నియో రిచ్-12

0
12

[ప్రజాసేవ మొదలుపెట్టిన పెంచలయ్య ప్రజల అభిమానాన్ని సంపాదిస్తాడు. వ్యాపారిగా కాక తమను ఆదుకునే మనిషిలా ప్రజలకు కనబడడం ప్రారంభిస్తాడు. హఠాత్తుగా మునిసిపల్ ఎన్నికలను ప్రకటిస్తుంది ప్రభుత్వం. ఇది పెద్ద హడావిడి వార్తయి కూర్చుంటుంది. అందరూ తమ తమ రూపాలని మార్చుకుని ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాలలోకి దిగుతారు. వృద్ధ నాయకులను అరికట్టి యువతకి ప్రాధాన్యమివ్వలనే ఉద్దేశంతో యువత అంతా సమావేశమై పెంచలయ్యను నాయకుడిగా ఎంచుకుంటారు. అతడు పెట్టిన షరతులన్నింటికీ అంగీకరిస్తారు. టీమ్ వర్క్‌‌తో అందరికీ సర్దిచెప్పి, పకడ్బందీ వ్యూహాన్ని రచించి తమ జట్టును గెలిపించుకుంటాడు పెంచలయ్య. ఇక మునిసిపల్ ఛైర్మన్ పదవికి అభ్యర్థిని ఎంపిక చేయాల్సి వస్తుంది. తనకి ఆసక్తి లేదని చెప్పి, స్థానికంగా పేరున్న వైద్యుని భార్య శ్రీమతి నళినీ రెడ్డిని ఛైర్మన్‍గా ప్రతిపాదిస్తాడు. ఇక చదవండి.]

[dropcap]అం[/dropcap]దరూ ఒప్పుకున్నారు. లోలోన కొందరికి అసంతృప్తి ఉన్నా పెదవి విప్పి మాత్రం బయటపడలేదు. సీనియర్ సభ్యుల ప్రతిపాదనతో ఏకగ్రీవంగా ఈవిడ చైర్మన్‌గా ఎన్నికయింది.

పేపర్లు – పెంచలయ్య తీసుకున్న ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేయడమే గాక ఆడవారికి ప్రాతినిధ్యం ఇచ్చి ప్రోత్సహించడమేగాక చైర్మన్‌గా అదీ ఏకగ్రీవంగా ఎన్నిక జరిపించడం మరో ముందడుగుగా తొలి విజయంగా అభివర్ణించాయి.

మున్సిపల్ చైర్ పర్సన్‌గా తొలి మహిళ అన్న పతాక శీర్షికలు వచ్చినయి.

ఇక ఇప్పుడైనా మనం ఈ నళినీ రెడ్డిని గురించి కట్టె కొట్టె తెచ్చెలా అన్నా తెల్సుకోవడం మంచిది. నళినీ B.A. దాకా చదివింది. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చింది. డా. శ్రీధర్ రెడ్డిని ప్రేమించి పెళ్లాడింది. అభ్యుదయ భావాలు గల మనిషిగా, చదివే రోజులలోనే మంచి పేరుని సంపాదించుకుంది. రెడ్డి గారితో పెళ్లయ్యాక అన్ని మరచి సంసారంలో పడిపోయింది. అయితే పెళ్లయి రెండో ఏడన్నా ముగియక ముందే కారు యాక్సిడెంట్‌లో డాక్టరు గారికి రెండు కాళ్లూ పోయాయి. వెన్ను పూస విరిగింది. కాళ్లు పోవడం అంటే తీసెయ్యడం కాదు, చలనాన్ని కోల్పోయాయి. రెండు మూడు నెలలైన తిరక్కుండానే ఎంత పెద్ద వైద్య సహకారం ఉన్నా పూర్తిగా సన్నబడిపోయినయి. చివరకు అమెరికా వెళ్లి వచ్చినా కుదుటపడలేదు. ఎంతో కొంత మార్పు రాలేదు.

అది మొదలు కాలక్షేపం కోసం, మానసిక ప్రశాంతత కోసం నళినీ మహిళామండలిలను ఆశ్రయించి చొరవగా చాలా ముఖ్య భూమికను నిర్వహించింది. పగలంతా అన్నీ మరచి మహిళామండలి కార్యక్రమాలలో తలమునకలైనా ఇంటికి చేరగానే భర్తని ఆదరంగా చూసుకునేది. రెండు మూడు ఘడియలు ఆయన ప్రక్కనే ఉండేది. జరిగిన అనర్థానికి కృంగిపోతుండేది.

అయితే నళినీ వయస్సు స్థితిని గమనించిన డాక్టరు గారు విడాకులు తీసుకోమనీ, మరో వివాహం చేసుకోమనీ చెప్పాడు. బ్రతిమాలాడు. ససేమిరా ఇష్టపడలేదు నళినీ. ముఖ్యంగా ఆయన ప్రక్కనే పడుకొని బాగా ఏడ్పింది. ఆయన ఓదార్పులోనే అక్కడే కుదురుకుంది.

ఇక పెంచలయ్యకు నళిని పచారీ సరుకులు – హోం డెలివరీ పెట్టినప్పటి నుంచి మాత్రమే తెల్సు. మధ్య మధ్యన కనిపించినా పెద్దగా మాటా మంతీ ఉండేది కాదు. ప్రజాసేవ మొదలయ్యాకనే ఈవిడతో పరిచయాన్ని పెంచుకుంటూ వచ్చాడు. ఇతని పద్ధతి, నిర్ణయాలు తగిన సమయంలో తీసుకొనే విధానం గమనించిన నళినీ బాగా అబిమానించి అండగా నిలబడింది. అయినా అప్పటి రాజకీయలలోకి ఎవడు ప్రవేశించినా మొదట మెట్టు చాకిరీ తప్పదుగదా. లేకుంటే ఒక్క తెలివిగల్గిన వాడు మాత్రమే దాన్ని రాజకీయ సోపానానికి పెట్టుబడిగా మలచుకోగలడు. దాన్నే సేవ అని జనంలోనే కాలగమనాన అనిపించుకోగలడు.

నిజానికి ఈ రాజకీయమే ఒక పజిలు. క్రాస్‌వర్డు పజిలన్నమాట. దానిలో ఉన్నటువంటి చిత్రమైన విషయ మేమిటంటే అంతా అర్థమైనటే సీదా సాదాగా ఉంటుంది. దాని దేముంది అని అడుగు వేసేసరికి అంతా గజబిజి. ఆ గజిబిజిలో పడి వదలక నడచాం పో, ఇక అంతూ దరీ దొరకదు. బయటకు రాలేం! ఏదైనా కూర్చోందే విషయం లోతు అర్థంగాదు గదా!

అయితే ఈ రాజకీయ వ్యాసంగానికి ధైర్యం, వినయం, సమయస్ఫూర్తి కవచకుండలాల లాంటివి. వీటిని కాపాడుకుంటూ కదిలేతే చాలు.

ఈ ఇంద్ర ధనస్సు – మన ప్రయత్నమూ అదృష్టమూ బాగుంటే కీర్తిగా మారి అధికారపీఠానికి దరి చేర్చుతుంది. అది కాంతా కనకాల్ని మన ముందుంచుతుంది. సకలోపచారాలను అదే జనంతో చేయిస్తుంది. జన సేవకులుగా ఎదిగి డామినేషన్. జనమే వారి కోసం పడిగాపులు పడడమేమిటో. ఎంత తల బాదుకున్నా అర్థం గాదు. అందుకే ఇదో పజిల్ అనుకున్నాం గదా అంతే.

మనిసిపల్ ఎన్నికలు జరిగి ఆరు నెలలు గడిచినయి.

అకస్మాత్తుగా ఇంకో ఏడాది టైం ఉండుగానే జనరల్ ఎన్నకలు వచ్చినయి. నామినేషన్‌కు తేదీని ఖరారు చేస్తూ ఎన్నికల కమీషన్ ప్రకటించింది. పార్టీలన్నీ పాత సరంజామాను దులుపుకుని అభ్యర్థుల కోసం వారి నుంచి ధరఖాస్తులను కోరారు. అనుకోని హడావిడి మాత్రం మొదలయింది.

పెంచలయ్య మాత్రం తమ పార్టీ వారి నందరిని పిలిచి సమావేశం ఏర్పాటు చేసాడు.

జిల్లాన ఉన్న ఎనిమిది నియోజిక వర్గాల నుంచి అభ్యర్థులను కోరాడు.

వచ్చిన వాటిని జిల్లా కమిటీ పరిశీలించింది. రాష్ట్రానికి పంపింది.

దరఖాస్తులు చాలా విరివిగా వచ్చినయి. ప్రతి వెధవా మిగిలిన వాళ్లకు పాలించే కోరికతో ఉన్నాడనిపించింది.

పాలనా వర్గాలు అనే దానికి నిర్దేశికత లేదు కనుక, మొలతాడు మొలన నిలచి ఉంటే చాలు దరఖాస్తు పెట్టుకోనే హక్కు ఈ దేశ పౌరుడిగా ఉన్నది గనుక.

మున్సిపాలిటి పరిధిన ఉన్న నియోజిక వర్గానికి మిత్రుల ఒత్తిడితో కార్యాలయానికి తన ధరఖాస్తు పంపాడు. అయితే అక్కడ నుంచే ఇద్దరు సీనియరు నేతలు ఆ నియోజిక వర్గం నాకు కావాలంటే నాకు కావాలని రాజధానిలో మోహరించి బల ప్రదర్శనలకు దిగి కనిపించారు.

అయితే పెంచలయ్య ఇద్దరిని కూర్చోబెట్టి పరువు తీసుకోకుండా శాంత పరచాడు.

ఎంత శాంత పడ్డా వారి విభేదాలు మాత్రం తారా స్థాయి మించి క్రిందకి దిగలేదు.

ఒకానొక సందర్భంలో వీధి పంచాయితీలా తలపడి చొక్కాలు చింపుకోవడం, ముక్కులు బెదరగొట్టు కొనడం కూడా చేసారు.

ఆనక అనుయాయులు మెరుపు దాడులు ప్రారంభించారు. వాతావరణం బాగా వేడేక్కింది.

రాష్ట్ర నాయకులకు తలనొప్పి అయి కూర్చుంది.

ఈ పరిస్థితిని తెలివిగా ఉపయోనగించుకున్నాడు పెంచలయ్య.

మొదటి పోటీదారుడు “నాకు రాకున్నా ఇబ్బంది లేదు. అతనికి రాకూడదు” అని కరాఖండీగా చెప్పాడు. ఇది రెండో వ్యక్తికి తెల్సి అతనిని తప్ప పార్టీ ఎవర్ని ఎంపిక చేసినా తన మద్దతు పూర్తిగా పార్టికే ఉంటుదని స్పష్టం చేసాడు.

అంచేత-

రాష్ట్రం, ఢిల్లీలలో రాజీ అభ్యర్ధిగా పెంచలయ్య తన అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేయించుకోగలిగాడు. ప్రకటించిన అభ్యర్ధుల బాజితాలో పెంచలయ్య పేరు రానే వచ్చింది. ఇది నిజానికి ఇక్కడి పార్టీ ఊహించంది గాదు.

తనకు టిక్కెట్టు రావడం చాలా ఆనందాన్నిచ్చింది పెంచలయ్యకు. ఇక పావుల్ని ఎలా కదపాలో నిర్ణయించుకున్నాడు. నళినీ రెడ్డి ఉబ్బితబ్బియింది. తోడుగా బరిలోకి దిగేందుకు సిద్ధపడింది.

పెంచలయ్య తన సంతోషాన్ని చింతాకంతా బయటపడనీకుండా ‘ఇది నాకెందుకు పెట్టారు’ అన్న ధోరణిన చికాకును బయటకు వ్యక్తం చేసి – మొదటి పోటీదారుడి దగ్గరకి వెళ్లి “ఈ భారం నా పై ఉంచడం సబబు కాదు. నాకంత రాజకీయానుభవం లేదు. నన్నేం చేయమంటారు. శెలవివ్వండి” అని నమస్కరించాడు.

“నువ్వు మొదగట కూర్చో” అని అన్నా అట్టానే నిలబడ్డాడు.

తనకు రావాల్సిన టిక్కెట్టు ఇలా అయిందేమిటి అన్న బాధలో ఉండి కూడా ప్రత్యర్థిని చిత్తు చేసాడన్న భావన కల్గి కొంచెం ‘కుదార్తి’ పడి “టికెట్టు నీకు ఇచ్చారుగా. నువ్వు గెలుస్తావు” అన్నాడు ముభావంగా.

“సార్ ఇది నేను కోరుకున్నది గాదు. మీలాంటి పార్టీ పెద్దల నిర్ణయమిది. నాకు కాలు చేయి అడడం లేదు. ఒక వేళ మీ మాట ప్రకారం గెలుపే వరిస్తే అది నా గెలుపు కాదు. మీది. నాకీ అవకాశం వచ్చింది గనుక మీ అడుగుజాడల్లో, తమ ఆశీర్వాద బలంతో నడుద్దామనుకుంటున్న వాడ్ని. తమరు చేసే ఏ ప్రయత్నానికైనా నా సహకారం ఉంటుంది. విధేయుడనై వుంటాను. ఇదిగో నా కాగితం మీరే ఉంచండి. మీకే టికెట్టు వస్తే దాన్ని రాష్ట్రానికి పంపండి. మీకు మద్దతిస్తూ నేను ఉపసంహరిచుకుంటున్నట్లు వ్రాసాను” అని చేతులో పెట్టి నమస్కరించి వెనక్కు మళ్లాడు. చాలా సీనియర్ నటుడిలా పాత్రకు జీవం పోయటంతో ఆ పెద్ద మనిషి లేచి పెంచలయ్యను ఆపి “నీలాంటి వానికి మన పార్టీ టికెట్లు ఖరారు చేసారని తెల్సినాక మన నియోజిక వర్గానికి న్యాయం చేసారని భావించాను. ఇక నాకు టిక్కెట్టు అఖర్లేదు. ఈ ఎన్నికలలో నీకు విజయం చేకూర్చడం ఎలా అన్నదాని గురించే ఆలోచిస్తున్నాను. నా సర్వశక్తులు ఒడ్డి నిన్ను గెలిపించుతాను” అని హామీ ఇచ్చి పెద్దరికంగా ఆశీర్వదించాడు కూడా. ఆ మరుక్షణాననే తన వద్ద ఉన్న వందిమాగధ బృందానికి “ఎన్నికల ప్రచారం ఈక్షణం నుంచే ప్రారంభించండి. క్షణం వృథా పోవద్దు” అని ఆదేశించాడు కూడా.

“నాకు తమరు తెల్సు కానీ ఇంత దొడ్డ మనసు అని ఇప్పుడు అర్థమైంది” అని నమ్మబలికి వంగి రెండు పాదాలకు నమస్కరించాడు.

పెద్దమనిషి ఆప్యాయంగా లేపి కౌగిలించుకున్నాడు.

“ఇక నువ్వు నాలో భాగం. నిశ్చింతగా ప్రచారం చేసుకో” అని తనుగా కార్యరంగంలోకి దిగాడు మనస్ఫూర్తిగా.

రెండో పెద్ద మనిషితో కూడా రహస్యంగా ఇలాంటిదే మరో పెద్ద నాటకం నడిపాడు. ఆశీస్సులు పొందాడు.

దాని ప్రతిఫలం పెంచలయ్యకు విజేతను చేసింది. అద్భుతమైన మెజారిటీతో గెలుపొందాడు. జిల్లా పార్టీకే ఖ్యాతిగా నిలచాడు.

ఈ యజ్ఞంలో నళినీ రెడ్డి నిర్విరామ కృషి చాలా ఓట్లను సంపాదించి పెట్టింది. పెంచలయ్య ఘన విజయానికి వెనక నుండి ఆవిడే మూల విరాట్టు.

ఇది ఇలా ఉంటే….

అదృష్టం రాష్ట్రాన పెంచలయ్య పార్టీనే వరించింది. అత్యధిక సీట్లు వచ్చినయి.

ఆధిక్యతను ఊహించeరు గానీ మరి ఇలా ఇంత విజయం?

గవర్నరు మంత్రివర్గం ఏర్పాటు చేసేందుకు పార్టీ అధ్యక్షుణ్ణి ఆహ్వనించాడు.

జిల్లాలో గెల్చిన నల్గురిలో పెంచలయ్య యవకుడిగా గాక ఉత్సాహవంతుడు, పార్టీని పటిష్టం చేయగల నేర్పరిగా కనిపించడంతో స్టేటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. దాన్ని ఎప్పుడూ ఊహించలేదు.

జిల్లా అంతా ఆనందోత్సాహాలు నిండినయి.

మంత్రివర్గపు స్థాయికి ఎదిగిన మొదటి జిల్లా వ్యక్తిగా గౌరవమూ దక్కింది. జిల్లా మొత్తంగా గర్వంగా పెంచలయ్య మంత్రిగా ఎదగడంపై చర్చ జరిగంది.

తమ నాయకుణ్ణి సన్మానించకునేందుకై జనం ఉత్సాహాన్ని ప్రదర్శించారు.

అయితే….

టౌను మున్సిపల్ హాలులో మున్సిపల్ చైర్ పర్సన్ నళినీ రెడ్డి ఆధ్వర్యాన జరిగిన సభనే ముఖ్యమైనదిగా చెప్పుకోవాలి.

జనం బాగా తరలి వచ్చారు. కార్యకర్తలు చాలా ఉత్సాహాంగా పాల్గొన్నారు.

సభ కిటకిటలాడింది.

తన కోసం ఎంతెంత దూరాల నుంచో అభిమానంగా వచ్చిన అశేష జనవాహినిని చూసి వినమ్రంగా నమస్కరించాడు. కళ్ల నిండా ఆనందంతో నీరు నిండడంతో తుడుచుకుని గొంతు గద్గదమవగా, చిరు కంపనకు లోనై “పెద్దలారా, పిన్నలారా, అమ్మలారా, తమ్ములారా, ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి? ఇంతటి అభిమానానికి నేను అర్హుడనేనా? నేనుగా మీకు ఏమి చేసానని నన్ను అందలం ఎక్కించారు?” అని ప్రశ్నించి – జనాంతికంగా కలయ జూచి “ఇవి నన్ను ప్రశ్నించుకునేలా చేస్తున్నాయి. ఎంత ఆలోచించినా సమాధానం అందడం లేదు. మిమ్మల్ని మీ అభిమానాన్ని చూస్తుంటే ఈ గుండె ఆగిపోతుదేమో నన్నంత ఆనందం.

మీరు వేసిన దండలు మాత్రం బారాన్ని పెంచినయి. అడుగు కదపలేని స్థితి.

నన్న అర్థం చేసుకోనండి. దండల్ని చూస్తే నాకు చాలా భయం.

మెడన పడిన ప్రతి దండ వెనకా అభిమానంతో పాటు కోరికా ఉంటుంది.

ఎన్ని దండలు తెచ్చారు? జిల్లాలోని పూలన్నీ ఇక్కడకు తీసుకొని వచ్చినట్లున్నారు. నేను మీలా మనిషినే.

ఎంత అధికారం ఉన్నా, హోదా ఉన్నా, తెలివి కల్గిన వానిగా, మంచి వానిగా ఎంత ఆదరం ఉన్నా, ఇన్ని కోర్కెలను తీర్చడం సాధ్యమౌతుందంటారా?” అని అందరికి చేతులెత్తి నమస్కరించి “తీర్చే అవకాశం, శక్తి భగవంతుడు నాకు ప్రసాదించాలని మాత్రం కోరుకుంటున్నాను.

నేను చిన్నవాణ్ణి. చిన్న హద్దుల్ని గీసుకుని జాగ్రత్తగా బతుకు ప్రారంభించిన వాణ్ణి. కోరికల కుప్పలకు భయపడి పారిపోయే వాణ్ణి” అని నవ్వి,

“ఇది మీ ఆనంద సమయం. కనుక” అని నవ్వి…

“ఇక విషయానికొస్తాను. మీరు అభిమానించి నన్ను M.L.A. గా మీరు పంపితే అధిష్టాన వర్గం మీ అభిమానాన్ని ఆదరణనూ నా పైన వుంచిన నమ్మకాన్నీ పరిగణన లోనికి తీసుకొని నన్ను మంత్రివర్గంలో ఆహ్వానించారు.

నాకు మీరు, పెద్దలూ ఆప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహించి మీచే సహబాష్ అనిపించుకోనే ప్రయత్నం చేస్తానని మనవి చేస్తున్నాను.

ఇదేదో గొప్ప గౌరవం అనుకుంటే, అది మరీ మీ అభిమానానికి మొత్తం జిల్లాది. ఇక ముఖ్యంగా మన పార్టీలోని పెద్దలూ, నిష్ణాతులూ అయిని వారికీ, కష్టించి పని చేసిన కార్యకర్తలకు నా మనః పూర్వక నమస్కారాలను తెలుపు కుంటున్నాను.

వారికి బాగా అందుబాటున ఉండి, వారి సలహాలను పాటించి వారి ఆశీస్సులను పొందుతూ జిల్లాలో అడుగును మోపుతానని మనవి చేసుకుంటున్నాను.

మిమ్మల్ని మీ ఆభిమానాన్ని చూస్తుంటే నేనెంత అదృష్టవంతుణ్ణో అర్థమైంది.

నేను మీ వాణ్ణి. ఆజ్ఞాపించండి.” అన్నాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here