నేను.. కస్తూర్‌ని -1

1
9

[వృత్తి రీత్యా వైద్యులైన డా. ఎచ్. ఎస్. అనుపమా కన్నడంలో రచించిన జీవితకథని శ్రీ చందకచర్ల రమేశ బాబు అనువదించి ‘నేను.. కస్తూర్‌ని’ అనే పేరుతో సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నారు.]

ఒక చరిత్ర స్వరం

[ప్రముఖ రచయిత్రి ఓల్గా గారి ముందుమాట]

[dropcap]‘నే[/dropcap]ను కస్తూర్‌ని’ – ఈ పుస్తకం చదవడానికి చేతిలో తీసుకున్నప్పుడు నాకు పెద్ద కుతూహలం కానీ, ఆసక్తి గానీ లేదు. మనకు తెలిసిన గాంధీ జీవితాన్ని కస్తూర్ బా నోట్లోంచి చెప్పించడమే గదా అనుకున్నాను. ముందుగా అనుపమ రాసిన ముందుమాట శీర్షిక చూసి కొంత ఆసక్తి కలిగింది. ‘రావి అరుగు-వేపచెట్టు’ అని చదవడం మొదలు పెట్టిన తర్వాత నాకు క్రమంగా అర్థమవుతూ వచ్చింది, ఈ పుస్తకం సాధారణమైనది కాదని. అనుపమ ఈ పుస్తకం కోసం చేసిన కృషి కూడా సాధారణమైనది కాదు. అంత కృషి చేసిన, చేస్తున్న అనుపమ అంటే కస్తూర్‌కి ఎంతో ప్రేమ కలిగి ఉండాలి. అనుపమ దగ్గరగా కూచుని కస్తూర్ బా చెప్పిన మాటలను అక్షరబద్ధం చేయటం తప్ప అనుపమ చేసిందేం లేదు. కానీ కస్తూర్ బా ను పొందాలంటే ఎంత దీక్ష కావాలో, శ్రమ పడాలో అంతా అనుపమ చేసింది. సాక్షాత్కారం జరిగిన తర్వాత కథ సులభంగానే నడిచి ఉండొచ్చు.

చరిత్రలో భర్తననుసరించిన భార్యలు ఉన్నారు. ఆంద్రదేశంలో వీరేశలింగం పంతులు- రాజ్యలక్ష్మి, మహారాష్ట్రలో జ్యోతిబా ఫూలే-సావిత్రిబాయి ఫూలే, ఉన్నవ దంపతులు, పుచ్చలపల్లి దంపతులు ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. వీరందరినీ పతిని అనుసరించిన వారిగా మాత్రమే చూసే ధోరణే ఎక్కువ ప్రచారంలో ఉంది. అది సరైనదేనా? ఈ స్త్రీలలో ఒక కర్తృత్వ ఆకాంక్ష లేకపోతే వారి జీవితాలు మరొక విధంగా సాగే అవకాశం లేదా? ఆ కర్తృత్వ ఆకాంక్షకు మనం ఎంత విలువ ఇవ్వాలి? అది ఆనాటి సామాజిక వాతావరణంలో ఒక సాహసమే కదా! ఆ సాహసాన్ని కేవలం పతిననుసరించటం అనే మాటతో తేలిక చేయడం తగినదేనా? ఈ స్త్రీలు పతి వెనకాల దాగి రక్షణ పొందలేదు. బంధుమిత్రుల నుండీ, సమాజం నుండీ తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. తట్టుకుని నిలబడ్డారు. తమ చుట్టూ ఒక కొత్త సమాజాన్నీ, బంధుమిత్రులను ఏర్పరచుకున్నారు. అది మామూలు విషయం కాదు. పబ్లిక్, ప్రపంచం, లేదా పురుష ప్రధానమైన రాజకీయ ప్రపంచలోకి, ప్రైవేట్ ప్రపంచంగా ఉన్న కుటుంబ విలువలను, ఆ పనులను తెచ్చి ఘర్షణ పడ్డారు. ఆ రెండు ప్రపంచాలు ‘పరస్పరం సంఘర్షించిన’ సమయాలలోనే కొత్త ఆలోచనలు, కొత్త దారులు ఏర్పడ్డాయి. ఆ దారులను, ఆలోచనలను సమాజం సహజంగానే నిర్లక్ష్యం చేస్తుంది. ఆ నిర్లక్ష్యాన్నుంచి బైట పడవేసి చరిత్రను భిన్నంగా నిర్మించుకోవలసిన అవసరం వర్తమానంలోని స్త్రీ పురుషుల బాధ్యత. అనుపమ ఆ బాధ్యతను చాలా గొప్పగా నెరవేర్చారు.

గాంధీ వంటి సత్యసంధుడు, నిరంతరం ప్రపంచాన్నీ, తన అంతరంగాన్నీశోధించుకునే తాత్త్వికుడు, సామాన్య ప్రజల క్షేమం కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం రాజకీయ వ్యూహాలు రచించగల నాయకుడు, మొండివాడు, మూర్ఖుడు అయిన వాడితో జీవిత ప్రయాణం సాగించడం కస్తూర్ బా కు తప్పనిసరి బాధ్యత అయిందా? ఇష్టమైన కర్తవ్యం అయిందా? ఇష్టము, తప్పనిసరితనమూ కలహించుకుని చివరకు రాజీ పడ్డాయా? ఆ అంతరంగ కల్లోలాన్ని పట్టుకోవడం అనభవించిన వారికి కూడా ఒక్కోసారి సాధ్యం కాదు. అందులోపడి కొట్టుకు పోవడమే చాలాసార్లు జరుగుతుంది. కస్తూర్ బా నిలదొక్కుకోగలిగిందనీ, తన అంతరంగ కల్లోలాన్నేకాక గాంధీ అంతరంగ కల్లోలాన్ని కూడా పట్టుకోగలిగిందనీ మనకు అనుపమ, కస్తూర్ బా మాటల ద్వారా చేతల ద్వారా అర్థం చేయించారు. ఈ పుస్తకంలో చరిత్రనుండి పక్కకు జరగలేదు. జరిగే వీలు కూడా లేదు. గాంధీ జీవితం అంతా బహిరంగమే. చరిత్రగా రికార్డయి ఉన్న ఆధారాలతోనే, ఆ సాక్ష్యాలతోనే కొత్త చరిత్రను రచించటమెలాగో అనుపమ తెలుసుకుంది. స్థూల దృష్టికి అందని సూక్ష్మ విశేషాలను చూడటం, ఆ సూక్ష్మార్థాలను గ్రహించడం, వాటిని ఓపికగా, ఆసక్తికరంగా చెప్పడం ఎలాగో ఈ పుస్తకం చదివి తెలుసుకోవచ్చు. స్థూల కథ తెలిసినదే. అందువల్ల, తక్కువ సమయంలో సూక్ష్మాంశాల వద్దకు పాఠకులను తీసుకెళ్ళవచ్చు. కానీ సూక్ష్మాంగాలలోని గంభీరతనూ, ప్రాముఖ్యాన్నీ అర్థం చేయించడం తేలిక పని కాదు. అనుపమ పడిన కష్టం మనకు తెలియదు గానీ పాఠకులు సులువుగా వాటిని గ్రహించగలుగుతారు.

భార్య, కోడలు, తల్లి ఇవి వాటంతటవి ప్రతివారికీ కత్తి మీద సాము అనిపించే పాత్రలే. కానీ గాంధీకి భార్యగా ఉండటమంటే నిప్పులతో స్నానం చేయటమే అనిపిస్తుంది. కస్తూర్ బా ను వింటుంటే హరిలాల్ తల్లిగా ఉండటమంటే తన పేగులు తనే చీల్చుకున్నప్పటి బాధానుభవమనిపిస్తుంది. వీటిని నిభాయించుకోవటానికి చేసిన యుద్ధమంతటినీ కస్తూర్ బా సరళంగా, శాంతంగా, ఒక్కో చోట కన్నీరు వచ్చినా మన కంట పడకుండా తుడుచుకుంటూ చెప్పిన తీరుకి మాధ్యమంగా నిలిచిన అనుపమను ఎంత అభినందించినా చాలదనిపిస్తుంది. గాంధీ, కస్తూర్ బా లు తమ జీవితాలను ఎంతో మార్చుకున్నారు. మార్పు గురించిన ఆలోచన గాంధీదైతే, ఆచరణ ఇద్దరిదీ. ఐతే గాంధీ చెప్పిన మాటనల్లా వెంటనే విని ఆచరణలో పెట్టగలిగినంత విధేయురాలు కాదు కస్తూర్ బా. ప్రశ్నించడం, బైటి ప్రపంచం గురించి చెప్పటం, గాంధీ చెప్పినదంతా తాను చేయగలదా లేదా అని విచారించుకుని చేయగలిగినవే చేయటం, ఇది కస్తూర్ బా స్వభావం. కొన్నిపనులు తనకు ఇష్టం లేకున్నా చేసింది. చేయక తప్పని పరిస్థితుల ఒత్తిడిని గ్రహించింది. కస్తూర్ బా జీవితంలో వచ్చిన పెద్ద మార్పు న్యాయాన్యాయాల వివేచన చేయగలగటం. అన్యాయాన్ని వీలైనంత ఎదిరించాలని నిర్ణయించుకోవటం. దీనికి గాంధీ పరిచయం చేసిన దక్షిణ ఆఫ్రికా జీవితం, అక్కడ భారతీయుల మీద జరిగే హింస, నిర్బంధాలు, నిషేధాలు కారణం. కస్తూర్ బా తనంత తాను అన్యాయానికి కోపంతో రగిలిపోయి అధికారాన్నిధిక్కరించి జైలుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నది తనలాంటి స్త్రీల కోసమే. వారి గౌరవ మర్యాదలను కాపాడటం కోసమే. తన కోసమో తనవంటివారి కోసమో గొంతెత్తటం నేర్చుకున్న తర్వాత ఆ గొంతు, ఆ మనసు, అనేక అన్యాయాల గురించి ఆలోచించి మాట్లాడాయి. సామూహిక జీవితమైన ఆశ్రమ జీవితంలో కస్తూర్ బా ఇమిడిపోయిన విధం ఆశ్చర్యపరుస్తుంది. అక్కడ విద్యావంతులు, పామరులు, అన్ని జాతులవారు, మతాల వారు ఉంటే, వారందరితో కలిసి, వారి శక్తులను, పరిమితులను అర్థం చేసుకుంటూ అందరి గౌరాభిమానాలను పొందిన కస్తూర్ బా మాటల్లో ఇంత గంభీరతలు ఎలా వచ్చాయో మనం తేలికగా గ్రహించగలుగుతాం. ఆమెకు కోపం వచ్చిన సందర్భాలు, దుఃఖం కలిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఐతే ఆ కోపాన్ని ఎప్పుడు ప్రకటించాలి, ఆ దుఃఖాన్ని ఎలా అదుపు చేసుకోవాలి అనే విచక్షణ కస్తూర్ బా కు ఉన్నది. అది కొంత స్వభావం కావచ్చు. కొంత పరిస్థితులు నేర్పి ఉండవచ్చు. గాంధీ ఏదైనా కొత్త విషయం ఆలోచించి, ఆచరణలో పెట్టే ముందు చాలా మథనపడతాడు. అంతర్మథనం సాగుతుంది ఆయనలో. కస్తూర్ బా కు ఆ వెసులుబాటు చాలాసార్లు దొరకదు. వెంటనే ఆచరణలోకి దిగాల్సి వస్తుంది. మలం కుండలను శుభ్రం చేయటం నుంచీ, బ్రహ్మచర్యం అవలంబించటం వరకూ దాదాపు ప్రతి విషయమూ హఠాత్తుగానే నెత్తిమీద పడుతుంది. దానికి ఆమె తక్షణ స్పందనలు ఆమెకున్నాయి. ఆ తరువాత ఆచరించే ముందు ఆమె ఆ విషయాలను అర్థం చేసుకున్న తీరు నిజాయితీతో కూడినది. నిజమే, గాంధీ నుంచి ఆజ్ఞాపూర్వకమైన మాట రాకపోతే ఆమె తనంత తాను ఆ పనులు చేయటానికి సిద్ధపడేది కాకపోవచ్చు. కానీ దేశమంతటినీ, బ్రిటిష్ అధికారులను, భయపెట్టిన, ఆందోళన కలిగించిన ఆయన ఉపవాస దీక్షలు ఆమెను భయపెట్టకుండా ఉండటం ఎలా సాధ్యం? కానీ ఆయన తనను బెదిరించినట్లు ఉపవాసాలతో గాంధీని జయిద్దామని ఆమె అనుకోలేదు. ఉపవాసాలు తన వల్ల కాని పని అని ఆమె గ్రహించింది. భర్తతో పాటు పస్తుండే పతివ్రతగా కాక, ఉపవాస సమయాలలో ఉపచారం చేసే సహచరిలా మిగిలింది. ఇలాంటి అనేక పనులనుండి తనను తాను మినహాయించుకున్నది. కానీ న్యాయమనిపించిన ప్రతి పనినీ ఆచరించింది. అస్పృశ్యత విషయంలో గాంధీకి సత్యం బోధపడలేదని కూడా కస్తూర్ బా గ్రహించినట్లు మనకీ పుస్తకం చెబుతుంది. గాంధి ఉపవాసదీక్షను ఆపి బతికించమని అంబేద్కర్‌ను అభ్యర్థించిన కస్తూర్ బా మొదటినుంచీ అంబేద్కర్ ఒక ప్రత్యేకమైన వ్యక్తి అనీ, అతన్ని అర్థం చేసుకునేందుకు గాంధీ చాలా శోధన చేసుకున్నారనీ మనకు చెబుతుంది.

ఆశ్రమ జీవితాలు, ఆ నియమాలు, రాజకీయాలు, ఆ నిర్బంధాలు అలా ఉంచి అతి ప్రైవేటు విషయమైన నైతిక జీవితాన్నికూడా కస్తూర్ బా సంకోచం లేకుండా మాట్లాడింది. వివాహమైన తొలి సంవత్సరంలో గాంధీ కాముకత, యాభయ్యవ పడిలో తీసుకున్న బ్రహ్మచర్య దీక్ష, ఆ సమయంలోనే గాంధీకి వచ్చిన ప్రేమానుభవం, దానినుంచి బైట పడిన విధం – వీటన్నిటినీ కస్తూర్ బా మనతో పంచుకున్నది. ఇవేవీ రహస్య విషయాలు కావు. గాంధీ తన సత్యాన్వేషణలో భాగంగా ఎప్పటికప్పుడు బహిరంగ పరిచినవే. కానీ వాటిని కస్తూర్ బా తన స్వరంలో చెప్పిన తీరు మనలను అబ్బురపరుస్తుంది. కస్తూర్ బా Right to Privacy ని గాంధీ ఉల్లంఘిస్తూ పోయాడు. ఆయన చేసిన ఆ ఉల్లంఘనను విమర్శిస్తూనే తాను ఆ విషయాలను చెప్పింది. తన వాదనేమిటో, తన పక్షమేమిటో వివరించక తప్పని పరిస్థితిలో ఆమె మాట్లాడింది. ఇక్కడ వ్యక్తిగతం రాజకీయమైందా? ఆ రోజుల్లో గాంధీ ప్రతిపాదించిన బ్రహ్మచర్యం, ఒక ఆదర్శంగా చాలా ప్రచారం పొందింది. కస్తూర్ బా మాటలు వింటే గాంధీ మొండితనంతో పాటు, భయాలు, పాపభీతి కూడా మనకు అర్థమవుతాయి.

ఈ పుస్తకంలో అన్నివిషయాలకంటే చాలా ఆశ్చర్యపరచినది కస్తూర్ బా, గాంధీ గురించి చేసిన ఒక వ్యాఖ్యానం. లేదా గాంధీ గురించి ఆమె తెలుసుకున్న ఒక సత్యం. బహుశ ఆమెకే తెలిసిన ఒక సత్యం. ఆమెకు మాత్రమే తెలియటానికి వీలున్న ఒక సత్యం. అనుపమ చాలా సమర్థవంతంగా చెప్పింది ఆ విషయాన్ని. బాపూకున్న ఒకే ఒక దౌర్బల్యం ‘నేను’ అనే భావనను ఒదులుకోలేక పోవటమని కస్తూర్ బా నోటితో చాలా నేర్పుగా వివరించింది అనుపమ. ఆ వివరణ చదివి ఆలోచించే ఆనందాన్ని పాఠకులకు వదలాలని, లేకపోతే పాఠకులు క్షమించరనే భయంతో, అదంతా ఇక్కడ నోట్ చేయాలనే లౌక్యాన్ని విడిచిపెడుతున్నాను. అదంతా చదివి అనుపమను మరీ మరీ అభినందించండి.

గాంధీ సిద్ధాంతాలైన సత్యం, అహింస, పరమత సహనం, మొదలైన విలువలను కాలదన్నుతూ పోతున్న వర్తమాన సమాజంలో ఆ విలువలను కాపాడుకోవడం ఎంత అవసరమో కస్తూర్ బా జీవితం నుంచి మనకు అర్థం చేయించే ప్రయత్నం కూడా అనుపమ చేశారు. పుస్తకాలను ఊయలలో ఉంచి వాటిని ప్రార్థిస్తూ ఈశ్వర్ అల్లాలనిద్దరినీ ఒకరిగా భావించే తీరుని, ప్రణామి మతాన్నిపరిచయం చేశారు. ఈశ్వర్ అల్లా తేరేనామ్‌ని, వైష్ణవ జనతో పీణ్ పరాయి జాణ్ రే ని, మర్చిపోయి మత విద్వేషాల జ్వాలలను రగిలిస్తున్న ఈ సందర్భంలో ఈ పుస్తకం విలువైనది. చదవాల్సినది, ఆలోచించవలసినది.

అనువాద రచనలకు తెలుగులో మంచి ఆదరణే ఉంది. అనువాదం చిన్నపని కాదు. ఒక్కోసారి మూల రచయిత పడినంత శ్రమ అనువాదకులు పడవలసి ఉంటుంది. కన్నడం నుంచి తెలుగులోకి అనువాదం చేసే రచయితలు ఉన్నారు. ఇప్పుడు రమేశ్ బాబుగారు పరిచయమయ్యారు. అనువాదం సరళంగా సాఫీగా సాగింది. అక్కడక్కడా కొన్ని పదాలకు బదులు మరింత తేలికగా ఉండే పదాలు వాడితే బాగుండుననిపించింది. ఈ పుస్తకాన్ని అనువాదం చేసి తెలుగు పాఠకులకు మంచి పుస్తకాన్ని అందించినందుకు రమేశ్ బాబు గారికి అభినందనలు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here