నియో రిచ్-19

0
11

[రఘుపతి, రాముడు, శివాజీల వ్యాపారాలు ఎదుగుతాయి. బాలాజీని కూడా పైకి తెస్తాడు రాముడు. ఆ రాత్రి గడిచి తెల్లారుతుంది. పొద్దున్నే లేచిన జయంతి తయారై పది నిమిషాల్లో వస్తానని శారదకి చెప్పి వెళ్తాడు. అంతలో రవి వస్తాడు. జయంతి తిరిగి వచ్చి ‘అవధాని గాని నగేష్ గానీ వచ్చారా’ అని అడుగుతాడు. ఎవరూ రాలేదని చెప్తుంది శారద. జయంతి శారద సినిమాకి వెడతారు. ఇంటర్వెల్‍లో అవధాని కన్పించి విష్ చేస్తాడు. మర్నాడు ఉదయం అవధాని జయంతి ఇంటికి వస్తాడు. అతనితో పాటు వచ్చిన మేనక అనే యువతిని పంపేయమంటాడు జయంతి. ఆమె వెళ్ళిపోయాక, ఇద్దరూ వ్యాపారం గురించి, నల్ల ధనం గురించి, ఇన్‍కమ్ టాక్స్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. తన తండ్రి గురించి చెప్తాడు అవధాని. తాగుతూ మాట్లాడుకుంటారు ఇద్దరూ. ఇక చదవండి.]

[dropcap]“ఇ[/dropcap]దేనా, విస్కీ కావాలా?” నవ్వుతూ అన్నాడు జయంతి.

“విస్కీయే తెప్పించు. నిభాయించుకోగలను” అని నవ్వాడు.

విస్కీతో బాటు సోడాలు, ఐస్ బాక్సూ తెచ్చిపెట్టాడు నౌకరు.

రెండు గ్లాసులూ నిండినయి. పెదాల్ని తాకినయి.

గ్లాసు చివరి తగిలేదాకా గటగటా మ్రింగిన అవధాని తల విదిలించి “జయంతి నేను ఒక సారి ప్రేమగా బంగారు మొలతాడు చేయించి పట్టుకెళ్ళా, కన్న తండ్రి పాదాలకు నమస్కరించి ఇచ్చాను. ‘ఏమిట్రా ఇదీ’ అన్నాడు. ‘మొలతాడు నాన్నాగారూ. ఆరున్నర తులాలలో చేయించాను. మీకోసం’ అన్నాను ఉత్సాహంగా. దాన్ని అలాగే పట్టుకొని ‘ఏమేవ్’ అని పిలిచాడు. మా అమ్మ వచ్చింది. ఆవిడకు చూపాడు వేదాంతిలా నవ్వుతూ.. ఆనక ‘అవధానీ’ అని పిలిచి అదోలా చూసాడు నన్ను. ఆ చూపు భయాన్ని కల్గించింది. ‘పరిమితులు దాటి ఆర్జించినవాడు అడుక్కుని తినేవాని కంటే అధముడు నా దృష్టిలో’ అన్నాడు. నాకు అలవిమాలిన కోపం, ఉక్రోషం వచ్చింది. చాలా కష్టంగా నిగ్రహించుకున్నాను. లేచి దాపునకొచ్చి నా భుజం పై చేయివేసి ‘నా వయసెంతో తెలుసా?’ అన్నాడు.

‘డెబ్భయి కొచ్చారు’.

నవ్వి. ‘బాగానే గుర్తుంది. కొన్నిటిని మరచిపోలేం. మరచినా అవే చెబుతాయి’ అని కళ్లు మూసుకొని ‘మనిషి వయో పరిమితులు కూడా నీకు తెల్సు’ అని ఆగాడు.

‘నూరు’ అన్నాను ఏమిటి ప్రశ్నలు అనుకుంటూనే.

‘అరవై దాటినవాడు వానప్రస్థానికెళ్ళాలి అవునా?’

‘మన ధర్మం’ అని తల ఉపాను.

‘నీకిదీ తెలుసు’ అన్నట్లు చూసి

‘మరి ఇప్పుడు ఇది నాకు అవసరమని నీకేలా అనిపించింది’ అని అడిగాడు.

మాటాడలేదు నేను.

‘చాలా ఆలస్యమైంది కదూ. నా మొలనున్న నూలు తాడే తెగే దశలో ఉంది. ఇప్పుడు బంగారంది’ అని నవ్వి. ‘అపనవ్యంగా ఉంటుంది. నీ కోరిక ప్రకారం ఉంచుకుంటాలే పో. నేనిక్కడ ఎప్పుడో గుట్టుకుమంటాను. నువ్వెక్కడో ఉంటావు. ఈ బంగారం కోసం తన్నుకొని నన్ను అనాథగా మిగులుస్తారు’ అని పెద్దగా నవ్వాడు.

మారు మాటాడక నేను దాన్ని జేబులో వేసుకున్నాను. నేరస్థుడిలా లేచి వచ్చాను.

ఆయన్ని నేనుగా ఎప్పుడైనా బాధించానా అన్న ఆలోచన మెదిలింది.

అలాంటి గుర్తు నాకు లేదు. నిజంగా లేదు కూడా.

ఆయన్ని చూస్తే దుఃఖం ఆగలేదు. ఆయన కాళ్లు పుచ్చుకొని ‘కనీసం నాతో ఉండకూడదా నాన్నగారూ’ అనడిగాను. ‘నే బ్రతికి వుండగా నా ఏ క్రతువూ ఆగరాదు. బ్రతికుంటే ఈ బాపడు ఎక్కడికి వెళ్తాడయ్యా అనుకుంటారు.

పైగా వాళ్లు నన్నంతగా అభిమానించి ఆరాధించిన వాళ్లు. నాకు తల్లిదండ్రుల లాంటివారు.’

‘వారిచ్చిన శక్తితోనే నేనింకా తిరుగాడుతున్నాను. నాకు ఎటూ రావాలని లేదు.’ అన్నాడు.

‘పైగా నా తండ్రీ ఆయన తండ్రీ ఇక్కడే చివరి నిముషాలు గడిపారు. నేనూ ఈ మట్టిలోనే కలుస్తాను’ అన్నాడు.

ఇక ఏం మాటాడాలో నాకు తోచలేదు. ఆ పూట ఉండి తిరిగి వచ్చాను” అంటూనే బాటిల్ తీసి గ్లాసులో వంపుకున్నాడు. చివరి డ్రాపులు తప్ప మందు కనిపించలేదందులో. కాజూ ప్లేట్లు ఇంకో రెండు బయటకొచ్చినాయి. ఖాళీ అయినయి.

“అవధానీ మీ నాన్న సంగతి ఇప్పుడెందుకు చెప్పావు?” అన్నాడు జయంతి.

శారద మళ్లీ ఒకసారి తొంగి చూసి వెళ్లిపోయింది.

జయంతి ప్రశ్నకు నవ్వాడు అవధాని. అది నవ్వులా లేదు కాని నవ్వే.

తనలో తాను నవ్వుకుంటున్నట్టుగా మొదలయిన ఆ నవ్వు తెరలు తెరలుగా పెద్దదయి పొర్లి పొర్లి విరగబడి నవ్వాడు. కళ్లల్లో ఉబికిన నీరు క్రిందకు దొర్లిందాకా. అంత తాగిన వానిలా లేడు.

జయంతి చిత్రంగా చూసాడు అవధానిని, వీడిదే బాపన పుట్టుక అనుకుంటూ.

కొద్ది సేపలగా నవ్వి.. ఆగి “జయంతీ ఈ లోకంలో పాపత్ముడైన వాడు కడు పేదవానిగా పుడతాడనీ; బ్రతుకంతా సుఖశాంతులు లేక నానా బాధలూ పడతాడనీ; దయనీయంగా బాధల వలయంలో చిక్కుకొనే చస్తాడనీ అంటుండగా చాలా సార్లు నేను విన్నాను.

అట్టాటి నమ్మకం మన వాళ్లకుంది. నేనుగా సంపాదన ప్రారంభించినపుడు నేను పూర్వజన్మ సంచితాన చాలా పుణ్యం చేసుకొనబట్టే ఇలా సంపాదించే అవకాశాన్ని భగవంతుడే నాకు కల్గించాడని ఆనందపడ్డాను. చాలా సార్లు నా సంపాదన నాకే చాలా గర్వంగా దండిగా అనిపించడం నాకూ తెల్సు. దానితో పాటు సంపాదించలేని వాణ్ణి, సంపాదించే అవకాశం ఉన్నా మిన్నకున్నవాణ్ణి, అసలు సంపాదననే అదోలా చూసే వాణ్ణి – నేను చాలా తేలికగా చూసాను. కడు హీనంగా కూడా. అసమర్థునిగా గజ్జికుక్కను చూసినట్టు చూసిన సందర్భాలూ ఉన్నాయి. మరి ఇప్పుడు జయంతీ, అదే గజ్జికుక్క నన్ను చూసి అవహేళన చేస్తందేమోనన్న భయం, దిగులు వదలడం లేదు. పైగా అక్రమ సంపాదన పేరిట శ్రీకృష్ణ జన్మస్థానాన్నీ చూడాల్సి వస్తుందేమో?”అంటూండగా..

“అవధానీ ఆగు. నువ్వు సంస్కారి కడుపున పుట్టావు గనుక జైలులోకి వెళ్తేప్పుడు కూడా శ్రీకృష్ణ జన్మస్థానం అన్న తృప్తి అన్నా మిగులుతుంది. అనేక మందికి ఆ యోగమూ, అవకాశమూ రాదు” అని అరక్షణం ఆలోచనల్లోకి వెళ్లి “అవధానీ ఓ మాట చెప్తా విను” అన్నాడు.

తల ఊపాడు అవధాని, కళ్లు మూతలు పడుతుంటే.

“అవధానీ మనం ఉన్న ఈ సమాజాన మనమే చీడపురుగులం. ఆవేశంలో ఒళ్లు తేలీక ఎదుటి వాణ్ణి చంపినవాడు హంతుకుడు కాడు. నందనవనంలా మార్చుకొని సుఖపడాల్సిన సమాజాన్ని మన మన స్వార్థాల కోసం నిత్యం చంపుతున్న మనం నిజమైన హంతుకులం.

ఇరవై రూపాయలిచ్చే కూలి సరిపోయిన రోజులు పోయి వంద ఇచ్చినా కట కట పడుతున్న స్థితికి వాడెందుకు వచ్చాడనుకున్నాడు? అయిదొందలూ చాలని రోజు వస్తుంది.

రెండు వేల ఊద్యోగస్థుడు ఐదు, నాలుగు వేలు లంచం పుచ్చుకుంటున్నా తృప్తిగా బ్రతకలేకపోవడం ఎందుకో తెలుసా?

కార్మికుడు రెండో షిప్టు పని చేసినా పిల్లలకు సరిగ్గా తిండి పెట్టలేని కొందరు.

లేదు నిరంతరం శ్రమించినా వ్యవసాయ ఖర్చులకూ కూలీలకూ శిస్థులకూ చాలని దెందుకో తెలుసా?

న్యాయంగా సంపాదించిన వాడు మనముందు బేలగా తప్పు చేసినవానిలా తల దించుకొని నిలబడ లేడు, ఎందుకంటావు?

మన రూపాయి విలువ ప్రపంచం విపణిన నూరు పైసల నుంచి పదహారు పైసలకు జారింది ఎందుకు.

శీలమే సంపదగా ఎంచి బ్రతికే ఈ దేశపు ఆడాళ్ళు బ్రతుకీడ్వలేక అరబ్బు ధన మదాంధులకు కట్టు బానిసలుగా అమ్ముడుపోవడం ఎందుకు?

ఇందుకు కారణమూ అర్థమూ అంతా మనమే.

దేశానికి అంతు పట్టని డబ్బును కూడబెట్టి మార్కెట్టును పెంచి తుంచి వీలుగ నిలబడక వాణ్ణి వేధవను చేస్తే; వాడు తను అప్పటిదాకా నమ్మిన ధర్మాన్ని వదలి మన తోవకు రావడంతో ఈ సమాజపు మొత్తం ఎంత స్థితి అతలాకుతలం అవుతుందో తెలుసా?

ఇంతెందుకు ఇప్పుడు నా దగ్గరున్న (దాయలేక చస్తున్న) డబ్బూ నాలాంటి ఎందరో ఎంతెంత దాచారో? ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచించు. వేల, లక్షల, కోట్లలోనే కదా ఉండేది. అదంతా లెక్కకు రాక దోబూచులాడుతుంటే రూపాయకు అగ్గిపెట్టి కొనుగోలు చేయలేని సమాజాన్ని చూస్తున్నాం. మనకు అనాదిగా ఉన్న గౌరవం, పరువు, అగ్గిపుల్ల వెలిగించకుండానే అగ్గి అయి బుగ్గి అవుతున్నయి.

అందుకే చేద్దామన్నా పని దొరక్క అన్నమో రామచంద్రా అని నిత్యం వెతుకుతున్న కాలం.

దొరికిన పని చేయలేని కాలం. మధ్య తరగతి మందహాసమూ. దిగువ మధ్య తరగతి అడుగు దిగుడులోకి నడుస్తున్న స్థితి. వెనకబడిన గుదిబండ మానసిక స్థితి కల్గిన వాళ్లకు చేతికి చిక్కిన ఈ ‘కొత్త డబ్బు’ అసలే శల్యావస్థలో వున్న జీర్ణ సమాజాన్ని ఇంకా దిగజారుస్తున్నది. అంచేత మొత్తంగా ఈ జాతి పతనావస్థకు కారణం ఎవడు నల్లధనం ఉన్నవారియూ, షావుకారు అయినా, రాజకీయవేత్త అయినా, ఉద్యోగి అయినా బందిపోటు అయినా మూల కారణం మనం మాత్రమే!

అవధానీ ఒక్క మాట! మనని న్యాయస్థానం అంతుపట్టక ఋజువు దొరక్క వదిలినా ఈ సమాజం బొత్తిగా క్షమించదు. కనీసం ఉరి తీసే టైం లేకుండా ‘హేంగ్’ చేయాలి. మనం పాతిక ముప్పై ఏళ్లుగా వృత్తిగా పెట్టుకొని చేస్తున్న ఈ ద్రోహాన్ని ఏమవాలి? దానికి న్యాయం తెల్సికొనడం ఎలా? అంటే ఈ వర్గం పూర్తిగా చావాలి. మిగిలిన సమాజమన్నా చెడకుండా ఆపాలి.

అవధానీ గుర్తుంచుకో. దాచిన దోచిన డబ్బు ప్రభావం ఈ సమాజాన బ్రతుకుతున్న ప్రతి వ్యక్తి పైనా పడ్తది. దాన్ని మరచి మనం మెలిగాం” అని అవధానినే చూస్తూనే పని మనిషిని రమ్మని సైగ చేసాడు. మళ్లా ఓ ఫుల్ బాటిల్, సోడాలు, కారా వచ్చినయి. పాతవి లోనకెళ్ళినయి.

బాటిలు విప్పుతున్న జయంతి కాళ్ళు జాపుకు జారాడు. అక్కడే కూర్చుని ఏడుపు ప్రారంభించాడు.. చాలా ప్రయత్నం తరువాత గానీ కదల లేదు. చాలా ప్రయత్నం తరువాతనే సోఫాలోకి చేరాడు.

సోఫాపై బాసాపెట్లేసుకొని కూర్చుని “జయంతీ ఇన్ని తెలిసి నన్ను ఆదుకుంటానంటున్నావు” అన్నాడు అవధాని ముద్ద ముద్దగా.

మళ్లీ రౌండు మొదలయింది.

“అవధానీ నేను చెప్పింది స్వతంత్రానంతరం మన వాళ్లు ఓట్లు, సీట్లు అధమ స్థాయి పాలనన జరుగుతున్నది. ఇంక నేను చేసేదంటావా ‘స్నేహం’ కోసం అంతే.”

“జయంతికీ జై, జయంతికీ జై” అని సోఫా నుంచి ఎగురుతూ నాలిక తడబడుతుంటే అరిచాడు అవధాని.

“Shut up please” అని గట్టిగా భుజం నొక్కి మరీ మందలించాడు జయంతి.

కోపం కూడా వచ్చినట్లుంది. కఠినంగా కనిపించినయి చూపులు,

“ఇక వెళ్తాను జయంతీ. సారీ సారీ” అంటూ లేచి “నీకు కోపం తెప్పించాను, మన్నించు” అని తూలుతూ కారు వైపు నడిచాడు అవధాని.

కారు ముందు ఆగిన అవధాని జయంతి వైపు తిరిగి “వెళ్తున్నాను. నన్ను ఎట్టా బయట పడేస్తావో? ఏ చక్రాన్ని అడ్డు వేస్తావో. బై బై” అని తూలిపడిపోగా డ్రైవర్ వచ్చి తీసుకెళ్లి కార్లో ఎక్కించి కారు స్టార్ట్ చేసాడు.

ఆనక పడక గదిలోకి వెళ్లాడు జయంతి.

శారద మంచి నిద్రలో ఉన్నది. ప్రక్కన పడకుందాం అనిపించింది కానీ అప్పటిదాకా తాగిన తాగుడు గుర్తులోకొచ్చి no no అనుకుంటూ ప్రక్కనున్న సోఫాలో దిండు వేసుకొని పడుకున్నాడు. తెల్లవారి తొమ్మిది గంటలు దాటుతుండగా శారద లేపితే లేచాడు. మనిషి అసహనంగా కనిపించాడు. నిద్ర పోత స్థితిని పోగొట్టలేకపోయినట్లుంది. బాత్ రూం వైపు నడిచాడు. ఇంతలో ఫోను. ఆగి వెనక్కొచ్చి ఎత్తాడు. చంద్రశేఖరానిది.

“ఏం?” అడిగాడు విష్ చేసి.

“ఇప్పుడే లేచినట్లుంది. తరువాత కలుస్తాను” అని పెట్టేసాడు.

‘పోలీసు నౌకరీలో ఉన్న వాళ్లకు పోలీసు కుక్కల కున్నంత అవగాహన ఉండేట్లుంది. ఇవతల మనిషిని గమనించి ఇంతగా ఇలా ప్రవర్తిచడం అంత తెలివైన విషయమైతే కాదు. కనీసం జనరల్‌గా మన పని తొందరలో ఎదుటివాని పరిస్థితులు అంతగా పట్టించుకోకున్నను, అవసరం అందుకు permit చేయదు’ అనుకుంటూ బాత్ రూం లోకి నడిచాడు. బట్టలు వేసుకొని బయట పడతుండగా శారద ఎదురుపడింది.

“టిఫిన్ చేసాను తిని వెళ్లండి” అంది.

తల ఊపి డైనింగ్ టేబులు దగ్గరకి వెళ్లి బుద్దిమంతుడిలా కూర్చున్నాడు.

స్వయంగా టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చింది. శారద ముఖంలో మరే భావనా కనిపించలేదు.

“వస్తాను” అని బయటకొచ్చాడు.

టైం దొరికితే రాత్రి సంగతి అడుగుతుందేమోనన్న భావన మెదిలి కారెక్కాడు.

రోడ్డు కొచ్చాక శివరాం కలవడం లేదు అనిపించింది.

అటుగా మలిపాడు కారు.

లోనకి వెళ్ళేసరికి తండ్రీ తనయులు కాఫీ సేవిస్తూ కనిపించారు.

“అన్నయ్యొచ్చాడు.” అని, “రా నువ్వు ఇంత తిని కాఫీ త్రాగుదువుకాని” అంది పార్వతి.

“మీరు ఏమనుకున్నా నాకు తోచినంత టైం ఇక్కడ ఉందామనే వచ్చానమ్మా” అన్నాడు నవ్వి.

“నువ్వు ఫోన్ చేయమన్నావట, రాత్రి పన్నెండున్నర అయింది నేను వచ్చేసరికి. కొత్త జంట కదా, బావుండదని ఆగాను. ఇక నీ దగ్గరకే బయలుదేరదామని…” అన్నాడు శివరాం.

సోఫాలో రాత్రి పడుకున్న వైనం గుర్తొచ్చి నవ్వొచ్చింది జయంతికి.

“రాత్రిళ్లు రాత్రిళ్లు భార్యలు గుర్తుకు రాని వారు ఉంటారు” అంది పార్వతి.

“నువ్వు అనేది నన్నే అని తెల్సు కానీ..”

“కానీలూ అర్ధణాలూ ఏమిటి మనకు కుటుంబమైనక ఇల్లు ఇల్లాలు ముఖ్యం గదా!” అన్నాడు నవ్వుతూనే.

“ఇందుకు నిలదీయాల్సినంత తప్పు నేనేం చేయను గానీ, శివరాం కొత్త ప్లాంటుకు నువ్వు కొంత finance చెయ్యాలి” అన్నాడు.

మంచిది.

‘శ్రీ’ లో శారద పేర పైకం ఉంది. దాన్నే క్యాపిటల్‌గా ఉంచి, వైశ్యా బ్యాంకులో పార్వతి పేరన ఉన్నది ఫైనాన్స్‌గా ఉంచేద్దాం.”

తల ఉపాడు.

రన్నింగ్ క్యాపిటల్‌కు డబ్బు ఉంది. అవధానిది. బినామీ పేర్లతో దాన్ని రైజ్ చేద్దాం. ఇది చెపుదామనే వచ్చాను. పైగా నువ్వు కలవక పది రోజులయినట్లుంది” అని లేచాడు జయంతి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here