నియో రిచ్-8

0
7

[చిదంబరం గతం తలచుకుంటూంటాడు జయంతి. తానో వ్యభిచార ముఠాలో చిక్కుకుపోయినట్టు గ్రహిస్తాడు చిదంబరం. మొదట్లో వాళ్ళు చెప్పినట్టు నడుచుకున్నా, కొద్ది రోజులు పోయాకా అతనిలో ఆలోచన కలుగుతుంది. ఒకసారి ఇంటికి వెళ్ళొస్తా అంటే అనుమతి నీయరు. బయటకి వెళ్ళే మార్గం గమనించి అక్కడ్నించి పారిపోతాడు చిదంబరం. ఇంటికి వెళ్ళి చూస్తే భార్య కనబడదు. తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి చూస్తే, అక్కడా ఉండదు. మీ కోడలేది అని అమ్మానాన్నలని అడిగితే, “నీకు ఉద్యోగం దొరికిందని, నువ్వు తీసుకురమ్మన్నవని, ఖాసిం వచ్చి పిలుచుకుపోయాడు” అని చెప్తారు. ఖాసిం కోసం వెతికితే సాయంత్రం బస్ స్టాండ్ దగ్గర కనబడతాడు. తన భార్య గురించి అడిగితే తెలియదంటాడు ఖాసిం. ఖాసిం పారిపోతుంటే తెలివిగా పట్టుకుని పోలీసుకులకి అప్పగించి, ఆ వ్యభిచార ముఠా గురించి చెప్పేస్తాడు చిదంబరం. పెద్ద పెద్ద వాళ్ళు అరెస్ట్ అవుతారు. ఎందరో ఆడవాళ్ళకు చెర తప్పుతుంది. వాళ్ళలో చిదంబరం భార్య ‘రమణ’ ఉండదు. కోపంతో ఖాసిం నెత్తి మీద కొడితే, అతను చనిపోతాడు. చిదంబరం అక్కడ్నించి పారిపోతాడు. అలా చిదంబరం గతం తలచుకోడం ముగియగానే, నౌకరు వచ్చి – R.K రావుగారినీ, వరదరాజుగారినీ పోలీసులు అరెస్టు చేశారనే వార్త జయంతికి చెబుతాడు. డా. హర్షకీ లాయర్ ముకుందానికి ఆ వార్త అందిస్తాడు జయంతి. R.K రావుకీ, వరదరాజుకీ బెయిల్ లభిస్తుంది. ఆ రాత్రి ఆర్.కె. రావు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. వరదరాజు బెదిరిపోతాడు. ఇక చదవండి.]

[dropcap]భోం[/dropcap] చేసి పడుకుని సంగీతం వింటున్న జయంతికి అలికిడి అనిపించడంతో అటుగా చూసాడు. ‘శారద’ కనిపించింది. గబుక్కున మంచం పై నుంచి లేచి క్రిందకు దుమికి పరుగు లాంటి నడకతో శారద దగ్గరకు చేరాడు “ఏమిటి? ఇలా?” అంటూ…

“మీరు ఇప్పుడు ఉండరన్నారు” అంది బెరుకుగా.

“ఉంటే రా రాదా.”

“రావచ్చు, కాబోయే భర్త ఇంటికే గదా! అనుకోనడానికయితే తప్పేం కనిపించదు. కాని మగవాళ్ళు పరిస్థితి అంత మంచిగా ఉండడం లేదని రోజూ పేపర్లలో చూస్తూనే ఉన్నాం గదా! చివరికి భార్య కూడా ఒంటరిగా భర్త గదిలోకి వెళ్లే పరిస్థితి దూరమవుతోంది. ప్చ్.” అంది.

“అలాగా, అవును. వెధవలు మరీ బరి తెగించిపోతున్నారు” అని అమాంతం శారదను ఎత్తుకొన్నాడు. ఆవిడ తేరుకునే లోపే బెడ్ పైన వదిలాడు.

ఇంతలో పార్వతి కంఠం వినిపించింది. మంచం పైకి దుమకబోతున్న తరుణాన బ్రేక్ – “జయంతీ, శారద వచ్చిందా?” అంటూ వస్తూనే ఉంది. ఎత్తుకొచ్చిన దగ్గరే మళ్లా శారదను దించి బెడ్ పైకి పారిపోయి దొంగ నిద్ర నభినయించసాగాడు.

శారద నడుం రాసుకుంటూ కనిపించింది.

“ఏమైంది?” అడిగింది పార్వతి.

“ఏం లేదు. తిమ్మిరి పట్టినట్టు అనిపిస్తేనూ.”

జయంతికి వారి సంభాషణ చాలా నవ్వు తెప్పించింది.

పెద్దగానే నవ్వుతూ మంచం దిగాడు.

“ఎదుటి వాళ్ల బాధ ఎక్కడైనా నవ్వు తెప్పించుతుందా?” అంది సీరియస్‌గా.

మాటాడలేదు. నిల్చున్నాడు పార్వతి ప్రక్కన.

“మీ బావ నిన్ను కలిసి వెళ్లమన్నారు”, అని “శారద ఇక వెళ్తామా?” అంది పార్వతి.

“ఓ గంట ఉండి వెళ్దామేం?”  అంది నెమ్మదిగా నడుం సర్దుకుంటూ కూర్చుని.

“మంచిది. అయితే అన్నయ్యా నువ్వు వచ్చి దీన్ని డ్రాప్ చేసి మాటాడి వెళ్లు. వెళ్తున్నాను” అని కదిలింది. పార్వతి వెంట జయంతి కారు దాకా వచ్చాడు. ఆవిడ వెళ్లగానే శారద దగ్గరకు పరుగెత్తుతూ వచ్చి ‘సారీ’ అన్నాడు.

“మీరు చేయాల్సిన పనా?”  అంది కోపంగా చూస్తూ.

నొప్పి అనిపించిన ప్రదేశాన తనూ చేత్తో నిమిరాడు.

శారద వారిస్తూనే తన్మయత్వంలోకి వెళ్లింది.

టీ త్రాగాక అడిగింది.

“R.K రావు, వరదరాజు ఎవరు? వాళ్లు అరెస్టయితే మీరంతా హైరానా పడుతున్నారెందుకు?” అడిగింది.

“ఇది నీకు అవసరమైన ప్రశ్నేనా?” అన్నాడు జయంతి.

“తెల్సుకోవాలనిపించింది. రావుగారు చనిపోయరన్నాక దానిపై ఆసక్తి పెరిగింది. మీ సంబంధ అనుబంధాల్ని మీరు చెప్పేందుకు ఇష్టపడకున్నా తెలుస్తుంది” అంది.

శారద మాటల్లోని స్థిరత్వం ఆశ్చర్యపరచింది జయంతిని.

శారద విషయం తెల్సుకోనగలదు అనుకున్నాడు.

మనమే తెలిపితే పోలే! అనుకొని ఫ్రిజ్ తెరచి చల్లటి నీళ్లు త్రాగి వచ్చి శారద పక్కనే కూర్చుని “శారదా! ఈ  R.K.రావు, అసలు పేరు రాచిప్పల కృష్ణారావు. బందరు తాలూకా వాడు. వారికి మొదటి నుంచి చేపల చెరువులుండేవి. కృష్ణారావుకు మాత్రం చదువుపైన శ్రద్ధ ఉండేది. చదివాడు, ఇంజనీరయ్యాడు. ఉద్యోగంలో చేరాడు. అది మొదలు ఎక్కతున్న మెట్లు లెక్క పెట్టాడే తప్ప వెనక్కి తిరిగి చూడలేదు. S.E. దాకా ఎదిగి రిటైరయ్యాడు. రావుకు చదువు పూర్తవగానే అతని మేనమామ తన కూతురు శకుంతలనిచ్చి పెళ్లి జరిపాడు. శకుంతల   అందమైన పిల్ల. అజంతా బొమ్మలా గుండేది. శకుంతలను పెళ్లాడాలనే తలంపు చిన్ననాటి నుంచి ఉంది. కానీ మేనమామ పిల్లనిస్తాడని అనుకోలేదు. వాళ్ల స్థాయి పెద్దది. ఇంజనీరుగా ఉద్యోగంలో చేరడంతో దిగివచ్చి బతిమాలి మరీ శకుంతలనిచ్చాడు. అయితే మొదటి రాత్రి అనుభవం రావు తొందరపాటు వల్ల బాధాకరంగా గడిచింది. కలలు గన్న ఊహలు చెదిరినయి. అయితే శకుంతల అందగత్తేగాక తెలివిమంతురాలు అవడంతో ఆ మర్నాటి  నుంచి అన్నీ సర్దుకున్నాయి. రావుకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే సరికి ఆరేళ్లు పట్టింది. ఇద్దరు పిల్లలయ్యారు. అయితే పిల్లల తల్లిలా అనిపించేది కాదు శకుంతల. A.E గానే చిన్న ఇల్లూ బ్యాంకు బ్యాలన్సు సంపాదించాడు. స్కూటరు, ఉన్న టౌనులో రెండు ప్లాట్లూ అమరినయి. భోజనశాలనా, పడకనా ఖరీదైన సామాను చేయించాడు. ఇంటిని మాత్రం శకుంతల చాలా అందంగా నీటుగా ఉంచేది. ఆ తరువాత ఓ భారీ ప్రాజెక్టుకు ప్రమోషను పైన ట్రాన్స్‌ఫర్ అయింది. అక్కడ మొదటిసారి దొరికిన ముగ్గురు కాంట్రాక్టర్లు మంచిగ మెలిగేవారు దొరికారు. వారి పరిచయం స్నేహమయింది. రాకపోకలు సాగినయి. కలిసి ప్రయాణాలు చేసే వరకూ ఎదిగినారు. వాళ్లు తీసుకొని చేస్తున్న పనులు పూర్తి కావడానికి రెండేళ్లు పట్టింది. పనికి పనీ బాగా పేరొచ్చేలా చేసారు. మంచిగా ముట్టచెప్పారు కూడా. అయితే ఇది పూర్తియేసరికి ఇంత పని ఒక్కటే వచ్చింది. దాన్ని మేనేజు చేసి ఈ ముగ్గరూ కలిసి పని చేసేలా చేసి ఇప్పించాడు. నాల్గు వాటాల పైన లాభాలనూ పంచారు. అటాంటి కాలాన వరదరాజుతో రావుకు పరిచయం అయింది. వరదరాజు కాంట్రాక్టరు కాదు. ఇంజనీరు కాదు. బ్రతుకున ఎప్పుడూ కాంట్రాక్టరు అవుదామన్న భావనలేని వాడు. ఓ పెద్ద చిట్‌ఫండ్ + ఫైనాన్సు కంపెనీకి యజమాని. చిట్టీల వ్యాపారానికి ఆ టౌనులో మూల విరాట్టు. రకరకాల చిట్ లను ఆకర్షణీయంగా మలచి పెట్టడంలో నిష్ణాతుడు. పిల్లల చేతికి చాక్లెట్లు కొనుక్కోమనడానికి ఇచ్చిన పైసలకు కూడా చిట్టీలను వచ్చేలా చేయగల నేర్పరి.

వరదరాజు దగ్గరకి యాదగిరి అనే మిత్రుడు అమరీ జాన్ అనే హైద్రాబాదీని వెంటపెట్టుకొని వచ్చాడు. మర్యాద చేసి సంగతి అడిగాడు వరదరాజు. యాదగిరి అప్పుడు అమరీను పరిచయం చేసి ‘ఇతను పాకిస్థాన్ కెళ్లాడు. అక్కడ స్థిరపడ్డాడు. ఇక్కడ బ్యాంక్ కాలనీకి దక్షిణ భాగాన రోడ్డు సైడున ఎకరన్నర  స్థలముతో పాటు బంగ్లా ఉన్నది. పైకం వాయిదాలు పెట్టని పార్టీ దొరికితే అమ్మేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ ఆస్తికి మరో వారసుడున్నాడు. అతనూ ఇక్కడ లేడు. అతగానికి అక్కడకు చేరాక వెన్నెముక వ్యాధి వచ్చి కదలలేని స్థితి. నొప్పి పోరు. మనిషి పోడు. నొప్పేలేని క్షణమూ ఉండదు. పైగా అతను ఇద్దరు భార్యలున్నా నిస్సంతు. అతను, అతని భార్యాల సంతకాలు… కూడా పెట్టించి పంపాకనే రిజిష్ట్రరు. ఇక్కడ కొచ్చాంగదా. ఇక్కడ అలాంటి పార్టీ  ఎక్కడ దొరుకుతుందేమో చూద్దాం అనుకున్నాము’ అని ముగించాడు.

“యాదగిరీ నువ్వు చోటంతా బాగా చూసినావా?” అడిగాడు వరదరాజు.

“ఆఁ!”

“ఎంతలో ఉందేటి?”

“చివరకు పది లక్షలకయితే ఇచ్చేస్తానంటున్నాడు. నిజానికి ఇవ్వాళ ఆ బంగ్లాయే అంత చేస్తది” అన్నాడు.

“మీరిద్దరూ ఎన్ని రోజులుంటారు?” అడిగాడు.

“రెండు మూడు దినాలుంటాం! భద్రాచలం దాక పోయిరావాల.”

“అయితే నేను మీరు ఇక్కడికి వచ్చే నాటికి చెప్తా” అని లేచాడు వరదరాజు.

యాదగిరీ, అమరీ అతని వెంటనే నడచారు.

వరదరాజు ఆ రోజు వకీలు ముకుందాన్ని మొదటిసారి కలిసాడు. తను ఒక కొత్త వ్యాపారం ప్రారంభించబోతున్నాననీ, మొదటి బేరం తన దగ్గరకే వచ్చిందనీ చెప్పాడు.

“అయితే నాకు ఇరవై పైసల వాటా ఇవ్వు” అన్నాడు ముకుందం అనాలోచితంగానే.

“ఇరవై అని కాదు, తప్పక మీకు వాటా ఇస్తాను” అని లేచాడు.

తల ఊపాడు ముకుందం నీ యిష్టం అన్నట్లు.

అక్కడ నుంచి నళినీ రెడ్డి దగ్గర కెళ్లి ఇదే చెప్పాడు వరదరాజు.

“నాకు పదిహేను పైసల వాటా ఇవ్వగలవా?” అంది నవ్వుతూ.

“మీరు కావాలంటే చూద్దాం. దానిదేముంది” అన్నాడు వరదరాజు.

“అయితే నా వాటా పదిహేను పైసలు. డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడ తీసుకెళ్లు” అన్నది. “మంచిది” అని ఆవిడ ఇచ్చిన హార్లిక్స్ త్రాగి డాక్టర్ హర్షనూ, చక్రపాణినీ కలిసాడు. చక్రపాణితో మాత్రం “పది పైసలు నీకు వాటా ఇస్తాను” అని చెప్పాడు. తల ఊపాడు సంతోషంగా. ఓ పెగ్గు విస్కీ పోస్తే త్రాగి మూతి తుడుచుకుని వచ్చాడు.

భద్రాచలం నుంచి వాళ్ళు రాగానే హైద్రాబాదు చేరాడు. పొద్దుటే మొదటి చోటు చూపాడు. నచ్చింది. టౌను ప్లాను చూపాడు. తెల్సిన వాళ్లతో దాని స్థితిగతులను గురించి తెల్సుకున్నాడు. రేటు వివరాలు తెల్సుకొని ఇంటికి చేరాడు ఆ రాత్రి. ప్రొద్దుటే అమ్మోరి గుడికెళ్ళి దండం పెట్టుకుని, ఊదుపుల్ల ఇంటి కాడ వెలిగించి, ఆ గాలి వృథా పోకుండా అక్కడే ఉండి పిల్చి – యాదగిరికి కబురు పెట్టాడు. వాడు రాగానే కాఫీ గట్రా ఇచ్చి పరామర్శ చేసి “ఇదిగో అమీరీ జాన్ ఇళ్ల చోటు బేరం ఉందంటివి గదా, నేనుగా దాన్ని పదహారు లక్షలకు కొందామనుకుంటున్నా” అన్నాడు.

“అడుగుదాం” అన్నాడు యాదగిరి బెట్టుగా.

“దాని పైన ఎటువంటి అభ్యంతరాలున్నా వాడే పరిష్కరించాలి. అందుకు హామీగా ఏభై వేలు జాయింటు ఎకౌంటుకి బ్యాంకులో వేయాలి. అట్టా ఇష్టపడితే అమీరీ జానును రిజిష్ట్రారుకు రమ్మను. పైకం స్పాట్‌న కడతాం” అన్నాడు.

అటు కలిపి – ఇటు కలిపి పదారున్నర లక్షలకు బేరం O.K  అయింది నాల్గోనాడు. ఆ తరువాత  R.K రావు కలిసాడు క్లబ్బులో. ‘నాకు ఎంతో కొంత వాటా కావాలి’ అన్నాడు.

సరేనని నూరు పైసల వాటాని నూటా పది పైసలు చేసి ‘మంచిద’న్నాడు.

పైకం కట్టి రిజిష్టరు చేయించుకున్నాడు. అలా మొదలయింది రావుకూ, వరదరాజులకు స్నేహం. చిట్ కట్టడంలో ప్రారంభమైన పరిచయం చివరకు భాగస్థులను చేసింది.

ఇది బాగా ముదిరాక ఒకనాడు వరదరాజుతో అన్నాడు “వరదా నువ్వు ఎక్కడ చేయి పెట్టినా వరదలా రావడమే గదా, అట్టా అని నాకు పూర్తి విశ్వాసం ఉంది. అంచేత నువ్వు  ఎక్కడ ఎలాంటి పని చేసినా నాది పదిహేను పైసల వాటా ఉంటూనే ఉంటది. దాన్ని బట్టి పైసలు తీసుకెళ్తుండడమే, యేం” అని నవ్వాడు. తన పైన ఉంచిన ఇంతటి నమ్మకానికి ఉబ్బితబ్బిబైన వరదరాజు ఆలు దగ్గర వాళ్లకి చెప్పి తెగ మురిసిపోయాడు. అనుకున్నట్టుగానే వరదరాజు కొన్న చోటు చేయి మారాక, దాని విలువ ఏడాది తిరగకముందే రెట్టింపై కూర్చున్నది. విషయం చెప్పాడు మిత్రులకు. ఒక్క నళినీ రెడ్డి తప్ప అంతా ఉంచమన్నారు. ఆవిడ వాటానూ రావుగారు వరదరాజు తీసేసుకొని పైసలిచ్చారు.

నాలుగో సంవత్సరం దానిలో ఉన్న పాత ఇంటిని కూలగొట్టించి ప్లాట్లు చేసి తొంభై లక్షలకు అమ్మాడు వరదరాజు. దాంతో ఈ ఇద్దరూ కలసి ప్లాట్ల వ్యాపారం లోకి దిగారు. ఇది ఇట్లా ఉంటే…

అక్షరం ముక్క రాని ఇంట్లో పని చేసే  మంగ్యా అనే అతనికి అక్షరాల్ని కష్టపడి నేర్పించి లైసెన్స్ ఇప్పించి కాంట్రాక్టరుని చేసాడు రావుగారు.

పెట్టుబడి రావుగారిది, కాంట్రాక్టరు మంగ్యా. పెట్టుబడిదే మూడు వంతుల లాభం.

ఈ పద్దతి ప్రాక్టికల్‌గా బాగా పండింది. మంగ్యాకు బిజిలీ అనే వాళ్ల కులపు పిల్లతో పెళ్లి జరిపించి గృహస్థును చేసాడు. రావుగారి మొదటి ఇంటిని మంగ్యా ఉండేందుకు కేటాయించాడు. కాంట్రాక్టు పనులు ముమ్మరంగా ఉండడం మూలాన మాంగ్యాకు నెలల తరబడి బయట ఉండాల్సి వచ్చేది. భార్య బిజిలీని అంతగా అలరించనూ లేకపోయాడు. వయస్సు ఒత్తిడికి అక్కడే దుర్వ్యసనాలకూ లోనయ్యాడు. రావుగారు మొదట్లో తండ్రి లేదా గార్డియన్ హోదాన బిజిలీ మంచి చెడూ స్వయంగా వెళ్లి అరుసుకునేవాడు. ఓ దుర్ముహూర్తాన బిజిలీ రావుగారి ఒళ్లోకి వచ్చింది. బెదిరినట్టుగానే బిజిలీ అనిపించింది తప్ప బాధపడినట్టు అనిపించలేదు. తరువాత తరువాత ఆ బెదురుపోయింది. లోకం కాకుల కంటే వార్తా పత్రికల వాళ్లకంటే అన్యాయమైనవాళ్లు కదా. బిజిలీని రావుగారు రెండో భార్యగా చెవులు కొరుక్కున్నారు అని కొందరు గిట్టని వాళ్లు పైకే అన్నారు.

ఈయనేమిటి ఈ వయసున ఇలాంటి పనేమిటి? బాగా తెల్సిన వాడు కదా, లోకులకు మరీ ఏం అనాలో కూడా ఏం అనకూడదో కూడా బొత్తిగా తెలీదు అని సరిపెట్టుకుంది శకుంతల. దానితోపాటు శకుంతలకు ఓ మలయాళీ కుఱ్ఱవానితో సంబంధం ఉందని చెవులు కొరుక్కోవడం రావుగారి దాక వచ్చింది. ఆయన దీన్ని బొత్తిగా పట్టించుకోలేదు. ఎవరేం అనుకున్నా వారి వారి సంబంధాలు ఎలా ఉన్నా భార్యాభర్తలుగా వారు చాలా దగ్గరిగానే మెలిగారనిపిస్తుంది. ఏ పొరపొచ్చాలు లేని సుఖ సంసారం వారిది.

ఇలా కట్లు తెంచుకుని పెరిగిన ధనలక్ష్మి S.E.గా అయ్యాక మరీ తికమకగా మారింది. ఉన్న ఇద్దర పిల్లలు చదువులో ఎదగలేదు. శారీరికంగా ఎదిగారు గనుక పెళ్లిళ్లు చేయాల్సి వచ్చింది. కన్నతండ్రి గదా, ప్రయోజకులు అవుతారేమోనని నాల్గయిదు సార్లు అవకాశాలు ఇచ్చి కల్పించి మరీ చూసాడు. ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి ఒకడు జూదరిగా, రెండోవాడు పక్కా త్రాగుబోతుగా మారారు. ఇదే ఎప్పుడూ ఆయన్ను ముల్లులా బాధిస్తుండేది. దిగమింగుతుండేవాడు. మందలించ ప్రయత్నించి అవమానం పాలు కూడా అయ్యాడు.

ఎప్పుడు ఏది ఎలా ఇంటి మీదకు వస్తుందోనని బితుకు బితుకుమంటూ ఉంటున్నాడు. ఇది గమనించాక తన స్థితి అర్థమయ్యాక అసలు నేను ఇంత ఎందుకు సంపాదించాను? అని ప్రశ్నించుకొనేవాడు. సమాధానం దొరక్క వారాల తరబడి పిచ్చెక్కి తిరుగుతుండేవాడు. ఆ ప్రశ్నకు సమాధానం దొరకలేదు. ఒక తాగుబోతు కోసం – ఒక తిరుగుబోతు కోసం ఇలా సంపాదించాలా? కళ్లల్లో నీరు ఉబికేది.

నేను తప్పు చేసానా? అనిపించి గండెంతా పిండేసినట్లయ్యేది.

నిద్ర కరువయ్యేది. కళ్లు మండేవి దాని పర్యవసానంగా. అర్థం గాని స్థితిన బిజిలీతో గడపడం – హద్దు మీరి త్రాగడం. అసంతృప్తి, ఆవేదన, బాధ. ‘భగవంతుడా నన్నిలా ఏపిస్తున్నావెందుకు? నేను చేసిన తప్పేమిటి? జరిగిన దోషమేమిటి?’ అని వాపోయేవాడు. ఇది ఇట్టా ఉంటే –

ముప్ఫై సంవత్సరాలు అర్ధాంగిగా మెలిగిన శకుంతల మలయాళ కుఱ్ఱాణ్ణి తీసుకుని – అందిన మేర నగలు డబ్బు తీసుకొని మాయమైంది. రావుగారినీ వార్త దిమ్మరపోయేలా చేసింది. తిరిగి వస్తుందేమోనని చాలా రోజులు  ఆశగా ఎదురు చూశాడు. రాలేదు.

ఎంత భ్రష్టులైనా పిల్లల కోసమూ- ఆరాతీసాడు. వారు అందుబాటులోకి రాలేదు.

చివరకు తనుగా కట్టుకున్న మహల్‌లో తనను ‘మంచి నీళ్లు కావాలా’ అని అడిగే స్థితి లేని గోడు. కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు.

చివరకు మరో ఆసరా కనిపించక మంగ్యాని, బిజిలీని తన ఇంట్లోనే తెచ్చి పెట్టుకున్నాడు. ఒకసారి రావుగారు బిజిలీ ఒక్కటిగా ఉండడం మంగ్యా దృష్టిలో పడింది. రావుగారిని మంగ్యా ఏమనలేదు. కానీ బిజిలీని విహారానికని తీసుకపోయి నరికి పారేసి పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. ఇది మరో షాకయింది రావుకు. ఇంతలో రిటైర్‌మెంటు. బయటకు కదిలే అవసరమూ తప్పింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here