నేనే విజేత

2
10

[dropcap]చి[/dropcap]న్ననాటి నుండే ప్రతి బిడ్డా క్రీడా స్ఫూర్తితో పెరిగి పెద్దగా అవుతుంది అనుకుంది త్రిష.

‘అవును నిజమే కదా! పుడుతూనే కేరింతలను, విజయోత్సాహాలను పొందుతుంది తన వారి నుండీ. తన ఆవయవ కదలికలతో మురిపింపచేస్తుంది క్రీడా స్ఫూర్తిని కలిగి.

పారాడినా ఆనందమే. బుడి బుడి అడుగులతో నడయాడినా, పరుగులు తీస్తూ తడబడి క్రింద పడినా స్పూర్తి నిచ్చి అభినందించే ప్రతి అమ్మనాన్నలు కోరుకుంటారు తమ బిడ్డల అభివృద్ధిని గాంచాలని. మా అమ్మానాన్నలు కూడా ఏ మాత్రం తీసిపోరు’ అనుకుంటూ…

‘అబ్బ ఏమిటి ఈ రోజు మరీ ఇంతగా ఆలోచిస్తున్నాను. బహుశా మరుసటి వారం వున్న అంతర్జాతీయ పరుగుల పోటిలో చోటు దక్కింది కదా అందుకే యిలా ఆలోచిస్తున్నానేమో’ అనుకుంది తన మనసులో త్రిష.

“త్రిషా, త్రిషా రామ్మా యింకా ఎన్నిసార్లు పిలవాలమ్మా నిన్ను. నీ కోసం పళ్ల రసం తీసి వుంచాను. నువ్వేమో పలకవాయే. ఏమిటే బాబూ నీ ఆలోచనలు” అంటూ కూతురి నెత్తి మీద చిన్నగా తడుతూ అన్నది కామాక్షి.

“అమ్మా, అరవకు. నాకు చెవుడు లేదు. ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతావు? ఎప్పుడూ నీకు తిండి గోలే” అంటూ తల్లిని చూసింది త్రిష.

తల్లీ కూతుళ్ళు హాల్లోకి వచ్చి అక్కడే కూర్చున్న కమలాకర్‌ని చూశారు.

‘అమ్మో ఇద్దరూ వచ్చారు. ఇప్పుడు నా పని అయిపోయింది. కూతురికి వంత పాడుతున్నానని కామాక్షి నస. ఎప్పుడూ అమ్మ వైపే మాట్లాడుతానని త్రిష పేచీ. అడకత్తెరలో పోక చెక్కలా ఉంది నా పరిస్థితి’ అనుకుని పేపరులో తల దూర్చాడు కమలాకర్, వాళ్ళని గమనించనట్లు.

“ఎప్పుడూ మీకు పేపరే, చూడండి మీ ముద్దుల కూతురు. పొద్దుటి నుండి ఏమీ తాగలేదు, తినలేదు. మీరు ఏమీ పట్టించుకోరు” అని సణుగుతూ భర్త కమలాకర్ చేతిలో పేపర్ లాక్కుంది కామాక్షి.

“నాన్నా, అమ్మ ఎప్పుడూ అంతే. ఈ రోజు కొంచెం అలసటగా ఉంటే రెస్ట్ తీసుకుందామని పడుకోవటానికి వెళ్ళాను, అంతే. అమ్మ సంగతి నీకు తెలుసుగా. సరే, అమ్మా పండ్లరసం తీసుకురా తాగుతా” అన్నది త్రిష.

“అమ్మయ్య, ఈ పూట నా కూతురితో ఎలాగో పండ్ల రసమైనా తాగించగలుగుతాను” అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళి పండ్లరసం తెచ్చి పేరుకు గ్లాసెడు అనే గాని అదో చిన్న సైజు జగ్గులా ఉంది. తల్లి ప్రేమ మరి. కూతురు త్రాగాక చీర చెంగుతో మూతి తుడిచి ‘చిన్న పిల్ల’ అని నవ్వుకుంది కామాక్షి.

తల్లి బిడ్డల మధ్య తాత్కాలిక గొడవ ముగిసిందని ‘హమ్మయ్య ఈ రోజు నాకు గండం తప్పింది’ అని మనసులో అనుకున్నాడు కమలాకర్.

‘అయినా వాళ్ళిద్దరూ ఒకటైతే నన్నే ఒక ఆట ఆడిస్తారు. త్రిషను కడుపులో ఉండగా బాగా స్పోర్ట్స్ చానెల్స్ చూసేది కామాక్షి. అందులో నాకు కూడా ఇష్టమే. ఇద్దరం కలసి ఎంజాయ్ చేస్తూ చూసేవాళ్ళం. చిన్న పిల్లలా కేరింతలు పెట్టేది. తనే విజయం సాధించినంత ఆనందం కనిపించేది కామాక్షి కళ్ళల్లో.

అందులో కామాక్షికి పి.టి ఉష, అశ్వని నాచప్ప అంటే చాలా అభిమానం. మనకు కూతురు పుడితే ఆలాగే తర్ఫీదు ఇద్దామండీ మనం అంటూ ఉండేది కామాక్షి.

తల్లి కడుపులో ఉండి విష్ణుభగవానుని గాథలు విని పరమ భక్తుడయిన ప్రహ్లాదుడిలా, తల్లి గర్భంలో ఉండి పరుగుల పోటీలు చూస్తూ, తల్లి పెట్టే కేరింతలకు వంత పాడుతున్నదా అన్నట్లు కాళ్ళతో కామాక్షిని తన్నుతూ ఉండేదని కామాక్షి చెబుతూ ఉండేది.

పుట్టిన తరువాత ఉష పేరుకు తగ్గట్టు త్రిష అని పేరు పెడతామంటే సరే అన్నాను’ అనుకొన్నాడు కమలాకర్.

***

“అమ్మా, నేను కోచింగ్ క్లాసుకు వెళతాను” అంటున్న కూతురితో “వెళ్ళొస్తాను అనాలి అని ఎన్నిసార్లు చెప్పాను నీకు?” అంటూ బయటకు వచ్చింది కామాక్షి.

స్కూటీ మీద బయలుదేరింది త్రిష.

“ఏమిటో ఈరోజు హడావిడిగా క్లాసు టైమ్ అయిందంటూ వెళ్ళిపోయింది. రాత్రంతా చెప్పినా వినకుండా ఏవేవో మేగజైన్లు చదువుతూ వుంటుంది. పరుగుల పోటీకి సంబంధించిన ఏ విషయం తెలిసినా వదిలిపెట్టదు. ప్రతి రోజూ నేను ఎదురు రాకుండా వెళ్ళదు, ఈ రోజు ముందే వెళ్ళిపోయింది. భగవంతుడా నా బిడ్డను చల్లగా చూడు” అనుకుంటూ లోపలకు వెళ్ళింది కామాక్షి.

***

ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ అంటూ ఫోన్ రింగ్ అవుతుంటే లేచి ఫోన్ తీశాడు కమాలాకర్.

“ఏమిటీ హస్పటల్ నుంచీనా? మా పాప అని చెప్పిందా?” అంటున్న కమలాకర్ మాటలకు డైనింగ్ టేబుల్‌పై లంచ్ రెడీ చేస్తున్న కామాక్షి పరుగెత్తుకుని వచ్చింది ఒక్క అంగలో.

అప్పటికే భర్త నిశ్చేష్టుడై నిలబడటం చూసి “అసలే మీకు కంగారు” అంటూ ఫోను తీసుకుంది చేతిలోంచి కామాక్షి.

తేరుకున్న కమలాకర్, “త్వరగా పద, త్రిష స్కూటీ మీద నుంచి క్రింద పడిందట. మోకాలు చిప్ప పగిలిందట. ఆపరేషన్ చెయ్యాలట” అన్నాడు.

కళ్ళ నీళ్ళ పర్యంతం అవుతూ గబగబ బట్టలు పిల్లవి రెండు జతలు సర్దుకుని బయలు దేరింది కామాక్షి.

హాస్పటల్ మంచం మీద వున్న త్రిష తల్లిని చూచి వాటేసుకుని ఏడ్చింది. “అమ్మా, మరి నా పరుగుల పోటీ ఎలా? అమ్మా నాకు స్వర్ణపతకం ఎలా వస్తుంది?” అంటూ.

“అన్నీ తగ్గిపోతాయి ఏమీ పరవాలేదు. నువ్వు ధైర్యంగా వుండు తల్లీ. అన్నీ పతకాలూ నీకే వస్తాయి. యిప్పటి వరకూ స్కూలు స్థాయినుండీ అంతర్ జిల్లా, రాష్ట్రా, జాతీయ స్థాయిలలో కూడా నువ్వే ప్రథమంగా ఉంటున్నావు. తప్పకుండా నీకే వస్తుంది” అని ఓదార్చాడు కమలాకర్ మేకపోతు గాంభీర్యంతో.

ఆపరేషన్ ముగిసింది. సక్సెస్ అయింది. కానీ రెస్టు ఉండాలన్నారు డాక్టర్లు. వాళ్ళంద్దరూ కూడా చాలా బాధపడ్డారు. ఎంతైనా పేరున్న పిల్ల కదా, గుర్తుపట్టారు స్టాఫ్.

***

నెమ్మదిగా వాకర్ సాయంతో నడుస్తూ, ప్రయత్నిస్తున్నది త్రిష. తల్లిదండ్రులు కూడా ఎవరి సమయానుసారం వాళ్ళు త్రిషను ప్రాక్టీస్ చేయిస్తున్నారు.

మొత్తం మీద తల్లిదండ్రులు, కోచ్‌ల ప్రోత్సాహంతో తొందరగానే కోలుకుంది త్రిష.

మయూరి సుధ జైపూర్ కాలుతో ఎలా విజయపధంలో ముందుకు వెళ్ళిందో. మయూరి సినిమా చూసి స్ఫూర్తి వచ్చింది త్రిషలో.

ఆ రోజే పరుగుల పోటీ. పోటీదారులు అందరూ గ్రౌండ్‌లోకి చేరారు.

స్టార్ట్ చెప్పగానే పరుగు ప్రారంభించారు. అది పదిహేను వందల మీటర్ల పరుగుల పోటీ.

పరుగెడుతోంది త్రిష. ఒక్కసారి కళ్లు మూసుకుని గుండెల నిండా గాలి పీల్చుకొంది. తన ఆరాద్య దైవం హనుమంతుని తలుచుకుని. వాయివేగంతో పరుగెడుతున్నాను అనుకుంటోంది. అంతే కానీ అడుగు తీసి అడుగు వేయలేకపోతోంది. మోకాలు నుంచీ కాలుని ఎవరో వెనక్కు లాగేస్తున్నట్లు బాధ అయినా పరుగెత్తాలి. తన ముందు తొమ్మిది మందీ వెళ్ళి పోతున్నారు. బాధగా చూసింది వాళ్ళ వైపు  త్రిష.

ఈసారి గట్టిగా మనస్సులో అనుకుంది ‘నేనే విజేతనౌతా’ అని.

అంతే తెలియని ఉత్సాహం. ఒక్క పది నిమిషాలు కళ్ళు మూసుకుంటే చాలు అనుకుని ధైర్యంగా పళ్ళ బిగువున బాధను నొక్కి పట్టి పరుగుతీసింది.

రెండు, మూడు, నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది మందిని దాటి ముందుకు వచ్చి ‘నేనే విజేతను’ అంటూ రిబ్బన్ మీదుగా గోల్ చేరింది త్రిష.

‘నేనే విజేత’ అని పెద్దగా కేక వేస్తూ మంచం మీద నుండీ క్రింద పడింది త్రిష.

త్రిష కేకలకు భయపడి నిద్ర మంచం మీంచి లేచి వచ్చారు కామాక్షి, కమలాకర్‌లు పరుగెత్తుతూ.

క్రింద పడి కూడా పరుగెత్తున్నట్లు కాళ్ళు ఆడిస్తోన్న కూతుర్ని చూసి లేపి కూర్చోబెట్టి మంచినీళ్ళు పట్టారు.

“కళ్ళు తెరిచి చూస్తూ ఏమిటి నా కాలు కేమీ అవలేదా? అసలు నేను ఇక్కడ ఉన్నానేమిటి? నేను పోటీలకు వెళ్ళాగా?” అంటున్న కూతుర్ని అయోమయంగా చూశారు కామాక్షి, కమలాకర్‌లు.

“అమ్మో కలా! ఎంత భయంకరంగా ఉందమ్మా! నాకు నిజంగా ఆపరేషన్ అయినట్లు, నేను పరుగెత్తలేక నరకయాతన పడ్డట్టు… అమ్మో ఊహించటానికే చాలా భయంకరంగా ఉంది. మళ్ళీ తలచుకోవాలంటే చాలా భయమేస్తోందమ్మా” అని బావురుమంది త్రిష.

“నీ మొహం నీకేమీ కాలేదు. పీడకల వచ్చింది” అని కూతుర్ని దగ్గరుండి తీసుకువచ్చారు బయటకు.

“అయినా ఇరవై నాల్గు గంటలూ నీవు అదే ధ్యాసలో వుంటావు. ఆ టీ.విలో కూడా వచ్చేవన్నీ చూసి ఎక్కువ ఆలోచిస్తావు. అందుకే నీకు అలా కల వచ్చింది. బ్రష్ చేసుకుని ఫ్రెష్ అవు. ఈ పూటే నీ ప్రయాణం డిల్లీకి” అన్నాడు  కమలాకర్.

ఇంకా నమ్మబుద్ధి కావటం లేదు త్రిషకు. నిజంగానే తనకు కాలుకు ఏమయినా అయిదేమో అని స్ట్రెచస్ చేసింది. పది నిమిషాలకు బాడీ కండీషన్‌లోకి, మైండ్ కాన్‌షస్‌లోకి వచ్చాయి.

డిల్లీ చేరారు, జవహర్‌లాల్ స్టేడియంకు కోచ్‌తో కలసి త్రిష, కమలాకర్ కామాక్షిలు. షరా మామూలే. పోటీ ప్రారంభం… ఒలింపిక్ క్రీడలలో పరుగుల పోటీ. పొరుగు దేశాల వారు కూడా గట్టి పోటీదారులే అవడం గమనార్హం.

గ్రౌండ్‌లో జనాల వీక్షకుల కేరింతలు, అరుపులు – ‘త్రిషా హరీ ఆప్’ అంటూ కేకలు.

తన కల నిజమౌతున్న వేళ ఆ తల్లి కళ్ళల్లో ఆనందం. ఏరులై పొంగి పొరలుతోంది.

అందరినీ దాటుకుని త్రిష ఎప్పటిలాగే ముందుకు సాగి ప్రధమస్థానంలో నిలచింది. బంగారు పతకం అందుకుంది, అందరి ప్రశంసల నడుమ పదిహేనువందల మీటర్ల పరుగుల రాణిగా త్రిష. గ్రౌండ్ అంతా చప్పట్లు, కోలాహాలం సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. భారత దేశమంతా  పండుగ చేసుకొంది.

త్రిషకు, ఆమెను కన్న తల్లిదండ్రులకు అభినందనలతో పాటుగా అనేక బహుమతులను సొంతం చేసుకుంది త్రిష.

‘నేనే విజేత’ అని గర్వంగా శిరసు వంచి అనుకుంది నేల తల్లికి నమస్కరించి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here