నేను నా బుడిగి-1

3
8

[box type=’note’ fontsize=’16’] “నా నోట్లోనుండొచ్చే ప్రశ్నలకు జవాబుచెప్పడం ఇంట్లో ఎవరికీ తెలీదు. అమ్మ ‘హుష్’ అని నోట్లో చేయుంచుకొని చెబితే, నాన్నేమో ఇలా నోట్లో చాక్లెట్టో, లడ్డూనో పెట్టేస్తారు” అంటూ “నేను నా బుడిగి”  పెద్దకథ చెబుతున్నారు వాసవి పైడి. [/box]

[dropcap]ఎ[/dropcap]క్కడినుంచి ఎలా మొదలుపెట్టాలో తెలీదుకాని చెప్పాల్సిన సంగతులు చాలానేవున్నాయి. ముఖ్యంగా రాత్రి నాన్న చెప్పిన విషయాలతో కలిపి ముందుగా మూడు సంగతులు. వాటిలో మొదటిదాని గురించి చెప్పేముందు… నేను ఈ విషయం గురించి నా ఫ్రండ్ ‘ఆరిఫా’తో మాట్లాడాలి. దానికి కొంచెం సమయం పడుతుంది. ఇక రెండో విషయం చెప్పేముందు అర్జంటుగా నేను బాతురూముకెళ్ళాలి. అంటే… ఇక్కడ భయంవల్ల కాదు, అవసరం అని అర్ధంచేసుకోవాల. ఇక అక్కడ మూడో విషయం గురించి తీరిగ్గా ఆలోచించుకోడానికి కొంచెం టైం చిక్కుతుందేమో చూసుకోవాల.

ఈ మధ్య ఊర్నుండి అమ్మమ్మ వచ్చినప్పటినుండి నాకు ఇంట్లో స్వేచ్ఛ అన్నదే లేకుండా వుంది. అడుగుతీసి అడుగు పెట్టాలన్నా లక్ష అడ్డంకులు. ఇట్లయితే నాకు ఎంత కష్టంగా వుంటుందో వేరే చెప్పాలా! “ఇంట్లోనే ఇట్టుంటే ఇంక బైట ఎలావుంటుందో” అంటాననుకున్నారా! అసలు మనం బైటకెళ్ళేదెప్పుడు? లేస్తే ‘కూర్చో’ అనే. కూర్చుంటే ‘ఇక పడుకో’ అనే. అట్టా గుమ్మంలోకి తొంగిచూడగానే ‘ఎక్కడికా పరుగు? ఇలారా!’ అంటూ పిలుపులు. ఇంకేముంది! ఒక ఆటాలే- ఒక పాటాలే. ఇక షికారన్నమాట మర్చిపోయి నాలుగురోజులైంది.

ఇవన్నీ నాతో పాటూ చెల్లి ‘అనిత’ కూడా భరిస్తున్నట్టే. కాకపోతే దానికి అంత బాధ లేదనే అనుకుంటున్నా. ఎందుకంటే అదెక్కువగా నిద్రపోతూ వుంటుంది. ఇంకా… అమ్మ దగ్గరో అమ్మమ్మ వెంటో వాళ్ళ కొంగు పట్టుకొని తిరిగే టైపు కాబట్టి, తనకింకా ఈ అడ్డాలేవీ ఎదురవ్వలేదు.

కొంతలో కొంత కొంచెం మేలేటంటే… నా ముఖ్యమైన ఫ్రండ్, నాకన్నా మూడేళ్ళు పెద్దది కాబట్టి. కొన్ని విషయాలలో మంచి సలహాలు కూడా ఇచ్చే ‘ఆరిఫా’ మా పక్కింట్లోనే వుండడం. కొంచెం కన్నా చాలా ఎక్కువ కీడేంటంటే ఆరిఫా తమ్ముడు నా ఈడు వాడు ‘అన్వర్’ కూడా అక్కడే అఘోరించడం. ఏదో తెలివైనదాన్ని కాబట్టి ఇలా కష్టాలన్నీ కమ్ముకుంటున్నా, నైసుగా నెట్టుకొచ్చేస్తున్నా.

ఇలాంటి టయిములోనే ఈ ముఖ్యమైన సంగతులు తెలిసింది. అదే… ఇందాక నేను చెప్పిన మూడువిషయాలలో ఇది మూడోది, నాకు నచ్చనిది.

మొదటగా ఈ మూడో దాని గురించే చెప్తా. అదేమంటే కొన్నిరోజులు పరిస్ధితులు ఇప్పుడున్నట్టే వుండబోతూంది. మనం పూర్తిగా అమ్మమ్మ చెప్పుచేతల్లోనే వుండాల. ఇంకా, అనితను కూడా కనిపెట్టుకొని వుండాల. ఈ పని నాకు కష్టం కాదులే. ఎందుకంటే నాకు చెప్పకుండా అది ఒక్కటే ఏపనీ చేయదు.

ఇంకా… ఇంట్లోవాళ్ళకి ఇబ్బంది కలిగించే పనులేవీ చేయకూడదు. అసలు నన్నడిగితే వీళ్ళేనాకు ఇబ్బంది. ఈ విషయం నేను చెబితే ఓ నవ్వు నవ్వి ఊరుకుంటారు గానీ దాని గురించి గట్టిగా ఆలోచించరు.

ఇక రెండో సంగతేంటో చెప్పేముందుగా… అసలు… మొదటి, మూడో సంగతులకు ఈ రెండోదే కారణమైనా ఇది అనితకూ, నాకూ గంపనిండా సంబరాలను పట్టుకొచ్చింది. అదేంటంటే… కొన్నిరోజులలో మా ఇంటికి చెల్లికాని, తమ్ముడుకానీ రాబొతున్నారు. ఖచ్చితంగా ఎవరొస్తారో ఎందుకు తెలీదు? ఇప్పుడే ఎందుకొస్తున్నారు? ఇన్నిరోజులూ ఎక్కడున్నారో?! ఇవన్నీ అడిగేలోపలే నాన్న నా నోట్లో అమ్మమ్మ చేసిన లడ్డూ పెట్టేసారు. అది తింటూ… ఎదురుగా వున్న పళ్ళెంలో లడ్డూలెన్నున్నాయో లెక్కపెట్టుకుంటుంటే అక్కన్నుంచి నాన్నమాయం. నా నోట్లోనుండొచ్చే ప్రశ్నలకు జవాబుచెప్పడం ఇంట్లో ఎవరికీ తెలీదు. అమ్మ ‘హుష్’ అని నోట్లో చేయుంచుకొని చెబితే, నాన్నేమో ఇలా నోట్లో చాక్లెట్టో, లడ్డూనో పెట్టేస్తారు. ఇంక ఈ అమ్మమ్మ అయితే అసలు నోరే తెరవనీదు. కాని, నా ప్రశ్నలన్నింటికీ సమాధానం వినాయకుడు చెప్పేస్తాడు. రాత్రి అందరూ నిద్రపోయాక మేమిద్దరమే మాట్లాడుకుంటాం. వాటి గురించి నేను తర్వాత చెబుతాలే. ఇప్పుడు నా ఫ్రండ్ ఆరిఫా ట్యూషన్ నుంచి వచ్చే టైం అయ్యింది. ఇప్పుడే మాట్లాడుకోవాల. ఆనక వాళ్ళ తమ్ముడు అన్వర్ గాడుంటాడు. వాడు విన్నాడంటే అందరికీ చెప్పేస్తాడు. వాడి నోరు మూయించడం మా ఇద్దరి వల్లా కాదు నాయనా.

“తమ్ముడొద్దు చెల్లే మేలు. మా తమ్ముడిని చూసారుకదా! కోతికి చెడ్డీచొక్కా వేసి ఇంట్లో పెట్టుకున్నట్టే కదా! అందుకని చెల్లే కావాలని దేవుడికి మొక్కుకోండి. “…ఆరిఫా అనితకు, నాకూ నీతులు చెప్పింది.

“అది సరేలే కాని, ఇప్పటికే నాకో చెల్లి వుంది కదా! అందుకని తమ్ముడైతే బాగుంటుందేమో!” అన్నా. అనిత కూడా “అవునవును” అనింది.

“ఏమో! నాకు తోచింది చెప్పానబ్బా. ఇక మీ ఇష్టం” అనేసిన ఆరిఫా తన గౌనుకు చేతులు దులుపుకొని, నేనిచ్చిన చాక్లెట్ చప్పరిస్తా వెళ్ళిపోయింది.

అనిత ఏం మాట్లాడకుండా నా వంక చూస్తా కూర్చుంది. నేనూ నా నోటికి కాసేపు రెస్టు ఇచ్చి (నా నోటికి పని లేకపోతేనే నా బుర్ర పని చేస్తుందని అమ్మమ్మ చెప్పిందిలే) దానివంకే చూస్తావున్నా. అనిత నా మాట వింటుంది. నేనేం చెప్పినా కాదనదు. అమ్మ, నాన్న, అక్క అలాగన్నమాట. ఆరిఫా అన్నట్టు చెల్లి అయితే మంచిదే. ‘తానా అంటే తందానా’ అనే చెల్లి ఒకటుంది చాలు కదా! ‘తందామా అంటే ఎపుడో తన్నేసా’, అనే తమ్ముడే కావాలనిపిస్తుంది మాకిద్దరికీ. కాని, అన్వర్ గాడిని చూస్తుంటే కొంచెం భయంగానే వుంది. ఆరిఫా మాట అస్సలు వినడు. తనవన్నీ లాగేసుకొని ఏమన్నా అంటే మీదపడి కొట్టేస్తాడు. ఇంకా వాళ్ళమ్మకు అన్నీ చెప్పేస్తాడు. మా ఆటల మధ్యలో వచ్చి అంతా పాడు చేసేస్తాడు. అయినా… అన్వర్ చేసే పనులు అన్నీ కాదుగాని కొన్ని నేనూ చేసేవే. తోడుంటే అన్నీ చేయాలనుకునేవే. వాటికన్నాముందు అన్వర్ గాడిని ఓడించాలంటే తమ్ముడుండాలి. అందుకని నేనే భయపడకుండా ఒక నిర్ణయానికొద్దామనుకుంటున్నా.

“తమ్ముడే కావాలని మొక్కుకుందాం” అనితకు చెప్పా. రెండుచేతుల్తో చప్పట్లు కొడతా ‘భలే-భలే’ అనింది. ఇది… ఇందాకటి మొదటి విషయంలో మొదటి సగం.

ఎప్పుడన్నా సాయంత్రం పూట అనిత, నేను అల్లరి చేయకుండా, విసిగించకుండా వుంటే, ఏమీ తోచడంలేదని అమ్మమ్మ మమ్మల్నిద్దరినీ మా వీధి చివరన వుండే రాములవారి గుడికి తీసుకొనివెళుతుంది. అక్కడ రాముడు దేముడి పక్కన సీతమ్మవారు, తమ్ముడు లక్ష్మణుడితో పాటూ ఆంజనేయస్వామి కూడా వుంటాడు. నాకు ఆంజినేయుడంటే ఎంతో ఇష్టం… పిల్లలనేమీ అనడంట. భయమేసినపుడంతా తోడుగా వుంటాడు. ముఖ్యంగా అక్కడపెట్టే బెల్లంపొంగలి ప్రసాదం చాలా రుచిగా బాగుంటుంది. పూజారి నాకు రెండుసార్లు పెడుతారు. రెండోది నాన్నకోసం. అమ్మకేమో అమ్మమ్మ తీసుంచుతుంది. ఏదేవుడైనా పర్వాలేదు కాని, అక్కడ ప్రసాదం రుచిగా వుంటే మాత్రం నేను గుడికి తయారయిపోతా. రాముడు దేముడి దగ్గర చెల్లీ, నేను తమ్ముడు కావాలనే దణ్ణం పెట్టుకుంటున్నాం. అమ్మమ్మ పైకి చెప్పదు కాని, తను కూడా అదే కోరుకుంటుందనుకుంటా. ఇంటికొచ్చాక అమ్మతో, “దేవుడితో తమ్ముడు కావాలని దణ్ణం పెట్టుకున్నాం. మరి నీకెవరు కావాలి?” అనడిగితే నోరు తెరవకుండా నవ్వి వూరుకుంటుంది. నాన్ననడిగితే ” అల్లరి తక్కువ చేసే కవితయితే చాలు” అన్నారు.

నేనెందుకు అల్లరి చేస్తాను నాన్నా? అసలు నీకు అల్లరంటే ఏంటో తెలుసా? ఇంత మంచి పిల్లను పట్టుకొని అన్ని మాటలు అనకపోతే… అయినా అల్లరే చేయకుండా అమ్మమాట మంచిగా వినే అనిత ఒకటుంది కదా! అది అమ్మ గీసిన గీటు దాటదు. పీట మీద రెండుమూడు రకాల గింజలు కలిపేసి వాటన్నిటినీ విడిగా చేయమని చెప్పి అమ్మ వంటచేసుకుంటుంటే అది వంచిన తల యెత్తకుండా అమ్మ చెప్పిన పని చేస్తుంటుంది. అదే నేనయితే “ఏంటమ్మా ఇది? అన్నీ అలా కలిపేస్తే యెలా? ఎందుకు చేసావలా?” అని ప్రశ్న మీద ప్రశ్నలేసి అమ్మకు విసుగు తెప్పించేసి ఆ తర్వాత అమ్మ చేత, “నువ్వు ముందిక్కడ నుండి వెళ్ళు?” అని అనిపించుకుంటా. ఇదంతా అల్లరయితే… అదంతా ముందుగా అమ్మే కదా మొదలెట్టింది? అమ్మని యేమీ అనలేక చిన్నపిల్లని నన్ను అల్లరి పిల్లని ఆడిపోసుకొకపోతే… నీకు తోడుగా వుండేందుకు తమ్ముడు కావాలని చెప్పచ్చుకదా నాన్నా? ఇలా ఇంకా చాలా మాట్లాడాలనుకుంటా. నాన్న నా నోట్లో సాయంత్రం అమ్మమ్మ చేసిన సున్నుండ వుంచే లోపలే చెప్పాలనుకున్నవన్నీ చెప్పేయాలని ఇంకా… రాత్రి వినాయకుడితో కూడా తమ్ముడే కావాలని చెబుతున్నా నాన్నా! అని చెప్తుంటే, నాన్న ‘సరే సరే’ అంటూ ఓ పక్క నా మాటలు వింటూనే ఇంకో పక్కనుండి నా నోరంతా సున్నుండ తో నింపేసారు. అప్పుడింక నేనేం చెప్పాలనుకుంటానో అవన్నీ మరచిపోయి సున్నుండ తినడంలో మునిగిపోతానుకదా!

ఆదివారం నాన్నకు సెలవురోజు. ఆఫీసుండదు. ఆరోజంతా నేను నాన్నతోనే వుంటా. సైకిల్ పై నాన్నతో షికార్లు పోవచ్చు. సాయంత్రం సినిమా కెళ్ళొచ్చు. కాని, ఇప్పుడది కూడా సున్నానే. ఆరోజు నాన్న అమ్మను తీసుకోని హాస్పిటల్ కెళ్ళాలి. ఇంకా చాలా పనులంట. అందుకని ఇప్పుడు సరుకులు కూడా ఇంట్లో పనిచేసే లక్ష్మమ్మ సాయంతో ఏదో ఒకరోజు అమ్మమ్మే పట్టుకొచ్చేస్తుంది. తనతో నన్ను అస్సలు తీసుకెళ్ళదు. ఎందుకంటే… అంతసేపు నా నోటికి తాళం వేయలేనని చెబుతుంది. ఎవరైనా ఇంటికి, ఇంట్లో ఇనపెట్టికి తాళం వేస్తారు కాని, నోటికి వేస్తారా! చెల్లిని మాత్రం రమ్మని పిలుస్తుంది. కాని, అది పోదు. వస్తానన్న వాళ్ళని వద్దని చెప్పి, రాననే వాళ్ళను రమ్మని పిలిచే అమ్మమ్మంటే అందుకే నా కర్ధం కాదు.

ఆరోజు కూడా ఇలాగే నాన్న తోటి తమ్ముడికి పేరు నేనే పెడుతానన్నా. నాన్న, “నువ్వు చిన్నపిల్లవి నీకేం తెలీదు” అని అనకుండా “సరేలే” అని అన్నారు. అయినా… నాన్న నన్ను ‘చిన్నపిల్ల’ అంటే నేమో ‘నేను పెద్దదాన్ని కదా!’ అని కోపం. “నువ్వు పెద్దపిల్లవి కదా!” అన్నప్పుడేమో ‘నేనూ చిన్నపిల్లనే కదా!’ అని ఏడుపొస్తుంది. ఏంటో! ఇదంతా మాయ లాగా వుంటుంది. అసలేం అర్ధం కాదు. అందుకేనేమో! నాన్న ‘సరే’ అన్నప్పటినుండీ నాకు కొత్తగా ‘పేరు’ బాధలు మొదలయ్యాయి. ఏం పేరు పెట్టాలి? ఒక్కోసారి అన్నీ బాగున్నట్టే వుంటాయి. కాసేపయ్యాక చూస్తే ఏవీ బాగుండవు. ఆరిఫా నడిగితే తమ్ముడు కావాలని మొక్కుకున్నారు కాబట్టి దేవుడి పేరే పెట్టాలంది.

మరి రాములవారి గుడిలో రాముడు దేముడి పక్కన వాళ్ళ తమ్ముడు, ఇంకా ఆంజనేయస్వామి వున్నారు. ముగ్గురిలో ఏ పేరు పెట్టాలి? రాత్రి వినాయకుడికి చెప్తే… “అయితే నా పేరు పెట్టవా?” అన్నాడు. ఇప్పుడెలాగ? ఇందాక మొదట్లో మూడు సంగతులు అని చెప్పానే! అందులో మొదటి విషయంలో ఇదే రెండో ఆఖరి సగం.

రాత్రి నిద్రపోయే ముందు, “ఒకవేళ ఈపేరు నచ్చక తమ్ముడికి కోపం వస్తే?!” అన్నా అనితతో. అది ఊ…ఊ… అంటా దీర్ఘం తీసింది.

నిజమే కదా! అయితే ఏం చేద్దాం? అని అంటుండగానే… “ఇంకా పడుకోలేదా మీరూ…” అమ్మమ్మ గదమాయింపుతో గట్టిగా కళ్ళు మూసేసుకున్నాం. “ఏయ్ కవితక్కా! ఎందుకు నాకిలాంటి చచ్చు పేరు పెట్టావ్? ఈ పేరు నాకు నచ్చలేదు. మార్చమంటే నాన్న కుదరదంటున్నారు. ఇప్పుడెలాగ? అసలు నా పేరు నువ్వెందుకు పెట్టావు? అమ్మ, నాన్నయితే ఊరుకుంటాను గాని, నిన్ను మాత్రం వదిలిపెట్టను. నాకు కోపం వచ్చినప్పుడంతా నీ జుట్టు పీకి పెడుతా” అంటూ అరుస్తున్నాడు తమ్ముడు.

“బాగయ్యిందా!” అంటూ అమ్మ, నాన్న నవ్వుతున్నారు. అనిత కూడా వాళ్ళపక్కకు వెళ్ళిపోయింది. తమ్ముడు నాతో గొడవ పడడం ఒక్కటే కాకుండా చెల్లిని కూడా నానుంచి లాగేస్తున్నాడె! అరే! తమ్ముడూ… నా జుట్టు వదల్రా… ప్లీజురా… గట్టిగా అరుస్తుంటే మెలకువ వచ్చింది. ఒళ్ళంతా చమట్లు. పక్కనే చెల్లి, ఆ పక్కన అమ్మమ్మ గుర్రుపెడుతున్నారు.

అమ్మో! ఆరిఫా చెప్పింది నిజమే. తమ్ముడికి పేరు పెట్టే సంగతి నాన్నకే ఇచ్చెయాలి. అని నాకు నేనే ఒట్టేసుకుని చెప్పేసుకున్నా. చెల్లికి దగ్గరగా జరిగి బజ్జున్నా.

పొద్దున దేవుడి అరుగు పైనున్న అరటిపండ్లన్నీ అలాగే వుండడం చూసి అమ్మమ్మకు ఆశ్చర్యం వేసేసింది. “రాత్రి వినాయకుడు రాలేదు అమ్మమ్మా” అని చెప్పాను గాని, తమ్ముడి విషయం మాత్రం చెప్పలా. ఎందుకంటే… రోజూ రాత్రి నా కల్లోకి వినాయకుడు వస్తాడు. మేమిద్దరం దేవుడి అరుగు పైనుండే అరటిపండ్లు తింటా చాలా విషయాలు మాట్లాడుకుంటాం. ఈ సంగతి అమ్మకు, నాన్నకు బాగా తెలుసు. అందుకే నాన్న రోజూ మర్చిపోకుండా అరటిపండ్లు తెచ్చి అరుగుపై నుంచుతారు. అమ్మమ్మ మాత్రం నా పొట్ట తడిమి “కబుర్ల సంగతేమోగాని, ఇద్దరి బొజ్జమాత్రం ఒకటేగుందమ్మా”, అని విచిత్రంగా తన బుగ్గలు నొక్కుకుంటుంది. అందుకే తమ్ముడొచ్చిన సంగతి అమ్మమ్మకు చెప్పలేదు. ఈ లోపల కల్లో వాడికోపం గుర్తుకొచ్చి భయపెట్టింది. అంతే! గబగబా నిద్రపోతున్న నాన్నదగ్గరికెళ్ళి “నాన్నా… తమ్ముడి పేరు సంగతి నువ్వే చూసుకోవాలంట. నా కల్లోకొచ్చి చెప్పాడు”, అన్నా. నిద్రలోంచి లేవకుండానే “సరే తల్లీ ” అనేసారు నాన్న. హమ్మయ్య నాకిప్పుడు నోరు నొప్పెట్టినా వదిలిపెట్టకుండా మూడు వేరు శనగముద్దలు తిన్నంత తృప్తిగా వుంది.

“నేను చెబితే తెలీలేదు. చూసావా! ఇంకా ఇంటికి రాకనే నిన్ను ఒకాటాడించాడు మీ తమ్ముడు”, తమాషాగా చేతులూపతా అనింది ఆరిఫా.

వాడు మంచోడే. నేను పెట్టిన పేరు నచ్చలేదు అంతే. అందుకనే అట్లా చేసాడు. అయినా మాకిలాంటి తమ్ముడే కావాల్సింది. కొన్ని రోజులయ్యాక అనిత లాగే వాడు కూడా నాతో బాగుంటాడు కదా అనితా!” అన్నాను. అవునవును అంటూ తలాడించింది చెల్లి. అనడమైతే అలా అనేసాను కాని, నా మొహంలో భయం, అయోమయం దాగుడుమూతలాడుతూంది. ఇలాంటప్పుడు నాకు వినాయకుడు సాయం చేస్తాడనే ధైర్యం కూడా అప్పుడప్పుడూ గుప్పుగుప్పుమంటూ నా మొహం లోకి వెలుగులా తొంగిచూస్తుంటుందిలే.

“అయినా మేం దేవుడికి మొక్కుకునేసాము కదా! ఇప్పుడు కాదంటే ఎట్టా?” అన్నా.

“మీకు చాలామంది దేవుళ్ళున్నారు కదా! ఈ సారి ఇంకో దేవుడికి మొక్కుకుంటే సరి”, అనింది ఆరిఫా.

“ఉహు తప్పు. అలా చేస్తే కళ్ళు పోతాయ్” అన్నా. కాని, నిజమేనేమో! అసలు నేను వినాయకుడికి చెప్పకుండా రాములవారికి మొక్కుకున్నందుకే ఇలా జరిగిందేమో!

ఏందో… నాకంతా అయోమయంగా వుంది. ఈ విషయం గురించి మా ఇంట్లో ఎవర్నడిగితే సక్రమంగా చెబుతారో తెలీడంలా. “పోనీ మీ ఇంట్లో దేవుడినడుగుతావా?” అన్నా ఆరిఫాతో.

“మా దేవుడికి మీ భాష రాదు. మా భాషలో మీ గురించి ఎట్టా అడగాలో నాకు తెలీదే” అనింది బాధగా.

వాళ్ళు మాట్లాడుకునేది వేరే భాష. నాపైన కోపం వచ్చినప్పుడల్లా అన్వర్ వాళ్ళ భాష లోనే తిడుతాడు. అందుకే ఆరిఫా దగ్గర ఇప్పుడిప్పుడే వాళ్ళ భాష నేర్చుకుంటున్నా. వాళ్ళ దేవుడి పండగయినా, మా దేవుడి పండగయినా ఆరోజు వండుకున్నవన్నీ కలసి తింటాం కదా! మా దేవుళ్ళు కూడా ఆరోజు కలిసినప్పుడు ఏం భాష మాట్లాడుకుంటారో తెలిస్తే బాగుణ్ణు. ఇంకా మేము మాట్లాడుకుంటా వుండగానే అమ్మమ్మ మూడోసారి కూడా పిలిచేసింది. ఇంట్లోకి రమ్మని. ఇప్పుడు కూడా వెళ్ళకపోతే ఇంటికి తాళమేసి నాన్నొచ్చేదాకా లోపలే వుంచేస్తుంది. అందుకని ఆరిఫాతో “మళ్ళా మాట్లాడుకుందాం” అని చెప్పి ఇంట్లోకొచ్చేసా.

సాయంత్రం అమ్మమ్మ, అమ్మతో రాములవారి గుడికి వెళ్ళాం. గుడి చుట్టూ తిరిగేటప్పుడు “దేవుడికి ఏమని మొక్కుకోవాలి?” అని నా దగ్గరగా నడుస్తా అనుమానంగా అడిగింది అనిత.

“నాకేం తెలుసు?”. కాని, అక్కగా ఏదో ఒకటి నేనే చెప్పాలి కదా! మూడో ప్రదక్షిణ పూర్తయ్యేటప్పుడు నాకో ఐడియా వచ్చింది. అనిత చెవిలో చెప్పా. నచ్చినట్టుగా దాని కళ్ళు మెరిసిపోయాయి. అదేంటంటే మేము ఏమీ మొక్కుకోకుండా, “అమ్మ కేం కావాలో అది యివ్వు స్వామీ” అని దణ్ణం పెట్టుకున్నాం.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here