నేను.. కస్తూర్‌ని-22

0
11

[వృత్తి రీత్యా వైద్యులైన డా. ఎచ్. ఎస్. అనుపమా కన్నడంలో రచించిన జీవితకథని శ్రీ చందకచర్ల రమేశ బాబు అనువదించి ‘నేను.. కస్తూర్‌ని’ అనే పేరుతో సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నారు.]

~

అతి నిజాయితీ

[dropcap]బా[/dropcap]పును తలచుకుంటే ఒక చిత్రం నాకళ్ళ ముందు కదలాడుతుంది. అది తన ఒంటి పైన కొరడాతో బాదుకునే గణాచారి చిత్రం. ఊరికే ఇచ్చింది వద్దంటాడు. తీసుకున్న దానికి ప్రతిగా కొరడాతో ఒంటి పైన బాదుకోవడం. దానివల్ల వారికే కాదు, చూసేవాళ్ళకు కూడా బాధ. ఇంకా చెప్పాలంటే వారికంటే చూసేవారికే ఎక్కువ బాధ. బాపు ఆత్మశుద్ధికి, పశ్చాత్తాపానికి అంటూ తమను తామే కఠిన శిక్షకు గురి చేసుకునేవారు. ఒక చెంపకు కొడితే మరో చెంపను చూపించు అని క్రీస్తు చెప్పిన మాటను ఎప్పుడూ చెప్పేవారు. కానీ అది ఆయన నిజాయితీగా ఉండేటట్టు చేయడమే కాక, అహింస స్వహింస అయ్యేట్టుగా కూడా చేసింది.

దక్షిణ ఆఫ్రికాకు వెళ్ళేటప్పటికి మోక భాయి అటార్ని అయ్యున్నారు. పడవ క్యాప్టన్‌తో చదరంగం ఆడుతూ వెళ్ళారట. ఆ క్యాప్టన్ ఒక నల్లజాతి అమ్మాయితో పడుకుంటావా అని అడిగాడట. లేదు, అది సబబు కాదు, నాకు పెళ్ళయ్యింది అన్నారట. తరువాత దీన్నికూడా నాతో చెప్పారు. ఆయన ఎలాగంటే అంతా చెప్పేసేవారు. ఆయన చేసేదంతా ఆయన చుట్టూతా ఉన్నవారికి తెలిసేలా బహిరంగంగా చేసేవారు. రహస్యమన్నదే లేదు. అందరి మనసుల్లోనూ కొన్నిరహస్యాలు ఉండనే ఉంటాయి. వాటిని మనలో మనమే చెప్పుకోవడానికి కానీ, మనలో మనమే ఆలోచించడానికి కూడా ఇష్టపడం. కదా ? కానీ బాపు అలా కాదు. అంతా బహిరంగం. తెలిస్తే ఆయన గురించి లోకం మంచిదనుకుంటుందో, చెడుగా వర్తిస్తుందో అని ఆయన ఆలోచించేవారే కాదు. లోకపు ప్రతిక్రియ వలననే తనను తాను తిద్దుకోవడానికి ఎక్కువగా వీలవుతుంది, కాబట్టి అనేవారు ఏమైనా అననీ అనే భావించేవారు. అంతరంగ పరీక్షకు లోనవ్వని జీవితం బ్రతకడానికి అర్హత లేనిది అనే ఆయన భావన. తమదే కాదు. మా చిన్నా చితకా తప్పులను కూడా అందరి ఎదుటా చెప్పి మమ్మల్ని మరమ్మతు చేయాలని కోరేవారు. దీనివలన ఇతరులకు ఆయన నిజాయితీ పట్ల సందేహమే లేకుండా, వారు కూడా నిజాయితీపరులుగా ఉండేలా చెసేది.

కానీ కొన్ని సార్లు మనం అనుకున్నదానికంటే ఇంకోలా కావడం కూడా జరిగేది. లూయి ఫిషర్ అనే రచయిత ఆశ్రమానికి వచ్చి మాతో పాటు ఉండేవాడు. 1938వ సంవత్సరం అనుకుంటాను. హిట్లర్ యొక్క భీకర నరమేధానికి యూదులు ఏం చెయ్యాలి అని అహింసావాది అయిన బాపును ఆయన అడిగాడు. “ఒకటి తమ సమ్మతితో ప్రాణాలు అర్పించాలి లేదా సామూహిక ఆత్మహత్య చేసుకోవాలి, అప్పుడు విశ్వం, జర్మనీ ప్రజలు మేలుకునేవారు. ఎలాగూ చావు తప్పదు, కానీ అలా జరిగినప్పుడు యూదులు ఒక ప్రాముఖ్యత సంతరించుకుని చనిపోయేవారు” అని చెప్పారు బాపు! ఫిషర్ ఉలిక్కిపడ్డాడు. యుద్ధం సమయంలో కూడా అంతే. మీరు రెండింటిలో ఒకరి వైపు ఉండి తీరాలి అనేవారు. “ప్రాణం పోగొట్టుకోవడానికి మీరు తయారుగా లేకపోతే, ఇంకే రీతిగానో చావడానికి మీరు సిద్ధమవాలి” అనేవారు. అహింసావాది, ధార్మిక వ్యక్తి యొక్క ఇలాంటి శాంతితత్త్వం కొందరికి విచిత్రమనిపించేది. తను ఇలా అంటే ఇతరులు ఏమనుకుంటారు అనే జంకు లేకుండా అనేసేవారు.

మేము పావలా అడిగినా “నావద్ద లేవు” అనేవారు. “అత్యవసరమైతే కచేరిలో అడిగి తీసుకోండి” అనేవారు. ఆయనకు డబ్బుల అవసరం ఉండేది. ఆశ్రమం, పత్రిక, సంఘసంస్థలు, పోరాటం, అభియానం వీటన్నిటికీ డబ్బు అవసరం ఉండేది. కానీ తనకోసం కాదు. పేదరికమే ఒక విలువ అనే భాయికి కొందరు శ్రీమంతుల స్నేహం ఉండేది. “సంపాదించండి. తరువాత పశ్చాత్తాపం చెంది సద్వినియోగం చెయ్యండి. కలిమి పాపం కాదు. డబ్బులు ఎలా సంపాదించింది, ఎలా వినియోగించింది అనేదే ముఖ్యం” అని శ్రీమంతులకు చెప్పేవారు. ఇతరులు శ్రీమంతులనుండి డబ్బును ‘తీసు’కుంటే. బాపు ఇవ్వడం ద్వారా ఇచ్చేవాళ్ళను మార్చవచ్చా అని ప్రయత్నించారు. ఇలా సారాభాయి, బిర్లా, బజాజ్, పెటిట్ మొదలైన భారీ వ్యక్తులు బాపుకు దగ్గరయ్యారు. వారి వద్దనుండి ఒక్క పైసా కూడా తనకోసం, తన భార్యాపిల్లల కోసం తీసుకోలేదు. అంతా పార్టి-సంఘ సంస్థలకు అనే అడగడం ఒక విశేష గుణమనే చెప్పుకోవాలి.

శ్రమే దైవం

తిలక్ గారు కాలం చేసినప్పుడు మూడు రోజులు హర్తాళ్ అని అంతా చెప్పారు. కానీ బాపు దానికి సుతరామూ ఒప్పుకోలేదు. “ఒక్క రోజు చాలు. అది కూడా ఆయన పేరిట ఏదైనా మంచి పని చేద్దాం. ఆయన సరళత, పరిశుద్ధ జీవితం, ధైర్యం, దేశభక్తిని ఒంటబట్టించుకుందాం. అవేవీ కాకపోతే ఒక పైసాతో మొదలు పెట్టి ఒక రాష్ట్రం వరకు మన వద్ద ఉన్నదాన్ని దేశానికిద్దాం. అంతే కాని, సెలవు మాత్రం వద్దు” అనేశారు. బాపుకు ఎప్పుడూ పని, పని, పని. ఒక్క రోజు కూడా ఊరికే కూర్చునేవారు కాదు. తనతో పాటు తనతో ఉన్నవారందరికీ పని ఒప్పచెప్పేవారు. దిట్టంగా ఉన్న బిచ్చగాళ్ళకు తినడానికి ఇవ్వు అనేవారు కాదు. అందరూ శ్రమించి కష్టపడి పనిచేసే తినాలి అనేది ఆయన తత్త్వం. అందరూ పనిచేసే తినాలి. పనిచెయ్యనివాడికి తిండి లేదు. కనీసం అంటే నూలు వడకాలని అయినా సత్రాలలో చెప్పాలి. ఉచిత భోజన కేంద్రాలకు బదులుగా ఉచిత ఉద్యోగ కేంద్రాలను దానులు తెరవాలని చెప్పేవారు.

దక్షిణ ఆఫ్రికానుండి వచ్చిన తరువాత రవీంద్రనాథ్ ఠాకూర్ గారి ఇంటికి వెళ్ళాము. ఒక వారం పాటు శాంతినికేతన్‌లో ఉన్నాము. రవీంద్ర గురువులతో మొదటి కలయిక అది. గదిలో ఆజానుబాహువైన కవీంద్రులు కూర్చున్నారు. ముందు బాపు నమస్తే గురుదేవా అన్నారు. వెంటనే, “నేను గురుదేవ అయితే, మీరు మహాత్ములే మరి” అన్నారాయన. అదే పేరు ఉండిపోయింది. చివరిసారిగా ఆయనను చూడడానికి వెళ్ళినప్పుడు “శాంతినికేతన్ బాధ్యత మీరు వహించాలి” అన్నారు మాకు. దానికి బాపు “దీన్ని వహించుకోవడానికి నేనెవర్ని? ఇది ఒక అమూల్యమైన, ఉదాత్తమైన చైతన్యంతో ప్రారంభమయ్యింది. ఇది అలాగే కొనసాగుతుంది” అన్నారు. అప్పుడు దాన్ని నడపడం కొంచెం కష్టంగా ఉండింది. బాపు రెండు విషయాలను గుర్తించి చెప్పారు – ఒకటి అక్కడివారు తమ పనులను తామే చేసుకునేలా శ్రమదానం, సామూహిక పనులు-సామూహిక భోజనాలు ప్రారంభించాలి. ఎవరికీ కూడా ఊరికే భోజనం ఉండరాదు. రెండోది, ఒక మహాకవి డబ్బులకు కటకటలాడుతూ జోలె పట్టి ఆశ్రమం నడపనవసరం లేకుండా, తమ శ్రమను తాము చేసుకునేలా ఆశ్రమాన్ని రూపొందించాలి.

తను చనిపోయే సమయంలో కూడా పని చేస్తూ ఉండేలా ఉండాలని అనేవారు బాపు. అందులోనూ రాట్నం వడుకుతున్నప్పుడు తనకు చావు వస్తే తను ధన్యుడిననేవారు. ఆయన శ్రమపట్ల ప్రేమ రాట్నం చేతికి వచ్చాక ఇంకా ఎక్కువయ్యింది. ఆశ్రమానికి ఎవరే రానీ, వారిని రాట్నం తిప్పమని చెప్పేవారు. అక్కడ ఉండిపోవడానికి వచ్చినవాళ్ళయితే ఇక వాళ్ళ పనులు వాళ్ళే, వాళ్ళ వంతు పనులు వాళ్ళే చేసుకోవాల్సి వచ్చేది. దీనికి ఎవరికీ రాయితీ ఉండేది కాదు. ఎంతో మంది విదేశీ విలేఖరులు, సాహిత్యవేత్తలు, ధార్మిక వ్యక్తులు ఇంకా ఎవరెవరో వచ్చేవారు. వాళ్ళకంతా ఖాదీ తొడిగించేవారు. రాట్నం తిప్పమని చెప్పేవారు. ఆశ్రమంలో పనివాళ్ళు ఎవరూ లేనందున అందరూ వాళ్ళ వాళ్ళ పనులను వాళ్ళే చేసుకోవాలని చెప్పేవారు. వచ్చినవారు ఏ పని చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎక్కడి నుండి మొదలుపెట్టాలి అని ఆలోచించేలోపే బాపు చిమ్మి, తుడిచి, నీళ్ళు చల్లి, వడుకుతూ పని ప్రారంభించేసేవారు. బాపు స్వతహగా పని చేస్తుంటే మనదేమిటి అని వచ్చినవారు కూడా పనులు చేసేవారు. అలా ఒక్క సారి వచ్చి, బాపును చూసి వెళ్ళి, బ్రతుకు దిశనే మార్చుకున్నవారు ఎంతో మంది.

శ్రమ పడడం అహం నాశనమవడానికి ఒక దారి అన్నది బాపు భావన. నిజమే. తమాషాకు నేను బాపుతో ”పని మీ మొదటి భార్య. నేను ఏమున్నా తరువాత వచ్చినదాన్ని” అనేదాన్ని! “పుణ్యం! నన్ను ఇంత అర్థం చేసుకున్నావు కదా” అంటూ నవ్వేసేవారు.

“ఇక డబ్బులు పంపడం నావల్ల కాదు”

దక్షిణ ఆఫ్రికాలో లాయరుగిరి బాగుండింది. కానీ జీవితం తరచుగా మారేది. సాధారణ ఆశ్రమ జీవితమే అయినా భారతీయుల పోరాటానికి మా ఆదాయం ఖర్చయిపోయి, రాజకోట్‌కు డబ్బు పంపడానికి అయ్యేది కాదు. ఒకసారి లక్ష్మీదాస్ బావ చాలా ఘాటుగా ఉత్తరం రాశారు. ఆయన ప్రకారం మోక బ్యారిస్టర్ చదవడానికి ఆయన 13,000 రుపాయలు ఖర్చు చేశారు. “అంత కష్టపడి చదివించాము. నువ్వు నెలకు 100 రుపాయలయైనా పంపు” అని అడిగారు. అప్పుడు భాయి భారతీయుల కేసులను ఉచితంగా చూసేవారు. మిగిలిన డబ్బులు ఆశ్రమం నడపడానికి, ఇండియన్ ఒపీనియన్ పత్రిక నడపడానికి ఖర్చయ్యేది.

భాయి ఖచ్చితమైన లెక్కలు తన వద్ధ ఉంచుకున్నారు. తనకోసం చేసిన ఖర్చు, తను లేనప్పుడు తన భార్య, పిల్లలకోసం చేసిన ఖర్చు ఎంతో దాని రెట్టింపు డబ్బును అన్నకు పంపారు. కానీ ఇది లక్ష్మీదాస్ బావగారికి నచ్చలేదు. కష్టపడి ఇంగ్లండ్‌కు పంపింది, తమ్ముడి భార్యను పిల్లలను చూసుకున్నదాని గురించి గుర్తు చేసి, నిష్ఠూరంగా ఉత్తరం రాసేవారు. కుటుంబ బాధ్యతను పూర్తిగా మరచిపోయావని దూషించేవారు. చివరికి భాయి వినయంగా అన్నకు ఉత్తరం రాసేశారు.

“మీరు నా తండ్రి స్థానంలో ఉండి నాకు మద్దతునివ్వక పోయుంటే ఈ రోజు నేనేమయ్యానో అలా అవడానికి ఖచ్చితంగా వీలయ్యేది కాదు. తీర్చులేనంత మీ ఋణభారం నాపైన ఉంది. కానీ అది ప్రేమ, కృతజ్ఞల ఋణం. డబ్బు విషయానికొస్తే, మీరు నా పైన ఖర్చుచేసిన 13,000 రుపాయలకు గాను నేను ఇప్పటిదాకా తిరిగి ఇచ్చింది 60,000 రుపాయలు. మీరు డబ్బుతో శాంతి, సుఖాలను అపేక్షించేవారు. శాంతి సుఖాలను పొందడానికి డబ్బు అవసరం లేదని నమ్మేవాడిని నేను. నాకు కుటుంబమంటే మేమిద్దరం, అన్నదమ్ములే కాదు. సోదరీమణులు, బంధువులు, నా చుట్టుముట్టున్న అందరూ నా కుటుంబంవారే. నేను విషాదంతో చెపుతున్నాను. మీ విచక్షణ లేని ఆచారాల వలన, వైభవయుత జీవన విధానం వలన దుబారా ఖర్చు చేసి ఉన్నారు. గుర్రం బండి పెట్టుకున్నారు. స్నేహితులకు పార్టీలు ఇస్తున్నారు. స్వార్థపరులైన స్నేహితులకు డబ్బులు పోశారు. నేను అనైతికమని అనుకునే విషయాలకు ఖర్చు చేశారు. వాటన్నిటికీ ఇక నేను డబ్బులు పంపడం వీలు కానే కాదు. దీని గురించి ఇక పత్రవ్యవహారాలు చెయ్యకండి.”

ఆ ఉత్తరం అన్నకు రాసి భాయి ఊరట పొందారు. అలా రాశానని నాకూ చెప్పారు అక్కడికి భాయి గడించిన ఆదాయం పైన మా హక్కులకు కూడా హద్దులు నిర్ణయించినట్టయింది. తను సంపాదించిన డబ్బు, తను గడించిన ఆస్తి అంతటికీ తను ట్రస్టీ మాత్రమే. దక్షిణ ఆఫ్రికా భారతీయుల గురించి తన ఆదాయాన్నివినియోగించాలనుకున్నానని నాకు దశలవారిగా చెపుతూ పోయారు.

అదే సమయానికి మా హరి వాళ్ళ నాన్న పైన కోపగించుకుని, పెదనాన్న లక్ష్మీదాస్ బావ దగ్గరికి వెళ్ళాడు. ఆయన వైభవంగా వాడి పెళ్ళిచేయడమే కాక, దానికయిన ఖర్చువెచ్చాలను పట్టీ చేసి హరి తండ్రికి పంపారు. కానీ బాపు “ఈ ముందుగానే మీకు తెలిపినట్టుగా నాకు డబ్బులు పంపడం వీలు కాదు. అదీ కాక ఇది నేను ఒప్పుకునే మాదిరి జరిగిన పెళ్ళి కాదు. నా దృష్టిలో ఇప్పుడు కుటుంబం, సేవ అనే పదాలకు అర్థాలు వేరేగా ఉన్నాయి” అని మళ్ళీ గుర్తు చేసి రాశారు.

బాపు అక్క రాలియత్ కూడా తన బ్యారిస్టరు తమ్ముడు తనకు నిరంతరం సహాయం చేయాలనే భావించారు. ఆవిడ భర్త చనిపోయినప్పుడు కొడుకు గోకులదాస్ ను మేమే ఉంచుకున్నాము. కానీ భారత దేశానికి వచ్చిన తరువాత కూడా అదే అపేక్ష కొనసాగింది. అప్పుడు బాపు సబర్మతి ఆశ్రమానికి వచ్చి ఉండమని చెప్పారు. అక్కడ ఎలా ఉండాలి? అక్కడ అస్పృశ్యుల కుటుంబం ఉంది కదా అన్నారు ఆవిడ. “నాకు మైల లేనిది నీకెలా మైల అవుతుంది? నేను నీకివ్వడానికి డబ్బులు ఎక్కడినుండి తేను? స్నేహితులను డబ్బడిగితే ఆశ్రమంలో ఉంచుకో అంటారు. నువ్వేమో మైల అంటావు. నేనున్నది కూడా నీలాంటి పరిస్థితుల్లోనే. నీదేమంత సహించలేనంత కష్టం కాదు. నీకు ఎక్కువ డబ్బులు కావాలనుకుంటే రెండిళ్ళకు వెళ్ళి పప్పులు, గోధుమలు విసిరి సంపాదించు. అది ఉత్తమ మార్గం. అయినా చెప్తున్నాను. ఇక్కడికొచ్చి ఉండు. నీకు నీ సోదరుడు దొరకక పోవచ్చు. కాని, వందలాది సోదరులు దొరుకుతారు. అదే నిజమైన వైష్ణవ మార్గం.” అని ఉత్తరం రాశారు!

పర్వతానికి దుప్పటు కప్పినట్టు, తను ఎంత గడించి పంపినా బంధువర్గం తృప్తి చెందదు అని భాయికి తెలిసిపోయింది. వాళ్ళు అనుకున్నదానికంటే, తన ఇల్లు కుటుంబానికంటే కూడా తన బాధ్యత ఇంకా పెద్దది అని ఆయన భావించారు. తన సంపాదన పైన కుటుంబ సభ్యులకు హక్కు ఉన్నది వాస్తవమే. కాని తనకోసం తను చేసుకునే ఖర్చు వాళ్ళు చేసే ఖర్చుకంటే చాలా తక్కువ. సమాజం కోసం ఖర్చు చేసిన తరువాత కూడా మిగిలితే అందులో కుటుంబానికి భాగమే కాదు అంతా ఇవ్వడానికి సిద్ధం అని ఒక ఉత్తరానికి జవాబిచ్చారు.

లక్ష్మీదాస్ బావకు కొంత అనారోగ్యం పొడసూపసాగింది. తమ్ముడికీ తెలిపారు. తనకు ఇప్పుడు పిత్రార్జిత కుటుంబ-ఆస్తి పైన ఏ రకమైన ఆశ కూడా లేదని, ఒకవేళ అన్నయ్య తనకంటే ముందే చనిపోతే మాత్రమే కుటుంబాన్ని చూసుకుంటానని బాపు తెలిపేశారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత కూడా తనకు అని ఒక ఇంటిని కూడా చేసుకోలేదు. తన పేరిట, పిల్లల పేరిట ఆస్తి కొనలేదు. బాపు అన్న పిల్లలు, అక్క పిల్లలు అంతా మాతోనే ఉండేవారు. సహాయం చేసేవారు. కానీ మనది అని ఇల్లు, ఆస్తి, నగలు, ధనం ఏమీ చేసుకోని భాయి తత్త్వాలను జీర్ణించుకోవడం సులభం కాదు. “ఒక బలహీనుడు తనకు అవసరం ఉన్నవాటిని సమకూర్చుకోవడానికి కాకపోతే నేను కూడా దాన్ని త్యజిస్తాను. ముందుగా అతడి అవసరాలను సమకూర్చి తరువాత నేను సమకూర్చుకుంటాను” అన్నదాన్ని జీర్ణించుకోవడం మా బంధువులకు చాలా కష్టమయ్యింది. మిగతావాళ్ళు సరే, మా అబ్బాయికే కష్టమయ్యింది. పైన వేసుకున్న పేదరికం, ఆశ్రమ జీవితం, బ్రహ్మచర్యం, నిగ్రహం, సత్యాగ్రహం మొదలైనవి హరికి అర్థం కాలేదు.

చివరికి దేశం నలుమూలల నుండి వచ్చిన, అన్నిమత ధర్మాల ప్రజలున్న ఆశ్రమ జీవితాన్ని మేము కొనసాగించినప్పుడు, బాపు గురించి దేశమంతా అనుకోవడం ప్రారంభించాక తమ కుటుంబానికి చెందిన మోక సాధారణ వ్యక్తి కాడు అని కుటుంబానికి కొంచెం కొంచెంగా అర్థమయ్యింది. అయినా కానీ, కుటుంబానికి ద్రోహం చేసిన మహాత్ముడనే రాజకోట్-పోరుబందర్ బంధువులు చాలా కాలం భావించారు.

హిందూస్తాన్‌కు ఒక మహాత్ముడు ఉదయించడానికి కాబా గాంధీ కుటుంబం మోకను వదలుకుని తీరాల్సివచ్చింది.

“నేను సగం ఆడదాన్ని”

ఒక మగవాడు తను సగం ఆడదాన్నిఅని చెప్పుకోవడం, మంచితనం వైపు మళ్ళడానికి ఒక ప్రయత్నం. దీన్నే కదా అర్ధనారీశ్వర కల్పన అనేది? కానీ ఈ దేశం మగవారు, అందునా మావైపు మగవారు, అర్ధనారీశ్వరుణ్ణి మరచిపోయి, తన పాదాల చెంత కాళ్ళుపట్టే లక్ష్మిని పెట్టుకుని పడుకున్న విష్ణువును పూజిస్తూ వైష్ణవులయ్యారు. పెద్ద పెద్ద తత్త్వనీతులు మాట్లాడుతారు. కానీ నోట్లో వేదాంతం, చేసేదంతా రాద్ధాంతం. అలాంటి వాళ్ళ మధ్యనుండి లేచివచ్చిన అర్ధనారీశ్వరుడు నా భర్త.

బాలింతరాలికి పక్క శుభ్రం చెయ్యడం, ఆహారం నీళ్ళు ఇవ్వడం భర్తే చెయ్యాలి, ఆమెను ముట్టుకోకూడదనే మన ఆచరణ పూర్తిగా తప్పు అన్నది బాపు వాదన. మిలి, బాపు, ఇలాంటి ఒకటి కాకపోతే మరో విషయం గురించి చర్చ జరుపుతూనే ఉండేవారు. ఒకసారి బాపు తూర్పు ఆడవాళ్ళ పరిస్థితి పాశ్చిమాత్య ఆడవాళ్ళ కంటే గౌరవయుతంగా ఉంది అన్నారు. మిలి ఊరుకుంటుందా, తూర్పువాళ్ళు ఆడదాన్ని పూర్తిగా పరాధీనగా ఉంచి, ఆమెకు వ్యక్తిగత జీవితమే లేకుండా చేశారని అన్నది.

“లేదు లేదు. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు మిలి. తూర్పులో ఆడదాన్ని పూజిస్తాము మేము”

“నాకయితే అలా అనిపించలేదు భాయి. మగవాడి అవసరాలను చూసుకోవడానికి ఆవిడ పోరాడుతూ ఉండేలా చేసి ఉంచారు మీరు..”

“లేదమ్మా. అన్ని చోట్లా ఆడది మగవాడితో జతజతగా నడుస్తుంది. కొన్ని సార్లు అతడిని మించిపోతుంది కూడా.”

“అలాగయితే భర్త కుర్చీ పైన కూర్చోవాలి, భార్య ఆయన వెనుక దాసీలా సేవకు సిద్ధంగా నుంచుని ఉండాలి అని ఎందుకనుకుంటారు? మగవాళ్ళు ఆడవాళ్ళను సమానమని పరిగణిస్తారు అని ఎలా చెప్పగలం?”

“నువ్వు చెప్పేది నిజం మిలి. మావైపు మగవాళ్ళు ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు. కానీ అలాగని మగవాళ్ళకందరికీ తెలిసిపోయింది” అని నవ్వుతూ అన్నారు బాపు.

బాపు ఉన్నచోట నేనుంటే సాయంత్రం ఆయన కాళ్ళు కడగడం నాకు అలవాటు. నాకు అందులో ఆక్షేపణ కనిపించలేదు. ఒత్తిడి అయితే అసలు లేదు. అలా చెయ్యడానికి నాకొక్కదానికే అధికారం ఉంది అని ఒక విధమైన గర్వం నాకు. కాని మిలి, సోన్యాల లాంటి ఆడవాళ్ళు “నీ భార్య నీకు చేసేది నువ్వు చెయ్యగలవా?” అని అడిగేవారు. కానీ అప్పటికే ఏ మగవాడూ చేయని నా పనులను బాపు చేసేవారు. నాకు నా ఆరోగ్యం సహకరించడం తక్కువే. నేను ఆయనకు చేసిన సేవకంటే ఆయన నాకు ఎక్కువే సేవ చేశారు. నేను రోగిష్ఠి గానే ఎక్కువగా ఉండేదాన్ని. అప్పుడంతా నాకే ఇబ్బందిగా అనిపించేలా తమ రోగిష్ఠి భార్యకు సేవ చేశారు ఆయన.

మా సమయంలో నేను చూశాను, తమ భార్యలను నోరు విప్పడానికి ఎవరూ అనుమతించేవారు కారు. ఈ మహాత్ముడు మాత్రం “నువ్వు మాట్లాడు, మాట్లాడు” అని చెప్పేవారు. నేను మాట్లాడలేను అని చెప్పినా “లేదు. నీకు ఏమనిపిస్తుందో అదే మాట్లాడు” అనేవారు. నువ్వే ఆలోచించు, మాట్లాడు, నిర్ణయం తీసుకో, చర్చించు అనేవారు. చివరికి ఏం చెయ్యమంటావ్ అని నన్నే అడిగేవారు. ఒకసారి సిమ్లాకు వైస్రాయ్ విలింగ్డన్ గారిని చూడడానికి వెళ్ళినప్పుడు నన్ను కూడా వెంటపెట్టుకుని వెళ్ళారు. అనసూయా సారాభాయ్ కూడా ఉన్నారు. ఏం మాట్లాడను అని అడిగాను. “అది నువ్వే ఆలోచించు. కుదిరితే నన్ను వదిలేసి ఆలోచించు” అన్నారు. ఆశ్చర్యమేమంటే ఇలా నాకు నేనే స్వంతంగా ఆలోచించి మాట్లాడడానికి ప్రారంభించాకనే నేను ఎవరు అని నాకు అర్థమయ్యింది. ఆలోచించి మాట్లాడడానికి ప్రారంభించినాకనే బాపు నాకు అర్థమయ్యింది. ఆలోచించడం వల్లనే బహుశా బాపుకు కూడా అందరూ అర్థమవుతూ ఉండింది!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here