నేను స్రవంతిని.. నీ ఫ్రెండ్‌ని

2
11

[dropcap]”హా[/dropcap]య్… రామం! నా కెనడా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు జరిగాయిరా. మా అబ్బాయి దగ్గరకు ఓ రెండు నెలలు వెళ్లి వస్తా, శలవు పెట్టాను. అలా వెళ్లి వచ్చిన తరువాత మీ ఊరు వస్తాను. సరేనా. ఇంకేమీ విశేషాలు లేవు కదా?” అంటూ ఫోన్ చేసాడు పరమేశం.

“చాలా బాగుందిరా.. వెళ్లి అన్నీ సరదాగా చూసిరా. అంతేకానీ ఇంట్లో కూర్చోకు. నయగరా జలపాతం చూసి ఫోటోలు పెట్టు. ఇంకేమిటి విశేషాలు. మరి నువ్వు అక్కడకు వెడితే వాట్సప్‌లో నైనా దొరుకుతావా? అయితే నువ్వు లేక ఓ రెండు నెలలు చాలా బోర్ కొడుతుందేమో? మన ఫ్రెండ్స్ ఎవరైనా కలిసారా? ఎవరినైనా పలకరించావా?” అంటూ సంభాషణ కొనసాగించాడు రామం.

“అన్నీ చూస్తానులే. దానికే సిద్ధం అయ్యాను. ఈ మధ్య మన  క్లాస్మేట్ స్రవంతి గుర్తుందా? తను నాకు ఫోన్ చేసింది. బహుశా నీకు గుర్తు ఉండే ఉంటుందిలే.. ఆ రోజుల్లో బాగా ఇష్ట పడ్డావుగా” అంటూ నవ్వేశాడు పరమేశం.

స్రవంతి…. ఆ పేరు వినగానే రామం గుండెల్లో ఎక్కడో తీయగా మోగింది. ఒక్క క్షణం పరధ్యానంలోకి వెళ్లి మరలా తెలివి తెచ్చుకుని “స్రవంతి…. ఎక్కడుందిరా? నువ్వేమిటిరా బాబూ… ఏదో కాలేజీ రోజుల్లో ఇష్టపడ్డాను. ఇప్పుడు ఇంకా ఏమిటీ? సుమారు పాతికేళ్ల క్రితం మాట. ఇక వదిలేయి. కానీ ఫోన్ నెంబర్ ఇవ్వు. మరి నేను మాట్లాడితే గుర్తు పడుతుందా? అసలు మనం తన క్లాస్మేట్ అన్న విషయం గుర్తు ఉందా? కాలేజీలో ఉన్నప్పుడు ఏనాడూ మాట్లాడలేదు. మరి ఇప్పుడు ఏమో?” అంటూ అనుమానం వ్యక్తం చేశాడు రామం.

“అదేమీ లేదులే. మన కాలేజీ ఫోటో పంపిస్తే గుర్తుపట్టి మాట్లాడింది. సరదాగా అన్నాను కానీ, ఎంతైనా ఫస్ట్ క్రష్ కదా… పోనీలే అప్పుడు ఎలాగూ మాట్లాడలేకపోయావు. తనతో ఇప్పుడైనా మాట్లాడు. కానీ ఇప్పటి విషయాలే మాట్లాడారోయి. అప్పటివి అడగకు.” అంటూ ఆటపట్టించాడు పరమేశం.

అలా స్నేహితులు ఇద్దరూ చాలా సేపు పిచ్చాపాటీ మాట్లాడుకున్న తరువాత స్రవంతి మొబైల్ నెంబర్ ఇవ్వడంతో పరమేశంకు శుభాకాంక్షలు చెబుతూ ముగించాడు రామం.

“స్రవంతి”….. చదువుకున్న రోజుల్లో మనసును అల్లలాడించిన పేరు అది. మళ్లీ ఇన్నాళ్లకు… ఒక్కసారి గుండె ఝల్లుమంది. ఏదో తెలియని ఊహల్లో జారిపోయాడు రామం.

“ఏమండోయ్!” అన్న భార్య మంజరి పిలుపుకు ఆ ధ్యాస నుండి బయటకు వచ్చాడు.

“ఏమిటీ. పరధ్యానంగా ఉన్నారు. ఏమైంది” అంటూ సరదాగా నవ్వింది మంజరి.

“పరమేశం ఫోన్ చేసాడు. వాడు కెనడా వెడుతున్నాడు. ఇంకో రెండు నెలలు అక్కడే తిరిగి వస్తాడు. అదే ఇప్పుడు మాట్లాడుకున్నాము. మా కాలేజీ ఫ్రెండ్ స్రవంతి ఫోన్ నెంబరు మాట్లాడవచ్చంటూ ఇచ్చాడు. అదే ఆలోచిస్తున్నాను. అంతకన్నా ఇంకేమీ లేదు” అంటూ వివరం చెప్పాడు రామం.

“అబ్బో… అయ్యగారికి ఏవో ఊహలు చెలరేగి ఉంటాయి…. ఇంతకూ ఆ స్రవంతేనా.” అంటూ కొంటెగా నవ్వింది భార్య మంజరి.

“నువ్వు ఊరుకో… మంజరి… అవన్నీ పాత రోజులు. నువ్వు ఉండగా అలాంటి ఊహలు ఇప్పుడు వస్తాయా?” అంటూ మంజరి భుజం పట్టి లాగుతూ నవ్వాడు రామం.

***

స్రవంతి నెంబర్ ఫోన్‌లో ఎక్కించాడు. ఏమని పలకరించాలి? ఎలా తనను గూర్చి చెప్పుకోవాలి. అసలు పలుకుతుందా? ఏ ఊర్లో ఉందో, ఎలా ఉందో? అప్పటిలాగే అంత అందంగా ఉందా? పాతికేళ్ల అయినా ఇంకా ఆ పేరు వినగానే ఇంత గుబులు ఏమిటి? మరి మాట్లాడితే ఇంకేమిటో? అదే ముఖాముఖి కలిస్తే గుండె పేలిపోదుకదా. అయినా బాధ్యత కలిగిన స్థాయికి వచ్చినా ఎందుకో ఇంకా ఇంత ఆరాటం. కలగాపులగపు ఆలోచనలతో ఆరోజు అంతా గడిపేశాడు రామం.

ఎప్పుడూ ముహూర్తం చూడనివాడు స్రవంతికి ఫోన్ చేయటానికి ముహూర్తం నిర్ణయించి మరీ ఎంతో ఉత్సుకతతో ఫోన్ చేసాడు. పూర్తి నిడివి కాల్ అయినా అటువైపు నుండి సమాధానం రాలేదు. మరోసారి ప్రయత్నం చేసాడు. ఫలితం లేకపోవడంతో నిరాశగా వాట్సాప్‌లో మెసేజ్ పెట్టి, తన కాలేజీ రోజుల్లో ఫోటో జతచేసి తాను ఎవరో,  వివరం రాసాడు. అలా మెసేజ్ పెట్టిన క్షణం నుండి ప్రతి పది నిమాషాలకి చూసిందా లేదా ఏమైనా జవాబు ఉందా అంటూ ఆత్రంగా సెల్ ఫోన్ పట్టుకుని తిరిగాడు. ఎప్పటికీ ఏమీ  సమాధానం రాక అసహనం కూడా చెందాడు.

చాలా గంటల తరువాత వాట్సాప్ చూసిన సంకేతం కనిపించింది. సుమారు రాత్రి ఎనిమిది గంటల ప్రాతంలో స్రవంతి నుండి ఫోన్ మోగింది. రామం ఏదో విచిత్రమైన ఆనందం, ఆరాటం కూడిన స్థితిలో ఫోన్ ఎత్తాడు.

***

ఫోన్ ఎత్తిన రామం ఆత్రుత ఆగకుండానే తానే మాట్లాడాడు.

“హాయ్… స్రవంతి…. బాగున్నారా? నేను మీ క్లాస్మేట్ ‘రామం’ను. బహుశా గుర్తుకు వచ్చే ఉంటాను. ఎన్నాళ్ళయింది? ఇంతకూ మీరు ఎలా ఉన్నారు?. ఎక్కడ ఉన్నారు?” అంటూ ప్రశ్నలు పరంపర కురిపించాడు.

“హెల్లో! స్రవంతి నే మాట్లాడుతున్నా. ఇంతకూ మీరు నా క్లాస్మేటా? ఎలా? గుర్తుకురావటంలేదు.” అంటూ అటువైపు నుండి తీయని కంఠంతో స్రవంతి నోటి వెంట శరాఘాతాలు లాంటి మాటలు వచ్చాయి.

“అయ్యో…. నేను గుర్తు లేదా. నేను వాట్సాప్‌లో ఫోటో కూడా పెట్టాను. చూసారా? అందులో మూడో వరసలో నాలుగో వ్యక్తిని నేనే. ఆ రోజుల్లో హిప్పీ క్రాప్, బెల్ బాటమ్ ఫాంట్, చుక్కల చొక్కా, చలువ కళ్ళజోడు ఈసారి చూడండి. చూసి మళ్లీ ఫోన్ చేయండి” అంటూ ఆత్రంగా చెప్పి నిరాశగా ఫోన్ పెట్టేసాడు.

‘ఛీ…. దీనమ్మా….జీవితం. ఇష్టపడిన అమ్మాయి కనీసం గుర్తు పట్టలేదు అంటే ఎంత బాధ, అవమానం. జీవితంలోకి ఎలాగూ వెళ్లలేక పోయాను. కనీసం జ్ఞాపకంలో కూడా లేనా. ఈ మాట విన్న ఏ ప్రేమికుడైనా ఈ భూమ్మీద బతికి ఉంటాడా? అవమానంతో చచ్చిపోడూ. లేక కావాలనే గుర్తుపట్టనట్టు నటిస్తోందా? అయినా అయి ఉండొచ్చు. వీళ్లకు మన మనసులతో ఆడుకోవటం వెన్నతో పెట్టిన విద్య. కాలేజీ రోజుల్లో కూడా ఇలాగే ఏమీ తెలియనట్లు ఉండేది….’ ఆలోచనలు పరి పరి విధాల పోతుండగానే రామం చేతిలో సెల్ ఫోన్ మరోసారి మోగింది.

“హాయ్… నేను స్రవంతిని. రామం బాగున్నావా? అవును ఎన్నో ఏళ్ళు అయ్యింది నిన్ను చూసి. ఎక్కడ ఉన్నావ్?” అంటూ కోకిల కంఠంతో రామం అసహనం పోయేలా పన్నీరు చిలికినట్లు మాట్లాడింది.

రామం గుండె మరోసారి మంచుముద్దలా కరిగిపోయింది. చల్లటి బాధను ఆస్వాదిస్తూ “అమ్మయ్య… స్రవంతి… గుర్తు పడతారో లేదో అని ఇందాకటి నుండి తెగ కంగారు పడుతున్నా. ఇంతకూ మీరు ఎలా ఉన్నారు? ఎక్కడ ఉన్నారు?” ఆనందంగా అడిగాడు రామం.

“ఇదిగో రామం ఇంకా ఏమిటి మన మధ్య మీరు, అండీ అంటూ కొత్త పలకరింపులు. ఏకవచనంతో పలకరించుకుందాం. నేను బాగున్నాను. నువ్వు ఏ ఊళ్ళో ఉన్నావ్? ఏం చేస్తున్నావ్? మీ ఇంటి విశేషాలు చెప్పు.” అంటూ ఆరాలు తీసింది స్రవంతి.

రామానికి నోట మాట రావటంలేదు. ఒక్క చూపు చూస్తే కరిగిపోయి మనసులో ఆనందం నింపుకుని కాలేజీలో గడిపేశాడు. అలాంటిది తన కలలరాణితో ఇప్పుడు ఇలా.

“స్రవంతి…. నేను బాగానే ఉన్నాను. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉన్నాను. ఒక్కడే కొడుకు, వాడు అమెరికాలో చదువుతున్నాడు. నా భార్య మంజరి నాతోనే ఇక్కడే ఉంటుంది. మరి నీ సంగతి ఏమిటీ. ఎన్నాళ్ళయింది. అసలు జీవితంలో మరోసారి మనం కలుస్తామని ఆశే ఉండేది కాదు. అలాంటిది ఇలా నిన్ను కలవటం, చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఎక్కడ ఉన్నావ్? ఎలా ఉన్నావ్….నీ వివరాలు చెప్పు” అంటూ ఉత్సాహంగా అడిగాడు రామం.

“నేను కూడా హైదరాబాద్ లోనే ఉన్నాను. చాలా బాగున్నాను. నాకూ ఒక్కడే కొడుకు. వాడికి పెళ్లి కూడా అయ్యింది. మా వారు ఉద్యోగం రీత్యా తిరుగుతూ ఉంటారు. అందువల్ల మేము స్థిరంగా ఇక్కడే ఉండి పోయాము. అవును .మన స్నేహితులను కలసి చాలాకాలం అయ్యింది. నాకు మన క్లాస్మేట్స్‌లో లక్ష్మి, దేవి, మూర్తి, శ్రీను మాత్రమే గుర్తున్నారు. ఇప్పుడు ఫోటో చూసిన తరువాత నువ్వు గుర్తుకు వచ్చావు. అంతే. అయినా ఆ రోజుల్లో మాట్లాడే అవకాశం ఉండేదా. అమ్మో… అలా ఎవరైనా ప్రయత్నం చేస్తే మా ఆడవాళ్లు అత్తిపత్తిలాగా ముడుచుకు పోయేవారు. ఇప్పటి స్వేచ్ఛ అప్పట్లో లేదు. నువ్వు హైదరాబాద్ లోనే ఉంటావు కాబట్టి నీ అడ్రస్ ఇవ్వు. నేనే మీ ఇంటికి వచ్చి నిన్ను ఆశ్చర్యపరిచేలా వస్తాను” అంటూ నవ్వేసింది స్రవంతి.

“వావ్….ఇక్కడే హైదరాబాద్ లోనా. చాలా బాగుంది. త్వరలోనే కలుద్దాం. అదేంటి పరమేశం ఈ మధ్య కాలంలో నీతో మాట్లాడాను అని అన్నాడు. తనని కూడా మరచిపోయావా? అయినా ఫ్రెండ్స్‌ని మరచిపోవటం ఏమిటి? అంతేలే ఇష్టం లేకపోతే వాళ్ళు గుర్తు ఉండాలని ఏమీ లేదు. అయినా గుర్తు పెట్టుకునేంత ఘనత మాకు లేదులే” అంటూ కాస్త నిరుత్సాహంగా, వ్యంగంగా మాట్లాడాడు రామం.

“లేదు… రామం. పరమేశం ఫోన్ చేసిన మాట వాస్తవం. కానీ నాకు ఇంకా గుర్తుకు రాలేదు. అంటే బాగుండదు కదా. అదే నువ్వు వెంటనే గుర్తుకు వచ్చావు. అయినా ఆడపిల్ల వెంటనే గుర్తుపట్టేస్తే బరితెగింపు అని మీరే అంటారు. లేకుంటే అతి చనువు తీసుకుంటారు. అయినా నువ్వు మంచోడివి, సైలెంట్‌గా ఉండేవాడివి కదా.” అంటూ వివరణ ఇచ్చింది స్రవంతి.

స్రవంతి మాటలకు ఆనందం వేసింది రామంకు. అమ్మయ్య.. నన్ను గుర్తించింది. నేను అల్లరి చేసేవాడిని కానీ తనను చూడంగానే సైలెంట్‌గా ఉండేవాడిని. అది ఎవ్వరికీ తెలియదు. అని మనసులో తలుచుకుంటూ “థాంక్యూ స్రవంతి. నన్ను గుర్తు  పెట్టుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అవునులే… పరమేశం గాడు గుర్తు ఉండకపోవచ్చు. మరి నువ్వు బాగా మాట్లాడినట్టు తెగ ఫోజు కొట్టాడు. వాడికి మాత్రం గుర్తు పట్టలేక పోయానని మాత్రం చెప్పకు. అసలే బక్క ప్రాణం. తట్టుకోలేక గుండె కడుపులోకి జారిపోతుంది. అయినా వాడు ఇప్పుడు కెనడా వెళ్ళాడు. ఇంకో రెండు నెలలు రాడులే. వాడు ఇక్కడే వరంగల్‌లో ఉంటాడు. నువ్వు అన్నది నిజమేలే. ఆ మాత్రం భేషజం చూపించాలి” అంటూ వత్తాసు పలికాడు రామం.

అలా వాళ్ళు ఇద్దరూ ఎన్నో కబుర్లు చెప్పుకుని ఆనాటికి స్వస్తి పలికారు.

***

రామంకు స్రవంతితో రోజూ ఫోన్ చేయటం ఏదో కాసేపు మాట్లాడటం పరిపాటి అయ్యింది. ఇదంతా గమనిస్తున్న మంజరి రామంను ఆట పట్టించడం మొదలు పెట్టింది.

“ఏమండోయి… ఏమిటీ… అప్పట్లో మాట్లాడలేకపోయిన మాటలు ఇప్పడు గుర్తు తెచ్చుకుని మరీ కబుర్లు ఆడేస్తున్నారా. ఈ ఆనందంలో నా కొంప ముంచకండే? నేను మాత్రం మిమ్మల్నే నమ్ముకున్నాను” అంటూ అల్లరి చేయటం మొదలుపెట్టింది.

“ఊరుకో.. మంజరి. అదేదో అప్పట్లో. ఇంకా ఇప్పుడేముంది. ఆమె నాకు స్నేహితురాలు మాత్రమే. అంతే. నిన్ను వదిలేది లేదులే.” అంటూ బతిమాలాడటం రామం వంతు అయ్యింది.

అలా స్రవంతి రామం జీవితంలో పునః ప్రవేశం చేసి నెల్లాళ్ళు అయింది. రోజూలాగానే ఆ రోజు కూడా  స్రవంతికి రామం ఫోన్ చేసాడు.

“స్రవంతి… ఏమిటి విశేషాలు. ఎలా ఉన్నావ్? ఇంతకూ మా ఇంటికి ఎప్పుడు వస్తున్నావ్? నీ అడ్రస్ నాకు ఇవ్వవు. ఆ వాట్సాప్‌లో నీ ప్రస్తుత ఫోటోలు పెట్టవు. అసలు నువ్వు ఎలా ఉంటావో చూడాలని ఉంది” అంటూ అభ్యర్ధన చేసాడు.

రామం మాటలకు కిసుక్కున నవ్విన స్రవంతి “వస్తానులే…అతి త్వరలో నీ ముందుకు. మరి నేను ఇది వరకు ఉన్నంత అందంగా లేను. అందుకే ఫోటో పెట్టలేదు. అప్పటి అందం అంతా మాయం. వయసు వచ్చేసిందిగా.. అయినా ఒక మాట అడుగుతాను. నిజం చెబుతావా మరి?” అంటూ రామం ఏమంటాడో అని ఆత్రంగా ప్రశ్న వేసింది.

స్రవంతి మాటలకు రామం నవ్వుతూ “మనం ఏమైనా గంధర్వులమా, అచ్చంగా అదే రూపుతో ఉండటానికి. అయినా నువ్వు నా ఫ్రెండ్‌వి. చూడాలని ఉంది. ఎప్పడు కలుస్తామా అని పిచ్చి ఆశగా ఉంది. నువ్వు ఎలా ఉన్నా పరవాలేదు. ఇంతకూ ఏదో అడగాలని ఉంది అన్నావు…. ఏమిటి. నా దగ్గర మొహమాటం ఎందుకు. చెప్పేయి” అంటూ స్రవంతి ఏమి అడుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూసాడు.

“రామం… నేను అడిగిన దానికి నిజం చెప్పాలి. లేకుంటే నా మీద ఒట్టు మరి అడగనా?” అంటూ మరోసారి స్రవంతి.

“అదేంటి స్రవంతి…. అడుగు. అంత నేను అబద్ధం చెప్పే విషయం ఏముంది? సరే ఒట్టు వేస్తున్నా. అడుగు మరి” అంటూ ఏమి అడుగుతుందో అర్థం కాక ఆత్రంగా ఎదురు చూసాడు రామం.

“రామం….నువ్వు నన్ను ప్రేమించావా? అదే కాలేజీ రోజుల్లో ఇష్టపడ్డావా? నిజం చెప్పు” అంటూ స్రవంతి జవాబుకై ఎదురు చూస్తూ.

స్రవంతి ప్రశ్నకు రామం గుండె  ఒక్కసారి ఝల్లుమంది. ఇదేంటి తిను ఇలా అడిగేసింది. ప్రేమించిన మాట వాస్తవమే కానీ, ఇప్పుడు చెప్పే సమయం, సందర్భం కానే కాదు. రామంకు ఏం చెప్పాలో, ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. కంగారులో కాల్ కట్ చేసాడు.

మరో రెండు నిమిషాలు గడిచాయి. స్రవంతి నుండి మరోసారి ఫోన్ వచ్చింది. ఏం చెప్పాలా అని తలుస్తూనే ఫోన్ ఎత్తాడు.

“సమాధానం చెప్పలేక కాల్ కట్ చేస్తున్నావా రామం. నిజం చెప్పు. వినాలని ఉంది. నా మీద ఒట్టు కూడా పెట్టావ్. అబద్ధం ఆడితే నాకు ప్రమాదం… తెలుసు కదా. మన కాలేజీ రోజుల్లో నువ్వు నన్ను  ఇష్టపడ్డావా?…ప్రేమించావా?” అంటూ మరోసారి సూటిగా స్రవంతి మాటలు రామం చెవిని చేరాయి.

“అవన్నీ ఇప్పుడు ఎందుకు స్రవంతి. ఏంటో విచిత్రమైన ప్రశ్న వేసి నన్ను ఏదో ఇరకాటంలో పెట్టావ్” అంటూ లౌక్యంతో సమాధానం తప్పించబోయాడు రామం.

“రామం… నేను సూటిగానే అడుగు తున్నాను. నువ్వు నన్ను ఇష్టపడ్డావా? దానికి సమాధానం చెప్పకుండా ఏమిటో చెబుతావేమిటి?” అంటూ  మరోసారి సూటిగా అడిగింది స్రవంతి.

కాసేపు నిశ్శబ్దం ఆవరించింది.

నెమ్మదిగా గొంతు సర్దుకున్న రామం “అవును… స్రవంతి. ఇష్టపడేవాడిని. ఎంత అంటే మాటలకు అందనంత, ఊహల్లో కొలవలేనంత, కలల్లో తీరనంత… అంతా మూగ ప్రేమ. నిన్ను పలకరిద్దామన్నా ధైర్యం ఉండేది కాదు. ఎక్కడ కాదంటావో అని భయం. అందరిలాగే నన్నూ తుంటరివాడని ముద్ర వేస్తారేమో నన్న బెరుకు. అప్పటి పరిస్థితుల వల్లో, కాలానుగుణంగానో.. ఏమో ఎందుకో.. నా గుండెల్లో ఎదిగిన ప్రేమను అక్కడే వదిలేశా. నిజం చెప్పాలి అంటే బ్రూణహత్య చేసేసాను.

నిన్ను చూసిన రోజు అద్బుతంగా ఉండేది. నిన్ను తలచిన క్షణం స్వర్గంలా ఉండేది. నువ్వు నన్ను వీడిన క్షణాల్లో నాలో ప్రేమికుడు చచ్చిపోయాడు. అందని ద్రాక్షవని ముందునుండే తెలుసు. అందుకే నా గురించి నీకు ఏమీ చెప్పకుండానే నేను తప్పుకున్నాను.

కొన్నాళ్ళు బాధగా ఉండేది. కాలమే లేపనాలు రాసి తగ్గించేసింది. ఐనా ఇప్పుడు ఈ విషయం అడిగి నన్ను ఇబ్బంది పెట్టావ్. ఈ వయసులో, ఈ పరిస్థితిలలో ఇది అవసరమా. పైగా ఒట్టు పెట్టి మరీ అడిగావ్.  నీకు ఏదైనా జరిగితే… అమ్మో అందుకే అబద్ధం అడలేక నాకు తోచింది వాగేసాను. నా మాటలు నిన్ను బాధిస్తే క్షమించు. ఇంకెప్పుడు మన మధ్య ఈ ప్రస్తావన రాదు. అంతే కానీ మన మధ్య ఈ స్నేహాన్ని వీడకు” అంటూ బాధగా చెప్పేడు.

రామం మాటలకు ఇద్దరి మధ్య కాసేపు స్తబ్దత రాజ్యం ఏలింది.

నెమ్మదిగా రామం మాటల నుండి బయటపడిన స్రవంతి తేరుకుని “రామం ఎంత పనిచేశావ్? ఇప్పుడు ఈ విషయం అప్రస్తుతం అయినా అప్పట్లో చెప్పి ఉంటే, మరి మన కథ మరో రకంగా ఉండేదేమో? ఇంత మనసు పడి ఎక్కడ దాక్కున్నావ్. తప్పో, ఒప్పో అప్పుడే తెలిపోయేది కదా. నాకు అలాంటి ఉద్దేశాలు అప్పట్లో లేవు కానీ, నువ్వు చెబుతుంటే, నీ మాటలు వింటుంటే అదేంటో చాలా అబ్బురంగా అనిపించింది. ఏదో తెలియని మైకంలో గుండె తీయగా మూలిగింది. ఇంత ప్రేమను కోల్పోయిన నేను నిజంగా దురదృష్టవంతురాలిని. అందుకే అంటారు ఆలస్యం అమృతం విషం. ఏది ఏమైనా రామం. ఈ వేళ నా మనసుకు నచ్చావయ్యా. చాలా ఆనందంగా ఉంది. ఇలా అడిగానని ఏమీ అనుకోకు. ఎందుకో నాకు వినాలనిపించింది. మన స్నేహానికి ఢోకా లేదు. ఇంతకూ నీకో విషయం చెప్పడం మరిచాను. రేపు నేను చెన్నై వెడుతున్నాను. చిన్న పని కారణంగా ఒక వారం పడుతుంది. నాకు వీలు కుదిరితే నేనే నీతో  మాట్లాడతాను… లేకుంటే నేను తిరిగివచ్చిన తరువాతే. అక్కడ నుండి రాగానే మీ ఇంటికి వస్తాను. మరి నీ ఈ ప్రియసఖిని ఎలా చూసుకుంటావో చూద్దాం. సరేనా.” అంటూ ఆనందంగా వారి సంభాషణ ముగించింది స్రవంతి.

స్రవంతి మాటలు విన్న రామం నీళ్లు తిరిగిన కళ్ళను తుడుచుకుంటూ ఆనందంగా పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు.

***

అలా ఒక వారం గడిచిపోయింది.

ఆ వారం మొదట్లో స్రవంతి మొబైల్ నుండి ఉత్త పలకరింపు సందేశాలు వచ్చాయి… తరువాత మొబైల్ కాల్ కూడా వెళ్లకుండా స్విచ్చాఫ్ అయ్యింది. రామంకు స్రవంతి నుండి ఏ విధమైన సమాచారం రాలేదు. రామంలో అసహనం, ఆత్రుత పెంచుతూ మరో పది రోజులవరకు ఏ విషయం తెలియలేదు. రామం పరిస్థితి తట్టుకోలేక పరమేశంకు మెసేజ్ పెడితే పరమేశం కూడా స్పందించలేదు. రామం అర్థంకాని అయోమయంలో పడ్డాడు.

తాను నిజం చెప్పడం వల్ల ఏమైనా నొచ్చుకుని స్రవంతి మాట్లాడటం మానేసిందా…. అలా పరిపరి విధాల ఆలోచనలో ఉండగానే స్రవంతి మొబైల్ నుండి ఒక సందేశం వచ్చింది. స్రవంతి ఇంటి అడ్రస్ ఇస్తూ లొకేషన్ షేర్ చేస్తూ రమ్మనమని ఆహ్వానం అందింది. అది చూడంగానే రామం ముఖంలో ఆనందం వెల్లివిరిసి గబగబా తయారయి బయలుదేరి వెళ్ళాడు.

***

అలా వెళ్లిన ఓ నాలుగు గంటలు తరువాత విచారంగా ఇంటికి వచ్చాడు. ఎంతో ఉత్సాహంగా వెళ్లిన భర్త ఇలా డీలా పడిపోతూ రావటం చూసిన మంజరి ఆగలేక “ఏమయ్యిదండీ!..అలా ఉన్నారేమిటి? ఏవరైనా, ఏమైనా అన్నారా? ఇంతకూ మీ స్నేహితురాలు స్రవంతిని కలిసారా?” అని ఇంకా ఏదో అడగబోతుంటే రామం మంజరిని పట్టుకుని చిన్నపిల్లాడులాగ ఏడ్చేశాడు.

బేలగా మారిపోయిన రామంను దగ్గరకు తీసుకుంటూ మంజరి “ఏమయ్యింది…. పరవాలేదు చెప్పండి” అని ఇంకా ఏదో అనబోతుంటే రామం తన మొబైల్ తీసి స్రవంతి నుండి వచ్చిన ఒక ఆడియోను చూపించి “ఇది విను..విషయం నీకు అర్థం అవుతుంది” అంటూ చెప్పాడు.

మంజరి ఆతృతగా ఆడియోని వినటం మొదలు పెట్టింది.  అందులో స్రవంతి గొంతుక గంభీరంగా ,స్థిరంగా, సౌమ్యంగా పలకడం మొదలు పెట్టింది.

“హాయ్… రామం. ఈ ఆడియో వింటున్నావు నువ్వు అంటే, నేను నీకు అందని దూరాలకు, తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయానని అర్థం. ఎలా ఉన్నావు. రామం. నన్ను క్షమించండి. నేను నీ స్నేహితురాలు స్రవంతిని కాను. మీ వయసు దాన్ని కాదు. ఏదో పొరపాటున నెంబర్ తప్పు నొక్కడం వల్ల నీతో మాట్లాడిన ఇరవై ఒక్క ఏళ్ల అందమైన అమ్మాయిని. నా పేరు కూడా స్రవంతి అవ్వటం యాదృచ్ఛికంగా జరిగింది. అత్యంత అరుదైన గుండె జబ్బుతో బాధపడుతూ రోజులు లెక్క పెట్టుకుంటున్న నాకు నీ ఫోన్ వచ్చింది. మొదట ఎవరో గుర్తు పట్టలేక పోయాను.ఎందుకో సరదాగా మాట్లాడాలి అని అనిపించింది.

కాసేపు ఆడుకుందాం అన్న తుంటరి ఆలోచన వచ్చింది. ఎంతైనా అల్లరి చేసే వయసు కదా. అదేమీ మాయో ఏదో సరదాగా మొదలు పెట్టిన మన సంభాషణలో నాకు ఏదో స్వాంతన లభించింది. చాలా బాగా అనిపించిది, జీవితం మీద ఆశ పుట్టింది. అందుకే నీ ఫ్రెండ్ స్రవంతి గానే కొనసాగిపోయాను. మరి నీకు అనుమానం రావచ్చు. మీ క్లాస్మేట్స్ పేర్లు ఎలా చెప్పకలిగానా అని. నేను చెప్పిన పేర్లు ఒకసారి పరిశీలించు. లక్ష్మి, దేవి, మూర్తి, శ్రీను…. ఈ పేర్లు కలవారు చాలా మంది ఉంటారు. కాస్త అక్కడే తెలివిగా ఆలోచించాను. కానీ పరమేశం విషయంలో కొద్దిగా కంగారు పడినా వెంటనే సద్దుకున్నాను.

రామం…. ఏది ఏమైనా అనుకో. నువ్వు నా తండ్రి వయసు అయినా ఏదో ఫ్రెండ్ లాగే అనిపించింది. అందుకే నీ ఫ్రెండ్ లాగే నటిస్తూ ఇన్నాళ్లు గడిపేసాను. మధ్యలో నిజం చెప్పేద్దామని అనిపించినా నువ్వు దూరం అవుతావని ఆగిపోయాను. నేను చెన్నై వచ్చింది నా గుండెకు జరిగే అత్యంత క్లిష్టమైన ఆపరేషన్…. విజయవంతం అవ్వటం చాలా అరుదు. ఒకవేళ ఆపరేషన్ జరగకపోయినా నేను ఎంతోకాలం బ్రతకను. అందుకనే ఛాన్స్ తీసుకున్నాను. బహుశా ఆపరేషన్ విజయవంతం అయిఉంటే ఈపాటికి నీతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉండేదాన్నేమో. కానీ ఏం చేయను. అందుకే ముందుగానే నా మాటలు రికార్డు చేసి ఉంచాను.

మరి ఎందుకో దేముడు.. అందమైన హృదయం ఇచ్చిన నాకు, చిల్లులు ఉన్న గుండెను పెట్టాడు. కొండంత ప్రేమను ఇచ్చి, గోరంత ఆయుష్షు పెట్టాడు. దేముడికి తనకు నచ్చినవి తొందరగా తనే తీసేసుకుంటాడు అని అంటారుగా. బహుశా నేనంటే అంత ఇష్టమేమో. ఇన్నాళ్లు నా గుండె నన్ను ఇబ్బంది పెట్టేది. కానీ చివర్లో దానికి తీయని అనుభూతి నీ ద్వారా మిగిలింది. నేనేదో నిన్ను ప్రేమించాను అని చెప్పటం లేదు. కానీ ఎందుకో నీ మాట నాకు నచ్చింది, నీతో గడిపిన క్షణాలు ఎంతో మధురానుభూతిని మిగిల్చాయి.

బహుశా నువ్వు ప్రేమించిన స్రవంతి నాలో నాకే కనిపించిందేమో. అందుకే అంత మధురంగా ఉండేవి. ఎంతైనా తొలిప్రేమ కదా. అందుకే ఆ జ్ఞాపకాన్ని నాలో నిక్షిప్తం చేసుకున్నాను. నీ మాటల ద్వారా, చేతల ద్వారా నువ్వు నీ స్నేహితురాలు స్రవంతిని ఎంతలా ప్రేమించావో అర్థం అయ్యింది. అందుకే ఆ ప్రేమను బయలుపరచడానికి నిన్ను ఇబ్బంది పెట్టాను. నీలో దాచిన ఆ ప్రేమను బయటకు తీసి నాకే ఆపాదించుకున్నాను. ఆ ఊహే అద్బుతంగా ఉండేది. నిజంగా నీ భార్య అదృష్టవంతురాలు. అమృతభాండంలా ఉన్న నీ ప్రేమను పూర్తిగా తానే దాచేసుకుంది.

నీ మాటల్లో స్వచ్ఛత, నిజాయితీ, నన్ను కట్టి పడేసాయి. నీ మాటలకు మానసికంగా బందీ అయిపోయాను. నన్ను క్షమించు… నీ భావాలతో ఆడుకున్నాను. కానీ రామం. నన్ను కూడా ఫ్రెండ్‌గా స్వీకరించు. నన్ను కూడా నీ స్రవంతిగా భావించు. భౌతికంగా మనం ఎలాగూ కలవం. కానీ మానసికంగా నేను నీ ఫ్రెండ్‌ను, ప్రియసఖిని. నీ జీవితంలో నీ ఫ్రెండ్ స్రవంతి కలవవచ్చు. కానీ ఈ స్రవంతిని మాత్రం మరచిపోకు నేస్తం.

నాకు అవకాశం ఇస్తే మరోసారి స్రవంతిగా పుట్టాలని, నీ జీవితంలోకి ఫ్రెండ్ గా రావాలని, అదే కాలేజీలో నీతో ప్రేమలో పడాలని కోరుకుంటా. ఎలాగూ దేముడి దగ్గరకు వెళ్లి పోతున్నాగా… ఆయననే ఇదే నా కోరిక అని నిలదీస్తా. వరం ఇవ్వమని అడుగుతా. తప్పకుండా నీ జీవనంలో జీవన స్రవంతిగా, నీ స్నేహంలో స్నేహ స్రవంతిగా, జ్ఞాపకాల్లో మధుర స్రవంతిగా మిగిలిపోతాను నేస్తం. థాంక్యూ. మరోజన్మ అంటూ ఉంటే కలుద్దాం” అంటూ స్రవంతి గొంతుక  మూగబోయింది.

వింటున్న రామం, మంజరిలకు కళ్ళ వెంట ధారపాతంగా కన్నీరు కారిపోయింది. మౌనంగా చాలా సేపు ఇద్దరూ ఉండి పోయారు.

“అంటే రాంగ్ నెంబర్‌కు ఫోన్ తగలటం వల్ల ఈ స్రవంతి కలిసిందా. పాపం చిన్నపిల్ల కదండీ. ఎంత అన్యాయంగా జీవితం అయిపోయింది” అంటూ ఇద్దరూ స్రవంతి గురించి గత రెండునెలలుగా సాగిన ఘటనలు తలచుకుంటూ ఉండి పోయారు.

ఇంతలో రామం ఫోన్ మోగటం మొదలు పెట్టింది. నెమ్మదిగా తేరుకున్న రామం ఫోన్ ఎత్తి హలో అని అన్నాడు.

“హాయ్ రామం… ‘నేను స్రవంతిని.. నీ ఫ్రెండ్‌ని’…బాగున్నావా రామం? పరమేశం నాకు నీ నెంబర్ ఇచ్చి చాలా కాలం అయ్యింది. ఎన్నాళ్ల నుండో నీకు చేద్దామని అనుకున్నా. ఇదిగో ఇవ్వాళ కుదిరింది” అంటూ తీయటి కంఠంతో గలగలా నిజ స్రవంతి మాట్లాడుతూ.

మాటలు వింటున్న రామం, మంజరి ఆశ్చర్యంగా ముఖాముఖాలు చూసుకున్నారు…. స్రవంతి మాటలు గాల్లో కలసిపోతుండగా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here