నేను నా బుడిగి-3

1
11

[box type=’note’ fontsize=’16’] “ఈ నాన్నలు దెబ్బలేయకుండానే నొప్పి తెప్పించేసారబ్బా” అన్వరూ, నేనూ మళ్ళీ ఏడ్చుకున్నాం. ఈ తగలని దెబ్బలకు కలిగిన నొప్పిని తలచుకుంటూ…” అంటూ “నేను నా బుడిగి” కథ మూడవ భాగంలో చెబుతున్నారు వాసవి పైడి. [/box]

[dropcap]అ[/dropcap]ప్పటినుండి ఏవీ మేమనుకున్నట్టు జరగడం లేదు. ఆరోజు తర్వాత అమ్మ, ఫాతిమా ఆంటి మమ్మల్ని బయటకు పంపడం మానేసారు. బడినుండి వచ్చాక ఇంకెక్కడికీ పంపరు. ఇదివరకటిలా ఇద్దరం అంగడికెళ్ళే పనులు, ఫ్రండ్స్ ఇంటికి వెళ్ళడాలూ ఏమీ లేవు, మాఇల్లు, లేదంటే ఆరిఫా వాళ్ళిళ్ళు అంతే. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా మేము అమ్మా వాళ్ళతోనే వెళ్ళాలి. ఇదంతా మాఇద్దరి నాన్నలు చేసిన పని అని తర్వాత తెలిసింది. ఇంకొ విషయం కూడా తెలిసింది. అదేంటంటే అన్వరుగాడే నాకిలాంటి పనులు నేర్పుతున్నాడని అందరూ అనుకోవడం. అందుకనే వాడిని కూడా ఇల్లు కదలనీకుండా చేసేసారు.

“ఈ నాన్నలు దెబ్బలేయకుండానే నొప్పి తెప్పించేసారబ్బా” అన్వరూ, నేనూ మళ్ళీ ఏడ్చుకున్నాం. ఈ తగలని దెబ్బలకు కలిగిన నొప్పిని తలచుకుంటూ…

బుధ్ధిగా బడికి, ఇంటికి తిరగతా వుండే టయిములోనే చిన్నమామయ్య పెళ్ళని చెప్పి అమ్మని, అనితనూ, నన్నూ ఊరికి తీసుకెళ్ళడానికి ఊర్నుండి పెద్దమామయ్య వచ్చారు. నాన్నని అక్కడే వుంచి మేమంతా అమ్మమ్మ ఊరికెళ్ళాం. ఊరికెళ్ళేముందు ఆరిఫా, అన్వర్‌తో ఊరెళుతున్నామని చెప్పామే… అంతే! ఆ తరువాత నేనూ వాళ్ళని మళ్ళీ చూడనే లేదు. ఎందుకో చెప్పేదానికి కొంచెం టైం పడుతుందిలే. ఈ లోపల బుడిగీ దగ్గరికెళ్ళిపోయాం.

బుడిగి ఇప్పుడు కొంచెం పెద్దదై భలేవుంది. ఇప్పుడు నవ్వుతుంది, కేకలు పెడుతుంది. ఇంకా కింద పడుకోబెడితే పొట్టతో పాక్కుంటా వెళుతుంది. అమ్మమ్మని చూస్తే వదలదు. అమ్మ దగ్గరకు కొంచెం సేపయ్యాక వచ్చేసింది. మాకు తనతో ఇక ఒకటే ఆటలు. మాకు లాగె బుడిగీకి కూడా మేమంతా బాగా నచ్చేసాము. అమ్మమ్మ ఇల్లు చాలా పెద్దది. ఇంక అక్కడ చుట్టుపక్కలోల్లంతా మా చుట్టాలే. అందరికీ బుడిగీ అంటే చాలా ఇష్టం. అనిత పుట్టినప్పుడు నేనూ అమ్మమ్మ దగ్గర పెరిగానంట.

పెళ్ళికి ముందు బుడిగీకి మళ్ళీ బాగలేకుండా వచ్చేసింది. అక్కడ డాక్టరుగారు పెద్దమామయ్య ఫ్రండే.  బుడిగికి బాగయ్యేదాకా బుడిగి దగ్గరే వున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బుడిగిని అందరూ నాన్న పెట్టిన పేరుతో కాకుండా బుడిగీ అనే పిలుస్తున్నారు. ఇది అనితకూ, నాకూ భలే నచ్చేసింది.

కుదురుగా ఒకచోట కొంచెం సేపు కూడా ఉండలేను నేను. నాలాగే నాన్న ఆఫీసు కూడా వున్నట్లుంది. నేను పుట్టిన తరువాత ఇది రెండో ఊరంట నాన్న ఆఫీసుకు. ఇప్పుడు మేము ఆ ఊరికి వెళ్ళాలి. అక్కడ ఇల్లు చూసుకునేదాకా అమ్మ, మేమూ అమ్మమ్మ దగ్గరే వుంటామని చెప్పి నాన్న కొత్తఊరికి వెళ్ళారు. ఇన్నిరోజులూ గుర్తుకురాని ఆరిఫా, అన్వర్ ఇప్పుడు చాలాసేపు గుర్తొచ్చారు. అమ్మతో మాట్లాడాలంటే అమ్మకూ ఎన్నో పనులు. అమ్మకు తీరికున్నప్పుడు నా నోటి  నిండా అప్పచ్చులు. ఇంకేం మాట్లాడేది?! అమ్మమ్మ ఊరిలో చాలా బాగున్నది. ఆడుకోవడానికి, మాట్లాడుకోవడానికీ బోలెడంతమంది. ఇంకా సాయంత్రం మామయ్యతో సినిమాలు, షికార్లూ చాలావుండేవి. నిద్రలేచిం తర్వాత తొందరగా రాత్రి వచ్చేసేది. ఇలాగే  నాన్నకూడా త్వరగా వచ్చేసారు మమ్మల్ని కొత్తఊరు తీసుకెళ్ళడానికి. నాకు అమ్మమ్మ దగ్గరే వుండిపోవాలనివుంది. అనితకూ అంతే. కాని, నాన్న, అమ్మ ఒప్పుకోలేదు. బడికి వెళ్ళాలని చెప్పి అనితనూ, నన్నూ తీసుకొని కొత్తింటికి వచ్చేసారు.

కొత్తిల్లు అంతకుముందున్న ఇంటికన్నా పెద్దది గానే వుంది. అయినా అమ్మమ్మ ఇంటికన్నా చిన్నదే. మా కన్నాముందే మా సామాన్లన్నీ వచ్చేసాయి. ఆరిఫా, అన్వర్ ఇంకా బడిలో ఫ్రండ్స్ అంతా నాకు టాటా చెప్పారంట. ఫాతిమా ఆంటి తెల్లగా, చిన్నచిన్న కన్నాలున్న గుడ్డ పైన అంచులంతా బుల్లిబుల్లి పిల్లల బొమ్మలు కుట్టి నాన్నచేత పంపిచ్చారు. అది అమ్మ కొత్తింట్లో టేబుల్ పైన పరిచింది. అది చూసినప్పుడంతా నాకు మా ఊరు, ఆరిఫా, అన్వరూ గుర్తుకువస్తారు.

“పసుప్పచ్చ మిద్దింట్లో దిగింది మీరేనా సారూ” సరుకుల అంగడిలో డబ్బులపెట్టి దగ్గర కూర్చోనున్న పొడుగు మీసాలున్న ‘పెద్దాయన’ నాన్నని అడిగారు. “ఆ” నాన్న సమాధానం అంతే. అదే నేనయితే, “అవునండి మేము అనంతపురం నుండొచ్చాం. నాన్న ముందే వచ్చేసారు. మళ్ళీ అమ్మ, చెల్లి, నన్ను తీసుకొని నిన్ననే అమ్మమ్మ వాళ్ళూరునుండి వచ్చాం. ఇక్కడ మాకేం కావాలన్నా మీ అంగడికే వస్తాంలే” అని ఆ పెద్దాయన మీసాలంత పొడుగు సమాధానం చెప్పేదాన్ని. ఈసారి ఏమన్నా అడిగితే నేనే చెబుదామనుకున్నా. ఈలోపే ఓ చేత్తో సరుకుల సంచీ, ఇంకోచేత్తో నా చేయి పట్టుకొని అంగడి ముందున్న మెట్లుదిగి రోడ్డుపైకి తీసుకొచ్చేసారు.

అక్కడ కాసేపాగి ఇక్కడ కూరగాయలెక్కడ దొరుకుతాయో! అని అంటూ చుట్టూ చూస్తూ ఆలోచిస్తున్నారు. నేను “అంగడిలో వాళ్ళనడిగితే చెబుతారు కదా” అని నాన్నతో చెప్తూనే  గబగబా మెట్లెక్కి ఇందాక మాకు సరుకులిచ్చిన వాళ్ళదగ్గరికెళ్ళి అడిగితే ఈ దారిలోనే కొంచెం ముందుకెళితె వుంటుందని చెప్పి నా పేరడిగారు. నేను “నా పేరు కవిత, మా చెల్లి పేరు అనిత” అని చెప్పేసి అక్కడున్న నాలుగు ఎత్తెైన మెట్లు గెంతుకుంటా నాన్న దగ్గరకొచ్చి “ఇలాగే వెళ్ళాలంట” అని ముందుకు చేయి చూపిస్తా చెప్పా.

కూరలంగడి దగ్గర ఏం తీసుకోవాలా! అని చూస్తున్నారు నాన్న. “అమ్మ ఆక్కూరలూ, చిక్కుడుగాయలు, పచ్చిమిరపకాయలూ చెప్పింది కదా!” అన్నా ఏం మాట్లాడకుండా చూస్తున్న నాన్నతో.

అక్కడున్న కూరలమ్మ “అన్నీబాగున్నాయి. తలా అరకిలో యేస్తా” అనింది.

“అన్ని కూరలు మాకెందుకూ? ఇందాక నేను చెప్పినవే యివ్వు” అని అక్కడున్న గంపల్లో మాక్కావలసినవి వేళ్ళతో చూపిస్తా చెప్పా.

“అట్లేలే బుల్లెమ్మా!” అని కూరలు తూచి మా సంచిలో వేసింది. “నాపేరు బుల్లెమ్మ కాదు కూరలమ్మా… కవిత” అని చెప్పా. అప్పుడు కూరలమ్మ నవ్వి “అలాగేలే బుల్లెమ్మా” అనింది నవ్వుకుంటానే.  పాలు డిపో నుండి ఉదయం, సాయంత్రం క్యానులో తెచ్చి ఇక్కడ అమ్ముతారంట. ఈ విషయం కూరలు తూచెటప్పుడు కూరలమ్మ మేము  అడగకనే చెప్పింది. ఆ టయిముకు మనం ఇక్కడికొస్తే సరిపోతుంది కదా నాన్నా… అని అంటుంటే  నాన్న”ఊ…” అన్నారు.

ఇంటికెళ్ళేప్పుడు దారిలో “ఈ కొత్తిల్లుచాలా బాగుంది నాన్నా. ఇంటిచుట్టూ చాలా చెట్లు. ఇంకా చాలా ఇండ్లు” అని నేను చెప్తూవుంటే నాన్న ఊకొడుతూ వున్నారు. ఇంటికివచ్చాక అమ్మకు మళ్ళీ అక్కడ జరిగిందంతా చెప్పేసా. అప్పుడు నాన్న “అమ్మమ్మ ఊర్నుండివచ్చాక కవిత ఎక్కువ మాట్లాడేస్తుంది” అన్నారు.

“అవును నాన్నా! నేనూ అదే చెబుదామనుకున్నా… మేము నీ దగ్గర లేకపోయేసరికి నీవూ మాటలు మర్చిపోయావు. అందుకే నీ మాటలు కూడా నేనే చెప్పాను” అన్నా కొంచెం కోపంగా. ఇప్పుడు కూడా నాన్న యేమీ మాట్లాడలా. నన్నూ మాట్లాడనీలా. ఎలా అంటే… అమ్మమ్మ చేసిన అరిసె తుంచి సగం నా నోట్లో- సగం నాన్న నోట్లో వుంచి. ఈసారి మాత్రం అరిసెముక్కను ఇష్టంగా తినలేకపోయా.

చాలారోజుల తర్వాత బడికి వెళుతున్నా. మొదట్లో అంతా కొత్తగా వున్నా కాసేపటికంతా అందరూ అలవాటై పోయారు. బడి ఇంటికి దగ్గరే. మా వీధి లో ఆ బడిలో చదివే పిల్లలు చాలా మందే వున్నారు. అందరి ఇంటి ముందు కావలసినంత ఖాళీస్ధలం. పిల్లలందరం ఒకచోట చేరి చెల్లెళ్ళూ, తమ్ముళ్ళతో కలిసి ఆడుకుంటాం. అనితకు కూడా ఫ్రండ్స్ దొరికారు.

కొత్త ఇంటిచుట్టూ రకరకాల పూలమొక్కలు. వాటికి రంగు రంగులపూలు పూలలో తేనె కోసం వాలే తుమ్మెదలు, ఆకులు తినాలనుకునే పురుగులు, వానొస్తే వరుసగా వచ్చేసే తూనీగలు. ముఖ్యంగా సీతాకోకచిలుకలు. ఇవి ఆకుల కింద రంగు రంగు గుడ్డులో దాక్కున్నప్పుడు కూడా చూడ్డానికి భలే వుండేది. కొత్తచోట కొత్తకొత్తగా కనబడేవెన్నో. తెలుసుకునేవి ఇంకెన్నెన్నో!!

నేనూ కూడా కొంచెం కొంచెం పెద్దయిపోతున్నానని నాకు తెలిసొస్తావుంది. ఎలాగంటే… ఈ మధ్య నేనేమైనా సహించలేని పనులు చేసినప్పుడు అమ్మ నాకు మాటలతో చెప్పడం మానేసి, చేతికి దొరికిన వస్తువులు  అంటే  పప్పుగుత్తి, అట్లకాడ, చెంబు, తపేలాలను నా పైకి విసిరేస్తా వుంది. నేనూ చాలావరకు అవి నాకు తగలకుండా భలే తప్పించుకుంటా. ఈ ఆట భలే తమాషాగా వుంటుంది. అందుకే ఇద్దరం బాగా ఆడుకుంటాం. అనిత కొంచెం దూరం నుండి అంతా గమనిస్తా, అప్పుడప్పుడూ చప్పట్లు కొడతా వుంటుంది.

కొత్త సంగతులు తెలుసుకుంటావుంటే అందులో చాలా అర్థం కాని విషయాలు దాక్కోనుంటాయ్. వాటికి అన్ని వైపులనుండీ సర్రుమని బాణాలొచ్చినట్టు బోలెడన్ని ప్రశ్నలు. వాటన్నిటికీ ఎలాగైనా జవాబులు తెలుసుకోవాలని… బాగా ఆకలిగా వున్నప్పుడు పొట్టకొచ్చిన తిప్పలంత ఆరాటంగా వుంటుంది. ఇవన్ని ఇంట్లోవాళ్ళకేమైనా అర్థమవుతాదా!? అదే మన స్నేహితులయితే… మనకి సమాధానాలు చెప్పడమే కాకుండా మంచి మంచి సలహాలూ కూడా యిస్తారు. కొత్తచోట ఇలాంటి స్నేహితులు దొరక్కముందే అలాంటి ఇరకాటమొకటి వచ్చింది.

మా ఇంటికి  ముందూ, వెనుకా, ఈ పక్కఇల్లు, ఆ పక్కనిల్లు అంతెందుకు మా వీధిలో వుండే ప్రతి ఇంట్లో జామచెట్టుంది. మా ఇంట్లో తప్ప. మా ఇంట్లో నిమ్మకాయలు, నారింజకాయలు కాచే చెట్టులాగా వుండి వాటికన్నా ఇంకాపెద్దగా కాయలు కాచే దబ్బచెట్టుంది. ఈ చెట్టుకేమో ముళ్ళు, కాయలేమో పులుపు. ఈ చెట్టు నాకే కాదు కోతులక్కూడా నచ్చదు.

మా పక్కింట్లో వుండే జామచెట్టుని చూసినప్పుడల్లా ఈ చెట్టు మనింట్లోవుంటే ఎంతబాగుణ్ణు! అని అనిపిస్తానే వుంటుంది. ఆ చెట్టుకు చాలా జాంకాయలుంటాయి. ఆ ఇంట్లో వుండే నాకన్నా పెద్దపిల్లలు ఎంచక్కా ఆ చెట్టెక్కికాయలు కోసుకోని తింటుంటారు. మా ఇంటి వెనకింటి వాళ్ళు ఊర్లో లేనప్పుడు వీళ్ళింటి గోడమీంచి మా బాతురూము  పైకెక్కి వెనకింటి చెట్లో జామకాయలు కూడా కోసుకొని తింటారు. ఇవన్నీ గోడ అవతలినుంచి పక్కింటి వాళ్ళమ్మ చూస్తూనే వుంటుంది. మా వంటింటి గడప దగ్గర నిలబడి అమ్మ కూడా జరిగేదంతా గమనిస్తా వుంటుంది.

ఒకరోజు మా పక్కింటివాళ్ళు వాళ్ళింటికి తాళాలేసి సంచులు పట్టుకొని ఊరెళ్ళడానికి రిక్షా తెప్పించుకొని బస్టాండుకు వెళ్ళడం, మా వీధి గుమ్మం దగ్గరనుండి చూసాను. గబగబా వంటింట్లో వున్న అమ్మ దగ్గరకెళ్ళి, పక్కింటోళ్ళు ఊరెళ్ళిన విషయం చెప్పి, “ఇప్పుడు మనం పక్కింటోళ్ళ జామ చెట్లో జాంకాయలు కోసుకొని తిందామా!” అనడిగానంతే. అమ్మ కోపంతో పక్కనేవున్న పప్పుగుత్తి తీసి నాపైకి విసిరేసింది. తెలివిగా తలవంచేసా కాబట్టి దెబ్బ తగలకుండా తప్పించుకున్నా. కాని, అమ్మకు కోపం ఎందుకొచ్చిందో అర్థం కాలా. అడగాలంటే అమ్మ పక్కనే పప్పుగుత్తి. మళ్ళా అది నామీదకు ఉరకడానికి సిధ్ధంగా.

అయితే కాసేపటికి అక్కడ భలే గమ్మత్తు జరిగింది. ఎక్కడినుండో చాలా కోతులు వచ్చి  పక్కింటి జామచెట్టులో చేరి కాయలు, పిందెలు ఆఖరికి చిన్న కొమ్మల్ని కూడా లాగి  విరిచేసి, ఆకులు, పూతని కూడా వదిలిపెట్టకుండా చెట్టంతా పీకి పెట్టేసాయి. అమ్మ కర్రతో అదిలించినా కదలకుండా కొమ్మల్లో కూర్చోని గొంతునిండా తిని చెట్టుని ధ్వంసం చేసిగాని వెళ్ళలేదు.

“చూడు! కోతులెలా పాడు చేసేసాయో” అన్నా అమ్మతో .

“అంతకుముందు అదే పాడు పని చేయాలన్న కవిత – ఈ కోతిపిల్లలూ ఒకటే!” అంది అమ్మ మొహంలో కోపం చూపిస్తా.

“ఎంతమాటన్నావమ్మా! నేనలా యెందుకు చేస్తాను? నేను మంచి కాయలే కోసుకుంటా. అలా పిందెలూ, పూతలూ, పీకి పాడుచేయను ఆ కోతుల్లాగా. నీవల్ల మనం తినాల్సిన కాయలు కూడా ఆ కోతులు తినేసాయి. అది మాత్రం నీకు తెలీకుండా వుంది” ఉక్రోషంగా అన్నా.

అమ్మ అప్పటికి ఏం మాట్లాడకుండా గమ్మనే వునింది. ఈ లోగా మా వెనకింటివాళ్ళు వాళ్ళ చెట్లో దోర  జామకాయలన్నీ కోసేసి, అమ్మని పిలిచి ఒక చిన్న బుట్టనిండుగా దోరజామకాయలేసిచ్చారు. అప్పుడు ఆ ఇంట్లో లావుగా, అమ్మమ్మలా కనిపించే ఆమె  అమ్మతోటి “ఇన్నేళ్ళుగా మా చెట్లో ఎన్ని కాయలు కాసినా అవన్నీ కోతులో, పిల్లమూకలో తినేసేవి. మా చేతికి దొరికేవి కావు. మీరొచ్చాక మా చెట్లో కాయలు మాకూ అందతా వున్నాయమ్మా”, అని అమ్మను మెచ్చుకుంది. అప్పుడు అమ్మ ఏం మాట్లాడకుండా నా వెైపోచూపు చూసింది. ఆ చూపు నాతో “ఇప్పుడు చెప్పు పిల్లా! నువ్వు అల్లరి మూకతో కలిసి కోతిపిల్లవుతావా! నా కూతురు కవిత అవుతావా!” నిటారుగా నిలబడి నడుం పైన ఓ చెయ్యేసుకుని నన్నడిగినట్లునింది.

అయినా… కళ్ళకెదురుగా నోరూరించే జాంకాయల బుట్టని చూస్తాంటే మన నోట్లో నీళ్ళూరుతాయి గాని మాటలేమొస్తాయ్!

కడుపారా నాలుగు జామకాయలు తినేసాక అమ్మ చెప్పిన ఆ నాలుగు మంచి మాటలు కూడా తలకెక్కించుకున్నా.

చెట్టెక్కి జామకాయలు కోసుకోవాలన్న నా కోరిక ఇంకెట్టా తీరుతుంది? మనింట్లో జామచెట్టులేదు. పక్కింటోళ్ళ చెట్టు తాకకూడదు. వెనకింటోళ్ళ దగ్గర మంచోళ్ళన్న పేరు ఎప్పటికీ ఉంచేసుకోవాల “ఎలాగమ్మా ఇలా అయితే” అన్నా. “మనింట్లో ఓ జామచెట్టు నాటుకొని పెంచుకుందాంలే, అది పెద్దదయ్యాక ఎక్కుదువులే” అని అంటుందీ అమ్మ శ్రీ మహాలక్ష్మి. అనడమేంటి మర్నాడే ఒక బుల్లి జామ మొక్క తెచ్చి పెరట్లో నాటి నా చేత నీళ్ళు పోయించి, “రోజూ ఇలాగే నీళ్ళు పోసి జాగ్రత్తగా పెంచు కవితా, నా బంగారూ” అని చెప్పింది.

జామచెట్టు విషయంలో అమ్మకుకూడా ఒక సంగతి  తెలీదనే అనుకోవాల. చెట్లెక్కడంలాంటివి చిన్నప్పుడే నేర్చేసుకోవాలిగాని పెద్దయ్యాక ఎక్కాలంటే కుదిరే పనా! అయినా అమ్మలు అమ్మల్లా వుండాల. అంటే పిల్లలు చేసే కోతిచేష్టలు చూసీ చూడనట్టు వదిలేయాల. పిల్లలు పిల్లలుగానే పెరిగి పెద్దవ్వాల. కోతి పనులూ, గట్రా ఇప్పుడేకదా చేసేయాలి… అమ్మ అమ్మమ్మలాగా ఏనాడైనా వునిందా? ఇంక అమ్మ కూతురిగా వుండాలంటే ఒకలాగ, నాన్న కూతురిగా అంటే వేరేలాగా. కాబట్టి అదంతా వాళ్ళముందే., బడిలో మన స్నేహితుల దగ్గర  మనం మన పేరు తోనే కదా వుండేది. అప్పుడు మన వన్నీ పిల్లచేష్టలు కావనుకో అప్పుడు వాళ్ళే ఏందీ పెతరపనులు? అని అరవరా! అందుకే, ఎక్కడి పనులు అక్కడే గప్ చిప్ అన్నమాట. చెట్లెక్కినా, గోడలెక్కినా అవి మాలో మేమే పడతా లేస్తా నేర్చేసుకుంటాం. ఇక్కడ తగిలిన దెబ్బలకు కొట్లాటలకంతా మాదే పూచీ. మేమెవ్వరికీ ఏమీ చెప్పనక్కర్లేదు. ఇంకా చెల్లి వుంది కాబట్టి జాగర్తగా మనం నేర్చుకున్నవన్నీ తేలికగా దానికి నేర్పాలి. ఇలా మాపాటికి మేము మా ప్లాన్లలో వుంటే ఎంతెంత దూరం- చాలాచాలా దగ్గర అంటా వచ్చేసింది ఒక కష్టం. ఒకటేనా.. దానికి తోకలాగా మరికొన్ని.

ఉపద్రవాలన్నీ ఉన్నపళాన ముంచుకొచ్చేస్తాయని ఓసారి అమ్మమ్మ చెప్పింది. ఇప్పుడు నా పరిస్ధితి అట్లేవుంది. బడిలో ఆడతాపాడతా చదువుకుంటావుంటే, అదేటయానికి మా పక్కింట్లో చప్పుడు చేయని పెద్దోళ్ళు చదువయిపోయి ఖాళీగావుండడమెందుకు, మా వీధిలో పిల్లలకంతా ట్యూషన్ చెప్తామని అమ్మల దగ్గర అనుమతి తీసుకొని వెంటనే మా ఇంటి మిద్దిపైన మొదలుపెట్టేసారు.

అప్పటిదాకా అమ్మని ఏమార్చి నేను చేసే పనులకంతా అంతతొందరగా పోయేకాలం వచ్చేస్తుందని కల్లొకూడా అనుకోలేదు సామీ. నేనేనా… మా వీధిలో పిల్లలందరిదీ  అదే పరిస్ధితి.  మా ట్యూషన్ సార్ ఇప్పుడు వాళ్ళని అలాగే పిలవాల. పెద్ద నిశ్శబ్దం పేరు శ్రీధర్ సార్, రెండో నిశ్శబ్దం సుధాకర్ సార్. వీళ్ళు మాదగ్గర కూడా తక్కువ మాట్లాడి ఎక్కువ నేర్పాలని చూసారు కాని పాపం పుస్తకాలు చదివేప్పుడు శబ్దం రాదు కాని, చించేప్పుడు పరపరా అంటుందా లేదా. అదంతా మేమే వాళ్ళకు నేర్పించాల్సొచ్చింది. అయినా కూడా పెద్దోళ్ళని ఏమార్చినంత ఈజీగా వీళ్ళని నమ్మించలేము. వీళ్ళ ముందు అలా నిలబడితే చాలు తాకకుండానే తల్లో పేలని-ఆవలించకనే  పొట్టలో పేగుల్ని శుభ్రం చేసేస్తారు. మాటలు తక్కువైనా చేతల్లో చాలా బలం. అందుకని వీళ్ళు ట్యూషన్లు చెప్పడం మొదలెట్టగానే పెద్దోళ్ళంతా కూడబలుక్కోని  బందిలదొడ్లోకి పశువుల్ని పంపినట్లు మా చుట్టుపక్కల బళ్ళలో చదివే పిల్లల్నంతా ఇక్కడ చేర్పించేసారు. వీళ్ళ వల్ల  అమ్మలకంతా ఆటవిడుపు. మమ్మల్ని వీళ్ళదగ్గర తోలేసి ఇక వాళ్ళు ముచ్చట్లేనా, సినిమాలేనా షికార్లేనా. ఈ విషయం ఇంతకన్నా బాగా విడమరచి చెప్పలేనులే, ఇప్పటికే నాకు ఒళ్ళు మండిపోతా వుంది. ఎందుకంటే అమ్మకు తెలీకుండా నేను చెట్లెక్కడం నేర్చేసుకున్నానా! దాని తర్వాత సైకిలేకదా! మా ఫ్రండ్ భాగ్య వాళ్ళన్న దగ్గర సైకిల్ వుంది. ఆదివారం తప్పించి మిగతారోజుల్లో సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఏడుదాకా ట్యుషన్‌లో వుంటాడు. చీకటిపడే లోగా ఏదోక టైములో సైకిల్ నేర్చుకుందామనుకుంటే ఇదిగో ఇలా జరిగింది. ఇంక  అన్నీ సున్నే. ఇక్కడితో ఆగినా ఫరవాలేదు. అమ్మల ముచ్చట్లలో పిల్లల కబుర్లొస్తే కదా మనకి లడ్డూ వద్దన్నా చిక్కేది. ఎవరి పిల్లలు ఏమేం ఘనకార్యాలు చేసిందీ, అవెట్టా చేసిందీ అన్నీ అందరూ కూర్చోని మాట్లాడేసుకుంటారా! మన మతలబులన్నీ పట్టేస్తే ఇక మాగతేంటి గణేశా!

అసలు ఇప్పుడే బడి ముందు నిలబడి వున్న పిల్లలకు చెప్పడానికి పాఠాలేముంటాయి అనుకున్నాగాని,. వీళ్ళు ఇంగ్లిషు, హిందీ నేర్పించడం మొదలుపెట్టారు. అందరికీ చెంబెడు కష్టాలైతే నాకు బిందెడు. మా సార్ వాళ్ళు పక్కింట్లోనే వుంటారా! మా ఇంట్లో మాటలన్నీ మైకు లేకుండానే బాగా వినబడతాయి ఏమీ ఎరగనట్టు అన్నీ వినేసి సాయంత్రం ట్యూషన్‌లో పాఠం మొదలుపెట్టే ముందు నన్ను లేపి నిలబెట్టి ప్రార్ధనాగీతం లాగా మన కవిత ఈరోజు ఏం చేసిందంటే అంటా ఉదయం నేను పళ్ళు తోముకోడం మర్చిపోయి టిఫెన్ తిన్న విషయం చెప్పేస్తారు. అది విని నా ముఖ్యమైన ఫ్రండ్స్‌తో సహా అంతా హి హి హి అని ఇకిలించడమే. ఇదికాక మళ్ళా ఇంకో ప్రశ్న. మీలో ఎవరైనా ఇలాంటి పని చేసున్నారా? అని అడుగుతారు. ఆ… ఒక్కరైనా నిజంచెప్పే మొహాలా! అంత లేద్సార్ ఇలాంటి పనులు  చేయడంలో ఫస్ట్-నుండి లాస్ట్ దాకా కవితొక్కటే అంటారు మనకు పట్టంకట్టి. ఇంకో రౌండ్ పకపకలు.

అప్పటిదాకా చేతులు కట్టుకొని నోరు మూసుకొని నిలబడడం నాకెంత కష్టం? కొంతలోకొంత చిన్నసార్ మేలు. కూర్చో అని సైగచేస్తాడు. కూర్చున్నాక మనం సైలెంటుగా వుండచ్చుకదా! అహా, ఎవర్రా నన్ను చూసి నవ్వింది? ఉండండి, మీ పని చెప్తా, అని ఒక్కోక్కరి వైపుచూసి వార్నింగిస్తావుంటే మళ్ళా లేపి ఈసారి మోచేతులపై ఇందాక నా చేత వార్నింగ్ చెప్పించుకున్నవాళ్ళ పలకలు పెట్టి నిలబెట్టి నాచేత సుమతి శతకంలో పద్యాలు చెప్పమని అవి విని అందరిచేత పలికిస్తారు. ఈ పద్యాలు వాళ్ళు రాసారని వీళ్ళూ-వీళ్ళు రాసారని వాళ్ళూ ఒక్కోక్కరు ఒకటో రెండో రాసి ఊరుకోకుండా వందలు వందలు రాసేస్తే నేర్చుకునేవాళ్ళకి ఎంత కష్టమో చూసుకోవద్దా. అయినా ఇలాంటి ప్రత్యేకమైన గుర్తింపులన్నీ మనకే సొంతం. ఏ రోజయినా. మరొకరికి ఆ అవకాశం మనం ఇస్తేకదా! రోజూ ఏదోఒకటి మర్చిపోవడం అమ్మ గుర్తుచేసి మొటిక్కాయలేస్తే సాయంత్రం ఇక్కడ అందరిచేతా సన్మానం. ఆఫై నా  నోరు నొప్పిపుట్టే దాకా పద్యగానం.

రాత్రి నిద్రపొయేముందు వినాయకుడికి చెప్పుకునే నా కష్టాల లిస్ట్ రోజురోజుకీ పెద్దదయిపోతుంది. ఇక్కడ విలన్లు కూడా ఎక్కువైపోతున్నారు. ఎలాగోలా వినాయకుని దయవల్ల నా కష్టాలు ఇంకో నెత్తిమీదకెక్కే రోజొచ్చింది.

మా వీధిలో అన్నిటికన్నా చివరగా వుండే ఇల్లు చాలా పెద్దది ఇంటి ముందు చాలా-వెనకా చాలా చెట్లుంటాయి. ఇంకా ప్రహరీగోడ పొడవునా రంగురంగుల పూలమొక్కలు, వాటితోపాటూ రెండు కుక్కలు కూడా. ఒకటి పేరు ‘టైగర్’ నల్లగా ఎత్తుగా కూచి పళ్ళేసుకొని. అవి బాగా కనిపించేలా నోరు తెరిచి ‘భౌ’మని గట్టిగా మొరగతా అందర్నీ భయపెడితే ఇంకోటి ‘లైలా’ తెల్లగా ఒళ్ళంతా బొచ్చుతో అందరి ఒళ్ళో కూర్చోవాలని ఆశగా తోకూపుకుంటా కుయ్-కుయ్ మని ముద్దుగా మూలగతా అందరి చుట్టూతా తిరగతా వుంటుంది. ఇవి కాకుండా ఆ ఇంట్లో ఇద్దరబ్బాయిలున్నారు. ఒకడు ‘గణేశ్’, ఇంకొకడు ‘మణి’. వీళ్ళిద్దరూ వీధిలో మిగతా పిల్లల్లా అందరితో అంటే మాతో కలవకుండా టైగర్‌ని వెంటబెట్టుకొని మమ్మల్ని భయపెడతా ఎవ్వరితోనూ మాట్లాడకుండా అందర్నీ కొంచెందూరం లోనే వుంచేసే వాళ్ళు. అసలు కారణం తర్వాత తెలిసిందిలే, వీళ్ళతో ఫ్రండ్షిప్ చేసింతర్వాత. వీళ్ళింట్లో చెట్లెక్కడానికొచ్చి టైగర్ అరుపులకి జడిసి కిందపడేవాళ్ళు ఎక్కువయి పోతున్నారని ఇంట్లోవాళ్ళే ఎవ్వరితో మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చారంట. అదెలా తెలిసిందంటే ఒకరోజు…

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here