[box type=’note’ fontsize=’16’] ఏం చేస్తే మనిషి మనిషిలా మిగులుతాడో కవితాత్మకంగా వివరిస్తున్నారు డా. విజయ్ కోగంటి “నీవు నీలా మిగిలివున్నట్లే” కవితలో. [/box]
ఒక ప్రేమాస్పద
పలకరింపు
ఒక వెచ్చని కదలికై
నీ గుండెను వెలిగిస్తే
ఒక ఆర్ద్ర దృశ్యం
నీ కనుల చివరన
అమ్మ స్పర్శ లాటి
చెమ్మై కదలాడితే
నీ అరచేతిలో చేయి నిలిపి
నీవు ప్రవహించాల్సిన అవసరాన్ని
తెలిపే నిజానికి
నీవో నదివయి పులకిస్తే
నీ భుజాన చేయివేసి
భరోసాని నింపుతూ
నడిపించినపుడు
నీవో పచ్చిక బయలువవగలిగితే
నీ వింకా మనిషిగా మిగిలున్నట్లే
పచ్చని నీడనిచ్చే మనసు నీలో పలవరిస్తున్నట్లే
నీ లోలోపలగా ఒక చూపు పసితనాన్ని పోగొట్టుకోనట్లే
నీవు నిజంగా నీలా బతికున్నట్లే