[వృత్తి రీత్యా వైద్యులైన డా. ఎచ్. ఎస్. అనుపమా కన్నడంలో రచించిన జీవితకథని శ్రీ చందకచర్ల రమేశ బాబు అనువదించి ‘నేను.. కస్తూర్‌ని’ అనే పేరుతో సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నారు.]
~
[dropcap]మీ[/dropcap]కు చెప్పేదేముంది! కొంతమందికి అది నచ్చేది కాదు. ఇబ్బందయ్యేది. అతడివల్లనే ఇబ్బంది కలుగుతోంది అంటూ కొంతమంది మహిళలు ఆశ్రమాన్ని వదిలిపెట్టడానికి తయారయ్యారు. ఈ విషయం బాపు దాకా వెళ్ళింది. ఒక రోజు ప్రార్థన తరువాత బాపు మాట్లాడసాగారు. “దక్షిణ ఆఫ్రికాలో పోరాటం ప్రారంభమైనప్పుడు దాన్ని నేను సదాగ్రహమని అన్నాను. దానికి సత్యాగ్రహం అనే పేరును చెప్పిందే మగన్ లాల్. ఫీనిక్స్ ఆశ్రమం ఉన్నందుకే సత్యాగ్రహం వీలయ్యింది. ఇక్కడ కూడా ఈ ఆశ్రమం ఉన్నందువల్లనే సత్యాగ్రహం వీలవుతోంది. దీన్ని కొనసాగించడంలో మగన్ శ్రమ చాలా ఉంది. నా తత్త్వం ప్రకారం నడవడానికి అతడు ఎన్ని త్యాగాలు చేశాడని చెప్పడం కష్టం. నేను దేన్ని ప్రతిపాదిస్తానో అదంతా ఆశ్రమంలో ఉంది. పుస్తకంలో రాసి పెట్టడం కాదు. జీవితమే ప్రతిపాదన కావాలి అన్నదాన్నిమగన్ సరిగ్గా అర్థం చేసుకున్నాడు. అతడు ఇక్కడ ఉండడం ఎవరికైనా ఇబ్బందనిపిస్తే ఆశ్రమంలో నేను కూడా ఉండడం ఇబ్బందికరమే అని భావించాలి. నేను ఎవరినీ బలవంత పెట్టను. కష్టమనిపించినవారు వెళ్ళిపోవచ్చు” అంటూ దీర్ఘమైన ప్రసంగం చేసి తాము-మగన్ ఒకటే, అతడిని ఆశ్రమం నుండి పంపడమన్నది కల్ల అని సూచించేశారు.
మగన్ కొడుకు కేశవ్. కేశుభాయి. మా వద్దనే పుట్టి పెరిగాడు. వాడిని సత్యాగ్రహపు నమూనాగా తీర్చిదిద్దాలని బాపు, మగన్‌ల ఆశ. వాడు చాలా బాగా నూలు వడకడం నేర్చుకున్నాడు. రాట్నం – అదీ బార్డోలి రాట్నాన్ని ఎంత బాగా తిప్పేవాడో తెలుసా? ఒక్క రోజుకు ఐదు వందల కండేలు తీసేవాడు. మాకే అయ్యేది కాదు. బాపు అనుకున్నదంతా మగన్ పీల్చుకునేవాడు. దాన్నంతా తన కొడుకు కేశుభాయి పైన ప్రయోగించేవాడు.
ఇలాంటి మగన్ తన కూతురు రాధను చూడడానికి చంపారన్‌కు వెళ్ళాడు. బహుశ 1928 ఉండచ్చు. రాధ చంపారన్‌లో పని చేసేది. అక్కడి ఆడవాళ్ళు మాట్లాడేటప్పుడు మొహాన్నికప్పుకునేవారు. అంటే మొహాన్ని చూపడానికి ఆడవాళ్లు సిగ్గు పడతారన్నమాట. అంటే తమను తామే తక్కువవాళ్ళు అని భావించుకుంటున్నారని అర్థం. వారి ఈ న్యూనతా భావాన్ని పోగొట్టమని బాపు రాధకు చెప్పడం వలన ఆమె చంపారన్‌లో ఉంది. ఆమెను చూడడానికని వెళ్ళిన మగన్‌కు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. వార్త రాగానే ఉత్తరం రాశాము. బాపు వెళ్ళాలని అనుకునేంతలో, మందులేవీ పని చెయ్యకుండా మమ్మల్నంతా వదిలేసి చనిపోయాడు అని తెలిసింది.
అవునమ్మాయ్! వేసవిలో పడిన పిడుగులాగ అతడి చావు వార్త మాకు అశనిపాతమే అయింది. మాకంటే చిన్నవాళ్లు ఇలా అకస్మాత్తుగా ఎలా వెళ్ళిపోతున్నారని క్రుంగిపోయాము. నాకైతే అదొక పెద్ద దెబ్బ. ఇలాంటి దెబ్బలు తింటూనే ఉన్నాకానీ ఇతడు మాతో పాటు ఇరవై సంవత్సరాల పైబడే ఉన్నవాడు. వెళ్ళిపోయాడు అన్నప్పుడు చాలా బాధ కలిగింది. తమ ఉత్తరాధికారి అతడు అనుకున్న బాపుకైతే చేతులు కాళ్ళు విరిగి కళ్ళు కనిపించనట్టయింది.
రాట్నాన్ని ఇతర విధాలుగా ఎలా చెయ్యాలి, సంస్కరిచడమెలా అని అతడు చాలా కష్టపడ్డాడు. అందుకే అతడి గదిని మేము రాట్నం మ్యూజియం అని చేశాము.
***
బాపు ఆశ్రమంలో ఉన్నప్పుడు మెరుపులా తిరిగేవారు. కానీ ఆయన ఆశ్రమంలో గడిపినంత సమయాన్ని ప్రయాణం చేస్తూ, ఊళ్ళలో ఉపన్యాసాలిస్తూ గడిపారు. “ప్రజలకు దగ్గిరవ్వాలి అంటే వారి మధ్య ఉండాలి, తిరగాలి. అప్పుడు మాత్రమే మనం చెప్పేది వాళ్ళకి అర్థం అవడానికి వీలవుతుంది” అనేవారు. బాపు లాయర్ చదువు చదివి వచ్చారు కదా, ఆశ్రమంలో బాపు ఉన్నారంటే రోజంతా మాటలు, చర్చలు, సభలు ఉండనే ఉండేవి. రాను రాను మాటలు తగ్గించారు. ఉత్తరాలు, పని, ఉపవాసం, మౌనం పెరిగాయి. కొత్తగా వచ్చినవాళ్లతో మాట్లాడి తీరాల్సి వచ్చేది. ఇక భార్య, పిల్లలు, మనమలు, ఆశ్రమవాసులు, ఆయన ఆప్త సహాయకులు బాపు కళ్ళతో చెప్పినదాన్ని చేసి చూపించేంత, అర్థం చేసుకునేంతగా తయారైన తరువాత ఇక మాటలెందుకు? కొత్త నీతి నియమాలు, ఉల్లంఘనలు, ఉపవాస ప్రకటన ఇలా ఏవైనా కొత్త విషయాలుంటే మాత్రమే మాట్లాడేవారు.
మగన్ చనిపోయి ఒక రెండు సంవత్సరాలు అయ్యుంటుంది. 1930వ సంవత్సరం. చలికాలం పోయి ఇంకేం వేసవి అడుగు పెడతాను అంటూంది. సబర్మతీ నది పైన పేరుకున్నమంచు ఇంకా పూర్తి కరగలేదు. మార్చ్ 12 అనుకుంటాను. ఉదయపు ప్రార్థన ముగిసింది. మైనా, పిచ్చుక, పావురం అన్నీ తమ తమ గింజలను ఏరుకుంటున్నాయి. చీమల గూటికి పొడి బెల్లం చల్లాను. ఇక కొద్ది సేపట్లో శ్రమదానం ప్రారంభమవ్వాలి. అప్పుడు సబర్మతి నుండి 240 మైళ్ళ దూరాన ఉన్న దండి అనే సముద్ర తీరపు ఊరికి సత్యాగ్రహులు పాదయాత్ర ప్రారంభించారు. గాలి, నీరులాగానే ఉప్పు కూడా మనిషి జీవించడానికి అత్యవసరం. దాన్ని సముద్రపు రూపంలో ప్రకృతి ఉచితంగానే మనకు ఇచ్చింది. ఇలా ఉన్నప్పుడు దానికి పన్ను కట్టాలన్న బ్రిటిష్ వారి చట్టాన్ని ఎదురించి తామే స్వతహాగా ఉప్పు తయారు చెయ్యడానికి సత్యాగ్రహుల గుంపు బయలుదేరింది. ఇది ఉప్పు సత్యాగ్రహం అని పిలవబడింది. ఇది ఒక నెల నడక.
దీనికోసం బయలుదేరడానికి ముందు బాపు స్వాతంత్ర్యం దొరికిన తరువాతే తను ఆశ్రమానికి రావడం, అక్కడి దాకా సబర్మతీ ఆశ్రమానికి రాలేను అనేశారు. దండి నుండి బాపు జైలుకు వెళ్ళారు. వేలాది సత్యాగ్రహులను ప్రభుత్వం జైళ్ళకు పంపింది. వెంటనే స్వాతంత్ర్యం దొరుకుతుందనే అవకాశం తక్కువగానే ఉండింది. కాబట్టి బాపు ఆశ్రమానికి రారు అని అక్కడి వారికి అనిపించింది. ఆశ్రమానికి వచ్చేవాళ్ళు తగ్గిపోసాగారు. ఆశ్రమవాసుల సంఖ్య కూడా తగ్గసాగింది.
ఆ సమయానికి ప్రభుత్వం ఆశ్రమం ఆస్తులను జప్తు చేయడానికి ప్రయత్నించింది. దాన్ని తీసేసుకుని నడపాలని ప్రభుత్వానికి ఉత్తరం రాశారు బాపు. వైస్రాయ్ గారిని కలవాలనుకున్నారు. కానీ ఆ మనిషి పలకలేదు. “సబర్మతిని వదిలేస్తాను. దాన్ని ప్రభుత్వం పేర రాసేస్తాను” అన్నారు బాపు. అప్పటికీ ఆయన పలకలేదు. 33వ సంవత్సరమనుకుంటాను. ప్రభుత్వం పూనుకోకపోతే ఆశ్రమాన్ని విసర్జించేద్దాం అన్నారు. అప్పటికే 16 సంవత్సరాల ఆశ్రమమది. అక్కడినుండి అందరూ వెళ్ళిపోవాలని నిర్ణయించబడింది. ఆశ్రమాన్నిఅస్పృశ్యుల సేవా సంఘాలకు కేటాయించడం జరిగింది. అక్కడి వాళ్ళు ముందుగా అనసూయా సారాభాయ్ గారి ఇంట్లో ఉండి, తరువాత గాంధీ తత్త్వాల పైన నడుస్తున్న ఇతర ఆశ్రమాలకు, పల్లెలకు వెళ్ళిపోయారు.
సబర్మతి నాకు ఒక రకంగా ఇల్లే అనిపించింది. అన్ని సంవత్సరాలు అక్కడున్నాము. అన్నిటినీ ఈ చేతులతో కట్టాము. ఇప్పుడు ఆ స్థలాన్ని వదిలి వెళ్ళిపోవడమంటే చాలా దుఃఖం కలిగింది. దుఃఖం మాకే కాదు. ఆశ్రమానికీ అవుతోంది అనిపించింది. మహదేవకైతే చాలా బాధ. ఆ ఆశ్రమంలోని ప్రతి చెట్టు, మొక్క, స్తంభం, పువ్వు, పశువుకూ ఒక కథ ఉండేది. ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు పుట్టిందే అక్కడ. సబర్మతీలో ఉన్నవాళ్ళెవరెవరెవరో, వాళ్ళు కట్టుకున్నకలల సౌధాలెన్నెన్నో. తీసుకున్న నిర్ణయాలెన్నెన్నో! నేను ఉత్తరాలు రాసేటప్పుడు సబర్మతీ మందిర్ అనే రాసేదాన్ని. బాపు కూడా అంతే.
అమ్మాయ్! ఈ రోజుకు కూడా తలచుకుంటే బాధగా ఉంటుంది. పుట్టిల్లు వదిలి వచ్చినప్పుడు కూడా అంత దుఃఖం కలగలేదు. ఒకరకంగా ఇది నదీమూలాన్ని కప్పేసినట్లు. నీళ్ళున్న బావిని మూసేసినట్లు అయ్యే బాధ. కానీ బాపు చాలా నిర్లిప్తులుగా ఉన్నారు. ఖచితులుగా ఉన్నారు. ఈ బావి మూయాల్సొస్తే మూయాలి. మరో చోట తవ్వుదాం రండి. నీళ్ళు తప్పకుండా దొరుకుతాయి అనేశారు. ఆయన మాటకు, ఉత్తరానికి ఎవరూ వెంటనే బదులివ్వలేదు.
ఆశ్రమం వదిలి వచ్చిన ఒక నెల తరువాత దేవదాస్ పెళ్ళిని పూనాలో చేశాము. అది జూన్ నెల. దేవదాస్ రాజాజిగారి అమ్మాయి లక్ష్మి మధ్య ముందునుండి ప్రేమ ఉండింది. కానీ లక్ష్మి ప్రాప్త వయస్కురాలయ్యేదాకా, ఐదు సంవత్సరాలు పేమికులు పత్ర వ్యవహారాలు లేకుండా కాచుకోవాలి. ప్రేమే నిజమైతే ఐదు సంవత్సరాలు చూడకున్నా సంబంధం గట్టిగా నిలిచి ఉంటుంది, తరువాత పెళ్ళి చేస్తాము అని ఇద్దరి తలిదండ్రులూ నిర్ణయించి వాళ్లకు ఒక పరీక్ష పెట్టారు. పాపం, లేత అబ్బాయి, అమ్మాయిలు. కానీ ఒప్పుకున్నారు. అమ్మాయి మద్రాసులో, వీడు ఆశ్రమంలో. వాడి వాడిపోయిన మొహం చూసినప్పుడల్లా, తనకు లక్ష్మి గుర్తుకు వచ్చేదేమో అని నేను కుమిలేదాన్ని. ఒకసారి మద్రాసుకు వెళ్ళినప్పుడు లక్ష్మిని చూసొచ్చాను. ఆ అమ్మాయి గురించి చెప్పినప్పుడు దేవదాసు మొహం ఎలా వెలిగిపోయిందనుకున్నావు! ఇప్పుటికి వారిద్దరి ఐదు సంవత్సరాల గడువు ముగిసింది. పూనాలో పెళ్ళి చేశాము. పెళ్ళి అంటే గుజరాతీ పెళ్ళిలా కాదు. అలా చూస్తే మా పిల్లల్లో గుజరాతీ పద్ధతిలో పెళ్ళి చేసుకున్నది ఒక్క హరి మాత్రమే. కానీ ఆ పెళ్ళికి మేమిద్దరమూ లేము. మణిది, రాముది అతి సరళమైన పెళ్ళి. దీన్ని కూడా అలాగే, అతి సరళంగానే చేశాము. అబ్బాయి-అమ్మాయి మొహాల పైన కనిపించిన కళ చాలు, అన్నివైభవాలకు సమానం అనిపించింది. ఐదు సంవత్సరాలు వేచిన ఫలితం మరి! సబర్ కా ఫల్ మీఠా హోతా హై కదూ!!
బాపుయే పెళ్ళి చేయించారు. “శ్రీ రాజగోపాలాచారిగారి రత్నాన్ని నువ్వు పొందుతున్నావు. దానికి నువ్వు యోగ్యుడుగా ఉండేట్టవనీ” అని ఆశీర్వదించారు. రాజాజిగారి కుటుంబం నుండి కొంతమంది, మా వైపు నుండి కొతమంది ఆత్మీయులు అంతే. బ్రాహ్మణ వధువు, వైశ్యుల వరుడు జరిగిన పెళ్ళి కొంత గందరగోళం సృష్టించింది. “ధార్మిక వ్యక్తి, సంత్ అని మీరంతా పిలిచే గాంధీ యొక్క నిజమైన రంగు ఇప్పుడు చూడండి” అని పూనా దేవాలయంలో సభకు చేరిన సనాతన పండితులు అభిప్రాయపడ్డారు. ఈ విలోమ వివాహాన్ని విరోధిస్తూ ఆ పండితులు “ గాంధీ అసలు రంగు బయటపడింది”, “గాంధీ క్రైస్తవుల ఏజెంటు. అతడు వర్ణ సంకరం చెయ్యాలనుకునే సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నాడు”, “స్వరాజ్యం అంటూ ఇప్పటిదాకా ధార్మిక ప్రజలను మోసం చేసి తన వైపు లాక్కునేవాడు. ఇప్పుడు చూడండి”, “ గాంధీ మహాత్ముడు కాడు. దురాత్ముడు” – ఇలా ఏవేవో ప్రతిక్రియలు ఇచ్చారు. పత్రికా వార్తలను చదివిన బాపు నవ్వి ఊరకున్నారు.
***
సబర్మతి వదిలేసి వచ్చాము. మరో ఆశ్రమం ఇంకా ఏర్పాటు కాలేదు. అవి బాపు తిరుగుడు, పన్లు, జైలు వాసపు సంవత్సరాలు. బాపు పుట్టి పెరిగిందంతా పట్టణాలే కదా? ఆయనకు పల్లెలంటే చాలా ఇష్టం. ఇకపైన నేను పల్లెల్లోనే ఉంటాను అంటూ దండి దగ్గరి రాస్‌కు పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర సాగుతుండగానే బాపును బంధించి పూనాలోని యరవాడా జైలుకు పంపారు. ఈ సారి మహదేవ్‌ను బాపుతో పాటు ఉంచలేదు. జైలులో ఒకే చోట ఉంచితే ఇద్దరూ కలిసి ఏదో ఒక ప్రణాళిక ఆలోచిస్తారు అని మహాదేవ్‌ను బెళగావి జైలుకు పంపారు. బాపును యరవాడలో పెట్టారు. అక్కడ చాల నిర్బంధాలు. ‘హరిజన సేవా సంఘం’ వ్యవహారాలకు, ఉత్తరాలు రాసుకోవడానికి, వచ్చేవాళ్ళను కలవడానికి అవకాశమే ఉండేది కాదు. దాన్ని వ్యతిరేకిస్తూ బాపు ఉపవాసం చేపట్టారు. ఐదో రోజుకు బాపుకు అదెంత వాంతి వచ్చే సూచనలు కనిపించాయి అంటే మృత్యువు దరిదాపులకు వెళ్ళొచ్చారు. ఆయనకు చావు దగ్గిర పడిందనుకుని తమ వద్ద ఉన్న కొన్నే వస్తువులను తమ పక్కన ఉన్నవాళ్ళకు ఇచ్చివేశారు. ఇంతవరకూ చేపట్టిన ఏ ఉపవాసంలోనూ ఇలా కాలేదు. చివరికి ఆయన జైలు శిక్ష గడువు పూర్తి కాకపోయినా, ఆరోగ్య దృష్ట్యా కోలుకోవడం కోసం ఆయనను విడుదల చేసి పూనా దగ్గరి ‘పర్ణకుటి’కి తరలించారు.
ఇలా బాపు. ఇప్పుడు లోపల, ఇంకొద్ది రోజుల్లో బయట. ఇప్పుడు ఉపవాసం ప్రారంభం, ఇక ఉపవాసం ముగింపు. ఇప్పుడు జైలు, త్వరలో బయలు. అదెన్నిసార్లు జైలుకు వెళ్ళారో, అవెన్ని ఉపవాసాలు చేశారో ఎవరికీ లెక్క తెలీదు. బ్రిటిష్ వారికి, కొందరు విలేకరులకు, అధికారులకు, బాపు విరోధులకు, అతి ధార్మికత నాటకం చేస్తున్నారు అనిపించేది. కొందరికి ఆయన ఉపవాసం, సత్యాగ్రహాలు ఉత్త వార్తల్లో ఉండడానికి చేసే ముసలాయన వెర్రితనంగా అనిపించేది. కానీ సాధారణ ప్రజలకు దేశం కోసం బాపు తమ శరీరాన్ని పందెంగా పెట్టినట్టు అనిపించేది.
ఎవరేమన్నా, కాళ్లకు మొక్కినా, కొట్టినా, బాపు మాత్రం రాయిలా అచలంగా ఉంటూ, ఒక బండలా నిర్లిప్తంగా తమ గురివైపు నడిచారు.
వర్ధా మందిరం
సబర్మతి ఆశ్రమం వదిలిపెట్టి నాలుగు సంవత్సరాలయింది. సబర్మతి నదిలో ఎన్ని నీళ్ళో ప్రవహించుంటాయి. 34వ సంవత్సరం అనిపిస్తుంది. అందరూ వర్ధాకు వచ్చాము. నాగపూర్ దగ్గరి వరోదా అనే పల్లెకు మాకంటె ముందుగా మీరా వెళ్ళి గ్రామస్వరాజ్య కార్యక్రమం అమలులో పెడుతోంది. ఆమెకు బాపు తమ కొత్త ఆశ్రమం నెలకొల్పడానికి మధ్య భారతంలో ఒక పల్లె వెతకమని చెప్పున్నారు. ఆమె నాగపుర్‌కు దగ్గరగా వరోదా నుండి ఒకటిన్నర మైలు దూరంలో ఉన్న సేగాంవ్‌ను ఎంపిక చేసింది. అక్కడ జమ్నాలాల్ బజాజ్ ఇచ్చిన భూమిలో ఆశ్రమం ప్రారంభమయింది. మొదటగా నేను, బాపు సేగాంవ్‌కు వెళ్ళి ఊరి జనాలను కలిశాము. మా పరిచయం చేసుకున్నాము. అది అస్పృశ్య సముదాయం వాళ్ళే ఎక్కువగా ఉన్న పల్లె. మేము ఎవరము, ఎందుకు అక్కడ ఉండాలనుకుంటున్నాము, మా విచారధార ఏమిటి అని అంతా వివరంగా చెప్పాము. మహదేవ్ మరాఠిలో అంతా వారికి వివరించాడు. మేము మతం, రంగు, జాతి, ఉద్యోగం, పేద ధనికులు మొదలైన ఏ భేదాలు లేనివాళ్లమని, ఆశ్రమంలో అన్నివైపుల నుండి, అన్ని వర్గాల వారు ఉంటారని చెప్పాము.
బాపుకు వర్ధా తరహాలో ఒక అంతిమ స్థానం చేరాలని ఉంది. రైలు, బస్సు, యంత్రాలు ఏవీ వద్దు అన్నారు. శ్రమతోనే బతకాలని అన్నారు. ఒక పల్లెలో నివసించే ఆశ కూడా ఆయనకు ఉండింది. అప్పటి దాకా మేము నగరాల్లో ఉన్నాము. పోరుబందర్, రాజకోట్, లండన్, ముంబై, డర్బాన్, జొహాన్స్‌బర్గ్, అమదావాద్ ఇలా. నగరాల అంచుల్లో ఒక పల్లె మాదిరి మా ఆశ్రమాన్ని సృష్టించుకుని ఉన్నాము. పేదరికాన్ని మా పైకి తెచ్చుకుని గ్రామీణ ప్రజలుగా ఉండాలని ప్రయత్నించాము. కాని, బాపుకు ఒక గ్రామంలోనే ఉంటూ దాన్ని ఒక మాదిరి గ్రామంగా చేయాలన్న ఆశ ఉండింది.
ఆ రోజు సాయంత్రం వర్ధా నుండి నేను, బాపు, మహదేవ్, మీరా సేగాంవ్ వైపు నడుస్తూ వెళ్ళాము. మేము వెళ్ళేటప్పుడు తక్కినవాళ్ళు మొహం చిన్నది చేసుకుని నిలబడ్డారు. ఆ కుగ్రామంలో ఏముందని బాపు వెళ్ళి నివసించడానికి? ఆయనను కలవడానికి వచ్చేవాళ్లకయినా సౌలభ్యంగా ఉందా? అక్కడ నీళ్ళు లేవు, విద్యుత్ లేదు. కావాలనుకోగానే వార్తా పత్రిక దొరకదు. ముద్రణాలయం లేదు. మార్కెట్ లేదు. బస్సు లేదు, రైలు లేదు, రోడ్డే లేదు. ఒక గుడి లేదు, సభామందిరం లేదు, రేవు, నది, తటాకం లేవు. ఫోను లేదు, టెలిగ్రాం ఇవ్వడానికి లేదు. దగ్గరి నగరం అంటే నాగపుర్. సుమారు యాభై మైళ్ళ దూరం. వెళ్ళి రావడం సులభం కాదు. వాతావరణం కూడా అంత మంచిది కాదు. విపరీతమైన ఉక్క, విపరీతమైన చలి, తక్కువ వర్షం. ఈ బంజరు నేలలో బాపు అదెలాంటి కృషి ప్రయోగం చేస్తారు? అక్కడికి వెళ్ళి చావడానికి బదులు దేశం లోని ఒక్కో ప్రదేశంలోని ఒక్కో పల్లెలో ఇన్నిన్ని రోజులు అని ఉంటే సరిపోదా? ఇవే ప్రశ్నలు వచ్చాయి.
కానీ, మీరు నమ్ముతారో లేదో, మేము వెళ్ళగానే సేగాంవ్ అదృష్టమే మారిపోయింది. ఏవేవైతే ఇంతవరకూ లేవో, అవన్నీ ఉన్నాయనేటట్టు అయ్యాయి.
మేము అక్కడికి వెళ్ళినప్పుడు సేగాంవ్ ఎలా ఉండేదో తెలుసా? అక్కడక్కడ మండుటెండలకు ఒళ్ళప్పగించిన, పైరు కోయబడిన బయలు ప్రదేశాలు, రాయి నేల, అంచుల్లో ముళ్ల చెట్లు, ఎక్కడో ఒకట్రెండు వృక్షాలు. సబర్మతిలో మగన్-మహదేవ్ ఉన్నట్టు ఇక్కడ మీరా-మహదేవ్ చాలా శ్రమ వహించారు. ఆశ్రమంలో ఉండడానికి వచ్చేవాళ్ళు ఒక్కొక్కటే రాయిని ఎంచుకుని, పోగు చేసి, కట్టడం కట్టడానికి ప్రారంభించారు. మొదట బాపు కుటీరానికి పునాది వేశారు. మీరా తన చేతులారా కట్టిన కుటీరమది. ఆ స్థలం నుండి ఐదు మైళ్ళ పరిధిలో దొరికే వస్తువులతోనే కట్టాలని నియమం. తుమ్మ చెట్ల వాసాలు వేశాము. వేప, చింత, తుమ్మ ఉపకరణాలుగా దొరికాయి. దగ్గరలోనే కుమ్మర్ల ఊరుంది. అక్కడి నుండి పెంకులు తెచ్చాము. కప్పాము. అంతవరకూ మీరా ఇంట్లో ఉన్న మేము బాపు కుటీరం పూర్తయిన తరువాత ఇక్కడికి వచ్చాము.
మా అమ్మాయి మీరా, మీరాబేన్ మీకు తెలుసు కదా! ఆమె బ్రిటన్‌కు చెందింది. సైనికాధికారి కూతురు. గిటార్ బాగా వాయించేది. పాడేది. అదెంత భారతీయురాలుగా మారిందంటే గుండు గీయించుకుని, తెల్ల ఖద్దరు చీర కట్టుకుని, సన్యాసినిలా తనదంటూ ఏమీ ఉంచుకోకుండా బాపుకంటే ఒకడుగు ముందుకు వెళ్ళి బ్రతికింది. అదెవరో రోలండ్ అనే ఆయన రాసిన పుస్తకం చదివి ఆయనను కలవడానికి రోమ్‌కు వెళ్ళిందట. ఆయన “నన్నెందుకు చూడడానికి వచ్చావు? నువ్వు నిజంగా వెళ్ళి చూడవలసిన వ్యక్తి భారతదేశంలో ఉన్నాడు. ఆయన గురించి ఒక పుస్తకం రాశాను. ఆయన మరో క్రీస్తు. బాపు అంటారు ఆయనను. ఆయనను కలు“ అన్నారట. మరో క్రీస్తు అన్న మాట ఆమెను పట్టేసింది. ఆమెలో ఆ మాట ఎంత నాటుకు పోయిందంటే తను బాపు శిష్యురాలు కావడమే సరి అని నిశ్చయించి పడవ టికెట్ చేసేసుకుందట. ఆమె తలిదండ్రులు ఆమె మాటకు బదులు చెప్పకుండా “సరే. నీ ఇష్టం” అనేశారట. చివరికి బాపుకు ఉత్తరం రాసి అడిగింది. బాపు మానసికంగా ఆశ్రమవాసిగా మారడానికి సిద్దం కావాలి. అందుకోసం గొంతుక్కూర్చోవడం, నేలపైన పడుకోవడం,హిందిభాష నేర్చుకోవడం, శాకాహారం, మితాహారం, మద్య నిర్బంధం మొదలైన అలవాట్లను చేసుకోవాలి అని సలహా ఇచ్చారు. చాప పైన పడుకుంది. ఖద్దరు కట్టుకుంది. ఆ సమయంలో బాపు ఇరవై ఒక్క రోజులు ఉపవాస దీక్ష చేపట్టారు. ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు ఆమెకు చాల దిగులయ్యిందట. ప్రతిరోజూ బాపు గురించిన సమాచారాన్ని చదివేదట. ఫ్రెంచ్ భాషలో ఋగ్వేదం, భగవద్గీత చదువుతూ పార్థన చేసేదట. ఇరవై ఒక్క రోజుల ఉపవాసం ముగిసిన తరువాత భగవంతుడికి ధన్యవాదాలు తెలిపింది. బాపు నిధి సంగ్రహానికి ఇవ్వడానికి తన దగ్గిర ఏదీ లేదని, తన తాత తన ఇరవైఒకటో పుట్టిన రోజు కానుకగా ఇచ్చిన బంగారు కడియాన్ని అమ్మేసి ఇరవై పౌండ్లు పంపిందట. ఇలా బాపు అంటే దైవపుత్రుడి అవతారం అనే భావించింది.
వినోబా లాగా ఆమె కూడా బాపును కన్నతల్లేమో అనిపించేలా చూసుకుంది. మీరా బేన్ అని బాపు ఆమెకు పేరు పెట్టారు. ఆయన కళ్ళ అంచులతో చూపిన దాన్ని తలకెత్తుకుని చేసేది. ఆమె బాపుకు కూతురు, శిష్యురాలు రెండూగా ఉండేది. బండలా అచలం, బాపులా అచలం. తను అచలంగా ఉన్నా లోకాన్నే గడగడలాడించేంత అచలం ఆమె. వర్ధాలో ఉన్నన్నిరోజులూ మీరాను అంటిపెట్టుకునే ఉండేదాన్ని నేను.
వర్ధాలో ఏదైనా చెయ్యలని ఉత్సాహం వేసేది నాకు. కానీ నా ఆరోగ్యం సహకరించేదికాదు. అప్పటికే నేను చాలా మెత్తబడ్డాను. దమ్ము ఇనుమడించింది. కాబట్టి శ్రమదానం తక్కువ, పర్యవేక్షణ ఎక్కువ చేసేదాన్ని. వంటిల్లు, గోశాల చూసేది నేను. నేను, మీరా, బాపు అక్కడ కొన్ని చెట్లు నాటాము. పిల్లలను చూసుకోవడం, వచ్చిన వాళ్ళతో మాట్లాడడం, విచారించుకోవడం, ఇలాంటి పెద్దరికం పనులు నాకు ఎక్కువగా ఉండేవి. నూలు వడకడం ఆనందంగా అనిపించేది కానీ చాలా సేపు కూర్చోనిచ్చేది కాదు. వీపు నొప్పి, మెడ నొప్పి వచ్చేవి. పత్తి దుమ్ముకు దగ్గు రావడం జరిగేది.
వర్ధా అనే దేశ మారుమూల గ్రామంలో ఉంటూ బాపు రాజకీయాలనుండి దూరంగా ఉండాలని కోరుకున్నా అది కుదరలేదు. వచ్చే ఉత్తరాలే వేలకొద్దీ ఉండేవి. నేనిక రాయడం లేదు అన్నా కానీ ఎలాంటి ఉత్తరాలు వచ్చేవి అంటే బదులు రాయాల్సిందే అలాంటివి. అమదాబాదు బాక్రిపోళి పురోహితులు ఒకసారి ఆయనకు ఉత్తరం రాసి ఇంగ్లీషులో వాడే వెజిటేరియన్ అనే పదానికి అర్థమేమిటి అని అడిగారు. చేపలు, గుడ్లు, పాలు సేవించినవాళ్ళు శాకాహారులవుతారా? ఉల్లిపాయలు, వెల్లుల్లి ఎలాంటి ఆహారాలు? అని కూడా అడిగారు. దానికి బాపు భారత దేశంలోని అన్నాహారమే శాకాహారం అన్నారు. గుర్తుకు వచ్చింది అని చెప్పాను అంతే! ఇలాంటివే ఎవరెవరివో వేలాది ఉత్తరాలు, ప్రశ్నలు. వాటికంతా తామే బదులివ్వాలని బాపు.
(సశేషం)