నేను.. కస్తూర్‌ని-6

0
10

[వృత్తి రీత్యా వైద్యులైన డా. ఎచ్. ఎస్. అనుపమా కన్నడంలో రచించిన జీవితకథని శ్రీ చందకచర్ల రమేశ బాబు అనువదించి ‘నేను.. కస్తూర్‌ని’ అనే పేరుతో సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నారు.]

~

[dropcap]అ[/dropcap]ది జూలై 1888. బిడ్డ తండ్రి ఒక వారంలో బయలుదేరుతున్నాడు. నేను కూడా పురిటి స్నానం చేసి లోపలికి రాలేదు. ఒక రోజు మోక నా పుట్టింటికి వచ్చాడు. నేరుగా బాలింతరాలి గదిలోకి వచ్చేశాడు. “శ్ శ్. అయ్యయ్యో! ఇంకా శుద్ధి కాలేదు, ముట్టుకోరాదు” అని మా అమ్మ అరుస్తున్నా “అత్తా! కొంచెం బయటికెళ్తారా? ఒకే ఒక్క నిముషం” అన్నాడు. అమ్మ బయటకు వెళ్ళిపోయింది. “పేరేం పెడదాం బిడ్డకు?” అని అడిగాడు. నేనింకా ఆలోచించలేదు. “అన్ని తిళ్ళు తయారు చేసి పెట్టావు కదా! నేనేం బకాసురుణ్ణి అనుకున్నావా?” అని నాతో మేలమాడాడు. “నాకు ఏ తిండీ అక్కర్లేదు కస్తూర్. నువ్వు ఇంతవరకూ ఇచ్చిన సంతోషాన్ని నాతో తీసుకుపోతాను. నా కళ్ళల్లో ఉన్న నీ నవ్వును, బిడ్డ మొహమే చాలు. అమ్మ ఇచ్చిన జపమాల, భగవద్గీత మాత్రమే తీసుకుని వెళ్తాను. సరేనా? బిడ్డను హరిలాల్ అని పిలుద్దామా?” అని అడిగాడు. “ఓహో! హరినారాయణుడి పేరు. మంచిదే. సరే” అన్నాను. బిడ్డను చేతిలోకి తీసుకుని వాని చెవిలో “హరి, హరిలాల్ హరిలాల్ హరిలాల్. నా కొడుకా” అని గుసగుసలాడాడు. తలుపును మెల్లిగా తోసిన మోక, బిడ్డను నా పక్కలో పడుకోబెట్టి, నా కళ్ళు, ముక్కు, పెదవులు, నుదురు పైన వేళ్ళాడించి, అతి తేలికైన మెత్తనైన ముద్ర ఒత్తాడు. ఓ,ఇది ఆ ఆవేశపు మోకా యేనా? ఇతణ్ణి సంవత్సరాల కొలది ఎలా వదలి ఉండాలి దేవుడా అని నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. వేడి ఊపిరిని గమనించి నా కళ్ళ పైన పెదవి ఒత్తాడు, నా దుఃఖాన్నంతా పీల్చివేసేటట్టుగా.

“కస్తూర్! నేనిప్పుడు నీ పక్కనే ఉండి నీకు సేవలు చెయ్యాల్సింది. క్షమించు నా ప్రాణమా! ఈ శరీరం బయలుదేరినా కానీ, నా ప్రాణం మాత్రం ఇక్కడే ఉంటుంది అని మరచిపోకు. ఎప్పటికైనా మోహన్ దాస్ నీవాడే, నీ దాసుడే. నేను అక్కడ ఏ మగువనూ ముట్టుకోను. మద్యం, మాంసం ముట్టుకోను. అమ్మకిచ్చిన మాటనే నీకూ ఇస్తున్నాను. రెండే సంవత్సరాలు, వచ్చేస్తాను. అప్పటిదాకా ఈ బిడ్డ ఆరోగ్యం, నీ ఆరోగ్యం బాగా చూసుకో. నాకోసం ప్రార్థించు. నువ్విక్కడ ఎలా ఉంటావో నేనక్కడ అలానే ఉంటాను. హరిని, నిన్ను బాగా చూసుకో. నాకోసం మీరిద్దరూ బాగుండాలి. లండన్‌కు వెళ్ళడానికి డబ్బులు, ఇతర ఏర్పాట్లు కూడా అయిపోయాయి. ఇక నీ అనుమతి ఒకటే బాకీ ఉంది. నన్ను నవ్వుతూ పంపు నా బంగారమా! దేవుడి ఇచ్ఛ ఇలానే ఉంది. అంతా మంచిదే అవుతుంది. దేవుడు మన చెయ్యి వదలడు. వెళ్ళే రోజు మళ్ళీ వస్తాను,” అంటూ నుదురు, కనుబొమలు, పెదాల పైన చిత్తరువు గీశాడు. మెల్లగా బిడ్డకు ఒక ముద్దిచ్చి, వెళ్ళేపోయాడు.

ఈ క్షణాలే మూడు సంవత్సరాలు నేను ప్రాణం ఉగ్గబట్టుకుని వేచి ఉండే శక్తినిచ్చాయి. హరి తండ్రి ఐన మోక ఉన్నట్టుండి పెరిగి పెద్దవాడయినట్టు అనిపించింది.

లక్ష్మీదాస్ బావ పడవ ఎక్కించి వస్తానని ముంబైకి వెళ్ళినాయన తొందరగా తిరిగి వచ్చేశారు. సముద్రంలో తుఫాను లేచిందనీ, బయలుదేరిన పడవలు మునిగిపోతున్నాయనీ, అందుకే దీపావళి సమయానికి బయలుదేరమని అక్కడి వాళ్ళు సలహా ఇవ్వడంతో మోకను అక్కడి స్నేహితుల ఇంట్లో వదిలేసి వచ్చానని చెప్పారు. నా చెల్లెలి భర్త మోకకు తోడుగా ఉన్నాడని చెప్పారు. పడవ మునగడం గురించిన వార్త విని నాకు చేతులు కాళ్ళు ఆడలేదు. అయ్యో! హరి నాన్న మళ్ళీ తిరిగి రాకపోతే? వెళ్లవద్దు అని పరిగెత్తుకుని వెళ్ళి ఆపేద్దామని అనిపించింది. కానీ నేనందుకోనంత ఎత్తుకు ఎదిగిపోయారు హరి నాన్న. నేను పసికందును ఒడిలో పెట్టుకుని భయపడడం తప్ప, అతడి కోసం ప్రార్థించడం తప్ప, ఇంకేమీ చేయడానికి వీలు కాలేదు.

ముంబై నుండి మరో వార్త వచ్చింది. మోధబనియాలనే మా జాతివాళ్ళకు హరి నాన్న సముద్రాన్నిదాటి వెళ్లడం అసలు నచ్చలేదట. ముంబైలో అనుకూల వాతావరణం కోసం కాచుకుని పడవ ఎక్కడానికి మోక వేచి ఉన్నప్పుడు జాతివారు కాబా గాంధీ కొడుకును గుర్తు పట్టి వెళ్లవద్దని పట్టు పట్టారు. 19 సంవత్సరాల మోకకు అందరూ, “మీ నాన్న నాకు అంత తెలుసు, ఇంత పరిచయం” అంటూ చెప్పేవారే. పాపంతో నిండిన ‘కాలాపాని’ని దాటి వెళ్తే జాతి నుండి బహిష్కారం అని వాళ్ళు పట్టు పట్టారు. పెద్దవాళ్ళంతా కలిసి ఒక జాతి పంచాయితీని జరిపించారు. సముద్రాన్ని దాటడం అంటే జాతి భ్రష్టులైనట్టే. కాబట్టి మోక విదేశానికి వెళ్ళరాదు, ఆయన్ని పంపడానికి ఎవరూ రేవుకు వెళ్ళరాదు, వెళ్ళినవాళ్ళు జరిమానా చెల్లించాలి, చెల్లించనివాళ్ళను జాతినుండి వెలివేయాలి అని పంచాయితీ తీర్మానించింది. మద్యం, మాంసం, మానిని లను ముట్టుకోనని తన తల్లికి ప్రమాణం చేశానని మోక చెప్పినా వారు వినలేదు. కానీ హరి నాన్న వెనక్కు తగ్గలేదు. వాళ్ళంతా చివరికి కాబా గాంధి కొడుకు దండన విధించి బహిష్కరించారు. అదేం జరగనట్టు మోక లండన్‌కు బయలుదేరారు.

మూడు వారాల తరువాత రాజకోట్ లాయర్ ఒకాయన లండన్‌కు బయలుదేరారు. ఆయన తోడుగా మోక తనూ బయలుదేరాడు. ప్రయాణపు ఖర్చులు ఇస్తానన్న మా అక్క భర్త, జాతివాళ్ళ కోపానికి భయపడి ఇవ్వకుండా తిరిగి వచ్చేశారు. దానికి కూడా అప్పు చెయ్యల్సివచ్చింది. ఈయన్ని పంపడానికి బంధుమిత్రులు ఎవరూ వెళ్ళలేదు. లక్ష్మీదాస్ బావ ఇదంతా చెప్పేటప్పుడు నాకు దుఃఖం పొంగింది. మొదటి సారిగా జాతి పైన కోపం వచ్చింది. అప్పటిదాకా నా జాతి అంటే నాకు చాలా అభిమానం ఉండేది. ఇప్పుడు కొంచెంకొంచెంగా కూలుతూ పోయింది.

మోధబనియాలు మమ్మల్ని జాతి నుండి వెలివెయ్యడం ఒక రకంగా మంచిదే అయింది. ఒక్కొక్కటే వదిలేస్తూ పోయాం అన్నాను కదా, అలా జాతినే మొదటిగా వదిలెయ్యడం జరగింది. కానీ, ఎంత దుఃఖపడ్డాడో నా మోక? హరిని పట్టుకున్నట్టు అతడిని కూడా పట్టుకుని ఓదార్చాలనిపించేది. కానీ ఎక్కడ? హరికి ఒక నెల నిండేటప్పటికి వాడి తండ్రి సముద్రం దాటి నా నుండి దూరంగా సాగి, కనిపించని దేశం చేరుకున్నాడు.

ఇంతవరకూ అతడు నా మోకాగా ఉన్నాడు. ఇక పైన “ఉన్నారు” “మోక భాయ్” అవుతున్నారు.

మా వైపు చాలా మట్టుకు అందరి ఇళ్ళల్లో, మా మామగారి ఇంట్లోనూ అంతే, సంగీతం, పాట ఇవేవీ ఉండేవి కావు. వినరాదు. ప్రతి రోజూ భజన ఉంటుంది అంతే. ఆట, పాట, వేడుక ఉండదు. సంగీతం ఉండదు. యాత్ర ఉండదు. విశ్రాంతి ఉండదు. ఎప్పుడూ పని, పని, పని. వ్యాపారం, వ్యాపారం, వ్యాపారం. పనుల్లో మునిగి తేలే అలవాటు మోకకు కూడా ఉండేది. మోక మొదటగా పియానో చూసింది ఓడలోనే. ఎంత ఆశ్చర్యంతో తన జాబులో దాని గురించి రాశాడో తెలుసా? ఎంత ఘన గాంభీర్యంగా ఉన్నా, అతడు పసిపిల్లవాడే. అన్నింటి గురించి ఆసక్తి, కుతూహలం. ఒక జాబు నిండా ఉత్త పియానో గురించే రాశారు.

లండన్‌కు వెళ్ళిన తరువాత లెక్కలేనన్ని ఉత్తరాలు రాశారు. వాటినన్నిటినీ భద్రంగా ట్రంకులో దాచేదాన్ని. స్వతహాగా రాసిన ఉత్తరాలు కదా! అప్పుడప్పుడు కళ్లకద్దుకునేదాన్ని. అకస్మాత్తుగా ఆయన కళ్ల రెప్పలో, తల వెంట్రుకలో, మీసాల వెంట్రుకలో దొరకొచ్చునేమో అని చూసేదాన్ని. ఊహూ. చాలా క్రమశిక్షణ ఉన్న మనిషి. అలా జరగడానికి వీల్లేదంతే. ఇక్కడి నుండి వెళ్ళిన ఉత్తరాలలో అలాంటివి ఉండే అవకాశాలున్నాయి. ప్రతి ఉత్తరంలోనూ ‘ఉత్తరం రాస్తూండు, ఉత్తరం రాయి’ అని ఒత్తిడి చేసేవారు. ఏమని రాసేది, ఏమని రాయించేది? నాకు ఉత్తరం రాయడం వచ్చేది కాదు. చదవడం, రాయడం కూడా వచ్చేది కాదు. నేను చదువుకున్నదాన్ని కాను, ఇతరులతో చదివించాలి, రాయించాలి. అక్షరాలు మాత్రం నేర్చుకున్నాను. ఎలాగెలాగో రాసేదాన్ని. కానీ, తరువాతి ఉత్తరంలో ఎలా కాయితం పైన లేఖిని పట్టుకుని రాయాలి అనే దాని గురించి ఒక పుట సలహా ఉండేది. ఇలా రాయి, ఇలా ప్రారంభించు, తరువాత ఇలా రాయి అని ఏవేవో నియమాలు. అక్షరాలు గుండ్రంగా అవాలని రోజూ కా గుణింతం రాయాల్సుండేది. పనుల మధ్యలో ఇదేం ఈయన పీడించడం అని కోపం వచ్చేది. చదువు రాక పోయినా, పైసా పైసా ఇంటి లెక్క అంతా చేస్తుంది నేనే కదా అనిపించేది.

మోక ఎలాంటి వాడంటే అన్నిటినీ రాసేవారు. అందరికీ తెలిసేటట్టు చెప్పేసుకుంటే చేసిన పాపం క్షమార్హం అని ఆయన అభిప్రాయం. రాసి తెలిపేస్తే మళ్ళీ చెడు పనులు చెయ్యకుండా మనం ఉండవచ్చు అని భావించారు. ఏమైనా కానీ, నిజాయితీగా బ్రతకాలని ఆయన తత్త్వం. “డిన్నర్లకు వెళ్ళేటప్పుడు ఒకామె చాల దగ్గరైంది. ఆమెతో ఇస్పేటు సహా ఆడేవాణ్ణి. చివరికి అమ్మకిచ్చిన మాట గుర్తుకు వచ్చి, ఆమెను వదిలేశాను” అని ఒకసారి నాకు రాశారు. నాకెలా అనిపించుండాలి చెప్పు? నాకు ధైర్యం రావాలని అలా రాసేవారని చెప్పారు. దీన్ని చదివి నాకు ఎలా ధైర్యం వస్తుంది? తనకు ధైర్యం రావాలి అని రాసుండాలి.

అక్కడికెళ్ళినాక కొన్ని రోజులు విసుగు పుట్టుండొచ్చు. తరువాత రాసిన ఉత్తరంలో అక్కడి శాకాహారి సంఘం పరిచయం అయ్యింది, నిజాయితీగా ఉండడానికి సహాయపడుతోంది అని రాశారు. మొదట హోటల్లో, తరువాత హాస్టళ్ళలో రోజులు గడిపి, అక్కడెక్కడా పడక ఒక ఇంట్లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్నానని రాశారు. రాను రాను అక్కడున్న మనవారి పరిచయం కాసాగింది. ప్రాణజీవన్ మెహ్తా అని, మా ఊరు రాజకోట్ వైపు వారు, లండన్‌కు ఈయనకంటే ముందుగా వెళ్ళినవారు దొరికారట. ఆయన దొరికినాక ఒక మంచి స్నేహితుడు దొరికాడు అని ఆనందంగా ఉంది అని రాశారు. డబ్బులు మాత్రం నీళ్ళ లాగా ఖర్చవుతున్నాయి. డబ్బులు కావాలి అని ఇంటికి పైన పైన ఉత్తరాలు వచ్చేవి. ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పే పాఠశాలకు చేరారు. ఇతర కోర్సులను తీసుకున్నారు. లక్ష్మీదాస్ బావ అప్పులు చేసి, చేసి డబ్బులు పంపేవారు. ఆయన దన్నును మరచిపోలేము. తండ్రి స్థానంలో నిలుచుండి హరి నాన్నకు సహాయం చేశారు. అదేమైనా కానీ, తన తమ్ముణ్ణి బ్యారిస్టర్ చేసి తీరాలని పట్టుబట్టారు మా బావగారు. ఒకటి తరువాత ఒక పరీక్షలు ముగిసాయి. మళ్ళీ ఆరు నెలలకు మరొక్క పరీక్ష ముగిసింది.

అలా ఇలా రెండు సంవత్సరాలు గడచిపోయాయి. కానీ తిరిగి రావడానికి సమయం పడుతుంది అని ఒక ఉత్తరంలో రాశారు. “ఆహార ప్రయోగాలు, శాకాహారం ఇలా అనేక విషయాల గురించి పత్రికకు వ్యాసం రాస్తున్నాను. శాకాహార సంఘ కార్యదర్శినయ్యాను. పెద్దవాళ్ళ పరిచయాలు అవుతున్నాయి” అని రాశారు. శాకాహార సంఘంలో చేరినందువలన రుచిగా ఉండే మన ఆహారం దొరుకుతుండవచ్చు అని అత్తగారు, బావగారు నెమ్మది పొందారు.

ఇటు వైపు నేను, హరి ఒకరికొకరు అతుక్కునే గడుపుతున్నాము. నాకైతే నా మొదటి బిడ్డ పోయినట్లే హరి కూడా పోతాడేమో అనే భయం, భ్రమ చాలా రోజుల వరకూ ఉండింది. ఈ క్షణానికి బిడ్డ ఊపిరి ఆగిపోతే అని భయంగా ఉండేది. రాత్రి పాలు తాపుతూ పక్కలో వేసుకున్న బిడ్డ తెల్లవారేటప్పటికి ముక్కులో పాలు నిండిపోయి, ఊపిరి అందకుండా చనిపోయాడు అని ఎవరో చెప్పేసరికి హరిని నా తొడపైనే పడుకోబెట్టుకుని పాలు తాపేదాన్ని. రాత్రి మెలకువ వచ్చినప్పుడల్లా బిడ్డ ఊపిరి తీస్తున్నాడా లేదా అని పట్టి పట్టి చూసేదాన్ని. వీడు చనిపోతే అని ఆలోచించి ఆలోచించి ఏడ్చేదాన్ని. వీడి తండ్రి కూడా ఇక్కడ లేడు. ఇంట్లో అందరూ ఉన్నా తండ్రి లేని పిల్లవాణ్ణి నేనే చూసుకోవాలి అనే భయం ఉండేది. వాడి మెడకు, కాలికి, చేతులకు ఏవేవో దారాలు కట్టేదాన్ని. తాయత్తులు కట్టేదాన్ని. పూజలు చేయించేదాన్ని. ఇంటికి వచ్చిన సాధువుల కాళ్ళకు వాడి నుదుటిని తాకించేదాన్ని. ఏమైనా కానీ, నాకు నా కొడుకు ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలి అంతే. హత్తుకుని పడుకునేదాన్ని. వాడి తండ్రి గుర్తుకు వచ్చినప్పుడల్లా వాడిని ముద్దాడి, హత్తుకునేదాన్ని.

వారానికొకసారి వచ్చే భర్త ఉత్తరం, దాంట్లో నా గురించి, హరి గురించి ఆయన చూపుతున్న ప్రేమ, ఆరోగ్యం-ఆహారం గురించిన సలహాలు, గుజరాతి చదివి రాసేదాన్నిగురించిన విచారణ అన్నీ ఇలాగే జరిగిపోతున్నాయి. హరి పెద్దవాడవుతున్నాడు. రోజు రోజుకూ గట్టిగా తయారవుతున్నాడు. ఇక వీడు చావడు అనే ధైర్యం వచ్చింది. హరి లేకపోతే నాకు మోక లేనిది ఎంత కష్టమయ్యేది అని ఆలోచించేదాన్ని. ఒక్కోసారి హరి తండ్రి ఉండుంటే వీడిని ఇంత జాగ్రత్తగా ఎలా చూసుకోను వీలయ్యేది అని కూడా అనిపించింది. ఆయన ఉండుంటే ఈ వేళకు ఇంకోదాని తయారి జరిగుండేది అని జ్ఞాపకం వచ్చి సిగ్గు ముంచుకొచ్చేది.

దీని నడుమ లక్ష్మీదాస్ బావ పోరుబందరుకు దివాన్ కచేరికి వెళ్ళివచ్చేవారు. కర్షణ్ దాస్ బావ అక్కడే రాజకోట్‌లో చిన్నపనికి కుదురుకున్నారు. మా అత్తగారు అప్పుడప్పుడూ అనారోగ్యానికి గురవుతున్నారు. నా ఆడపడుచు భర్తకు కూడా అప్పుడప్పుడు ఆరోగ్యం చెడేది.

మోకనుండి ఎన్ని ఉత్తరాలు వస్తున్నా ఆయన ఎదురుగా లేని కొరత నన్ను బాధించేది. సాధువులు ఇంటికి వచ్చినప్పుడు నా కష్టాలు చెప్పుకుంటుండేదాన్ని. మా ఇళ్ళల్లో సాధువులు వచ్చినప్పుడు ఉండడానికి ఒక గదినిచ్చేవారు. ఒక్కొక్కరుగా ఆడవాళ్ళు పరదా చాటున తమ కష్టసుఖాలను సాధువుల వద్ద చెప్పుకునేవారు. రోగాలు, పోట్లాటలు, విసుగు, సంబంధాల కష్టాలు మొదలైన అన్నిటినీ సంసారం వదిలేసిన సాధువుల వద్ద చెప్పుకుని మనసులు తేలికపరచుకునేవాళ్ళం. మా కష్టాలకు పరిహారంగా వారు చెప్పే వ్రతాలు, పూజలు అన్నిటినీ చేసేదాన్ని. భర్తను చూడాలని అనిపించినప్పుడు, అక్కడ ఇంకెవర్నైనా పెళ్ళి చేసుకున్నాడా అని భయం కలిగినప్పుడు, ఇక్కడినుండే కట్టు బిగించేదాన్ని. “ఫిరంగి ఆడవాళ్ళను నమ్మలేము. వాళ్ళు మన మాదిరి కాదు. అన్నీ వదిలేసినవాళ్ళు” అని నా తోడికోడళ్ళు మళ్ళీ మళ్ళీ భయపెట్టేవాళ్ళు. కానీ ఎడతెగకుండా వచ్చే ఉత్తరాల వల్ల అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు, ఏ పన్లో మునిగున్నాడు అని తెలిసేది. మోక భాయి ఇతర ఆడవాళ్ళ వెంట పడేవాడు కాడు. ఏముందో అంతా చెప్పేసుకునేవాడు. అలా ఏమైనా ఉంటే ఉత్తరం రాసి తెలిపేస్తారు అని ధైర్యం తెచ్చుకున్నాను.

దీని నడుమ మా అత్తగారికి చాలా అనారోగ్యమయింది. ఆమెను కనిపెట్టుకుని ఉండడంలోనే సమయం గడిచిపోయేది. తమ చిన్న కొడుకును తలచుకునేవారు, పిలిచేవారు. అప్పుడు లండన్‌కు రాసే ఉత్తరాల్లో అమ్మ మిమ్మల్ని తలచుకున్నారు అని రాసేవాళ్ళం. ఆమె అనారోగ్యం చాలా ముదిరి ఇక బ్రతకడమే కష్టం అని తెలిసినప్పుడు మోక భాయికి తెలపాలా వద్దా అని ఇంట్లో చర్చ జరిగింది. అమ్మను చూడాలని అంత దూరం నుండి వచ్చె వెళ్ళడం విద్యాభ్యాసానికీ అడ్డంకి, అలాగే డబ్బులకు కూడా ఇబ్బంది, అదీకాక అత్తగారు అంతవరకూ బ్రతకడం సందేహం కాబట్టి మోకభాయికి విషయం తెలిబరచరాదని నిర్ణయించారు.

చివరికి ఒక రోజు తన చిన్నకొడుకు తిరిగి వచ్చేరోజు కోసం కాచుకోకుండా అత్తగారు చనిపోయారు. చాలా ప్రశాంతమైన చావు ఆమెది. ఆమె మొహం చూస్తే శాంతియుతంగా యాత్రకు బయలుదేరినట్లున్న నెమ్మది కనిపించింది. తన తండ్రి ప్రాణం పోయేటప్పుడు తను దగ్గర లేనే అని బాధపడిన మోక తన తల్లి పోవడానికి ముందు కానీ, తరువాత కానీ ఉండలేక పోయినందుకు అదెంత బాధపడతాడో అనిపించింది. నా కళ్ళల్లో అత్తగారిని నింపుకుని భర్త వచ్చాక దాన్ని దాటించేయాలి అనిపించింది.

అలాగో ఇలాగో రెండు, రెండున్నర సంవత్సరాలు గడిచే పోయాయి. అయినంతవరకూ ఖర్చు చెయ్యకుండా, డబ్బులు అడక్కుండా పండుగలు పబ్బాలు నిభాయించేటట్టు చూసుకున్నాను. బావగారి నుండి తీసుకున్నప్రతి పైసాకు లెక్క రాసుంచాను. అలా పెట్టమని మోక చెప్పున్నారు.

ఇలా ఉండగా ఆ రోజు రానే వచ్చింది. హరి నాన్న, బ్యారిస్టర్ మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధి ముంబైలో వచ్చి దిగారు. నాకైతే స్వర్గమే వచ్చి రాజకోట్‌లో వాలుతుందేమో అనేంత ఆనందం. దేహం, మనసు, రోమాలు ఆనందంతో తకతక నర్తిసున్నట్టు, ఎదలో ఏదో వికసిస్తున్నట్టు అనిపించింది.

రాగానే లక్ష్మీదాస్ బావ అత్తగారు చనిపోయిన వార్త చెప్పారు. మోకభాయి చాలా దుఃఖించారట. ఆయన మిత్రుడు ప్రాణజీవన్ మెహ్తా ఇంట్లో రాయ్‌చంద్ భాయి అనే ఒక సంతుడు ఆయనను సమాధాన పరచారట. జాతి నుండి వెలివేసిన వాళ్ళ కిరికిరి ఎక్కువయ్యింది. వాళ్ళ కోపం శమింపజేయడానికి, రాజ్‌కోట్‌కు రావడానికి ముందు నాసిక్‌లో దిగి, గోదావరిలో మునిగి శుద్ధమయ్యారు. కానీ అది మోధబనియాలను తృప్తి పరచకుండా, మేము జరిమానా కట్టాల్సిందేనని తీర్మానించారు. మోక భాయి కట్టలేదు. అలా జాతి పెద్దల కోపానికి భయపడి మోక అక్క తమ్ముడ్ని ఇంటికి పిలిచి ఒక గ్లాసు నీళ్ళైనా ఇవ్వలేదు.

మూడు సంవత్సరాల తరువాత హరి నాన్న ఇంటికి వచ్చారు. సంవత్సరాల తరబడి తరువాత నా భర్త నన్ను చేరుకున్నారు. మొదటి కంటే పెద్దవారయ్యారు, తెల్లబడ్డారు. మీసాలు దట్టమయ్యాయి. విదేశంలో మంచి ఆహారం దొరికిందేమో, ఆరోగ్యవంతంగా కనబడ్డారు. కళ్ళు మెరుస్తున్నాయి. హరి ముందు ముందు తండ్రి వద్దకు వెళ్ళడానికి మొండితనం చేశాడు. తరువాత కొన్ని రోజులకు సర్దుకున్నాడు.

మోక దూకుడు, పోకిరి పనులన్నీ ప్రీతితో కూడిన స్పర్శలుగా, మెత్తని మాటలుగా మారాయి. తనను తాను నిగ్రహించుకోవడానికి తను పడిన కష్టాలన్నీ ఏకరువు పెడుతూ నా ఛాతీలో మొహం కప్పుకుని మౌనంగా ఉండిపోసాగారు. నా మట్టుకు భవిషత్తు ప్రణాళికలేం లేకుండా, అత్యంత నెమ్మది క్షణాలవి.

నా వస్తువు నా వద్దకు వచ్చింది. నా ఇంటి దీపం నా ఇంటికి వెలుగునిస్తోంది. దీనికంటే ఇంకేం కావాలి?

సముద్రాలకావలి కల

ఏదైనా నెమ్మది, రోమాంచనం ఒకే రకంగా ఉండవమ్మాయ్!

మూడు సంవత్సరాల లండన్ చదువు కోసం చేసిన అప్పులు తీర్చవలసి ఉంది. చేయవలసిన పెళ్ళిళ్ళ ఖర్చులకు డబ్బులు లేక ఇంటివాళ్ళ చెయ్యి లేవడం లేదు. బావగారికి అనేక ఆశలు, ఇంకేమిటి ఇంటి ఖర్చులకు డబ్బులిచ్చే కామధేనువు వచ్చేసింది అని. ముంబైలో నా భర్త లాయరుగిరి ప్రారంభమై, కొన్ని రోజుల తరువాత మేమంతా అక్కడికి వెళ్ళడం అని నేను కూడా కలలు కన్నాను. కానీ మోకభాయికి ఇప్పుడు తన భార్యను, తన ఇంటివారిని లండన్ సంప్రదాయాలకనుగుణంగా మార్చే ఉత్సాహం పుట్టుకొచ్చింది. ఇది ఇక్కడ పెట్టరాదు, సరైన పద్ధతి కాదు, ఇలా చేయడం కాదు, భోంచేస్తూ సద్దు చెయ్యడం సరికాదు, చేతులతో తినడం శుభ్రత కాదు, లేవగానే ఒక కప్ చాయ్ తాగాలి, కలుపుకోవడానికి చక్కెర, చంచా ఇవ్వాలి, నేలపై కూర్చోవడానికి బదులు కర్ర దివాన్ వెయ్యాలి, కిటికీ తలుపులు బార్లా తెరవకుండా తెరలు వెయ్యాలి, వచ్చిన అతిథులను ఇక్కడినుండి లోపలికి పంపడం కూడదు, తమదంటూ స్థలం కోసం ఇక్కడ ఒక గోడ కట్టాలి, ఓహోహో.. ఇలా. లక్ష్మీదాస్ బావ కొన్నింటిని ఆచరణలో పెట్టారు. కప్పు సాసర్ తెచ్చిపెట్టారు. తెరలు కట్టించారు. దివాన్ వేయించారు. చంచాలు తెప్పించారు. ఇక మిగిలినవి వృథా ఖర్చులనిపించుండాలి, తన తమ్ముడితో ముందు ఒక లాయర్ ఆఫీసు తెరిచిన తరువాత వీటన్నిటికీ ఖర్చు చేద్దాం అన్నారు. నేను కూడా హరి నాన్నతో “మొదట ఒక కచేరి ప్రారంభించండి. చేతినిండా డబ్బు సంపాదించి, అప్పులు తీర్చి, తరువాత ఇంటిది, మనది అలంకరణ చేద్దాం” అని గుర్తు చేశాను.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here