నేను.. కస్తూర్‌ని-21

0
7

[వృత్తి రీత్యా వైద్యులైన డా. ఎచ్. ఎస్. అనుపమా కన్నడంలో రచించిన జీవితకథని శ్రీ చందకచర్ల రమేశ బాబు అనువదించి ‘నేను.. కస్తూర్‌ని’ అనే పేరుతో సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నారు.]

~

మహాత్ముడు

[dropcap]మే[/dropcap]ము గుజరాతీలము ఎలాంటి వాళ్ళమో తెలుసా అమ్మాయ్? పాలున్నప్పుడు పండుగ చేస్కో, నీళ్ళున్నప్పుడు స్నానం చెయ్యి: పాలుంటే బొబ్బట్లు, ఎండొస్తే అప్పడాలు అనే రకం. అలాంటివాళ్ళ మధ్యన పుట్టి పెరిగిన మోకకు బాపు కావడానికి ఎలా వీలయ్యింది అని నేను చాల ఆలోచించాను. హరి నాన్న దేవుడే సత్యం అనేవారు. కాని బాపు సత్యాన్నే దేవుడన్నారు. ఇంతకు ముందు కామరూపమే తామై ఉండేవారు. తరువాత బ్రహ్మచర్యం చేపట్టారు. ముందంతా జాతి అన్నది ఉండాలి, జాతి చెల్లని సమాజం, చవుడుగా మారిన భూమి ఒకటే అనేవారు. చివరికి వరకట్నం అనే పిడుగు తొలగడానికి ఆడవాళ్ళు ఒకటి జాతి అనే సరిహద్దు దాటి పెళ్ళిళ్ళు చేసుకోవాలి, లేదా బ్రహ్మచర్యం పాటించాలి అనేలా తయారయ్యారు. నాకు పాతివ్రత్యం నేర్పడానికి కఠినమైన నియమాలను విధించినవారు, చివరికి విధవా వివాహానికి ప్రోత్సహించారు. బ్యారిస్టర్ కావడానికి బ్రిటిష్ దుస్తులు ధరించసాగినవారు. చివరికి కాథేవాడ దుస్తులకు, ఇంకా చివరికి పేద భారతీయులు ధరించే పంచ, పైన కప్పుకునే వస్త్రం లాంటి అతి సాదా, అతి తక్కువ గుడ్డలకు వచ్చి చేరుకున్నారు.

ఒక మనిషి ఇంత మారింది ఎలాగ? తన పైన తనకు ఎవరికీ లేనంత నియంత్రణ కలిగింది, వేలాది దిక్కుల్లో ఆలోచించి వాటిని అయ్యేలా చేయడానికి కష్టపడే శక్తి కలిగింది ఎలాగ అని నాకు చాలా ఆశ్చర్యం నాకు. ఇందులో మహాత్ముడు ఎవరు? ఎంత? ఎక్కడ? అన్నది చాలా కష్టమైన వెతుకులాట. అయినా మొత్తం జీవితం ఆయనతో గడిపినాక, నాకు విశేష గుణాలు అనిపించినవి కొన్ని ఉన్నాయి. వాటి గురించి చెప్తాను. ఆయన మహాత్ముడా, మనిషా అనే నిర్ణయం లోకమే చెయ్యాలి.

తనను మహాత్మ అనడం బాపుకు అసలు ఇష్టం ఉండేది కాదు. చాలా సార్లు అలా అని చెప్పారు. ఉత్త గాంధీ అనండి, లేదా గాంధీజీ అనండి, మహాత్మ వద్దు అనేవారు. “నన్ను సంతుడు అంటారు. నేనయితే రాజకీయ బురదలో పొర్లేవాణ్ణి” అని కూడా అన్నారు. చివరి రోజుల్లో పుణె యరవాడా జైలులో ఊపిరందక బాధపడుతున్న నేను బాపుతో “ఎందుకు ఈ బ్రిటిష్ వాళ్ళతో ఇంత గొడవ? ఇంకెన్ని రోజులు ఈ పోరాటం? వాళ్ళతోనూ సర్దుకుని ప్రేమతో జీవించవచ్చు కదా?” అన్నాను. అప్పుడు బాపు ఒక కథ చెప్పారు.  పద్ధెనిమిది రోజుల కురుక్షేత్ర యుద్ధం ముగిసిపోయి ఉంటుంది.  ధర్మరాజు బాధ, విషాదాలలో మునిగిపోయి ఉంటాడు. రెండు వైపులా సైన్యం మొత్తం నాశనమయి పోయుంటుంది. యుద్ధం యొక్క దుఃఖం, తమవారిని పోగొట్టుకున్నవారి శోకం, కుళ్ళిపోతున్న శవాలు, కుక్క నక్కల పాలైన వీరాధి వీరుల దేహాలను చూసి చాలా బాధలో ఉంటాడు. అందరూ ఓదారుస్తారు. కానీ ఓదార్పు దొరకదు. కృష్ణుడు వచ్చి ఓదారుస్తాడు. ఊహూ. ఓదార్పు దొరకదు. చివరికి కృష్ణుడు ధర్మరాజును భీష్ముడి వద్దకు పంపుతాడు. పితామహుడు ఇలా చెప్తాడు. “వెనుకటికి ఒక కాలం ఉండేది. రాజ్యమూ ఉండేది కాదు, రాజూ ఉండేవాడు కాడు. తప్పూ ఉండేది కాదు, తప్పుకు శిక్ష అని ఉండేది కాదు. ఒకరినొకరు చూసుకుంటే పరస్పరులను ఎలా రక్షించుకోవడం అనే భావన మాత్రం అనిపించేది. ఎదుటి మనిషి నుండి ఏదైనా పొందాలనే, గిట్టించుకోవాలనే భావనయే ఉండేది కాదు. అది నిజమైన ధర్మయుగం. ధార్మికత ఉండిన కాలం. ఇప్పుడు మనం అక్కడి నుండి చాలా దూరం వచ్చేశాము. జరిగిందంతా జరిగిపోయింది. ధర్మాన్ని పోగొట్టుకున్నాము. అందుకే రాజు, సైన్యం, రాజ్యం కలిగాయి. అవన్నీ లేకుంటే ప్రజలు పరస్పరం కొట్టుకుని క్షోభలో మరణిస్తారు. అలా కాకుండా, ధర్మం సాకారమయ్యేలా పాలించు”. రాజులేని, రాజ్యమూలేని, తప్పులే లేని, తప్పులకు శిక్షలేలేని సముదాయ జీవితం ఎలా ఉంటుందో అది నిజమైన ధర్మ జీవితం. “బ్రిటిష్ వాళ్ళు అలాంటి ధర్మ రాజ్యంలో ఉండడానికి ఇష్టపడరు. వాళ్ళ రాజ్యమే వేరు. అందుకే వాళ్ళతో గొడవపడాలి” అన్నారు. తను చేస్తున్నది ఎందుకు, ఏమిటి అన్నది ఎలా అర్థం చేసుకున్నారు చూడండి.

ఒక విషయపు లోతును అర్థం చేసుకోవడమంటే ఆ విషయపు లోతులోని దుఃఖాన్ని అర్థం చేసుకోవడం అనే అర్థం. దుఃఖాన్నిఅర్థం చెయ్యడం అసాధ్యం. అది అనుభవంలోకి రావాలి. ఎదుటి మనిషి దుఃఖం అర్థమవుతే కరుణ, జాలి తమకు తామే కలుగుతాయి. దానికి బాపు అందెవేసిన చెయ్యి. ఆయనకు ప్రజల కష్టమే కాదు, దుఃఖం కూడా అర్థమయ్యేది. దావాలు, కోర్టులు, ఎన్నికలు వీటివల్ల సంకష్టాలు సమసిపోవు. లోతైన సంకష్టానికి ఇతర మార్గాన్నే పట్టాలి అని బాపుకు తెలుసు. అందుకే ఆయన మనుషులకు సంబంధించిన అన్ని విషయాల గురించి మాట్లాడారు. మాట్లాడింది ఎక్కువయింది అనిపించినప్పుడు మౌనం దాల్చేవారు. బాపుది సోమవారం మౌనం. చాలా అవసరమనుకుంటే రాసి చూపించేవారే తప్ప మాట్లాడేవారు కారు. బాపుకు ఇలాంటి అనేక కఠిన వ్రతాలు నియమాలు ఉండేవి. అవన్నీ తన ఇచ్ఛాశక్తిని పెంపొందించుకోవడానికి ఉన్న దారులు. ప్రజలకోసమే బ్రతకాలనే దశకు చేరుకోవడానికి అలాంటి వ్రతాలను ఆయన పూర్వసిద్ధతగా చేసుకున్నారు.

దుస్తులు, మాటలు, ఆహారం, జీవిత విధానం అన్నిటి లోనూ సాదా సీదా. ఆయన వద్ద ఉన్న వస్తువులనన్నిటినీ ఐదు పౌండ్లకు కొనవచ్చు. నేను చూసినట్టుగానే పందొమ్మిది వైస్రాయ్‌లు మా అవధిలో వచ్చి వెళ్ళారు. వాళ్లనందరినీ వణికించిన బాపు ధరిస్తున్నది ఏమిటి? కొల్లాయి గుడ్డ. దుస్తుల గురించి పట్టింపులే లేవు. పెద్ద పెద్ద అధికారులు, సేనాధికారులు, మహారాజులు, రాణులే ఈ బక్కమనిషికి, ఆయన ఉపవాసానికి బెదరడం చూసిన ప్రజలు ఈ మనిషి మహాత్ముడే అయ్యుండాలి అని నిర్ణయించారు.

బాపు దైవభక్తులు. దేవుడున్నాడు, ప్రపంచం- సంసారం అనేది మనం దాటాల్సిన ఒక భ్రమ అని చెప్పేవారు. మనుకుల సేవ చెయ్యాలనుకున్నవారు తమకు తామే కొన్నినియమాలను విధించుకుని అనుసరించాలి, త్యాగానికి సిద్ధం కావాలి అనేవారు. మనిషే అంతిమం, మన పని మనుషులు బ్రతకడానికి తగిన భూమిని రూపొందించడం అని భావించలేదు బాపు. ఆయన వద్ద ద్వేషం, ఆత్మన్యూనత, కడుపు మంట ఇలాంటివి లేనే లేవు. ఆయనతో మాట్లాడేటప్పుడు అందరూ తమకు తెలియకుండానే ఒక పెద్ద ప్రమాణాన్ని ఆయనకు అన్వయించేవారు.

కానీ ఇంత మంచి మనిషితో బ్రతకడం సులభం కాదు. నాకయితే ఆయనను అర్థం చేసుకోవడంలో, ఆయనను అనుసరిస్తున్నానా లేదా అని పరీక్షించుకోవడంలోనే జీవితమే గడచిపోయింది.

దేహధైర్యం

రాజును మార్చాలంటే రెండు దార్లట. ఒకటి అధికారం నుండి దించడం, మరోటి చంపడం. కానీ బాపు దారి రాజును ప్రేమతో మార్చడం. శత్రువులను కూడా ప్రేమతో మార్చవచ్చు అన్నది బాపు నమ్మకం. శత్రువులే ఉండనట్టు తన ప్రేమలో, కరుణలో, పట్టుదలలో, స్వీయదండనలో మనుషులను మునకలు వేయించేవారు. కొట్టడానికి వచ్చినవారికి ఎదురు తిరిగకుండా కొట్టించుకుని, వాళ్ళ పైన ఫిర్యాదు కూడా చెయ్యకుండా అకస్మాత్ బంధింపబడితే “వాళ్ళను క్షమించాను. వదిలెయ్యండి” అని బలవంతం చేసేవారు! దక్షిణ ఆఫ్రికాలో అలాగే అయ్యింది. 1897లో తెల్ల కార్మికులు ఆయన పైన దాడి చేశారు. 1908లో పఠానులు చేయిచేసుకున్నారు. 1909లో పఠానులు ఆయనను హతమార్చాలనుకున్నారు అని వార్త వచ్చింది. “దేశభక్తుల చేతిలో చావడానికి నేను బాధపడను” అని తన కొడుకుతో చెప్పారు బాపు. చూడడానికి చేతకానివారిలా కనిపించేవారు కదా! చాలా గుండెధైర్యం ఆయనకు. దేహధైర్యం. ఒకసారి జొహాన్స్‌బర్గ్‌లో భారతీయుల సభ ఉండింది. ఒక అంగుళం కూడా దొరకనంత జనాలు. ఆయన ఎక్కడకు వెళ్ళినా గుంపు మూగేది. సభ ముగిసింది. వేదిక దిగి వచ్చేటప్పుడు కొంతమంది ఆయనను చుట్టుముట్టారు. అంత దూరంలో నుంచున్న ఒకరు ఈయన వద్దకు వచ్చారు.  తరువాతా వాళ్ళిద్దరూ గుసుగుసలుగా మాట్లాడుతూ ముందుకు వెళ్ళారు. చివరికి వాడు ఈయన చేతిలో ఏదో పెట్టి వెళ్ళిపోయాడు. ఇచ్చింది ఏమిటో తెలుసా? చాకు! ఎందుకు తెచ్చాడు? గాంధీభాయిని చంపడానికి! ఎందుకు చంపడం? భారతీయులను సంఘటించే సాకుతో వారికి మోసం చేస్తున్నారు అని వాడికనిపించిందట. పోలీసులకు ఫిర్యాదు చేద్దాం అని అందరూ అంటే “వద్దు. వాడికి నేను చెప్పిన తరువాత అర్థమయ్యింది. ఇప్పుడు చాకు నాకే తిరిగి ఇచ్చేశాడు. వాడిప్పుడు నా మిత్రుడు. పోలీసు ఫిర్యాదు చేసుంటే శత్రువయ్యేవాడు. చివరికి వాడి భావనలో నేను చెడ్డవాణ్ణవుతే చావడానికే అర్హుణ్ణి. పోనివ్వండి” అనేశారు.

హంతకుడి ఎదుట ఆయన చూపిన ధైర్యముంది చూశావా, మిలి, సోన్యా ఇతరులు నిరీక్షించనే లేదు. జైలులో ఉన్నప్పుడు తను కుట్టిన చెప్పులను, తనను నిర్దయగా చూసిన అధికారి జనరల్ స్మూట్స్‌కు జ్జాపికగా ఇచ్చి వచ్చారు. తరువాత దానిని గుర్తు చేసుకున్న ఆయన “ప్రతి వేసవికి ఆ చెప్పులను ధరిస్తాను. కానీ ఆ మహత్తర వ్యక్తి చేసిన ఆ చెప్పులకు నేను తగుదునా అనే శంక నన్ను పీడిస్తుంది” అన్నారు. బాపుకు 70 సంవత్సరాలయినప్పుడు ఆ అధికారి పుస్తకంలో ఏం రాశారు తెలుసా? తమను తామే బాధకు, సంకష్టానికి గురి చేసుకుని, ప్రజలలో కనికరం, శ్రద్ధ మేలుకొలిపి, దాన్నే తమ పోరాటాయుధం చేసుకునే మెలకువ గాంధీకి సిద్ధించింది అని రాశారట. దక్షిణ ఆఫ్రికాలో గాంధీభాయి పరమ విరోధి ఇంత చక్కగా ఆయనను అర్థం చేసుకున్నారు!

ప్రేమతో శత్రునాశనం అంటే ఇదే!

అలాగని బాపుతో పోట్లాడిన వాళ్ళు తక్కువా అంటే అదీ లేదు. ఆయన ఖండితవాది, లోకవిరోధి. కొందరు కోపగించుకుని దూరంగా వెళ్ళిపోయేవారు. బాపు అలాంటివారి గురించి పగలు రాత్రి ఆలోచించారు. వారు కూర్చున్నది, నుంచున్నది అంతా గమనించారు. వాళ్ళ వద్దకే వెళ్ళడానికి ఈయన ప్రయత్నించినంతా వాళ్ళనుండి దెబ్బ తిన్నారు. అయినా కానీ వాళ్ళను అందుకునే పట్టుదల పోలేదు.

నాకనిపించినంత వరకు ఆయన నుండి దూరంగా వెళ్ళినవాళ్ళు ముగ్గురు – జిన్నాగారు, డాక్టర్ గారు, హరి. బాపు ప్రతి అడుగూ కూడా ఈ ముగ్గురితో వాదిస్తూ, వారికి బదులిస్తూ, ఒప్పిస్తూ ఉన్నట్టు ఉండేది. వారితో ఎల్లప్పుడూ అశరీర చర్చ జరుపుతూ ఉండేలా ఉండేవారు బాపు.

“మరుజన్మ అని ఉంటే..”

38వ సంవత్సరంలోఅనుకుంటాను, మేము పురికి వెళ్ళాము. అది జగన్నాథ దేవాలయం ఉన్న ఊరు. బాపు, మహదేవ్ ఇద్దరూ తమ పనులు, చర్చలలో మునిగి పల్లెలకు తిరుగుతున్నారు. నేను, మహదేవ్ భార్య దుర్గా బెహన్ జగన్నాథ దేవాలయానికి వెళ్ళిపోయాము. కానీ మేము వెళ్ళొచ్చిన విషయం తెలిసి బాపు చాలా ఇబ్బందిని అనుభవించారు. ఎందుకంటే అస్పృశ్యులకు ఆ దేవాలయంలో ప్రవేశం లేదు.  “తనకు కానుకలు తెచ్చేవారికి, తన పేరిట పండుగ పబ్బాలు జరుపుకునేవారికి మాత్రమే ఆయన దేవుడు. అస్పృశ్యులను వద్దనే జగత్తుకు నాథుడవడానికి ఎలా సాధ్యం? అలాంటి చోటికి ఏ దేవుణ్ణి వెతుకుతూ వెళ్ళారు?” అని బాపు వాదన వరస. రాత్రంతా నిద్రపోలేదు ఆయన.

వెనుకా ముందు చూసుకోకుండా ఒక దేవాలయానికి వెళ్ళొచ్చిన సంఘటన, మమ్మల్ని మేము మళ్ళీ మళ్ళీ తిరిగి చూసుకునేలా, పశ్చాత్తాపం-ప్రాయశ్చిత్తం-సేవలకు పురికొల్పింది. నాకింకా గుర్తుంది, ఒక వైపు సముద్రపు ఘోష, మరొక వైపు బాపు నిట్టూర్పు భయం. నేను, దుర్గ బాపును మన్నించమని అడిగాము. అది ఆయనకు మరింత బాధను కలిగించింది. చెప్పేవి ఆచారాలు, దూరేవి దొమ్మరి గుడిసెలు అన్నట్టు, 20-30 సంవత్సరాల నుండి చెప్తున్నాను, అయినా కాని తన ఇంటివారే ఇలా చేస్తే ఇంకేం చేసేది? తను చెప్పే పద్దతే సరిగ్గా లేదా? ఎదుటివాళ్ళకు అర్థమయ్యేలా తను చెప్పడం లేదా? అని తమను తామే ప్రశ్నించుకున్నారు. ‘హరిజన’ పత్రికలో పుటల కొద్దీ రాసే మీరు, దాన్ని ఇంటివాళ్ళకు చేరేలా చెయ్యకపోతే ఎలాగ అని మహదేవ్‌ను అడిగారు.

ఇప్పుడు ఈ అలోచనలు నాకు తెలిసాయి. కానీ అప్పుడు ఈ విషయంలో బాపుకంటె వెనుకబడి ఉన్నాను. కాబా బాబు ఇంటికి ఉల్కా అనే భంగి పాయిఖానా కడగడానికి వచ్చేవాడు. నేను పెళ్ళి చేసుకుని వచ్చాక కూడా ఆయనే వచ్చేవాడు. ఆయనను ముట్టుకోరాదు. ముట్టుకుంటే ఏమవుతుంది అని తల్లితో మోక వాదించేవారు. మనుషులను ముట్టుకుంటే దోషం ఎలా వస్తుంది? అలా చెప్పేది ధర్మశాస్త్రం ఎలా అవుతుంది అని వాదించేవారు. కానీ నాకు కూడా ఆయన ఈ వాదన అర్థమయ్యేది కాదు. భంగిలను ఎలా ముట్టుకుంటాం అనే నా మనసు భయంతో అడిగేది. తరువాత అస్పృశ్యులను ఆశ్రమంలో పెట్టుకోవడం, గోమాంసం తినే క్రైస్తవ-ముస్లిములను ఆశ్రమంలో పెట్టుకోవడం, ఇతరుల మలం కుండలను మేము తీయడం, రుచి అనిపించిందల్లా వదలిపెట్టడం, నగలు, చీరలు వదిలేసి చేత్తో నేసిన ఖద్దరు చీర కట్టుకోవడం – ఇవన్నీ మొదట మొదట ఒప్పుకోవడానికి చాలా కష్టం కలిగించిన సంగతులు. మా ఆయన పట్టుదలతో మళ్ళీ మళ్ళీ తెలిసేలా చెప్పేవారు. “కస్తూర్! నీ శరీరం యొక్క కన్ను, చెవి, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు వీటిలో ఏది మేలు? ఏది తక్కువ? అలాగే సమాజం కూడా. భారతదేశపు సమాజం ఒక శరీరమనుకో. ఒక్కొక్కరిది ఒక్కొక్క పని. ఎవరూ ఎక్కువ కారు, ఎవరూ తక్కువ కారు. ఎవరూ అనవసరమూ కారు..” అనేవారు. కానీ ముందు ముందు అవన్నీ సమాజం యొక్క దిశనే మార్చే పెద్ద అడుగులు అని అర్థమయ్యింది. ఎందుకు బాపును అందరూ మహాత్ముడంటారు అని మరింత స్పష్టంగా అర్థమయ్యింది.

ఒక బనియాగా పుట్టిన మా ఆయనకు అస్పృశ్యత గురించి ఇలాంటి ఆలోచనలు రావడమే విశేషం. ఎందుకంటే ఒక అస్పృశ్యుడుని ముట్టుకున్న దోషాన్ని ఒక ముసల్మానుని ముట్టుకుని పోగొట్టుకోవాలి అని అనేవారు మా జాతివాళ్ళు. అలాంటి జాతి బాపు అదెంత మారిపోయారు అంటే పువ్వు పండయిపోయినంత మార్పు అది. లండన్ ముందుగా ఆయనను మార్చింది. దక్షిణ ఆఫ్రికా, భారతంలోని అంబేడ్కర్ గారు ఆయన ఆలోచనను చాలా మార్చారు. “అస్పృశ్యతను ఒప్పుకున్న ధర్మశాస్త్రాలు ధర్మశాస్త్రాలే కాదు, అవి అ-ధర్మశాస్త్రాలు. నా కళ్ళు తెరిపించిన అంబేడ్కర్ మహాత్ముడే మరి” అనేంత ఆయన మారిపోయారు.

అంబేడ్కర్ గారిని కలవక ముందే బాపు అస్పృశ్యత గురించి ఆలోచించారు. కానీ జాతి గురించి ఎక్కువ ఆలోచించలేదు. తామే జాతి నియమాల కష్టాలను అనుభవించారు కదా! అప్పుడు కూడా జాతి పద్ధతిలోని లోపాలను విరోధించారే కానీ, జాతి నిర్మూలన జరగాలి అని ఆలోచించలేదు. దక్షిణ ఆఫ్రికాలో ఇంటి పనులకు అస్పృశ్యులను తీసుకొచ్చి, నేను వ్యతిరేకించినప్పుడు చేయి చేసుకున్నారు. అంత జరిగినా కానీ జాతి నిర్మూలన ఆయన మనసులోకి రాలేదు. అది ఉండాలి అనే అనేవారు. కానీ ఇక్కడికి వచ్చినాక కేరళలోని దాక్షాయిణి, ఇతరులతో కలిసిన తరువాత మెల్లమెల్లగా మారుతూ పోయారు. అన్నిటికంటే డాక్టర్ గారి దేవాలయ పోరాటం, ఆయనతో చేసిన చర్చలు, ఆయన రాతలు, అయన కార్యాలు చూస్తూ, చదువుతూ, గమనిస్తూ పోయినట్టల్లా బాపులో పెద్ద మార్పు జరిగింది. పుణెలోని యరవాడా జైలులో ఉపవాసం చేస్తూ డాక్టర్ గారితో జరిగిన చర్చ తరువాత పూర్తి మారిపోయారు. మొదట అంతరజాతి వివాహం చేసుకుంటే సమాజంలో కష్టం అనేవారు. తరువాత దేవదాసుకు అంతర జాతి వివాహం చేయించారు. అంతరజాతి వివాహాలకే వెళ్ళేవారు.

కానీ డాక్టర్ గారికి దగ్గరవ్వాలని చేసిన ప్రయత్నాలలో బాపు ఓడిపోయారు. లోపలే దెబ్బ తిన్నారు. అస్పృశ్యులను బానిసలుగా చేశారు కాబట్టే భారతీయులు బ్రిటిష్ వాళ్ళకు బానిసలుగా ఉండడానికి తగినవారు. అయిదింట ఒక భాగం ప్రజలను బానిసలుగా చేసిన వాళ్ళు స్వరాజ్యానికి అర్హులు కారు, జలియన్ వాలా బాగ్ కంటే హీనమైన హత్యాకాండను వాళ్ళపై మోపడానికి సవర్ణీయులు అర్హులు అనేది వారి భావన. అన్నిదేవాలయాలలోనూ అస్పృశ్యులకు ప్రవేశం కల్పించాలి అంటూ పుణె యరవాడ జైలులో ఉపవాసం చేసి, చివరికి డాక్టర్ గారే ఆయన ప్రాణాలు కాపాడారు. ఒకసారి మరుజన్మంటూ ఉంటే భంగిగా జన్మించాలని కోరుకుంటాను అనేశారు! ఒక విలేకరి “స్వరాజ్యం అంటే ఏమిటి?” అని అడిగితే, “ఎక్కడ భంగికి, మహారాజుకు తేడా ఉండదో, ఎక్కడ  భంగికీ, బ్రాహ్మణుడికీ తేడా ఉండదో అలాంటి స్థితి స్వరాజ్యం” అన్నారు.

మొత్తానికి భంగి కాని మనుషులలో ఏర్పడాల్సిన పెద్ద మార్పు ఇది. సత్యంగా చెప్పాలంటే ఆయనలోని మార్పును జీర్ణించుకోవడానికి నాకే కష్టమనిపించేది. ఇక మిగితా ఆశ్రమవాసులు, బంధువులు, దేశ ప్రజల కథ చెప్పనవసరం లేదు.

భారతానికి వచ్చిన తరువాత అస్పృశ్యత ఆచరణ అంత పాపమో అని సవర్ణీయ హిందువులకు తెలియ చెప్పడానికి దేశమంతటా తిరగాలని కార్యక్రమం వేసుకున్నారు. ‘హరిజన సేవా సంఘం’ ప్రారంభించారు. దేశమంతటా సంచరించి నాలుగు లక్షల నిధిని సేకరించారు. కానీ బనారస్ హిందువులు, ఎవరో స్వామి లాలనాథ్ అని, బాపు వెంట వెంటే, ఆయన వెళ్ళిన పల్లెలకూ వెళ్ళి ‘హరిజన సేవా సంఘం’ కార్యక్రమాలను నిరసిస్తూ ఉపవాసం చేసేవారు. సత్యాగ్రహం చేసేవారు. నల్ల జెండా ప్రదర్శన, రోడ్డుకడ్డంగా పడుకోవడం, బాపు బొమ్మను కాల్చడం చేసేవారు. అస్పృశ్యత నివారణ ద్వారా గాంధీ హిందూమతం యొక్క మూల రచనను నాశనం చెయ్యడానికి పూనుకున్నారు, ఆ సాకుతో కాంగ్రెస్‌కు డబ్బు సంగ్రహిస్తూ ఉన్నారు అని ఆయన ఆరోపణ. ఏ ప్రదేశంలో సంగ్రహమైన సొమ్ములో మూడు వంతులు అక్కడి అస్పృశ్య సముదాయ సేవకే వినియోగించాలని బాపు అంతకు ముందే చెప్పున్నారు. కానీ సనాతనవాదులకు నమ్మకం కుదరలేదు.

పిల్లలు ఒక ఆట ఆడ్తారు. నువ్వు చూసుండొచ్చు. కళ్ళు మూసుకుని నేలపైన గీసిన ఒక గడి నుంచి ఇంకో గడికి గీత తొక్కకుండా ఎగిరి “అంబ్రిట్?” అని మిగతావాళ్ళను అడుగుతారు. అది అంబ్రిట్ కాదు “యామై రైట్” అని నాకు తరువాత తెలిసింది. బాపుకు అలాంటి కొన్ని గుణాలుండేవి. ఆయన ఆలోచించి, కళ్ళు మూసుకుని గడి నుండి ఇంకో గడికి వెళ్తున్నా “అంబ్రిట్?” అని మిగతావాళ్ళను అడుగుతూనే ఉండేవారు. ఇలా అడిగే  గుణం విశేష గుణమే, కాని దానికి పరుషమైన బదులు వస్తే అది కలిగించే  బాధ కూడా విశేషమైనదే. అస్పృశ్యతను నిర్మూలించడానికి ఏవేవో క్రమపద్ధతులను ఆలోచించి, అటువైపు వెళుతూ “అంబ్రిట్?” అని అడిగేవారు. ప్రోత్సాహకరమైన బదులు వస్తుందనే నిరీక్షణలో. కానీ చాలా మటుకు చాలా బాధ కలిగించే జవాబులే దొరికాయి.

బాపు జీర్ణించుకోవాలసిన ఒక విషయం ఉండింది. ఎన్నిప్రయత్నాలు చేసినా అస్పృశ్యులు కాని వారు అస్పృశ్యత నిర్మూలన గురించిన ప్రయత్నాలు, ఆదుర్దా అనిపించుకుంటాయి అంతే. కానీ దాన్ని అనుభవించినవారిది నిజమైన బాధ అయ్యుంటుంది. ఆదుర్దా, బాధ వేరు వేరు. ఆడవారి మనసు, కష్టాలు తెలుసుకోవచ్చు. కానీ ఆమె బాధ అనుభవిస్తే కాని తెలియదు. ఆదుర్దా ఆయుష్షు, బాధ లోతు వేరు వేరు. బాపుకు ఇది అంతగా అర్థం కాలేదు. అస్పృశ్య సముదాయం వారు తన ఆరాటాన్ని సందేహించిన కొద్దీ మరింత ఆ కార్యంలో నిమగ్నమయ్యేవారు. అస్పృశ్యులతో పాటు ఇతరులు కూడా వారి సేవలో పాల్గొనాలనేవారు. అది పాప పరిహారార్థం చేయవలసిన సేవ అనేలా చూసేవారు. ఆయన ఈ దృక్పథం ‘హరిజన సేవా సంఘం’ ‘హరిజన యాత్ర’లను అస్పృశ్య సముదాయం వారే సందేహంతో చూసేలా చేసింది.

బాపును, డాక్టరు గారిని దగ్గరనుంచి చూసిన నాకు అనిపించింది ఇది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here