నేను.. కస్తూర్‌ని-12

0
10

[వృత్తి రీత్యా వైద్యులైన డా. ఎచ్. ఎస్. అనుపమా కన్నడంలో రచించిన జీవితకథని శ్రీ చందకచర్ల రమేశ బాబు అనువదించి ‘నేను.. కస్తూర్‌ని’ అనే పేరుతో సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నారు.]

~

[dropcap]ఆ[/dropcap]గస్ట్‌లో ఇంగ్లండ్‌కు బయలుదేరాము. నాకు ఇతర దేశాలు చూసే ఆశ అయితే లేదు. ఎప్పుడూ ఆరోగ్యం గురించే ఆలోచన. భాయి ముందు కార్యక్రమం ఏమిటి అని నిర్ణయించడానికి ముందు భారతీయుల వైపు ఉన్న కొందరిని కలవాలనుకున్నారు. మా పెద్ద బావగారు అంటే లక్ష్మిదాస్ బావగారు ఆరోగ్యం బాగోలేక పడుకున్నారు. భాయికి ఒక వైపు తొందరగా మాతృ దేశానికి చేరుకుని తనకు చేతనైనంత అన్నయ్య సేవ చెయ్యాలని ఆశ. మరో వైపు ఇంగ్లండులోని పనిని ముగించే వెళ్ళాలని మనసు. అప్పటికే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యింది. బ్రిటన్‌లో యుద్ధంలో గాయగొన్న వారిని తీసుకొచ్చే భారతీయుల సమూహాన్ని తయారు చెయ్యడానికి భాయి అక్కడికీ ఇక్కడికీ వెళ్ళారు. కానీ ఆయన ఆరోగ్యం చెడింది. కాబట్టి నాలుగు నెలల్లోనే అంటే 1915 జనవరిలో భారతానికి వచ్చేశాము.

21 సంవత్సరాల తరువాత భాయి, 15 సంవత్సరాల తరువాత నేను హిందూస్తాన్‌కు తిరిగి వచ్చాము. రొట్టెలు ఒత్తే కర్రను తప్ప ఇతర కర్రను చూడని నేను మనుషులను కొట్టే లాఠీల రుచి చూశాను. ఇంటి నాలుగు గోడల మధ్య బందీగా ఉన్న నేను సముద్రాన్ని దాటి వెళ్ళి ఇతర దేశం జైలు కూడా చూసొచ్చాను. ఉద్యమం, పోరాటం అనే పదాలే చెవి పైన పడని ఒక గృహిణి సత్యాగ్రహిగా మారాను. పాఠశాలకే వెళ్ళని నేను అక్షరాల్ని కూడబలుక్కుని వార్తా పత్రిక చదివేటంత, మా పత్రిక యొక్క గుజరాతీ అవతరణకు చెప్పి రాయించేటంత అక్షరస్తురాలనయ్యాను.

ఇది గర్వంగా చెప్పట్లేదమ్మాయ్! నాలో కలిగిన మార్పు. భాయి ద్వారా అయిన మార్పు కూడా. ఇది ఒక్కసారిగా అయిన మార్పు కాదు. పెరుగు కవ్వంతో చిలికగా వెన్నగా మారినట్లు. వెన్న వేడితో నెయ్యి అయినట్టు అయిన మార్పు. అందుకే ఇంత వివరంగా చెప్పాను అంతే.

మళ్ళీ హిందూస్తాన్

1915. లండన్‌లో నాలుగు నెలలు గడిపి హిందూస్తాన్‌కు తిరిగి వస్తున్నాము. మోసుకుని తెచ్చేంత సామాన్లేమీ మా వద్ద లేవు. మా స్నేహితులు తమ ఇళ్ళకు పిలిచి సత్కరించి కానుకలిచ్చారు. కానీ వాటినన్నిటినీ అక్కడే వదిలేశాము. అక్కడ మాకు దొరికిన జ్ఞాపకాలు, స్పూర్తి చాలు అని భాయి అభిప్రాయం. ఊళ్ళో విదేశాల నుండి ఏం తెచ్చారా అని చూసేది వాడుక. కానీ మేము మాత్రం ఏమీ, ఎప్పుడూ తీసుకు రాలేదు. భాయి వచ్చేటప్పుడూ ఏం తేలేదు, నేను కూడా క్రితం సారి వచ్చినప్పుడు ఏమీ తేలేదు. ఏమైనా తీసుకురావడానికి భాయి ఒప్పుకోలేదు. బంధువులు ఏమనుకున్నారో తెలియదు. పిల్లలు వచ్చినవాళ్ల చేతులు ఆశగా చూసేటప్పుడు వాళ్ళ కోసమైనా ఏమైనా తేవలిసింది అనిపించింది. కానీ నా వద్ద దమ్మిడీ కూడా లేదు. అకస్మాత్తుగా నేను ఉంచుకుని అది ఆయనకు తెలిస్తే దానికి భాయి మూడు రోజులు ప్రాయశ్చిత్త ఉపవాసం కూర్చునేవారు. ఎందుకదంతా? అక్కర్లేదనుకుని నేను కూడా వైరాగ్యాన్ని అలవాటు చేసుకున్నాను. ఇప్పుడనిపిస్తుంది. ఒక రకంగా నాకు అది జీవితాన్ని సులభం చేసింది. మాకున్న బంధువులకేం తక్కువ? ఎవరికి, ఏమి తీసుకు వచ్చేది? ఒక ఊరి నుండి మరో ఊరికి సామాన్లు చేరవెయ్యడం, అదీ పిల్లలున్నప్పుడు, చాలా కష్టం కదా అమ్మాయ్? నాకయితే వస్తువులూ లేవు. వాటిని కట్టడం, విప్పడం అనే బాధ్యత కూడా లేదు. ఇచ్చే సంబరమూ లేదు.

మొదటి సారి భాయి లండన్ నుండి వచ్చినప్పుడు ఏమేం జరిగిందని! ఓడలో వచ్చేటప్పుడు మళ్ళీ వాటిని గుర్తు చేసుకున్నాం. అప్పటికి “జాత్ బాహర్” అయిన భాయిని చూసేవాళ్ళకు, రేవుకు వెళ్ళి వీడ్కోలు చెప్పేవాళ్ళకు జాతి సంఘం నుండి ఒక రూపాయ నాలుగణాలు జరిమానా ఉండేది. కాబట్టి బంధువులు, హితైషులు రాలేదు. దాంతో పాటు జాతి భ్రష్టులైన మా ఆయనను ఇంట్లోకి రమ్మంటే, జరిమానా కట్టడమే కాదు, ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భయపడి, నా పుట్టింటి వాళ్ళే ఆయనను ఇంట్లోకి తీసుకోలేదు. పడవ నుండి దిగిన తరువాత భాయి నాసిక్ లోని గోదావరిలో మునిగి, పంచ చుట్టుకుని, అంగవస్త్రంతో భోజనం వడ్డించారు. తల్లి అపర కర్మలు చేయించడానికి ఆ ప్రాయశ్చిత్తాన్ని చేసుకున్నారు.

జాతితో సంబంధం వదలుకోవడానికి మాకు దీని వలన మంచిదే ఆయినా, పుట్టిల్లు నాకు దూరమై పోయింది. మా వైపు “పెళ్ళైనాక ఆడపిల్ల ‘ఆడ’ పిల్ల” అవుతుంది అని ఒక మాట ఉంది. నేను కపాడియాలకు దూరమై పోయాను. భర్తను ఇంట్లోకి వదలని పుట్టింటికి కూతురు ఎలా వెళ్లగలదు? అలా పోరుబందరుకు వెళ్ళడం, వారిని జ్ఞాపకం చేసుకోవడం చాలా వరకూ ఆగిపోయినట్టయింది. దాంతో పాటు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. నాకంటే పైన ఇద్దరు అక్కలు చనిపోయారు. చెల్లెలికి పెళ్ళై ఉన్నా పిల్లలు కలగలేదు. తమ్ముడు మాధవ్ పెళ్ళయింది. వాడికీ పిల్లలు కలగలేదు. వాడు, వాడి భార్య ఇదే విచారంతో చెదలు పట్టిన చెట్టులా మారిపోయారు. అలా, మేము దక్షిణ ఆఫ్రికాకు వెళ్ళేటప్పుడు కానీ, తిరిగి వచ్చేటప్పుడు కానీ, నా వాళ్ళు ఒక్కరంటే ఒక్కరూ రాలేదు. నా వాళ్ళకు భాయి ఆలోచనలు కానీ, ఆయన కానీ అర్థమయ్యే అవకాశాలే తక్కువ. మా అత్తగారి ధార్మిక ప్రవృత్తివలన భాయి ఇంట్లో అంతింత సేవ, దానం మొదలైన విషయాలు అర్థమయ్యేవి. కానీ, మా పుట్టింట్లో ధార్మిక వాతావరణం చాలా తక్కువ. రాజకీయం, వ్యాపారం వీటినే అందరూ నింపుకున్నారు. అలా, మేము దేశం వదిలి వెళ్ళిన తరువాత పుట్టిల్లు చాలా మటుకు దూరంగానే మిగిలింది. మా కాపురం లోక సంసారంగా మారింది.

కబీర్ దాస్ ‘నైహరవా హమకా న భావే’ అనే పాటను మీరు విన్నారా? పుట్టింటి భావనలే నాకు కలగటం లేదు అంటూ ప్రియుణ్ణి గుర్తు చేసుకునే, భగవంతుణ్ణి తలచుకునే పాట. నాకూ అలాగే అనిపించేది. ఈ భాయి నా నీడ. ఆయన పై నాకున్నప్రేమ ఏం తక్కువనా? ఆ మోహంలోనే పుట్టింటి సంబంధం మరింత తెగుతూ పోయింది.

ఈ సమయానికి ఆంగ్ల పత్రికల ద్వారా భాయి భారతదేశంలో అంతా పరిచితులయ్యారు. దక్షిణ ఆఫ్రికాలోని పోరాటం, ఆశ్రమ జీవితం,సత్యాగ్రహం, కారాగార వాసం, చివరికి దొరికిన విజయం అందరూ గుర్తించి ఆయన భారతంలో ప్రఖ్యాతులై పోయారు. దక్షిణ ఆఫ్రికాలో భారతీయుల సంఘటన, పోరాటం ఒక రకంగా సాగింది. కానీ భారతదేశం ఎలా అని తెలియదు. తెలుసుకోవడం కూడా సులభం కాదు. ప్రజలు తన పైన చాల ఆశలు పెట్టుకున్నారు అనే భయంతోనే భాయి ఉన్నారు. మాతృదేశంలో ముందుగా లాయరుగా వేళ్ళూరాలి. అందుకే ముంబై హైకోర్టులో మూడవ సారి ప్రయత్నించాలని నిర్ణయించారు.

ముంబైలో మేము దిగగానే స్వాగతించడానికి అనేక కార్యక్రమాలు జరిగాయి. జె.బి.పెటిట్ అని ఒక శ్రీమంతుడు. చదువుకున్న వారే వేలాదిగా హాజరైన ఒక స్వాగత, సన్మాన సభ ఏర్పాటు చేశారు. వారంతా దక్షిణ ఆఫ్రికా పోరాటదారులకు ధన సంగ్రహం చేసి పంపినవాళ్ళు. అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతూ, ఇంగ్లీష్ దుస్తులలో వచ్చారు. భాయి మాత్రం ఒక సాధారణ చొక్కా, పంచ కట్టుకుని తలకొక ఎనిమిదణాల కాశ్మీరీ టోపీ పెట్టుకున్నారు. తరువాత టోపీ కూడా వదిలేసి రుమాలు చుట్టుకోవడం మొదలుపెట్టారు. చివరికి రుమాలు కూడా పోయింది. తల పైన ఒక సాదా వస్త్రం మాత్రం మిగిలింది.

ఈ సభలో మాట్లాడుతూ తమకూ, తమ భార్యకూ మాతృభూమి హిందూస్తాన్లో అపరిచితుల నడుమ ఉన్నట్టు అనిపిస్తోంది, ఇక్కడ ఇంత ఇంగ్లీష్ వాతావరణం ఉంది, ముందుగా మనం భారతీయుల్లా బ్రతకడం నేర్చుకోవాలి అన్నారు. “నా విజయం గురించే మాట్లాడారు. కానీ నా అపజయం గురించి మీకు తెలియదు. హిందూస్తాన్‌లో నా నిజస్వరూపం మీకు తెలియబోతుంది” అని సన్మానానికి పొంగిపోకుండా నిజాయితీగా మాట్లాడినప్పుడు చుట్టుముట్టు ఉన్నవారంతా మనసు పారేసుకున్నారు.

ఇది కాకుండా ముంబై గుజరాతీలు ఒక సన్మాన సభ ఏర్పాటు చేశారు. అక్కడ జిన్నాగారు ఉన్నారు. వారితో పాటు అందరూ ఇంగ్లీష్ లోనే మాట్లాడారు! భాయి మాత్రం గుజరాతీలో మాట్లాడారు. ఇంగ్లీషుకు సేవకులు కాకుండా మాతృభాషలో మాట్లాడకపోతే స్వరాజ్యం సాధ్యం కాదు అన్నారు.

ఇంకో సార్వత్రిక కార్యక్రమం జరిగింది. దాన్ని భాయి గురువుగారైన గోఖలేగారు ఏర్పాటు చేశారు. జన సముద్రం. దక్షిణ ఆఫ్రికాలో ఏవేవో ప్రయోగాలు చేసి వచ్చిన గుజరాతీ బ్యారిస్టర్‌ను చూడాలని నాయకులు, సామాన్యులు, పిల్లలు, మహిళలు అందరూ వచ్చారు. ఇక భారత స్వాతంత్ర్య పోరాటానికి బలం చేకూరుతుంది అని అందరూ భావించారు. కార్యక్రమం అయిపోయిన తరువాత మమ్మల్ని పంపుతూ గోఖలేగారు “ఇక ఒక సంవత్సరం మీరు దేశమంతా చుట్టాలి. కానీ ఎక్కడా సార్వత్రిక ప్రసంగాలు చెయ్యకూడదు. మీ అభిప్రాయాన్ని సార్వత్రికంగా ప్రకటించరాదు. వారి ప్రశ్నలకు బదులివ్వరాదు” అని చెప్పారు.

భాయి దీన్ని మనసులో మననం చేసుకుంటూ దేశసంచారానికి బయలుదేరాలని నిర్ణయించారు. ఇంటివాళ్ళనంతా ఒకసారి చూసి రావాలని బయలుదేరాము. భాయి అన్నలిద్దరూ కాలం చేశారు. మగవాళ్లంతా వ్యవహారాలలో, రాజకీయాలలో మునిగి ఉంటే ఆడవాళ్ళంతా రోజంతా కొత్త వంటకాలు, భోజనాలు, తిళ్ళు, వ్రతకథలు, ప్రసాదాలు, ఉపవాసాలు, మడి అని వాటిలో మునిగి పోయి కనిపించారు. భాయి మమ్మల్ని అక్కడ వదిలేసి, కలకత్తాలో జరుగుతున్న భారత జాతీయ కాంగ్రెస్ అధివేశనానికి వెళ్ళారు. కానీ భారత రాజకీయ నాయకులను చూసి ఆయనకు చాలా నిరాశ కలిగింది. కాంగ్రెస్ వారు ఉత్త మాటలతోనే మహలు కట్టేవారిలా ఆయనకు అనిపించారు. అధివేశన ప్రదేశంలో లెట్రిన్ గుంటలు నిండి దుర్వాసన కొడుతున్నా ఎవరికీ లక్ష్యం లేదు. వాటిని తామే నాయకత్వం వహించి శుభ్రం కావించారు. శుభ్రత విషయంలో భాయి చాలా చండశాసనుడు. ఇలానే ఉండాలి అనేవారు. ఒకవేళ లేదనిపిస్తే తామే స్వతః చీపురు పట్టుకుని బయలుదేరేవారు. శ్రమదానం, శుభ్రత, క్రమశిక్షణ, సమయపాలన, ముందుగా ప్లాన్ చెయ్యడం, ప్రార్థన ఏవీ లేని ఈ అధివేశనం ఒక జాతరలోని సందడిగా అనిపించింది ఆయనకు.

“పిల్లలను రాజకోట్‌లో వదిలేసి ఇద్దరూ వెళ్దాం రా” అని పిలిచారు. కలకత్తా వైపు మా ప్రయాణం ప్రారంభమయ్యింది. మార్చ్ నెల అప్పటికి శాంతినికేతన్‌కు వెళ్ళాము. అక్కడ ఒక వారం ఉండేలా ఏర్పాటు జరిగింది. భాయి దోస్తులు, ఆండ్రూస్ ఫాదర్, ఆయనే దర్శనం ఏర్పటు చేశారు. మేము వెళ్ళినప్పుడు గురుదేవ్ లేరు. నాలుగైదు రోజులలో వచ్చారు. ఆయనను చూస్తే మా ఇంటికి వచ్చే సాధువులు గుర్తుకు వచ్చారు. పొడుగరి, తెల్ల అలల్లాంటి వెంట్రుకలు, మహర్షిలాంటి గడ్డం, మెరిసే కళ్ళు, సాధువుల మాదిరిగానే పొడుగాటి చొక్కా వేసుకున్నారు. భాయిది చిన్నదేహం. ఒక ధోతి, తల పైన ఒక కాశ్మీరి టోపి ధరించి చిన్నగా కనిపిస్తున్నారు. మమ్మల్ని చూడగానే కవీంద్రులు స్వాగతించి తమ పక్కనున్న సోఫాలో కూర్చోమని పిలిచారు. ఒకరి పైన ఇంకొకరికి అత్యంత ఇష్టం, గౌరవం. నేల పైన కూర్చునే అవకాశమున్నప్పుడల్లా భాయి నేల పైన కూర్చునేవారు. అలా గురుదేవ్ గారి పాదాల దగ్గర కూర్చున్నారు. చివరికి ఆయన కూడా క్రిందే కూర్చున్నారు. వారిద్ధరి మధ్య చాలా సేపు చర్చ జరిగింది.

అక్కడినుండి మా భారత యాత్ర ప్రారంభమయ్యింది. నాకు రెండు విధాల సంతోషం. ఒకటి భాయితో ఉండవచ్చని. రెండోది పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు అని. హరిద్వార్, హృషికేశ్ మొదలుకొని అనేక చోట్లకు వెళ్ళాము. ఆ సంవత్సరం హరిద్వార్‌లో పూర్ణ కుంభమేళా జరుగుతోంది. కలకత్తా నుండి అక్కడికి బయలుదేరాము. లక్షలకొలదీ ప్రజలు దేశం నలుమూలల నుండి అక్కడికి వెళ్తున్నారు. రైళ్ళలో కాలు మోపడానికి కూడా చోటులేనంత కుమ్ములాట. బోగీలన్నీ నిండి, పశువులను తీసుకువెళ్ళే పైకప్పు లేని బోగీలలో ప్రజలను నింపి తీసుకెళ్తున్నారు. అలా వెళ్ళేవారిలో దొంగలు, యాత్రికులు, విలేఖరులు, ధార్మిక వ్యక్తులు, భక్తులు.. ఇలా లక్షలకొలది ప్రజలు సముద్రంలా అక్కడ గుమిగూడారు. నేను ఇప్పటి దాకా వేలకొలది జన సమూహాన్ని చూశానే కానీ లక్షలకొలదీ జనాన్ని చూడలేదు. నిజం చెప్పాలంటే అంత గుంపును చూసి భయమే వేసిందో, ఆశ్చర్యమే కలిగిందో, హిందుస్తాన్ అంతా అక్కడ సముద్రంలా చేరింది చూసి ముగ్ధురాలై నేనెవరో అని మరచిపోయాను.

భాయికి పుణ్యక్షేత్రాల దేవాలయాలు, ఆచరణలకంటే ఆ స్థలం పైన భక్తిభావం, ప్రేమ పెద్దది. కాబట్టి పుణ్యక్షేత్రమంటే అక్కడి జనాలు, వారి ప్రవర్తన, శుభ్రత అన్నీ భక్తిభావం పెంచేలా ఉండాలి అని భావించారు. కానీ హరిద్వార్ ఆయనను నిరాశపరచింది. అక్కడ అన్నీ ఉన్నాయి. కాని శ్రద్ధ, భక్తి లేవు. దాని ఫలితంగా శుభ్రత కూడా కనబడలేదు. భాయికి ఎంత దుఃఖం, విషాదం కలిగిందంటే, తరువాత ఎన్నో రోజుల దాకా భారతంలోని జనాలకు శుభ్రత గురించి తెలియజెప్పడానికి ఏం చెయ్యాలి అనే మాటలే మాట్లాడేవారు. దానికి తోడు ఆ సంవత్సరం కుంభమేళాకు వచ్చినవారిలో వేలాది మందికి కలరా సోకింది. ఆ సారి 90 వేల మంది కలరావల్ల మృతిచెందారు అని తరువాత వార్త వచ్చింది. త్రాగే నీరు-ఆహారంలో అశుద్ధి కలసిపోతే వచ్చే రోగమట అది. దాని గురించి నాక్కూడా తెలియజెప్పారు. వ్యక్తిగత శుభ్రత, అందులోనూ శౌచం యొక్క క్రమశిక్షణ ఎందుకు ముఖ్యం అని మళ్ళీ మళ్ళీ అందరికీ చెప్పేవారు. కనిపించిన చోటల్లా తిని, స్నానం చేసి, మలవిసర్జన చేసే జనాలను చూసి భాయికి చాలా బాధ కలిగింది. గంగానది దగ్గర రాసిపోసిన చెత్త, మురికి చూసి బాధపడి నదికి క్షమాపణ అడిగారు. ప్రాయశ్చిత్తం చేసుకున్నారు.

ఎక్కడికి వెళ్ళినా, జనాలకు గాంధీ భాయి గురించి తెలిసిపోయేది. అనామకుల మాదిరి వెళ్ళి రావడానికి ధోతి, రుమాలు, చెప్పులు వేసుకుని బ్యారిష్టర్ వేషం మార్చుకున్నారు. ఎక్కడెక్కడికి వెళ్ళామని లేదు. అన్ని చోట్లకూ వెళ్ళాము. మధ్య మధ్యలో నేను రాజకోట్ కు వెళ్ళివచ్చేదాన్ని. రైలు ఉండేది కాబట్టి ఒక్కదాన్నే వెళ్ళగలిగే ధైర్యం తెచ్చుకున్నాను. అయినా కానీ నాతోపాటు మగన్ లేదా దేవదాస్ ఎవరో ఒకరు ఉండేవారు. ఇలా ఒకసారి మదరాస్ దగ్గర్ మాయావరం అనే ఊరికి వెళ్ళాము. అక్కడ ఎంత మురికి ఉండిందంటే, అక్కడి వాళ్ళు మురికి నీటినే త్రాగుతున్నారు. మురికి కాలవల నీళ్ళే పేదలకు గతి. దాన్ని చూసిన భాయి, తనకు పురసభ ఏర్పరచిన సన్మానంలో వారిని తీవ్రంగా మందలించారు. పురసభ సభ్యత్వం ఒక సౌకర్యం కాదు. తాము పనివాళ్ళు అని భావించి పని చెయ్యాలి అని కటువుగా విమర్శించారు.

మద్రాసుకు వెళ్ళాము. నటేశన్ అనే ఒకాయన ఇంట్లో ఉన్నాము. ఆయన భాయి గురించి, ఈయన దక్షిణ ఆఫ్రికాలో చేసిన సత్యాగ్రహాల ప్రయోగాల గురించి పుస్తకం రాశారు. భాయి రాసిందాన్ని కూడా పుస్తకం చేశారు. ఆయన, భాయి నడుమ ఎప్పుడూ పత్ర వ్యవహారాలు జరిగేవి. ఆయన ఇంట్లోనే ఉన్నాము.

ఒక రోజు ఏమయిందంటే, భాయితో ఏదో విషయంలో వేడి వేడి చర్చ జరిగింది. నాకు కొంచెం కోపం వచ్చింది. నటేశన్ చాలా సూక్ష్మం గ్రహించే మనిషి. నేనెందుకో కోపంగా ఉన్నాను అని ఆయనకు తెలిసిపోయింది. భాయితో అన్నారు. దానికి భాయి తడుముకోకుండా “పిల్లలు, మనమలకు దుస్తులు కొనాలని డబ్బు అడుగుతోంది. ఇవ్వలేదు అని కోపం వచ్చింది” అన్నారు. అవును మరి. వాళ్ళను రాజకోట్‌లో వదిలి వచ్చాం కదా! ఇన్ని రోజులు దూరంగా ఉన్నాము. పిల్లలకు ఏమైనా వస్తువు తీసుకెళ్ళాలని నా మనసు ఆరాటం. మద్రాసులో తక్కువ ధరకు మంచి దుస్తులు దొరికేవి. కానీ, అవన్నీ అక్కర్లేదు అని భాయి. దానికి నటేశన్ “మీరు చాలా కఠినమైన పతి” అని నవ్వుతూ అన్నారు. భాయి ఏమన్నారో తెలుసా? “అంత చేదుగా అనవద్దు నటేశన్. నేనెవర్ని, నా ఆలోచనలేమిటి అని తనకు తెలుసు. తను చెప్పినదంతా వింటూ పోతే నా తత్త్వాలు ఏమవ్వాలి? అందుకే ఈ బాదరబందీ అక్కరలేదు. నువ్వు వేరుగా ఉండు, పిల్లలతో హాయిగా ఉండు అంటాను. అయినా వినకుండా పక్కా హిందూ పత్నిలాగా నాతో వస్తాను అంటుంది. తరువాత కోపం చేసుకుంటుంది” అన్నారు.

మరి, ఆయనతో ఉండకుండా ఎక్కడికెళ్ళాలి నేను?

బాపు అయిన భాయి

ఇక్కడికి వచ్చి నాలుగైదు నెలలు ఇలాగే గడిచాయి. భారత్‌లో ఇంకా ఆశ్రమం ప్రారంభించడానికి వీలు కాలేదు. శాంతినికేతన్ చూశాము. హరిద్వార్‌లో ఒక ఆశ్రమం చూశాము. దక్షిణ ఆఫ్రికాలోని ఆశ్రమ జీవన అనుభవం ఉంది. ఆశ్రమం ప్రారంభించడానికి హరిద్వార్, రాజకోట్, కలకత్తాల నుండి ఆహ్వానం ఉండింది. కానీ భాయికి అమదావాద్‌లో ఆశ్రమం ప్రారంభించాలని ఆశ. అంతెత్తు గోడల నడుమ ఉన్న ఆ ఊళ్ళో ఉత్త వ్యాపారులు, శ్రీమంతులే నిండి ఉన్నారు. అనేక ‘అతి’ల ఊరది. అక్కడ అన్నీ ఎక్కువే అనిపించేంత డాంబికం. అందుకనే సరళత, శ్రమతో కూడిన బ్రతుకు, పేదరికం మొదలైన విలువలను ప్రతిపాదించే ఆశ్రమం చెయ్యాలని భాయి కోరిక. చివరికి హృషికేశ్ నుండి తిరిగి వచ్చే వేళకు మండుటెండల రోజుల్లో జీవన్ లాల్ మెహ్తా అనే ఒక బ్యారిష్టర్, భాయి స్నేహితులు. ఆయనది అమదావాద్ నగరం బయట సబర్మతీ నదీ ఒడ్డున దగ్గిరే ఒక బంగళా ఉండేది. కొచ్రాబ్ బంగళా అని పిలిచేవారు. దాన్ని ఆశ్రమం చేసుకోవడానికి ఇచ్చారు.

ముందుగా అక్కడికి వెళ్ళి చూసినప్పుడు నేను డంగైపోయాను. ఒక హవేలీలా ఉండే బంగళా. ఆ బ్యారిష్టర్ అంతపెద్ద బంగళాను, ఊరికి అంత దూరంగా, అదీ అంత బయలు ప్రదేశంలొ ఎందుకు కట్టించారో అని ఆశ్చర్యం కలిగింది. మా నాన్న ఇల్లు, కాబా మామయ్యగారి ఇల్లు అన్నీ మూడంతస్తుల మేడలే. కానీ అక్కడ గదులు ఉన్నా ఇంత విశాలంగా లేవు. ఇక్కడ కింద అంతస్తులో విశాలమైన నడవ, వంటిల్లు, భోజనాల గది, అరుగు ఉన్నాయి. పైన అంతస్తులో ఒకట్రెండు గదులు, అక్కడ కూడా పెద్ద నడవ, బయట వచ్చినవాళ్ళు చాప పరచుకుని పడుకునేంత వెడల్పు బాల్కని. చుట్టూ వ్యవసాయ భూమి. ఆ ధనవంతుడి ఇల్లు వాడుకలో లేకుండా దుమ్ము కొట్టుకునుంది. దాన్ని చూసుకునే మనిషి అక్కడే పక్కన ఒక బిడారంలో ఉన్నాడు. ఈ బంగళా ఆశ్రమం కావడానికి తగినదవుతుందా అని మాకిద్దరికీ సందేహం ఉండింది. మగన్‌కూ అలాగే ఉండింది. కానీ ఇతర ఏ రకమైన ఎంపికలూ లేవు. అక్కడికే అందరూ వెళ్ళాము.

అవును. ఒక విషయం చెప్పాలి. దక్షిణ ఆఫ్రికానుండి మొదలుకొని భారతంలో ఆశ్రమం మొదలు పెట్టేదాకా మోక గాంధీ ‘గాంధీ భాయి’గా ఉన్నారు. భారతంలో ఆశ్రమం ప్రారంభించగానే బాపు అయ్యారు. ఇదొక పెను మార్పు, దీనికంటే ముందుగానే ఆయనను బాపు అన్నవారున్నారు. కానీ ఇప్పుడు అందరి నోళ్ళలోనూ బాపు అయ్యారు. నేను కూడా అలాగే పిలవసాగాను.

ఇక్కడ పాతిక సభ్యుల మా కుటుంబం ప్రారంభమయ్యింది. అందులో పదముగ్గురు తమిళులున్నారు. మిగిలిన వాళ్ళు దేశం నలుమూలల నుండి వచ్చినవాళ్ళు. దేశసేవ కొరకు తమను అర్పించుకున్న సత్యాగ్రహులకు సత్యం, అహింస, బ్రహ్మచర్యం పైన నమ్మకం ఉండాల్సింది ప్రదానమైన అర్హత. ఆశ్రమవాసులైన సత్యాగ్రహులు అన్ని రకాల భయాలనుండి ముక్తులై ఉండాలి. రాజు, దొంగలు, ప్రజలు, జాతి, సంసారం, క్రూర మృగాలు, చావు ఇవన్నిటి భయం నుండి ముక్తులై ఉండాలి అని బాపు చెప్పేవారు. అభ్యర్థి, విద్యార్థి, పర్యవేక్షకుడు ఇలా మేమే ఆశ్రమవాసులను మూడు శ్రేణులుగా విభజించి ప్రతి ఒక్కరూ భిన్న భిన్న బాధ్యతలను నెత్తికెత్తుకున్నాము.

విద్యార్థులకు వారి వారి మాతృభాషలో మతం, వ్యవసాయం, గణితం, చరిత్ర, సాహిత్యం, అర్థశాస్త్రం, భూగోళం మొదలైనవాటిని బోధించేవాళ్లము. చదువుతో పాటు దేహ శ్రమతో చేసే పనులూ ఉండేవి. రోజుకు కనీసం ఎనిమిది గంటలైనా మనిషి శ్రమపడాలి అన్నది బాపు అభిప్రాయం. అక్కడ ఒకే వంటిల్లు, ఒకే పొయ్యి. అందరు కలిసి ఆశ్రమం పనులు చేసుకునేవాళ్లం. మగన్ లాల్ అన్ని వ్యవహారాలు చూసుకునేవాడు.

ఆశ్రమానికి ఇంకా నలభై మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సరైన ఏర్పాట్లకు డబ్బుల అవసరం అయ్యింది. మేము సంపాదించిందంతా దక్షిణ ఆఫ్రికాలోనే వదిలి వచ్చాము. చివరికి భాయి అమదావాద్ మంగల్ దాస్ గిరిధర్ సేఠ్ అనే ఆయనకు ఉత్తరం రాశారు. మొత్తం యాభై కంటే ఎక్కువ నివసించబోయే ఆశ్రమానికి యాభైవేల చదరపు అడుగుల స్థలం, మూడు వంటిళ్ళు, వ్యవసాయానికి ఒక ఎకరమంత పొలం, అక్కడ ఇక్కడ తిరగడానికి ఎద్దుల లేదా గుర్రం బండి కావలసి వస్తుందని తెలిపి నెలకు ఒక్కొక్కరికి పది రుపాయల లెక్కన సంవత్సరానికి ఆరు వేల రుపాయల ఆర్థిక సహాయం కావాలని అడిగారు. ఒక సంవత్సరం పాటు అమదావాద్ ఈ ఖర్చును భరించలేమంటే తాము అద్దెనయినా భరించడానికి సిద్ధం అని తెలిపారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here