నేను.. కస్తూర్‌ని-3

1
11

[వృత్తి రీత్యా వైద్యులైన డా. ఎచ్. ఎస్. అనుపమా కన్నడంలో రచించిన జీవితకథని శ్రీ చందకచర్ల రమేశ బాబు అనువదించి ‘నేను.. కస్తూర్‌ని’ అనే పేరుతో సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నారు.]

అమ్మాయ్, ఎలా వున్నావు? అంతా బాగున్నారా ?

[dropcap]నే[/dropcap]ను, కస్తూర్ గోపాలదాస్ మకన్జి కపాడియాని. గుజరాత్ లోని కాథేవాడ్ ప్రాంతంలోని పోరుబందర్‌కు చెందిన గోపాలదాస్, వ్రజ్ కుంవర్‌ల కూతుర్ని. మీకు తెలుసా? నేను 150 సంవత్సరాల క్రితం పుట్టిన దాన్ని. 75 సంవత్సరాలు అందరితోనూ జీవించాను. తరువాత 75 సంవత్సరాల నుండి మీ అందరి స్మృతులలో ఉన్నాను. ఇల్లెక్కడ, భర్త, పిల్లలు ఎక్కడ అని అడుగుతున్నారా? నిజం చెప్పాలంటే భర్త, పిల్లలు అని ఒక కుటుంబం నాకు లేనే లేదు. లేదా మేము అలా ఉండనే లేదు. నా భర్త ఒక లోక సంచారి. పిల్లలు నలుగురు. అందరూ మగ పిల్లలే. వారిది కూడా లోక సేవే. మేమంతా కలిసిందే చాలా తక్కువ. కాబట్టి నాకు ఎప్పుడూ ఇల్లనేది లేనే లేదు. లేదా అందరి ఇళ్ళూ నావే అనుకోవచ్చు. నాదీ అని ఏదీ లేదు. అయినా అంతా అంటే అంతా ఉంది. వెల కట్టడానికి వీలు కాదు. అంతుంది నా వద్ద.

ఇదెవరండీ బాబూ, అలంకారిక భాషలో మాట్లాడుతోంది అనిపిస్తుందా? ఆడవాళ్ల భాషే అలంకారికం అయిపోతుందమ్మాయ్. లోకం మాటలు వదిలెయ్యి. మన పరిచయమే మనకుండదు కదా. అందుకే ఇలాంటి భాష మనది.

నేను గంభీర స్వభావం దాన్ని అని అందరూ అంటారు. నా అంతటికి నేను ఉండడం నాకు ఇష్టం. దానికి నా బాల్యం కూడా కారణం అయ్యుండొచ్చు. గుజరాత్‌లో ఆడపిల్లలు చాలా సాంప్రదాయకమైన వాతావరణంలో పెరుగుతారు. అపరిచితులను చూడగానే మొదటి పని మొహాల పైన కొంగు లాగేసుకోవడం. వాళ్ళెదుట నిలబడడం కానీ, మాట్లాడడం కానీ చెయ్యరు. నేనయితే ఎవరైనా వస్తే, ఎవరు ఏమి అని కూడా అడక్కుండా లోపలికి పారిపోయేదాన్ని. ముందునుండి మాటలు తక్కువ. నా భర్త మాట్లాడు, మాట్లాడు అంటుంటే కొద్దిగా నేర్చుకున్నాను. చదువు రాత అంటూ చాలా తక్కువ. రాయడానికి రాదు అనే అనవచ్చు. నా భర్త, పిల్లలు నేర్పించిన అంతో ఇంతో గుజరాతీ చదివి, రాయడానికి నేర్చుకున్నాను. నాకు గుజరాతీ మాత్రం వచ్చు. ఎంత తన్నుకున్నా హిందీ, ఇంగ్లీష్ తలకెక్కలేదు.

ఇంత పొడుగ్గా చెప్పినా కానీ, నేనెవరు అని ఆనవాలు దొరకడం లేదు కదూ ఎవరని? సహజమేలే. ఇలాగే ఎంత చెప్తూ పోయినా కస్తూర్ గోపాలదాస్ మకన్జి కపాడియా ఆనవాలు మీకు దొరక్కుండా పోవచ్చు. నీళ్ళిస్తున్నా కానీ చెట్టు వేరు కంటికి కనబడదు. వేరుకు పేరూ పెట్టేదిలేదు. దాని జ్ఞాపకమూ ఉండదు. పైన వ్యాపించిన చిగురు, పండు, కాయిలే చెట్టు చేమలకు పేరు తెచ్చేది కదూ! నాదీ అలాంటి కథే అమ్మాయ్!

“నేను కస్తూర్ మోహన్ దాస్ గాంధీ, కస్తూర్ బా లేదా బా” అంటే? వెంటనే గుర్తు పడతారు కదూ! కళ్ళు విప్పారతాయి. మహాత్ముడి భార్య అంటూ దగ్గరికి వస్తారు, కాళ్ళకు దండం పెడతారు. అదేమో కానీ, కస్తూర్ కపాడియా అని ఉన్నదాన్ని కస్తూర్ బా అయింది: ఒంటరి అమ్మాయిగా ఉన్న నేను పోరాటం, ఉపవాసం అంటూ జైలు కెళ్ళడం: మూగదాన్లా ఉన్నదాన్ని విలేకరులు, రాజకీయ వ్యక్తులతో మాట్లాడేలా అయింది: మా ఇంటి గోడల్ని దాటి ఆవలికి వెళ్ళని దాన్ని దేశ విదేశాలు చుట్టి, విదేశంలోని జైలును కూడా చూసొచ్చింది అదొక పెద్ద ప్రయాణం. ఔనమ్మాయ్! గంగోత్రి నుండి వేలాది మైళ్ళు ప్రవహించి గంగా నది బంగాళాఖాతంలో లీనమవుతూ తాను సముద్రమే అయినట్టు నా ఈ ప్రయాణం.

దాన్ని మీకంతా చెప్పాలి. ఎందుకంటే ‘ఇక్కడితో కథ ముగిసింది’ అని అయిపోలేదు మా కథ. ఈ రోజుకి కూడా బాపు గురించిన ఎన్నో విషయాలు ఏరి ఏరి తీస్తూనే ఉన్నారు. వెతుకుతూనే ఉన్నారు. పిల్లల జ్ఞాపకాల నుండి మరుగు పడడమే చావు అని మా అమ్మ చెప్పేది. ప్రజల మనసులలో ఎదిగేది నిలిచి పోతే అదే చావు అని బాపు అనేవారు. అలా చూస్తే మాకు చావు రానే లేదు. బ్రతుకు ఎదుగుతూనే ఉంది – అదృశ్యంగా, ఎత్తుగా, విశాలంగా, లోతుగా..

ఎక్కడినుండి మొదలుపెట్టను?

మహాత్ముడి భార్య అని మొదలుపెట్టడమైతే వద్దు. ఎందుకంటే మహాత్మ అనేది కవీంద్రులు రవీంద్రనాథ్ ఠాకూర్ గారు ఇచ్చిన బిరుదు. నేను చూసినప్పుడు ఇతడు మహాత్ముడేం కాదు. అతడూ నా అంతే పెద్దవాడు లేదా నా అంతే చిన్నవాడు.

మీకు నా చిన్నప్పటి కొన్ని విషయాలు అంటే నా పుట్టిల్లు, పెళ్ళి, మా ఊరు గురించి చెప్పాలి. వీటి గురించి చెప్పడం ఏ ఆడపిల్లకు నచ్చదు? అది మన మూలం. మనం మనమైన స్థలం. ఆడదని కాదు, భార్య అని కాదు, అమ్మ అని కాదు ఒక జీవిగా మనం అన్ని సంతోషాలను, స్వాతంత్ర్యాలను అనుభవించిన చోటు పుట్టిల్లు. అందుకే పుట్టింటి స్మృతులు చాలా ఇష్టమైన, వెచ్చని జ్ఞాపకాలు. కాదా?

నేను సముద్రపు ఒడ్డు ఊరిదాన్ని. పోరుబందర్ మా ఊరు. ఎప్పుడూ వినిపించే సముద్రం హోరు ఇప్పటికీ నా చెవుల్లో వినిపిస్తుంది. మా ఊరికి మొదట పావ్ బందరు అని పేరుండేదట. పావ్ అంటే ఒక రకమైన రొట్టె. గోధుమలతో పావ్ చేసి అరబిక్ దేశాలకు ఓడల్లో పంపేవారట. మా ఊరికి కమాన్ మాదిరి సముద్రపు ఒడ్డుంది. సముద్రం అక్కడ లోతుగా ఉంటుంది. కాబట్టే పడవలు వచ్చేవట. కోస్తా తీరంనుండి కొద్దిగా లోపలికి వెళ్తే వరి, ధాన్యం గింజలు పండించేవారు. అవన్నీ మా ఊరికి వచ్చేవి. ముంబై పెద్ద బందర్‌గా మారే మునుపు ఆ దరిదాపుల్లో పోరుబందరే ముఖ్యమైన రేవు పట్టణం.

ఒక వైపు సముద్రం, మరొక వైపు చిన్న కొండలు, దాని పైన హిందూ, ప్రణామి, జైన మందిరాలున్నాయి. అప్పుడంతా చిరుత, సింహం, జింకలు ఆ కొండల పైన ఉండేవి. ఆహారం వెతుక్కుంటూ కోడి, కుక్క, గొర్రె, పశువులను ఎత్తుకుని పోవడానికి చిరుతలు ఊళ్ళోకి వచ్చేవి. సముద్ర తీరంలో ఫ్లెమింగో అనో ఏమో దాని పేరు, ఎర్ర కుత్తుకల బాతులు చాలా ఉండేవి. అవే కాకుండా మైనా, పాలపిట్ట, పావురాయి, ఇబిరిత మొదలైన పక్షులు ఉండేవి.

మా ఉళ్ళో అన్నిటికంటే మిన్నగా కనిపించేది ఒక ఎత్తైన దీపస్తంభం. తొంభై అడుగులు ఎత్తు దానిది. మా ఉళ్ళోనుండి ఎక్కడ నుంచున్నా కనిపించేది. మైళ్ళకొలది దూరంనుండి నావికులకు కనిపించేది.

మా ఊరు అన్న అభిమానంతో చెప్పడంలేదమ్మాయ్! పోరుబందరు అందమైన ఊరు. వర్షం, చలి, వేసవి కాలాలు ఏవైనా వెచ్చగా ఉండే ఊరు మా ఊరు. చెమటలు పోయించే కోస్తా వాతావరణం. వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పడమే కష్టం. ఎప్పుడో ఒకసారి ఒకే ధాటిగా హోరున బలు జోరుగా వచ్చేసి కురిసేది. లేదా, అసలు వచ్చేది కాదు. ఎప్పుడూ చెమట. తొంగిచూసి తొంగిచూసి, ఉరిమి మేఘాలు ఎగిరి పోయేవి. రెండు మూడు సంవత్సరాలు వర్షం కురియకుండా ఉన్న రోజులుండేవి. దబదబా కురిసిన రోజులూ ఉండేవి. అందుకే మా ఊళ్ళో ఏం చేసేవాళ్ళంటే నేలపై పడే ప్రతి చినుకును కూడా వ్యర్థం కాకుండా నిలవ చేసుకుని వాడేవారు. వర్షం అంటే దేవలోక కృప, రబ్‌కి రహమత్ అనేవారు సాధువులు. కాబట్టి దాదాపు అందరి ఇళ్ళల్లోనూ వర్షం నీళ్ళు నిలవ చేసే ఒక పెద్ద తొట్టె ఇంటి ముందర, భూమి మట్టంలో ఉండేది. వర్షం వచ్చేది ఆలస్యమైనా లేదా రాకపోయినా తాగే నీటికి ఇబ్బంది కలగకుండా ఈ తొట్టే మమ్మల్ని కాపాడేది. వర్షం పడితే వైశాఖ మాసం నుండి శ్రావణ మాసం దాకా కురిసేది. అది మా అందరికీ అత్యంత ఆనంద సమయం.

మా నాన్న మూడంతస్తుల మేడ కట్టారు. నగరంలోని సేఠ్ కాబట్టి వచ్చి పోయేవాళ్ళు ఎక్కువ. ఇంటికి వచ్చిన అందరినీ లోపలికి పిలిచేవారు కాదు. పైన మేడలో ఒక అతిథి గది ఉండేది. గణ్యవ్యక్తులను బయటి నుంచే మెట్లెక్కించి ఆ గదికి తీసుకెళ్ళేవారు. కింద మా పనులు మేము చేసుకునేవాళ్లం. దానిపై అంతస్తు పైకప్పు పైన పడిన వర్షం నీరు గోడలు, రాళ్ల మధ్యలో ఉన్న రంధ్రాల ద్వారా ప్రవహించి క్రింది తొట్టికి చేరేది. తొట్టిని మూయడానికి విసర్రాయిలాంటి ఒక బండరాయి ఉండేది.

మా కుటుంబంలోని వారంతా వ్యాపారులేనట. మా ఇల్లు సముద్ర తీరం నుండి కొంత దూరంలో ఉండేది. రెండు వీధులు దాటి వెళ్తే సముద్రం ఉండేది. దూరంగా పరచుకున్న జెట్టి ఉండేది. అక్కడ ఎప్పుడూ రెండో మూడో పడవలు నిలిచి ఉండేవి. మా తాత, అవ్వ తమ కాలం కథలు చెప్పేవారు మరి! మలబారునుండి చెక్క పనిముట్లు, ముంబైనుండి ప్రత్తి, తంబాకు, కరాచి వైపు నుండి ధాన్యం ఇక్కడికి వచ్చేదట. వాటిని తీసుకుని మా వాళ్ళు ఇతర స్థలాలకు అమ్మకానికి పంపేవారట. కూర్చున్న చోటే దేశవిదేశాల సంబంధాలు, వ్యవహారాలు. బ్రిటిష్ వాళ్ళు చేస్తుండింది ఇదే కదా. అందుకే వాళ్ళను చాలా వేగంగా అర్థం చేసుకుని, వాళ్ళు వస్తే కలిగే అపాయం గురించి మొదటే ఊహించిన వారు గుజరాతీలు.

మా నాన్న గోపాలదాస్ మకంజీ కపాడియా. పప్పు దినుసులు, ప్రత్తి, బట్టల వ్యాపారం చేసేవారు. పెద్ద వ్యాపారి. బాగా ఉన్నవాడు. అరబిక్ దేశాలకు, ఆఫ్రికాకు ధాన్యం పంపేవారు. మా ఇంట్లో ఎప్పుడూ వ్యాపారం, వ్యాపారం వ్యాపారమే. అది కాకుండా అంటే రాజకీయ చర్చలు. వేరే మాటలే ఉండేవి కావు. నాన్న పోరుబందరు మేయర్‌గా ఉండేవారు. పద్ధెనిమిది గదుల ఇల్లు నా పుట్టిల్లు. ఇంట్లో ఎంత మంది ఉండేవారో అన్ని ధాన్యపు మూటలు, సామాన్ల మూటలు ఉండేవి. మా నాన్న వ్యాపారం, రాజకీయం కాకుండా వేరే మాట్లాడిందంటూ నేనెరగను. ఎప్పుడూ అదే ధ్యాస. నాకు చిన్నప్పటి నుండి ఛాతీలో కఫం చుట్టుకుని ఊపిరాడడం కష్టమయ్యేది. మళ్ళీ మళ్ళీ జలుబు చేసేది. మా ఇంట్లో ఎప్పుడూ ధాన్యం, దాని దుమ్ము ఉండేవి. నాకు ఆ దుమ్ము దగ్గరికి వెళ్ళడమే పడేది కాదు. ఆ నాటి దమ్ము చివరిదాకా నన్ను సతాయించింది. తొందర తొందరగా నడవడానికే అయ్యేది కాదు. కానీ ఆటల్లో, పరుగుల్లో దేంట్లోనూ తగ్గింది లేదు. చిన్న ప్రాణం, చురుకుగా ఉండేదాన్ని.

సముద్రం ఆడవాళ్ళను లోపలికి లాక్కుంటుంది, దగ్గరికి వెళ్ళకండి అని ఇంట్లో ఎప్పుడూ భయపెట్టేవారు. మా ఇంట్లో చాలా మంది ఆడపిల్లలం ఉండేవాళ్ళం. మా అమ్మకు నలుగురు, ఒక మగబిడ్డ. నలుగురిలో ఇద్దరు అక్కలు తొందరగా చనిపోయారు. ఇరుగు పొరుగు ఇళ్ళ ఆడపిల్లలంతా కలిసి గుంపుగా సముద్రం వైపు వెళ్ళేవాళ్ళం. మా వెంట మగపిల్లల్ని వదిలేవారు కాపలాగా. నా తమ్ముడు మాధవ్, వాడి స్నేహితులు చిన్న పిల్లలు, వాళ్ళేం కాపలా కాస్తారు మమ్మల్ని? చిన్న పిల్లలయితే ఫర్వాలేదు. మా కాపలాకు అబ్బాయిలు వచ్చేవారు. ఒకిద్దరు మా కంటే పెద్ద అబ్బాయిలు. గుంపుకు ‘యజమానులు’ వాళ్ళు. మేము నీళ్ళను తాకడానికి ముందే హోయ్ హోయ్ అని అరవసాగేవారు. వాళ్ళు మాత్రం బర్రెలు కాసేవాళ్ళలా సముద్రంలోకి దూకి ఈత కొట్టేవారు. మమ్మల్ని మాత్రం నీళ్ళలోకి దిగడానికి వదిలేవారు కాదు. మేము కొద్దిగా ముందుకు వెళ్తే మమ్మల్ని పిలవడానికి ఒక ఉపాయం కనిపెట్టారు. వేరే ఎవరో స్నేహితులతో వచ్చి మా ముందు నిలబడేవాళ్ళు. అపరిచిత అబ్బాయిలు ఎదురుగా నిలబడితే, ఇక అంతే. పైటను తల పైకి లాక్కుని పరిగెత్తి వచ్చేవాళ్ళం.

మగవాళ్ళంతా ఎప్పుడూ వ్యాపారం, రాజకీయాలతో తలకాయ చెడుపుకుంటే ఆడవాళ్ళు పిల్లలు, పండగలు, వ్రతాలు, వంట, చీరల అల్లికలు ఇలా. మీకు తెలుసు కదా! మా వైపు చీరలు కాథేవాడి చీరలు అని, ఒక్కొక్క చీరను తయారు చెయ్యడానికి కొన్ని నెలలే అవుతుంది. అల్లికలు, కుట్లతో సమయం గడిచేదే తెలిసేది కాదు. దీనికి తోడు గోడలు, నేల నున్నగా ఉండేట్టుగా రుద్దడం, గోడల పైన గుమ్మాల పైన బొమ్మలు వేయడం, ఉపాహారం- భోజనాలకు వంట సామాగ్రిని సిద్ధం చేసుకోవడం, కట్టెలు, బొగ్గులు సమకూర్చుకోవడం ఇవీ ఆడవాళ్ల పనులు. పనులు, బాలింతల పనులలో మునిగిన ఆడవాళ్ళకు ఆప్తులే దేవుళ్ళు, సంతులు! అవును. ఆడవాళ్ళకు బయటకు వెళ్ళడానికి అవకాశం దొరికేది ఒక దేవాలయానికి వెళ్ళడానికి మాత్రమే. దాని కోసమే కల్పించుకున్నట్టు ఏదో ఒక వ్రతం, కథ తయారు చేసుకున్నారో ఏమో అన్న మాదిరిగా ఒకదాని తరువాత ఒకటి వ్రతం, ఉపవాసం, పండగ, పూజలే ఎప్పుడూ ఉండేవి.

మా ఊరు లెక్కలేనంత కృష్ణ భక్తులున్న వైష్ణవ పంథా భక్తుల ఊరు. మా అమ్మ వైష్ణవ పంథాను అనుసరించేది. ఇది సుదాముడి జన్మస్థలం అని అందరి నమ్మకం. సుదామ పురి అని కూడా పిలుస్తారు. అన్నిచోట్ల కృష్ణుడి గుడి, బలరాముడి గుడి కనబడితే మా ఊళ్ళో సుదాముడి గుడి ఉంది. తెలుసా? సుదాముడు, అతడి భార్య సుశీల, కృష్ణుడు రుక్మిణుల మూర్తులున్నాయి అక్కడ. అటుకులే నైవేద్యం, ప్రసాదం. ఎప్పుడో ఒకసారి మోధేశ్వరి మాత దేవాలయానికి వెళ్ళేది మా అమ్మ. ఆ దేవతని అంబా మా, మాతంగి మా అని కూడా పిలుస్తారు. మోధబనియా అనే మా జాతి పేరు ఆమెనుండే వచ్చిందేమో తెలీదు. ఆమెకు ఒకట్రెండు చేతులు కాదు, పద్ధెనిమిది చేతులు. గర్జించే సింహం పైన కూర్చున్న అమ్మవారు ఆమె. ఆ దేవతను చూడడానికి భయమేసి నేను బయటే ఉండేదాన్ని. లోపలికి రాకుంటే అమ్మకు కోపం వస్తుంది. “కడుపు నొప్పి వస్తుంది, దుష్టుడైన మొగుడు వస్తాడు చూడు” అని అమ్మ తిట్టి భయపెట్టి లోపలికి తీసుకు వెళ్ళేది!

పిల్లలకంతా చాలా ఇష్టమయ్యే దేవుడు వానదేవుడు. వర్షం అంటే మా అందరికీ చాలా ఇష్టం. ఎక్కువగా పడినా లేదా అసలు పడకున్నా దాంతో మాకు వ్యవహారం ఉండనే ఉండేది. మీకు ఆశ్చర్యం కలుగవచ్చు. భూమినే ముట్టుకోకున్నా మా నాన్న ఏ నక్షత్రం వాన ఎప్పుడు వచ్చింది, ఏది చెయ్యిచ్చింది, ఇప్పుడు ఏది ప్రారంభమవుతుంది అని లెక్క చెప్పేవారు. మేం వ్యాపారులం కదా? వానలు బాగా పడి, పంటలు పండితే కదా మా వ్యవహారాలు సాగేది! లేకపోతే అందరికీ నష్టమే. అందుకే వానదేవుడితో మాకు నేరుగా సంబంధం. వర్షం పడితే వానదేవుడికి పూజలు, లేకపోతే అలకలు. ఎక్కువగా కురిస్తే శాపాలు పెట్టడం లాంటివి చేసేవాళ్ళం. రైతులు ఎలా చేసేవారో వ్యాపారులైన మేము కూడా అలాగే చేసేవాళ్ళం.

చాలా రోజులుగా వర్షం పడలేదనుకోండి. అప్పుడు వానదేవుడి మూర్తిని చేసి ఎండలో ఉంచి చెమట పట్టించేవాళ్ళం. ఉక్కకు తట్టుకోలేక దేవుడు వర్షం కురిపిస్తాడని. భోలేనాథ్, శివుడున్నాడు కదా, ఆయనకు కారం రాసేవాళ్ళం. వానదేవుణ్ణి ముళ్ళకంచె పైన కూడా విసిరేవాళ్ళం. సముద్రదేవుడి దగ్గరికి వెళ్ళి రాళ్ళు విసిరి రావడం, కప్పలను వెతుక్కుని వెళ్ళి తెచ్చి ఊరి బయట వీధిలో వేలాడదీయడం, చిన్నా చితకా దేవుడి ప్రతిమల వద్ద పాములు, తేళ్ళు వదలడం, దేవుడు పూనేవాళ్ళ ఇళ్ల ముందు లేదా పురోహితుల ఇళ్ళ ముందు రాళ్ళ కుప్ప పోయడం, ఇలా భక్తాదులకు కోపం వచ్చి తనను పీడిస్తారని దేవుడికి అర్థమవ్వాలి. అలా ఏమేమో చెయ్యడం. కంటికి కనిపించే మనుషుల కంటే కనబడని దేవుడితోనే మా వ్యవహారం.

వర్షం పడ్డప్పుడు మా ఆనందాన్నిచూడాలి మీరు. ఆహాహా! వర్షంలో తడిసే ఆనందమే వేరు. దాంతోపాటు వానదేవుడి పూజ కూడా జరిగేది. వర్షం ఆర్భాటం ఎక్కువైతే గంగకు పూజ, నీళ్ళ పూజ. దగ్గరగా సముద్రం ఉండేది కదా, వానకు సముద్రం శబ్దం తోడై గలాటా విపరీతమయ్యేది. మేమంతా ఇళ్ళల్లో ఏడ్చింది, నవ్వింది, పాడింది ఏదీ బయటకు వినిపించేది కాదు. ఆ వర్షం గలాటా కంటే మేం ఇంకా ఎక్కువ గలాటా చేసేవాళ్ళం. జోరుగా శబ్దం చెయ్యాలని మేడ పైకి ఎక్కడం, దిగడం, ఎక్కడం దిగడం చేసేవాళ్ళం. మగవాళ్ళు వేషాలు వేసుకుని ఊరేగింపుగా వెళ్ళేవాళ్ళు. ఆడపిల్లలు, మగపిల్లలంతా వర్షంలో తడుస్తూ వాళ్ళ వెంట వెళ్ళేవాళ్ళం. వానదేవుడి పాట పాడుతూ వాళ్ళు ఇళ్ళ ముందు నిలబడేవాళ్ళు. వాళ్ళకు ఇంటి ఆడవాళ్ళు హారతి ఇచ్చేవాళ్ళు. కురిసే వర్షంలో తడిసి తమ ఇంటి ముందుకు వచ్చిన దేవుడి వేషం వాళ్ళను అరుగుకు పిలిచి హారతిచ్చి, నోరు తీపి చేసి, ఎండుఫలాలు, ఫలహారాలు ఇచ్చి ముందుకు పంపేవారు.

అలాగని విపరీతంగా కురిసినా కష్టమే. మా ఊళ్ళో చండమారుతం, సుడిగాలి వాన ఎప్పుడైనా వచ్చేది. నాకు గుర్తున్నట్టు ఒక్క సారి వచ్చింది. విపరీతమైన గాలి, దానికి తోడు వర్షం. అంత వర్షం అక్కర్లేదు మాకు. పట్టిపెట్టుకోవడానికి కూడా అయ్యేది కాదు. అందుకే వానకు ‘వెళ్ళీపో వెళ్ళిపో’ అంటూ గట్టిగా అరచి ఇంటి ముందు నిప్పు కణికలను పైకి విసిరేవాళ్ళం. చిన్న పిల్లల బట్టలూడదీసి, అరుగుపైన నిలబెట్టి, కాలుతున్న కట్టెను బయటికి విసరమని చెప్పేవారు. పిల్లలు బట్టలు విప్పి, పృష్ఠ భాగాన్ని ఆకాశానికి చూపేవారు. కొడవలిని ఎర్రగా కాల్చి బయట వర్షానికి పెట్టేవారు, చీపురును తలక్రిందులు చేసి బయట పెట్టడం, ఇంటి బయట ప్రవహించే నీట్లో ఆకు పైన నెయ్యి వేసి తేలిపోయేలా చెయ్యడం, ఇలా వర్షాన్నిఆపడానికి ఏమేమో చేసేవారు. వాటితో పాటు వానదేవుడిని అనేక తిట్లతో తిట్టేవారు. మనుషులతో పోట్లాడినట్లే వానదేవుడితో పోట్లాడేవారు.

మా ఊరికి పాటగాళ్ళు చాలా వచ్చేవాళ్ళు, పల్లెలనుండి. ఆ పాటలను విని వారికి ఏదైనా ఇచ్చి పంపేది ఆడవాళ్ళే. అదే మాకు పెద్ద మనోల్లాసం. మగవాళ్ళు మాత్రం ఒక క్షణం నిలబడి, మేము ఎక్కడ పాటల్లో ఒళ్ళు మరచి పోయి, ఎంత పని ఆగిపోయిందో అని లెక్క వేసి హుంకరించి ముందుకెళ్ళిపోయేవారు. మేము మాత్రం మా వద్ద ఉన్న కాసులు, వండినవి, పాత గుడ్డలు, తిండి, వంట సామాను, పళ్ళు, కూరగాయలు ఇలా ఏమైనా ఇచ్చి పంపేవాళ్ళం. భజనలు పాడేవాళ్ళే ఎక్కువ. కొందరు ముగ్గురు, నలుగురు చేరి ఒక చోట కూర్చుని పాడేవాళ్ళు. నరసి మెహ్తా అనే ఒక దాసయ్య, ఆయన రాసిన భజన పాట, కృష్ణుడి పాట, రాస్ పాటలనే ఎక్కువగా పాడేవారు. రాధా కృష్ణులు ఏమేమి చేశారో అని తామే చూసినట్టుగా పాడేవారు. భక్తిగీతాలతో పాటు శృంగార గీతాలు కూడా ఉండేవి. పుట్టింటికి సంబధించిన ఒక పాట, గోపికలు చెప్పేవి నాకు గుర్తుంది. “నేను అక్కడా ఇక్కడా తిరుగుతూ హాయిగా ఉండేదాన్ని. నీకు నా జ్ఞాపకమైనా ఉందా” అని కన్నయ్యను ఏడిపించేలా ఒక పాట అది. “మైకా మే మై రహతీ థీ ఖుష్ మే, ఫిర్తీ థీ క్యూ మారీ మారీ కన్హయ్యా.. యాద్ హై కుఛ్ భీ హమారీ?” అనే ఆ పాట చాలా బాగా పాడేవారు. అది వినేటప్పుడు ఆడంగుల మొహాల్లో నవ్వు, సిగ్గు ఎలా పూచేవి అని మీరు చూడాలి. అందరికీ తమ తమ పుట్టిళ్ళలో తాము బాల్యంలో హాయిగా, సుఖంగా ఉన్నరోజులు జ్ఞాపకం వచ్చి ఒక రకంగా మనసు బరువైపోయేది. నా భర్త మోక వచ్చినప్పుడు నేను ఈ పాట పాడి అతడ్ని ఆట పట్టించేదాన్ని. మొదట్లో మోకకు కూడా రాసలీల పాటలు నచ్చేవి. నరసి మెహ్తాగారి రాస్ చాలా ఇష్టం. వైష్ణవ జనతో నచ్చింది బాపు అయిన తర్వాత.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here