నేను సైతం

3
10

[dropcap]డి[/dropcap]గ్రీ పరీక్షలకు ఇంకా వారం రోజులే టైం ఉంది. బాగా ఎండల్లో ఉండే ఈ పరీక్షలంటే విసుగు నాకు. ప్రతి సంవత్సరం ఓ బాచ్ వెళ్ళిపోవ్వడం కొత్తవాళ్ళు రావడం షరా మామూలే. ప్రిపరేషన్ హాలీడేస్ కారణంగా పిల్లలు ఎవరూ కాలేజీకి రావట్లేదు. ఒక్కదాన్నే స్టాప్ రూంలో కూర్చుని ఉన్నాను. ఫోన్ మోగింది. సేవ్ చేసుకోని నంబర్. కాలేజి టైంలో పెద్దగా నాకు కాల్స్ రావు. కొన్ని ఏళ్ళ నుండి నా రొటీన్ తెలిసిన వారెవ్వరూ నాకు పగటి పూట కాల్ చేయరు. కాల్ లిఫ్ట్ చేస్తే ఓ సన్నని గొంతు, ఇంతకుముందు పరిచయం ఉన్నదే..

“మేడం కాలేజీలో ఉన్నారా” అన్న పలకరింపు.

ఎంతో మందిని రోజూ చూస్తాం. పరిచయం అయిన గొంతే అనిపించినా, చాలా సార్లు వారెవరో నాకు గుర్తుకురాదు. మీరెవరు అని అడిగితే, పాపం అంత ఆప్యాయంగా పలకరించే అవతలి వాళ్ళు ఫీల్ అవుతారని ఓ బెదురు. అందుకే కొంత సేపు మాట్లాడి మెల్లిగా ఎవరో కనిపెట్టే ప్రయత్నం చేస్తాను. వాళ్లు మాత్రం ఫోన్ ఎత్తగానే నన్ను మేడం గుర్తుపట్టేసారు అని అనుకునే విధంగానే మాట్లాడతాను. అలా వాళ్లని నమ్మించే విద్య కొన్ని ఏళ్ళ ఫోన్ పలకరింపుల అనుభవంతో నాకు అలవడింది. ఆ అనుభవంతో అటు ఉన్నది ఎవరో తెలుసుకోలేకపోయినా, “ఆ కాలేజీలోనే ఉన్నా.. నువ్వెంటీ ఈ టైంలో ఫోన్” అని అడిగా.

“మేడం మిమ్మల్ని కలవాలని వచ్చాను. కాలేజీ బైట ఉన్నాను. మీరు ఉన్నారంటే నేను వచ్చి కలుస్తాను” అంది ఆ అమ్మాయి.

“నేను స్టాప్ రూం లోనే ఉన్నాను వచ్చేయ్” అన్నా.

ఒక పది నిముషాలలో తలుపు తెరుచుకుని నా టెబిల్ దగ్గరకు ఓ అమ్మాయి వచ్చింది. నల్ల బురఖా, ముఖాన నఖాబ్. కళ్ళు తప్ప ఏమీ కనిపించట్లేదు. పరిచయమైన కళ్ళే. కాని ఈ సంవత్సరం నా దగ్గర చదువుతున్న పిల్ల మాత్రం కాదు. కాలేజీ వదిలి వెళ్ళిన అమ్మాయి అయి ఉంటుంది అనుకున్నా. ఆ అమ్మాయి నా టేబిల్ దగ్గరకు వచ్చింది. కూర్చోమని పక్కన ఉన్న కుర్చీ చూపించా.

“మీరు ఉండరేమో అనుకున్నాను మేడం. ఇవాళ మీరు దొరకకపోతే కలవలేకపోయేదాన్ని” కూర్చుంటూ అంది.

“పిల్లలు వచ్చినా రాకపోయినా మేము రావాలి కదా. అందుకని ఉన్నాను. నువ్వేంటి నన్ను కలవాలని సడన్‌గా” అడిగా. అప్పటికీ ఆ అమ్మాయి ఎవరో అర్థం కాలేదు. కాని పరిచయం ఉన్న పిల్లే. విన్న గొంతే. ఆ బురఖాలో నుండి ఆమెను గుర్తు పట్టలేకపోతున్నాను.

ఆ అమ్మాయి బేగ్‌లో నించి పెళ్ళి కార్డు తీసింది. ఇంటి నుండే కార్డుపై నా పేరు రాసుకు వచ్చింది. కొందరు పిల్లలు కార్డులు పట్టుకుని వచ్చి లెక్చరర్లను చూసి అప్పుడు గుర్తుకు వచ్చి, మా ముందే మా పేరు రాసి కార్డు ఇచ్చి వెళుతూ ఉంటారు. అంటే అంతకు పూర్వం మేము గుర్తుకు లేమనే అర్థం. చూసాక అరే వారికిచ్చి వీరికివ్వకపోతే ఎలాగ అంటూ ఎవరి కోసమే వచ్చి మేము ఎదురుపడితే మాకు ఓ కార్డు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ అమ్మాయి దగ్గర ఒక్క కార్డే ఉంది. దాని పైన కూడా నా పేరు రాసి ఉంది. అంత గుర్తు పెట్టుకుని నా దగ్గరకు వచ్చిన అమ్మాయిని నేను గుర్తించలేకపోయానే అన్న గిల్ట్‌తో “ఓ పెళ్ళి ఇన్విటేషనా. కంగ్రాట్స్” అంటూ కార్డు ఓపెన్ చేసా. అలా అన్నా ఆ అమ్మాయి పేరు కనుక్కోవచ్చని.

సుమైయా సుల్తానా ఔర్ సమీర్ కా నిఖా 24 ఆప్రిల్, 25 న వలీమా అని ఉంది. సుమైయా సుల్తానా పేరు చూసి ఆమ్మాయిని పరీక్షగా చూసా. సుమయా అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్. కాని వారంలో పరీక్షలు పెట్టుకుని పెళ్ళి ఎంటి? అందులో క్లాస్ టాపర్. కళ్ళు చూస్తే నేను అనుకుంటున్న సుమయానే. నా కళ్ళల్లో ప్రశ్నార్దకం చూసి ఏమనుకుందో ఏమో ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లూరుతున్నాయి. ఆమె చేతి మీద చేయి వేస్తూ “ఇదేంటీ? కార్డిస్తూ కన్నీళ్ళు” అన్నా. అప్పుడు ఆ అమ్మాయి ముఖంపై నఖాబ్ తీసింది. ఈమె ఫైనల్ ఇయర్ సుమయానే. ఈ అమ్మాయికి పెళ్ళేంటి?

ఫైనల్ ఇయిర్ పిల్లలకు లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఉండదు. అందువలన వాళ్లతో నాకు టచ్ ఉండదు. కాని మొదటి రెండు సంవత్సరాలలో పెరిగే చనువు కారణంగా కొందరు ఫైనల్ ఇయర్‌కి వచ్చాక కూడా అప్పుడప్పుడూ నా రూంకి వచ్చి పలకరించి వెళుతూ ఉంటారు. కాలేజీ ప్రోగ్రాంలో కలిసి పని చేస్తారు కొందరు. అంతే తప్ప ప్రత్యేకంగా ఫైనల్ ఇయర్ పిల్లలతో నాకు టచ్ ఉండదు. అందుకే సుమయాని ఇలా బురఖాలో గుర్తు పట్టలేకపోయాను.

కార్డ్ పక్కన పెట్టి తనవైపు మౌనంగా చూస్తూ ఉండిపోయాను. రెండు సంవత్సరాలు కాలేజీ టాపర్ తను. పీ.జీ. చేయాలని కాంపటీటివ్ పరీక్షలు రాయాలని కాలేజిలో చేరిన మొదటి నుండి తపన పడేది. మామూలుగా మా కాలేజీలో చదివే ముస్లిం ఆడపిల్లలు అంత కెరియర్ ఆలోచనలతో ఉండరు. ఈ అమ్మాయి దానికి విరుద్ధంగా ఉండేది. క్లాసులో చలాకీగా ఉంటూ ప్రతి ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయ్యేది. ఫస్ట్ ఇయర్‌లో అంతాక్షరి చాంపియన్ తను. చాలా శ్రద్దగా చదివేది. డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు అవకముందే పెళ్ళి చేసుకోబోతుంది.

ఇలాంటివి చూస్తూనే ఉంటాను. కాని పాపం ఆ తల్లి తండ్రుల పరిస్థితి కూడా ఏంటోలే అనుకుంటూ సర్ది చెపుకుంటూ ఉంటాను. కాని సుమయా విషయంలో మాత్రం బాధ అనిపించింది. నేను ఇంకా రెండు సంవత్సరాలు పీ.జీ రెగ్యులర్ గానే చదువుతాను మేడం అని గట్టిగా అనేది. పైగా మా నాన్న నన్ను ఎంతైనా చదివిస్తాడు అని నాతోనే ఓ సారి క్లాస్‌లో చాలెంజ్ చేసింది కూడా.

టేబిల్‌ని గట్టిగా పట్టుకుని ఉన్న ఆమె చేయి వణుకుతుంది. ఏడుపు ఆపుకోవాలని అవస్థపడుతుంది. “ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదా సుమైయా” అడిగాను.

నా వైపు విసురుగా తల ఎత్తి చూసింది “నాకు ఇదేది ఇష్టం లేదు. నా జీవితం అయిపోయింది. నేను అనుకున్నవేవి చేయలేను” అంది ఏడుస్తూ.

ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. “మీరు ఆ రోజు అలా చేసి ఉండవలసింది కాదు. మా వాళ్లకు చెప్పవలసింది కాదు. అందుకే ఇప్పుడు ఇలా జరుగుతుంది” అంది ఏడుస్తూ.

షాక్ కొట్టినట్లు ఆగిపోయాను. ఏం అంటుంది సుమైయా. ఒక్క క్షణం కళ్లు తిరిగినట్లు అయినై. ఈ బలవంతపు వివాహానికి నేను కారణమా?

“ఏంటి సుమైయా? ఏం చెప్పాలనుకుంటూన్నావో చెప్పు. నేను నీ పెళ్ళికి కారణం అవడం ఏమిటీ” అడిగాను కంగారుగా.

సుమైయా కళ్ళల్లో నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. “మీరు అమ్మీ అబ్బుకి చెప్పకుండా ఉండవలసింది” అంది ఏడుస్తూ.

సుమైయా ఏం చెప్పాలనుకుంటుందో అప్పుడు అర్థం అయింది నాకు.

***

మొదటి సంవత్సరం బీకాం టాపర్‌గా నిలిచిన సుమైయా అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. బాగా పాడుతుందని చదువు తప్ప మరో దృష్టి లేకుండా ఉంటుందని. హిందీ క్లాసులో తను ఎంత అందంగా నోట్స్ మెయింటెయిన్ చేసేదంటే నాకే ముచ్చటేసేది. నా చేతి వ్రాత అసలు బావుండదు. అందుకని నా స్టూడెంట్స్‌లో ఎవరన్నా మంచి చేతి వ్రాతతో కనిపిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. చేతి వ్రాతే కాదు సుమైయా నోట్స్ మెయింటెయిన్ చేసే పద్దతి వినూత్నంగా ఉండేది. ఆ పుస్తకం చూస్తే నేను ఇంత క్లియర్‌గా డీటేయిల్డ్‌గా నోట్స్ ఇచ్చానా అని నాకే ఆశ్చర్యం వేసేటంత విపులంగా ఆమె ప్రతి లెసన్ రాసుకునేది. పైగా ఆ రచయిత, కవి బొమ్మ సంపాదించి అది కట్ చేసి లెసన్ పేరు పక్కన అంటించుకునేది. అంత బాగా నోట్స్ రాసిన వాళ్ళు డిగ్రీలో సామాన్యంగా ఎవరూ ఉండరు.

మూడవ సంవత్సరంలోకి తను వచ్చిన తరువాత ఆగస్ట్ 15కి ఓ ప్రోగ్రాం తయారు చేయవలసి సుమైయాకి కబురు చేసాను. అప్పటికి వాళ్ళకు నేను క్లాసు తీసుకోవట్లేదు. ప్రతి సారి తానే ముందుండి నాకు అన్ని విధాల సాయం చేసే సుమైయా తాను రానని, తనకి ఇంట్రెస్ట్ లేదని నేను పంపిన సెకెండ్ ఇయర్ స్టూడెంట్‌తో కబురు చేసింది. పైగా నన్ను కలవమని ఎన్ని సార్లు కబురు చేసినా రాలేదు. నన్ను చూసి తప్పించుకు పోయేది. సబ్జెక్ట్ చెప్పడానికి రాని లెక్చరర్‌తో చాలా మంది పిల్లలు ఇలాగే ప్రవర్తిస్తారు. ఇప్పుడు ఈమెతో అవసరం లేదు. ఇక ఈమె మాట మేము ఎందుకు వినాలి అన్నట్లుగానే ఉంటారు. సుమైయా కూడా అలాంటి పిల్లే అయినందుకు బాధపడ్డాను. రొటీన్‌లో పడిపోయాను.

ఓ రోజు కాలేజీ అయిపోయాక కొన్ని పనులు చేసుకుని ఇంటికి తిరిగి వెళుతున్నాను. టైం ఆరు గంటలు దాటింది. కాలేజీ గేట్ పక్కన ఓ చిన్న గోడ అడ్డు ఉంటుంది. అక్కడ అప్పుడప్పుడూ కొన్ని జంటలు ప్రైవసీ కోసం కలుస్తూ ఉంటాయి. అందులో ఎక్కువగా మా కాలేజీ పిల్లలే ఉంటారు. అందుకని అక్కడనుండి ఎప్పుడు వెళుతున్నా ఆ గోడ వైపు చూడడం నాకు అలవాటయింది. అలా చూసిన నాకు చాలా దగ్గరగా కూర్చుని నరేష్ సుమైయా కనిపించారు. సుమైయా వీపు మీద రాస్తున్నాడు నరేష్. ఆమె తల నరేష్ భుజంపై ఉంది. కాలేజీలో ఇవన్నీ మామూలే అని తల దించుకు వెళ్లలేను నేను. నా టూ వీలర్ తిప్పుకుని ఆ గోడ దగ్గరకు వచ్చాను. “కాలేజి వదిలి గంట పైగా అయింది కదా ఇక్కడేం చేస్తున్నారు” గట్టిగా అడిగాను ఇద్దరిని.

నా గొంతు విని చివ్వున తల తిప్పి చూసారిద్దరు. సుమైయా కళ్లల్లో బెదురు కాని నరేష్ ఏ మాత్రం బెదురు లేకుండా. “జస్ట్ మాట్లాడుకుంటున్నాం మేడం. షీ హాజ్ ఏ ప్రాబ్లం” అన్నాడు.

“ఆ ప్రాబ్లం ఇలా ఒకరి ఒళ్ళో ఒకరు కూర్చుని మాట్లాడుకుంటేనే తీరుతుందా? ముందు ఇళ్ళకు వెళ్ళండి” అన్నా గట్టిగా. వాళ్ళు లేచి బస్ స్టాప్ దాకా నడిచే దాక చూసి నేను ఇంటికి వచ్చా. ఎందుకో ఈ ప్రేమ గోలలో సుమైయా పడడం నాకు మింగుడు పడలేదు. నరేష్ ఆమె క్లాస్ వాడే. బాగానే చదువుతాడు. కాని హీరోయిజం కాస్త ఎక్కువ చూపిస్తూ ఉంటాడు. ఆ వయసులో అది మామూలే కాని అతని చుట్టూ తిరిగే అమ్మాయిలు చాలా మందే ఉంటారు. నరేష్‌లో ఓ చరిష్మా ఉంది. చెడ్డవాడు కాదు. కాని అనవసరమైన నాయకత్వం ప్రదర్శిస్తూ ఉంటాడు. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు. నేనేమన్నా చేయగలను అన్న బిల్డప్ ఇస్తూ ఉంటాడు. ఈ మధ్య సుమైయా అన్ని అకడమిక్, కల్చరల్ యాక్టివిటీస్‌కి దూరం ఉండడం, కొన్ని సార్లు కాలేజీకి రాకపోవడం, వచ్చినా మొదటి క్లాస్ అయిపోయాక క్లాస్‌కి వెళ్ళడం కొన్ని సార్లు నా కళ్ళలో పడుతూనే ఉండేది. కాని నేను వెళ్ళని క్లాస్ పిల్లలను చనువుగా పిలిచి దండించడం నాకూ ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఇప్పటిదాకా ఏమీ అనలేదు తనని.

మరుసటి రోజు స్టాఫ్ రూంలో కామర్స్ లెక్చరర్‌ని సుమైయా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని అడిగా. ఆవిడ పెదవి విరుస్తూ “లాభం లేదు మేడం. గుంపులో కలిసిపోయింది పిల్ల. ఆ నరేష్‌తో కలిసి తిరుగుతూ.. ఎప్పుడు ఖాళీ దొరికినా ఇద్దరు గుసగుసలే” అంది

నరేష్‌ని రమ్మని కబురు చేసా. పిలిచిన వెంటనే వచ్చాడు. “ఏంటీ నరేష్ సుమైయాతో అఫేయిరా” డైరెక్ట్‌గా అడిగేసా.

‘నో మేడం. అలాంటిదేమీ లేదు. ఆమెకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకని మోరల్ సపోర్ట్ కోసం నేను తనతో ఉంటున్నా అంతే” అన్నాడు.

నాకీ మోరల్ సపోర్ట్ ప్రెండ్షిప్ అంటే చిర్రెత్తుతది. అమ్మాయిని ఉద్ధరిస్తున్నానని అబ్బాయి, అబ్బాయిని ఉద్ధరిస్తున్నానని అమ్మాయి కలిసి తిరుగుతూ తరువాత కొట్టుకు చావడం మామూలే. మధ్యలో జరగాల్సినవన్నీ జరిగిపోతాయి. అయ్యే రచ్చ అయితీరుతుంది. తరువాత బ్రేక్ అప్ స్ట్రోరీలు. తల్లి తండ్రులు తమను అర్థం చేసుకోవట్లేదని, వారి మీద కంప్లెయింట్లతో ముందు ఈ స్నేహాలు మొదలవుతాయి. అటు తరువాత ఒకరినొకరం పూర్తిగా అర్థం చేసుకుంటున్నాం అని సోల్‌మేట్లమని చెప్పుకుంటూ ఉంటారు. కొంత కాలం తరువాత కథ మారిపోతుంది. ఇలాంటి రిలేషన్‌షిప్‌ని మనసుకు ఎక్కించుకోక కొంత కాలం ఎంజాయ్ చేసేవాళ్లు మరొకరిని చూసుకుంటారు మొదటి అనుభవం ఆధారంగా. మనసుకు ఎక్కుంచుకున్నవాళ్లు అందులోనించి బయటపడడానికి కొన్ని ఏళ్లు పడుతుంది. ఈ లోగా జరిగే నష్టం జరిగిపోతుంది. చదువు వెనుకబడుతుంది, చెత్త అలవాట్లు మొదలవుతాయి, చెత్త స్నేహాలు ఏర్పడతాయి. పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది.

“చూడు నరేష్ నాకు కహానీలు వినిపించకు. అఫెయిర్ ఉందో లేదో అది మీ పర్సనల్. కాని చదువు దెబ్బతినడం నాకు ఇష్టం లేదు. మీరిద్దరూ మంచి స్టూడెంట్స్. ఇద్దరి పర్ఫామెన్స్ ఈ సంవత్సరం ఘోరంగా ఉంది. పైగా ఆ అమ్మాయి ముస్లిం. వాళ్ల ఇళ్లల్లో ఆడపిల్లలను చదివించడమే కష్టం. ఇవి వాళ్లింటి దాకా వెళ్తే ఆ అమ్మాయి నష్టపోతుంది. అది నాకు ఇష్టం లేదు. ఇద్దరూ కొంచెం కంట్రోల్ లోకి రండి. ఆలోచించి మెసలండి” అన్నా కోపంగా

“అయ్యో మేడం. అఫెర్ ఉంటే ఉంది అని చెప్పే దమ్ము నాకు ఉంది. అదేమీ లేదు నన్ను నమ్మండి. ఆమెకు మోరల్ సపోర్ట్ ఇస్తున్నా అంతే” అన్నాడు నరేష్.

“ఏంది రా నువ్విచ్చే మోరల్ సపోర్ట్. ఏ విషయంలో ఇస్తున్నావ్. పిచ్చి డైలాగులు కొట్టకు. కాలేజి అంతా మీమీద కధలున్నాయి. ఒకరు పొద్దున తొమ్మిదికి క్లాసు రూంలో మీ ఇద్దరిని చూసాం అంటారు. ఇంకొకరు లంచ్ టైంలో సీతాఫల్మండి ప్లై ఓవర్ వైపు మీరు నడుచుకుంటూ వెళ్ళారంటారు. కథలు చెప్తున్నావా” అన్నా కోపంగా

“సరే మేడం నేను సుమైయాకి చెబుతూనే ఉన్నా మీకు చెప్పమని. ఆమె చెప్తలేదు. నెల ముందు చచ్చిపోవడానికి లాలాగుడ రైల్వే ట్రాక్ మీదకి కూడా పోయింది. అప్పుడే మీతో మాట్లాడమన్నా. కాని ఆమె వింటలేదు. రేపు మీ దగ్గరకు తీసుకువస్తా. మీరు మాట్లాడండి. ఇది ఎవరికి చెప్పలేం మేడం” అన్నాడు.

“సరే రేపు తీసుకురా” అన్నాను

అన్నట్లుగానే మరుసటి రోజు రెండు గంటలకు ఇద్దరూ కలిసి నా రూం కి వచ్చారు. దగ్గరి నించి చూస్తే సుమైయా చిక్కినట్లు కనిపించింది. కళ్ళ ముందు నల్ల చారికలు. ముఖం పాలిపోయి ఉంది. చేతికి వేసుకున్న గాజులు కూడా మోచేతి దాక వెళ్ళాయి. ఈ అమ్మాయి ఏదో పెద్ద విషయంలోనే ఇరుక్కుంది అనిపించింది.

“ఏంటీ సుమైయా” ఆడిగా.. ఆ అమ్మాయి “ఇంటిలో ప్రాబ్లం ఉంది మేడం” అంది.

“ఏం జరిగింది” అడిగా..

ఆ అమ్మాయి మౌనంగా నిల్చుని ఉంది. నరేష్ ఆమె వైపు చూస్తూ “చెప్పు మొత్తం” అంటున్నాడు

ఆ అమ్మాయి మొహంలో అయోమయం.

“మొత్తం మొదటి నుండి చెప్పు. ఇప్పుడే అన్నావ్ కదా చెపుతానని” గట్టిగా అడుగుతున్నాడు నరేష్.

“నై హొతా మేరేసే (నాతో అవ్వదు)” మెల్లిగా అంది ఆ అమ్మాయి.

“చీ నీ యవ్వ. ఎంత చెప్పినా ఇంటలేవ్” గట్టిగా అరిచాడు నరేష్. అతని కంట్రోల్ ఆ అమ్మాయి పై ఉందని అర్థం అవుతుంది. పోయిన సంవత్సరం దాకా అంత కాన్పిడెంట్‌గా ఉన్న అమ్మాయి ఇలా నరేష్ కంట్రోల్ లోకి వెళ్ళడం నాకు నచ్చలేదు.

ఈలోగా ఎకనమిక్స్ మేడం రూం లోకి వచ్చింది. “ఏంటీ మాడం రోమియో జూలియట్‌లకు కౌన్సిలింగా” అంది నవ్వుతూ.

“ఇగో మేడం మీరు మంచిగ మాట్లాడ్తలేరు” అన్నాడు నరేష్ గట్టిగా. వాడికి కోపం వస్తే నోటీకి చేతికి కూడా కంట్రోల్ ఉండదు.

“పోవోయ్ నిన్న సన్ బేకరీలో ఫస్ట్ అవర్‌లో ఒకరి నోటికి ఒకరు తినిపించుకుంటూ పబ్లిగ్గా కూర్చున్నప్పుడు మంచిగ ఉందా” అడిగింది.

“అది మా ఇష్టం మేడం. నీకెందుకు” ఇంకా గట్టిగా అన్నాడు నరేష్.

విషయం ఎటు పోతుందో అర్థం అయింది. “నరేష్ లెక్చరర్లతో అలాగేనా మాట్లాడేది? గెట్ అవుట్,” అన్నా గట్టిగా

విసురుగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ సుమైయానీ లాక్కు వెళ్ళాడు.

“ప్రేమ పక్షులు” నవ్వింది ఎకనమిక్స్ మేడం లోపలికి వస్తున్న మేథ్స్ మేడంని చూసి.

“మీ కెందుకు మేడం వాళ్లతో మాటలు. మీ క్లాసు కూడా కాదుగా” ఉచిత సలహా పారేసింది ఆమె.

మౌనంగా నా క్లాసులోకి వెళ్ళాను.

వెళ్లానే కాని పాఠం చెప్పలేకపోయాను. క్లాసులోకి వెళ్ళి హర్షిత్‌ని పిలిచి నరేష్‌ని నా దగ్గరకు తీసుకురమ్మని చెప్పాను. హర్షిత్ పరుగున వెళ్ళాదు బీ కాం ఫైనల్ ఇయర్ వైపుకి.

ఓ పదిహేను నిముషాల తరువాత నరేష్‌ని తీసుకుని వచ్చాడు. క్లాసంతా ఆసక్తిగా వింటున్నారు. నేనెందుకు వాడిని పిలిచానో వారికి అర్థం అయింది మరి. ఇలాంటి విషయాలలో వాళ్ల బుర్ర పదునుగా పని చేస్తుంది.

నేను నరేష్‌ని తీసుకుని కారిడర్ లోకి వెళ్ళాను. “చూడు నరేష్. నేను సుమైయాతో మాట్లాడాలి. తనతో నువ్వు ఉండవద్దు. మూడు గంటలకు నాకు క్లాస్ అయిపోతుంది. రూం సెవెంటీన్ ఖాళీగా ఉంటుంది. అక్కడకు సుమైయాను తీసుకుని రా. అయితే ఆమెతో నేను ఒంటరిగానే మాట్లాడుతాను.” అన్నాను

“సరే మేడం. కాని నేను ఉంటేనే మాట్లాడతది” అన్నాడు. అతని మాటల్లో ఓ మనిషి పై కంట్రోల్‌ని ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్ కనిపించింది.

“అవసరం లేదు. మాట్లాడకపోతే నేను చెప్పేది వింటది. కాని తను రావాలి. అర్ధమయిందా”. అన్నాను ఇంకా కోపంగా.

“సరే మేడం. తీసుకువస్తా” అన్నాడు. “తీసుకువస్తా” అన్న మాటను వత్తి పలుకుతూ.

క్లాస్ అయిపోగానే నేను ఫోన్ తీసుకుని రూం సెవెంటీన్ తెరిపించి కూర్చున్నా. ఇది ఖాళీ క్లాస్ రూం. ఎక్స్‌ట్రా క్లాస్‌ల కోసం వాడుకుంటాం. పిల్లలు అందులో దూరకండా తాళం వేసి ఉంటుంది. కావలసినప్పుడు స్టాప్ ఆ రూం వాడుకుంటారు. సుమైయా అక్కడకు వచ్చింది. ముందు ఏమీ చెప్పలేదు. ఓ గంట సేపు నా పద్దతిలో కుస్తీ పడ్డాక అసలు విషయం చెప్పింది.

సుమైయా తండ్రి పెయింటర్. లాలాగుడలో ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని తన పిల్లలను చదివించుకుంటున్నాడు. ఇక్కడ చాలా ముస్లిం కుటుంబాలలో నలుగురికి తక్కువ కాకుండా పిల్లలుంటారు. సుమైయాకి, ఆమె తమ్ముడు దస్తగిర్‌తో పాటు ఇద్దరు అక్కలు ఉన్నారు. అక్కల పెళ్ళిల్లు జరిగిపోయాయి. వాళ్లకు సుమైయా లాగా చదువుపై ఆసక్తి లేదు. పెద్ద అమ్మాయి టెన్త్ ఫెయిల్ అయితే ఓ రెండు సంవత్సరాలు ఇంట్లో ఉండి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. రెండవ అక్క ఇంటర్ ఫెయిల్ అయి ఇక చదవనని మొండికేస్తే వీళ్లు పెళ్ళి చేసారు. సుమైయా మొదటి నుండి క్లాస్ ఫస్ట్. ఇంజనీరింగ్ చేయలని అనుకుంది. కాని ఇంటి పనులతో ఎంట్రన్స్ పట్ల సరైన అవగాహన లేక, చెప్పేవాళ్లు లేక ఆ అమ్మాయికి మంచి రాంకు రాలేదు. సీటు వచ్చిన ప్రైవేట్ కాలేజీ ఫీజు తండ్రి కట్టలేనన్నాడు. సుమైయా తమ్ముడు నారాయణలో చదువుతున్నాడు. ఆడపిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నారు. ఇంటర్ అయిపోయాక ఓ రైల్వే ఆఫీసర్ భార్య సుమైయా చదువు పిచ్చి చూసి తన పేరు మీద గార్డియన్‌గా మా కాలేజీలో సీటు ఇప్పించింది. సుమైయా తమ్ముడు గొప్పగా ఏమీ చదవడు. కాని ఒక్కడే మగపిల్లవాడని అతన్ని ఇంజనీరును చేయాలని తల్లి తండ్రుల ఆశ.

ప్రైవేట్ కాలేజీలో డబ్బు కట్టి ఇంజనీరింగ్ చదువుతున్నాడు దస్తగిర్. కొంత స్నేహల ప్రభావం, వయసు ప్రభావం ఆ వయసులో ఉండే తిక్కలన్నీ కొంచెం హెచ్చు స్థాయిలోనే అతనిలో ఉన్నాయి. ఒక చిన్న గది, దాని పక్కన ఓ చిన్న వంటగది. ఇది వాళ్ల ఇంటి స్థితి. ఆ గదిలోనే నలుగురూ నిద్రపోతారు. ఆరు నెలలుగా నిద్రలో అక్కను తడమకూడని చోట తడమడం, నిద్రలో ఉన్నట్లు నటిస్తూ ముద్దు పెట్టుకోవడం చేస్తున్నాడు దస్తగిర్. క్రింద చాప వేసుకుని తల్లీ కూతురు పడుకుంటే, మధ్యరాత్రి వచ్చి అక్క పక్క చేరుతున్నాడు దస్తగిర్. ఇక అతను చేసే చేష్టలు రేప్‌కు తక్కువ, ముద్దులకు ఎక్కువ అన్నట్లున్నాయి. తన కన్నా ఒక సంవత్సరం చిన్నవాడైన తమ్ముడు చేసే ఈ చేష్టలకు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంది సుమైయా. ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు. ఎవరితో మాట్లాడాలనిపించట్లేదు. నరేష్ అతి చనువు కారణంగా ఓ రోజు తన ఇబ్బంది అతనికి చెప్పింది. అప్పటి నుండి ఆమెపై నరేష్ పెత్తనం మొదలయింది. నరేష్ దృష్టిలో తను ఆమెను హీరోలా రక్షిస్తున్నాడు. ఇవాళేం జరిగింది, నిన్నేం జరిగింది అని కనుక్కోవడం, ఆఖరికి తన ఇంటి దగ్గర ఉన్న స్నేహితులతో ఒక గాంగ్‌లా వచ్చి ఈ తమ్ముడిని తన్ని బుద్ధి చెబుదాం అని కాచుకుని కూర్చున్నాడు. ఆ గాంగ్‌లో హేమాహేమీలున్నారట.

నరేష్ స్నేహాలు నాకు చూచాయగా తెలుసు. అతను సమీకరించిన గాంగ్‌లో కొందరి పేర్లు విన్నాక అక్కడ ఎలాంటి గొడవ జరుగగలదో నాకు అర్థం అయింది. ఒక సారి తన్నుకోవడం మొదలెడితే అది చిన్న చిన్న దెబ్బలతో ఆగదని, చేతులు కాళ్లు ఇరగడం వాళ్ళ గొడవల స్థాయిలో చిన్న ప్రమాదాలని తెలియజేసే కొన్ని పాత సంఘటనలు నాకు తెలుసు. ఇంతా చేసి ఈ తమ్ముడిని అక్కే కొట్టించిందంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటీ? నరేష్ తన స్నేహితులకి ఈ సంగతంతా చెప్పే తీసుకురావచ్చు. ఇది అలుసుగా తీసుకుని ఆ మగపిల్లలు సుమైయాపై కంట్రోల్ తీసుకోగలరు. ఇబ్బంది పెట్టగలరు. అసలు నరేష్ క్రెడిబిలిటి ఎంత? వాడి ఆవేశం, ఇంతకు ముందు వాడు చేసిన గొడవలు, నాకు కొన్ని తెలుసు పైగా నిలకడ లేని మనస్తత్వం. ఇవన్నీ సుమైయాను ప్రమాదంలోకి నెట్టేవే.

సుమైయా నాతో ఇవన్నీ చెబుతున్నప్పుడు అన్ని నెలలుగా ఆమె ఎంత బాధపడుతూ ఉందో అర్థం అయింది. కాలేజీలో చేరినప్పటికి ఈ రోజుకు ఆ అమ్మాయి ముఖం కళాకాంతులు లేకుండా పీక్కుపోయింది. ముఖ్యంగా ఆమెలో ఉత్సాహమే హరించుకు పోయింది. కళ్ల ఎదురుగా ఆ అమ్మాయిని అలా చూస్తూ మౌనంగా ఉండలేకపోయాను. మాటల మధ్యలో నరేష్ ప్రమేయం కూడా తన రోజు వారి జీవితంలో తనకు చికాకుగానే ఉంది అని, కాకపోతే అతనికి అంతా చెప్పేసింది కాబట్టి అతనికి కోపం తెప్పిస్తే ఆ సంగతి ఇంకెవరికన్నా చెబుతాడేమో అని తాను భయపడుతున్నానని నాతో సుమైయా చెప్పినప్పుడు ఆమెను చూస్తే జాలి వేసింది. ప్రొద్దున్న తొందరగా రమ్మని, సాయంత్రం కొంచెం సేపుండమని అతను బలవంతం చేస్తున్నాడని, తనకీ ఇంట్లో ఉండబుద్ది అవట్లేదని, అందుకే నరేష్‌తో కలిసి తిరుగుతున్నానని చెప్పింది. పైగా నరేష్‌తో తిరుగుతున్నందుకు తనతో తన స్నేహితులెవ్వరూ సరిగ్గా మాట్లాడట్లేదని, అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని, నరేష్ అంటే వారికి ఉన్న భయం కారణంగా కొంత ఊరుకుంటున్నారు కాని చాలా చెడ్డగా తన గురించి మాట్లాడుకుంటున్నారని, నరేష్ పక్కన లేకపోతే తనను చాలా అవమానం చేస్తున్నారని అందువలన నరేష్‌తో ఉండవలసి వస్తుందని చెప్పింది.

సుమైయా చాలా భయంకరమైన సమస్య ఎదురుకుంటుంది. ఇతరుల నుండి రక్షించవలసిన సోదరుడే తనతో అలా ప్రవర్తించడం, ఏం చేయాలో తెలియని పరిస్థితులలో స్నేహితుడు తన జీవితంపై కంట్రోల్ తీసుకోవడం, ఆ అమ్మాయికి ఏం తోచనీయకుండా చేస్తున్నాయి. ఇంతా చేసి ఆ అమ్మాయి వయసు మాత్రం ఎంతని పందొమ్మిది సంవత్సరాలు.

ఒక్క రెండు రోజులు నాకు టైం ఇమ్మని, నేను ఏదో ఒకటి ఆలోచిస్తానని ఆ అమ్మాయితో చెప్పాను. ఇంటికి వెళ్లానే కాని మనసు గందరగోళంగానే ఉంది. చాలా ఆలోచించాను. ఈ సమస్యకు ఒక్కటే పరిష్కారం అనిపించింది. సుమైయాని పిలిచి మాట్లాడాను. ముందు భయపడింది కాని ఎంతో కన్విన్స్ చేసాక ఒప్పుకుంది. తండ్రి ఫోన్ నెంబర్ ఇచ్చింది. కాలేజీ సమయంలోనే నా సెల్ నుండి ఆమె తండ్రితో మాట్లాడాను. కాలేజీకి కాస్త పక్కన ఉండే అపార్టమెంట్ లోనే నేనుండేది. అడ్రస్ ఇచ్చి అతన్ని భార్యతో కలిసి సుమైయాని తీసుకుని మా ఇంటికి రమ్మని, పర్సనల్‌గా మాట్లాడాలి అని చెప్పాను. ముందు అతను షాక్ అయ్యాడు. కాని సుమైయా గురించి నేను పర్సనల్‌గా ఆ భార్యాభర్తలిద్దరితో మాట్లాడాలి అనుకుంటున్నానని చెప్పడంతో కొంత నెమ్మదించాడు. వస్తానని కాని తొమ్మిది తరువాతే రాగలనని చెప్పాడు. సరే అన్నాను.

అదే రోజు రాత్రి సుమైయా తల్లీ తండ్రితో ఇంటికి వచ్చింది. సుమైయా తల్లితో విషయం వివరించాను. ఆమె నన్ను వేసిన మొదటి ప్రశ్న “ఇది నీకెలా తెలుసు” అని. అమ్మాయి ప్రవర్తనలో మార్పు బట్టి నేను కొన్ని విషయాలు పసిగట్టానని క్లాసులో ఏడుస్తూ ఉంటుంటే చూసానని, ఓ సారి చేయి కోసుకోబోయిందని, అప్పుడు గట్టిగా అడిగితే ఈ సంగతి చెప్పిందని కథ చెప్పవలసి వచ్చింది. సుమైయా ఇబ్బంది పడుతుంది ఇంటి వ్యక్తితో కాకపోయినట్టయితే నేను మరోలా ప్రవర్తించేదాన్నే. కాని ఇక్కడ తనకు ఇబ్బంది కలుగుతుంది తన కన్నా చిన్నవాడైన తమ్ముడి వల్ల. ఆ అబ్బాయిని ఏం చేయలన్నా దానికి పరోక్షంగా సుమైయా ఇబ్బందిపడవలసి వస్తుంది. ఇది తల్లి తండ్రులకు తెలియచేయకుండా డీల్ చేయలేని విషయమనే అప్పుడు నాకు అనిపించింది.

విషయం ఇద్దరూ మౌనంగా విన్నారు. సుమైయా తల దించుకునే ఉంది తప్పు చేసినట్లు. మొత్తం విన్న తరువాత ఆమె తండ్రి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. కాని సుమైయా తల్లి నిబ్బరంగా కూర్చునే ఉంది. నేను చెప్పిందంతా విని “మాకు చెప్పి మంచి పని చేసారు మేడం. ఇక నేను చూసుకుంటాను. నా పిల్లవాడు చెడ్డవాడు కాదు. వయసు కదా. పొరపాటు చేసాడు. నేను ఇకనుండి ఇద్దరి మధ్య పడుకుంటాను. కాపలా కాస్తాను. నచ్చచెప్పుకుంటాను. మా పిల్ల చచ్చిపోకుండా రక్షించారు. ఇక నేను చూసుకుంటాను” అంది. తండ్రి తల దించుకుని ఆలోచిస్తున్నాడు.

సుమైయా నా దగ్గర విషయం చెప్పినందుకు తనకు ఏమీ అనవద్దని, ఆమె రోజూ కాలేజీకి రావలని, రాని పక్షంలో నేను ఇంటికి వచ్చి తనను తీసుకువస్తానని చెప్పాను. కాని తల్లి మాత్రం, “లేదు మేడం మీకు చెప్పబట్టే కదా మా వరకు వచ్చింది. లేకపోతే ఎంత ప్రమాదంలో పడేవాళ్లమో. నా పిల్లల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను” అంది.

మరుసటి రోజు నుండి సుమైనా కాలేజీకి వస్తుంది. నవంబర్ నుండి కాలేజీ షెడ్యూల్ బిజీగా ఉంటుంది. అందుకని నేను ఈ విషయం మర్చిపోయాను. ఎప్పుడయినా సుమైయా ఎదురొచ్చినా ఆమెలో మునుపటి ఉత్సాహం కనిపించేది. నరేష్‌తో సుమైయా కలిసే తిరిగేది. కాని ఇప్పుడు అతని దగ్గర భయం భయంగా ఉండేది కాదు. కొన్ని రోజుల తరువాత నేను ఆమె నుండి దృష్టి మళ్లించాను. ఏడు నెలల తరువాత ఇదుగో తనతో ఇదే మాట్లాడడం.

***

“మేడం మీరు అంతా చెప్పిన తరువాత అమ్మీ భాయ్‌ని ఏమీ అన్నదో నాకు తెలియదు. కాని అబ్బూ మాత్రం రాత్రిల్లు కనిపెట్టుకుని ఉండేవాడు. ఆ రోజు నుంచి అమ్మీ “ఇస్కీషాది కర్ దేనా” అంటూ ఉండేది. కాని అబ్బూ నన్ను పీ.జీ చదివిస్తానని మాట ఇచ్చాడు. అందుకని చదివిస్తాడనే అనుకున్నా. కాని ఎగ్జామ్స్ కన్నా ముందే నా నిఖా ఖరారు చేసారు. అబ్బూ కూడా అమ్మీ మాటకు ఎదురు చెప్పలేదు. సమీర్ నా కన్నా పదేళ్లు పెద్ద. మోటర్ బిజినెస్ చేస్తాడు. టెన్త్ ఫెయిల్. నేను చేసుకోనన్నా. కాని ఇంక ఎంతకాలం ఇంట్లో ఉంటావు. పెళ్ళి చేసుకోవలసిందే అన్నారు మా అక్కలిద్దరూ. బంధువులందరూ ఇప్పటికే ఆలస్యం అయిందని బలవంత పెట్టారు. సమీర్ మంచివాడని ఇంత మంచి సంబంధం దొరకదని అంటున్నారు. వాళ్ల బాధ తట్టుకోలేక తల వంచా. పరిక్షలు రాయలని కూడా నాకు లేదు. ఈ స్థితిలో ఏం చదవాలి? అబ్బూ మాత్రం ఫైనల్ ఎగ్జామ్స్ రాయిస్తానని అంటున్నాడు. కాని నేను ఇక ఎవరినీ నమ్మను. అబ్బూ పీ.జీ చదివిస్తానని పోయిన సంవత్సరం చెప్పాడు. నమ్మినా కదా. ఇప్పుడు చూడండి ఏం జరిగింది. ఫూఫీ లందరూ పెళ్లి తరువాత చదువుకో అంటారు. టెన్త్ పాస్ కూడా కాని సమీర్ నన్ను పీ.జీ. చదివిస్తాడా. నేను నమ్మను. నేను మంచి జాబ్ తెచ్చుకోవాలనుకున్నా. ఇప్పుడు ఏదీ జరగదు” అంది ఏడుస్తూ..

“అప్పటికీ నేనంటే ఇష్టపడే మా నానీతో అమ్మీని ఈ పెళ్ళీ ఒద్దని అడిగిపించా. కాని ‘జవాన్ బేటీ ఔర్ బేటా ఏక్ చత్ కే నీచే నై రెహ్నా’ (వయసులో ఉన్న కూతురు కొడుకు ఒకే కప్పు క్రింద ఉండకూడదు) అంది. అప్పుడు అర్థం అయింది ఇది ఎందుకు జరుగుతుందో”

నా గొంతులో ఏదో అడ్డుపడింది. మాట రాలేదు.

“మా తమ్ముడు ఇప్పుడు ఇంజనీరింగ్ ఫోర్త్ ఇయర్‌కి వచ్చాడు. తరువాత యూ.ఎస్. పోతాడంట. దానికి డబ్బు కోసం అమ్మ ఊర్లో పొలం అమ్ముతుంది. వాడు తప్పు చేస్తే నా చదువు ఆపి పెళ్ళి చేసి పంపిస్తున్నారు. వాడు మాత్రం ఇంకా చదువుతాడు. మంచి ఉద్యోగం చేస్తాడు. మేడం నాకు వచ్చినన్ని మార్కులు కూడా వాడికి ఎప్పుడూ రాలేదు. అయినా నాకే ఎందుకిట్ల”

“మీరు అమ్మీ అబ్బుతో మాట్లాడితే అంతా మంచిగ అయిందనుకున్నా. పోనీలే తమ్ముడే కదా అని వాడిని మంచిగనే చూసుకున్నా. మీ కన్నా తెలియలేదా మేడం నాకిట్ల అవుతుందని. మీ మీదా నాకు కోపం లేదు మేడం. మీరు నా కోసం ఆలోచించారు. కాని కొన్ని రోజులు కళ్ళు మూసుకుని ఉంటే నా చదువు అయిపోయేదేమో. ఎలాగూ వాడు యూ.ఎస్. వెళ్లిపోయాక నేను నాకిష్టం వచ్చినట్లు చదువుకునేదాన్నేమో. నేనే తప్పు చేసి నరేష్‌తో చెప్పి పిచ్చి పిచ్చిగా చేసినా. కొన్ని రోజులు కళ్ళు మూసుకుని ఉంటే పోయేదానికి నేనే అంతా బైట పెట్టుకుని నా జీవితం నాశనం చేసుకున్నా” అంది ఏడుస్తూ.

సుమైయా అంటున్న మాటలు గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. కొన్ని రోజులు కళ్ళు మూసుకుని ఉంటే బావుండేది అని ఆమె అనడం భరించలేకపోతున్నాను. ఏం చెప్పగలను. ఆమె సమస్యకు సమాధానం పెళ్ళి అని భావించే ఆ తల్లి అలోచన తప్పు అని అనగలనా? వంశోద్ధారకుని ఉన్నతి కోసం నిచ్చెనలు వేస్తున్న వారి పుత్ర ప్రేమను తప్పని అననా? ఓ రకంగా సుమైయా స్థితికి నేను కూడా కారణం అయినందుకు బాధపడనా? ఈ స్థితిలో మరే ఆడపిల్ల కనిపించినా ఈ అనుభవం నేర్పిన పాఠంతో కొన్నాళ్లు కళ్ళు మూసుకో అనగలనా?

ఏది ఏమయినా సుమైయా జీవచ్ఛవంగా మారడానికి నేనూ సైతం ఓ కారణమే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here