నేపథ్య రాగం – నాటకం – దృశ్యం 3

0
9

[box type=’note’ fontsize=’16’] యుగ-యుగాల నుండి ఈ సంఘమనే రంగస్థలంపైకి వచ్చి కనబడాలని, వినబడాలని నిరంతరం సంఘర్షణ చేస్తున్న ఒక సన్నని రాగం కథే ఈ ‘నేపథ్య రాగం’.. హిందీ మూలం డా. మీరాకాంత్. తెలుగు సేత డా. సుమన్‌లత రుద్రావజ్ఝల. [/box]

దృశ్యం-3

[dropcap](సు[/dropcap]బంధు భట్టు, ఖనాలతోబాటు రెండవ దృశ్యం కూడా మరుగవుతుంది. ఇప్పుడు స్టేజిపైన మేధ, ఆమె తల్లి మధ్య సంభాషణ మూడవ దృశ్యానికి సూత్రం సమకూర్చుతూ)

మేధ : అమ్మా! ఐతే వరాహమిహిరుడు ఖనాకి జ్యోతిష శాస్త్రం బోధించేడంటావా?

తల్లి : (నడుస్తూ-నడుస్తూ ఆగి) బోధించేడు. ఖనా భవిష్యత్తును గురించి సరిగ్గా చెప్పే వ్యక్తిగా పేరు సంపాదించి ప్రసిద్ధికెక్కింది. ఆమె జీవిత లక్ష్యం ఏకాగ్రతతో అధ్యయనం చేయడమే! దానిలో ఆమెకు సాఫల్యం లభించింది. కాని…

మేధ : (ఆగి) కాని….?

తల్లి : ఆమె జ్ఞానాన్ని… ఆమె ప్రసిద్ధిని, ఆ ప్రపంచాన్ని స్వంతం చేసుకోవాలని ఎల్లప్పుడూ కాసుకుని కూర్చున్న కొంతమంది పెద్దలెక్కడ జీర్ణించుకోగలిగారు?

మేధ : అంటే?

తల్లి : ఔను! ఒక మహిళ భవిష్యవాణి చెప్పడం, అందులో ప్రసిద్ధి పొందడం అంటే ఆలోచించు, ఎంత కఠోర పరిశ్రమ చేసి ఉంటుందో….. ఏ శాస్త్రాన్ని ఎవరికీ అలా అలా రంగరించి తాగించలేరుగా…. ఖనా చేసే కరోర పరిశ్రమను ప్రజలు మాత్రం ‘అబ్బే వేషాలు వేస్తోంది!’ అంటూ ప్రచారం చేశారు.

మేధ : అంటే? అర్థం కాలేదు.

తల్లి : నిజంగా… వరాహమిహిరుడు తయారు చేసిన ‘జ్యోతిష్మతి తైలాన్ని’ ఖనా తాగేసింది అన్నారు.

మేధ : తైలమా? అంటే, ‘యూ మీన్ సమ్ సార్ట్ ఆఫ్ టానిక్?

తల్లి : సరే…. టానిక్కే అనుకుందాం… కాని కేవలం టానిక్కు తాగే నువ్వు గోల్డ్ మెడలును సాధించగలిగే దానివా?

మేధ : (నవ్వుతూ) నా గోల్డ్ మెడల్ సంగతి పక్కన పెట్టుగాని… అటుపైన ఏం జరిగిందో చెప్పు?

తల్లి : (నడుస్తూనే) మరేదో జరగవలసింది… ఏనాడూ… కనీసం ఖనా ఊహించలేనిది…

మేధ : (వెనకాలే గబగబ అడుగులు వేస్తూ) ఏమయింది?

తల్లి : వరాహమిహిరుడి కుమారుడు పృధు యశస్సు స్వయంగా విద్వాంసుడు. ఉత్తరోత్తరా జ్యోతిషాచార్యునిగా గొప్ప ప్రసిద్ధిని పొందాడు. అతను ఖనా పట్ల ఆకర్షితుడయ్యాడు.

మేధ : (నవ్వుతూ) ఏమన్నావు?

తల్లి : వరాహమిహిరుడు ఎంతగానో బోధపరిచాడు కాని…

మేధ : కాని?

(మేధ ఆగిపోవడంతో తల్లి కూడా నిల్చుండిపోతుంది)

తల్లి : (కాస్తంత వ్యంగం కూడిన దృష్టితో మేధను చూస్తూ, చిరునవ్వుతో) అటువంటి సమయంలో అసలు ఏమైనా అర్థం అవుతుందా? గుర్తుందా? ఎమ్.ఏ. మొదటి సంవత్సరం చదువుతూండగా నువ్వు కూడా…. ఎంత బోధపరిచాము? కాని…

మేధ : అమ్మా…! అవన్నీ ఇప్పుడెందుకు…?

తల్లి : (నోటి పైన వేలువేసుకుని స్టేజిమీద నడుస్తున్న దృశ్యాన్ని చూడమని సూచిస్తుంది. మరోవైపు నుండి వడివడిగా అడుగులు వేస్తూ వస్తున్న వరాహమిహిరుడు, వెనకే వస్తున్న పృథు యశస్సు రావడం కానవస్తుంది. తల్లి కూతుర్లు వారికి రంగస్థలంపైన స్థానం వదిలేసి మరొకవైపుకు తప్పుకుంటారు) వరాహమిహిరుడు : (వడివడిగా అడుగులేస్తూ) కాదు… కాదు… అలా, ఎలా అవగలదు?

పృథు : ఎందుకు కాకూడదు?

వరాహమిహిరుడు :  ఖనా నా శిష్యురాలు.. అటుపైన సుబంధు భట్టు అన్న కుమార్తె!… సుబంధు భట్టు నాకు పుత్రసమానుడు.

పృథు : ఎంత ఉత్తమమైన ఆలోచన!

వరాహమిహిరుడు : కాని నాయనా… పృథూ…. నువ్వు వచ్చే నెల… నా ఉద్దేశం, మాళవ గణనాయకుడైన విక్రమాదిత్యుడి ఇచ్ఛానుసారం, నువ్వు అతి త్వరలో ఉజ్జయిని నగరానికి చేరుకోవలసిన అవసరం ఉంది. ఆయన ఆజ్ఞను పాటిస్తూ, కొత్త వేధశాలను నిర్మించడానికి వాస్తు శాస్త్రానుసారం అనువైన స్థానాన్ని వెతికి, పరిశీలించడం నీ ధ్యేయం కావాలి!

పృథు : (కంఠాన్ని అదుపులో ఉంచుకుంటూ, తనమాటను బలపరుస్తున్న రీతిలో) నా ధ్యేయం అది… ఆహ! అదే.. నా… ధ్యేయం! దీనికి వివాహం అడ్డంకేమీ కాదు.

వరాహమిహిరుడు : నువ్వు ఈ నగరం నుండి వెళ్లబోతున్నావు. తిరిగి ఎన్నిమాసాల తరువాత వస్తావో… ఇలాంటి పరిస్థితిలో నీ వివాహం గురించిన మాటలు నువ్వొచ్చాక అయితేనే బాగుంటుంది.

పృథు : (గొంతుకలో సన్నని బాధ) నాన్నగారూ! ఇదే భేదం…. కాదు ఇది మాత్రమే భేదం.. సాధారణానికి…. అసాధారణానికి…

వరాహమిహిరుడు : భేదమా?

(ఇప్పటి వరకూ అక్కడే నిల్చుని మేధ, ఆమె తల్లి – వరాహమిహిరుడు, పృథు యశస్సుల మధ్య నడుస్తున్న సంభాషణను వింటూ ఉండగా, తల్లి మేధను పదమని సూచించడంతో స్టేజిపై నుండి తల్లి – కూతుర్లు నిష్క్రమిస్తారు.)

పృథు : ఔను… నేను సాధారణ కులంలో జన్మించి ఉంటే నా తల్లి తండ్రులు ఈ పాటికి నన్ను ‘ముందు పెళ్లి చేసుకున్న తరవాతే నగరం విడిచి వెళ్లు’ అని పట్టుపట్టేవారు. మరి ఇప్పుడు నేనూ ఉన్నాను. నా సంగతికొస్తే…..

వరాహమిహిరుడు : తర్కం బాగానే ఒంట బట్టిందే… తర్కం – మీమాంసా శాస్త్రజ్ఞుడు క్షపణుకుడి ప్రభావం వలన కాబోలు!

పృథు : (ఉద్రేకం నిండిన స్వరంతో) నాకు ఒకటి అర్థం కావడంలేదు… ఈ వివాహం అంటే మీకేమైనా సిద్ధాంతపరమైన ఇబ్బంది ఎదురవుతుందా?

వరాహమిహిరుడు : సిద్ధాంతపరమైన ఇబ్బంది నాకెందుకుంటుంది? నువ్వు స్వయంగా పండితుడివి… కాని ఈ అమ్మాయి గ్రహాలు హెచ్చు బలంగా ఉన్నాయని మాత్రం నాకర్థం అవుతోంది. …. నువ్వు జ్యోతిష్యంలో ఎప్పటినుండో వస్తున్న ఒరవడిని పట్టుకుని నడుస్తున్నావు….

పృథు : తెలుసు. మీ ఆలోచనలు కూడా చాలా ఔదార్యంతో కూడినవని కూడా నాకు తెలుసు…. కాని ప్రస్తుతం నేను మాట్లాడుతున్నది జ్యోతిష్యం గురించి కాదు… వివాహం గురించి!

వరాహమిహిరుడు : (గొంతుకలో కాస్తంత కోపం ధ్వనిస్తూండగా) నువ్వు ఇంకా చిన్నవాడివి…. విలువలు, అభిప్రాయాలు వ్యక్తిత్వంకి అంగాలవంటివి… ఇంతకీ జ్యోతిష్యంలో పాత సంప్రదాయాలను పాటిస్తూ, గార్హస్థ్య జీవితంలో విశాల హృదయాన్ని చాటుకోగలవా?

పృథు : గార్హస్థ్యం శాస్త్ర చర్చ కాదుకదా!

వరాహమిహిరుడు : (పృథు యశస్సు కళ్లలోకి చూస్తూ) గృహస్థధర్మం శాస్త్రార్థం కాకపోవచ్చు కాని, …. మీరిద్దరూ ఒకే మార్గంపైన పయనించే పథికులు. తను అదే మార్గం పైన నీకన్న ముందుకు సాగిపోతూంటే చూసి తట్టుకోగల సాహసం నీకుందా? నీకు తెలుసా, తన గ్రహాలు…

పృథు : (ఎంతో వినయంగా) మీ దయవలన నాకు నా సామర్థ్యంపైన నమ్మకం ఉంది నాన్నగారూ! ఇద్దరి అభిరుచులు, ఇద్దరి మార్గాలు ఒకటే అయితే కుటుంబ జీవితంలో ఆనందం సజీవంగా నిల్చి ఉంటుంది….. గార్హస్య జీవితపు కొత్త కోణాలు తెరుచుకుంటాయి.

వరాహమిహిరుడు : (పృథు యశస్సును బెదిరిస్తున్న ధోరణిలో) నేను చెప్పేదేమిటో నిజంగా నీకు అర్థం కావడంలేదా లేక అర్థం చేసుకోవాలనుకోవటం లేదా?

పృథు : (చిరాకుగా) నాన్నగారూ….. మీరు

వరాహమిహిరుడు : నాయనా! కాలం అనుకూలంగా లేనప్పుడు బలమైన బుధుడు కూడా తర్కం స్థానే కుతర్కాన్ని ప్రోత్సహిస్తాడు! నీకు శుక్రదశ నడుస్తోందని నీకు గుర్తుంది కదా! శుక్రుడు…. ఏకాక్షి అని కూడా వ్యవహరిస్తారు… కాకి లాగ… ఒకసారి కేవలం ఒకవైపు మాత్రమే ఒక్కసారి చూడగలుగుతాడు…. అతని వశం లేదు గనక… ఈ మధ్య నువ్వు చూస్తున్నట్లు!

పృథు : (తనను తాను నిగ్రహించుకుంటూ) కాని స్వయంగా మీరు ఖనా అంటే ఎంత ఇష్టపడ్డారు?…. మొదటిసారి ఒక శిష్యురాలు మన ఇంటి గుమ్మాన్ని దాటి లోపలికి రాగలిగింది….

వరాహమిహిరుడు : నిజమే గాని, ఒక శిష్యురాలిగా… ఇంటి కోడలిగా అడుగు పెట్టి ఉంటే గనక… అని ఆలోచిస్తే…

పృథు : (ఒక్కసారిగా) ఆలోచించడానికేముంది?…. మీరే అంటారుగా, మనం గ్రహాలు ఎలా నడిపిస్తే అలా నడుస్తామని…. ఇందులో ఇంత ఆలోచించడానికేముంది?

వరాహమిహిరుడు : (ఆగి తేరపారి చూస్తూ) అంటే నువ్వు  నిశ్చయించుకున్నావన్నమాట…. (కొద్ది క్షణాలు ఆలోచించి)

నీ ఒక్కడి నిర్ణయమేనా ఇది, లేక ఇందులో ఖనా సమ్మతి కూడా ఉందా?

పృథు యశస్సు : (ఆలోచనలో మునిగినట్లు) చెప్పలేను.

వరాహమిహిరుడు : అంటే?

పృథు : ఈ విషయమై ఆమెతో ఏనాడూ చర్చించలేదు.

వరాహమిహిరుడు : మరి ఎలా?

పృథు : మర్యాదస్థుల కుటుంబాలలో కన్యలకి వివాహానికి సంబంధించిన విషయాలు పెద్దవారు ప్రస్తావిస్తారు. మనం సూర్యవంశస్థులం… మిహిరకులం మనది… మన మర్యాద మనకుంటుంది… నా ఉద్దేశం (మార్దవమైన గొంతుకతో) ఇది మీ హక్కు… అందులో నేనెలా తల దూర్చగలను?…..

వరాహమిహిరుడు : (క్రోధాన్ని నియంత్రించుకుంటూ) అర్థం అవుతోంది. అంతా అర్థం అవుతోంది……

పృథు : మీకు తెలుసుకదా… వచ్చేనెల చివరకు నేను ఇక్కడి నుండి ప్రయాణం కావాలి…. హెచ్చు సమయం లేదు కదా!

వరాహమిహిరుడు : ఇంత త్వరగా ముహుర్తమూ లభించదు.

పృథు : ముహూర్త శాస్త్రంలో ఉద్దండుడైన తండ్రి దొరకడం ఎవరి అదృష్టమో, వారు ఇటువంటి సందేహాలకు తావు ఇవ్వడమే అనవసరం. (వరాహమిహిరుడు తిరిగి చూస్తాడు తప్ప, ఏం మాట్లాడడు). అంటే నాకు నిశ్చింతే కదా!

వరాహమిహిరుడు : (కాస్తంత వ్యంగ్యాన్ని జోడించి) నిజమే!….. ఇక చింత అంతా నాది కదా!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here