‘నేను’ ను గుర్తించేందుకు మార్గం చూపే వాసిలి వసంత కుమార్ యౌగిక కావ్యం – “నేను”

0
12

[box type=’note’ fontsize=’16’] “జీవితాన్ని గెలవాలనే తపన జ్వలిస్తే, ఆ ధీ దీప్తిలో మనసు మర్మాన్ని మార్గాన్ని, ఆత్మ పథాన్ని, సంచితానుభవాలను, జీవన వలయాలను దిగంతాల ఎత్తుపల్లాలను గెలవగలిగింది ఈ ‘నేను'” అంటూ విశ్వర్షి వాసిలి రచించిన ‘నేను’ యౌగికకావ్యాన్ని సమీక్షిస్తున్నారు పాలకుర్తి రామమూర్తి. [/box]

[dropcap]క[/dropcap]వయః క్రాంత దర్శినః అంటారు. చూడడం వేరు పరిశీలించడం వేరు. అందరమూ చూస్తుంటాము.. కాని కవి లేదా కళాకారుడు చూసే పార్శ్వం వేరుగా ఉంటుంది. రాగద్వేషాల మధ్య బంధితుడైన వాని చూపుకు ఒక తాత్వికుని చూపుకు భేదం ఉంటుంది. “ఉన్నది ఉన్నట్లుగా” చూడడం నేర్చుకుంటే, పరిశీలించడం నేర్చుకుంటే ఎన్ని భావనలు మనలో ఆనందానికి బీజం వేస్తాయో…

ప్రపంచంలో మనుషులందరికీ భగవంతుడు అనుగ్రహించినది ఒక్కటే జీవితం. దీనికి స్టెఫినీ ఉండదు. ప్రయాణము చేసినంత సమయమూ చాలా జాగ్రత్తగా ఈ బండిని నడపాలి… గమ్యస్థానాన్ని చేరే ప్రయత్నం చేయాలి.

ఆనందవర్ధనుడు “అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి” అనడం, మమ్మటుడు కవిసృష్టి బ్రహ్మసృష్టిని కూడా మించినదని వర్ణించడం, “నానృషి: కురుతే కావ్యమ్” అని భట్టతౌతుడు చెప్పడం – వీటిని బట్టి చూస్తే లాక్షణికులు కవిని ప్రజాపతిగాను, కవితను సృష్టిగాను భావించినట్లుగా భావించాలి.

ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ కవి మనలను ఒక అంతరం నుండి మరొక అంతరం వైపు నడిపిస్తున్న భావన. పోతనగారు వామన చరిత్రలో చెప్పిన ఒక పద్యం గుర్తుకు వస్తుంది. వామనుడు త్రివిక్రముడైన విధానాన్ని పోతనగారు చెపితే విశ్వర్షి గారు తన కవితా మార్గంలో యోగ భూమికలో ఎదిగిన వైనం కనిపిస్తుంది.

పోతనగారి పద్యంలో ఇంతగా (చిన్నగా) ఉన్న వటువు అంత అయినాడు. అంటే కొంచెం పెరిగాడు. మళ్ళీ అంత అయినాడు. ఆకాశమార్గాన అంతవాడుగా కనిపించాడు. ఆ తరువాత మేఘమండలం దగ్గరగా వచ్చాడు. ఆపై కాంతివలయాన్ని దాటి, చంద్రుని దాటిపోయి, ధ్రువనక్షత్ర మండలాన్ని దాటిపోయి, మహాలోకాన్ని దాటి, బ్రహ్మస్థానమైన సత్యలోకాన్ని కూడా మించిపోయి, బ్రహ్మాండాన్ని అంతా ఆక్రమించునట్లు పెరిగిపోయినాడు. ఆకాశవీది, మేఘమండలం, కాంతిమండలం, ఆపై ధ్రువమండలం, మహర్లోకం, సత్యలోకం, ఆ పై విష్ణుస్థానం. సామాన్య మానవులకు అగోచరమైన లోకాల ఆరోహణాక్రమాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన ద్రష్ట, పోతన. ఆయన క్రాంత దర్శకుడు కాకపోతే ఈ ఖగోళరహస్యాలు ఆయనకు ఎలా అవగత మౌతావి.

‘ఇంతింతై, తానింతై, అంతై, అల్లన్తై, ఆపై అంతై’ అనే పదప్రయోగాలు ఆరోహణాక్రమాన్ని సూచిస్తూ, వామనుడు పెరిగిపోయిన విధానం కళ్ళకుకట్టినట్లు చూపింప బడింది. విశ్వర్షి గారి రచనలో “నేను” పెరిగిన, తిరిగిన వైనం చెప్ప డమూ నాలాంటి వానికి సాధ్యపడనిది.

అనాదిగా మానవునిలో తన మూలాలను తెలుసుకోవాలనే ఆరాటం, తపన, జిజ్ఞాస, అన్వేషణ. అదే సృష్టి తత్వాన్ని గ్రహించేందుకు మార్గం చూపింది.

కింకారణం బ్రహ్మ కుతఃస్మ జాతా, జీవేమ కేన క్వచ సంప్రతిష్ఠాః

అధిష్ఠితాః కేన సుఖేతరేషు, వర్తామహే బ్రహ్మ విదో వ్యవస్థామ్!

తాను ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు, ఎక్కడికి వెళతాడో తెలియదు… ఎందుకు జీవించాలో తెలియదు… ఇక్కడి రాకకు కారణం ఏమిటి తెలియదు? ఈ సృష్టిని నియమించిన వారెవరైనా ఉన్నారా? ఉంటే ఎవరతను? తెలియదు. (శ్వేతాశ్వతరోపనిషత్తు)… ఈ తపన తపస్సుగా మారడం వల్ల కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకో గలిగాడు…. ఈ సృష్టికి మూలాన్ని తెలుసుకునే క్రమంలో……

“సమిథున ముత్పాదయతే రయించ ప్రాణంచేతి” ముందుగా సృష్టి కర్త పదార్ధము శక్తి అనే జంటను ఉతత్తి చేసాడట. “ఆదిత్యోహవై ప్రాణో, రయిరేవ చంద్రమా, రయిర్వా ఏతత్సర్వం యన్మూర్తంచా మూర్తంచ, తస్మాన్మూర్తిరేవ రయిః” సూర్యుడే శక్తి, చంద్రుడే పదార్ధము లేదా ఇదంతా సాకారమూ, నిరాకారము (పదార్ధము సాకారము, శక్తి నిరాకారము). పదార్ధంలో ఉండేది శక్తి, శక్తికి ఆశ్రయమిచ్చి, ఆకారాన్నిచ్చేది పదార్ధము. చంద్రుడు సూర్యుని వెలుగు చేత ప్రకాశితుడైనట్లుగా పదార్ధము శక్తిద్వారా ప్రకటితమౌతుంది. స్థూలమైనది, స్థలాన్ని ఆక్రమించేది పదార్ధంగా చెప్పబడుతుంది. (ప్రశ్నోపనిషత్తు)… ఇలా కొన్ని సమాధానాలను ఆవిష్కరించుకో గలిగాడు. అయితే అవి సత్యాలా? ప్రాచీన ఋషులు, యోగులు, మునులు తాము దర్శించిన దర్శనాలను అక్షరబద్ధం చేసారు. ఆ అక్షరాలను చదవడం వల్ల “అక్షర” జ్ఞానం వస్తుందేమో కాని అనుభవ జ్ఞానం రాదు. పంచభక్ష్య పరమాన్నాలను విస్తరిలో వడ్డించి ఫోటో తీసి మనముందుంచితే మన ఆకలి తీరదు. అలాగే నిరంతరం తెలుసుకున్న దానిని అభ్యసించడం ఆచరణాత్మకంగా మలుచుకోవడం వల్ల మాత్రమే ఆ సత్యాన్ని శోధించ గలుగుతాము… ఆనందాన్ని అనుభవించ గలుగుతాము. జీవితమూ సాఫల్యమౌతుంది.

భౌతిక స్థాయిలో ఆకృతిని చూస్తాము. మానసిక స్థాయిలో భావోద్వేగాలను అవగాహన చేసుకుంటాము. ఆలోచనల స్థాయిలో బుద్ధి వికసిస్తుంది, పరిణతి చెందుతుంది. చైతన్యస్థాయిలో సత్యదర్శనం కలుగుతుంది. దానికి ముందుగా కావలసిన ప్రాతిపదిక శాంతిని పొందడం.

శాంతిని పొందాలనే తపన ప్రతి వ్యక్తికీ సహజమే.. శాంతి ఎక్కడ.. ఎలా? మనసు యొక్క సమస్థితి శాంతి. మనసు యొక్క సమదృష్టి శాంతి, మనసు యొక్క నిశ్చల స్థితి శాంతి, మనసు యొక్క నిశ్శబ్ద స్థితి శాంతి. శాంతి పొందిన మనసు సాక్షీభూతంగా నిలుస్తుంది. ఇప్పుడు ఎలా అనేది మరొక ప్రశ్న. యోగం అనేదే జవాబు. ఒత్తిడి నుండి ఒత్తిడిని జయించే విధానం యోగం యొక్క లక్షణం.. లక్ష్యం కూడా. ఆ మనస్సు అప్పుడు మూలాలను అర్థం చేసుకోగలుగుతుంది.

ఎందరో యోగులు వివిధ ప్రక్రియల ద్వారా సత్యాన్ని ప్రత్యక్షానుభవం లోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేసారు. సఫలీకృతులయ్యారనే చెప్పాలి. అలాగే వారి దర్శనానుభవాన్ని కవితా రూపంలో అందించారు. అవే ఉపనిషత్తులు… దర్శనాల లాంటి సాహిత్యంగా సాధకుల సందేహాలను తీరుస్తూ ముందుకు సాగేందుకు ప్రేరణ నిస్తుంది. ఆ క్రమంలోనే విశ్వర్షి శ్రీ వాసిలి వసంత కుమార్ గారి “నేను” యౌగిక కావ్యం వెలుగు చూసింది.

వీరి తండ్రి శ్రీ “శార్వరి” గారు యోగ సాధనలో తమ జీవితాన్ని తరింప చేసుకున్నవారు. పలు గ్రంథాలను రచించి జిజ్ఞాసువుల సందేహాలను తీర్చిన వారు. వారసత్వంగా తమకు అందిన ఆ యోగ సంపదను తామనుభవిస్తూ.. ఇతరులతో పంచుకుంటున్న శ్రీ విశ్వర్షి గారు… తన “నేను” ద్వారా దీర్ఘ కవితా “విశ్వ రూపాన్ని” ప్రకటించారు. అధీతి బోధ అవగతం ప్రచారం ఈ నాలుగూ విజ్ఞానాన్ని వ్యాప్తం చేసే మార్గాలు. అధీతి బోధ వల్ల శోధన సంతృప్తమై, సాధన వల్ల పరిణతి చెందిన విజ్ఞానం బోధన వల్ల ప్రచారమవుతుంది. అదే అర్హుల దాహార్తి తీరుస్తుంది.

అన్నీ “నేనే” అంటాడు పరమాత్మ, భగవద్గీతలో. ఆ “నేను” ఏమిటి? కన్ను ఉన్నది.. వెలుగు ఉంది. వెలుగును చూడాలి అంటే కన్ను కన్నుగా చూడలేదు. దానికి చూచే శక్తి కావాలి. ఆ చూచే శక్తియే “నేను”. ఆ శక్తి లేని నాడు కన్ను ఉండీ ప్రయోజనం లేదు, వెలుగు ఉండీ ఉపయోగం లేదు. ఆ “నేను” ను గుర్తించేందుకు మార్గం చూపేదే.. వాసిలి గారి ఈ “నేను”.

జీవితానికి ఒక లక్ష్యం ఉండాలంటారు. లక్ష్యం అంటే ఏమిటి? తెలిసిన దానికి, సమున్నతమైన ఊహను జోడించి, విస్తరించి దానిని దర్శించి సాధించేందుకు ప్రేరణను పొందేది, లక్ష్యం. వ్యాప్తమైన లక్ష్యాన్ని సాధించే క్రమంలో వీరి కవిత పరిణామం నుండి ఆరంభమై, ప్రమోదంతో ప్రమాణం చేస్తూ సాగే ప్రస్థానపథంలో ప్రయోగాలు ప్రవిమలములై పరమ పథాన్ని చేర్చాయి. ఇది ఒక సాధకుని సాధనలోని ఆరోహణా క్రమం. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా పరిణామం చెందినట్లుగా, సాధకుడు తన ఆలోచనలలో “పరిణామం” చెందాలి. చేస్తున్న సాధనలో ఆనందాన్ని పొందాలి. అది ఒక ఉత్సవంగా భావించాలే కాని శిక్షగా భావించ వద్దు. ఆ ప్రస్థానంలో ఎన్నో అవరోధాలు ఎదురవవచ్చు. తాను చేసే ప్రతి ప్రయత్నమూ విఫలం కావచ్చు. అయినా వాటి నుండి పాఠాలు నేర్చుకుంటూ, సరి దిద్దుకుంటూ… ముందుకు సాగితే… అవే ప్రవిమల మార్గాలై పరమ పథానికి తీసుకు వెళతాయి. వ్యష్టిని సమష్టిగా ఆవిష్కరించ గలిగే చైతన్య శక్తి వాసిలి గారి దహరాకాశంలో అక్షయ్యంగా నిలిచి అక్షర దీప్తిని ప్రకాశనం చేసింది కాబట్టే.. అపురూపమైన దీర్ఘ కవిత గంగా ఝరియై ప్రవహించింది.

యోగః సుకౌశలం అంటారు. ఒక చిన్న విత్తనంలో అనంత వృక్షంగా పరిణతి చెందే సామర్ధ్యం నిబిడీకృతమై ఉన్నది. అలాగే అనంతమైన చైతన్యం పరిమితత్వంలో ఒదిగిపోతుంది. పొందదగినది యోగం. నిరంతర జీవన పరిణామ క్రమంలో ఏకంగా ఉన్న “నిత్య చైతన్యం” ద్వైతమై అనేకమై అక్షయమై అక్షరమై విశ్వవిశ్వాంతరాలలో వ్యాప్తమై, నేనుగా ఎదిగి అణువుగా ఒదిగి పోయే సమయంలో చావు పుట్టుకల మూలమే భయరహితమైన నేనుగా హంసయై విహరిస్తుంది.

నేనే బిందువు, నేనే సింధువు, నేనే విశ్వం, విశ్వమే నేను…. కేంద్రం నేనే వృత్తం నేనే… పంచభూతాల మూలమూ నేనే… అదే చీకటి అదే వెలుగు… అదే అజ్ఞానం అదే జ్ఞానముగా రూపాలు మార్చుకుంటూ మన ముందు నర్తిస్తుంటే… ఆ భ్రాంతితో వీక్షిస్తున్న నాలోని వెలుగు అంతర్వీక్షణను జాగృతం చేస్తుంది… అదే యోగం.

విశ్వర్షి గారు ఒకప్పటి గురుశిష్య బంధం చూచారు. కామాదులకు చలించని ఋషుల సాంగత్యాన్ని పొందారు. ధర్మాన్ని మథించి బోధించిన విజ్ఞానినీ పలకరించారు, ఆత్మీయుల మధ్య సాగిన ఆధిపత్య పోరుకు నిలువెత్తు సాక్షిగా నిలిచిన నిరీహుని పరామర్శ చేసారు. జ్ఞానార్తుల దాహార్తిని తీర్చిన దార్శనికులను మాటలు విన్నారు, అచలాగ్నిని చూచారు, మానస సరోవరంలో హంసలా విహరించారు, పరమహంసల యోగానందాన్ని ఆస్వాదించారు, వివేక సిద్ధిని పొందిన వారి సేవలో తరించారు… మౌన ప్రయాణంలో “శార్వరి” ఉత్సుంగాగ్రంపై రమించారు…. యౌగిక అక్షరంగా అక్షయమైన స్థానంలో సుప్రతిష్ఠులయ్యారు.

సప్తవర్ణాల చిత్తరువులలో, ఇంద్రచాప విలాసాలలో భూతాత్విక మనోల్లాసాలలో లాలిత్యంగా సల్లాపాలాడుతూ… విహంగమై కదిలారు… అనంతత్వంవైపు పయనించే లక్ష్యంతో…

ఒక పక్షి గుడ్డులో ఉన్నంత వరకు అదే ప్రపంచమనుకుంటుంది. గుడ్డు పగిలి కొద్దిగా తల బయటకు పెట్టి చూచి పరిసరాలను పరికించి అబ్బో ఇదా ప్రపంచం అనుకుంటుంది. మొత్తంగా బయటకు వచ్చి చుట్టూ చూచి ఆశ్చర్య పడుతుంది… తానింత పెద్ద ప్రపంచాన్ని ఎందుకిప్పటిదాకా చూడలేదని. రెక్కలల్లార్చి పైకెగిరి చెట్టు కొమ్మపై నుండి చూస్తే ప్రపంచపు ఎల్లలు కనిపించక… ఆశ్చర్యం ఆనందం… పొందుతూ… ఉత్సాహంతో, సాహసంతో, ధైర్యంతో, శక్తి సామర్ధ్యాలను కూడదీసుకుంటూ.. అనంతంలోకి పయనించే ప్రయత్నం చేస్తుంది… పంచభూతాలకు అతిథిగా ఆకాశిక ప్రకృతికి ఆతిథ్యాన్నిస్తూ … పయనిస్తున్న ఆ పక్షికి ప్రతీకయే ఈ యౌగిక కావ్యం…”నేను”

తొలి శ్వాస, తుది శ్వాసలు మన చేతిలో లేనివే. మధ్య దేనిని కోరుతున్నాము. ఇంద్రియ భోగాలనా… ఇంద్రియాతీత భోగాలనా? ఇది సామాన్యుఅల ప్రశ్న… ఏదో ఒకటి కోరేదీ సామాన్యులే.. కాని ఈ రెంటికీ భేదం లేదనే సత్యాన్ని గుర్తించింది, ఈ యౌగిక “నేను”. అందుకే దీనిది త్రికాలాలకు, త్రిసంధ్యలకు, పంచభూతాలకు అతీతమైన మహా ప్రస్థానమయింది. విశ్వవేదిక పైన కాలవేదిక అయింది. సృష్టి వేదికకు మూలమయింది.

పరతంత్రాన్ని అధిగమించి స్వతంత్రతను ఆశ్రయించి పరస్పరాధారితమై, స్థూల సూక్ష్మ కారణ మహా కారణ శరీరాలను త్యజించి ఆద్యంత రహిత జీవన యోగంలో, యోగ జీవనం సాగిస్తూ.. అంతర్గతపు సత్వమై, రజస్సై, తమస్సై, సత్యమై, నిత్యమై సౌభాగ్య సీమయై, సౌశీల్య సంపదయై… ఏకత్వాన్ని అన్వేషించి, శార్వరీయ యోగానుభవ యామినిలో అమృతమయిగా రస సిద్ధిని పొందింది ఈ “నేను”.

ఆద్యము అఖండమూ, అచలమూ, అనంతమూ నైన కాల స్వరూపంలో క్రాంతిని, కాంతిని దర్శించే “లో చూఫు”కు అందిన యవనిక పైన విశ్రాంతిని, విముక్తిని కోరే మహదాశయం ఈ “నేను”ది.

ఆకార నిరాకారాలకు, పదార్ధ పరమార్ధాలకు, అంధకార ప్రకాశాలకు, అనంత విశ్వ చైతన్యానికి, జీవగోళానికి, కాలానికి సాక్షిగా, భూగోళానికి అతిథిగా, స్వర్గ నరక లోకాలకు అభ్యాగతునిగా, ప్రకృతిగా పురుషునిగా, వృత్తిగా ప్రవృత్తిగా, అస్తిత్వానికి, అంతస్తత్వానికి ప్రతీకగా ఎదిగి, ఒదిగి, నేర్చి, నేర్పి, కదలాడి, కరిగిపోయి విశ్వవిజేతయై తనను తాను ప్రకటించుకున్నది “నేను”.

జీవితాన్ని గెలవాలనే తపన జ్వలిస్తే, ఆ ధీ దీప్తిలో మనసు మర్మాన్ని మార్గాన్ని, ఆత్మ పథాన్ని, సంచితానుభవాలను, జీవన వలయాలను దిగంతాల ఎత్తుపల్లాలను గెలవగలిగింది ఈ “నేను”. ఆ గెలుపు విజయంగా ప్రవిమలత్వాన్ని ప్రసాదించింది.

కాంతి వేగానికి వరసత్వానికి వారసత్వమై, కాల యాన ఆంతర్యంలో విధియై, సంకల్పమనే కణ విస్ఫోటనంలో లయగా మారి, చైతన్య విభవానికి భూమికయై, పరివేదన, పరిశోధనల వల్లరిలో క్రాంతిని దర్శిస్తూ, స్థిత ధ్యానియై, కర్తృత్వ భావనలకు దూరంగా, చెదరిన పరిమితులలో, అంతరంగ లోతులను తడిమినది ఈ “నేను”.

ఉదయించిన వివేకం చూడామణిగా సౌందర్యలహరియై, నిశ్చలానంద విభూతిలో ఆనందలహరియై, అంతటా తానైన చైతన్యలహరియై ప్రభవించింది, ప్రసరించింది, ప్రశమించింది, ప్రభావమయింది, ప్రభూతమయింది… మహత్తును దర్శించి, స్పృశించి, రసావిర్భూతిలో మమేకమై, రాసక్రీడలో శివమై, మంగళమై, కుండలి నుండి సహస్రారం వరకు గమించే జాగృత సర్పమై, స్వక్షేత్ర సుక్షేత్రాన్ని స్వాత్మ క్షేత్రంగా మలుచుకున్న నిశ్శబ్దంలో శబ్దమై భాసించింది ఈ “నేను”.

కనిపించేదీ, కనిపించనిదీ, చూచేదీ, చూడబడేదీ, ఆలోకనా శక్తీ, ఆలోచనా శక్తీ, జ్ఞాత, జ్ఞేయమూ, జ్ఞానమూ అన్నీ తనే అయి అన్ని పరిమితులకూ అతీతంగా షట్చక్రాలలో, జాగృత్ స్వప్న సుషిప్తి, తురీయాదులలో… అన్నింటిలో.. అన్నింటికీ అతీతంగా ప్రకటితమైనదీ అప్రకటితమైనదీ ఒక్కటే. అదే ఆ “నేను”.

కాలంలో ఏది ఆరంభమయిందో అది కాలంలోనే అంతం కావాలి. ఇది ప్రకృతి నియమం. “నేను” అనే దానికి మరణం లేదు అనుకుంటే… ఈ “నేను” కాలానికి అనాది. అంటే మన జీవితానికి ముందు ఉన్నది… మనతోనూ ఉంటున్నది, తదుపరి ఉంటుంది.

నేను ఆ “నేను”నే  ఈ “నేను”లో అర్థం చేసుకునే ప్రయత్నం చేసాను.

ఫలితాలు భౌతికస్థమైనవి. బంధుత్వాలు మానసిక అంతరాలలో జరిగేవి. సత్య దర్శన ఆలోచన స్థాయిలో ఆవిష్కృతం అవుతుంది. సాక్షాత్కారం ఆత్మ చైతన్య స్థాయిలో జరిగేది… నేను అర్థం చేసుకున్న మేరకు విశ్వర్షి గారి “నేను”ఈ స్థాయిలన్నింటినీ దాటి ఆవలి తీరాన్ని దర్శించిందని భావిస్తున్నాను.

లోకంబులు, లోకేశులు

లోకస్థులు తెగిన తుది నలోకంబౌ పెం

జీకటి కావల నెవ్వం

డేకాకృతి వెలుగు నతని నే సేవింతున్!

అన్న పోతనగారికి నమస్కరిస్తూ… అక్షరము మాత్రమే అయిన ఆ భావానికి మార్గం చూపి తాను ఆ మార్గంలో నడుస్తూ… తన నాశ్రయించిన వారిని నడిపిస్తున్న విశ్వర్షి శ్రీ వాసిలి గారికి నమస్సులు… నా దర్శనంలో నేనును నేనెంత వరకు అర్థం చేసుకున్నానో నాకే తెలియని స్థితిలో ఆత్మ గత భావాన్ని పంచుకునే సాహసం చేసాను.

–  పాలకుర్తి రామమూర్తి

***

నేను (దీర్ఘ కవిత)
రచన: విశ్వర్షి వాసిలి
వెల: రూ.150.
పుటలు: 240
ప్రతులకు:
యోగాలయ, ప్లాట్ 90,
కృష్ణా ఎన్‌క్లేవ్,
ఎం.డి. ఫామ్ రోడ్,
తిరుమలగిరి, సికిందరాబాద్- 500 015
9393933946

****

 

A note on webinar –

తెలుగులో తొలి యౌగికకావ్యంగా వివిధ సాహిత్య వర్గాలను ఆకట్టుకుంటున్న విశ్వర్షి వాసిలి “నేను” దీర్ఘకవితపై హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సెప్టెంబర్ 5, 2020 శనివారంనాడు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా “తెలుగు సాహిత్యం – తొలి యౌగికకావ్యం ‘నేను'” పేరిట అంతర్జాల అంతర్జాతీయ సమాలోచనా సదస్సును మధ్యాహ్నం 2 గం.ల నుండి సాయంత్రం 6 గం.ల వరకు నిర్వహించనుంది. ఈ సదస్సులో పరిశోధనే ప్రాణంగా పరిగణించే ఆచార్య వేటూరి ఆనందమూర్తి ప్రారంభోపన్యాస పత్రసమర్పణ చేస్తారు. వీరితోపాటు ఆచార్యులు అరుణకుమారి, పులికొండ సుబ్బాచారి,  దేవారెడ్డి విజయలక్ష్మి, దార్ల వెంకటేశ్వరరావు,  మాడభూషి సంపత్కుమార్, బూదాటి వెంకటేశ్వర్లు, డా. విజయభాస్కర్, డా. అరుణ నారదభట్ల, డా. పెరుగు రామకృష్ణ, అమెరికా నుండి నేమాని సోమయాజులు, డొక్కా రామశర్మ‌ వంటి పలువురు సాహిత్య ప్రముఖులు పత్రసమర్పణ చేస్తొరు. సదస్సుకు సమర్పించిన పత్రాలతో పాటు, తొలి యౌగికకావ్యంపై వచ్చిన పరిశోధాత్మక, విమర్శనాత్మక, సమీక్షాత్మక వ్యాసాలను కలుపుకుని ఒక సంకలనాన్ని సమాపనోత్సవంలో ఆవిష్కరించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here