నేనున్నానని..

0
11

[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘నేనున్నానని..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఔ[/dropcap]నట! నీవు గెలిచావని ఎవరో చెబితే విన్నాను,
నిన్ను పిలిచి అభినందిద్దామనుకున్నాను,
కానీ మొహం చెల్లక చాటేసుకున్నాను,
మనసులోనే అభినందించి ఊరుకున్నాను!

నీ గెలుపుని నీవు ఒకింత గర్వంతో
నాకు తెలుపుతావనుకున్నాను
కానీ, వినమ్రంగానే విన్నవించుకున్నావు.
నా వైఖరి పట్ల నీకే బాధా లేదనుకుంటాను!
బహుశా! నాకన్నా పరిణతి చెంది ఉన్నావేమో?

నిజం చెప్పొద్దూ!
నేను మనస్ఫూర్తిగానే నిన్ను అభినందించాను..
కరచాలనం చేసాను..
కానీ నీ విజయంలో
నాకూ భాగముందని ప్రకటించుకోడానికి
అర్హుడని కానని బలంగా నమ్ముతున్నాను

నీవు చేసే ఏ చిన్నా, పెద్ద ప్రయత్నంలోనూ
నేను చేయదగిన ఏ సహాయం నీకు చేయలేదు!
నీ ఓటమిలోనూ, నిరాశల చీకటి తావుల్లోనూ
నేనెప్పుడూ నీకు చేయూతనివ్వలేదు!

నీవు గెలిచి నిలబడతావని నమ్మకంలేకనేమో,
నీవు సాధిద్దామనుకున్న దానికై నీవర్హం కాదనేమో!
నీ శక్తి సామార్థ్యాలను నేనంచనా వేయలేక పోయుండొచ్చు.
నాలో ఏ మూలనో నీవంటే ఓ చిన్న చూపూ ఉండొచ్చు!

అయితే నేనిప్పుడు ఓ జీవిత పాఠం నేర్చుకున్నాను
పక్కవాడు చేసే ఏ మంచి ప్రయత్నానికైనా బాసటగా ఉంటాను
ఓడినప్పుడు చేయూతనిస్తాను
గెలిచినప్పుడు మనస్ఫూర్తిగా అభినందిస్తాను
సానుభూతినై అనుభూతి చెందుతాను
నేనున్నానని భరోసా ఇస్తాను.
నా ఉనికిని చాటుకుంటాను.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here