నేపథ్య రాగం – నాటకం – దృశ్యం 11

0
6

[box type=’note’ fontsize=’16’] యుగ-యుగాల నుండి ఈ సంఘమనే రంగస్థలంపైకి వచ్చి కనబడాలని, వినబడాలని నిరంతరం సంఘర్షణ చేస్తున్న ఒక సన్నని రాగం కథే ఈ ‘నేపథ్య రాగం’.. హిందీ మూలం డా. మీరాకాంత్. తెలుగు సేత డా. సుమన్‌లత రుద్రావజ్ఝల. [/box]

దృశ్యం-11

[dropcap](మా[/dropcap]ళవ గణనాయకుడైన విక్రమాదిత్యుని రాజాస్థానం! స్తంభాలు, తోరణాలు కట్టిన ద్వారాలతో అలంకరింపబడిన సభాభవనంలో, సామ్రాట్టు ముందు – ముందు నడుస్తూ ఉండగా, వెనకే వెనకే ఆయన ఆస్థానంలో నవరత్నాలు అడుగులు వేస్తూ అనుసరిస్తున్నారు.)

విక్రమాదిత్యుడు : స్వాగతం ధన్వంతరి రత్నవర్యా…. ఆసీనులు కండి.

ధన్వంతరి : ఈనాడు ఈ కొత్త పరిపాటి ఏమో? ముందుగా గణనాయకులవారు కదా ఆసనాన్ని స్వీకరించేది!

విక్రమాదిత్యుడు : (తడబాటును కప్పిపుచ్చుకుంటూ) మీవంటి వయోవృద్ధులైన జ్ఞానులు ముందుగా ఆసీనులయితే మాత్రం ఏం ఇబ్బంది? రండి ఆసీనులు కండి!

(విక్రమాదిత్యుడు తన సింహాసనంపైన ఆసీనులవగానే నవరత్నాలు కూడా తమ-తమ ఆసనాలలో ఆసీనులవుతారు)

వరరుచి : ఈనాటి ఉదయాన్నే సభాప్రాంగణంలో ఈ సమావేశం! విపత్కర పరిస్థితులేమీ లేవు కదా?

విక్రమాదిత్యుడు :- (నవ్వుతూ) ఉహుఁ! అలాంటి విపత్కర – అత్యవసర పరిస్థితులేమీ లేవు…

(ఆచార్య వరాహ మిహిరుల వారిని చూసి) మీకు తెలుసుకదా, పృథుయశస్సు నుండి కొత్త వర్తమానం ఒకటి అందిందని! అక్కడ వేధశాలకు సంబంధించిన పర్యవేక్షణలన్నీ పూర్తయేయి. ఇక శంఖుస్థాపన చెయ్యమని ప్రత్యేక విన్నపం. అందుకే రేపు ప్రాతః కాలమే మహాకాళేశ్వరుని దర్శనం చేసుకుని అక్కడి నుండే పయనమవాలని అనుకుంటున్నాము.

క్షపణకుడు : అయితే, ఆచార్య వరాహమిహిరులవారు కూడా ఈ ప్రయాణంలో మీతో ఉంటారా?

విక్రమాదిత్యుడు : ఉహుఁ! ప్రస్తుతానికి ఒక పరిమితమైన ఉద్దేశంతోనే పయనమవుతున్నాను. భవిష్యత్తులో వేధశాల పనులన్నీ ఆయన పర్యవేక్షణలోనే జరుగుతాయి… మిహిరావళిలాగే!

వరరుచి : (ఉత్సాహం నిండిన గొంతుతో) ఈ పని ఎంతో శ్రేయస్కరమైనది. ఎన్ని వేధశాలలు నిర్మించబడితే అంత ఉత్తమం! శాస్త్రము – విజ్ఞానాల కలయిక ఇది.

విక్రమాదిత్యుడు : ఈ విషయాన్ని మీకు నేను రాజాస్థానంలో కూడా సూచించవచ్చు. కాని ఈనాడు నవరత్నాలను క్షిప్రానదీ తీరం నుండి ఇక్కడకు తిన్నగా తీసుకురావడం ఒక ప్రత్యేక కారణం వలనే! ఈ విషయాన్ని గురించి ఆచార్య వరాహమిహిరుల వారితో చర్చించాను కూడా! పృథు యశస్సుకు తెలియజేసేముందు మన నవరత్నాల ఆమోదం కోరుకుంటున్నాను.

క్షపణుకుడు : ఏదైనా ప్రత్యేకమైన విధానానికి సంబంధించిన నిర్ణయమా?

విక్రమాదిత్యుడు : కావాలంటే మీరు ఆ విధంగా కూడా భావించవచ్చు!

(కొద్ది క్షణాలపాటు ఆగి, ఆలోచనల్లో మునిగిపోయి, మరలా తన మాటను కొనసాగిస్తూ) కొద్ది కాలం కిందట ఆచార్య వరాహమిహిరుల వారి శిష్యురాలు, కోడలు అయిన ఖనాదేవి గౌడ దేశం గురించి చెప్పిన భవిష్యవాణి నూటికి నూరుపాళ్లు నిజమయిందని మీ అందరికీ కూడా తెలిసిన మాటే! జ్యోతిష్యాచార్యులలో ఈనాడు ఆమెకు వ్యక్తిగతమైన గుర్తింపు లభించింది. ఆమె జ్ఞానం – అంతర్దుష్టులు దేశమంతటికీ ఉపయోగపడాలని మా అభిమనం. రాజాస్థానంలో ఖనాదేవిని ఒక సభ్యురాలిగా నియమించగలిగితేనే అది సాధ్యపడుతుంది.

ధన్వంతరి : (ఉలిక్కిపడి) ఖనాదేవిని… సభ్యురాలిగా?

ఘటఖరరుడు : (ఆశ్చర్యంగా) అంటే రాజాస్థానంలో ఒక స్త్రీకి సభ్యత్వమా?

క్షపణకుడు : కాని మహారాజా! పూర్వం ఇలా జరిగినట్లు ఉదాహరణలేమీ లేవే! ఈనాటి వరకూ రాజాస్థానంలో స్త్రీలెవరూ సభ్యులుగా లేరే!

విక్రమాదిత్యుడు : (కాస్త ఉద్రేకపడిన స్వరంతో చటుక్కున మాట అందుకుని) ఆచార్య వరాహమిహిరుల వారు మొదటిసారి రోమ్ దేశానికి రాయబారిగా వెళ్లినప్పుడు ఆయన కన్న పూర్వం ఎవరైనా ఈ దేశం నుండి ఆ దేశానికి ఈ విధంగా ఎవరైనా వెళ్లిన వారు ఉన్నారా? (ఘటఖర్పరుని వంక చూస్తూ) మీరు చెప్పండి ఘటఖర్పర రత్నవర్యా! మీ నేతృత్వంలో జరుగుతున్న ప్రయోగాలు, కొత్త – కొత్త ఆవిష్కారాలు కూడా ఇంతకు ముందే చోటు చేసుకున్నాయా? (ఒక్కసారి బలంగా ఊపిరి వదలి) అంతేనా? మహాకవి కాళిదాసులవారు ‘కుమార సంభవం’ రచించడానికి ముందు, ఎవరయినా దానిని రచించడం జరిగిందా? (కాస్త ఆగి) అంటే నా అభిమతం ప్రకారం పూర్వోదాహరణ లేకపోవడం అన్నది ఒకపని చెయ్యడానికి ఇబ్బందిగా ఎందుకు మారాలి? అని!

వరరుచి : (మాటను సంబాళించడానికి ప్రయత్నిస్తూ) ఇందులో సందేహమేముంది మహారాజా!

విక్రమాదిత్యుడు : (గంభీరంగా) ఈ విషయం గురించి నేను ఆచార్య వరాహమిహిరుల వారితో చర్చించడం అయింది. కాని నిర్ణయం మాత్రం మీ అందరి అనుమతితో తీసుకోవాలనుకుంటున్నాను.

(నవరత్నాలు అందరూ కొద్ది క్షణాలపాటు మౌనంగా ఉంటారు. విక్రమార్కుడు వారినందరినీ తదేక పరిశీలనా దృష్టితో చూస్తూ ఉంటాడు.)

ధన్వంతరి : (వ్యంగ్యంగా, వరాహమిహిరునితో) ఓహో! అంటే ఆచార్య వరాహుల వారికి ఏవిధమైన ఇబ్బందీ లేదన్నమాట!

వరాహమిహిరుడు : (ఉక్కిరి బిక్కిరి అవుతూ) వ్యక్తిగతంగా నాకు ఇందులో ఇబ్బంది ఏమాత్రం లేదు. కాని మహారాజుగారు శలవిచ్చినట్లు ఇంత పెద్ద నిర్ణయాన్ని అందరి సమ్మతితోనే తీసుకోవడం జరుగుతుంది.

ఘటఖరరుడు : (వరాహమిహిరుడికి తగిలేటట్లు, వ్యంగ్యంగా) ఔనౌను… వ్యక్తిగతంగా మీకేం ఇబ్బంది చెప్పండి?… స్త్రీలను గురించిన మీ ఉదారమైన అభిప్రాయం అందరికీ తెలిసినదేకదా… మీరే వ్రాశారుగా – బ్రాహ్మణుల పాదాలు పవిత్రమైనవి; గోవుల పృష్ట భాగం, అజాలు(మేకపోతులు) గుజ్రాల ముఖాలు పవిత్రమైన భాగాలు; కాని స్త్రీల ప్రతి అంగమూ పవిత్రమైనదే అని!

వరరుచి : (వ్యంగ్యాన్ని అర్థం చేసుకుని, తనవంతు అస్త్రాన్ని సంధిస్తూ) స్త్రీ రత్నాన్ని స్వయంగా బ్రహ్మదేవుడే సృష్టించాడు. స్త్రీలు రత్నాల శోభను మరింత ఇనుమడింపజేస్తారు. రాజాస్థానంలోకి ఎవరైనా స్త్రీ ప్రవేశిస్తే బహుశా నవరత్నాలమైన మన కాంతి కూడా మరింత తళుక్కు మంటుందేమో?

విక్రమాదిత్యుడు : (కాస్తంతరోషంగా) దీనిని పరోక్షంగా మీ అసమ్మతి అనుకోవాలా?

క్షపణకుడు : (విషయాన్ని గాడి తప్పనీయకుండా) కాదు… కాదు… స్త్రీ అంటే జనని… జీవితాధారం… సాక్షాత్తూ సరస్వతీ దేవి… వారిని ఎవరైనా ఎలా నిందించగలరు.

విక్రమాదిత్యుడు : (ఖిన్నవదనంతో) ఇటువంటి చారిత్రాత్మక నిర్ణయాన్ని నవరత్నాలందరూ ఉన్నప్పుడు తీసుకోగలిగితే ఎంత బాగుంటుంది? (ఉదాసీనంగా) దగ్గరలో సాధ్యం కాదు కూడా! రత్నవర్యుడైన కాళిదాసు కాశ్మీరంలో ఉన్నారు. తక్కిన ముగ్గురు రత్నవర్యులు కూడా నగరంలో లేరు.

వరరుచి : (సామ్రాట్టును ఊరడించాలని ప్రయత్నిస్తూ) మహారాజా! మీరు విచారించవద్దు. ప్రదేశం మారినంత మాత్రాన ఆలోచనలలో మార్పు రాదు కదా! ఈనాడు మహాకవి కాళిదాసు ఇక్కడ మన మద్య సభలో ఉంటే, ఆయన ఈ ప్రతిపాదనను విరోధించేవారా, చెప్పండి? (ఘటఖర్పరుని వంక, విషయాన్ని సంబాళించమన్నట్లు అడుగుతున్నట్లున్న ధోరణిలో చూస్తూ) మీరే మంటారు ఘటఖర్పర రత్నవర్యా? కవిత్వం మీకు హెచ్చు ప్రీతికరం కదా! ‘అభిజ్ఞాన శాకుంతలం’లో స్త్రీ విద్య గురించి కవి శిరోమణిగారు ఎంతో ప్రముఖంగా వచించారు కదా!

ఘటఖరరుడు : (చిరాకు పడుతూ) కాని, ఒక స్త్రీ సభాసదస్యురాలుగా ఉండటం అన్న ఉదాహరణ ఆయన సాహిత్యమంతటా వెతికినా ఎక్కడా లేదు.

వరరుచి : (తన చిరునవ్వును కప్పిపుచ్చుకుంటూ) బహుశా స్త్రీ యొక్క ఆ రూపాన్ని చిత్రించడాన్ని ఆయన ఏదో కొత్త రచన కోసం దాచుకున్నారేమో!

ఘటఖర్పరుడు : (అదే చిరాకుతో) ఎందుకు కాదు? కవికుల గురు కాళిదాసుగారి స్త్రీ పాత్రలు సేవకుల శ్రేణిని మించి ముందుకు పోలేక పోయేయి కదా… అంటే, తక్కిన పురుషపాత్రల వలె సంస్కృతంలో కాక, సేవకుల వలె ప్రాకృతం మాట్లాడుతారు కదా అని నా భావం!

(విక్రమాదిత్యుడు వారిని మౌనంగా ఉండమని సూచిస్తాడు).

విక్రమాదిత్యుడు : (రోషపడిన స్వరంతో) చాలు! కావలసినంత చర్చ నడిచింది. ఆచార్య వరాహమిహిరుల వారు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా?

వరాహమిహిరుడు : (తొట్రుపడుతున్న స్వరంతో) నేను చెప్పేను కదా మహారాజా… నేను చెప్పేను!

విక్రమాదిత్యుడు : అంటే?

వరాహమిహిరుడు : (చటుక్కున) ఈ సందర్భంలో ఇక్కడ ఉపస్థితులయిన రత్నవర్యుల అభిమతమే నా అభిమతం కూడా!

విక్రమాదిత్యుడు : ఉపస్థితులైన రత్నవర్యుల అభిప్రాయాల్ని నేను కాస్త – కాస్త గ్రహించుకోగలుగుతున్నాను. కాని మీ అందరి ప్రతిక్రియ నాకు అంత ఉత్సాహాన్ని పెంచేదిగా అనిపించడం లేదు. స్పష్టంగా విరోధించకపోయినా, మీ మాటలలో ఏవిదమైన సమ్మతి సుగంధం కూడా లేదు!

ఘటఖరరుడు : (ముఖస్తుతిలా) మీకు అలాటి భావం ఎందుకొచ్చింది మహారాజా? విక్రమాదిత్యుడు : (బాధగా) రాజు సభ చేసే ప్రదేశంలో మరుగుజ్జులు, వామనులు, కుబులు, నపుంసకులు, స్త్రీలు ఉండకూడదన్న ఉపదేశం ఈనాటి సందర్భంలో అర్థంలేనిది, అప్రాసంగికం అని నేను భావించాను. ఆకాశమండలంలోని నవగ్రహాలవలె, రాజ్యం యొక్క తేజస్సును నవరత్నాల రూపంలో వెతికి తెచ్చి ఈ సభను అలంకరించేను. జ్ఞాన-విజ్ఞానాలు, కథ-సాహిత్యాలలో మర్మజ్ఞులైన మహానుభావుల ఉదార దృష్ట, ఈ బిందువుకు వచ్చేసరికి నిరాశా జనకమవుతే, ఇక సాధారణ ప్రజలు,

జనసంఖ్యలో సగం ఉన్న వారిని గురించి ఏమి ఆలోచించగలరు? (ఎంతో బాధగా) అయ్యో! మాళవ గణాధ్యక్షుడైన విక్రమాదిత్యుడికి ఈనాడు ఘోరమైన నిరాశే ఎదురయింది.

ధన్వంతరి : (కంగారుగా) అదేం కాదు మహారాజా! అలాటి దేమీ లేదు. ఇటువంటి గంభీరమైన అంశాలను గురించి ఏకాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ముఖ్యం.

ఘటఖర్పరుడు : (పరిస్థితిని, మాటను గ్రహించుకుని) ధన్వంతర రత్నవర్యులు చెప్పినది యదార్ధమైన మాట. మాకు ఈ అంశాన్ని గురించి చర్చించేటందుకు కాస్తంత సమయాన్ని ప్రసాదించండి.

వరరుచి : (చింతాక్రాంతుడయి) మహారాజుల వారు ఉచితమని భావిస్తే మేము పరస్పరం ఈ విషయాన్ని గురించి లోతుగా చర్చించడం భావ్యం. మధ్యాహ్నం తరవాత సామ్రాట్టుల వారికి మా అందరి ఉమ్మడి అభిప్రాయాన్ని విన్నవించుకుందుకు అనుజ్ఞ నివ్వండి.

క్షపణకుడు :- మాళవాధీశునికి ఈ విధమైన నిరాశ ఎంతమాత్రం శోభనీయం కాదు. మీ కోరిక మాకు శిరోధార్యం. ఏదో ఒక దారిని కనుక్కోవాలి!

విక్రమాదిత్యుడు : (లేచి నిల్చుని) మీ అందరి నిర్ణయానికి నిరీక్షిస్తూ ఉంటాను. చూద్దాం ఏమార్గం లభిస్తుందో!

(విక్రమాదిత్యుడు పెద్ద-పెద్ద అంగలతో నిష్క్రమిస్తాడు. తక్కిన రత్నవర్యులు కూడా లేచి నిల్చుంటారు. ఒక క్షణం కాలంపాటు ఈ పరిస్థితిని ఎలా సంబాళించాలో అన్నట్లు పరస్పరం చూసుకుంటారు. అందరూ గంభీరంగా ఆలోచనా ముద్రలో ఉండి, అక్కడి నుండి ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తారు.)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here