నియో రిచ్-23

0
11

[ఇంటికి వచ్చి, మంచమెక్కాక A.S. అంటే అప్పల స్వామిని గుర్తు చేసుకుంటాడు జయంతి. అప్పల స్వామి ఓ పాత నేరస్థుడు. బాబులు అనేవాడితో కలిసి కాపు సారా వ్యాపారంలోకి దిగుతాడు ఎ.ఎస్. బాబులు ప్రోత్సాహంతో వ్యాపారాన్ని బాగా వృద్ధిలోకి తెస్తాడు. ఎ.ఎస్. అంటే అభిమానం పెంచుకున్న బాబులు అతడికి పెళ్ళి చేస్తాడు. పని మీద కర్నాటకకి వెళ్ళిన బాబులు అక్కడ ప్రమాదంలో చనిపోతాడు. బాబులుతో కొన్నాళ్ళు కలిసున్న రత్నం అనే ఆవిడకి విషయం తెలిసి ఎ.ఎస్. వద్దకు వచ్చి బాధపడుతుంది. బాబులును భర్తగా భావించి, తెల్లచీర ధరించి, గాజులు తీసేస్తుంది. ఎ.ఎస్. భార్య గర్భవతి అయ్యేదాక ఉండి, ప్రసవం అయి కొడుకు పుట్టాకా రత్నం ఇక వెళ్ళిపోతానంటుంది. ఆమెను విశాఖలో ఓ ఆశ్రమంలో చేరుస్తాడు. సారా ప్రపంచంలో నెంబర్ వన్ అవుతాడు ఎ.ఎస్. బలవంతంగా ఎ.ఎస్. జ్ఞాపకాలను ఆపుకుని, నిద్రపోతాడు జయంతి. పొద్దున్నే శారద వచ్చి లేపేదాకా మెలకువ రాదు జయంతికి. శారదని బాధపడుతోందని గ్రహించి, ఆ రోజు అన్ని ప్రోగ్రామ్‍లూ క్యాన్సిల్ చేసుకునే ఇంట్లోనే ఉంటాడు. మర్నాడు పొద్దున్నే శివరాం ఇంటికి వెళ్ళగా, డా. శ్రీధర్ రెడ్డి చనిపోయారని తెలుస్తుంది. ఇద్దరూ కల్సి వాళ్ళింటికి వెళ్తారు. డా. శ్రీధర్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతాయి. పెంచలయ్య వచ్చి నివాళి అర్పిస్తాడు. ఛైర్‌పర్సన్, డా. శ్రీధర్ భార్య నళిని దుఖిస్తూండగా, SP వచ్చి శవాన్ని పోస్ట్ మార్టమ్‌కి పంపాలని అంటాడు. పంపుతారు. రిపోర్టులో బలవన్మరణం అని వస్తుంది. హత్య, ఆత్మహత్యో అర్థం కాదు పోలీసులకి. పరిశోధన మొదలుపెడతారు. ఆధారాలేవీ లేక కేసు ఆగిపోతుది. పెంచలయ్య డా. శ్రీధర్ విగ్రహాన్ని తయారు చేయించి సెంటరులో ప్రతిష్ఠింపజేస్తాడు. ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా ఎందుకో జయంతికి నవ్వొచ్చేది. ఇక చదవండి.]

[dropcap]సా[/dropcap]రంగపాణి హోటలు ఇవ్వాళే ప్రారంభం. హోటలు ‘ఊర్వశి’ అని చక్కటి పేరు పెట్టాడు.

టూరిజం మంత్రిణి శకుంతలా దేవి(రాణి) దీనిని ప్రారంభించడానికి వస్తుంది.

హోటలుకు చేరుకున్నాడు జయంతి. జనం రద్దీగా గుమిగూడి ఉన్నారు.

జయంతి కనిపించగానే సారంగపాణి పరుగున వచ్చాడు. వాటేసుకున్నాడు ఆనందంగా. “నాకు తృప్తి మిగిల్చావు, చాలు దోస్త్” అన్నాడు.

“నువ్వు నాకు స్నేహితుడివి. నీ కోసం నరకానికి రమ్మన్నా వస్తాను కాని నువ్వు పిలిచింది స్వర్గానికి” అని నవ్వాడు. ఇద్దరు చేతులు పట్టుకొని ప్రారంభం దగ్గరకు వెళ్లారు.

అయిదారుగురు పెద్దవాళ్లు జయంతిని అక్కడ్నించే ‘విష్’ చేసారు.

S.P. అర్జున్ దూరంగా దేన్నో జాగ్రత్తగా గమనిస్తూ కనిపించాడు.

పలకరించి కుశల ప్రశ్నలు వేసి నడిచాడు.

అహోబలరావు కనిపించాడు. అక్కడో పది నిముషాలు ఆగాడు.

ఈలోపు శకుంతలా రాణి వస్తున్నది అన్నారెవరో. అటుగా మళ్లారు జనం.

ఆవిడ రానే వచ్చింది. దిగి రిబ్బను కత్తిరించి కూల్ డ్రింక్ అందిస్తే త్రాగింది. ఊళ్లో ఇంకా రెండు ప్రోగ్రాంలుంటే  వెళ్లి వచ్చింది. ఎక్కడా కూర్చుని తాపీగా బీరు త్రాగే అవకాశం లేని కారణాన శెలవు తీసుకొని వెళ్లిపోయింది.

జయంతి కూడా లేస్తుంటే సారంగపాణి వచ్చి “జయంతీ నువ్వాగు” అన్నాడు నెమ్మదిగా. ఇటు చూసాడు.

“చాలా కాలమైంది మనం కలిసి కూర్చుని” అంటూ దగ్గరికొచ్చి కుప్పుస్వామితో అవసరమైన వివరాలు చెప్పి జయంతితో ప్రత్యేకమైన గదిలో కెళ్లాడు.

“చాలా బాగుందిరా గది.”

కూర్చున్నాక “ఏం తీసుకుంటావు?” అనడిగాడు.

“నీకిష్టమైనదేదైనా” అన్నాడు నవ్వి.

స్కాచ్ తెప్పించి విప్పి గ్లాసులు నింపాడు పాణి.

“మొత్తం ఎంతయింది?” అడిగాడు జయంతి, ఆలోచనల నుంచి తేరుకొని..

“ఎనబై.”

“గవర్నమెంటు లెక్క.”

“ముప్పై ఒక్కటి.”

“బయట ఎంత ఉంది.”

“దీన్ని ఏం చేస్తావు? అని అడగడానికే” అని నవ్వాడు.

“నీకు గూడా వైరాగ్యం? ప్చ్.. ప్రసూతి వైరాగ్యం వల్ల ప్రయోజనం మేమిటి? ఆ క్షణం  తరువాత కుక్కతోకలా అవుతుంది.”

“జయంతీ, ఈ మధ్యన ఒంటరిగా కూర్చున్నప్పుడు  ఈ సంపాదన నా సంతానానికి శాపంగా మారుతుందా? ఒక్కడూ ప్రయోజకుడుగా ఎదగడం లేదు. అసలింత సంపాదన మనిషికి అనవసరం గదా! మరి ఎందుకు నానా గడ్డీ కరిచి ఇలా సంపాదించినట్టు! నిజం చెపుతున్నాను. ఇప్పటికే ఈ డబ్బు ధ్యాస పిల్లల్ని అహంకార్లునూ, వెధవల్నూ చేసింది. ఈ డబ్బు నుంచి వాళ్లను బయటపడేయడం ఎలా? అనేది ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు.  భయం, బాధ నన్ను మనిషిగా నిలవనీయడం లేదు. ఇంత సంపాదించి ఆనక మనస్తాపాలు వ్యథలు ఎందుకు? వాటిని వదిలించుకోవడం గానీ బయటపడడంగానీ ఎలా?” అన్నాడు.

మనిషి ఎలాగో అయిపోయాడు ఈ విషయం రాగానే.

“ఇదంతా నీ స్వార్జితమే కదా” అడిగడు.

“నీకు తెలియందేముంది?”

“ఓ మాట చెప్తాను. జాగ్రత్తగా విను. ఆస్తిని నాల్గు భాగాలు చెయ్యి. ఎవరిది వారికిచ్చి బయటకు పంపు. వాళ్లు బ్రతుకు వాళ్లని బ్రతకమను. అంతకంటే మార్గం లేదు.”

ఈ మాట విని నవ్వాడు పెద్దగా.

“ఎందుకు నవ్వుతావు?”

“లోనా రెండు సార్లు చేసాను. వెధవలు వట్టి చేతులతో తిరిగి వచ్చారు.”

“పెళ్ళిళ్ళు చేసావా?”

“చేసాను. చెరి ఇద్దరు పిల్లల్లూ కలిగారు.”

“అయితే వాళ్లకు రాసి గార్డియన్‌గా నువ్వు ఉండు” అని ఓ క్షణం ఆగి “పాణీ బ్రతుకు ఆట లాంటిది. పగ్గాలు గనక చేత ఉంచుకొని ఆట నడిపగల్గినవాడే ఇక్కడ ‘విజేత.’ చేత పగ్గం జారిపోయిందీ, మనకు దిక్కుతోచదు. అడవిన పడ్డట్టే. అయినా ఈ అన్ని సమస్యలకూ కారణం డబ్బు కూడబెట్టడమే” అని పెద్దగా నవ్వి “మన శివాలయం ఎదురుగా ఓ పెద్ద మఱ్ఱి చెట్టు ఉంది గమనించావా, ఊడలమఱ్ఱి” అన్నాడు జయంతి.

“ఆఁ!”

“అక్కడకు పొద్దు పొడుపుతో రెండు సార్లు వెళ్లు. జీవితం ఎంత మధురమైనదో తెలుస్తుంది.”

విచిత్రంగా చూసాడు జయంతిని.

“రకరకాలుగా పొట్ట పోషించుకునేందుకు రకరకాల పద్ధతులతో సూర్యోదయంతో తయారయి బయలుదేరుతారు. సాయంత్రానికి చేరుకుంటారు. దొరికిందానితో ఆరామ్‌గా కాలక్షపం చేస్తారు. రేపటి ఆలోచన గానీ, సంతానానికేది మిగిల్చామని గానీ వారి మనసునకే రాదు. వచ్చిన మేరకు ఆనందంగా కాలక్షేపం చేసి కంటి నిండా నిద్రపోతారు. తెల్లారిగట్ల లేవడంతో మళ్లా జీవయాత్రలో కలుస్తారు. ఎక్కువ దొరికిన నాడు ఎక్కువ ఆనందం. తక్కువ దొకిరిన నాడు ఆ మోతాదున. అయితే ఆనందం మాత్రం ఎప్పడూ వాళ్ళలో చూస్తాం. వాళ్లలో కొందరికి కుటుంబముంటుంది. ఉన్నా ఏం లేదు, ఎవరి దారి వారిదే. ఎవరి బ్రతుకు వారిదే. అయినా కలిసే ఉంటారు. పొద్దు పొడుపుతోనే ఎవరి దోవన వారు బ్రతుకు తెరువున పడతారు. వెళుతూ ఆనందం. దొరికితే ఆనందం. దొరకున్న ఆనందం” అని ఆగాడు.

“జయంతీ అందుకే నువ్వు మాలో దీపంలా అనిపిస్తుంటావు.  You are really great” అని చేతులు పట్టుకున్నాడు.

“అది వేళ కాని వేళ, ఇంకేమైన విశేషాలు?” అని నవ్వాడు సిప్ చేస్తూ.

“చెప్తాను” అని  జీడిపప్పును కసిగా నమిలి, “డా. శ్రీధర్ రెడ్డిది హత్య అంటున్నారు అంతా. అంతేనా? నాతో ఇప్పటికి అన్నవారు లేరు. ఇదే వినడం.”

“దహనం అప్పుడు నువ్వు ఉన్నావట గదా”.

“ఆఁ.”

“అది కాదు గాని జయంతి భాయ్, నన్నేమి అనుకోనంటే ఒక మాట చెప్తాను.”

“కానియ్” అని తల ఉపాడు.

“ఈ హోటల్లో అయిదో వంతు శారదా బెహన్ పేర వ్రాసా..”

ఈ మాట వింటూనే లేచాడు జయంతి.

“తప్పు చేసానా మన్నించు. ఇంకో పెగ్గు నా కోసం” అని చేతులు పట్టుకున్నాడు.

అయినా కదిలాడు జయంతి.

“మద్రాసు నుంచి కొత్త హీరోయిన్‍ను తెప్పించాను చూసెళ్ళు.”

“నువ్వున్నావుగా” అంటుండగా హీరోయిన్ లోనకొచ్చింది. మెరుపులా.

‘సినిమాలో కంటే బయటే బావుంది’ అనుకున్నాడు విష్ చేస్తూ. ఆ వెంటనే బయటకొచ్చి కారెక్కాడు. కారు స్టార్ట్ అయింది. సారంగపాణి గురించి ఆలోచనలో తలలో కొచ్చినయి.

వాటిని విడిపించుకుంటూ ఇంటికి చేరాడు. మంచం పై అడ్డంగా పడుకున్నాడు. శారద కనిపించలేదు. కళ్లు ముందు మత్తు, గుండె నిండా మత్తు. వాటి మధ్య సారంగపాణి  ఎదురుగా నిల్చుని ‘కానీయ్’ అన్నాడు. సారంగపాణి నవ్వుతున్నప్పుడు చూడబుద్ధవుతుంది. ఎంత అందమైన ఆడదాని నవ్వు వాని నవ్వు ముందు వాసిని కోల్పోతుంది. వాడెలా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటే, అలా చూస్తూ చూస్తూ చనిపోతే బాగు అని అనుకున్న సందర్భాలు జయంతికి ఉన్నాయి.

ఇతనిది తంజావురు ప్రాంతం. చిన్ననాడే ఇక్కడికొచ్చి హోటలు సప్లయిర్‌గా కుదిరాడు. యజమానికి నమ్మకం కలిగేలా నడుచుకున్నాడు. హోటలే తనది అన్నంత ఇదిగా వళ్లు వంచి పని చేసాడు. హోటలు యజమాని జగన్నాధానికి ఒకసారి  టైఫాయిడ్ జ్వరం వచ్చింది. దాదాపు నలభై రోజులు హోటలు ఛాయలకే రాలేకపోయాడు. పాణి అంతా తానే అయి జాగ్రత్తగా చూసుకోనడమే గాక రెండు రోజులకొకసారి ఇంటి కెళ్లి ఆయన ఆరోగ్యపు పరిస్థితిని విచారించుకొని ఆహారం ఆయనకు తెచ్చిచ్చి డాక్టరుతో అరుసుకొని ఆనక హోటలు పరిస్థితులు చెప్పి వెళ్లేవాడు. జ్వరం తగ్గి బయటకొచ్చిన నాటి నుంచి జగన్నాధం పాణిని స్వంత మనిషిగా చూసుకోనడం ప్రారంభించాడు. అంతటి అభిమానాన్ని పొందగలిగాడు.

జగన్నాధానికి ఏభై దాటుతున్నా సంతానం కల్గలేదు. పిల్లలు లేరనే బెంగతోనే మొదటి భార్య కనపడ్డ రాయి కల్లా మొక్కి ఫలించక మనోవ్యథతో చనిపోయింది.

ఆ తరువాత సంతానం కోసం జగన్నాధం మళ్లా పెళ్లాడాడు. పేరు మీనాక్షి. కళగా ఉంటుంది. చామన ఛాయ. కట్టు బొట్టు బావుండి ఒద్దికగా మసలుకునేది. జగన్నాధానికి అనుకూలంగా మెలిగేది. పాణితో నాల్గయిదు సార్లు యజమానురాలి హోదాలోనే మాటాడింది మీనాక్షి. చిల్లర మల్లర పనులు చెప్పనా నోరు మెదపక చేసాడు. అందుకు ప్రతిఫలంగా వేళ తప్పినప్పుడు భోజనం పెట్టేది. కాకపోతే జగన్నాధంతో ఎన్నాళ్లు కాపురం చేసినా నా కడుపు పండలేదు అన్న భావన ఆవిడ మొఖంలో కనిపించేది. ఇది ఇలా ఉండగా టైఫాయిడ్ తరువాత జగన్నాధం ఆరోగ్యం పరిస్థితి రాను రాను దిగజారుతూ వచ్చింది. పాణి ఇది గ్రహించి వైద్యం చేయించుకోమ్మని ఎంత చెప్పినా ఖాతరు చేయక తిరిగాడు. నలత ముదిరి మంచం మీదకొచ్చాడు నాల్గయిదు నెలల్లోనే. ఆ తరువాత హోటలు పాణి పైనే నడుస్తూ వచ్చింది. ఒకనాడు హోటలు తెరచి బిజీగా ఉన్న టైంలో ఇంటి నుంటి కబురు వచ్చింది. వెళ్లాడు. మంచంలో పడుకొనే  ఊపిరిపోయి కనిపించాడు జగన్నాధం. మీనాక్షి వెర్రిదానిలా ఏడుస్తూంది కాళ్ల దగ్గర పడి. సారంగపాణి నిజంగానే కన్న తండ్రి పోయినట్టుగా ఇదయిపోయాడు. మంచిగా క్రతువు నడిపాడు తలకొరివి పెట్టి. నల్గురయిదుగురు దూరంగా ఉన్న బంధువులు వచ్చినా ఇక్కడ చోటు దొరకదనే భావంతో సణుగుతూ చిల్లర మాటలు మాటాడి వెళ్లిపోయారు. తిరిగి మళ్లా రాలేదు.

హోటలును మాత్రం జాగ్రత్తగా నడపసాగాడు. అందరికీ ఆధారం అదే గదా. జగన్నాధం మాత్రం పాణికెప్పుడూ గుర్తులోకొస్తుండేవాడు.

కాలం ఎవరి కోసం ఆగదు గదా. నడుస్తూన్నది దాని తోవన అది.

అయితే మీనాక్షికి కాలగమనాన పాణి పై మనసయింది.

ఒక రోజు రాత్రి హోటలు కట్టేసి వచ్చినపుడు మంచి చెడు మాటాడుతున్నది. చెప్పింది కూడా. సారంగపాణికి ఆవిడ కోరిక మొదట కొంచెం జంకును కల్గించింది. కానీ ఇద్దరిదీ ఒకే వయస్సు అన్నది స్పష్టపడడంతో తను కాదంటే మరొకరి వైపు మీనాక్షి మొగ్గుతుందనే భయమూ నిద్ర పట్టకుండా చేసింది. అంతే తిరుపతి వెళ్లి అక్కడ పెళ్లి చేసుకొని వచ్చారు. సారంగపాణి మీనాక్షిలకు ఆనక సంతానము కల్గింది. ఎందుకు పనికిరాని వెధవలు పుట్టారు. అని సారంగపాణి వాపోయే సంతానమదే.

ఆ తరువాత సారంగపాణి తనదైన ధోరణిన సంపాదన పై విరుచుకుపడ్డాడు. కాలమూ అతనికి అలాగే కల్సివచ్చింది.

ఇలా పాణి తలలో మొదులుతుండగానే నిద్ర పట్టింది జయంతికి.

బాగా తెల్లవారాకే లేచాడు. కాఫీతో శారద ఎదురైంది. త్రాగాడు.

టేబులు పైన ఉన్న టపా చూసాడు.

‘ఆహ్వానం’ చేతికందింది మొదట.

ప్రఖ్యాత నాట్యతార శ్రీలక్ష్మి నాటక ప్రదర్శన, చెవిటి మూగ  పిల్లల సహాయర్థం.

రెండోది విప్పాడు. హరే రామ్ దగ్గర నుంచి వచ్చిందా ఉత్తరం.

“మిత్రమా! నేను హరేరామ్‍‌ను. ఆరు సంవత్సరాల అన్వేషణ ఫలించింది. ఇప్పుడు నీ ఆర్థిక సాయం అవసరం. నేను త్వరలో బయలుదేరుతున్నాను. నిన్ను చేరేసరికి నెల పట్టవచ్చు. ఈసారి బాగ్ లగేజీతో నీ ముందుంటాను.  నీ ఆశీర్వాదంతో నువ్వు ఎక్కడ అంటే అక్కడే ప్రొడక్షన్ ప్రారంభిద్దాం. జయంతీ మిత్రమా ఒకనాడు నన్ను నా ఆలోచననూ అందరూ అవహేళన చేసారు. ఒక్క నువ్వు నా తపనను అర్థం చేసుకున్నావు. ‘నీకేం కావాలన్నా తీసుకెళ్లు. చాలా శ్రమతో కూడిన పని ఇది. నువ్వు సాధించగలనన్న నమ్మకం నాకుంది’ అని వెన్ను తట్టావు.

Idea ఉంది ప్రయత్నం చేసి సాధించగలన్న విశ్వాసం ఉంది అన్నాను.

Go head ఏ పుట్టన ఏ పాముందో. ముందే అనుకోవడ మెందుకు, కొన్ని కొన్ని లేటుగా lift అవుతాయి. ప్రయత్నాన్ని మానుకోకు, నేనున్నాను అన్నావు. అడిగినంత ఇచ్చావు.

నీ చల్లటి మాట నాకు కొండంత ధైర్యాన్నివ్వడమే కాక పట్టుదలగా నిర్విరామ కృషి చేసేందుకు దోహద పడింది. జయంతీ, ఇవ్వాళ విజయం మన ముందు కొచ్చి నిల్చున్నది. Sure గా చెపుతున్నాను. దీని ఫలితమూ నీదే, నువ్వు లేని విజయం లేదు గనుక, నీ ప్రోత్సాహంతో నడచిన మైనపు బొమ్మను నేను. ఇక మలచుకొనడం నీ యిష్టం. That’s all.

నువ్వు ఫోనులో నాతో మాటాడే ప్రయత్నం చేయకు. నేనే మాటాడుతాను.

నీ హరే రామ్.”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here