నేలమీద నక్షత్రం నీవే!

0
13

[శ్రీ కంచరాన భుజంగరావు రచించిన ‘నేలమీద నక్షత్రం నీవే!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]డవి మొత్తం బుగ్గిచేసి
చెట్టుకి దూరం అయ్యావు
నేల మొత్తం పిండిగొట్టి
మట్టికి భారం అయ్యావు
ఏదేదో విలాస సరంజామా
తలనిండుగా పోగుచేసుకున్నావు
ఆశల కొనలు సాగదీసుకుని
నీకు నువ్వే గాలమేసుకున్నావు
ఇప్పుడు ఎరవీ నువ్వే!
ఎరకు దొరికే కొరమీనూ నువ్వే!

నదిని మొత్తం తోడుకొని
ఎడారికి దారి పరిచావు
సముద్రాలను కుదిపి
సునామీలా దాపురించావు
అనవసర బరువులెన్నో
నెత్తినేసుకుని కూలబడ్డావు
కంటి వాంఛలను వెంబడించావు
మనో వ్యామోహాలను
విశృంఖలంగా విస్తరించుకున్నావు
భూగోళం భుజాలపై
ఖగోళమెత్తు భారాన్ని మోపి
మోయలేక నీవే కుదేలయ్యావు
ఏడు నిలువుల లోతున
నిన్ను నువ్వు ముంచేసుకున్నావు
ఇప్పుడు పీడకుడివీ నువ్వే!
పీడితుడివీ నువ్వే!

నీ చుట్టూ చిక్కుముడులన్నీ
నీకు నువ్వే అల్లేసుకున్నావు
అనుక్షణ ఆందోళనలన్నీ
అనుదిన గడ్డు పరీక్షలన్నీ
నీకు నువ్వే ఏర్పరుచుకున్నావు
పరిపూర్ణమైన స్వేచ్ఛకు
రూపం నీవేనని మర్చిపోయావు
నీ చుట్టూ ఊచలు పేర్చుకుని
నిన్ను నీవు ఖైదు చేసుకున్నావు
అవధులు లేని ప్రేమ
నీ బలమని యాదమరిచావు
నిన్ను మించిన అద్భుతం
మరేదో ఉందని అదింకెక్కడో దాగుందని
అవిశ్రాంతంగా అన్వేషిస్తున్నావు

చాలు! ఇక చాలించు! నీ వెంపర్లాట
లోయలోకి జారే పక్షియీకలా
తేలికపడు! తేలికగా తూనికపడు!
నెమ్మదిగా కళ్లుతెరువు!
అద్భుతమైన స్వరం నీది
భువనగానంలో సంలీనమై మేలుకో!
అచంచలమైన విశ్వాసం నీది
సృష్టి సర్వంతో మమేకమై సాగిపో!
వసుధ వెలుగునంతా నీలో నింపుకుని
విశ్వవీధులకు పంచే తెగువ నీది
నిత్య జాగృతితో సంచరించు!
నిలువెత్తు నక్షత్రంలా నిత్యమూ దీపించు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here