నీరజ్ తత్వ చింతన

0
8

[dropcap]రా[/dropcap]యాలని అనుకున్నాక ఏదైతే రాస్తామో అది గద్యం. అసలు రాయలేకుండా ఉన్న స్థితిలో రాయబడేది పద్యం. అంటే దానంతట అదే స్వయంగా వెలువడేది కవిత. పర్వతాల పైన జలపాతం, పూలు, మంచు బిందువుల కథలు రాసినట్లుగా కవిత వెలువడుతుంది – ‘నా జీవితంలో కవిత రాయబడలేదు. దానంతట అది సజహంగా వచ్చేసింది. ఏ విధంగా అయితే వెలిగి – వెలిగి ఆరిపోవడం దీపం జీవితంలో తప్పదో నిజానికి అది దాని నిస్సహాయత అదే విధంగా పాట పాడి పాడి మౌనంగా ఉండిపోవడం, నా జీవితంలోని నిస్సహాయత. నిస్సహాయ నా ఆస్తిత్వానికి షరుదు. తప్పనిసరి. అందు వలన నేను దానికి కట్టుబడి ఉండలేదు, అదే నన్ను కట్టేసింది. అదే విముక్తి. అదే మోక్షం. అందువలన అది ఏ వాదాలకు అనుగామిని కాదు, ఏ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండదు. అది నాకే కాదు పరాయి వాళ్ళకు కూడా చెబుతుంది’.

తుమ్ లిఖో హర్ బాత్ చాహే జిస్ తరహ్ చాహే

కావ్య్ కో పర్ వాద్ కా కంగన్ న బన్ నే దో.

(నీవు ఏదనుకుంటే అదే రాయి కాని,

కావ్యాన్ని వాదాల కడియాన్ని కానివ్వకు.)

ఎందుకంటే అది ఈ విధంగా భావిస్తుంది –

ఆయు హై జితనీ సమయ్ కీ, గీత్ కీ ఉతనీ ఉమర్ హై

చాంద్‌నీ జబ్ సే హంసీ హై, రాగిని తబ్ సే ముఖర్ హై

జిందగీ గీత్ స్వయం జాన్‌తే గానా అగర్ హమ్

హర్ సిసకితీ సాంస్ లయ్ హై హర్ ఛలక్ తా అశ్రు స్వర్ హై.

(సమయానికి ఎంత ఆయువు ఉందో అంత ఆయువు గీతానికి ఉంది

వెన్నెల నవ్వినప్పటి నుండే రాగం వెలువడింది,

జీవన గీత ఒక గీతం అని మనం తెలుసుకున్నప్పుడు

వెక్కిళ్ళు పెట్టే ప్రతి శ్వాస లయమే, తొణికే ప్రతి కన్నీటి బొట్టు స్వరమే.)

ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు, నేల నుండి గగనం దాకా, ఏమైతే ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని మన ప్రాణ – శక్తిని ప్రభావితం చేస్తాయో అవన్నీ దానికి సంబంధించిన విషయాలే – చీకటైనా వెలుగైనా, జన్మ అయినా మృత్యువు అయినా, ఎండ అయినా నీడ అయినా, సుఖం అయినా, దుఃఖం అయినా, రాగం అయినా, విరాగం అయినా, సంఘర్షణ అయినా, శాంతి అయినా, ఏ బాటసారి జీవితంలోని శూన్యపు సంధ్య అయినా, ప్రేయసి చెంతన ఉన్న ఏ ప్రియడి జీవితంలోని ఉదయం అయినా, మండుతున్న ఎండలో శ్రమ పడే శ్రామికుడి జీవితంలోని మధ్యాహ్నం అయినా, ప్రేమలో మునిగిపోయిన ప్రేయసి జీవితంలోని వెన్నెల రాత్రైనా.. జీవితం ఎంత వరకు ఉందో, మనిషి అస్తిత్వం ఎప్పటి దాకా అయితే ఉంటుందో, సృష్టి ఎంత వరకు ఉంటుందో అంత వరకు దాని గతి ఉంటుంది. దానికి ఏదీ కానిది అనేది ఉండనే ఉండదు. అమంగళాన్ని మంగళంగా, అసౌందర్యాన్ని సౌందర్యంగా, అసత్యాన్ని సత్యంగా మార్చాలనుకుంటుంది. ఇదే దాని పాటకి ధ్యేయం. ఇదే దాని రుదనానికి అర్థం. అది పదాలతో ఏ మహల్‌ని నిర్మించిందో అందులో ప్రత్యేకంగా అందమైన ముందు గది ఏదీ లేదు. అక్కడ సాధారణ ప్రజలంతరికి ప్రవేశం ఉంది. దాంట్లోకి ప్రతి వ్యక్తి, ప్రతి కులం వాళ్ళు, ప్రతీ వర్ణం వాళ్ళు, వెళ్ళవచ్చు. అంటే అందరికీ ప్రవేశం ఉంది. ఏ సంకోచం లేకుండా తమ తమ అభిప్రాయాలను ఎదురు బొదురుగా వ్యక్తం చేయవచ్చు. అందరి కంఠం వినగల సహనం దానిలో ఉంది. ఎందుకంటే దాని ఉద్దేశంలో సత్యం ఎవరి సొత్తు కాదు. ఎవరి స్వంత బాట కాదు. అది రోడ్డు పైన ఆకలితో అలమటిస్తున్న బిచ్చగాడి దగ్గర లభిస్తుంది. సంవత్సరాల తరబడి చీకటిలో పడి ఉన్న శిధిలాలలో కూడా లభిస్తంది. అందుకే ఈ పాట ఇట్లా పాడుతుంది.

ఇస్ ద్వార్ క్యూం న జావూం,

ఉస్ ద్వార్ క్యూం న జావూం

ఘర్ పా గయా తుమ్‌హారా,

మై ఘర్ బదల్ బదల్ కర్.

ఈ ద్వారం దగ్గరికి ఎందుకు వెళ్ళను, (వెళ్తాను)

ఆ ద్వారం దగ్గరికి ఎందుకు వెళ్ళను, (వెళ్తాను)

ఇల్లు, ఇల్లు మార్చడం వలన

నీ ఇల్లు నాకు లభించింది.

నా ఉద్దేశంలో సాహిత్యానికి మనిషికన్నా గొప్ప సత్యం ఏది లేదు. ఈ సత్యాన్ని పొందడం లోనే దానికి సార్థకత. ఏ సాహిత్యంలో అయితే మనిషి సుఖ దుఃఖాలకు తావు ఉండదో ఆ సాహిత్యం పట్ల నేను విరోధం ప్రకటిస్తాను. నా కవిత్వం ద్వారా ఒక మనిషిగా ఎదుటి మనిషి దాకా చేరాలని ఆశిస్తున్నాను. అదే నా యాత్రకి ఆది అంతం కూడా. దారిలో నా కవిత్వం దారి తప్పకూడదని దాని చేతిలో నేను ఒక ప్రేమ దీపాన్ని పెట్టాను. మానవీయ సంబంధాలలో ప్రేమ సంబంధం అన్నింటికన్నా శ్రేష్ఠమైనది. ఈ ప్రేమ అనే భావోద్వేగం నిరంతరం మనలోని వికృతాలను అణిచేస్తూ మనలని మానవత్వం దగ్గరిగా తీసుకువెళ్తుంది. వ్యక్తి జీవితంలో వికృతి అహం అనే భావన. అది సమాజరూపంలో యథార్థ రూపం ధరిస్తుంది. ఘృణ, ద్వేషం, గర్వం, వైషమ్యం, యుద్ధం, సంహారం అసలు ఈ భావోద్యేగాలకు మూల కారణం ఆ ఆహమే. దీని నుండి విముక్తి, పొందడమే మనిషికి మోక్షం. నా ఉద్దేశంలో ఈ అహం సమర్పణమే ప్రేమ. ఈ అహాన్ని త్యజించడమే సాహిత్యం. ప్రేమకు ఏది ఇష్టమో అదే సాహిత్యానికి లక్ష్యం. అందువల అంతిమ రూపం ప్రేమ సాధనలా సాహిత్య – సాధన కూడా హృదయ సాధనయే. కవి కావాలనుకుంటే మొదట మనస్సున్న మనిషిగా మారాలి. ఇది నా కవిత్వానికి మకుట వాక్యం.

ప్రేమ ముఖ్యంగా మానవ ప్రేమ నా కవిత్వానికి మూల స్వరం. “ఆద్మీ హం ఆద్మీ సే ప్యార్ కర్ తా హుం” (నేను మనిషిని, మనిషిని ప్రేమిస్తాను) అన్న భావం. ఇది నా బలహీనత, నా శక్తి కూడా. బలహీనత ఎందుకంటే రాగద్వేషాలతో నిండిన ఈ లోకంలో మానవ ప్రేమ అనే గీతాన్ని పాడటం అంటే తన పరాజయం కథనే చెప్పడం. శక్తి ఎందుకంటే నాలో ఉన్న ఈ మానవ ప్రేమ నా చుట్టు పట్ల ఉన్న ధర్మం, కర్మం, కుల మతాలు మొదలైన అడ్డు గోడలని కూల్చి వేసింది. వాద వివాద భీషణమైన గాలి దుమారాలలో నన్ను దారి తప్పనీయలేదు. నేను సత్యన్వేషణ కోసం వెలువడినప్పుడు –

పర్వతోం నే ఝకా షీష్ చూమే చరణ్

బాంహ్ డాలీ కలీ నే గలే మే చంచల్,

ఏక్ తస్వీర్ తేరే లియే కింతు మై,

సాఫ్ థా మన్ బచాకర్ గయా హీ నికల్

(పర్వతాలు తల వంచాయి, నా పాదాలను ముద్దు పెట్టుకున్నాయి.

చంచలమైన మొగ్గలు నా మెడలో చేతులు వేసాయి.

కాని నీ చిత్రపటాన్ని తీసుకుని

ఏ మచ్చ లేకుండా రక్షించుకుంటూ బయటపడ్డా.) (ప్రాణ్‌ గీత్)

నా చేతిలో మనిషి చిత్రపటం ఉంది. అందుకే నేను దారి తప్పలేదు. అందువలన ప్రేమ నా శక్తి. దీనిని మీకు పూర్తిగా అర్థం అయ్యేలా చెప్పలాంటే నాకు ఎన్ని రూపాలలో ఇది అనుభవం అయిందో మీరు తెలుసుకోవాలి. కడుపుకి ఆకలి ఉంటుంది. దానితో పాటు మరో ఆకలి కూడా ఉంటుంది. దాని పేరే సృజన. ప్రకృతిలోని ప్రత్యేకమైన ప్రతి తత్వం తనని తాను విశ్వంలో ఏదో రూపంలో ప్రతిబింబించాలని తపన పడుతుంది. దానికి కారణం-

దీప్ కో అపనా బనానే కో

పతంగా జల్ రహా హై

బూంద్ బన్‍నే కో సముందర్ కీ

హిమాలయ్ గల్ రహా హై

(దీపాన్ని తన దానిగా చేసుకోడానికి

శలభం తనని తను మంటల్లో కాల్చేసుకుంటోంది,

సముద్రపు నీటి చుక్క కావడానికి

హిమాలయం కరుగుతోంది.)

ఇదే సృష్టిలోని ప్రజనన ప్రక్రియ. దీనినే వాంఛ అని అంటారు. ఈ వాంఛే ప్రత్యేకమైన కళకి సాహిత్యానికి మూల – ప్రేరణ. ఈ వాంఛ రకరకాల రూపాలని ధరిస్తుంది. మనిషిలోని పంచకోశాలలో ఉన్న శక్తిని నేను పంచచేతనల రూపాలుగా భావిస్తాను. ఇది నిరంతరం వికాసం చెందుతూ ఉంటుంది. అందు వలన కవి మానసంలో వ్యాప్తి చెందిన సృజన అనే అకలి ఎప్పుడు ఊర్ధ్వగామి అయి ఉంటుంది. దానికి రకరకాల అనుభూతులు కలుగుతాయి. ఎప్పటిదాకా ఈ వాంఛ అన్నమయ కోశంలో ఉంటుందో దానిని ఆకర్షణగా మనం అనుకోవాలి. ఈ స్థితిలో మనిషి శరీరక ఆకర్షణకు లోను అవుతాడు. ఈ సమయంలో అతడి లోపల పశుత్వం ప్రబలంగా ఉంటుంది. అప్పుడు వ్యక్తి పొందాలనే కోరుకుంటాడు. కాని ఇవ్వాలని ఏ మాత్రం అనుకోడు. ఇదే పాశవిక ప్రవృత్తి. దీనినే స్వార్థం అని అంటారు. ఈ స్థితిలో ఏ రచన అయినా చేస్తే అది కేవలం కామంతో నిండిన రచన అవుతుంది. ఇది ఘోరమైన యాన, తృష్ణ. నేను ఇటు వంటి రచనను ఒకటే ఒకటి చేసాను. “ఆజ్ తో ముఝసే నషరమావో తుమ్హే మేరీ కసమ్ హై” (ఈ రోజు మాత్రం నీవు నా దగ్గర ఏ మాత్రం సిగ్గు పడకు. నీ మీద ఒట్టే.) కొంత సంయమంతో ఉన్న కారణంగా ఈ కామం ఇంకా పై వైపు వెళ్ళినప్పుడు ప్రాణకోశంలో ప్రవేశిస్తుంది. ప్రాణకోశంలో వాయువు ఉంది. అంటే దాని ఆగమనం అయిందన్నమాట. ఇక్కడి నుండి ప్రేమ ఉదయిస్తుంది. ఈ స్థితిలో వ్యక్తిలో పొందాలన్న కోరికతో పాటు ఇవ్వాలి అన్న భావన కూడా ఉటుంది. ఇక్కడి నుండి స్వార్థం కొంత తగ్గుతుంది. కాని స్వార్థ చింతన పూర్తిగా మటుమాయం కాదు.అందువలన ప్రేమతో పాటు ఈర్ష్య కూడా ఉంటుంది. ఇక్కడి నండే కావ్యంలో దార్శనికత (తత్వం) జన్మస్తుంది. నా ‘విభావరి’ లోని కవితలలో ఎక్కువ శాతం తత్వం చోటు చేసుకుంది. నా రచన ‘ప్రాణ్ గీత్’లో కొన్ని తత్వం ప్రధానమైన గీతాలు ఉన్నాయి. ప్రాణమయకోశం నుండి ఇది మనోమయ కోశం లోకి ప్రస్థానం గావించినప్పుడు కవిలో ‘భక్తి’ అనే అనుభూతి మేల్కొంటుంది. కావాలి అన్న కోరిక ఇక్కడ నిద్రపోతుంది. కవిత్వం ఇక్కడికి చేరాక స్త్రీగా మారిపోతుంది. ఎందుకంటే సమర్పణ ఎప్పుడు స్త్రీయే చేయగలగుతుంది. పురుషుడు చేయలేడు. భక్త కవులు, సుఫీ కవులు ‘రామ్ కి బహురియా’ గా తమ హృదయ వేదనని వ్యక్తం చేసారు. భారతదేశంలో సఖీ సంప్రదాయాల జన్మకు కారణం ఈ భావమే. నా కవితలలో కూడా కొంత వరకు ఈ భావలే చోటు చేసుకున్నాయి –

తుఝ్ సే లగన్ లగాయి

ఉమర్ భర్ నీంద్ న ఆయి

సాంస్ – సాంస్ బనగయి సుమరీన్

మృగ్ ఛాల సబ్ కి సబ్ ధరిణి

క్యా గంగా, వైతరిణి

భేద్ న కుఛ్ కర్ పాయి

(నీలో నా మనస్సు లగ్నం అయింది

జీవితాంతం నిదుర రాలేదు

శ్వాస – శ్వాస ప్రార్థన అయింది

మొత్తం ధరణి అంతా మరీచికే

ఏ గంగ ఎటువంటి వైతరిణి

అసలు బేధం తెలుసుకో లేకపోయాను.)

భక్తిలో ఉండే తన్మయత్వం విరహ వేదనయే. విరహానికి కారణం ద్వైతం. దాని ఆరంభం మనోమయ కోశం నుండే మొదలవుతుంది. అందువలన భక్త కవులు మోక్షాన్ని వద్దనుకున్నారు. అద్వైత వాదాన్ని నీరస జ్ఞానంగా భావించి తిరస్కరించారు. మనోమయ కోశం పైన విజ్ఞానమయ కోసం ఉంది. ఇక్కడ నుండి ద్వైతం సమాప్తం కావడం మొదలవుతుంది. ఈ స్థితిలో కవిలో సామాజిక చేతన, జనకళ్యాణం భావం మేల్కొంటాయి. ఇక్కడి నుండి నిజమైన అభ్యుదయ కవిత్వం ఆరంభం అవుతుంది. (కాని నేటి అభ్యుదయ కవిత్వం కోవలోకి రాదు.) ఎందుకంటే అందులో ఎక్కువగా అనుభూతి శూన్యతే ఉంటుంది. కేవలం సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికికే రాసినట్లు అనిపిస్తుంది. ప్రేమ్‌చంద్ నవలా సాహిత్యంలో, నాజిమ్ హిక్‌మత్ కవితలలో అక్కడక్కడ అభ్యుదయ సాహిత్యం కనిపిస్తుంది. ‘అబ్ యుద్ధ్ నహీ హోగా’ (ఇక యుద్ధం జరగదు) అనే నా కవిత ఈ కోవకి చెందినది. సామాజిక చైతన్యం ఇందులో ఉంది. ఇక్కడ వ్యక్తి స్త్రీ రూపంలో ఆలోచించాడు, పురుష రూపంలోనూ ఆలోచించాడు. ఇది విశ్వంలో ఒక అంశం అవుతుంది. కింద ఇచ్చిన గీతంలో ఈ భావం ధ్వనిస్తుంది.

అంధియారా జిస్ కో షర్‌మాయే

ఉజియారా జిస్ కో లల్‌చాయో

ఐసా దేదో దర్ద్ ముఝే తుమ్

మేరా గీత్ దియా బన్ జాయే

(చీకటి ఎవరినైతే సిగ్గు పడేలా చేస్తుందో,

వెలుతురు ఎవరి నైతే ఆశ పెడుతుందో

నాకు అటువంటి బాధని ఇవ్వు

నా గీతం దీపం అయేలా.)

అన్నింటికన్నా పైన ఆనందమయ కోశం ఉంటుంది. ఇక్కడ అహం పూర్తిగా నశిస్తుంది. ప్రేమకి ఇది అంతిమ పరిణామం. ఇక్కడ వ్యక్తి చేతన విశ్వచేతనగా మారిపోతుంది. ఇదే సాహిత్యానికి, ప్రగతివాదానికి అంతిమ మెట్టు. గోస్వామి గారి ‘రామ చరితమానస్’ లో ఈ చేతన పై స్థాయిలో కనిపిస్తుంది.

దీనికి సంబంధించిన మరో మాట చెబుతాను. నా ఉద్దేశ్యంలో అనుభూతి అంటే ఉష్ణత. (తాపం అంటే వేదన). ఉష్ణత (తాపం) యే జీవితం. ప్రేమ లోతును వేడిలోని ఆధిక్యత లేక న్యూనతతో కొలవ గలుగుతాము. కావ్యంలో ఉన్న మార్మికత జన్యదాత కూడా ఈ ఉష్టమే లేక ఈ వేదన యే. ఒక వేళ ఇదే లేకపోతే అది ఉపదేశం అవుతుంది. కాన కవిత్వం ఏ మాత్రం కాదు. దీనిలో ఉండే సృజనకు మరో పార్శం మనిషి హృదయాన్ని స్పర్శించి దానిని విశాలం చేస్తుంది. సహనాన్ని ఇస్తుంది. నేను ఈ భావాన్ని ఈ విధంగా చెప్పాను.

మైనే తో చాహా బహుత్ కి అపనే ఘర్ మే రహుం అకేలా పర్ –

సుఖ్ నే దర్వాజా బంద్ కియా, దుఃఖ్ నే దర్వాజా ఖోల్ దియా

(నేను నా ఇంట్లోనే ఉండాలని ఎంతగానో కోరుకున్నా కాని

సుఖం ద్వారాన్ని మూసేసింది, ధుఃఖం ద్వారాన్ని తెరిచింది.)

నా కవిత్వంలో ఈ వేదన (ఉష్టత) సహజంగా ఉంది. కొందరి ఉద్దేశంలో ఈ ఆలోచన ప్రసూతి వైరాగ్యం లాంటిది. కాని అది కావ్య వస్తువు పట్ల నా నిశ్చలత్వం, ఏకాంత తన్మయత వలననే అని నా అనుభవం. ఒక వేళ దీనిని మీరు నా కవిత్వం నుంచి తీసేస్తే నా వయస్సు సగం అయిపోతుంది. నేనే కాదు, లోకంలో ఉన్న గొప్ప కవుల రచనల నుండి వేదనను బహిష్కరం చేస్తే బహుశ మీరే వాటిని చదవడానికి ఇష్టపడరు.

కవిత్వం లోపలి ఏకత్వం విషయంలో శ్రేష్ఠమైన కవితతో హృదయం, బుద్ధి రెండింటి పని ఆలోచించడం, హృదయానికి మాత్రం అనుభూతి కావాలి, ఇది నా అభిప్రాయం. కవిత్వంలో రెండింటి క్రియలు మారిపోతాయి. హృదయం ఆలోచిస్తుంది. బుద్ధి అనుభవిస్తూ ఉంటుంది. మరో విధంగా చెప్పాలంటే కవిత్వంలో బుద్ధి ఆలోస్తుంది, కాని హృదయం ద్వారా ఆలోచిస్తుంది. బైబిల్‌లో ఒక వాక్యం ఉంది – ‘In the beginning was word and word was god’ – ఆదిలో శబ్దం ఉండేది. శబ్దం ఈశ్వరుడు. శబ్దం అంటే ప్రతీక. ప్రతీకకి అర్థం ఆలోచన. ఈశ్వరుడు అంటే అర్థం సృష్టి. అంటే ఆలోచనయే సృష్టి. కవిత కూడా ఒక సృష్టే. కాని అక్కడ ఆలోచనకి కాదు భావానికే స్ధానం ఉంటుంది. కవిత విన్న తరువాత మీ భావం ఎంతో అందంగా ఉంది అని అనరు. అక్కడ ఆలోచనయే భావంగా మారుతుంది. ఎట్లా? బైబిల్‌లో రెండో వాక్యం ‘all was water and a spirit was brooding over it’ అంతటి జలం ఉంది, కాని ఒక చేతన చింతన చేస్తోంది. ఇక్కడ చింతన చేయడం అంటే బ్రూడింగ్ చేయడం. బ్రూడింగ్ అంటే వెచ్చ చేయడం అన్న అర్థం వస్తుంది. కోడిపెట్ట తన గుడ్లని పొదుగుతుంది. అప్పుడు దాని ద్రవంలో ప్రాణం సంచారం (వేడి) అవుతుంది. ఇదే విధంగా కవి కోడిపెట్ట గుడ్లను పొదిగినట్లుగా ఆలోచనను మథనం చేస్తాడు. దానికి వేడిని చేకూరుస్తాడు. అంటే తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా అందులో మమేకం చేస్తాడు. కోడిపెట్ట తన తనువు, ప్రాణం, మనస్సు, రెక్కల వేడిని కేంద్రీకృతం చేసి గుడ్డును ద్రవ్యంలో ముంచెత్తుతుంది. అప్పుడు ఆ ఆలోచన సృష్టి, అంటే భావంగా మారిపోతుంది. ఈ వియషాన్ని ఈ విధంగా చెప్పడం ఉపయుక్తమైనది – “ఎప్పటి దాకా అయితే మనం ఆలోచనను ఆత్మతో మమేకం చేస్తామో అప్పటి వరకు అది కేవలం ఆలోచనగా మాత్రమే ఉంటుంది. కాని ఆలోచనే మనలని ఆత్మతో మమేకం చేసుకున్నప్పుడు మన సంపూర్ణ వ్యక్తిత్వం, తనువు, మనస్సు, రక్తం, మాంసం మొదలైన వన్నీ పూర్తిగా కలిసిపోయినప్పుడు అది భావంగా రూపుదిద్దుకుంటుంది.” వ్యక్తిగతమైన నా అనుభవం ఏమిటంటే నేను ఏ కవితలనైతే పరిశీలించి, పరవశించి అనుభవించి రాసానో అవి శ్రేష్ఠమైన రచనలుయ్యాయి. ఏ ఆలోచన అయినా మనస్సులో తల ఎత్తితే అది తొందరగా పూర్తిగా మాసిపోదు. అది మన అంతశ్చేతనలో ఉందిపోతుంది. కొంత కాలం అయ్యాక ఒక తీవ్రమైన అనుభూతి రూపంలో మన కంఠం నుండి వెలువడుతుంది. ఈ వెలువడడం అనేదే సహజమైనది. అదే కవిత్వం. గీతాల రచనలో మనం కవిత నుండి ఒక అడుగు ముందుకు వేయాలి. దాని సృష్టిలో బుద్ధి పూర్తిగా హృదయానికి శరణాగతం అవుతుంది. ఆలోచనా క్రియను కంఠానికి అప్పచెప్పేస్తుంది. ఇట్లా ఎందుకు అవుతుందంటే గీతంలోని ప్రాణం ఒక అమూర్తమైన భావంగా ఉంటుంది. ఇది స్వరంలో వ్యక్తం అవుతంది. ఎప్పటి వరకైతే రచనకి ఆధారం మూర్తం అవుతుందో అప్పటి దాకా బుద్ధి సహాయ పడుతుంది. కాని విషయం అమూర్తం కాగానే బుద్ధి నిస్సహాయంగా మారిపోయి హృదయాన్ని శరణు కోరుతుంది. పూర్తిగా తనని తాను సమర్పించుకుంటుంది. కవిత్వం విషయంలో మనం మనసుతో ఆలోచిస్తాము. బుద్ధి (వివేకం)తో అనుభూతిని చెందుతాము. అందువలనే లోలోపల రాగాలాపన చేయానిదే గీతం రాయలేదు. ఈ క్రియ ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే అప్పుడప్పుడు రచన చేస్తున్నప్పుడే ఊహ అనుభూతి చెందుతుంది.

నా భాష గురించి అందరు ఈ విధంగా ఫిర్యాదు చేస్తారు. నా భాష హిందీ కాదు ఉర్దూ కాదు. నిజానికి వాళ్ళ ఫిర్యాదు సమంజసమైనదే. దీనికి కారణం ఏమిటంటే నా కావ్య వస్తువు ‘మానవ ప్రేమ’. ఈ రెండింటిలోనూ ఏ బాష కాదు. మనస్సులో ప్రేమ సహజంగానే అంకురిస్తుంది. అది జీవితంలో సహజంగా మనకు ప్రాప్తిస్తుంది. ఏది సహజమో దాని భాష సహజమైన భాషే అవుతుంది. అసహజమైన భాషలో రాస్తే అది వ్యక్తం కాదు. చెప్పకుండానే ఉండిపోతుంది. ప్రతీ సమాజానికి తన భాష అంటూ ఒకటి ఉంటుంది. నేను ఏ భాషలో కవిత్వం రాస్తున్నానో ఆ భాషే నేను ఉంటున్న సమాజానిది. విషయం అసహజంగా ఉన్నప్పుడు నేను అసహజమన భాషనే ప్రయోగించాను. నా రచనలు – ‘స్రష్ఠ’, ‘జీవన్ గీత్’, అరవిందుడి కవితలలో కొంత ఈ భాష కనిపిస్తుంది. అందువలన ప్రతీ విషయానికి భాష వేరుగా ఉంటుంది. చేతనలో ఉండే వేరు స్థాయిలతో పాటు భాషకి కూడా చిహ్నం, సంకేతం, భావం, సూత్రం, మంత్రం అనే వేరు స్థాయిలు ఉంటాయి. చిహ్నం (ఆకర్షణ), సంకేతం (ప్రేమ), భావం (భక్తి), సూత్రం (అంశరూపం), మంత్రం(ఆనందం). విషయానికి తగ్గట్లుగా నేను చిత్ర, సంగీత, పురుష, తత్వం, సహజ, సాంకేతిక మొదలైన భాషలను ప్రయోగించాను. చాలా విస్తారం అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ ఉదాహరణలను ఇవ్వడం లేదు. మీరు సూక్ష్మ దృష్టితో నా రచనలను చదివితే కొన్ని ఉదాహరణలు దొరుకుతాయి.

నేను కవితల కన్నా గీతాలన్నే అధికంగా రాసాను. నా గీతాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఇది కూడా నిజమే. ఎక్కువ మంది నా పాడే తీరు వలననే గీతాలకి మంచి పేరు వచ్చిందిని అంటారు. ఇది కూడా నిజమే. కాని ఇంత మంచి పేరు రావడానికి కారణం వాటిలో ఏ అడ్డంకి లేని సెలయేటి ప్రవాహం ఉంది. సహజమైన భాషలో వచ్చిన సహజమైన అనుభూతి ఉంది. మనం సహజత్వం నుండి అసహజత్వం వైపు ప్రస్థానం చేస్తే గద్య రచన అవుతుంది. అసహజత్వం నుండి సహజత్వం వైపు ప్రయాణం చేస్తే కవిత్వం అవుతుంది. సహజత్వమే గతి (కదలిక, చలనం). వ్యష్ఠి, సమిష్ఠి సృష్టిల అస్తిత్వానికి కారణం గతి మాత్రమే. కవిత్వం కూడా ఒక సృష్టే. అందు వలననే సృష్టికి సమానం అయిన గతి (లయ) దానికి మూలం. వాక్యంలో క్రియని సహజంగా, ఉచితంగా ప్రయోగిస్తేనే వస్తుంది. సంస్కృత సాహిత్యాన్ని పరంపరగా భావించి, స్వాభావికంగా ఆధ్యాత్మిక చింతనలో లీనం కావడం వలన హిందీ ‘క్రియ’ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేకపోతోంది (వ్రజ్ భాష అవధీ భాషలో రాసిన కవులు ఇటువంటి తప్పు చేయలేదు). దానిని బహిష్కరించనైనా బహిష్కరించరు, లేకపోతే తప్పుగా అయినా ప్రయోగించరు. ఆధునిక హిందీ కవిత్వంలో క్రియని సరిగా ప్రయోగించక పోవడానికి కొన్ని కారణాలు కనిపిస్తాయి. ఉదాహరణలు ఉన్నాయి. మొదట్లో నేను ఇటువంటి తప్పే చేసాను. కాని అనుకోకుండా ఒక నాలుగేళ్ళ బాలుడి వలన నేను చేస్తున్న తప్పులను తెలుసుకున్నాను. అప్పటి నుండి నేను క్రియని ప్రయోగించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉంటున్నాను. గుర్తు పెట్టుకోగల గుణం కవిత్వంలో ఉండాలి. శ్రేష్ఠ కవిత్వం అంటే స్మరణే. ఎక్కువగా క్రియ ఉచిత అనుచిత ప్రయోగం పైనే ఇది ఆధారపడి ఉంటుంది. ఏ వాక్యంలో అయితే క్రియ సరియైన స్థానంలో ప్రయోగింపబడదో ఆ వాక్యం ఎంత ప్రయత్నించినా మన స్మృతలో ఎక్కువ సేపు ఉండదు. ఏ వాక్యంలో అయితే క్రియ సరియైన స్థానంలో ఉంటుందో దానిని గుర్తు పెట్టుకోవడం తేలిక.

కింద ఇచ్చిన రెండు ఉదాహరణలు దీనిని స్పష్టం చేస్తాయి.

ఆజ్ జీభర్ దేఖ్ లో తుమ్ చాంద్ కో

క్యా పతా యహ్ రాత్ ఫిర్ ఆయే న ఆయే

(ఈ రోజు మనస్ఫూర్తిగా చూసుకో నీవు చంద్రుడిని

ఎవరికి తెలుసు ఈ రాత్రి మళ్ళీ వస్తుందో రాదో)

ఏక్ తిన్‌కా నే కిసీ తూఫాన్ కే

సాథ్ బఢకర్ జబ్ లియా ఆకాశ్ ఛూ

(ఒక గడ్డిపోచ ఏదో ఒక తుఫాను తాకడం వలన

పెరిగి పెద్దదై ఎప్పుడైతే ఆకాశాన్ని స్పర్శిస్తుందో.)

పైన ఇచ్చిన రెండు ఉదాహరణలలో భేదం స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి కావ్య పంక్తిలో క్రియ దాని యథాస్థానంలో ఉంది. రెండో వాక్యంలో స్పర్శించడాన్ని విరిచి దాన్ని స్థానాన్ని భ్రంసం చేయడమైనది. అందు వలన జ్ఞాపకం ఉండదు. అందులో గతి అంతగా ఉండదు.

భావం, అర్థం, సంకేతం మొదలైన వాటి వలన స్వాభావికంగా పదానికి ఒక గొప్ప స్థానం ఉంటుంది. కేవలం శబ్దానికి ఏ అర్థం ఉండదు. శబ్ధానికి అర్థం వాక్యం, అంటే తక్కిన శబ్దాల సంబంధం వలన సమయం స్థానం సందర్భంలో ప్రాప్తం అవుతుంది. ఏ విధంగా అయితే ప్రతీ మనిషి అపూర్ణుడో పూర్ణత కలిగించే ఆత్మ సఖుడు లేక సఖి ఈ ప్రపంచంలో ఎక్కడోక్కడ దాక్కుని ఉంటారో అదే విధంగా ప్రతీ శబ్దం కూడా అపూర్ణమైనదే. దానికి పూరక శబ్దం తప్పకుండా ఉంటుంది. ఉదయం – సాయంత్రం, నేల – ఆకాశం, పగలు – రాత్రి మొదలైన ధ్వని సామంజస్యం వలన ఒక పదం యొక్క సంబంధం మరో పదంతో ఉంటుంది. అది శతాబ్దాల ప్రయోగం, సంస్కారాల తరువాత ప్రాప్తిస్తుంది. ఎందుకంటే భాష వ్యక్తి సృష్టి కాదు. సమాజ సృష్టి. డిక్షనరీలో ప్రతీ పదానికి ఏదో ఒక పర్యాయ వాచక పదాలు ఉంటాయి. కాని కవిత్వం కోసం అవి తయారు చేయబడలేదు. కవితలో ప్రయోగించిన శబ్దం యొక్క స్థానాన్ని అదే అర్థం ఇచ్చే వేరే శబ్దం తీసుకోలేదు. ఒక వేళ ఇట్లా అయితే నా ఉద్దేశంలో అది కవితలోని లోపం. కవిత్వం స్వాభావికమైన భాష ఏదంటే దాంట్లో ఒక పదం మరొక పదానికి పూరకం అవుతుంది. కింద చరణాన్ని చూడండి –

అన్‍జాన్ యాహ్ నగర్ హై, అన్‌జాన్ య‍హ్ డగర్ హై,

న చఢావ్ కా పతా హై, న ఢలన్ కీ ఘబర్ హై,

సబ్ కహ్ రహే ముసాఫిర్ చల్‌నా సంభల్ – సంభల్ కర్

లంబా బహుత్ సఫర్ హై ఛోటీ బహుత్ ఉమర్ హై.

(అపరిచితమైన నగరం ఇది, అపరిచతమైన బాట ఇది

ఎత్తు తెలియదు పల్లము తెలియదు,

అందరు అంటున్నారు ఓ బాటసారి నిన్ను నువ్వు రక్షించుకుంటూ నడు

ప్రయాణం ఎంతో దీర్ఘమైనది, ఆయుష్షు ఎంతో తక్కువైనది.)

ఇటువంటి భాష వలన ఏ సంగీతం అయితే వినిపిస్తుందో అది సర్వ- సంగీతం కన్నా, శబ్ద సంగీతంకన్నా హృదయ సంగీతమే. ఈ సంగీతమే భావ సంగీత రూపంలో గీతానికి ప్రత్యేకతను ఇస్తుంది. నా గీతాలలో అతర్లీనంగా సలిల రూపంలో ఈ సంగీతమే ఉంది. చేతనకి ఏ స్థాయిలో ‘భక్తి’ జన్మిస్తుందో అదే స్థాయిలో ఈ సంగీతం కూడా జన్మిస్తుంది. సూర్‌దాస్, మీరా, మహాదేవి, కోకిల గారి రచనలలో ఈ సంగీతం వినిపిస్తుంది. హరి వంశరాయ్ బచ్చన్ రచనలలో కూడా ఈ సంగీతం ఉంది. ఇక నా విషయానికి వస్తే ప్రగతివాదం, ప్రయోగవాదం ఇంకా తక్కిన వాదాలలో నాకు ఎటువంటి ఆస్థ లేదు. నేను జీవితానికి ప్రగతి కావాలని కోరుకుంటాను. ప్రయోగం ప్రగతికి సహాయంగా పని చేస్తుంది. నేను కొన్ని విశేషాలతో కూడిన ప్రగతివాదిని కాను. సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ప్రయోగవాదిని కాను. దాని పక్షాన నేను ఎప్పుడు వాదించను. జీవిత వాక్యానికి విరామ చిహ్నం పెట్టలేము. దానిని బంధించడం అంటే దాని గతికి ఆటంకం కలిగించడమే. సాహిత్యం జీవితానికి ఉపనామం అంటే మరో పేరు. మనలని సంకుచితమైన పరిధి నుండి బయటకు తీసుకు వచ్చే సాహిత్యమే శ్రేష్ఠమైనదని నా అభిప్రాయం. ఇటువంటి సాహిత్యమే మనలని విశ్వ మానవతకి దగ్గరిగా తీసుకువెళ్తుంది. ఏదైతే ఆలోచనల ప్రయోగంతో పాటు భాష, చందస్సు, లయ సంగీతం మొదలైన విషయంలో కూడా ప్రయోగం చేయగలుగుతామో అదే ప్రయోగం ఆలోచనల ప్రయోగం వదిలి వేస్తే తక్కిన ప్రయోగాలు పారిస్ రోడ్ల పైన ప్రసిద్ధి చెందుతాయి. బృందావనం అయోధ్యల గల్లీలలో కాదు. ఇక్కడ సూర్ – మీరాల తన్మయత్వాన్ని తులసీ జీవన తత్వాన్ని కోరుకుంటాము. హృదయం ఇట్లా కోరుకుటుంది –

కోయి నహీం పరాయా, మేరా ఘర్ సారా సంసార్ హై.

(నాకు పరాయి వాళ్ళు ఎవరూ లేరు, ప్రపంచం మొత్తం నా ఇల్లే.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here