నియో రిచ్-18

0
10

[ఒకరోజు కొట్టు కట్టేసే సమయానికి రఘుపతి వస్తాడు. అతన్ని చూడగానే రాముడు కాస్త జంకుతాడు. తన గొర్రె గురించి మళ్ళీ అడుగుతాడు రఘుపతి. దాన్నెవరో ఎత్తుకుపోయారనీ, మూడు రోజులు వెతికి ఆశ వదులుకున్నాననీ చెప్తాడు రాముడు. తర్వాత బాలాజీకి జబ్బు పడితే వైద్యం చేయిస్తాడు రాముడు. కటిక వ్యాపారం మానేసి మరో వ్యాపారం చేద్దామని అంటాడు రాముడు. నిర్ణయాన్ని రాముడికే వదిలేస్తాడు బాలాజీ. కాలక్రమంలో రాముడు లారీ ట్రాన్స్‌పోర్టు వ్యాపారంలోకి దిగి రాణిస్తాడు. ఒక ఐస్ ఫ్యాక్టరీని అద్దెకు తీసుకుని బాలాజీ, తులసమ్మలకు దాని బాధ్యత అప్పగిస్తాడు. రాముడి దగ్గర పని చేసే రాచయ్య గురించి చెప్తాడు జయంతి. కొన్నాళ్ళ తరువాత రఘుపతి రాముడిని పిలిచి శివాజీని పరిచయం చేసి తాము ముగ్గురం కలిసి కలప వ్యాపారం చేద్దామని, ముగ్గురం సమాన వాటాదారులని చెప్తాడు. కొత్త వ్యాపారం మొదలవుతుంది. ఇక చదవండి.]

[dropcap]“రో[/dropcap]జ్ వుడ్‍ను అక్రమంగా బయటకు చేరవేయడంలో వారి స్నేహం బాగా బలపడింది.

ఇప్పుడు రాముడు ‘లక్ష్మి సినిమాహాలు’ యజమాని. రెండు వందల కంపెనీలలో పెద్ద పార్టనర్ బాలాజీ. సాల్వెంట్ లో MD. ఇక మద్రాసు, కలకత్తా, బొంబాయి, ఢిల్లీ నగరాలలో స్వంత ఇళ్ళు ఉన్నాయి.

ఇక రఘపతి సినిమా డిస్ట్రిబ్యూటరు. సుగంధ ద్రవ్యాలు ఎగుమతులు అనేక దేశాలకు చేస్తున్నాడు.

ప్రపంచాన్ని ఈ వ్యాపారం పేరుతో రెండు సార్లు చుట్టి వచ్చాడు. ఈ మధ్య భద్రాద్రి బ్యాంక్ అని ఒక బ్యాంకు తెరిచాడు. తమకున్న నల్ల డబ్బుంతా బినామీ పేర్లతో షేర్స్‌గా వ్రాసుకొని ఐ.టి.కి అర్థం గాకుండా, చేయవచ్చు గదా. అందుకే ఆ బ్యాంకు.

బాగా దాన ధర్మాలు చేస్తాడనీ అనేక స్వచ్ఛంద సంస్థలను ఆదుకుంటాడనీ పేరున్నవాడు. నలభై ఏళ్లు దాటినా పెళ్లి మాత్రం చేసుకోలేదు.

వివాహంతో వచ్చే సుఖం అతనికి అందుబాటులో ఉంటుంది కనుక అని కొందరు, ఆడంగి వాడని కొందరు అనుకుంటారు.

రాజ్ అనే కుఱ్ఱాడిని మాత్రం అనాథాశ్రమం నుంచి తెచ్చి పెంచి కొన్ని శాఖలను చూసుకోనే బాధ్యతలను అతనికి అప్పగించాడు.

అతనికి సువర్చల అనే బ్రాహ్మణ పిల్లతో ప్రేమ వివాహం జరిగాక తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు” అని ఆగాడు జయంతి.

ఆ రాత్రి మత్తుగా గడిచి, తెల్లారింది. లేస్తూనే శారద ఇంకా ప్రక్కలోనే ఉండడం గమనించి ముద్దులతో లేపాడు.

చికాకుగా మొఖం పెట్టి లేచింది. దూరం జరిగాడు జయంతి.

శారద లేచి వెళ్తంటే “ఇవ్వాళ నేను ఖాళీగా ఉంటాను. నువ్వు రడీ అయితే ఎటైనా వెళ్దాం” అన్నాడు.

తల ఊపింది శారద వెళ్తూనే.

“All right. పది నిముషాలలో వస్తాను” అని కారెక్కాడు జయంతి.

కారు వెళ్లాక ‘రవి’ వచ్చాడు.

ఫ్రిజ్ లోంచి ‘ఐస్ క్రీమ్’ ఇచ్చింది.

నాన్నా హైద్రాబాదు వెళ్లాడని చెప్పాడు.

శారదను కొంచెం సేపు చూసి “నీలో మార్పు ఉంది” అన్నాడు.

చెవి పట్టుకుని “ఇది చెప్పడానికా వచ్చింది” అంది నవ్వుతూ.

“కాదు ఫోనులో నాన్నగారు రాత్రి వస్తానని రాగానే జయంతిని కలవాలనీ ఉండమనీ చెప్పారు. అది చెప్పిపోదమనీ”.

“ఫోన్ చెయ్యచ్చుకదా”.

“చేసాను. ఎవరూ ఎత్తలేదు”.

“ఇక్కడే ఉన్నంగదా?”

తల ఊపి “నాకింకో ఐస్ క్రీం ఇవ్వు” అన్నాడు.

“బావుందా?”

‘బాగాలేంది రెండోది అడుగుతారా?’ అన్నట్లుగా చూసి నవ్వాడు.

తెచ్చి ఇచ్చింది.

దాన్ని తింటూ “తిండిబోతులా కనిపిస్తున్నానేంటి?” అన్నాడు.

“అలా అన్నానా?”

“అనాల్నేమిటి?”

“మరి”.

“కావాలని అని అడిగావా లేదా?”

“అడిగాను.”

“అంటే”.

“పొరపాటయింది బాబూ” అంటుండగానే జయంతి కారు లోనికొచ్చింది.

“అవధాని గాని నగేష్ గానీ వచ్చారా?”

“లేదు.”

“చక్రపాణీ?”

“రాలేదు”

“Any phone?”

తల అడ్డంగా ఊపింది.

“నిన్ను తయారయి ఉండమన్నాగదా? ఇదేనా? నువ్వు ఎవరిననుకుంటున్నావు? The wife of business magnet of the town Sri Jayanthi Lal MAKHANLAL RATHOD” అన్నాడు భుజం నొక్కి.

“నాకు ఎక్కడికి రావాలని లేదు.”

“అయితే పన్నెండు గంటలకయినా రడీగా ఉండు. Spartacus సినిమాకు వెళ్దాం.”

కొంచెం మెత్తబడింది.

దగ్గర కొచ్చి “please” అన్నాడు.

అన్నట్లుగానే వెంటనే నీటుగా బయటకొచ్చింది.

అట్లాగే చూస్తూ ఉండిపోయాడు జయంతి. దగ్గరకొచ్చి నడుంపై చేయి వేసి దగ్గరగా జరుపుకొని “ఇక సినిమాకు వెళ్దామా?” అన్నాడు

“వెళ్దాం, సినిమాకనే నేను వచ్చింది” అని కొంచెం వెనక్కి జరిగింది.

“అవును కదూ, పద” అని నడిచాడు.

బయట పనులు చూసుకొని రవిని వాళ్ల ఇంట్లో దింపి సినిమా హాలుకొచ్చారు.

మెయిన్ సినిమా అప్పుడే వేసారు.

ఇంటర్‌వెల్‌లో అవధాని కనిపించి విష్ చేసాడు. దగ్గరికొచ్చి మాటాడి వెళ్లి కూల్ డ్రింక్స్ పంపాడు. సినిమా వదిలాక కారు దాకా వచ్చి ఎక్కించి వెళ్లాడు.

ఇంటి దగ్గర దిగాక ఇంత తిని అనాలోచితంగా పక్కెక్కాడు జయంతి.

లేచే సరికి ఆరు గంటలయింది. లేచి రడీ అయి అవధాని కోసం కొద్ది సేపు ఆగి బయలుదేరబోతుండగా అవధాని కారు వచ్చి ఆగింది.

అది చూసి శివరాంకు ఫోను చేసాడు. లేడని చెప్పింది పార్వతి. “రాగానే రింగ్ చేయమను” అని పెట్టేసాడు. అవధాని వెంట పాతిక సంవత్సరాలలో కొస్తున్న అందంగా నాజూకుగా ఉన్న అమ్మాయి దిగింది. గ్రేస్‍ఫుల్‌గా విష్ చేసింది. ఆవిడ పెదవులపైన చెరగని నవ్వు బాగా ఆకట్టుకుంది. ఇద్దరినీ కూర్చోమని..

“మన మాటల్లో ఈవిడ ఉండడం అవసరమా?” అడిగాడు నవ్వుతూ జయంతి.

“అది మన ఇష్టం” అన్నాడు అవధాని తేలికగా.

“అలాంటప్పుడు నాకు తెలీకుండా తీసుకొచ్చావుగదా?”

“Sorry” అని, “మేనకా నువ్వ వెళ్లు. దిగి కారు పంపు” అన్నాడు.

“మంచిది” అని లేచి అదే చిరునవ్వుతో వీడ్కోలు తీసుకుంటున్నట్లుగా వెళ్లింది.

‘సభ్యత తెల్సిన పిల్ల’ అనుకున్నాడు జయంతి. Relaxed గా కూర్చుంటూ – కూర్చున్న అవధానిని చూసి “ఇక మొదలెడతాను” అని “నా కొత్త Businessలో మీరు 40% కాపిటల్ పెట్టబోతున్నారు” అన్నాడు నవ్వుతూ జయంతి.

“50% కావాలన్నా రడీ క్యాష్ ఉంది. కానీ  white money కాదు. మీరు దాన్ని మీ అనుకూలతను బట్టి వాడుకోండి.”

“ఆలోచిస్తాను.”

“మీరు దానికి ఎలా పెడతారు అన్నది సమస్య కానే కాదు. IT వాళ్లు నన్ను వేటాడుతున్నారు. వారి అంచనాలను మించి నా దగ్గర గుప్త నిధి ఏదో ఉందని వారి భావన. వాస్తవానికి గుప్త నిధి కాకున్నా ఎక్కువగానే ఉండచ్చు కూడా. సినిమా హాలే ఉంది, దానిలో వాటా 12 లక్షలు. కాని వినియోగించింది నలభై లక్షలు. దాన్ని అమ్మితే ఇప్పుడు మన చేతి కొచ్చేది అరవై పైనే ఉంటుంది. భానోజీ అనే సారా కాంట్రాక్టరు, నేను సూపరిండింటెంటుగా ఉన్నప్పుడు ఘోషామహల్ దాపున ఎకరంన్నర స్థలం, దానిలో పాడుబడిన బంగ్లా కొన్నాం. అప్పుడు దాని రేటు పది లక్షలు. అప్పుడున్న అక్కడి రేటు ప్రకారం ఆరు లక్షలకు రిజిష్టరు చేయించుకున్నాం, అదీ నలుగురు పేర.”

“ఎవరా నల్గురు? అడిగాడు జయంతి.

“మేం ఇద్దరమే, మిగిలినవి బినామీ పేర్లు. అసలా పేర్లు గల్గిన వాళ్లు లేరు. ఆ నల్గురివీ నామినీ వాటాలు గాదు. మరి ఇప్పుడు దాన్ని భానోజీ అమ్మేసుకున్నాడు. పదమూడు లక్షలకి. నల్గురికి. కొంత కాలం అయింది.”

“ఇలా అన్నం నీళ్లూ లేకుండా డబ్బు పెరుగుతూనే ఉన్నది. మనం బ్రతుకులో ఎంత పాపం చేసినా ఇంత తొందరగా అదీ పెరగదేమో?” అని నవ్వి “నేను A.E.S. గా ఉన్నప్పుడు ఓ మంచి మనిషి, కాంట్రాక్టరుకి సాయం చేసాను. అతగాని భార్య మా అవిడకు పాతిక తులాల బంగారంతో వడ్డాణం చేయించి ఇచ్చింది. దాన్ని చూసాక పెద్ద కోడలుకు చేయించాను నేను. అప్పుడు బంగారం ధర చాలా తక్కువ. ఇంట్లో మగా ఆడా తేడా లేకుండా ఎవరు ఏది కావాలంటే అది చేయిస్తూ పోయాను. అలా పేరుకుపోయిన బంగారం మొత్తం రెండున్నర కిలోలు సుమారుగా ఈజీగా ఉంటుంది.”

“మరి ఇప్పుడు దాని ధర?”

“నేను S.E.S ఉన్నప్పుడు నా జీతం కటింగు పోను నాల్గువేల చిల్లర. మరి నాకు నెలకు వచ్చిన మామూలెంతో తెలుసా, నెలకు లక్ష. నా  సర్వీసు 12 సంవత్సరాలు. ఆ పోస్టులో అంటే 144 లక్షలు. ఇది నా జీతంగాక వచ్చిన డబ్బు. ఈ పైకం సాలీనా వస్తుంటే ఊర్కే ఉంచం గదా, అదీ పెరుగతానే ఉంటుంది. ఇంత ఉండి ఈ IT వాళ్ల మూలాన భయంగా బ్రతకాల్సి వస్తున్నది. ఈ డబ్బు అంతా నీకే అప్పగిస్తాను. ఎలా షేర్స్‌లో పెడతావో నీ యిష్టం.”

“రిటైరయ్యకా సారా వ్యాపారం ఎందుకు చేసినట్టు?” అడిగాడు జయంతి.

“జయంతీ, ఈ ఎందుకు అన్నది అంత త్వరగా అర్థమయ్యేది కాదు. ఇది నాకు తెల్సిన వ్యాపారం. పది మందిని బ్రతికించవచ్చు. అదనంగా నేను ఇందులో శ్రమ చేయాల్సిన పని లేదు. పైగా ఈ డిపార్టమెంట్‍న రిటైరయిన వాణ్ణి గనుక ఉద్యోగస్థులంతా నా పట్ల బావుంటారు, కనుక వ్యాపారం సులువుగా సాగుతుంది. అందువల్ల దానిలో నష్టం చూపుదామన్నా కుదరలేదు” అని నవ్వి “ఈ కొత్త డబ్బును భయంలేని డబ్బుగా మార్చేందుకు ఏం చేస్తావో ఎలా చేస్తావో ఎలా ఖర్చు పెడ్తావో నీ ఇష్టం.” అన్నాడు

“మరి నా వాటా సంగతి?”

“నీ యిష్టం.”

“అంటే?”

“నువ్వు ఉంచుకోన గలిగింది ఉంచుకో..”

“నేను భరించేదిగా ఉండాలిగదా”

ఉలిక్కిపడ్డాడు అవధాని. జయంతిని నిశితంగా చూస్తూ “నువ్వు ఇరుకున్నావా IT లో?” అన్నాడు.

హాలు ఎగిరిపోయేలా నవ్వాడు జయంతి.

ఆ నవ్వుకు అవధాని వెన్నుపూసలో చలి పుట్టింది.

నవ్వి నవ్వి ఆగాడు జయంతి.

ఇంత పెద్దగా జయంతి నవ్వడం శారద ఇప్పటి దాకా వినలేదు.

చిత్రంగా అనిపించి ఓసారి తొంగి చూసి వెళ్లిపోయింది శారద.

బెల్ నొక్కాడు. పనిమనిషి వచ్చి నిలబడ్డాడు.

నాల్గు టిన్ బీర్‍లు పట్రా” అని, “అవధానీ నీకు నేనెప్పుడైనా ఫలానా బాధ ఉంది అని చెప్పానా?” అన్నాడు.

“లేదు”

“అంటే”

“నాకు తెలియాలి గదా?”

“చెప్పనా? విను. తన పని బాగా చేసుకోలేనివాడు లోకులకు సాయపడలేడు. నేనెమిటో నాకు తెలీడంతో సరిపోదు. మన సంగతి ప్రభుత్వానికి ఎంతో కొంత తెలిసే ఉంటుంది. అయితే అదృష్టమేటంటే మనకంటే మన వాళ్ల పైన ఈ ప్రభుత్వాలకు తెలీదు. వాళ్లు కాలూన లేని చోట చాలా మిగిలిపోతున్నది. ఆ బాపతు నాకు కొంత తెల్సు. అంచేత నాకు నేను సేఫ్టీగా ఉండి మెలుగుతున్నాను. నిన్న అదే మార్గాన నడిపి, చేరేసే ప్రయత్నం చేస్తాను.”

తృప్తిగా తల ఊపాడు అవధాని.

బీర్, కాజూ, దాల్, చిప్స్ టేబుల్ పైకి వచ్చనయి. ఇద్దరూ ఓపెన్ చేశారు.

మూడు బీర్లు కాగానే మరో మూడు వచ్చినయి. ఆనక మరో మూడు. అవధాని అదోలా తనలో తాను నవ్వుకొని “జయంతీ నేను బ్రాహ్మణ్ణి. మా తండ్రి బాగా నిష్ఠాగరిష్టుడు. మరి ఆయన కున్న ఆస్తి ఏమిటో తెలుసా?  నిలువ నీడ లేదు, ఓ గుడికి ఉన్న రెండెకరాల మాన్యాన వచ్చే కౌలు గింజలు కానుకలూను. అయితే దాదాపు పది గ్రామాలకు పౌరోహిత్యం నెరపేవాడు. ఆయన నోటి మంచితనంతోనే మా ఇద్దరి అక్కలకూ పెళ్లిళ్లు చేసాడు, నన్ను చదివించాడు, ఉద్యోగస్థుణ్ని చేసాడు.

నా తండ్రి  చివరి నిముషం దాకా అంత గౌరవంగానే కాక అంత నిష్ఠ గానూ బ్రతికాడు. ఆయనకు బాధలంటూ ఆవేళ లేవు. ఇవ్వాళ లేవు. ఆనందంగా ఉంటాడు. మరి అట్టాటి తండ్రి కడుపున పుట్టిన నాకీ బాధ ఏమిటి.  సంపాదనేమిటి. బొత్తిగా అర్థం కావడం లేదు” అని విచారంగా కూర్చుని “ఇంకా తెప్పించు” అన్నాడా బ్రాహ్మడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here