నియో రిచ్-17

0
11

[శారదకి రామయ్య గురించి చెబుతుంటాడు జయంతి. రాముడు చిన్నతనంలోనే తల్లి  జైలుకి వెళ్తే ఓ చర్చ్ ఫాదర్ వద్ద పెరుగుతాడు. పెద్దయ్యాకా, అక్కడ్నించి బయటకి వచ్చేస్తాడు. ఒకసారి తల్లి జైలు నుంచి వచ్చి కలిసినా, ఆమెను తనతో ఉండమని అడగడు. ఆమె చెప్పిన గతం విని తనని తాను అసహ్యించుకుంటాడు. బాలాజీ, తులసమ్మ అనే దంపతులు రామయ్యను చేరదీస్తారు. వారి కటిక వ్యాపారంలో చేరిపోతాడు రామయ్య. ఆ దంపతులు రామయ్యను సొంత కొడుకుగా భావించి, అతని కోసం డబ్బులు దాస్తారు. ఒకరోజు కొమరయ్య అనే వ్యక్తి వచ్చి ఇరవై జీవాలను బాలాజీకి అమ్ముతాడు. వాటిలో ముక్కుకు గాటున్న ఒక రోగిష్టి గొర్రె తనదనీ, పొరపాటున ఆ మందలో కలిసిపోయిందని రఘుపతి అనే వ్యక్తి రామయ్యని అడుగుతాడు. బాలాజీని అడిగి చెప్తానంటాడు రాముడు. రఘుపతి సాయంత్రం మళ్ళీ వచ్చి అడుగుతాడు. రోగిష్టి దాన్ని అమ్మకూడదు, నయమయ్యాకా ఇస్తాలే అంటాడు బాలాజీ. రఘుపతి కంగారు చూసిన రామయ్యకు అనుమానం వస్తుంది. కొమరయ్యని కలిసి రఘుపతి గురించి అడుగుతాడు. అతనెవరో తనకి తెలియదంటాడు కొమరయ్య. అనుమానం వచ్చిన రామయ్య ఆ గొర్రెని కోసి చూస్తే దాని పొట్టలో దాదాపు రెండు వందల బంగారు నాణేలు దొరుకుతాయి. బంగారాన్ని దాచి, మంసాన్ని కొట్టుకు పంపిస్తాడు రామయ్య. రెండు రోజులు ఎవరికీ కనబడకుండా వెళ్ళిపోతాడు. బాలాజీ కంగారు పడతాడు. మర్నాడు పొద్దున్నే వచ్చిన రామయ్య గొర్రె తప్పించుకుపోయిందని, ఎంత వెదికినా కన్పించలేదని అంటాడు. రఘుపతి మళ్ళీ వచ్చి గొర్రె ఏదని అడిగితే తప్పిపోయిందని, దానికి డబ్బు ఇచ్చేస్తాడు బాలాజీ. ఆ సమాధానం విని స్పృహ తప్పి పడిపోతాడు రఘుపతి. ఇంతలో ఒక జీపు వచ్చి ఆగుతుంది. అందులోని వారు రఘుపతిని డాక్టరు దగ్గరకు తీసుకువెళ్తాం అని వెంట తీసుకుని వెళ్ళిపోతారు. ఇక చదవండి.]

[dropcap]ఆ[/dropcap] రోజు కొట్టు కట్టేయమని చెప్పి ఇంటికి వస్తుంటే – రఘుపతి వచ్చాడు.

నిజంగా వాడు కనపడగనే రాముడి ఒళ్లు కొంచెం జంకింది.

“ఏమయింది అట్టా అయితివి. ఇప్పుడు బాగానే ఉన్నావు గద” అని పరామర్శించాడు.

తల ఊపి వెంట నడిచాడు రఘుపతి.

“నా గొఱ్ఱె నిజంగానే దొంగల పాలయిందంటావా?” అనడిగాడు రఘుపతి నెమ్మదిగా.

“అబద్ధమెందుకు? పోయింది. మూడు దీనాలు వెతికి ఆశ వదులుకున్నా” అన్నాడు.

మరీ దగ్గర కొచ్చి “దాని జాడ ఇప్పుడు చెప్పినా నీకు వాటా ఇస్తా” అన్నాడు రఘుపతి.

“నాకెందుకు వాటా?” అన్నాడు నవ్వి. గొఱ్ఱెకు వాటా ఏంది అన్నట్లు.

రాముడు నవ్వు చూసాక గొఱ్ఱె చిక్కలేదని నిర్ణయించుకొని వెళ్లాడు.

ఆ తరువాత మళ్లా రాలేదు. బయటా కనపడలేదు. అతని వెతుకులాటకు అది దొరికిందో లేదో ఆ భగవంతుడికే ఎరుక.

నాల్గయిదు నెలలు సజావుగానే గడచినయి.

బాలాజీ ఒకనాడు ‘నలత’గా ఉందని పడుకొన్నాడు. ఆ మర్నాటి నుంచీ అది ‘జ్వరం’గా మారి మంచాననే ఉంచింది. ఊళ్లోని వైద్యుడు “పట్నం తీస్కుపోయి పరీక్షలు చేయించందే సంగతి అంతు పట్టదు” అనడంతో అక్కడికే తీసుకెళ్లాడు. పూర్తిగా చూపించుకొని వైద్యం అక్కడే ప్రారంభించి కాస్త నిమ్మళపడ్డాకనే ఇంటికి తీసుకొని వచ్చాడు. ఈ టైంలో బంగారు కాసుల్ని నగదు చేసాడు రాముడు. ఒక మంచి మందం గల తోలు సూటుకేసు కొన్నాడు. “ఇంత డబ్బు పెట్టి అదెందుకు కొన్నావురా” అని కోప్పడ్డాడు బాలాజీ. అయినా సూటుకేసు తెచ్చి తల్లికి అప్పగించాడు. ఆనక ‘ఈ నెత్తుటి వ్యాపారం మానుకొని మరో దానికి మరలితే ఎట్టుంటది?’ అన్న ఆలోచనలో కొచ్చాడు రాముడు. బాలాజీతో కూడా ఒకసారి కదిలించాడు. “చేస్తున్నది వదిలి వెతుక్కోవడమేట్రా!”  అన్నాడు. కానీ చేస్తున్న దాన్ని నిర్వహించాలన్నా రాముడే గదా, వైద్యం ఎంత ఇదిగా చేయించినా అంతగా గుణం కనిపించని  బాలాజీ వాడి ఇష్టానికే వదిలేస్తే పోతది అన్న ధోరణికి వచ్చాడు.

ఓ ఏడాది తరువాత టౌనుకు తోళ్ళు వేసి వస్తుండగా రఘుపతి కనిపించాడు. గొఱ్ఱె మాట మరచిపోయినట్టుంది. ఆ మాట తేలేదు. పిచ్చాపాటీ మాటాడుకున్నారు. దానిలో భాగంగా “ఓ వ్యాపారం ఉంది చూస్తావా?” అని రఘుపతి అడిగాడు.

“పద చూద్దాం” అని రాముడు వెళ్ళడం జరిగింది.

వ్యాపారం చూపి పార్టీలు చెప్పాడు. బాగా లాభించేదిగనే అనిపించింది. కానీ భయమైంది. ముందు వెనకా ఆడి ఇంటికి చేరాడు.

వారం తరువాత రఘుపతి మళ్లా కనిపించాడు.

అప్పటికి రాముడి మనస్సుకు కొంత స్తిమితం చిక్కింది.

ఇద్దరు కలసి చేసుకునేందుకు అవగాహనకు వచ్చి ప్రారంభించారు.

నాల్గు నెలలలో చేరో ఏభై వేలూ కనిపించింది. దాంతో లారీ ట్రాన్స్‌పోర్టు ప్రారంభించాడు. దానిలో ఎప్పుడూ పడి ఉండేందుకు ‘సుల్తాన్’ అనే బ్రోకర్‌ని ఉంచాడు.

రెండు లారీలు తీసుకున్నాడు (ఒకటి చిన్నది, ఒకటి పెద్దది). ‘ఐస్ ఫ్యాక్టరీ’ నొకదాన్ని అద్దెకు తీసుకున్నాడు. అక్కడికి బాలాజీ తులసెమ్మలను మార్చి దాని బాధ్యత అప్పగించాడు.

అతన్ని ఆఫీసుకు ఇతర ఓనర్స్ బళ్లు ఇంకా అయిదారు రావడంతో సుల్తాన్, రాచయ్య అనే అతన్ని తోడుకు పెట్టుకున్నాడు రాముడి అనుమతి తీసుకొని.

ఈ రాచయ్యది చిత్రమైన కథ.

ఆడ తోడు కావాలనిపించగానే వయసొచ్చిందనుకొని రాచయ్య పెళ్లి చేసుకున్నాడు. భార్య బాగానే ఉండేది. అయితే ఏడాది తిరగకుండానే కనలేక చనిపోయింది. డాక్టరమ్మ అశ్రద్ధ వల్ల పోయిందనుకున్నారు. మాటా మంతి మానుకొని ఊర్కున్నాడు. అయిదో నెలన మరొకావిడను పెళ్లాడాడు. ఈవిడ ఫరవాలేదన్నట్టుగా ఉంది గానీ గుట్టు తెల్సిన మనిషి కాదు, చెపితే వినలేదు. ఆవిడకు తెలీలేదు. దాంతో నరకం అనుభవించాడు. ఆవిడ కోర్కెలను తీర్చలేక ఇంటికి రావడం తగ్గించుకున్నాడు. ఈవిడ ఎదురింటి షావుకారుతో సంబంధం పెట్టుకుంది. రాజయ్యను సాధించడం మానుకుంది. ఇది మారిందా ఏమిటి అని ఆలోచించాడు రాచయ్య. కుటుంబం సజావుగా నడుపుతున్నది. డబ్బు అడగడం మానుకుంది.

ఇది పరువును అమ్ముకుంటున్నదని అర్థమైంది. తలుపు లేసి కేకలేసాడు. విన్నది.

“ఇక అయిందా?” అని అడిగింది. ‘ఏమిటది?’ అనుకుని చిత్రంగా చూసాడు.

“గింజుకోకు. నేను చేస్తున్నది తప్పు. కానీ నావంటి తీట తీర్చుకోనడానికి చేయడం లేదు. నీ సంపాదనతో తిండి ఉంటే గుడ్డకు కరువు. గుడ్డ ఉంటే ఉండే నీడ కరువు వస్తది. నువ్వు నానా చాకిరీ చేసి అర్ధరాత్రి అపరాత్రో వస్తే నీకింత తృప్తిగా పెట్టి నిన్ను సుఖపెట్టాలనే” అంది.

రాచయ్య దగ్గరికొచ్చి “ఇగో తెల్లపోకయ్యా. నువ్వు నెలకింకో మూడొందలు సంపాదించు. నేను పై పని మానుకుంటాను” అని కావులించుకుని ఏడ్చింది. భార్య చెప్పింది విన్నాక నేను భర్తనేనా, పెళ్లాడే అర్హత నాకుందా అనుకున్నాడు. ఆవిడ అర్థమయ్యాక ‘ఛ నేను బ్రతక్కూడదు, దాని తప్పేముంది’ అనుకున్నాడు. కాని చావలేదు రాచయ్య. తను చస్తే అది మరీ దిక్కుమాలినదవుతుందని భయమేసింది.

ఇంతలో అకస్మాత్తుగా షావుకారు భార్య రోగం తీసుకుంటూ, అలాగే ఉండక ‘హరీ’ మన్నది.

దానితో ‘ఇక నాతోనే ఉండు గుళ్లో నీకు తాళి కడతా’ అని ఒత్తిడి ఎక్కువయింది.

రాచయ్య ఇల్లాలు షావుకారు వైపే మొగ్గింది. అతనింటికే చేరింది.

ఇది షాక్‌లా అనిపించింది రాచయ్యకు. నాల్గయిదురోజులు అన్నీ వదిలి ఏడ్చాడు.

‘డబ్బు లేకనే కదా ఇట్టా జరిగింది’ అనుకొని డబ్బు సంపాదించేందుకు నడుం కట్టాడు. నానా రకాల పనులు చేసాడు. ఏడాది కష్టం తరువాత లెక్కచూసుకుంటే పదివేలు వెనకబడి కనిపించనయి, తనున్న ముసలి దాని పాత భవంతి, అది చనిపోవడంతో స్వంతమైంది. ఇక పరవాలేదనుకొని బుద్ధిమంతురాలైన పిల్లను వెతికి మరీ పెళ్లాడాడు రాచయ్య.

ఆరేడు మాసాలు గడిచాయి. ఆనందంగా కాపురం నడుస్తున్నది.

ఒకసారి బాగా దూరాన లారీ ఏక్సిడెంటు అయితే దాన్ని కట్టుకొని రావడానికి వెళ్లాడు. పది పన్నెండు రోజులు పట్టింది. అనుకున్నదాని కంటే రెండు దినాలు ముందు అవడంతో ఇంటికి చేరిపోయాడు అవీ ఇవీ కొనుక్కుని. అయితే బండి బాగా లేటయి తెల్లవారు ఝాము నాల్గంటికి దింపింది. న్యాయానికిది రాత్రి తొమ్మిందిటికి రావాలి.

తలుపు తట్టాడు. ఇల్లాలే తలుపు తీసింది. ఇన్ని రోజుల విరహం ఊర్కోనివ్వలేదు. తలుపులు బిగిస్తూ వాటేసుకుని ముద్దులిచ్చాడు కోరికగా.

అయితే మంచం పైన ఎవరో మగవాడు చీకట్లో కనిపించాడు. చేష్టలుడిగాడు రాచయ్య.

“ఎవరు? ఎవరాడు?” అని లైటు వైసాడు.

“మా మేన బావయ్య. కంగారు పడతావే, రాత్రే వచ్చాడు” అంది. మరో మంచం కనిపించలేదు. అంటే అక్కడేవాని తోటే ఇది. ‘ఛ’ అని తలచాడు. “అతన్నే చేసుకొనక నన్నెందుకు మోసం చేసావు?” అని అరిచాడు జుత్తు పీక్కుంటూ.

మామ అన్న వాడు పక్కగదిన కంగారు పడతుంటే “నువ్వెళ్లకు మామయ్యా, భయపడకు” అంది.

అక్కడే అప్పుడే క్రింద పడేసి చావకొట్టుడు కొట్టాడు.

తెల్లారే సరికి ఆవిడ కిర్సనాయిలు పోసుకొని నిప్పంటించుకుంది. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయింది.

నెల రోజులు ఒంటరిగా ఇంటనే ఉన్నాడు రాచయ్య.

నాల్గయిదు సార్లు పోలీసులు స్టేషన్‍కు తీసుకుపోయి మాటాడి పంపారు.

ఆనక డ్యూటీ లోకొచ్చాడు.

డ్యూటీకి ఎక్కాక నెల తిరిగకుండానే పాతికేళ్ల వయసున్న మరో ఆడకూతురు రాచయ్య ఇంట కనిపించిది.

ఎవరీవిడ అని అడిగారు.

రాచయ్య చెప్పాడు. “నా రెండో  భార్య అక్క. ఈవిడ భర్త యాక్సిడెంటులో పోయాడు. నాకు వండి పెట్టే దిక్కు లేదు గదా, రమ్మన్నాను. వస్తూ ఉంటున్నది” అన్నాడు.

అయితే నాల్గో నెలలో పగలు ఇంటికి చేరేసరికి రాముడనే లారీ ఓనరు, అతని స్నేహితుడూ లోన కూర్చుని మందు త్రాగుతూ కనిపించారు. ఇది నా యిల్లేనా అని అనుమానపడ్డాడు గాని తనదే అని నిగ్రహించుకొని మంచి నీళ్లు అడిగి త్రాగి వెళ్లిపోయాడు రాచయ్య.

ఇతని ప్రవర్తన భయపెట్టింది అక్కడి వారందరినీ.

నెల రోజుల తరువాత రాచయ్య ఇంట ఆవిడ మాత్రం కనిపించలేదు.

ఎటు వెళ్ళిందో ఎవ్వరికీ తెలీదు. అడిగే ధైర్యం లేక ఎవ్వరూ అడగలేదు.

సీతారామాంజనేయ లారీ ఓనరు లారీ మీద ‘పాంట్యం’ దగ్గరకు వెళ్లాడు.

వాని భార్య సినిమాకు వెళ్లడం కనపించి ఆటోలో అక్కడికెళ్లాడు.

ఎక్కించుకుని తన ఇంటి దగ్గర ఆపాడు. “మంచి నీళ్లు త్రాగి పోదురుగాని” అని లోనకు తీసుకెళ్లాడు. తలుపులు మూసాడు. గమనించిందావిడ. మంచి నీళ్లు త్రాగింది గాబరా పడక. “ఇక వెళ్దాం” అంది లేచి. మాటాడలేదు రాచయ్య.

“నన్ను అవమానించి ప్రతీకారం తీర్చుకుంటావా?” అడిగింది నిబ్బరంగా.

“అనుభవిస్తాను. అవమానమూ ప్రతీకారమూ రెండు తీరతయి” అన్నాడు.

“ఇద్దరూ మనస్పూర్తిగా కలిస్తే దొరికేదే సుఖం. నెమరు వేసుకునేందుకు పనికొస్తది” అంది నవ్వుతూ.

“నా పగ చల్లారాలంటే నిన్న బలిమిననైనా..”

“బలవంతంగా ఎందుకు కలువు – అనుకున్నది చెయ్యి, అనుమానాలను వదిలెయ్యి” అంది.

పైగా ఓ అడుగు మందుకు వచ్చి ఆగింది.

రాచయ్యను ఆవిడ సమాధానం తిక్క తిక్క చేసింది. ఆ తిక్క దిగకముందే వచ్చి ఆవిడను వాటేసుకున్నాడు. ఆవిడ అడ్డు చెప్పలేదు. సహకరించింది.

రాచయ్య లేచాక “ఇక నేను వెళ్లొచ్చా” అంది.

తల అడ్డంగా ఊపాడు.

“మంచిది” అని కూర్చుంది.

మరో అరగంట తరువాత మళ్లా.

“ఇక వెళ్తాను” అని లేచింది.

“పో పో” అని గట్టిగా అరిచాడు.

వెళ్ళబోయిందల్లా రాచయ్య దగ్గర కొచ్చి అకస్మాత్తుగా ముద్దులిచ్చి “రాచయ్యా నిన్ను చూస్తే జాలేస్తున్నది. నిజంగా దురదృష్టమేదో నిన్ను వదలక పీడిస్తున్నట్టుంది. లేకుంటే ఇంత మగసిరి కల్గిన నిన్ను ఇందరు వదలి వెళ్లడమేంటి?” అని వెళ్లిపోయింది.

మర్నాడు గాని ఇంటి నుంచి బయటకు రాలేదు రాచయ్య.

చాలా సిగ్గుగా అనిపించింది.

కానీ, ఆవిడ ఇచ్చిన సర్టిఫికెటు కొండంత బలాన్ని ఇచ్చింది.

మళ్లా ఓ విధవరాల్ని తీసుకొచ్చాడు. పేరు కాంతమ్మ. ఆవిడ భర్త నాల్గు సంవత్సరాల కాపురం తరువాత ఏట్లో పడి చచ్చాడు. ఆవిడ వయసిప్పుడు ఇరవై అయిదు పైన ముప్పై లోపు. ఒకనాడు రాచయ్య భోజనానికి వచ్చే సరికి ఇంటికి తాళం పెట్టి ఉంది. ప్రక్క వాళ్లకు తాళం చెవి ఇచ్చి చెప్పి వెళ్లిందట.

లోనకెళ్లాక ఓ కాగితం కనిపించింది.

చదివాడు.

“ఇక్కడ నాకు ఉండాలనిపించడం లేదు. వెళ్తున్నాను. వెతకద్దు. కనిపించినా ఇక నీతో రాను” అని ఉంది.

రాచయ్య పరిస్థితి తేలుకుట్టిన దొంగలాగ అయిపోయింది.

ఆడాళ్ల జోలిని వదిలి ఇక సంపాదనపై బడ్డాడు. దానిలో భాగంగానే సుల్తానుతో చేరాడు. ఇద్దరు కలిసి అఫీసును చక్కగా నడుపుతున్నారు. రాచయ్య సంపాదన కొత్త పుంతలు తొక్కసాగింది.

ఇది ఇలా నడుస్తుంటే రాముడు రఘుపతి కోసం కబురు పెట్టాడు. ‘ఎంత కష్టమొచ్చినా పరవాలేదు, నే చూసుకుంటాలే’ అనే రాముడు ‘వెంటనే రావాలి’ అనడం విశేషమే గదా.

ఆఘమేఘాలపై వెళ్లి రాముడి సన్నిధిన వాలాడు. అయితే అక్కడ ఒక అపరిచిత వ్యక్తితో తాగుతూ మాటాడుతుండడం ఆశ్చర్యపరిచింది. “రఘుపతీ రా” అని పిలిచి ఎదుటి వ్యక్తని పరిచయం చేసాడు. అతన్ని శివాజీ అంటారనీ, కలప కాంట్రాక్టరని చెప్పి “మనం ముగ్గురం కలిసి కొన్ని పనులు చేయాలి” అన్నాడు నవ్వుతూ.

తల ఊపాడు రఘుపతి.

“ఇతని పద్ధతి చూసాక విన్నాక నాకు నచ్చింది. కనుక ఈ project లో మనం ముగ్గురం సమాన వాటాదార్లం” అన్నాడు.

తల ఊపాడు రఘుపతి.

ఆనక శివాజీ తన జీపులో వెళ్ళిపోయాడు.

అలా ప్రారంభమైంది వారి వ్యాపార కలయిక.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here