చాలా మంది విరాళాలు ఇచ్చారు. ఇచ్చేవాళ్ళని స్టేజ్ పైకి రమ్మనమని అనౌన్స్ చేసారు. ఎంతోమంది ఆడవాళ్ళు నగా నట్రా ఇచ్చేసారు.

గుంజున్‌ని ప్రోత్సాహించడానికి వెండి పూత పోసిన కప్ – ప్లేట్ సంయోజకులు ఇచ్చారు.

నీరజ్ రాసిన కవితని గుంజన్ పాడాడు. అక్కడ కూర్చున్న పెద్ద పెద్ద కవుల ప్రశంసలను అందుకున్నాడు.

గంగా కీ కసమ్, జమునా కీ కసమ్, యహ్ తానా బానా బదలేగా

….

హర్ ఝోంపడీ అజంతా, టాగూర్ హర్ కలమ్ హై..

మరోసారి ఢిల్లీ యాత్ర:

నీరజ్ కొడుకు కోసం ఒక కవిత రాసారు. కొడుకుకి ఎట్లా చదవాలో నేర్పించారు. వేదిక మీద ఆ రోజుల్లో పేరుప్రతిష్ఠలు కల మహాదేవి వర్మగారు, దినకర్ గారు, రఘునాధ్ అవస్థి, వీరేంద్ర మిశ్రా, దేవరాజ్ దినేష్, శ్యామ్ నారాయణ్ పాండేయ్, సుభద్రకుమారి సిన్హా మొదలైన వాళ్ళు ఉన్నారు. ఈ కవితలన్ని రేడియో వాళ్ళు ప్రసారం చేసారు. నీరజ్ ఎవరినీ సామాన్యంగా మెచ్చుకోరు. గుంజన్ లయలో కవిత చదివిన తీరుని ఎంతో మెచ్చుకున్నారు.

నీంవ్ బహుత్ కమ్‌జోర్ హో, జర్జర్ హో దీవార్

ఉస్ ఘర్ మే టికతీ నహీఁ జ్యాదా దేర్ బహర్

(పూనాది బలహీనంగా ఉంటే, కూలిపోయే గోడలు ఉంటే ఆ ఇంట్లో ఎక్కువ కాలం వసంతం నిలవదు)

అలీగఢ్ మారీస్ రోడ్డులో 5000 రూపాయలకు ఇప్పుడున్న భూమి కన్నా ఎనిమిది రెట్లు ఎక్కువ. కాని పదివేలు లేక కొనలేక పోయారు. నాయనమ్మ ఆ సమయంలో 5 రూపాయలుకు ఇంటి మొత్తానికి నెల రోజులకు సరిపడా సామాను వచ్చేది అని చెబుతుండేది. ఇప్పుడు కూలివాడికి 8 అణాలు, మేస్త్రీకి (ఇటు వైపు రాజ్ మేస్త్రీ అని అంటారు) ఒక రూపాయి నాలుగు అణాలు కూలి. గుంజన్ ఇంజనీర్‌గా ఉద్యోగం మొదలు పెట్టినప్పుడు 728 రూపాయలు వచ్చేవి.

ఇల్లు కట్టేటప్పుడు నీరజ్ లెక్చరర్‌గా పని చేసేవారు. ఆయనకి టైమ్ ఉండేది కాదు, భార్య నెలవారి ఒక రిక్షా మాట్లాడుకుని వెళ్ళేవారు. గుంజన్ తల్లి ఎంతో కష్టపడి ఈ ఇల్లు కట్టించారు. ఎండలో, వానలో, చలిలో అక్కడ ఉండి ఒక చక్కటి ఇల్లు 1960లో కట్టించారు.

కాలేజీలో తోటి లెక్చరర్ కంప్లైంట్ – కేసు గెలవడం:

నీరజ్ ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసరు దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న రసీదులన్నింటిని చూపిస్తానన్నారు. ఆఫీసరు వీటి వలన కేసు కొట్టేయరు, జూర్మానా కట్టమన్నారు. అన్యాయాన్ని నేను అసలు సహించను, కేసు నడవనీయండి అని అన్నారు. ఆ తరువాత ఆయన కేసు గెలిచారు.

స్కూలు వాళ్ళ పట్ల నీరజ్ సహృదయత:

గుంజన్ స్కూల్లో మెర్రీ గో రవుండ్ అనే ఆట ఆడుతున్నప్పుడు కింద పడ్డాడు. మోకాళ్ళు పై పెద్ద గాయం అయింది. తోటి పిల్లలు అరవడం మొదలు పెట్టారు. టీచరు పరుగెత్తుకుంటూ వచ్చింది. రోజూ ఇంటికి తీసుకువెళ్ళే బాబురావు వచ్చాడు. గబగబా హాస్పిటల్‌కి తీసుకవెళ్ళారు. మత్తుమందు ఇవ్వకుండానే కుట్లు వేసారు. బాధతో పిల్లవాడు పెద్ద పెద్దగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. తల్లి ఎంతో ఓదార్చింది. కాలేజీ నుండీ నీరజ్ గబగబా వచ్చేసారు. తండ్రిని చూడగానే రిక్షాలోంచి గుంజున్ కిందకి దూకబోయాడు. తండ్రి గట్టిగా కోప్పడ్డాడు. ఆనాడు తండ్రి ఆపకపోయి ఉంటే తను జీవితాంతం ఈ బాధ భరించాల్సి వచ్చేది అని గుంజన్ ఈనాటికి అనుకుంటూనే ఉన్నాడు.

స్కూలు స్టాఫ్ అందరు పిల్లవాడిని నిర్లక్ష్యం చేసారంటూ నీరజ్ ఎక్కడ కోపంతో ఊగిపోతారో ఏమౌతుందో అని ఎంతో భయపడ్డారు. కాని ఆయన సరియైన సమయంలో పిల్లవాడిని తీసుకువెళ్ళారు, వాడిని కాపాడారు అని అంటు ఆయన యజమాన్యానికి ధన్యవాదాలు చెప్పారు. ఈ సంఘటన ఆయన సహృదయతను చాటుతోంది.

అలీగఢ్ ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణం:

ఆ ఇల్లు ఎప్పుడు బంధువులతో కళకళలాడుతూ ఉండేది. నీరజ్, నీరజ్ భార్య, గుంజన్, నాయనమ్మ, మనుమలు, పెద్దనాన్న, బాబాయ్‌లు, పెద్దమ్మ, పిన్నిలు ఎప్పుడు ఉంటూ ఉండేవాళ్ళు. కవి నీరజ్ తన ఇల్లు ఒక కావ్యంలా ఉండాలనుకునే వారు. అందరిని కలిపి ఉంచి నవ్వుతూ తుళ్ళుతూ జీవితాలని గడపాలని ఆయన ఉద్దేశ్యం. ఈ ఉద్దేశ్యం నెరవేరడం కోసం ఆయన అష్ట కష్టాలు పడ్డారు.

సినిమా పాటలు – దేవానంద్ గారి పట్ల ఎనలేని అభిమానం:

నీరజ్ రాసిన ప్రతీ సినిమా పాటలో సాహిత్యం అద్భుతం. శిల్పం – శైలీ – లయ ఆత్మని వెన్నలా స్పర్శిస్తాయి. దేవానంద్ వస్త్రధారణ, జీవన విధానం ఆయనకు ఎంతో నచ్చేది. ఎప్పుడు యువకులుగా ఉండాలనుకుంటే, నునుగు మీసాల యువకులతో కలిసి ఉండాలని దేవానంద్ జెబుతూ ఉండేవారు. నీరజ్ ఇదంతా పిల్లలకి పెద్దవాళ్ళకి చెప్పేవారు.

కొడుకు గుంజన్ కోరిక – తండ్రి నీరజ్ సహృదయత:

నీరజ్ గారికి గుంజన్ అంటే ప్రాణం. గుంజన్ జబ్బు పడ్డప్పడు నీకేం కావాలి అని అడిగారు. నాలుక రుచించడం లేదు కనుక ఏవైనా తినే పదార్థాలు అడుగుతాడని ఆయన అనుకున్నారు. గుంజన్ భూతనాధ్ నవల కావాలని కోరాడు. అంతే అలీగఢ్ లోని పుస్తకాల దుకాణాలన్నింటిని వెతికారు. దొరకలేదు. బాబాయి ఢీల్లీ వెళ్ళి చంద్రకాంత్, చంద్రాకంతా సంతతి, భూత్‌నాధ్, రోహతాస్ మఠ్ మొత్తం పదహారు పుస్తకాల సెట్‌ని తీసుకు వచ్చారు. ఇప్పటికీ గుజన్ ఆ సెట్‌ని అన్నింటికన్నా ఎంతో విలువైనదిగా ఎంచి సురక్షితంగా ఉంచుకున్నారు. ఇప్పుడు వృద్ధులైన గుంజన్ దృష్టిలో ఆనాటి రచయితల ఊహలు – కల్పిత పాత్రలకు ఎంతో విలువ ఉంది.

విపరీతమైన ఎండలు – పిల్లలకు కథలు – కబుర్లు, పాఠాలు:

ఎండలు మాడిపోతున్నాయి. ఆ రోజుల్లో నీరజ్ బాక్స్ టైప్ కూలర్‌ని తీసుకువచ్చారు. మధ్యలో ఫాన్ ఉంటుంది. చుట్టూరా వట్టి వేళ్ళు తడికలు ఉంటాయి నీళ్ళు నిండగానే ఫోర్లి కింద కారతాయి. ఒక బక్కెట్టును దాని కింద పెట్టారు. బాల్టీ నిండగానే ముందు పిల్లలు ఎవరు పారపోస్తే వాళ్ళకి నాలుగు అణాలు ఇస్తానని తండ్రి అన్నారు. రాత్రి పూట పిల్లలు అందరు నిద్ర పోయేవాళ్ళు. కాని సోదరుడు అరుణ్, ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు, మేల్కోనేవాడు. బాల్టీ నిండగానే పారబోసి వచ్చేవాడు. పెదనాన్నకి చెప్పి డబ్బులు తీసుకునేవాడు. పన్నెండణాలు, రూపాయిన్నర జమ అయ్యేవి. పిల్లలందరు కలిసి తినడానికి బయటకి వెళ్దాం అని బలవంతం చేసేవాళ్ళు. అరుణ్ దానికి మొండి పట్టుపట్టేవాడు. ఈ విషయం పిల్లలు నీరజ్‌కి చెప్పారు. ఎవరు కష్టపడతారో వాళ్ళకే ఫలితం దక్కుతుంది. మీ అందరికీ భాగం ఇవ్వాలా ఒద్దా అన్నది వాడి ఇష్టం. డబ్బులు కావాలంటే మీరు కష్టపడండి అని అన్నారు.

పిల్లలందరు ఒక గుణపాఠం నేర్చుకున్నారు. కష్టపడాలి. ఏదైనా పొందాలంటే చాలా వరకు త్యాగం చేయాలి, సుఖాన్ని త్యాగం చేయాలి. కష్టే ఫలే..

కాళ్ళు పడుతూ ఉంటే కథల ప్రవాహం – కథ చెబితే నీరజే చెప్పాలి:

నీరజ్, ఆయన అన్నయ్య కాళ్ళు పిల్లలు పట్టేవారు. నొక్కుతున్నంత సేపు నీరజ్ భూతాల కథలు చెప్పేవారు. కాళ్ళు నొక్కడం ఆపేస్తే చెప్పడం మానేసేవారు. పిల్లలు చెప్పమని అడిగేవాళ్ళు.”కాలు నిద్రపోతోంది. నొక్కతూ ఉంటే లేస్తుంది” అని నీరజ్ అనేవారు.

‘లయ్’ అనే పత్రిక సంపాదకుడిగా నీరజ్:

నీరజ్ బావమరిదికి అంటే గుంజన్ మామయ్యకు ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. నీరజ్ ఎంతో ఆలోచించారు. ఏదైనా వ్యాపారం చేద్దామంటే కాయస్థులకు వ్యాపారం పనికిరాదనే నానుడి ఉంది. అందరూ సాహిత్య ప్రియులే. లయ్ అనే పత్రికను మొదలు పెట్టారు. అందులో పెద్ద పెద్ద రచయితల రచనలు ప్రచురితం అయ్యేవి. రెండేళ్ళు పత్రికను నడిపారు. ఆ తరువాత పరిస్థితుల కారణంగా అది మూతపడ్డది.

నీరజ్ పిల్లలకు ‘చదరంగం’ ఆట నేర్పించడం:

పిల్లలందరు కుస్తీలు పట్టే వాళ్ళు. ఇంట్లో ఓ మూల చోటు ఉంది. అందుకని అక్కడ గోదాని ఏర్పాటు చేసారు. కొన్నాళ్ళు తరువాత ఆడపిల్లలకి మగపిల్లలకి రెండు చదరంగం బోర్డులు తీసుకు వచ్చారు. పోటీలో ఎవరు గెలిస్తే వాళ్ళకి బహుమతి ఇస్తామన్నారు. ఒకసారి ఈ ఆటను ఆడటం నేర్చుకుంటే ఎంతగా అలవాటు పడిపోతారంటే, ఆడకుండా ఉండలేరు. తిండి తిప్పలు మానేసి ఆటలో మునిగిపోతారు. ఈ ఆటకు సంబంధించిన ఎన్నో కథలు చెప్పేవాళ్ళు. అందులో ప్రేమ్‌చంద్ గారి ‘షతరంజ్ కే ఖిలాడి’ గురించి ఎంతో చర్చ జరిగేది. పిల్లలందరు ఈ ఆట నేర్చుకున్నారు. పోటీలు పెట్టుకుని ఆడేవాళ్ళు. బహుమతులు గెలుచుకునేవారు.

సినిమా యాత్ర – కొన్ని సంఘటనలు:

1960, ఫిబ్రవరి 9న బిర్లా మాతృశ్రీ సభాగార్‌లో ‘నీరజ్ గీత్ గుంజన్’ అన్న పేరున ఒక ప్రోగ్రాం జరిగింది. ముఖ్య అతిథిగా యశ్వంత్ రావు చౌహాన్ గారు వచ్చారు. అలీగడ్ నివాసి ఆర్. చంద్రగారు కూడా వచ్చారు. సినిమాలకి పాటలు రాయమని నీరజ్ గారిని బొంబాయికి పిలిచారు. ఒక పాట రాయడం కోసం ఆయన బొంబాయికి రాలేనని చెప్పారు. అప్పటికే నీరజ్ ‘కారవాం గుజర్ గయా గుబార్ దేఖ్‍తే రహే’ పాట చాలా ప్రసిద్ధి చెందింది. ‘నయీ ఉమర్ కీ నయీ ఫసల్’ సినిమా షూటింగ్ అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలో జరిగిది. అలీగఢ్ వాసుల ఆనందానికి అవధులు లేవు. ‘దేఖతీ హీ రహో ఆజ్ దర్పణ్ న తుమ్’, ‘ఆజ్ కీ రాత్ బడీ షోఖ్ ఔర్ బహుత్ నట్‍ఖట్ హై’ పాటలు హిట్ అయ్యాయి. ఆ రోజుల్లో రేడియో ప్రోగ్రామ్స్ బినాకా గీత్ మాలా, వివిధ్ భారతిలో ఈ పాటలు ప్రసారం అయ్యేవి.

‘కాల్ కా పహియా’కి ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ వచ్చింది. దాదా బర్మన్ గారితో నీరజ్‌కి పరిచయం అయింది. ఆ తరువాత దేవానంద్ గారితో. దేవానంద్ సినిమాలకి ఎక్కువగా శైలేంద్రగారు పాటలు రాసేవారు. నీరజ్ పాట ‘రంగీలారే తేరే రంగ్ మే’ బర్మన్ గారికి చాలా నచ్చింది. బర్మన్ ఎవరిని ఎక్కువగా ఇంటికి పిలవరు. కాని నీరజ్ అంటే ఆయనకి ఎంతో గౌరవం. ఆయన నీరజ్‌ని ఇంటికి పిలిచారు. ఇక ఇక్కడి నుండి నీరజ్ దశ తిరిగింది. శ్రీ రాజ్‌కపూర్‌తో పరిచయం అయింది. ‘మేరా నామ్ జోకర్’కి రాసిన పాట ఎంతో హిట్ అయింది. నీరజ్ తన దైన శైలిలో పాడి చూపించారు. శంకర్-జైకిషన్ గారు దీనికి ట్యూన్ కట్టారు. ‘కన్యాదాన్’ సినిమా ప్రొడ్యూసర్ రాజేంద్ర బాటియా, నీరజ్ పాట రాసి ఇచ్చాక శంకర్ గారు రిజెక్ట్ చేసారు. ఒకసారి పాట రాసి ఉన్న కాగితాన్ని చించేసారు. నీరజ్, భాటియా చాలా బాధపడ్డారు. తరువాత ఎన్నో సార్లు రిజెక్ట్ అయింది. తరువాత రాసిన ‘లిఖా జో ఖత్ తుఝే’ చాలా పాపులర్ అయింది. పాట రాసే ముందు భాటియా ఇక రిజెక్ట్ కాకుండా పాట రాస్తే మీరు ఏది అడిగితే అది ఇస్తానని ప్రామిస్ చేసారు. నీరజ్ కారు అడగంగానే కారు తాళం చెవులు ఇచ్చేసారు. 1963 స్టాండర్డ్ హెరాల్డ్ కారు.

నీరజ్ తన తోటి కవులకి కూడా సినిమా పాటలు రాయమని సలహా ఇచ్చేవారు. ఒక సినిమాలో నీరజ్ యాక్ట్ చేసారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇక్బాల్ ఖురైషి, జయదేవ్, శివరామ్, రాజేంద్ర రోషన్, జతిన్ – లలిత్, ఉషా ఖన్నా మొదలైన సంగీతకారులతో నీరజ్ పని చేసారు. సినిమాలు బాక్స్ ఆఫీస్‍లో నడిచేవి కావు కాని పాటలు మాత్రం సూపర్ హిట్ అయ్యేవి. గీతాలు హిట్, ఫిల్మ్ ఫ్లాప్ కావాలంటే నీరజ్ చేత పాటలు రాయించాలి అని అందరు వ్యంగ్యంగా అనడం మొదలు పెట్టారు.

ఒకసారి మీనా కుమారి ఆగ్రా నుండి అలీగఢ్ వస్తానన్నారు. ఆమె వస్తోందన్న వార్త అలీగఢ్ అంతా పాకిపోయింది. కాని పోలీసు బందోబస్తు సరిగా లేనందున ఆమె రాలేకపోయింది. అందరు ఎంతో నిరాశ పడ్డారు.

‘మేరా నామ్ జోకర్’ ప్రీమియర్‌కి రాజ్ కపూర్, ధర్మేంద్ర, సిమీ, పద్మిని, దాదాసింహ్, మనోజ్ కుమార్, బంటూ, శశికపూర్, శంకర్ – జయకిషన్, ముకేష్, నీరజ్ వెళ్ళారు.

నీరజ్ ఫిల్మీ గీతాలు చాలా ప్రసిద్ధికెక్కాయి. అక్కడి వాతావరణంలో ఇమడలేక మళ్ళీ అలీగఢ్ వచ్చేసారు. మొట్టమొదట్లో నీరజ్ రచనలలోని గీతాలను ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు వాడుకున్నారు. తరువాత సినిమాల కోసం రాసారు.

లక్కీ కారు, తీపి జ్ఞాపకాలు:

‘కన్యాదాన్’ సినిమాకి పాటలు రాసినందుకు భాటియాగారు కారు ఇచ్చారు. దాని నంబరు M R Z 2218. అంతా కూడితే 13 నంబరు వస్తుంది. దీనిని అశుభంగా భావిస్తారు. విదేశాల్లో, ఇక్కడ హోటళ్ళల్లో 13వ ఫ్లోర్ ఉండదు. ఇంత అశుభంగా భావించే ఈ అంకె నీరజ్ గారికి ఎంతో శుభాన్ని చేకూర్చింది. నిజానికి కారు ప్రాణం లేని వస్తువే. కాని దీని వలన తనకెంతో లాభం కలిగిందని నీరజ్ భావించేవారు. అబ్దుల్ అనే వ్యక్తి కారు డ్రైవర్‌గా పని చేసేవాడు.

ఒకసారి నీరజ్ గారి కొడుకు మిలన్ ప్రభాత్ గుంజన్ కారుని నడపడానికి కూర్చున్నారు. స్టార్ట్ చేయగానే గోడకు తగిలింది. గోడ కూలిపోయింది. ప్రభాత్ గారికి ఏమీ కాలేదు. తరువాత దాన్ని రిపేర్ చేయించి ఎన్నో సంవత్సరాలు వాడుకున్నారు. ప్రబాత్ లోన్ తీసుకుని ఫియట్ కారు కొన్నారు. కొంత డబ్బు తక్కువ పడింది. నీరజ్ ఇచ్చారు. ఒక సారి టైర్ పంక్చర్ అయింది. కొత్త టైర్ వేయించుకుని ప్రయాణం చేసారు. ఆ సంవత్సరం ఖర్బూజాలు విరివిగా వచ్చాయి. రోడ్డుకు నలువైపులా అవే పళ్ళు. ఒక రూపాయికి ఒక 25 కిలోలు అమ్మారు. తరువాత 40 కిలోలు కూడా అమ్మారు. ప్రభాత్ దృష్టిలో ఆ రోజులు ఎంతో మంచి రోజులు.

హరిద్వార్‌లో గడిపిన మంచి రోజులు – కొన్ని జ్ఞాపకాలు:

ప్రభాత్ 1974లో ఇంజనీరింగ్ పూర్తి చేసారు. సెంచురీయన్, బరేలీలోని రబ్బర్ ఫాక్టరీలో నీరజ్ రికమండేషన్ వలన ఉద్యోగాలు దొరికాయి. కాని ప్రభాత్‌ తన యోగ్యతను బట్టి ఉద్యోగం దొరకాలి అని అనుకున్నారు. భెల్‌లో ఉద్యోగం చేయడం మొదలు పెట్టారు. తరువాత అక్కడే ఒక ప్లాటు కొనుక్కున్నారు.

ఆ రోజుల్లో అలీగఢ్‌లో ఎప్పుడు అల్లర్లు జరుగుతూ ఉండేవి. ఒకవేళ ఉండలేని పరిస్థితి వస్తే హరిద్వార్‌లో నివాసం ఏర్పురుచుకోవచ్చని, అక్కడే ఇల్లు కట్టుకోమని నీరజ్ తన కొడుకుకి చెప్పారు. 1992లో ప్రభాత్ ఇల్లు తయారైయింది.

నీరజ్‌కి గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ రావడం వలన ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. ప్రబాత్ ఒకవేళ అలీగఢ్‌లో చేయించుకుంటే అక్కడికి తను వస్తానన్నారు. హారిద్వార్‌లో చేయించుకున్నా ఫరవాలేదు. అక్కడ కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నీరజ్ గారి ఆత్మబలాన్ని ఎంతగానో మెచ్చుకోవచ్చు. ఒక్కరూ వెళ్ళి అలీగఢ్‌లో ఆపరేషన్ చేయించుకుని మూడో రోజున హరిద్వార్‌కి గృహప్రవేశానికి వచ్చారు.

ఆ రోజు ప్రబాత్ గారి పుట్టిన రోజు. అందరు కలిసి హాటల్‌కి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. నీరజ్ ఇంట్లో ధరించే కుర్తా తోటే, వేసుకున్న చెప్పుల తోనే బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళినా ఏ హోటలూ ఖాళీ లేదు. చివరికి సర్‌ప్రైజ్ అనే హోటలికి వెళ్ళారు. అక్కడ డెహరాడున్ నుండి వచ్చిన టీమ్ ఎక్కువగా నీరజ్ గారి పాటలే పాడారు. తరువాత దగ్గరికి వచ్చి ఆయన ఆటోగ్రాఫ్ తీసుకున్నారు.

నీరజ్ గారికి మామిడి పళ్ళంటే ఎంతో ప్రీతి. తను ఎంతో ఇష్టంగా తినేవారు. ఎదుటి వాళ్ళకి తినిపించేవారు.

ప్రభాత్ ఇల్లు కట్టుకునేటప్పుడు రసీదులన్నీ జాగ్రత్తగా ఉంచమని నీరజ్ చెప్పారు. ఇంతకు ముందు నీరజ్‌కి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంటు నుండి నోటీసులు వచ్చాయి. ఇప్పుడు ప్రభాత్‌కి వచ్చాయి. నీతి నిజాయితీ ఉన్నవాళ్ళకే ఉద్యోగం చేస్తూ టాక్స్ కట్టేవాళ్ళకి ఈ కష్టాలు ఎందుకు అని ప్రభాత్ ఆపీసర్‌ని అడిగారు.

చివరికి ఆయనకి టాక్స్, కట్టాల్సి వచ్చింది.

ఎండాకాలం – కొండలు కోనలలో ఆనందం:

నీరజ్ భారతదేశం అంతా తిరిగారు. ఎన్నో కవిసమ్మేళనాలలో పాల్గొన్నారు. చిన్నప్పుడు కుటుంబ బాధ్యతను నిర్వర్తించడానికి ఇంటివాళ్ళ నుండి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఎంతో కష్టపడి జీవితంలో సాఫల్యం పొందారు. కాని కవిసమ్మేళనాల వలన దూర దూరాలకు వెళ్ళిపోయారు. ఇంటివాళ్ళతో కలిసి సమయం గడపడం తన బాధ్యత అని తెలుసు, అయినా తప్పని పరిస్థితులు.

1960లో వేసవి సెలవులని కాశ్మీరులో గడపాలని అనుకున్నారు. బోట్ హౌజ్‌లో గడిపారు. ఒక రోజు ప్రభాత్ నీళ్ళలో పడిపోయాడు. అక్కడ రొట్టెలు చేస్తున్న ఒక అతను వెంటనే నీళ్ళలోకి దూకి అతడిని రక్షించాడు. నీరజ్ చాలా బాధపడ్డారు. నీరజ్ భార్యను కోపగించుకున్నారు. రొట్టెలు చేసే అతను పైవాడి దయవల్ల పిల్లవాడు బతికి బట్టకట్టాడు, ఇక ఈ విషయాన్ని మరచిపొండి అని చెప్పారు. ఆ తరువాత ప్రభాత్‌ని నీళ్ళ దగ్గరికి పొనిచ్చేవాళ్ళు కాదు. అందువలన ఇంటిల్లిపాదికీ ఈదడం వచ్చినా ప్రభాత ఈత నేర్చుకోలేకపోయారు.

ఒకసారి అల్మోడా వెళ్ళారు. అక్కడే సుమిత్రానందన్ పంత్ గారి ఊరు కౌసానీ వెళ్ళారు. ప్రభాత్ పెదనాన్నగారు వెనక్కి వెళ్ళిపోవాలని పట్టుపట్టారు. నీరజ్ గారు ఆయనని ఒక్కర్నినీ పంపించకుండా అందరు వెనక్కి వెళ్దాం అని అన్నారు. నీరజ్ ఎప్పుడు కర్తవ్య నిర్వహణకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

1968లో సిమ్లాలో ఒక కవిసమ్మేళనం జరిగింది. కుటుంబం అంతా బయలుదేరారు. కొండలలో ప్రయాణం. డ్రైవర్‌కి అంతగా ఎక్స్‌పీరియన్స్ లేనందున, బాగా రైజ్ చేసాడు. దాని వలన రేడియోటర్ నుండి పొగ రావడం మొదలయింది. నీరజ్ డ్రైవర్‌ని కోపడ్డాడు. అనుభవం లేదని ముందే చెబితే సరిపోయేది కదా! తరువాత నీరజ్ డ్రైవ్ చేసారు. సిమ్లాకి కొంచెం దూరంలో పోలీసుల చెకింగ్ అయింది. తను కవి నీరజ్ అని నీరజ్ చెప్పారు. పోలీసులు నీరజ్ డ్రెస్ చూసి, డ్రైవింగ్ సీట్‌లో కూర్చోవడం చూసి నమ్మలేదు. ఆయన తన డ్రైవింగ్ లైసెన్స్ చూపించారు. వాళ్ళు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. వస్త్రధారణ వలన మనిషిని గుర్తుపట్టలేరని నీరజే అన్నారు.

ఏ మాత్రం విశ్రాంతి లేకుండా కారు నీరజ్ నడిపారు. మళ్ళీ రాత్రి కవిసమ్మేళనానికి వెళ్ళారు. మరునాడు అలీగఢ్‌కి బయలుదేరారు. మళ్ళీ కారు కొంత ట్రబుల్ ఇచ్చింది. మెకానిక్‌ని పిలిచి బాగు చేయించారు.

ప్రభాత్ మామయ్య పెళ్ళి కనౌజ్‌లో. ప్రయాణం చేస్తున్నప్పుడు కారు కొంత ట్రబుల్ ఇచ్చింది. రాత్రి ఒక ధాబా దగ్గర పడుకుని ప్రొద్దున్న బయలుదేరారు.

ఒకసారి బద్రీనాథ్‌కి టాక్సీలో బయలుదేరారు. అనుకున్నట్లుగా ప్రభాత్ మామయ్య, పెద్దమ్మ రాలేకపోయారు. ప్రభాత్ భార్య రంజన రావడానికి సిద్ధం అయ్యారు. అప్పటికి ఆవిడ గర్భిణి. దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా పెద్ద లైన్ ఉంది. దర్శనానికి కనీసం 3 గంటలు పడుతుంది. ఈ లోపల ఎవరో, కొంత డబ్బు చెల్లిస్తే వెంటనే దర్శనం అవుతుంది అని చెప్పారు. కాని నీరజ్ గారు ఇట్లా చేయడానికి వ్యతిరేకం. అందరు వెనక్కి హోటల్‌కి వెళ్ళిపోయారు. ఇంతలో ఎవరో ఇద్దరు వచ్చి టి.విలో నీరజ్ గారిని చూసామని, ఈయన నీరజ్ గారా అని అడాగారు. నీరజ్ అవును అని అన్నారు. వాళ్ళు వీళ్ళకి దర్శన భాగ్యం కలిగిస్తామని కాని, రాత్రి వాళ్ళు ఇంకా కొందరు వస్తారని, కవితలు వినిపించాలని ప్రార్థించారు. నీరజ్ సరేనన్నారు. దర్శనం చేసుకున్నారు. రాలేకపోయిన పెద్దమ్మ ఆ తరువాత జీవితంలో ఎప్పుడు బద్రీకి వెళ్ళలేకపోయారు.

ప్రభాత్ గారి ఉద్దేశ్యంలో దేవుడి దయ ఉంటేనే ఈశ్వరుడి దర్శనం అవుతుంది. ఈ అనుభవంతో వారు ఈ మాటలను నమ్మకంగా చెప్పారు.

ఒక కవి జ్యోతిష్క జ్ఞానం:

జ్యోతిష్కం ఒక సంకేతం, భవిష్యత్తు ఒక ఊహ. ఇది ప్రజ్ఞాజ్యోతి, ఆధ్యాత్మిక జ్ఞానం. పూర్వ జన్మల ఫలితం. అంతా తలరాత. అంతా ప్రారబ్ధం. జ్యోతిష్కం ఒక విజ్ఞానం.

నీరజ్ గారికి అద్భుతమైన స్మరణ శక్తి ఉంది. ఏదైనా కొత్త విద్యని తెలుసుకోవాలని, నోర్చుకోవాలని ఉత్కంఠ, అందులో నిష్ణాతులు అవడానికి అనేకానేక ప్రయత్నాలు, ఆయనకి స్వతహా అబ్బిన గుణాలు. ఆయనకి జ్యోతిష్కంలో అపారమైన నమ్మకం ఉంది. ఆయన జాతకంలో రాయబడ్డవన్నీ నిజమయ్యాయి. కొత్త విద్యను నేర్చుకోవాలన్న కోరికతో జ్యోతిష్కం నేర్చుకున్నారు. కొంత కాలానికి ఈ విద్యలో నైపుణ్యం వచ్చింది. మెల్లి మెల్లిగా అన్యుల జాతకాలను చదడవటం మొదలు పెట్టారు. ఆయన చెప్పిన జ్యోతిష్యం నిజం అయింది.

నీరజ్ గారి ఇంట్లో సింహ్ అనే సంస్కృత లెక్చరర్ అద్దెకు ఉండేవాడు. ఆయన అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలో పని చేసేవారు. ఇద్దరి మధ్య సాహిత్య చర్చలు జరిగేవి. ఒక రోజు ఆయన తన గురించి చెప్పమని అడిగారు. జాతకం (జన్మకుండలి, జన్మపత్రిక) తయారు చేసారు. గ్రహ నక్షత్ర స్థితి గతులను గణించారు. ఒక సారి ఆయన పర్సు పోయిందని, అందులో ఎక్కువ డబ్బులు లేవని చెప్పారు నీరజ్. నిజంగానే సింహ్ జీవితంలో ఈ సంఘటన జరిగింది.

నీరజ్ ఇంటి పక్కన డా. కుమార్ ఉండేవారు. ఆయన అలీగఢ్ మెడికల్ కాలేజీలో హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంటుగా పని చేసేవారు. ఆయన భార్య నీరజ్ భార్య స్నేహితులు. ఒక రోజు భార్య తన భర్త డా. కుమార్‌కి కేన్సర్ అని రిపోర్టులు వచ్చాయని చాలా బాధపడ్డది. నీరజ్, కుమార్ జన్మకుండలిని తెమ్మని చెప్పారు. ఆయన తెచ్చాక జాతకం చూసాక, ఆయనకి కేన్సర్ లేదని కచ్చితంగా చెప్పారు. మళ్ళీ ఒకసారి టెస్టు చేయించుకోమని చెప్పారు. మళ్ళీ టెస్టు చేయిస్తే కుమార్ గారికి కేన్సర్ లేదని తేలింది. అంతకు ముందు వచ్చిన రిపోర్టులు మారిపోయాయి అని తెలిసింది.

1976లో ప్రభాత్ హరిద్వార్‌లో హాస్టల్‌లో ఉండేవారు. నీరజ్ కొడుకు కోసం ఒక స్కూటర్ కొన్నారు. అప్పుడు ఫోన్లు లేనందున ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. నీరజ్, కొడుకు గ్రహచారం బాగా లేదని, నీటి గండం, రోడ్డు యాక్సిడెంట్‌ల ప్రమాదం పొంచి ఉందని ఉత్తరంలో రాసారు.

ప్రభాత్, తక్కిన విద్యార్ధులు హర్ కీ పాడీ అనే ప్రదేశానికి వెళ్తూ ఉండేవారు. ఆ రోజు కూడా అందరు వెళ్ళారు. ప్రభాత్‌కి ఈత రానందున మెట్ల మీద కూర్చున్నారు. తరువాత గొలుసుని పట్టుకుని కిందకి దిగారు. ఇంతలో నీళ్ళు కొట్టుకు వచ్చాయి. ప్రవాహం ఈడ్చుకుంటూ వెళ్ళింది. అక్కడ గంగ గుడి ఉంది. చెట్టు వేళ్ళు బయటకి వచ్చాయి. వేళ్ళను పట్టుకున్నారు. ప్రభాత్ పెద్దగా అరవడం మొదలుపెట్టారు. అందరు వచ్చి రక్షించారు. జలగండం నుండి ఆయన బయటపడ్డారు. మరునాడు ప్రభాత్ స్నేహితుడితో స్కూటర్ మీద వెళ్తునప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది. కాని ఇద్దరికి ఏ మాత్రం గాయాలు తగులేదు.

చంద్రస్వామి గురించి తెలియని వారు ఉండరు. ఆయన విషయంలో నీరజ్ గారు చెప్పిన జ్యోతిషం అక్షరాల నిజం అయింది.

అటల్ బిహారి వాజ్‌పేయి గారు, నీరజ్ గారి మధ్య స్నేహం ఉండేది. అటల్ బిహారీ గారు తను చనిపోయిన నెల రోజులకు చనిపోతారు అని నీరజ్ భవిష్యవాణి చెప్పారు. ఆయన చెప్పిన జ్యోతిష్కం నిజం అయింది.

హోళీ, దీపావళి పండుగల్లో కుటంబం అంతా ఒక చోటికి:

మొదట్లో ఆర్ధిక స్థితి సరిగా లేక కుటుంబం అంతా ఒక చోట చేరి పండుగలు చేసుకునే అవకాశం అంతగా లభించలేదు. అంతో ఇంతో ఆదాయం రావడం మొదలు అయ్యాక, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు అందరు ఎంతో ఆనందంగా పండగలు జరుపుకోవడం మొదలు పెట్టారు. ప్రభాత్ గారు తన చిన్నప్పుడు పండుగలు ఎట్లా జరుపుకునే వాళ్ళు, ఆనందోత్సాహాలతో ఎట్లా గడిపేవారో వివరంగా రాసారు. ఆయన ఈనాడు ఆ రోజులు ఎక్కడికి వెళ్ళిపోయాయి, ఇప్పుడు అందరూ సంపన్నులే కాని ఆనాటి ఆనందం లేదు అని పదే పదే బాధపడుతున్నారు. వారి కళ్ళ ఎదుట ఎప్పుడు గత వైభవం కదలాడుతునే ఉంటుంది.

కోడలిని ఎన్నుకోవడం – ఫిల్మీ స్టైల్‌లో..:

ప్రభాత్ గారి నాయనమ్మ వయస్సు 82 సంవత్సరాలు. 1976లో ఆయన హరిద్వార్ ఉద్యోగం చేయడం మొదలు పెట్టారు. ఇంటిల్లిపాదీ ఇక ఆయనకి పెళ్ళి చేయాలనుకున్నారు. కోడలిని వెతకమని ప్రభాత్ చెప్పారు.

1976లో ఒకసారి నీరజ్ మరో కవితో కలిసి కవిసమ్మేళనానికి అలీగఢ్ నుండి ఆగ్రాకి బయలుదేరారు. బస్‌లో ఆయన పక్క సీటు ఖాళీ ఉంది. ఒక అమ్మాయి “సీటు ఖాళీ ఉంది కదూ!” అని ఆయనని అడిగి కూర్చుంది. నీరజ్‌కి ఆ అమ్మాయి నచ్చింది. తన కోడలుగా చేసుకోవాలని అనుకున్నారు. తనతో ఉన్న కవిని కూడా అడిగారు. ఆయన అమ్మాయి బాగుందని చెప్పారు. ఆ అమ్మాయిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. వాళ్ళు ఏడుగురు అక్కచెల్లెళ్ళని, తండ్రి వకీలని, జయపూర్‍లో ఉంటారని చెప్పింది.

ఆ రోజు హోళీ పండగ. హోలిక చుట్టూ అందరు ప్రదక్షిణ చేస్తున్నరు. నీరజ్ కుర్రాళ్ళతో కలిసారు. ప్రభాత్‌కి సంగతంతా చెప్పారు. తరువాత పిల్ల తండ్రికి నీరజ్ ఉత్తరం పంపించారు. అప్పుడే తన కూతురికి పెళ్ళి చేయడం ఆయనకి ఇష్టం లేదు. నీరజ్ జయపూర్ వెళ్ళినప్పుడు కాబోయే కోడలి ఇంటికి వెళ్ళారు. తను కవి నీరజ్‌నని పిల్ల తండ్రికి తన గురించి అంతా చెప్పారు. మూడో కూతురి పెళ్ళి చెయ్యందే ఈ అమ్మాయికి పెళ్ళి చేయనని చెప్పారు. తనకి కట్నకానుకలు అక్కరలేదని పెళ్ళి చేస్తే చాలని చెప్పారు. బి.ఎ ఫైనల్ చదువు అయ్యాక చేస్తానని అన్నారు. నీరజ్ దానికి కూడా ఒప్పుకున్నారు. చివరికి పిల్ల తండ్రి, పెళ్ళీకొడుకు, పెళ్ళి కూతురు ఒకరికొకరు చూసుకోవాలని, ఒకప్పటి రోజులు ఇప్పుడు లేవని వాళ్ళు ఇష్టపడితేనే పెళ్ళి చేద్దాం అని అన్నారు. నీరజ్ కూడా ఇది సరియైనదే అని ఒప్పుకున్నారు.

పెళ్ళి కూతురు రంజనని తీసుకుని పిల్ల తల్లీ తండ్రి అలీగఢ్‌కి వచ్చారు. ఇల్లు వాకిలీని చూసారు. అందరితో మాట్లాడారు. అందరికి అంతా నచ్చింది. ఒక సంవత్సరం తరువాత జయపూర్‌లో పెళ్ళి ఎంతో పెద్ద ఎత్తున జరిగింది. ప్రభాత ఉత్తర్ ప్రదేశ్ లోని పెళ్ళిళ్ళ ఆచార వ్యవహారాలను గురించి వర్ణించారు.

మన పెద్దవాళ్ళు – పెళ్ళిళ్ళు పైవాడే కుదురుస్తాడు, స్వర్గంలోనే ఎవరికి ఎవరు జంటగా ఉంటారో నిర్ణయింపబడుతుందని అంటారు. ప్రభాత్ గారికి ఈ విషయంలో ఎంతో గట్టి నమ్మకం ఉందని రాసారు.

ఒంటరితనంలో ఉండే బాధ – తల్లి మృత్యువు:

నీరజ్ గారు ఉన్నత స్థితికి ఎదిగారు. ఎప్పుడు ఉరుకులు పరుగులే. అందుకే ఇంటి వాళ్ళతో ఎక్కువగా గడపలేకపోయేవారు. ప్రబాత్ గారికి తల్లి పట్ల అమితమైన ప్రేమ ఉంది. ఇంటిల్లిపాదికి ఆవిడ ఎంతో సేవ చేసింది. అందరు ఎంతో పైకి ఎదిగారు. ఆవిడకి ఎంత గౌరవం దక్కలో అంతా దక్కలేదు అని ఆయన ఈనాటికి బాధ పడతారు. మన వేదాలలో, ధర్మగ్రంథాలలో స్త్ర్రీకి ఎంతో ప్రాముఖ్యతని ఇచ్చారు. కాని నిజజీవితంలో కాని, సమాజంలో కాని ఇప్పటికీ స్త్రీకి సముచిత స్థానం దొరకలేదని ఆయన ఎంతో బాధపడతారు. తన తల్లి తనను ఎంతగానో ప్రేమంచేది.

కొన్నాళ్ళను తను తన తల్లి ఉండేవారు. నీరజ్ ప్రోగ్రాములకి వెళ్ళి వస్తూ ఉండేవారు. ప్రభాత్ ఉద్యోగానికి వెళ్ళిపోయాక ఆయన పెళ్ళి అయ్యాక, తల్లి ఇంకా ఒంటరివారైయ్యారు.

1, జూన్ 2001 నాడు ప్రభాత్ తల్లి తండ్రి హరిద్వార్ వెళ్ళారు. ఆ రోజు ప్రభాత్ పుట్టిన రోజు. నీరజ్ గారికి ప్రోగ్రాం ఉంది. ఆయన వెళ్ళి మళ్ళీ అలీగఢ్‌కి వస్తారు. ఆయనకి వండి పెట్టే వాళ్ళు ఉండరని తల్లి అలీగఢ్‌కి వెళ్ళిపోయింది. ఇదే ప్రభాత్‌కి తల్లి చివరి చూపు.

ప్రభాత్ తల్లి తన తమ్ముడి దగ్గరికి వెళ్ళారు. ఆ రాత్రి ఆవిడకి బ్రైన్ హెమరేజ్ వచ్చింది. మైన్‌పూర్ హస్పిటల్‌లో అంతగా ఆధునిక సదుపాయాలు లేవు. ఆవిడ చివరి కోరిక ప్రకారం అలీగఢ్‌లో చందనియులో కాకుండా అంత్యేష్టి గంగ దగ్గర చేసారు. రాజ్‌ఘాట్ దగ్గర అంత్యక్రియలు జరిపించారు.

నీరజ్ గారు కవిగా ఎంతో ప్రసిద్ధి పొందారు. దేశం అంతటా తిరిగారు. విదేశాలకి వెళ్ళారు. కాని భార్యని ఎక్కడికీ అంతగా తీసుకువెళ్ళేవారు కాదు. ఆవిడ ఆ నాలుగు గోడల మధ్య దాదాపు ఏభై ఏళ్ళు సంసార జీవితాన్ని గడిపారు. ప్రభాత్ గారి మనస్సులో ఈ బాధ ఎప్పుడు ఉంది. ఈనాటికీ వారు ఈ విషయంలో బాధ పడుతునే ఉన్నారు.

ప్రభాత్ తల్లిగారి పేరు సావిత్రి. అలీగఢ్‌లో కాయస్థ పాఠశాల ఉంది. ఆవిడ అంతిమ కోరిక ప్రకారం అక్కడ ఒక గదికి సరిపడే డబ్బు చేకూర్చారు. బతికి ఉన్నప్పుడు ఆవిడ కొంత డబ్బు దాచుకున్నారు. ఇప్పటికి ఆవిడ పేరు మీద ప్రతీ సంవత్సరం వర్ధంతి జరుపుతారు. దానికి కూడా నీరజ్ వెళ్ళలేదని కొడుకు ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. తన తల్లికి ఒక భార్యగా నీరజ్ ఎప్పుడు ఎంతగా గౌరవం ఇవ్వాలో అంతగా ఇవ్వలేదని ఆయన ఇప్పటికీ క్షోభ పడుతునే ఉంటారు.

అటల్ గారితో ఆత్మీయ సంబంధం:

శాంతి కోసం సృజన తప్పదు

ప్రతీ ద్వారం దగ్గర ప్రకాశం గీతాలు పాడాలి

ప్రేమ కత్తులు – కటారులను జయిస్తేనే

ఈ ముక్తి యజ్ఞం పూర్తి అవుతుంది.

నీరజ్ గారికి – ప్రముఖులైన రాజకీయ నాయకులతో, వ్యాపారస్థులతో ఆత్మీయ సంబంధాలు ఉండేవి. కానీ ఆయన ఎప్పుడు తన స్వార్థం కోసం వీళ్ళను ఎక్కడా ఉపయోగించుకోలేదు. ఆయన ఉద్దేశ్యంలో ఏదీ ఫ్రీగా లభించదు. కష్టపడాలి, ఫలితం పొందాలి.

నీరజ్, అటల్ గారి మధ్య ఉన్న ఆత్మీయ సంబంధం చాలా మందికి తెలియదు. కాన్‌పూర్‌లో డి.ఎ.పి. కాలేజ్‌లో ఇద్దరు కలిసి చదివారు. ఇద్దరు కవితలు రాసేవారు. అటల్ బిహారి వాజ్‌పేయి గారు డిసెంబరు 25, 1925 నాడు పుట్టారు. కవిగా నీరజ్ ప్రసిద్ధికెక్కారు. మంచి కవిగా, వక్తగా, ఆకర్షణీయమైన వ్యక్తిగా అటల్ ప్రసిద్ధికెక్కారు.

ఆదిత్యా బిర్లా పరిచయం – బొంబాయి యాత్ర:

1974లో ప్రభాత్ ఇంజనీర్ అయ్యారు. కాని ఆరు నెలల దాకా ఉద్యోగం రాలేదు. చివరికి అందరు చెప్పింది ఒప్పుకుని నీరజ్, బిర్లాకి తన కొడుకు గురించి ఉత్తరం రాసారు. వెంటనే వచ్చి కలవమని ఆయన జవాబు రాసారు.

బొంబాయికి నీరజ్, ప్రభాత్, అజయ్ తివారి వెళ్ళారు. బిర్లాని కలిసారు. “ప్రభాత్, నాన్నగారి వలనే నీవు ఇంత దూరం రాగలిగావు. కాని ఇక ముందు ఉద్యోగం వచ్చాక, పని చేసేటప్పుడు నీవు నీరజ్ కొడుకువన్న సంగతి మరచిపో.. ఆయన సిఫారసు పైన ఉద్యోగం దొరకవచ్చు. కాని నీవు శ్రమపడాలి. పైకి ఎదగవచ్చు” అన్నారు బిర్లా. ఇదే జీవితానికి మూల మంత్రం అని ప్రభాత్ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు.

వ్యక్తిత్వ విభిన్న రూపాలు:

నీరజ్ గారి మనస్సు ప్రేమ, కరుణలకు నిలయం. వ్యవహారికంగా పిల్లవాడిలా పట్టుదల ఉంది. సహజత్వం ఉంది. సమాజంలో ఉన్న అసమానత పట్ల ఆక్రోశం ఉంది. తన గురించి తోటి కవుల గురించి ఇట్లా రాసారు.

బస్ యహీ అపరాధ్ మై హర్ బార్ కరతా హూఁ

ఆద్‌మీ హూఁ ఆద్‌మీ సే ప్యార్ కరతా హూఁ

(ఎప్పుడూ ఇదే నేరాన్ని చేస్తూ ఉంటాను

మనిషిని కాబట్టి తోటి మనిషి ప్రేమిస్తాను.)

నీరజ్‌కి తాను కవి అని ఎంతో గర్వంగా ఉండేది. ఆయన ఉద్దేశ్యంలో ఆత్మ సౌందర్య శబ్దరూపమే కావ్యం. మానవుడిగా పుట్టడం ఎంతో అదృష్టం. కవిగా పుట్టడం మహాదదృష్టం.

కరుణ:

నీరజ్ గారి హృదయం ఎంతో కోమలం. ఇతరులకు ఏ సహాయం చేయడానికైనా వెనుకాడరు. ఏ స్వార్థం లేకుండా ఎందరిరో ఆయన సహాయం చేసారు. ఒకవేళ ఎవరితో నైనా మనస్పర్ధలు వస్తే ఆయనకి నచ్చ చెప్పడం ఎవరి తరం కాదు. ప్రభాత్ తల్లిగారు బతికి ఉన్నప్పుడు రాధమ్మ అనే ఆవిడ తన కుటుంబం వాళ్ళతో కలిసి గారాజ్‌లో ఉండేది. ఆవిడ చనిపోయాక కూడా కొంత కాలం పని చేసింది. తరువాత ఆమె వెళ్ళిపోయాక నీరజ్ ఆ రోజుల్లో 200 రూపాయలు ప్రతీ నెలా పెన్షన్‌గా ఇచ్చేవారు. ఇంటి ఇంటింటికీ తిరిగి అమ్మేవాళ్ళ దగ్గర, అవసరం లేకపోయినా సరుకులు కొనేవారు. దుప్పట్లు ఇంకా మరి కొన్ని వస్తవులు కొనేవారు. ఎవరు కొనకపోతే వాళ్ళ తిండి ఎట్లా గడుస్తుంది అని అనేవారు.

ఎండాకాలం అయినా, చలికాలం అయినా ఆయన వరండాలోనే పడుకునేవారు.

తల్లి పట్ల అపారమైన ప్రేమ:

నీరజ్ వాళ్ళ అమ్మగారిని అమితంగా ప్రేమించేవారు. తనని చదివించి, కావ్య క్షేత్రంలో ఇంతటి ప్రగతిని, పేరు ప్రతిష్ఠలని సంపాదించుకోడానికి ఆవిడే కారణం అని చెబుతూ ఉండేవారు. ఆవిడ భజనలు బాగా పాడేవారు. నీరజ్ బాల్యంలో రాత్రి పూట భజనలను వినిపించేవారు. పెద్దవారయ్యక నీరజ్ ప్రోగ్రామ్ నుండి వెనక్కి రాగానే తన తల్లికి 100 రూపాయలు ప్రసాదం కోసం ఇచ్చేవారు. ఆవిడ ఆ డబ్బులతో మిఠాయిలు తెప్పించేవారు. దేవుడికి ప్రసాదం సమర్పించి అందరికి పంచి పెట్టేవారు.

తన తల్లి చేసే కొన్ని పదార్థాలు ఆయనకి ఎంతో ఇష్టం. ఆ తరువాత భార్య చేసిన కొన్ని పదార్థాలని ఎంతో మెచ్చుకునేవారు. కోడలు చేసిన కొన్ని పదార్థాలను ఎంతో ఇష్టపడేవారు. ఎక్కువ సార్లు అడిగి చేయించుకునే వారు. ఎంతో పొగిడేవారు. ఒక వేళ ఏదైనా పదార్ధం ఇష్టం లేకపోతే అస్సలు ముట్టకునే వారే కాదు.

వ్యక్తిత్వం – రచనలు:

సాహిత్యం సమాజ దర్పణం. సమాజంలో జరిగే సంఘటనల చిత్రాన్ని పాఠకులకు అందించడం సాహిత్యకారుడి ముఖ్య కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని నీరజ్ గారు ఎంతో దక్షతతో నిర్వహించారు. ఎప్పటికప్పుడు దేశ-విదేశాలలో జరిగే సంఘటనల గురించి ఎంతో అర్థవంతమైన కవితలు రాసేవారు. సూయజ్ కెనాల్ వివాదం మొదలయినప్పుడు, యుద్ధం జరిగే సూచనలు కవిపించినప్పుడు ‘నీల్ కే నామ్ పాతీ’ (నీల్ పేరున లేఖ) అన్న కవితను రాసారు.

నీల్ కీ బేటీ న ఘబ్‌రానా, సమఝ్ సే కామ్ లేనా

గర్ ఉఠే తుఫాన్, హిందుస్తాన్ కో ఆవాజ్ దేనా!

(నీల్ బిడ్డా! గాబరా పడకు, వివేకంతో ప్రవర్తించు, తుఫానే వస్తే, హిందుస్తాన్‌ని పిలు)

మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని తెలిసినప్పుడు నీరజ్ రాసారు.

మై సోచ్ రహా హూఁ అగర్ తీసరా యుద్ధ్ హువా తో

ఇస్ నయీ సుబహ్ కీ నయీ ఫసల్ కా క్యా హోగా!

మై సోచ్ రహా హూఁ ఘర్ జమీ పర్ ఉగా ఖూన్

ఇస్ రంగమహల్ కే చహల్ – పహల్ కా క్యా హోగా?

(నేను ఆలోచిస్తున్నాను, ఒక వేళ మూడో ప్రపంచ యుద్ధం వస్తే,

ఈ కొత్త ఉదయపు కొత్త పంట ఏమౌతుంది!

నేను ఆలోచిస్తునాను, ఒక వేళ భూమి పైన రక్తం మొలిస్తే

ఈ రంగమహల్ లోని సందడి.. ఏమౌతుంది?)

ఇట్లు జరుగుతున్న సంఘటనలపైన ఎన్నో కవితలు రాసారు.

మనిషికి వయస్సు పెరుగుతున్న కొద్దీ స్మరణ శక్తి తగ్గిపోతుంది. కాని నీరజ్ గారితో జ్ఞాపక శక్తి ఏ మాత్రం తగ్గలేదు. పెద్ద పెద్ద కవితలను పాడి వినిపించేవారు. తన పరిచయస్థుల టెలిఫోన్ నెంబర్లు ఆయనకి బాగా గుర్తుండేవి.

పిల్లల మనస్తత్వం – చంచల స్వభావం:

అప్పుడప్పుడు నీరజ్ పిల్లల్లా ప్రవర్తించేవారు. ఒకేసారి రెండు ప్రోగ్రాములు ఫిక్స్ అయిపోయేవి. ఎంత చెప్పినా ఆర్గనైజర్లు వినేవాళ్ళు కారు. అటువంటిప్పుడు ఆయన పిల్లల్లా నాటకం ఆడి తప్పించుకునేవారు.

ఆత్మాభిమాని:

నీరజ్ కష్టజీవి. ఎంతో కష్టపడేవారు. ఎప్పుడు దేనిని ఊరికే పొందలేదు. ఆయనలో కష్టపడకుండా దేనినైనా పొందాలన్న ఆలోచనే లేదు.

అలీగఢ్‌లో ధర్మ – సమాజ్ కాలేజీలో పని చేస్తూ కవి సమ్మేళనాలకి వెళ్తుండేవారు. మరునాడు రాగానే క్లాసులు తీసుకునేవారు. కానీ కొందరి లెక్చరర్లు ఆయనని చూసి అసూయపడేవారు. వాళ్ళు నీరజ్ చదువు చెప్పడంలో ఎక్కువ ఇంటరెస్ట్ చూపించడం లేదని, కవి సమ్మేళనాల పైన ఆయన దృష్టి అంతా అని పై అధికారులకు ఫిర్యాదు చేసారు. విద్యార్థులకు ఆయన పద్యాలను చెప్పే తీరు అంటే విపరీతమైన ఇష్టం. వాళ్ళ వైపు నుండి ఏ ఫిర్యాదు లేదు. చివరికి నీరజ్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చారు.

ఆయన తన అభిమానానికి దెబ్బ తగిలితే ఏ మాత్రం సహించేవారు కాదు.

కవి స్వభావం:

నీరజ్ గారి స్వభావంలో అనేక రూపాలు ఉన్నాయి.

పెద్దవాళ్ళ పట్ల ఆయన తన కర్తవ్యాన్ని నెరవేర్చేవారు. తన కుటుంబుం బాద్యతను కూడా నెరవేర్చారు. ఆయనది ప్రేమించే హృదయం. ఒకవేళ ఎప్పుడైనా కోపం వచ్చినా ఎక్కువ సేపు ఉండేదు కాదు. వెంటనే కోపం తగ్గిపోయేది. అవతలి వాళ్ళు చెప్పిన ప్రకారం చేసేవారు.

ఇటావాలో ఉన్నప్పుడు నీరజ్ మామగారు జబ్బుపడ్డారు. నీరజ్ అప్పుడు కచ్‌హరీలో పని చేసేవారు. వార్త తెలియగానే వెంటనే వచ్చేసారు. కడసారి చూపులో కూడా ఎప్పటిలాగానే మామగారు నీరజ్‌ని “ఎంత సంపాదించావు?” అని అడిగారు. “మీరు ఇక ఈ లౌకిక విషయాల గురించి ఆలోచించకండి. దేవుడిని స్మరించండి” అని నీరజ్ అన్నారు.

మామగారు నీరజ్ తల పై చేయి పెట్టి “నీవు చాలా వృద్ధిలోకి వస్తావు” అని అంటూ, కుటుంబ బాధ్యతను నిర్వహించాలి అని ఆశీర్వదించారు. పెద్దవాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదాలు ఎంతో అమూల్యమైనవి. నీరజ్‌ని ఎందరో పెద్దలు ఆశీర్వదించారు. కలలో కూడా ఊహించని విధంగా నీరజ్ ఎంతో పేరుప్రతిష్ఠలు పొందారు. ఆర్థికంగా ఎంతో బలపడ్డారు.

నీరజ్ తల్లి, అక్కయ్య తెల్లగా అందంగా ఉండేవారు. 83 సంవత్సరాలు బతికారు. ఇటువంటి పెద్దవాళ్ళ దగ్గర కూర్చుని నీరజ్ తన అంతిమ సమయం వరకు వాళ్ళ నోటి వెంట వాళ్ళ అనుభవాలను చెప్పిస్తూ, వాళ్ళకి ఎంతో బలాన్ని చేకూర్చేవాళ్ళు.

జీవితాంతం నీరజ్ అవసరం ఉన్న వాళ్ళకి ఎంతగానో ఆర్థిక సహాయం చేసారు.

ప్రభాత్ గారు ఎన్నో సంఘటనలను వర్ణించారు.

ప్రగతిశీల (అభ్యుదయం) దృష్టి కోణం:

ఛిప్ – ఛిప్ అశ్రు బహనే వాలోం

మోతీ వ్యర్థ్ బహనే వాలోం

కుఛ్ సపనోం కే మర్ జానే సే

జీవన్ నహీఁ మర్‌ కర్‌తా హై.

(దాచుకుని దాచుకుని కన్నీళ్ళు కార్చే వాళ్ళల్లారా!

ముత్యాలను వ్యర్ధంగా పోగొట్టుకునే వాళ్ళ్లలారా!

కొన్ని కలలు చచ్చిపోతే!

జీవితం మరగించదు)

నీరజ్ రాసిన ఈ పంక్తులలో ఆయన ఎప్పుడు సకారాత్మకంగా ఆలోచిస్తారన్న విషయం తెలుస్తోంది.

ప్రభాత్ భెల్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయనకి తెలియకుండానే డిప్రెషన్‌లో ఉండిపోయారు. ఏది తినబుద్ధి కాదు. ఏ పని చేయబుద్ధి కాదు, ఉద్యోగం చేయబుద్ధి కాదు, ఒంటరిగా గదిలో కూర్చోవాలని అనిపిస్తుంది.

నీరజ్ కోడలు రంజన్ భర్తకి ఎంతో సేవ చేసింది. పిల్లల ఆలన – పాలనా చూసుకుంది. జయపూర్‌లో తనకు తెలిసిన ఒక అతనికి ఇట్లాగే డిప్రెషన్ వచ్చిందని ట్రీట్‌మెంటు తీసుకుంటే తగ్గిందని మామగారికి చెప్పింది. ఆమె మాట విని అందరు జయపూర్‌కి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. కోడలు పుట్టింట్లో కొన్నాళ్ళు ఉండి ట్రీట్‌మెంటు తీసుకున్నాక ప్రభాత గారికి డిప్రెషన్ నయం అయింది.

నీరజ్ గారు కోడలిని ఎప్పుడు కోడలిగా చూడలేదు. జీవితాంతం కూతురులా చూసారు. ఆయన ఒకసారి కోడలికి ఎంతో ఆప్యాయంగా, స్నేహభావంతో లేఖ రాసారు.

“ప్రియమైన కోడలికి,

నీవు ఎంతో మనోబలంతో గుంజన్‌కి పిల్లలకి, అందరికి సేవ చేస్తున్నావు. ఎంత ప్రశంసించినా తక్కువే. పూర్వ జన్మలో మేము చేసుకున్న పుణ్యం. అందుకే ఈ జన్మలో నువ్వు మా ఇంటి కోడలివయ్యావు. నిన్ను కోడలిగా తెచ్చుకున్నందుకు మేం అందరం ధన్యులమయ్యాము. నీకు జీవితంలో ఏ అవసరం పడినా నాకు తప్పకుండా తెలియజేయి.”

తన భార్య పట్ల నీరజ్‍కి ఎంతో వాత్సల్యం, ప్రేమ ఉన్నవో ప్రభాత్ రాశారు. ఆయన ఉద్దేశంలో కోమలమైన హృదయం ఉన్నవాళ్ళే ఇట్లా రాయగలరు.

తన మనవడు లక్కీ, మనవరాలు ఓర్త చదువుపై ఎలాంటి ఒత్తిడీ తేవద్దనీ తన కొడుకు ప్రభాత్‌కి ఎన్నోసార్లు చెప్పారు. ఆ రోజుల్లో ఎంత సేపు పిల్లలు డాక్టర్లో, ఇంజనీర్లో అవ్వాలని తల్లిదండ్రులు కోరుకునేవారు. కానీ నీరజ్ ప్రోత్సాహంతో మనవడు, మనవరాలు తమకిష్టమైన చదువులు చదువుకున్నారు. ఈనాడు బిజినెస్ మేనేజ్‍మెంట్ క్షేత్రంలో ఎంతో ప్రగతిని సాధించారు.

నీరజ్ మారిన రోజులతో పాటు మారారు. మనవడు, మనవరాలి పెళ్ళి విషయంలో వాళ్ళిష్ట ప్రకారమే చేయాలని ప్రభాత్‍కి చెప్పారు. ప్రభాత్ తను పెద్దలు నిర్ణయించిన పెళ్ళే చేసుకున్నారు. కనుక తన పిల్లలు అట్లాగే చేయాలని అనుకున్నారు. కానీ నీరజ్ ఏ కులమైనా, ఏ మతమైనా సరే పిల్లల పెళ్ళిళ్లు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని చెప్పారు. పిల్లల సంతోషం ముఖ్యం అని చెప్పారు.

ప్రభాత్ కొడుకు కూతుర్ల పెళ్ళిళ్ళు చేశారు. ఈనాడు వాళ్ళు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. తను ఇన్నాళ్ళు పాత ఆచారాలు, పాత పద్ధతులను ప్రకారం జీవిస్తున్నానని, తన తండ్రి నీరజ్ పాత తరానికి చెందిన వాడైనా, తన కన్నా ఎంతో ముందున్నారని, ఆయన ఆలోచనల తీరే వేరని తరువాత ప్రభాత్ తెలుసుకున్నారు.

అలీగఢ్‌లో కవితలు చదవనన్న నిర్ణయం:

ఇతనే బద్‌నామ్ హుయే హమ్ తో ఇస్ జమానే మే

తుమ్ కో లగ్ జాయెంగే సదియోం ఇసే భూల్‌నే మే

(ఈ యుగంలో మీ పేరు అంతా పాడైపోయింది

ఎన్నో శతాబ్దాలైనా మీరు దీనిని మరచిపోలేరు.)

హరి వంశరాయ్ బచ్చన్ గారు, నీరజ్ గారు, మంచీయ్ (వేదిక) కవులకు గౌరవం రావాలని ప్రయత్నించారు. ఆ రోజుల్లో కవుల కవితలు ఎంతో ఉన్నతంగా ఉండేవి. కవులకు అంతో ఇంతో డబ్బులు ఇచ్చేవారు. కాని తరువాత కవితల స్థాయి పడిపోయింది.

కవి నీరజ్ పేరు ప్రతిష్ఠలు పెరగసాగాయి. కవి సమ్మేళనాలలో చివరికి ఆయన గీతాలు పాడేవారు. రాత్రి 2 గంటల వరకు ప్రేక్షకులు ఆయన గీతాలు వినాలని కూర్చునేవారు. దాదాపు గంట, గంటన్నర ఆయన వినిపించేవారు.

ఒకసారి అలీగఢ్‌లో ప్రోగ్రాం జరిగింది. ఆయన అధ్యక్షత వహించారు. మొదట యువ కవులను, నవోదిత కవులను పిలిచే పరిపాటి ఉంది. కొందరి కవితల్లో అశ్లీలత చోటు చోసుకోవడం వలన ఎదురుగా కూర్చున్న అమ్మాయిలు సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. నీరజ్ ఆ కవికి చెప్పడం ఆపేయమన్నారు. కానీ ఆడియన్స్ వన్స్ మోర్ అని అంటున్నరు. చివరికి నీరజ్ ఇక అలీగఢ్‌లో తను కవిసమ్మేళనానికి రానని వెళ్ళిపోయారు. ఆ తరువాత కొన్నాళ్ళు ఎవరు పిలిచినా వెళ్ళలేదు. ఒకసారి అలీగఢ్ డి.ఎమ్. నీరజ్ గారి పరిచయస్థులు ఎవరో ఒకరు చేసిన పనికి అందరు ఎందుకు బాధపడాలి అని ఆయన అడిగారు.

ఆయనని బతిమిలాడి ఒప్పించారు. అక్కడ జరిగే నుమాయిష్ కవి సమ్మేళనానికి మాత్రం వెళ్ళేవారు.

రెండో సంఘటన పిలానీ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగంది. బొంబాయి నుండి ఆయన వచ్చారు. స్టూడెంట్స్ ‘ప్రేమ పూజారి’ పాటలు ‘షోకియోం మే ఘోలా జాయే’, ‘ఫూల్ కే రంగ్ సే’ పాడమని అడిగారు. నీరజ్ గారు అంతకు ముందే రాసిన కవ్వాలీని వినిపిస్తానన్నారు. కాని విద్యార్థులు పట్టుబట్టారు. నీరజ్‌లో కూడా పట్టుదల ఎక్కువ అయింది. కళాకారుడికి తన మనస్సు ప్రకారం నడుచుకునే స్వేచ్ఛ ఉండాలని ఆయన అన్నారు. అటు స్టూడెంట్స్, ఇటు నీరజ్ ఎవరి పట్టుదల వారిదే. చివరికి నీరజ్ గారు వేదిక దిగి వచ్చేసారు.

కళాకారుడు తనదైన మట్టితో తయారు చేయబడతాడు. భావాల సముద్రంలో మునకలు వేస్తూ ముత్యాలను శోధించేవారి హృదయం ఎంతో కోమలంగా ఉంటుంది. మనస్సును ఎవరైనా గాయపరిస్తే చాలు, బాధ కలుగుతుంది. నీరజ్ గారి ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు తగిలాయి. అయినా ఆయన ఎప్పుడు ఎవరినీ ద్వేషించలేదు. తరువాత ప్రేక్షకులు పదే పదే అడిగిన గీతాలే పాడేవారు.

ముఫ్త్ హుయే బద్‌నామ్:

క్యా కహే యార్ హమే యారోం నే క్యా – క్యా సమ్‌ఝా

కతరా సమఝా తో కిసీ నే హమేం దరియా సమ్‌ఝా

సబ్ నే సమ్‌ఝా వైసా జిసె జైసా భాయా

ఔర్ జో హమ్ థే వహీ తో న జమానా సమ్‌ఝా

(ఏం చెప్పను మిత్రమా! నన్నెందుకు ఎట్లా ఎట్లా అర్ధం చేసుకున్నారో?

చిన్నముక్కను అని కొందరనుకుంటే సముద్రం అని కొందరనుకుంటారు.

అందరు వాళ్ళిష్టం వచ్చినట్లుగా నా గురించి అనుకున్నారు

కాని అసలు నేను ఎవరినో ఈ లోకం తెలుసుకోలేదు.)

కవి పేరు ప్రతిష్ఠలు పొందుతుంటే ప్రపంచం అంతా అతడిని పొగుడ్తూ ఉంటే అతడి గురించి లోకం ఏదో ఏదో చెడు ప్రచారం చేస్తూ ఉంటుంది. నీరజ్ తాగుబోతు అని, ఆడవాళ్ళతో సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం జరిగింది. ప్రభాత్ తన తండ్రి తాగుబోతు కాదని, కవి సమ్మేళనాలలో, సినిమా ప్రోగ్రాంలలో ఒకటి రెండు పెగ్గలు తాగేవారని చెప్పారు. అట్లాగే 1956లో లక్నో రేడియోలో ‘కారవాం గుజర్ గయా, గుబార్ దేఖతే రహే!’ కవితని చదివారు. కొంత మంది కాన్పూర్‌లో ఎవరితోనో ఉన్న ప్రేమ సంబంధం ఫెయిల్ అవడం వలన ఈ కవిత రాసారు అని కథలల్లారు. ఒకటి కాదు ఎన్నెన్నో.. ఒక లేడీ డాక్టర్ ప్రేమలో పడ్డారని ప్రచారం చేసారు. ఆమె హస్పిటల్లోనే ప్రభాత్ జన్మించారు. నీరజ్ ఆమెని వదినగా భావించేవారు.

నీరజ్ భార్య ఆయనతో అంతగా ప్రోగ్రాములకు వెళ్ళేది కాదు. అందు వలన కొందరు అసలు ఆయనకి పెళ్ళే కాలేదు అని అనుకునేవాళ్ళు. ఎవరైనా కలిసి అడిగినప్పుడు తన ఆయన భార్యనని ఆవిడ చెప్పేవారు.

ప్రోగ్రామ్ నుంచి ఇంటికి వచ్చాక ఆవిడ విషయలన్నీ చెప్పేది. ఆయన కాని ఆయన భార్య సావిత్రిగారు కాని ఎప్పుడు ఇటువంటి విషయాల గురించి చర్చించేవాళ్ళు కాదు.

జీవితంలో సృర్శించని కొన్ని పార్శ్వాలు:

‘ఈశ్వర్ బోలా ఏక్ దిన్ ముఝ్‌ సే బఢ్‌కర్ కౌన్

పరహిత్ కర్తా! ఇక్ ఉఠా, ఔర్ రహే సబ్ మౌన్’

(ఒక రోజు నాకన్నా పరహితకర్త ఎవరున్నారని అడిగాడు.

ఒకడు లేచాడు, అందరు మౌనంగా ఉండిపోయారు.)

నీరజ్ ఏ పని చేసినా పని మీద ఏకాగ్రతతో చేసేవారు. ఇట్లానే పని చేయాలని అందరికి చెప్పేవారు.

మేరాజ్ ఫైజుబానీ షేర్ –

ముఝ్‌కో థకనే నహీఁ దేతే హై జరూరత్ కే పహడ్

మేరే బచ్చే ముఝే బుఢా నహీఁ హోనే దేతే

(నన్ను అలసిపోనివ్వదు అవసరాల కొండ. నా పిల్లలు నన్ను ముసలివాడిని కానీయరు)

సంపాదన ఆ రోజుల్లో ఎక్కువగా లేదు. నీరజ్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తూ కవి సమ్మేళనాలకు కూడా వెళ్ళేవారు. అంతో ఇంతో సంపాదించేవారు. పరీక్షా పేపర్లు దిద్దేవాళ్ళు. ప్రభాత్ కూడా సహాయం చేసేవారు. కొన్ని పరీక్షా పేపర్లు చివరలో విద్యార్థీ, విద్యార్థునులు తమ ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూ, ఏ విధంగానైనా పాస్ చేయమని రాసేవారు. కొందరు విద్యార్థినులు అతి దీనంగా రాసేవారు. విద్యార్థులు అన్ని ప్రశ్నలకు జబాబులిస్తే చాలు నీరజ్ సామాన్యంగా ఎవరిన్నీ ఫెయిల్ చేసేవారు కాదు. ఆయనలో ఉన్న దయార్ద్ర హృదయం వీటన్నింటికీ కారణం.

అప్పు ఇచ్చేటప్పుడు ఎప్పుడు ఒక సూక్తి చెప్పేవారు. అప్పు అవతలి వాళ్ళు తీర్చలేకపోయినా బాధపడకూడదు. అందుకే చూసుకుని సహాయం చేయాలి. సంబంధాలను తెంపుకునే స్థితి రాకూడదు.

ఏ ఆటనైనా ఆట లానే ఆడండి. ఆటలో జయాపజయాలను రెండింటినీ ఒకే లాగా స్వీకరించడం నేర్చుకోవాలి. హరిద్వార్‌లో పని చేసేటప్పుడు ప్రభాత్ పార్డీలలో అప్పుడప్పుడు తాగేవారు. ఒకరోజు వాళ్ళ అమ్మ అడిగింది “గుంజన్ నీవు తాగుతున్నావా?” అని. ప్రభాత్ తల్లి తండ్రులకి ఏ విషయంలోనూ అబద్ధం చెప్పరు. తమ అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో తాగుతుంటానని చెప్పారు. నీరజ్ “అప్పడప్పుడయితే ఫరవాలేదు. అలవాటు మాత్రం చేసుకోకూడదు” అని చెప్పారు. ఎప్పుడు స్నేహం మంచి వాళ్ళతో చేయాలి అని చెప్పారు.

ఆనాటి నుండి నేటి దాకాక తండ్రి మాట జవదాటలేదు ప్రభాత్.

ఆధ్యాత్మిక చర్చ:

నీరజ్ గారు హిందీ సాహిత్యమే కాదు, హిందూ ధార్మిక గ్రంథాలు; వేరు వేరు మతాలకు సంబంధించిన పుస్తకాలు, వివిద మత గురువులు ధర్మం గురించి చేసిన వ్యాఖ్యానాలు చదివారు. ఆయనకి స్మరణ శక్తి బాగా ఉండేది. ఏ విషయం పైన అయినా గంటలు గంటలు మాట్లాడేవారు. తర్కం చేసేవారు. తన శక్తితో ఎదుటివారిని తన వైపు తిప్పుకునేవారు. ఆధ్యాత్మిక గురుమాత శ్రీమా, శ్రీ అరబిందో నీరజ్ గారిని తమ తమ ఆశ్రమాలకి రమ్మనమని పిలిచారు. శ్రీమా గారు ఆయనని ఆశీర్వదించారు. శ్రీమా ప్రేరణతో నీరజ్ అమ్మ పేరన ఎన్నో కవితలు రాసారు. వీటిలో ఫిలాసఫీ ఎంతో ఉంది.

మా మత్ హో నారజ్ మైనే ఖుద్ హీ మైలీ కీ న చున్‌రియా.

మా మత్ ఐ సే టేర్ కి మేరా తన్ అకులాయె.. మన్ అకులాయె..

(అమ్మా! కోప్పడకమ్మా! నేను నా కొంగను మురికి చేసుకోలేదు

అమ్మా! నీవు అట్లా చూడకమ్మా! నా తనువు బాధపడేలా.. మనస్సు బాధ పడేలా..)

ఆచార్య రజనీష్ (తరువాత ఓషో పేరుతో ప్రసిద్ధికెక్కారు) తను రాసిన మొదటి పుస్తకాన్ని నీరజ్‌కి ఇచ్చారు. ఆయన సంతకం ఉన్న పుస్తకం ఇప్పటికీ ఒక అమూల్య సంపత్తిగా ప్రభాత్ దాచుకున్నారు.

నీరజ్ కవితలలో అన్ని మతాలపైన చేసిన లోతైన చింతనను ఎంతో మెచ్చుకున్నారు. ఓషో నీరజ్ గారిని తన ఆశ్రమానికి రమ్మనమని ఎన్నోసార్లు ఆహ్వనించారు. నీరజ్ గారు అక్కడికి వెళ్ళకుండా అలీగఢ్ లోనే ఉండి ఓషో గారితో ఆత్మీయ సంబంధాన్ని పెంచుకున్నారు. ఆయన తన పుస్తకానికి నీరజ్ గారితో ముందుమాట రాయించుకున్నారు. ఒకసారి ఆయన ఆశ్రమానికి వెళ్ళారు. తన ప్రతీ హిందీ కవితను ఇంగ్లీషులో రాసి అక్కడ ఉన్న విదేశీయులకు అర్థమయ్యేలా చెప్పారు. తాత్విక బోధను చేసారు. ఆచార్య రజనీష్ తను రాసుకునే కలాన్ని నీరజ్‌కి ఇచ్చారు. ఆశీర్వదించారు. తరువాత తన మనవరాలికి, ప్రభాత్ గారి కూతురికి నీరజ్ ఆ కలాన్ని ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ కలం ఆ అమ్మాయి దగ్గర ఉంది.

9 అంకె గురించి కూడా తాత్వికంగా చర్చ జరిపేవారు. భ్రష్టు పట్టిన రాజకీయుల గురించి, దిగజారుతున్న నైతిక విలువలు, అరాచక వాతావరణం గురించి, మానవత్వం మరిచిపోతున్న మనుషుల గురించి వివరంగా లోతుగా చర్చించే నైజం వారిలో ఉంది.

ఒక రోజు నీరజ్ గారు ఇట్లా అన్నారు “మనం అందరం ద్వాపర యుగం కృష్ణుని అనుసరించాలి. కృష్ణ అనే శబ్దానికి రెండర్థాలు ఉన్నాయి. శ్యామల వర్ణం అని ఒక అర్థం. కృష్ణుడు ఒక్కొక్క చోట ఒక్కో రకమైన అవతారం ఎత్తాడు. ఒకచోట ఊరివాడు యాదవుడిగా ఆవుల కాపరి, మరో చోట రాజు, వెన్నదొంగగా బాల లీలలు చేసాడు, రక్షకుడిగా దానవులను సంహరించాడు. ఒకచోట రథం నడిపే సారథి అయితే మరో చోట యుద్ధం చేసే సేనాపతి. ఒక చోట గోపికలతో సంగీత సాగరంలో మునిగిపోయి రాసలీలలు చేసాడు. మరో చోట రణరంగంలో ఉపదేశకుడిగా గీతోపదేశం చేస్తాడు. అప్పుడప్పుడు శత్రువులతో యుద్ధం చేస్తాడు. మరో చోట రణరంగాని వదిలేస్తాడు. అంటే కృష్ణుడు పరిస్థితులను అనుసరించి అవతారం ఎత్తుతాడు. కృష్ణుడు ఎప్పుడు వివాదస్పదంగానే జీవించాడు. అయినా ఆనందంగానే జీవితం సాగించాడు.”

ఒకసారి నీరజ్ గారు, ప్రభాత్‌ని అడిగారు “మీరందరు అసలు వెన్న అంటే ఏమని అర్థం చేసుకున్నారు? ఇది కూడా ఒక ప్రతీకే. వెన్న అంటే అర్థం ఆత్మతత్వం. ఎన్నో ఏళ్ళు ప్రయత్నం చేసాక పుడుతుంది”. ఆయన ఒక కవిత రాసారు.

వెన్నను దొంగిలించి నీవు గోపిక బరువు తగ్గించావు

కాని నాశనం, ఈ కుండ సంగతి ఇప్పుడు ఏమౌతుంది చెప్పు?

ఆయన ఒక కథ గురించి చెబుతూ ఉండేవారు. “ఒక చిత్రకారుడు ఉండేవాడు. అతడు అందమైన చిత్రాలను చిత్రించేవాడు. అతడి పేరుప్రతిష్ఠలు నలువైపులా పాకాయి. పెద్ద పెద్దవాళ్ళు రాజులు, మహరాజులు అతడి చేత తమ తమ చిత్రాలను వేయించుకుంటూ ఉండేవాళ్ళు. అతడికి ఆత్మతృప్తి లేదు. తను ఒక గొప్ప చిత్రం వేయాలని, దానిని చూడగానే వ్యక్తి మనస్సులోని కల్మషం మొత్తం తుడుచుకుపోవాలని ఆ చిత్రం ఎదుట అందరు తల వంచాలని, సాక్షాత్తు, ఈశ్వరుడిని దర్శించాను అన్న భావం కలగాలని అనుకున్నాడు. అటువంటి మనిషి కోసం గుళ్ళూ గోపురాలకు, గురుకులాలకు వెళ్ళడం మొదలు పెట్టాడు. దేశ విదేశాలలో క్షణ్ణంగా గాలించడం మొదలుపెట్టాడు. తిరుగుతూ తిరుగుతూ ఒక కొండ దగ్గరికి వచ్చాడు. ఒక పిల్లవాడు ఆ కొండ మీద కూర్చుని పిల్లనగ్రోవిని ఊదుతున్నాడు. అతడి పెదవుల పైన చిరునవ్వు. కళ్ళల్లో ప్రేమ, కరుణ. ముఖంలో అమాయకత్వం. పవిత్రత అంటే ఆ పిల్లవాడే. చిత్రకారుడు ఆ పిల్లవాడి చిత్రం (బొమ్మ) గీసాడు. ప్రదర్శనకి పెట్టాడు. అందరూ ఎంతగానో పొగిడారు. ఎన్నెన్నో బహుమతులు కూడా లభించాయి. ఎంతో సమయం గడిచిపోయింది.

తను వేసిన చిత్రం మనిషిలోని దైవత్వానికి ప్రతీక. ఇక ముందు తను ఎటువంటి బొమ్మ గీయాలంటే ఆ ముఖంలో రాక్షసుడు కనిపించాలి. అని అనుకున్నాడు. చూసిన వాళ్ళందరు అసహ్యించుకోవాలి.

రాక్షసుడి చిత్రం గీయాలన్న ఉద్దేశ్యంతో, క్రూరులు, చెడ్డవాళ్ళు ఉండే ప్రదేశలను వెతకడం మొదలు పెట్టాడు. జైళ్లు, జూదాలు ఆడే చోట్లు, వేశ్యావాటికలకు వెళ్ళడం మొదలు పెట్టాడు. వెతుకు వెతుకుతూ జైల్లో ఒక ఖైదీని చూసాడు. ఆ ఖైదీ ఎంతో మంది పిల్లలను చంపిన హంతకుడు. ఇక కొన్న రోజుల్లో అతడికి ఉరిశిక్ష పడబోతోంది. చిత్రకారుడు అనుకున్నవన్నీ అతడిలో కనిపించాయి, అతడికి అందరు అసహ్యించుకునే లాంటి అతి క్రూరమైన పనులన్నీ చేసాడు. చిత్రకారుడు అతడి బొమ్మ వేయడానికి అతడి అనుమతి అడిగాడు. నేను ఒకప్పుడు దైవత్వం ఉట్టిపడే బొమ్మను గీసాను. ఇప్పుడు రాక్షత్వం ఉట్టిపడే భీభత్స చిత్రం వేయాలని అనుకుంటున్నాను అన్నారు. ఈ మాటలు విన్న ఆ ఖైదీ వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టాడు. అసలు ఏ భావాలు లేని కరుడుకట్టిన ఖైదీ ఏడుస్తుంటే అందరు ఆశ్చర్యపడ్డారు. కారణం అడిగారు – “చాలా ఏళ్ళ క్రితం పవిత్ర ఆచరణ వలన దైవత్వం ఉట్టిపేడే ఒక బాలుడి బొమ్మను మీరు వేసారు. ఆ పిల్లవాడిని నేనే. కాని సమయం నన్ను దేవుడి నుండి రాక్షసుడిగా మార్చివేసింది.” అమాయకుడైన ఆ బాలుడి ముఖంలో రాక్షసత్వం ప్రవేశించింది. ఆదిమ క్రూరత్వానికి ప్రతీకగా మారిపోయాడు ఆ బాలుడు. అందరు అసహ్యించుకునేలా తయారయ్యాడు అని అన్నాడు.

నీరజ్ గారి ఉద్దేశ్యంలో ప్రతి మానవుడిలోను భావుకత ఉంటుంది. మంచి చెడులు ఉంటాయి. మనిషి తను చేసే పనుల వలనే మంచి వాడిగా, చెడ్డవాడిగా మారతాడు. తను చేసిన అపరాధలన్నింటిని కాలం పైన, సమాజం పైన తోసేస్తాడు.

ఒకసారి నీరజ్ గారు పంచపాండవులతో ద్రౌపది వివాహాన్ని ఎట్లా అర్ధం చేసుకుంటారు? అని అడిగారు. “ద్రౌపదికి ఐదుగురు భర్తలు” అని సమాధానం చెప్పారు. “కాదు ఇదంతా సాంకేతికం. ఒక ప్రతీక. – పంచ పాండవులు ఐదు జ్ఞానేంద్రియాలు. ద్రౌపది వాళ్ళకి కేంద్రబిందువు. అంటే చైతన్యం. ఈ చైతన్యం అందరిని కలిసికట్టుగా ఉంచుతుంది.”

మృత్యువును గురించిన పూర్వాభాస:

“దేరీ మత్ కర్ యార్ మేరీ అబ్ ట్రైన్ ఛూట్‌నే వాలీ హై

జబరన్ న రోక్, నా టోక్ ఆఖరీ సాంస్ టూట్‌నే వాలీ హై

మై తో హారా యహాఁ బహుత్ యార్ తుమ్హారీ బారీ హై

కబ్ తక్ జిందా రూప్ తుమ్హారా మర్జీ కౌన్ హమారీ హై”

(ఆలస్యం చేయకు మిత్రమా! నా ట్రైన్ వెళ్ళిపోతుందేమో!

బలవంతంగా ఆపకు, చివరి శ్వాస ఎటూ తెగిపోతుంది

నేను ఇక్కడ ఎంతగానో ఓడిపోయాను, మిత్రమా ఇక నీ వంతు

ఎప్పటిదాకా జీవిస్తావు? అసలు మన ఇష్టం అనేది ఉంటుందా!)

2012లో ప్రభాత్ గారి రిటైర్మెంట్ తరువాత తండ్రితో ఎక్కువగా అలీగఢ్ లోనే గడుపుతూ ఉండేవారు. జనవరి 4 2018 కుటుంబం అంతా కలసి ఆయన 93వ పుట్టిన రోజు జరిపారు. తరువాత హాట్ పాడ్ వలన కాలు కాలింది. తరువాత ఎన్నోసార్లు లంగ్ ఇన్‌ఫెక్షన్ అయింది. ఎప్పుడు ఆయన ప్రభాత్ గారితో మృత్యువు గురించి మాట్లాడలేదు. ఈ ఏడాది గడిస్తే తను 98 సంవత్సరాలు జీవిస్తానని అన్నారు.

ప్రభాత్‌కి తనకి మధ్య ఎంతో ఆత్మీయ సంబంధం ఉంది, తను మృత్యువు గురించి చెబితే తట్టుకోలేడు అని అనుకున్నారు. ఆయన చనిపోయాక ప్రభాత్ గారికి, తన మృత్యువు గురించి నీరజ్ గారికి ముందే తెలిసి ఉంటుదని అనిపించింది. ఆయన ఉద్దేశ్యంలో మంచి ఆత్మలు, ఎవరికి ఎప్పుడు చెడు తలపెట్టని వాళ్ళు, ధర్మాన్ని తప్పకుండా నడిపేవాళ్ళు, ఉంటాయి. వారికి ఇటువంటి జ్ఞానం ఉంటుంది. ప్రభాత్ తల్లిగారు మైన్‌పూర్‌లో తన తమ్ముడి దగ్గరికి రాఖీ కట్టడానికి వెళ్ళేముందు చుట్టుపక్కల వాళ్ళకి ఇక నేను తిరిగి రాను అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఆవిడ అక్కడే మరణించారు.

చివరి రోజుల్లో నీరజ్ గారు తనకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసారు. కొన్ని చోట్ల ఇదే ఆఖరిసారి రావడం అని చెప్పారు. ప్రబాత్ ఇటువంటి సంఘటనల గురించి రాసారు. నీరజ్ గారికి తను ఇక ఉండనని, భూమి మీద నూకలు చెల్లాయని తెలుసునని ప్రభాత్ గారికి ఎంతో నమ్మకం.

2018 జూలై 18న ఎయిమ్స్‌ ఆసుపత్రిలో నీరజ్ గారిని చేర్చారు. ఆ సమయంలో వారు మాట్లాడలేకపోయేవారు. కానీ సౌంజ్ఞలు చేసేవారు. డాక్టర్లకి నీరజ్ మళ్ళీ కోలుకుంటారని ఎంతో నమ్మకం ఉండేది. కానీ జూలై 19 సాయంత్రం ఆయన దివగతుల్యయారు. అమెరికా నుండి ప్రభాత్ గారి కొడుకు వచ్చారు. జులై 20 ఢిల్లీకి వచ్చారు. జులై 21న అలీగఢ్‌లో ప్రభుత్వ లాంఛనాలతో తన ఆత్మీయుల మధ్య అంత్యక్రియలను జరిపించారు.

***

నీరజ్ కీ యాదోం కా కారవాన్
రచన: మిలన్ ప్రభాత్ ‘గుంజన్’
ప్రచురణ: హిందీ పాకెట్ బుక్స్,
పేజీలు: 208
వెల: ₹ 199.00
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/-/hi/Milan-Prabhat-Gunjan/dp/9353497280

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here