నేను.. కస్తూర్‌ని-5

0
12

[వృత్తి రీత్యా వైద్యులైన డా. ఎచ్. ఎస్. అనుపమా కన్నడంలో రచించిన జీవితకథని శ్రీ చందకచర్ల రమేశ బాబు అనువదించి ‘నేను.. కస్తూర్‌ని’ అనే పేరుతో సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నారు.]

~

[dropcap]చి[/dropcap]వరికి నా భర్తకు, అంటే మోక బాబుకు చెప్పాను, బయట చేరడం అంటే ఇలా ఇలా ఉంటుంది అని. చూడు ఇక్కడ నాకు చాల నొప్పి వస్తుంది అని చెప్తూ అతడి చేతిని అందుకుని నా పొట్ట పైన పెట్టుకుని చూపించాను. పోరుబందరులో ఉన్నప్పుడు నా కడుపు నొప్పికి అమ్మ ఉప్పు వేడి చేసి బట్టలో చుట్టి శాఖం పెట్టేది. తరువాత తను స్నానం చేసి శుద్ధి చేసుకునేది అని చెప్తూ చెప్తూ ఎందుకో అమ్మ, మా ఇల్లు గుర్తుకు వచ్చి ఏడుపొచ్చింది. కాని ఒక ఆశ్చర్యం! నేను ఏడవడం చూసి తను కూడా ఏడవడం మొదలుపెట్టాడు. ఆ రాత్రి ఇద్దరూ దుఃఖపడ్డాము. ఎందుకు? ఈ ప్రపంచంలోని ఆడవాళ్ళంతా ఆడ అనే కారణంగా అనుభవించే అన్నికష్టాలకు. “మీ ఆడవాళ్ళు నిజంగా చాలా గొప్పవాళ్ళు” అనే మాట అతడి నోటినుంచే వచ్చింది. తన తల్లి, అక్క, అవ్వ ఎవరికీ ఇలాంటి ఇబ్బంది వచ్చేదని తనకు తెలియనే తెలియదు అని పశ్చాత్తాపం కలిగిందట అతనికి.

ఈ శరీరం అనేది, ఆడ మగ అనేది అదెలాంటి మాయ అమ్మాయ్! ‘స్కూలులో ఉన్నా నీతో ఉన్న జ్ఞాపకాలే కలుగుతాయి నాకు. ఏం చెయ్యను?’ అనేవాడు మోక. అంత కాయమోహిగా ఉండేవాడు. ఈ సంఘటన తరువాత ఆడవాళ్ళ ఇబ్బందుల్ని కొద్ది కొద్దిగా తెలుసుకోవడం మొదలెట్టాడు.

అంత సేపటికి మా మామగారి ఆరోగ్యం బాగా చెడిపోయింది. 1885 అనుకుంటా. ఆయనను కనిపెట్టుకునే బాధ్యత అందరికీ వచ్చింది. పండితులు వచ్చి చూశారు. హకీములు చూశారు. మా కుటుంబ వైద్యులు చూశారు. ఇంగ్లీష్ వైద్యులు శస్త్రచికిత్స అవసరం అన్నారు. మిగతావాళ్ళు కూడదు అన్నారు. చివరికి ఇంకేం చెయ్యలేము, ఉన్నన్నాళ్ళూ అతడి సేవ చెయ్యాలని నిర్ధారించడం జరిగింది. ఎక్కువగా సేవ చేసింది మోకాయే. పెద్ద బావలు పనులు, రాజకీయాలు, పోరుబందరు అని తిరిగేవారు. సేవ మాత్రం చాలా జాగ్రత్తగా, బాధ్యతగా చేసేవాడు మోక. రోగి యొక్క కదలికలను బట్టే అతడికి ఏమవుతుంది, ఏం కావాలి అని అర్థం చేసుకునేవాడు. తండ్రి పక్కనే కూర్చుని ఆయనకు హితంగా ఉండడానికి ఏం కావాలో చెయ్యడానికి మోక నిష్ణాతుడు. చేతులు కాళ్ళు రాయడం, తల పైన చెయ్యి ఆడించడం, వీపు నుదురు రాయడం, భజనలు పాడడం, కొద్ది కొద్దిగా నీళ్ళు త్రాగించడం ఇలా పడుకున్నవాడిని చూస్తూ ఏది నచ్చుతుందో అది చేసేవాడు. మామగారు రాత్రి చాలా సార్లు లేచేవారు, నీళ్ళడిగేవారు. మూత్రవిసర్జనకు తీసుకువెళ్ళాల్సొచ్చేది. సైగ చేస్తే లేపి కూర్చోబెట్టాలి. ఆయనది భారీ శరీరం. మా అత్తగారి చేతనయ్యేది కాదు, చేయకూడదు కూడాను.

ఇలా ఉండగా ఒక రాత్రి..

మామగారు ఆ రోజు చాలా బాధపడ్తున్నారు. ఆయనకు విసిరి, తన పైన వాల్చుకుని, నీళ్ళు తాగించి, నుదురు వీపు నిమురేటప్పటికి ఆయనకు నిద్ర పట్టింది. అప్పుడు మా లక్ష్మీదాస్ బావగారు వచ్చారు. ఆయన మామగారి దగ్గర కూర్చోగానే మోక నా గదికి వచ్చారు. నేనప్పుడు తొలిచూరు గర్భిణిని. రోజులు నిండుతూ ఉన్నాయి. నిద్ర పోతున్నా. లోపలికి రాగానే మోక గది తలుపులు మూశాడు. ఐదు నిమిషాలు సముద్రం ఘోష పెట్టింది. అంతే. తలుపు టకటక వినిపించింది. మామగారికి ఊపిరాడ్డం లేదు అని పిలుపు వచ్చింది. ఆయన చనిపోయారు. అప్పుడాయనకు 63 సంవత్సరాలు. మోక పరిగెత్తాడు. కానీ, చివరిక్షణాల్లో ఆయన దగ్గర లేకపోయానే అనే పాపప్రజ్ఞతో ఎన్నో రోజులు బాధపడ్డాడు. తరువాత నాకు ప్రసవమయ్యి, బిడ్డ చనిపోయినప్పుడయితే తన పాపం వల్లనే ఇలా జరిగిందని భావించాడు.

మాయను జయిస్తాను అని చాలా కష్టపడిన నా భర్త నిజానికి తీవ్ర భావుకుడు, సుఖాకాంక్షిగా ఉండేవాడు. నాకు నచ్చుతుందో లేదో, కానీ అతడి వేగానికి ఒప్పించుకోవడం తప్ప వేరే ఏ రకమైన సుఖమూ అందులో ఉందని నాకు అనిపించేది కాదు. ఇతడు నా పైన, నా శరీరం పైన ఉంచిన శ్రద్ధ స్కూలు పైన, తాను చేసే పని పైన పెట్టుంటే ఇంకా బుద్ధిమంతుడై ఉండేవాడు. అలాగని అతడికి చెప్పలేదంతే.

అంత సేపటికి అతడు నా నుండి దూరంగా, విదేశాలకు వెళ్ళే ప్రస్తావన వచ్చింది. దీనితోనే దంపతులుగా మేమిద్దరూ సంబరపడ్డా, ఒకరికోసం మరొకరు కాచుకున్న, ఆనందించిన, దేహసుఖం అనుభవిస్తూ జతగా ఉండే సమయం కూడా ముగిసింది.

మోక గాంధీ హరి తండ్రి అయింది

అరె అమ్మాయ్!

నేను చూడు! వినే ఒక చెవి దొరికిందంటే చాలు, మొదలు నుండి ఏమేమో వెతికి తీసి నీముందు పరచి వాగుతున్నాను!! ఏమనుకోకు అమ్మాయ్, మనసులో అనిపించింది చెప్పడానికి వినే ఒక చెవి ఎంతైనా అవసరం కదా? అది నాకు దొరికేది కాదు. అందుకే నీ ముందు ఇలా మాట్లాడ్తున్నాను అనిపిస్తుంది.

సరే, సరే. ఇక నుండైనా కాస్త గంభీరంగా, కొన్ని ఇతర విషయాలు కూడా చెప్తాను. విను.

హా.. నేను ఎక్కడ ఆపాను? అదే, పోరుబందరు గురించి చెప్తున్నా కదూ. నేను- మోక ఇద్దరూ పుట్టిన సంవత్సరం పోరుబందర్లో ఒక పెద్ద మార్పు వచ్చింది. పరిపాలన రాణాల చేతినుండి జారిపోయింది. మొదట అక్కడ రాణా విక్మత్ జీ పరిపాలన సాగిస్తున్నారు. అదెంత పెద్ద రాజమహల్ అనుకున్నావు. హుజూర్ ప్యాలెస్ అని సముద్రం ఒడ్డున కట్టించుకుని అందులో ఉన్నారు. మా పోరుబందర్ ఆంగ్లేయుల భాషలో ‘Class 1’ సంస్థానంగా ఉండింది అని నాన్న, మామయ్య అంతా చెప్పుకోవడం విన్నాను. అంటే అక్కడ పరిపాలన చేసేది, పనివాళ్లను నియమించేది, జీతాలు నిర్ణయించేది, న్యాయదానం వీటన్నిటి పైనా రాణాదే అధికారం. కానీ, రెండు న్యాయ విచారణల్లో మా రాణా ప్రజలకు అన్యాయం చేశాడట. అందుకే ఆయన ప్రజలను పరిపాలించడానికి అర్హుడు కాడు అని ఆంగ్లేయులు తామే నిర్ణయించి ఆయనను గద్దె దింపేశారు. తమ ఏజెంటును తెచ్చి కూర్చోబెట్టారు. మా ఇంట్లో రాణాను అపఖ్యాతి పాలు చేసిన ఆ రెండు న్యాయ విచారణల గురించి మళ్ళీ మళ్ళీ చర్చ జరిగేది. ఆ న్యాయ విచారణ ఏమిటి? ఒక నౌకర్, లక్కన్ అని. అతడి చెవులు, ముక్కు కత్తిరించి చంపేశారు. దానికి రాణా ఇచ్చిన వివరణ ’తన కొడుకును చెడ్డ అలవాట్లకు పురిగొల్పి, రాజకుమారుడి దారుణమైన చావుకు ఆ నౌకరు కారణమయ్యాడు’ అని. మరొక అరబ్బుకు కూడా రాణాగారు మరణదండన విధించారు. కారణం, వాడు రాత్రిపూట హిందూ సైనికుల ద్వారా, అదీ రాజపుత్‌ల ద్వారా రక్షించబడిన రాణీవాసంలోకి దొంగలా ప్రవేశించి తమ విధవ కోడలితో పాటు అనేక హిందూ మహిళల మానభంగానికి ప్రయత్నించాడు’ అని.

కానీ, మరణదండనలకు రాణా ఇచ్చిన కారణాలు ఆంగ్లేయులకు నచ్చలేదు. రాణా తన అధికారాన్ని అతిక్రమించి, ప్రజలకు అహితకరంగా నడుచుకున్నాడంటూ, ఉత్తినే మమ్మల్ని ‘Class 3’ సంస్థానంగా చేసేశారు. దీని పరిణామం ప్రజలకు ఎంతవరకూ కలిగిందో చెప్పలేం కానీ మా రెండు ఇళ్ళ వ్యాపారాలకు మాత్రం చాలా ఇబ్బంది కలిగింది. ఇది మా పెళ్ళికి ముందే జరిగింది. కాబట్టే మా పెళ్ళి సమయంలో మూడు పెళ్ళిళ్ళు ఒక్కసారే చేసి ఖర్చు మిగుల్చుకున్నారు.

అక్కడిదాకా మామగారు పోరుబందర్ దివాన్‌గా ఉండేవారు. ఆయన పెద్దగా చదువుకోలేదు. ఎలిమెంటరీ ముగించారట. దివాన్ కాక ముందు సంస్థాన కచేరిలో గుమాస్తాగిరి చేశారట. తమ నిజాయితీ, తెలివితేటలతో దివాన్ పదవికి చేరి మంచి పరిపాలనాధికారి అని పేరు తెచ్చుకున్నారు. ఎక్కడినుండో వచ్చిన ఆంగ్లేయులు తుపాకి, నావలు, సైన్యం ఉన్న కారణంగా తరతరాలనుండి ఏలుతూ వచ్చిన మన రాజులు తమ స్థానాలను వారికి అప్పగించడం జరిగింది. మా ఇంట్లోనూ రాజకీయాల గురించి చాల చర్చలు జరిగేవి. పోరుబందరు ‘Class 3’ సంస్థానం అయిన తరువాత రాణా దివాన్‌కు దివాన్ పదవి పోయింది. గాంధీ కుటుంబం ప్రభావం తగ్గిపోయింది. అందుకారణంగా మోకకు ఐదారు ఏళ్ళున్నప్పుడు మామగారు రాజకోట్‌కు మకాం మార్చారు. అక్కడి ఠాకూర్ సంస్థానానికి దివాన్ అయ్యారు. అంతే కాదు. మొత్తం కాథేవాడ్ ప్రాంతపు బ్రిటిష్ ఏజంట్ కచేరి రాజకోట్‌లో ఉండింది. కాబా గాంధీగారు ఆ కచేరికి దగ్గిరయ్యారు. ఆయన వెళ్ళిన ఒకట్రెండు సంవత్సరాలకు ఆయన కుటుంబం కూడా రాజకోట్‌కు పోయింది. మోక ముందు చదివిందంతా రాజ్ కోట్ లోనే. పోరుబందర్‌లో ఆయన తమ్ముడు తులసీదాస్ దివాన్ గిరికి ఒక దగ్గరి స్థానంలో ఉన్నారు.

ఇలా ఉండగా ఆంగ్లేయులకు సహాయంగా వచ్చే దివాన్‌కు మంచి ఆంగ్ల భాషా పరిజ్ఞానం అవసరం. ప్రపంచంలోని అన్ని వ్యవహారాలు తెలిసుండాలి. చరిత్ర కూడా తెలిసుండాలి.

గాంధీ కుటుంబం వాళ్ళు చదువులో అంత ఆసక్తి ఉన్నవాళ్ళు కాదు. వారి తెలివితేటలు, ఆసక్తి అంతా వేరే. లక్ష్మీదాస్ బావ ఎక్కువ చదువుకోలేదు. ఇంటర్ ముగించి కోర్టు కచేరి పనులకు వెళ్ళేవారు. కర్షణ్ దాస్ బావ అయితే మెట్రిక్ పరీక్షకు కూర్చునేదాకా కూడా స్కూలుకు వెళ్ళలేదు. కాబట్టి కాబా గాంధీగారి ఇంటివాళ్ళకు దివాన్ గిరి పోయినదొకటే కాదు, దానికి బదులుగా ఆంగ్లేయుల క్రింద అలాంటిదే పని చేసే అవకాశం కూడ లేకపోయింది. కుటుంబానికంతా మెట్రిక్ పాసైన నా భర్తే ఒక భరోసా అనేలా ఉండింది.

మోక కూడా ఏమంత బుద్ధిమంతుడు కాదట. అలాగని నాకేం తెలుసు? నేనయితే మొత్తం పామరురాల్ని. నా మొత్తం జీవితమంతా దిద్దినా ఒక నాలుగక్షరాలు రాయడానికి ఒక గంట పట్టేది. మోకనే చెప్పింది తను ఒక సాధారణ విద్యార్థిగా ఉండేవాడని. 1887లో అహమదాబాదుకు వెళ్ళి మెట్రిక్ పరీక్ష రాసి వచ్చాడు. మా వైపు ఆ ఊరిని ‘అమదావాద్’ అని పిలుస్తారు. అక్కడికి తను రైలులో వెళ్ళాడు. అంత పెద్ద ఊరికి తను చేసిన మొదటి ప్రయాణం అది. ఏం చెప్పేది? అదెంత చెప్పినా అమదావాద్ వర్ణన ముగిసేదే కాదు. తరువాతి సంవత్సరం కొంచెం ఇంగ్లీష్ నేర్చుకోవాలని భావనగర్ కాలేజీకి పంపారు. అప్పటికి నేను గర్భవతినయ్యాను. వేవిళ్ళతో సతమతమవుతున్నాను. మొదటి బిడ్డ పోవడం, తరువాత ఒక గర్భపాతం వీటన్నిటితో చాలా భయపడుతూ ఉన్నాను. బతికి బట్టకట్టే బిడ్డలు నాకు పుడతారా లేదా అని అనిపించేది.

మోక భావనగర్‌కు వెళ్ళింది జనవరి 1888లో అనుకుంటాను. ఆ చుట్టుపక్కలకంతా అదొక్కటే పదవీ కళాశాల ఉన్నది. అంతేం దుబారాగా లేదు. మెట్రిక్ స్కూలు మాదిరిగా గుంపులు గుంపులుగా విధ్యార్థులు లేరు. 39మంది మాత్రమే ఉన్నారట. కానీ ఎందుకో మోకకు అక్కడ సరిపడలేదు. ఇంటి జ్ఞాపకాలు వస్తున్నాయి అంటూ మళ్ళీ మళ్ళీ రావడం, వెళ్లడం జరుగుతూ ఉండేది. భార్య కోసం ఇంటికి వస్తాడు అని అంతా గేలి చేసేవారు. అది కూడా నిజమేనేమో మరి. చివరికి ఒకసారి నాకక్కడ సరిపోవడం లేదు అని వదిలేసి ఇంటికొచ్చేశాడు. అప్పుడు మా ఇంటికి మావ్ జి దవె జోషి అనేవారు వచ్చి ఉన్నారు. ఆ పురోహితుడు మా అత్తమామలకు చాలా కావలసిన పెద్దవారు. ఆయనతో మోక చాలా సేపు మాట్లాడాడు. చివరికి దవెగారు “ఉత్త బి.ఎ చదివితే ఏమీ దొరకదు. బి.ఎ చేసినవాళ్ళు ఎంతో మంది ఉండగా దివాన్‌గిరి దొరకడం నమ్మకం లేదు. దానికి బదులుగా లండన్‌కు బ్యారిస్టర్ చదవడానికి వెళ్ళు. సంస్థానంలో కాకపోతే సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకుని చేతినిండా సంపాదించవచ్చు.” అని సలహా ఇచ్చారు. మోక వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు.

నన్ను వదిలేసి తనొక్కడే వెళ్తానన్నాడని అలకతో కొన్నిరోజులు మాట్లాడలేదు నేను. సంవత్సరాల కొద్దీ నన్ను వదిలేసి వెళ్ళడమేమిటి? ఇక్కడ నేనొక్కతెనే, అతడు లేని ఇంట్లో అందరి చాకిరి చేసుకుంటూ ఎలా ఉండను? పొద్దుగూకడాన్నే ఎదురు చూసే నా భర్త, కాలేజీకి చేరినా భార్య గుర్తుకు రాగానే మళ్ళీ మళ్ళీ ఇంటికి వస్తాడని అందరితో గేలి చేయించుకున్న మోక, ఇలా సంవత్సరాల కొలదీ నన్ను వదిలి ఉంటాడా? అలా ఉంటాడనుకుంటే ఎవరో తెల్ల అమ్మాయిని చూసుకుంటాడు. ఆ తెల్ల అమ్మాయిలు మహా మంత్రగత్తెలట. మన మగవాళ్ళను తమ వశంలోకి తీసుకోవడమే కాకుండా వారికి మాంసం, మదిర అలవాటు చేయించి జాతిభ్రష్టుల్ని చేసి, మతాంతరం చేయిస్తారట. కాబట్టి మోక అక్కడికి చదవడానికి వెళ్ళడం వద్దు, ఇక్కడే వ్యాపారం చూసుకుని ఉండనీ, పెద్ద కొట్టు పెట్టడానికి కావలస్తే మా తండ్రిగారు సహాయం చేస్తారు అని చెప్పి చూశాను.

కాని మోక వింటేనా? అదేం తలకాయలో నిండిందో, వెళ్ళితీరాలని పట్టుబట్టాడు.

లండన్‌కు వెళ్ళి చదవాలంటే డబ్బులు కావాలి. అంత డబ్బు ఎక్కడి నుండి తెచ్చేది? తులసీదాస్ మామగారు “వెళ్లేది వద్దే వద్దు. డబ్బుల్లేవు” అనేశారు. అప్పుడు మోక అన్నయ్య లక్ష్మీదాస్ బావగారే ఒత్తాసు పలికింది. ఎంత కష్టమైనా, ఎంత ఖర్చైనా సరే తన తమ్ముణ్ణి బ్యారిస్టర్ చేసి తీరుతానని నిర్ణయించేశారు. లండన్ ఖర్చు ఎంతవుతుందో అని లక్ష్మీదాస్ బావ, మోక కూర్చుని లెక్కవేశారు. ఎంత తక్కువైనా 13000 రుపాయలు అవుతాయని తేలింది. నేను నా నగలు ఇస్తానన్నాను. “ఇవన్నీ నీవి. నువ్వే ఉంచుకో. వెళ్ళినవాణ్ణి మళ్ళీ వస్తానో లేదో తెలియదు. వచ్చినా ఇవన్నీ చేయించి ఇవ్వగలుగుతానో లేదో” అనేశాడు మోక. తొమ్మిది నెలలు నిండి ప్రసవ సమయం దగ్గర పడుతోంది. తొలిచూరు బిడ్డ చనిపోయింది. ఆ చావు ప్రసవం అంటేనే భయం అనిపించేంలా చేసి వెళ్ళింది. ఇప్పుడు ఈయన చూస్తే ఇలా అంటున్నాడు! నాకయితే చచ్చిపోయేంత భయం వేసింది. వస్తాడో లేదో అనిపిస్తే అసలు వెళ్లడం ఎందుకు అని మళ్ళీ మళ్ళీ అనిపించి, అలా ఆయనతో అని, తిట్టించుకున్నాను. ఒకసారైతే “తల సరిగ్గా ఉందా లేదా నీకు” అని దబాయించాడు మోక.

***

పదమూడు వేల రుపాయలు మా వాళ్ళలో ఎవరివద్దా లేవు. పోరుబందరు ఆంగ్లేయాధికారి వద్దకు ఉన్నత చదువులకు ఇంగ్లండుకు వెళ్లడానికి ధనసహాయం చెయ్యవలసిందిగా అడుగడానికి వెళ్లారు. అన్ని రోజులు దివాన్‌గా సేవలందించిన కుటుంబపు సభ్యుడిగా ఆర్థిక సహాయం ఇవ్వడం న్యాయం అని వాదించారు. కానీ ఆయన ఖడాఖండిగా నిరాకరించారట. నా భర్త మొహం వాడిపోయింది. తన మనసుకు వచ్చింది చేయకుండా ఉండలేడు, వెళ్ళిరానీలే అనిపించింది. నా నగలనన్నిటినీ అతడి ముందుంచాను. వాటినుండి మూడున్నర, నాలుగు వేలు వచ్చాయి.

వేవిళ్ళ శాస్త్రార్థానికి నన్ను పుట్టింటికి పిలిచారు. పోరుబందరుకు వెళ్ళి ఇక్కడి సంగతులన్నీవారి చెవిన వేశాను. ఎవరి వద్దనుండైనా ధన సహాయం చేయించమని, లేదా అప్పుగానైనా ఇప్పించమని, ఆయన లండన్ కయితే వెళ్ళితీరాలని చెప్పాను. ‘నా ప్రసవం, బాలింతతనం మీరేమీ చెయ్యకండి, తీసుకు వచ్చి దిగబెట్టేవి ఏవీ చెయ్యకండి, నా భర్త చదువుకు సహాయం చెయ్యండి’ అన్నాను. అక్కడా కష్టాలే ఉన్నాయి. నా అక్క భర్త ప్రయాణం ఖర్చు భరిస్తానని అన్నారు. చుట్టాల దగ్గర అప్పులు చేసి పంపిద్దాం, దాని గురించి వదిలెయ్యి అని ధైర్యం నింపారు.

మొత్తానికి డబ్బుల ఏర్పాటు జరిగింది. ఇంత అయ్యాక కూడా నా చిన్న మామయ్య తులసీదాస్ గారు “ఫారిన్నూ వద్దు ఏం వద్దు. లండన్‌కు వెళ్ళి వచ్చినవాళ్లను చూశాను కదా నేను. సిగార్ నోట్లోనుండి తియ్యనే తియ్యరు. అన్నిఆచారాలను వదిలేస్తారు వాళ్ళు” అంటూ చివరి క్షణం దాకా పొడుస్తూనే ఉన్నారు. ఇది మా అత్తగారు పుతలీ బాయిని బాగా భయపెట్టింది. చివరికి తమ ఆప్తులయిన సంత్ బేచార్ జి మహరాజ్ గారిని కలిసి వచ్చారు. ఆయన మాటే చివరి మాట ఆమెకి. “కాలం మారింది. సముద్రం దాటితే జాతిభ్రష్టుడవడమేం లేదు. విదేశాలకు వెళితే వెళ్ళనీ. కానీ అతడి వద్ద మూడు ప్రమాణాలు చేయించుకోండి” అని సలహా ఇచ్చారు. విదేశాల్లో మద్యం, మగువ, మాంసం ముట్టుకోనని ప్రతిజ్ఞ చెయ్యాలి.

మోక బయలుదేరే రోజు దగ్గిర పడుతున్నాయి. అక్కడికి తీసుకువెళ్ళడానికి తిండి సామాన్లు ఏమేం చెయ్యాలో అని ఆలోచించి బుర్ర పాడుచేసుకున్నాం. ఈ తిండి, ఈ పొడి, ఈ కారం, ఈ తీపి, ఇది కావాలా, ఇది అక్కర్లేదా అనుకుంటూ ఏరి ఏరి పెట్టాము. ఏ తిండి చాల్రోజులు ఉంటుందో అని ఆలోచించి చేసి పెట్టాము. అక్కడ ఎలాంటి దుస్తులు వేసుకోవాలో తెలీక ఉన్నవాటిలో మంచివి ఏరి ఇస్త్రీ చేసి పెట్టాము. అక్కడ విపరీతమైన చలి అని తెలిసి కాథేవాడ్ వెచ్చని దుస్తులను ఒక వైపుకు పెట్టాము. అక్కడికి వెళ్ళినాక దగ్గర ఉండనీ అని మా అత్తగారు, ఒక చిన్న భగవద్గీతను, ఒక జపమాలను పెట్టారు. నా భర్త బ్యారిస్టర్ అయ్యి తిరిగి వస్తున్నందుకు గర్వపడాలో, ఇంక రెండు మూడు సంవత్సరాలు కనిపించడు అని దుఃఖపడాలో ఒకటీ అర్థం కాలేదు.

అప్పుడని కాదు. అక్కడినుండి ముందు ముందు అనేక సార్లు నేను ఇలాంటి సందిగ్ధంలోనే, అదీ ఈ మోక విషయంలోనే ఇరుక్కున్నాను.

మోక ఇకనేం బయలుదేరాలి, ఒక వారముందేమో అనిపిస్తుంది అంతే. నాకు కడుపులో నొప్పి ప్రారంభమయ్యింది. ఇంట్లో వాళ్ళంతా నేను నా భర్తను దూరం చేసుకునే కష్టంలో బాధపడుతున్నానని అనుకున్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ బాధ ఎక్కువై, మోక బయలుదేరేటప్పటికి ఇక చచ్చిపోతానేమో అనిపించింది. తొలిచూరు కాన్పు చాలా కష్టంగా ఉండింది. కానీ అప్పటికంటే ఇప్పుడు కొంచెం గట్టిదాన్నయ్యాను. పెద్దదాన్ని కూడా అయ్యాను. నాకప్పుడు 20 ఏళ్ళు. ఇలాగైనా మోక వెళ్ళిపోయేంతలో బిడ్డ పుడుతుంది, అది తన తండ్రిని, అతడు తన బిడ్డను చూసుకోవచ్చు కదా అని నెమ్మది ఒక వైపు. ఈ బిడ్డైనా దక్కుతుందో లేదో అనే భయం ఇంకొక వైపు. చివరికి నొప్పులు ఎక్కువై, దుఃఖం ఎక్కువా, నెమ్మది ఎక్కువా అని తెలియని విచిత్ర మనఃస్థితి ఏర్పడింది. వాటి నడుమ నా నిర్ణయం గట్టిగా ఉంటూ, ఏదో ఒక తెలియని ధైర్యం ఏర్పడింది. ఈ పురిటి నెప్పులు తక్కువైనట్టే, మోక దూరంగా ఉండే సమయం కూడా గడచిపోతుంది, చివరికి అంతా మంచే జరుగుతుంది అనిపించింది. ఏవేవో కలవరింతలు రాసాగాయి. మా ఇంటివాళ్ళంతా నాకు మతిభ్రమించిందని అనుకున్నారు.

చివరికి కాన్పయ్యి, ఒడి నిండింది. మగ బిడ్డ. ఎర్రగా, బొద్దుగా ఉన్న నా బిడ్డ, పుట్టిన రెండు నిమిషాలకే కప్పు ఎగిరిపోయేటట్టు ఏడ్చాడు. ఆ ఏడ్పు వినేవరకూ ఊపిరి బిగబట్టి వేచి ఉన్న వారంతా నెమ్మదిగా నిట్టూర్చారు. వెంటనే మా ఇంటికి వార్త చెప్పడానికి మోక పరుగెత్తాడంట.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here