నియో రిచ్-1

1
10

[box type=’note’ fontsize=’16’] సీనియర్ రచయిత శ్రీ చావా శివకోటి రచించిన ‘నియో రిచ్’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]“అ[/dropcap]యోధ్యా నగరానికి రాజు దశరథుడు… ఆయనకు ముగ్గురు భార్యలు. కౌసల్యా, సుమిత్ర, కైకేయి. వీరికి నల్గురు కుమారులు. రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులు.”

“రాముని ఇల్లాలు సీత. ఈయన ఏకపత్నీ వ్రతుడు” అన్నదాకా చదివి ఆగాడు రవి.

రవి శివరాం కుమారుడు. చదివేది నాల్గవ తరగతి.

“ఆగావేం?” అడిగాడు శివరాం.

“దశరథుడు రాముని తండ్రే గదా! అయనకు ముగ్గురు భార్యలెందుకు? రాముడికి ఒక్కతే ఎందుకు వుంది?” అని తనకొచ్చిన సందేహాన్ని బయటపెట్టాడు రవి.

“రవీ! నువ్వు పూర్తిగా పాఠం చదువు. అనుమానాలుంటే గుర్తుంచుకొని ఒకేసారి అడుగు” అని లోనకు చూసి “పార్వతీ!” అని పిలిచాడు.

చెంగుకు చేతిని తుడుచుకంటూ వచ్చింది పార్వతి.

పార్వతి శివరాం భార్య. వీరి సంతానమే ‘రవి’.

“ఇవ్వాళ క్లబ్బులో మీటింగు ఉంది. బహుశా మధ్యాహ్నం భోజనానికి రాలేకపోవచ్చు. ఇవ్వాళ బాబుకు శెలవు. వాడికి ఏదైనా అనుమానాలు చదివిన దాంట్లో వస్తే చెప్పు. నేను వెళ్తున్నాను.” అంటూ లేచి బ్యాగ్ చేత పెట్టుకొని గడప దాటాడు. రెండో నిముషానికి ‘కారు’ కదలిన శబ్దం వినిపించింది. పార్వతి లోనికి వెళ్తూ ‘బ్రహ్మం’ అని పిలిచింది. “వస్తున్నా” అంటూ రివటలాంటి వృద్ధుడు ఎదురు వచ్చాడు. “నేను స్నానం చేసి వచ్చే దాకా బాబు దగ్గర కూర్చో” అని వెళ్ళిపోయింది. తల ఊపి రవి దగ్గర చేరాడు బ్రహ్మం. ఎదురుగా కూర్చోగానే “‘ఏకపత్నీ వ్రతుడు’ అంటే ఏమిటి?” అనడిగాడు రవి.

“బ్రతుకు చివరదాకా కట్టుకున్న దానితోనే పడి ఉండేవాడ్ని అలా అంటారు” అన్నాడు అదోలా నవ్వి.

“నేను చూసిన అందరి ఇండ్లలోనూ ఒక్క మొగుడు, ఒక్క పెండ్లామే ఉన్నారు గదా! మరి ఈ రాముడిని మాత్రమే ‘ఏకపత్నీ వ్రతుడు’ అని వ్రాసారెందుకు” అడిగాడు.

“అట్టా వచ్చావా!” అని “రాముడి కాలానా, అంటే త్రేతాయుగాన అది గొప్ప. రాముడు తండ్రికి ముగ్గురు ఇల్లాళ్లు గదా!” అంటుండగా…

“అవును కదా!” అని పుస్తకం వైపే చూసి… “ఇదిగో మన ఇంటికి అహోబలరావు గారని వస్తుంటాడు, నీకు తెలుసా?” అనడిగాడు రవి.

“ఆయన నువ్వు పుట్టకముందు నుంచే నాకు తెలుసు.” అన్నాడు బ్రహ్మం.

“ఆయన పిల్లలిద్దరు మా బడిలోనే చదువుతున్నారు. అయితే ఈ మధ్యన ఓ అమ్మాయి ‘నేను అహోబలరావు గారి కూతుర్నేననీ – పెద్దావిడ మా అమ్మ అని చెప్పింది’. అంటే ఆయనకు చిన్నావిడ ఉన్నట్టే గదా!”

అవునన్నట్లు తల ఊపాడు బ్రహ్మం.

“ఆహాఁ! దశరథునికి ముగ్గురు భార్యలున్నారు. రావణుడు తనకు భార్య వున్నా సీతనెత్తుకుపోయాడు. వాలి సుగ్రీవులు ఒకరి తరువాత ఒకరు ఒకే ఆవిడతో ఉన్నట్లుగా ఉంది” అని, “ఇప్పడీ అహోబలరావుకూ ఇద్దరు ఇల్లాళ్లు. ఇట్టాంటి వాళ్ల కంటే ఒక్క భార్యతోనే ఉన్న వాడు గొప్పవాడంటావా?”

అవునన్నట్లు తల ఊపాడు బ్రహ్మం.

“మరి అహోబలరావు తప్ప ఇప్పుడు ఎక్కువ మందికి ఒక్క భార్యే ఉన్నారు గదా! ఇందులో ఉన్న గొప్పతనమేంటి?” అడిగాడు రవి.

“ఇట్టాంటివి నాకు తెలీదు. నాన్నగారినే అడుగు” అన్నాడు బ్రహ్మం.

రవి పుస్తకం మూసి అలోచనలో పడ్డాడు.

ఫోను మ్రోగడంతో స్నానం ముంగించుకొని వస్తున్న పార్వతి ఫోను దగ్గరకొచ్చి రిసీవర్ లేపింది. ‘నేను శివరాంని’ అని వినిపించింది.

“చెప్పండి.”

“బ్రహ్మాన్ని మన ఫియట్ కారు తీసుకొని వెళ్లి జయంతి లాల్‌ను ఎక్కించుకొని క్లబ్బు దగ్గరకు రమ్మను…” అని చెప్పాడు.

“మంచిది” అని ఫోను పెట్టేసి… బ్రహ్మానికా విషయం చెప్పింది.

“మంచిది” అని కారు తీసుకుని వెళ్లిపోయాడు బ్రహ్మం.

క్లబ్బు దగ్గర దిగిన జయంతి లాల్ మీటింగ్ హాలు వైపుగా నడిచాడు. జయంతి లాల్‌ది అసలు లక్నో. చిన్నతనాననే ఇక్కడికి వచ్చాడు. వ్యాపారికంగా బాగా స్థిరపడ్డాడు. వయస్సు నలభయిలోకి వస్తున్నా పెళ్ళాడలేదు. శివరాం కనిపించగానే ‘హాయ్’ చెప్పి మీటింగ్ హాలు లోకొచ్చాడు. ప్రముఖులు చాలా మంది కనిపించారు. అధ్యక్షస్థానంలో అప్పుడు నళినిరెడ్డి కనిపించింది. ఆవిడే మాటాడుతున్నది. మాటాడేది చివరకొచ్చింది. “‘దృష్టి’ లేని బ్రతుకంత దయనీయమో మనకు తెలుసు. అంచేత ఎక్కువ మందికి వైద్యము ఆపరేషన్లు పూర్తి చేయగలగాలి. ఈ క్యాంపు విషయం అందరికీ తెలిపి ఎక్కువ మంది లబ్ధి పొందేలా చూడడం మనందరి బాధ్యత. ఇందుకు అందరి సహకారమూ ఉందని తలుస్తున్నాను” అని కూర్చున్నది.

జయంతి మొదటి వరసను చూస్తూపోయాడు.

పెంచలయ్య, డా. హర్ష, లాయరు ముకుందం, రిటైర్డ్ చీఫ్ ఇంజనీరు ఆర్.కె. రావ్, స్టేటు లారీ యూనియన్ సింహాద్రి నాయుడు, సారా కాంట్రాక్టరు వెంకటయ్య, అటవీ కాంట్రక్టరు శివాజీ. ఇంకా చిదంబరం, వరదరాజు, వీరాంజనేయులూ, జానకీరాములు, శంకరశాస్త్రీ, అవధానీ వగైరాలు కనిపించారు. జయంతి లాల్ శివరాం వెంబడే కూర్చుని “ఇంతకీ క్యాంపుకి శివారెడ్డి గారు వస్తున్నట్టా?” అడిగాడు.

“వస్తానని మాటిచ్చాడు. నేను మాటాడాను.”

“జిల్లా అంతా తిరిగే కార్యక్రమం ఎవరికి అప్పగించారు?”

“సింహాద్రి, వరదరాజూ చూస్తామన్నారు.”

“ఇంకేమైన విశేషాలు?” అడిగాడు జయంతి.

“నువ్వు వారానికోసారైనా కనిపించడం లేదు. పార్వతి గోల చేస్తున్నాది” అన్నాడు.

“అయితే వెళ్దామా?” అన్నాడు నవ్వుతూ.

“ఒక్క నిముషం!” అని వాళ్ళ దగ్గర వెళ్లి మాటాడి వెనక్కువచ్చాడు. ఇద్దరు కలిసి కారు దగ్గరకొచ్చారు. కారు బయలుదేరి శివరాం ఇంటి ముందాగింది. దిగి ఇంట్లోకి నడిచారు. హాలులోనే ఉంది పార్వతి. జయంతి కనిపించగానే అప్యాయంగా లేచి వచ్చి – “కంట్లో నలుసవైపోయావేంటి?” అంది.

“నువ్వూ అలాగే ఆలోచిస్తున్నావన్నమాట.”

“అంటే నేను కాక.”

“శివరాం కూడా నిష్ఠూరంగా మాటాడితేనూ.”

“కాక మరేమిటి? నెలలో సగం దినాలయినా ఇక్కడ భోంచేసేవాడివి. వారానికోసారైనా కలసి భోంచేయలేకపోతున్నాం. అంత బిజీనా?” అంది.

“చెప్తాను. నేను వచ్చిందందుకే. అయినా నీ కంటే నాకెవరున్నారమ్మా. చెల్లివయినా, అక్కవయినా, బిడ్డవయినా నువ్వే కదా” అన్నాడు. ఈ మాటలంటున్నపుడు జయంతి గొంతు జీర పలికింది, కళ్లలో నీరూరింది.

“ఇంక చెప్పక్కర లేదు!” అంటూ దగ్గరికొచ్చి చేయి పట్టుకొని “అన్నయ్యా, నువ్వు రోజుకోసారయినా కనిపించాలనే కోర్కెతో అలా అన్నానే తప్ప” అని లోనికి తీసుకెళ్లింది. కాజూలడ్డూ కలకండ తినిపించి కబుర్లు చెప్పుతూ మమూలు మూడ్ లోకి తీసుకొచ్చి తృప్తిపడింది.

జయంతి తమను కల్సినప్పుటి నుంచీ జరిగినదంతా పార్వతి మనోఫలకంపై కదలాడింది.

శివరాం పరమపదసోపాన పటాన నడచిన నడకా – తల మెదిలింది.

***

శివరాంది ఇక్కడకి దూరాన ఉన్న ఓ పల్లెటూరు. ఇతని తండ్రి పేద రైతు. ఆర్థికంగా ఎంత వెనకబడి ఉన్నా శివరాంను బాగా చదివించాలని అనుకున్నాడు. ఎంత ప్రయత్నించినా పదవ తరగతి మించి చదవించలేకపోయాడు. దీనికి తోడు శివరాం తండ్రి ఒక పంచాయితీకి వెళ్తూ అక్కడ అకస్మాత్తుగా చెలరేగిన ఘర్షణలో వారించబోగా అతని తలకే పెద్ద గాయమైంది. బాగా రక్తం పోయింది. సరియైన వైద్య సదుపాయం లేక ఆసుపత్రికి చేర్చినప్పటికే చనిపోయాడు. శివరాం జరిగిన దానికి ఏడ్చాడే తప్ప కేసు లాంటివి పెట్టలేదు. దానితో ఇరుపక్షాల వారూ బోలెడు సానుభూతి చూపారు. ఏది ఏమైనా శివరాం తండ్రి మరణంతో ఏకాకి అయ్యాడు. ఆ ఊళ్లో ఉండలేకపోయాడు. తండ్రి జ్ఞాపకాలు అతన్ని బాగా రిగశీలేలా చేసేనయి. ఉన్న నాల్గు ఎకరాల చెలకని, ఇంటిని, జత ఎడ్లను, పెరటిని కలిపి బిల్‌మక్తా (మొత్తంగా) ముష్టి ఆరువేలకు అమ్మేసి ఊరు వదిలినాడు. వదిలేముందు ఆ ఊరు నుంచి అయిదారేండ్ల క్రితం టౌనుకు వెళ్లిన పుల్లయ్యను గుర్తులో ఉంచుకున్నాడు. అక్కడికి చేరాడు. పుల్లయ్య టౌను ప్రక్కన చోటు కొనుక్కొని సున్నం డంగు స్వంతంగా వేస్తూ దున్నపోతుని బండిని ఉంచుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇక్కడి కొచ్చాకనే పుల్లయ్య శాంతిని పెళ్లాడాడు. శివరాంను భార్యాభర్తలిద్దరూ ఆదరంగా చూసారు. వారం దినాలయ్యాక శివరాంను అడిగాడు పుల్లయ్య “ఏం చేద్దామనుకుంటున్నావు.” అని.

“తోచడం లేదు. కానీ ఏదో ఒకటి చేయాలి. తింటూ ఊరికే కూర్చుంటే గుట్టలు ఆగవు” అని నవ్వాడు. ఆవేళ్టికి అంతటితో లేచి వెళ్లారు. ఆ మర్నాడు పుల్లయ్య శివరాంను పిలిచి “బాబూ నీ ఆలోచన తెలిసాకనే వృత్తి లోకి వద్దువుగాని. మొదట ఉండేందుకు ఠికానా ఏర్పరుచుకోవడం మంచిది కదా. పట్టణాలలో ఇది ఉంటే అంతా ఉన్నట్టే” అని నవ్వాడు.

“నా దగ్గరున్న డబ్బుతో మామూలు ఇల్లు దొరుకుతుంది. కాని తరువాత?” అన్నాడు.

“నేను అన్నది ఇల్లు కొనమని కాదు. చోటు కొను. టౌనులో మనం కొనలేం. స్తోమత చాలదు. టౌనుకు దాపులో ఉండేలా కొనుక్కో” అన్నాడు.

“పుల్లయ్యా నువ్వు ఉన్నది ఊరి వెలుపల. ఇక్కడ గజం రెండు రూపాయలుంది. నన్ను ఇంకా జరిగి పొమ్మంటావా?” అనడిగాడు.

“బాబూ! ఇది బాగా పెరుగతున్న టౌను. దానికి చివరంటూ ఉండదు. ఇక్కడికి రోడ్డంటే ఫర్లాంగు దూరాన. రెండెకరాల చెలక ఉంది. దాన్ని కొంటే బాగు అనిపిస్తున్నది. దాని పైన ఇంకా జనం దృష్టి పడలేదు. పైకం ఉంటే నేను కొనేవాడిని” అన్నాడు.

“చివ్వార నేనే అవుతానేమో?”

“నేను కొన్నప్పుడు కిలోమీటరు అవతల ఉన్నాను. ఇప్పుడు ప్రక్కకొచ్చాను. నాలుగేండ్లు నడిస్తే నువ్వూ మధ్యకొస్తావు” అని నవ్వి “వాడు అక్కరలో ఉన్నాడు. ఎకరం ఆరు వేల రూపాయలకిస్తాడట. మాటాడక కొనెయ్” అన్నాడు.

“సరే! రేపు చోటు చూద్దాం” అన్నాడు. మరునాడు వెళ్ళి చూసాడు. రోడ్డు మఖమే చాలా వుంది. అనువైనది గానే అనిపించింది. కొని రిజిష్టరు చేయించకున్నాడు శివరాం. అయ్యగారొకర్ని తీసుక్కుపోయి వాస్తు ప్రకారం ఒక తాటాకు పాక వేసాడు. చేటబావి ఎట్టించాడు. నాల్గు గజాలలోనే నీళ్ళు పడ్డవి. వర్షాలు పోకముందే రెండెకరాలు చుట్టూ నాగటి చాల పట్టి సర్కారు తుమ్మ గింజల్ని పెట్టాడు. ఆనక రెండు వర్షాలు పడ్డాయి. గింజలు మొలచినయి. శివరాం అక్కడికే మకాం మార్చి ఇంత ఉడకేసుకొని తింటు పుల్లయ్య దగ్గరకొచ్చి అతనికి సాయంగా ఉంటూ ఏం వ్యాపారం ప్రారంభించాలి అన్న ఆలోచనలో పడ్డాడు. ఇట్టా ఉండగా ఒకనాడు దశరథం అనే అసామి పుల్లయ్య దగ్గరకొచ్చి “నాకు సున్నం అందాలంటే మరో డంగు తిరగాలి. లేకుంటే కట్టుబడి కాలం రెండున్నర నెలలు పెరుగుతుంది. చాలా నష్టమవుతది” అని కేకలేసాడు.

“నీ వరకు అందిస్తాను” అని బ్రతిమాలుకున్నాడు పుల్లయ్య.

డంగు లేసేందుకు మిషన్లు వచ్చినట్టు శివరాంకు తెల్సింది. పుల్లయ్య సలహా తీసుకొన్నాడు.

ఇరవై వేలతో డంగు మిషను పాతది కొని నల్గురు పని తెల్సిన వాళ్లను పెట్టుకొని పని ప్రారంభించాడు.

పుల్లయ్యే కొబ్బరికాయ కొట్టాడు. మొదటి నెల మిషను నడవక రిపేర్లు. దాన్ని అరుసుకొనే పద్ధతిని దగ్గరుండి ఆకళింపు చేసుకున్నాడు. దానికితోడు బాగా కష్టపడటంతో ఫలితం కనిపించసాగింది. ఒక సంవత్సరం గడిచింది. సర్కారు తుమ్మలు అన్నం కట్లు అనక పెరిగినయి. వాటిని దడిలా అల్లించి గ్రేడ్ చేసాడు. కాంపౌండ్‌గా అమరిందది. ఇంతలో కరంటు లైను అటుగా వేసారు. ఆయిలు ఇంజను మార్చి కరంటు మోటారు పెట్టాడు. టౌను పల్లెల్లో వస్తున్న ఆటుపోట్లు మూలాన బాగా పెరగసాగింది. వలస మొదలయింది. ఇండ్ల అక్కరా వచ్చింది. దాంతో కట్టుబడి విరివిగా సాగింది. వ్యాపారం బాగా పెరిగింది. మిషనులో ఆడిన సున్నం నాణ్యంగా ఉండడాన పుల్లయ్య సున్నం వ్యాపారం దెబ్బతిన్నది. దానితో సున్నం ఆడడం మానుకొని బాడుగ బండి నడిపాడు. శివరాంకు బాధనిపించింది. టౌనులో వచ్చి ఉండమని కోరాడు. ‘సరే’ అన్నాడు. ఇక్కడ చేతినిండా పని ఉండడాన కొంత ఊపిరి పీల్చుకున్నాడు. ఇంతలో పుల్లయ్య కొని ఉంటున్న చోటు పై పేచీ వచ్చింది. అమ్మినావిడ దాయదులు కోర్టుకు వెళ్లారు. ఈ పేచీ మనకెందుకు అనుకుని వదిలేద్దామంటే రూపాయకు అరవై రెట్లు పెరిగింది. శివరాం కొన్న చోటును కూడా దాటి ఇండ్లు పడ్డయి. ఇంకా మొదలవుతున్నయి. పుల్లయ్యకు వచ్చిన నోటీసును తీసుకొని వకీలును సంప్రదించాడు శివరాం. కౌంటరు వేసాడు. అయితే సంవత్సరం తరువాత చోటును అమ్మే హక్కు పుల్లయ్యకు అమ్మినామెకు లేదని కోర్టు తీర్పిచ్చింది. శివరాం ఊరుకోక హైకోర్టులో వేసాడు. స్టే వచ్చింది. దాదాపు ఎనిమిదేళ్ల పొజుంగునే కూడా ఉంది కదా. అయితే ఓ నెల తరువాత అవతల నుంచి రాజీ ప్రతిపాదన వచ్చింది. పుల్లయ్య కొనుకున్న రేటుకు రెట్టింపు ఇస్తారట. చోటు ఖాళీ చోయాలట. అది బాగనిపించలేదు. కాని పుల్లయ్యకు చెప్పాలి గదా. టౌనుకు వస్తూ వస్తూ పుల్లయ్య ఇంటి దగ్గర ఆగాడు. తలుపులు తెరిచి ఉంటే పిలుస్తూ లోనకెళ్తాడు. దడి లాంటి స్నానాలగది నుంచి “వస్తున్నా” అన్న శాంత మాట వినిపించింది. అటుగా చూసాడు శివరాం. “పుల్లయ్యేడి?” అంటూంటే, దడికి ఉన్న రంద్రాల నుంచి శాంత స్నానం ముగించడం కనిపించింది. చీరను తిరిగి చుట్టుకొని సిగ్గుపడుతూ ఎదురుగానే వచ్చి మరో దడి చాటుకు నడచింది. అప్పుడే పూర్తిగా చూసాడు శాంతను. ఇంత అందగత్తెనా శాంతి? అనిపించింది. ఒళ్లంతా ఎలాగో అయింది. మనస్సు ఆగలేదు. కోరిక కళ్ళకు పొరను తొడిగింది. అంతే వడిగా లేచి శాంతి వెనకే నడిచాడు. వెనక నుంచి వాటేసుకొని మెడ నుంచి ఎదను ముద్దులతో ముంచాడు. నివ్వెరపోయింది శాంతి. వారించింది. శివరాం వేగానికి నోరు పెగలలేదు. చేతులాడలేదు. నేలపైనే పడేసాడు. ఊపిరి పూర్తిగా చల్లరాక గాని లేవలేదు. శాంతి ఏడుపు వినిపిస్తున్నది. లేచి వెళ్లిపోయాడు. ఆ తరువాత శివరాం పుల్లయ్య కోసం ఎదురు చూసాడే తప్ప ఇంటి చాయలకు కూడా పోలేదు. పుల్లయ్యతోనూ ఫ్రీగా మాటలాడలేకపోయాడు.

శాంతి పుల్లయ్యతో ఏమీ చెప్పలేదనేది మాత్రం స్పష్టమైంది.

నెల తరువాత దావా సెటిల్ చేసి పుల్లయ్యతో చోటు ఖాళీ చేయించి తన ఇంటికే మకాం మార్పించాడు శివరాం. స్నేహం, అభిమానం అంటే ఇలా ఉండాలి అనుకున్నారు లోకులు. అయితే నెల తిరగకుండానే యాక్సిడెంట్లో పుల్లయ్య కాలు ఒకటి తీసెయ్యాల్సివచ్చింది. శివరాం మనస్ఫూర్తిగా వైద్యం చేయించాడు. కాని శాంతి అరణ్యరోదనకు ఆసరా దొరకలేదు. రోజులు నడుస్తున్నాయి. అవి ఎవరి కోసమూ ఆగవు గదా! శాంతి కనిపిస్తే చాలు నరాలు నలపడం మొదలవుంది. శాంతి పరిస్థితిని మరచి అవకాశం దొరికినప్పుడల్లా అనుభవించాడు, పుల్లయ్యను కంటికి రెప్పలా చూస్తూనే. శాంతను మరువలేని స్థితిలో శాంతనే భార్యను చేసుకుంటే అన్నంత దురూహ కూడా కల్గిన క్షణాలున్నాయి.

ఒకనాటి పొద్దుపొడుపునే శాంత పుల్లయ్యలు నిర్జీవులుగా కనపించారు.

పురుగలు మందు త్రాగారు. నిజంగా పసివానిలా ఏడ్చాడు ఆ రోజు శివరాం. క్రతువు సక్రమంగా జరిపాడు. నెల దాకా ఆ దుఃఖం నుంచి బయటపడలేకపోయాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here