నియో రిచ్-6

0
9

[పరధ్యానంగా ఉన్న జయంతి శారదను చూసి ఈ లోకంలోకి వస్తాడు. ఆ అమ్మాయి తన వద్ద పి.ఎ. ఉద్యోగానికి వచ్చిందని తెలుసుకుని, శారద వివరాలు అడుగుతాడు. తన గురించి చెప్పి, తనకి ఉద్యోగం ఎంత అవసరమో చెప్తుంది. మొదట తన వద్ద ఉద్యోగాలు లేవని చెప్పేస్తాడు. కానీ మళ్ళీ ఆలోచించుకుని ఆ అమ్మాయికి పి.ఎ. ఉద్యోగం ఇస్తానంటాడు. మర్నాడు రమ్మంటాడు. ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి రూపం, అణకువ నచ్చి ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని తలుస్తాడు. శివరాం ఇంటికి వెళ్ళి జరిగినదంతా పార్వతికి చెబుతాడు. పార్వతి ఎంతో సంతోషిస్తుంది. మర్నాడు శారద వచ్చే సమయానికి పార్వతి కూడా జయంతీలాల్ ఇంట్లోనే ఉండి పార్వతిని రకరకల ప్రశ్నలు వేస్తుంది. ఉద్యోగానికీ, ఈ ప్రశ్నలకి సంబంధం ఏంటో శారదకు అర్థం కాదు. అప్పుడు చెబుతుంది పార్వతి – జయంతి శారదను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని. అదీ తన ఇష్టం మీదనే అని శారదతో చెబుతుంది పార్వతి. శారద ఆలోచనలో పడుతుంది. ఇక చదవండి.]

[dropcap]స[/dropcap]మాధానం రాలేదు. పార్వతి వేపు మళ్ళి, “ఇలా నిలబెట్టి అడిగితే చెప్పగలనా? మీరూ ఆడవారే కదా! ఆలోచించండి” అని మాత్రం అంది.

“ఇక్కడే ఇప్పుడే చెప్పమని ఎవరన్నారు? తాపీగానే చెప్పు. నేను లోపలకు వెళ్తాను” అని అప్పుడే బయటకొస్తున్న జయంతిని “నువ్వు లోపలకి పద” అంటూ వెంట తీసుకొని వెళ్లింది. జయంతి బయటికొస్తే “ఏమిటిది?” అని అడగాలనుకుంది. కాని ఆ అవకాశమూ పోయింది. పార్వతి నాలుగు నిముషాలలో మంచి కాఫీ పంపింది శారదకు.

అరగంట తరువాత నాలుగు బిస్కట్లూ టీ వచ్చినాయి.

గంట తరువాత తనే హాలోలోకి వచ్చింది. వెంట జయంతి లేడు.

శారద కూర్చుని లేదు. నిల్చుని ఉన్నది.

“శారదా నువ్వు లోనికి వస్తున్నావా?” అనడిగింది పార్వతి.

అమ్మ పిలిచనట్టుగా అనిపించిందా పిలుపు. చలించిపోయింది. అన్ని ఆలోచనలూ మాయమయ్యాయి. అప్పటిదాకా తలను తిరిగిన రకరకాల భావనలకు తెరపడింది.

పార్వతినే తేరిపార చూచి ఓ నిర్ణయానికి వచ్చిన దానిలా దగ్గర కొచ్చి నెమ్మదిగా వంగి పార్వతి పాదాలకు నమస్కరించింది.

“ఇదేంటమ్మా” అని భుజాల్ని పట్టుకొని లేపి కౌగిలిలోకి తీసుకున్నది ఆత్మీయంగా. నీకిష్టమేగదా అన్నట్లు చూసింది శారదను.

ఇష్టాన్నే సూచించినయి ఆ కళ్లు.

అప్పుడు పిలిచింది జయంతిని, “అన్నయ్యా ఇలారా” అని.

శారదనే చూస్తూ నెమ్మదిగా వచ్చాడు.

సిగ్గుతో మొగ్గయింది శారద. కాని మనసున జయింతిపై కోపం పోలేదు.

“అమ్మాయికున్న గడువు దాకా శారద నా యింటనే ఉంటుంది” అంది పార్వతి.

“ఎక్కడయితే ఏం?” అన్నాడు.

“అలా కాదు మరి. పెళ్లి కాకుండా ఒక చోట ఉండడం మన పద్ధతి కాదు. శారద నాతో వస్తున్నది, నేను తీసుకువెళ్తున్నాను” అంది.

తల ఊపాడు ఆనందంగా.

“డ్రైవర్ను పిలువు” అంది.

“నేనున్నానుగదా! వాడొచ్చాడో రాలేదో” అంటూ లాన్ వైపు చూసాడు.

“సరే పద” అంది.

కారు శివరాం ఇంటి ముందు ఆగింది. జయంతి పార్వతి శారద దిగి ఇంట్లోకి వచ్చారు.

శివరాం కనిపించాడు హాలులో. “ఎక్కడికెళ్లావోయ్” అంటూ అడిగాడు.

“ఎవరొచ్చారో చూసారా?” అంది శారదని చూపి.

జయంతి వెళ్తాన్నానని చెప్పి కారు దగ్గరకెళ్లాడు.

“జయంతి వెళ్తున్నాడేం” అడిగాడు శివరాం.

“ఇక రాక ఏం చేస్తాడు. రోజుకు పది సార్లు ప్రదక్షిణాలు చేస్తాడు” అంది నవ్వి.

“నువ్వు చెప్పేదేమిటో అర్థం కాలేదు.”

“ఈ పిల్ల పేరు శారద.”

నమస్కరించింది శారద.

“అన్నయ్యకు కాబోయే ఇల్లాలు.”

ఉలిక్కిపడి సర్దుకొని ‘జయంతి పెళ్లాడతానంటున్నాడా?’ అని తనలో తానే సణుకున్నాడు నమ్మకం కుదరక.

“తపోభంగం చేసిన మేనక ఈవిడ” అంది నవ్వుతూ పార్వతి.

సిగ్గుతో ముడుచుకుపోయింది శారద. అంతా కూర్చున్నారు. శారదతో మాటాడాడు శివరాం. వివరాలు అడిగాడు. చెప్పింది.

శారద మాట తీరు నిజాయితీ బాగా నచ్చింది. “జయంతి అదృష్టవంతుడు” అన్నాడు.

ఆనక శారద వైపు తిరిగి “శారదా నీకెలా thanks చెప్పాలో తోచి చావడం లేదు. అంతగా సంతోషం వ్యక్తం చేద్దామంటే చిన్నదానివైపోయావు. నిజానికి మేం ఇందరం దగ్గర వాళ్లము ఉండి పెళ్లికి జయంతిని ఒప్పించలేకపోయాం. …. నువ్వు గెలిచావు. Really it is great” అని అభినందించాడు. శివరాంలో కూడా అనూహ్యమైన రీతిన సంతోషం కనిపించింది.

ఆనక శారదకు గది చూపి “ఇక్కడ నువ్వు ఉంటున్నావు” అంది పార్వతి.

“నేను ఉన్న ఇల్లు ఖాళీ చేయాలి గదా” అంది వెనుతిరిగి.

“అదంతా మగాళ్లు చూసుకుంటారు. తాళపు చేతులు వాళ్లకిచ్చేయ్” అంది.

ఇంకేదో చెప్పబోయింది శారద.

వినలేదు. తాళం చెవి తీసుకుని శివరాం కిచ్చి అడ్రసు చెప్పి “పిల్లదాని సామాను ఉంది. ఖాళీ చేయించి తీసుకురండి…” అని పురమాయించింది ఆ మరుక్షణానే. చూస్తూ ఉండిపోయింది శారద. కనిపించేదంతా నిజమేనా అన్న అనుమానం మెదిలింది.

నిజంగానే కనిపిస్తున్నది గదా! అనుకుంది.

***

జయంతి ఇంటికి చేరి చల్లటి నీళ్లు త్రాగి మంచానికి అడ్డంగా పడుకున్నాడు. చిదంబరం అనేకసార్లు అతని పనులు చేయించుకోవడం కోసం అందాలరాశుల్ని చాలా సార్లు ఎగదోలాడు. ఒక్కసారీ దగ్గరకు రానివ్వలేదు.

అతను శారదను పరిచయం చేసినప్పుడు మనస్సు మరోలా…

శారద చెప్పాక మబ్బు విడిపోయినట్టు అయి. మనసంతా దూది పింజంలా తేలి ఆడింది.

ఈ చిదంబరం గాడిదో చిత్రమైన గతం.

వీడిది రాజోలు. చేపలు అమ్ముకోనడం వీని వృత్తి. ఎంతకాలం ఎన్ని చేపలమ్మినా ఏ చేప కడుపునా వజ్రాలు దొరకలే. అమ్మకంలో చికాకయి యజమానితో అనేక సార్లు మక్కెలిరగ దన్నించుకున్నాడు. ఆ బాధ పడలేక వృత్తి మారాడు. పూలు అమ్మాడు. ఈ వ్యాపారాన అనేక మంది ఆడంగుల స్పర్శలు. వయస్సులోకి అడుగుపెడుతున్న ప్రాణం గనుక చానా తికమక అయ్యాడు. ఈ తికమకను చిదంబరం తల్లి గమనించి బంధువుల పోరి రమణనిచ్చి పెళ్లి చేసి ముకుతాడేసింది. రమణమ్మ బాగానే ఉంటుంది. వయస్సుంది.. ఆరేడు నెలలు బయట వృత్తి మానేసి రమణతోనే గడిపాడు. ఇలా వాళ్లని ఊర్కే మేపడం ఇక కుదరదనుకొన్న తల్లి ఏదన్నా పని చూసుకొమ్మని పంపింది. దాంతో రోడ్డెక్కాడు. టౌను కొచ్చాడు. పని కోసం ప్రయత్నించాడు. దొరకలేదు. రిక్షా వేస్తే అనుకున్నాడు. అట్లాటి టైంలో హుస్సేను కలిసాడు. పూలు అమ్మినప్పుడు తెచ్చింది అతని దగ్గరనే. సిల్కు చొక్కా సిగరెట్టుతో పైలాపచ్చీసుగున్నాడు. “పని కోసం వచ్చాను దొరకలేదు” అని చెప్పాడు. “మా కంపెనీలో ఏమన్నా ఉన్నాయేమో కనుకుందాం రా” అన్నాడు హుస్సేను. ప్రొద్దుటే కంపెనీకి తీస్కుపోయాడు. లోపలకెళ్లొచ్చి ‘పద’ అన్నాడు. నాల్గుయిదు ఫర్లాంగుల పోయాక ఊరుకు దూరంగా ఉన్న పాడుబడిన బంగ్లా దగ్గరకు చేరారు. బంగ్లా పాడుబడ్డదయినా గేట్లూ వగైరా మామూలుగనే ఉన్నాయి. గేటు మందున్నతను ‘నువ్వా హుస్సేనూ’ అని తోవ ఇచ్చాడు. వరండా దాటి పెద్ద తలుపు దగ్గర ఆగి టక్ టక్ అని నాల్గు సార్లు కొట్టాడు. ‘ఎవరు’ అన్న మాట వినిపించింది. ‘నేను హుస్సేన్’ అన్నాడు. తలుపులు తెరుచుకున్నయి. లోపలకు నడిచారు. రాజన్న అనే అతని దగ్గర ఆగి ‘చిదంబమరని పేరు, ఈడికి పంపారు’ అని చెప్పి వెళ్ళిపోయాడు హుస్సేను. రాజన్నకు డెబ్బై ఏళ్లుంటయనిపించింది. అయినా గట్టిగా ఉన్నాడు. దగ్గరకొచ్చి తేరపార జూచి “చాయ్ తాగుతావా” అడిగాడు.

“ఇప్పుడొద్దు. అలవాటయితే ఉన్నది” అన్నడు చిదంబరం.

“మందు?” అడిగాడు రాజన్న నడుస్తూ.

“అంటే?” అడిగాడు చిదంబరం.

“మందు అంటే తెలీని సన్నాసిని ఈ సాయిబుగాడు పట్టుకొచ్చాడా?” అని పగలబడి నవ్వాడు.

“మందు అంటే సారాయి” అని చెప్పాడు.

“నాకు అలవాటు లేదు.”

“తెల్లది?”

“అదేంటి?”

“ఇంటికాడి అమ్మ పాల నుంచి బయటపడినట్టు లేడు సన్నాసి” అని భుజంపై చెయ్యేసి నడిపిస్తూ “కల్లు” అన్నాడు.

“ఈడ అమ్ముతారా?”

ఈ ప్రశ్నకు క్రింద పడి నవ్వాడు రాజన్న. వాని నవ్వు ఆపేసరికి నాల్గు నిముషాలు పట్టింది. తేరుకొని కళ్లలో తిరిగిన నీటిని తుడుచుకొని “నిన్ను ఏ జంగిల్ నంచి తోలుకొని వచ్చిండ్రా” అన్నాడు.

“జంగిలేంది మాది మోటూరు” అన్నాడు చిదంబరం.

“ఓర్నీ ఊరు తగలడ. ఇంత తెలివి అబ్బింది నీకు. అసలు నీది ఊరా వల్లకాడా?” అని మళ్లీ నవ్వాడు. తెరలు తెరలుగా నవ్వి “లింగం” అని పిలిచాడు రాజన్న.

“ఆఁ వస్తి” అన్న మాట వినిపించింది. ప్రక్కకున్న చీకటి నుంచి మూడడుగులు ఎత్తున కండరాలు మెలితిరిగిన గూటం లాంటి మనిషి వచ్చాడు. కారునలుపుగా ఉన్నాడు. వాడు కదులుతుంటే అడవిన కొండచిలువ కదిలినట్లనిపించింది.

“పాలెం పోర్ని ఏడుంచినవు?” అడిగిండు.

“మూడో నెంబరులో ఉండాది.”

“ఎవడన్నా ఒక్కనాడన్నా తొంగున్నాడా దాంతో.”

“కరచి కండలు పీకేస్తున్నది ముండ.”

“వణ్ణం ఆపు చెయ్యమంటిని గదా”

“మూడు దినాలయింది పంపక. రాత్రి పూట మాత్రం పాలు పంపుతున్నా. చస్తదేమోనని.”

“నువ్వన్నా చూడకపోయినవు?”

“నా వల్లకాదు” అని, “వీడెవాడు” అనడిగిండు చిదంబరాన్ని చూసి.

“లోకం తెల్సినోడు గాదు గానీ పోటుగాడేనేమో” అన్నాడు నవ్వుతూ.

“వాణ్ణి వదిలి చూద్దామేం?” అన్నాడు.

“చూడు” అన్నాడు నవ్వి.

చిదంబరం జబ్బ పట్టుకొని ‘దా’ అన్నాడు లింగం. కొంత దూరం మలుపులు తిరిగాక ఓ గది ముందాగాడు.

“నేనేం చెయ్యాలి?” చిదంబరం అడిగాడు.

“దాంట్లో ఓ పోరి ఉంది. లొంగదీసుకోవాలి” అన్నాడు.

“అదేంది.”

“అదంతే. దాన్ని ఒక్కసారి బలిమిన లొంగదీసుకో చాలు. మందు తమ మనుషుల్లో పడతాది, మానం పోయిందని.”

“ఏడ నుంచి తీసుకొచ్చారు.”

“ఈడ ప్రశ్నలడగరు. వింటారు” అని పార పళ్లను మొత్తం బయటపెట్టి నవ్వాడు.

చిదంబరాన్ని లోపలికి తోసి తలుపు లేసాడు.

బోనులో కెళ్తునట్టు భయం భయంగా పదడుగులేసాడు చిదంబరం. నులక మంచం పైన బంగారు తీగ లాంటి ఓ పిల్లది నిద్రపోతూ కనిపంచింది. ఇంకొంచెం నడిచి చూసాడు పరీక్షగా. కుందనపు బొమ్మ అంటేనే సరిపోతది. అనిపించింది. అంత అందాన్ని చూడడం చానా ముచ్చటగానూ అనిపించింది. ఆ వెంటనే ‘అసలిదే ఉద్యోగం? ఇట్టాటి ఉద్యోగాలు ఉంటాయా? చిత్రంగా ఉందే? ఇట్టాటి పిల్ల పొందు దొరికిం తరువాత అసలీ ఎదవ జన్మ ఉంటేం ఉడిపోతేం?’ అనిపించింది. లింగం చెప్పింది గుర్తుకొచ్చి జంకు కల్గింది. కోరిక మస్తుగా కిర్రెక్కింది. అంతే పడుకున్న దాన్ని నెమ్మదిగా పిల్లిలా వెళ్లి అట్టాగే మీద పడి గట్టిగా… కదలకుండా అణచిపెట్టాడు. ఆ పిల్ల గమనించేలోపే చీరను లాగేసి మంచానికి మొరటుగా కట్టాడు. చాలా శ్రమపడి చావుబ్రతుకుల పోరాటం చేసి నెగ్గాడు. ఆ పిల్ల ఎంతగా ప్రతిఘటించినా ఉపయోగం లేకపోయింది. బలంగా తన్నింది. పళ్లు బిగబెట్టి ఓర్చుకున్నాడు. ఎట్టకేలకు ఆమెను అనుభవించాడు. తెల్లవారింతర్వాత ఏమైతే అది అవుతదనుకొని చేతులవి కట్లు విప్పాడు. విప్పుతూ కళ్లలోకి చూసాడు. ఆవిడలో ఏ భావనా కనిపించలేదు. శవంలా అనిపించింది. తిరగబడలేదు. కనీసం మెదలలేదు. పూర్తి నగ్నంగా ఉన్న ఆ పిల్లను చూసాడు. ఉసిగా మళ్ళా కలవాలనిపించింది. అంతటి శక్తి వుందా ఆ క్షణాన? కాని ఛ అనిపించింది. చీరను తెచ్చి ఆవిడకు చుట్టబెట్టాడు. తలుపు తట్టాడు. కాసేపటికి తలుపు తెరచుకున్నది. లింగం కనిపించాడు.

వికారంగా పళ్లన్నీ బయటపెట్టి నవ్వులాంటిది మొఖాన పులుముకుని, “గెలిచావా?” అడిగాడు ఆపి. తల ఊపాడు చిదంబరం సిగ్గుపడుతూ.

“నిజం? నిజమా. అహో” అని పెద్దగా ఎలుగోడ్డులా నవ్వుతూ అదే గదిలోకి నెట్టుకొచ్చాడు.

ఆ పిల్లకు చెక్కిలిగిలి పెట్టబోయాడు. “తిరగబడి కరిస్తే మనిషి కాటుకు మందుండదు” అని చిదంబంరం అనడంతో బిక్కచచ్చి వెనకడుగు వేసాడు. బయటకొచ్చి డాక్టరు కోసం కబురు పెట్టాడు లింగం. చాలా జాగ్రత్తగా వైద్యం చేయించారా పిల్లకు.

ఆ రోజున రాజన్న చిదంబరాన్ని చానా పనోడికింద చూసాడు.

అక్కడే ఒక గది ఇచ్చాడు. చిదంబరానికి గది బాగానే ఉండాది. నాల్గయిదు రోజులు గడిచినయి. ఒకనాడు ఆరాముగ ఉన్నపుడు లింగాన్ని మాటల్లో పెట్టాడు చిదంబరం. వాళ్ల మనుషుల్లో ఒకడయ్యాడు గదా. “ఆ పిల్లను ఏం జేస్తారు?” అడిగాడు.

“అదా చెప్తా. ఒకసారి చెడిందాకా మన ఆడపోర్లు చాల ఘమండ్‌గా ఉంటారు. పాతివ్రత్యానికి తామే ప్రతినిధులమనుకంటారు. తాళి కట్టినోడు ఎంత నికృష్టుడైనా వాని తోనే మొదటి కలయిక కోరుకుంటారు. అదో గొప్ప అనుకుంటారు. అర్ధరాత్రి అయ్యాక కట్టుకున్న వాళ్లతోనే సుఖమూ కష్టమూ పడి బయట మగాళ్లను తేళ్ళను చూసినట్టు చూస్తారు. అదే పతివ్రతతనమని తలఎగెరేస్తారు. ఆ బ్రమను మనం వదిలించగలగాలి. చెడిపోయాం, శీలం పోయింది అనిపించగల్గితే చాలు పెళ్లికి అనర్హులయ్యామనే అభిప్రాయానికి వారే వస్తారు. అది వచ్చాక ఇంకా చెడిపోయేదేముంది, ఇక ఏమైతే ఏం అనుకుంటారు. అప్పడు గాని మన మాటను వారు సజావుగా వింటం జరుగతది. అంటే మావోళ్లు చేసే యాపారం మూడు పూలు ఆరకాయలా పండుతది” అని ముగించాడు.

ఇదన్నమాట ఇక్కడ జరుగుతున్నది. అనుకున్నాడు. హుస్సేను పైన మాలావు కోపం వచ్చింది. అంతలోనే అసహనమూ మెదిలింది. సాయిబును నమిలేద్దామనిపించింది.

“చిదంబరం” అని రాజన్న కేక ఆలోచనల్ని ఆపింది. “ముసలోడు పిలుతున్నాడు” అని వంటింటి వైపెళ్లాడు లింగం.

“వస్తున్నా” అని అటుగా నడిచాడు చిదంబరం.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here