నే నెక్కడి కెళ్ళానూ?

0
15

[శ్రీ సముద్రాల హరికృష్ణ రచించిన ‘నే నెక్కడి కెళ్ళానూ?’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]నే[/dropcap]నెక్కడి కెళ్ళానూ, ఇదిగో నీ ముందే ఉన్నాగా?!
ఆ నిమ్మకు నీరెత్తినట్టు, మీ గుళ్ళో దైవమట్టు!!
***
ఇదిగో ఇపుడే తారామణుల కోలాహలంలో!
అదిగో పడవ లాంటి చంద్రవంక విహారంలో!!
***
ఈ క్షణం హరి ధనువు రంగుల దొంతరలలో
ఒక్క ఊపుతో శ్వేతాశ్వపు ఆ రౌతు బీరంతో!
***
మరు లిప్త నీలిమబ్బు నీటిముత్యాల ఆటలో
మెరిసేటి కత్తి ఝళిపింపు,ఆ వియత్ప్రభలో!
***
అదె, ఆ ఆకాశగంగ దివ్య జలాభిషేకంలో
నందనవన విరిమండప సౌరభపర్వంలో!!
***
ఇక్కడ అబ్ధి ఉవ్వెత్తు అలల పడగలపై
అక్కడ నదీ సుందరి నడక బెడగులలో!!
***
ఇదె, విరిసే సుమంతో సుస్నేహ సంభాషణలో
అదె, రాలే సుమధీర, మ్రృదు సమాశ్వాసనలో!!
***
నేనొట్టి మట్టి గణపతినే, అర్థం అయిందిగా?!
ఆ నిమ్మకు నీరెత్తినట్టు, మీ గుళ్ళో దైవమట్టు!!
***
లోపలి వానరపు విశ్వ యాన విలాసమది,
ఆ పైవన్నీ, దాని కొమ్మచ్చులే, రెమ్మ ఊయలలే!!

***
నేనెక్కడి కెళ్ళాను, ఇదిగో నీ ముందే ఉన్నాగా?!
ఆ నిమ్మకు నీరెత్తినట్టు, మీ గుళ్ళో దైవమట్టు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here