నేపథ్య రాగం – నాటకం – దృశ్యం 7

0
6

[box type=’note’ fontsize=’16’] యుగ-యుగాల నుండి ఈ సంఘమనే రంగస్థలంపైకి వచ్చి కనబడాలని, వినబడాలని నిరంతరం సంఘర్షణ చేస్తున్న ఒక సన్నని రాగం కథే ఈ ‘నేపథ్య రాగం’.. హిందీ మూలం డా. మీరాకాంత్. తెలుగు సేత డా. సుమన్‌లత రుద్రావజ్ఝల. [/box]

దృశ్యం-7

[dropcap](ఆ[/dropcap]చార్య వరాహమిహిరుల వారి గృహం. దానికి ఉన్న ఉద్యానవనం. ఆ ఉద్యానవనం మధ్యన పుష్పించిన లతలతో అలంకరించిన పీఠం ఉంది. ఆ పీఠం చుట్టూ ఇప్పుడే ఎవరో ముగ్గులతో అలంకరించినట్లు తెలుస్తోంది. పీఠంపైన వేదిక అమర్చబడింది. దగ్గరగా కొన్ని భూర్జర పత్రాలున్నాయి. కలముతోబాటు సిరా పాత్ర కూడా ఉంది. ఆచార్య వరాహమిహిరుడు పూర్తి తన్మయత్వంతో వ్రాతపనిలో మునిగిపోయి ఉన్నారు. అక్కడ కూర్చుని ఆయన ‘పంచతంత్రం’ అనువాదాన్ని చెయ్యడంలో నిమగ్నులయినటువంటి సమయంలో ఖనా ప్రవేశిస్తుంది.)

ఖనా : (దూరంనుండే వరాహ మహిరుడిని ఉద్దేశించి అంటూ ప్రవేశిస్తుంది) ఇదేంటి మామయ్యగారూ! అల్పాహారం తినకుండానే అనువాద కార్యాన్ని ఆరంభించేరు?

వరాహమిహురుడు : (తన పని కొనసాగిస్తూనే) ఈ పనిని శీఘ్రంగా పూర్తి చేసుకోవాలి! ఎన్నాళ్లని రాజాస్థానానికి వెళ్లకుండా ఉండగలను?

(చేస్తున్న వ్రాత పనినుండి దృష్టిని పైకి మరల్చి ఏదో ఆలోచిస్తూ)

ఈ పని చాలా విభిన్నమైనది కూడా!

ఖనా : విభిన్నమైనదా?

(దగ్గరగా వచ్చి కూర్చుంటుంది)

వరాహమిహిరుడు : (గంభీరంగా) ఔను, అనువాదం చెయ్యడం… ఒక భాషనుండి వేరొక భాషలోకి వెళ్లడం…. తిరిగి రావడం …. నిరంతరం రెండు భాషల మధ్య ఉండడం… రెండు భాషలు-రెండు వేర్వేరు సంస్కృతులు! రెండు జీవితాలు ఒకేసారి జీవిస్తున్నట్లు అనిపిస్తుంది!

ఖనా : (హాస్యంతోబాటు కాస్తంత కోపాన్ని కూడా ప్రదర్శిస్తున్నట్లు) రెండు జీవితాలు ఒకేసారి జీవిస్తున్నానంటున్నారు గాని, భోజనం మాత్రం ఒక జీవితానికి అవసరమైనంత కూడా చెయ్యరు కదా…

వరాహమిహిరుడు : (నవ్వేసి) నీ నుండి తప్పించుకున్నా, నీమాటల చాతుర్యం నన్నెక్కడ వదులుతుంది చెప్పు? ఏదో తినిపించక మానదు సుమా!

ఖనా : (లేవటానికి సిద్ధపడుతూ) సరే అయితే కొన్ని పండ్లను ముక్కలు చేసి తీసుకురానా?

వరాహమిహిరుడు :- (కూర్చొమని చేతితో సంజ్ఞచేస్తూ) పృథుయశస్సు వెంటనే వివాహం చెయ్యమని నిర్ణయించడం సరియైనదే అని ఇప్పుడు అనిపిస్తోంది. తను రాచకార్యం మీద వెళ్లనే వెళ్లాడు… నువ్వు కూడా లేకపోతే ఈ ఇల్లు ఎంత కళావిహీనంగా ఉండేదో కదా!

ఖనా : సరే ఏదైనా తినడానికి తీసుకురానా?

(వరాహమిహిరుడు ఆమెను తేరపారి చూడడంతో ఒక్కసారి లజ్జితురాలయినట్లు) అల్పాహారమే…

వరాహమిహిరుడు : నా భోజనం అంత పెద్ద సమస్య అయిందా?…. నువ్వే స్వయంగా తెస్తానంటున్నావు?

ఖనా : సమస్య కాదు మామయ్యగారూ…. అదృష్టం… మీకు నా చేతుల్తో స్వయంగా భోజనాన్ని సిద్ధం చేసివ్వడం నా అదృష్టం!…

వరాహమిహిరుడు :- (వినోదంగా) ఆపైన తింటే గాని ఊరుకోనని కంకణం కట్టుకోవడం! ఔనా?

(ఖనా మందహాసం చేస్తూ లేచి నిల్చుంటుంది.) సరే-సరే! నీ ఆలోచనను కూడా గౌరవించాలి కదా!…. అల్పాహారమే సరిపోతుంది. కాసిని ఫలాలు ఇవ్వు. ఈనాడు పనిభారం మరింత హెచ్చుగా ఉంటుంది.

ఖనా: (ఉత్సాహంగా) మీరెలా శలవిస్తే అలాగే….. ఇప్పుడే తెస్తాను!

(ఖనా వెళ్తుంది)

వరాహమిహిరుడు : (ఆలోచిస్తూ) ఇంటి పనులుతో బాటు, స్వాధ్యాయయనం చెయ్యడంలో కూడా ఈ ఖనా ఎంత నేర్పరి! రెండింటినీ ఎంత బాగా సమానంగా నిర్వహిస్తోంది. (ఆచార్య వరాహమిహిరుడు తన పనిని తిరిగి ప్రారంభిస్తూండగా, నేపథ్యంలో ఏదో కోలాహలం వినిపిస్తోంది. అదేమిటో తెలుసుకునే ప్రయత్నం ఆయన చేస్తూంటారు)

ద్వారపాలకుడు : (దూరంనుండి కరోరమైన స్వరంతో) ఆచార్యులవారు ప్రస్తుతం ఎవరినీ కలవరు!

పేదవ్యక్తి : (దూరం నుండి బ్రతిమాలుకుంటున్న ధోరణిలో) దయచేసి… నన్ను వెళ్లనివ్వండి!

ద్వారపాలకుడు : (కఠినంగానే) మొండితనం తగదు చెప్పేనుగా! ఇది ఆచార్య వరాహమహిరుల వారి ఆదేశం!

పేదవ్యక్తి : (కంపిస్తున్న స్వరంతో) అయ్యా! నా పుత్రుడు మృత్యుశయ్య పైనున్నాడు… దయ చూపండి… మరీ అంత కఠినులు కాకండి…!

వరాహమిహిరుడు : (స్వగతం) ఆ కోలాహలానికి హేతువేమిటో?

(పిలుస్తూ) ద్వారపాలకా….

ద్వారపాలకుడు : (దగ్గరకు వచ్చి శిరసువంచి) క్షమించాలి ప్రభూ!…. ఎవరో ఒక నిర్ధనవ్యక్తి… అందునా మన గ్రామానికి చెందిన వాడు కూడా కాదు… మీ దర్శనం కావాలని మొండి పట్టుదలతో………

(అప్పుడే ఆ బీదవ్యక్తి చేతులు జోడించి వారి వద్దకు ప్రవేశిస్తాడు. అతడి ముఖాన పొడవైన గడ్డం మాసిపోయి ఉంది. ఒక కంబళిని తలపై నుండి కప్పుకున్న ఆతడి నడుము వంగిపోయి ఉంది.)

పేదవ్యక్తి : (ఆచార్య వరాహమిహిరుడి వంక వెళ్తూ) కరుణించండి… మహాశయా… దయ చూపండి…

ద్వారపాలకుడు :- (ఉద్విగ్నతతో) చూసేరా ప్రభూ, ఇతడు ఎంత మొండి వ్యక్తో! ఇతని దుస్సాహసాన్ని చూస్తున్నారుగా ఆచార్యవర్యా!

(ద్వారపాలకుడు బీదవ్యక్తిని అవతలికి పంపెయ్యడానికి అతనివంక వెళ్తాడు)

వరాహమిహిరుడు : (ద్వారపాలకుడికి ఆగమన్నట్లు చెయ్యి చూపించి) ఆగు…

(బీదవ్యక్తి వంక చూస్తూ) ఎవరు నువ్వు? నీ సమస్య ఏమిటి?

పేదవ్యక్తి : (మెత్తగా, నమ్రతతో) ఆచార్యా! నేను మీ గ్రామానికి చెందిన వాడిని కాను, గాని ఈ ఉజ్జయినికి చెందినవాడినే…. ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను… నా ఏకైక పుత్రుడు జీవన్మరణాల మధ్య కొట్టుకుంటున్నాడు…. (ఏడుస్తున్నట్లు అభినయిస్తూ) అతడి ఏశ్వాస ఆఖరి శ్వాస అవుతుందో తెలియదు!

వరాహమిహిరుడు : (కటువుగా) అయితే ఎవరయినా వైద్యుడిని సంప్రదించాలి!

బీదవ్యక్తి : (వినమ్రతతో) నాకు చేతనయినన్ని ప్రయత్నాలు అన్నీ చేశాను.

వరాహమిహిరుడు : నేనేం చెయ్యాలి?

పేదవ్యక్తి : (చేతులు జోడించి ఎంతో వినయం చూపిస్తూ) మీ కీర్తి నాలుగు దిక్కులా పాకింది… ప్రభూ! మీరే నా ఆఖరి దిక్కు.

వరాహమిహిరుడు : (గొంతులో కాస్తంత మార్గవత వస్తుంది) జాతకం తెచ్చేవా?

పేదవ్యక్తి : నాలాటి నిరాశా జీవికి జాతకాన్ని తీసుకురావాలన్న ఆలోచన ఎక్కడ? ఉన్న పళంగా మీదగ్గరకొచ్చి వాలిపోయేను, అంతే!

(ఆచార్య వరాహమిహిరుడు ఆలోచనలో పడతారు. పేదవ్యక్తి ఆయన వద్దకు చేరి, ఆందోళ చెందుతున్నట్లు అభినయిస్తూ తన అరచేతిని ఆచార్యుల వారి ముందుకు జాపే ప్రయత్నం చేస్తూ) చూడండి స్వామీ! చేతి రేఖలు ఏమని చెప్తున్నాయి? పుత్ర వియోగం అని వ్రాసి లేదుకదా!

(ఆచార్యులవారు ద్వారపాలకుడిని వెళ్లమన్నట్లు సైగ చెయ్యడంతో ద్వారపాలకుడు అక్కడినుండి తప్పుకుంటాడు. ఆచార్యుల వారు వచ్చిన పేదవ్యక్తిని చెయ్యి మూసి మరల తెరిచి చూపమంటారు. ఈ మాటతో వచ్చిన ఆ బీద వ్యక్తి వరాహమిహిరుల వారి చరణాల వద్ద కూర్చుని, తన చేతిని ఆయన ముందు ఉంచి)

ఇంతకీ పుత్ర సౌఖ్యం ఉందా – లేదా?

(వరాహమిహిరుడు తన ముందున్న అరచేతిని చూస్తూనే ఒక్కసారి ఉలిక్కిపడినట్లు అయి, వచ్చిన ఆగంతకునివైపు దృష్టిని మరల్చి, తిరిగి అరచేతిని నిశితంగా పరిశీలిస్తూ)

వరాహమిహిరుడు : (స్వగతంగా) శంఖముద్రలతో శోభిల్లుతున్న ఈ అరచెయ్యి, నిర్దనుడిది ఎలా కాగలదు?

(ఒక్కసారి ఉలిక్కిపడిలేచి నిల్చుని)

మీరా? మాళవగణ నాయకులైన చంద్రగుప్త విక్రమాదిత్యులవారు ఈ వేషంలోనా?

పేదవ్యక్తి : (నవ్వుతూ, అధికార స్వరంతో) సరే, నా అదృష్టాన్ని గురించి ఏం నిర్ణయించారు?

వరాహమిహిరుడు : (చేతులు జోడించి) లేవండి మహారాజా… ఆసనాన్ని గ్రహించి, నన్ను అనుగ్రహించండి. మీరు ఇలా కింద కూర్చోవడం నేను ఎంతటి సిగ్గుపడే విషయం?

పేదవ్యక్తి : (లేస్తూ) సిగ్గు ఎందుకు? ఒక విద్వాంసుని శరణులోకే కదా చేరాను.

(గంభీరంగా) వినోదానికి కాదు గాని, మనసెందుకో చాలా వ్యాకులపడుతోంది!

(ఇద్దరూ ఆసనాల పైన కూర్చుంటారు.)

వరాహమిహిరుడు : (గంభీరంగా) తెలుసు… ప్రస్తుతం కాలం అలా ఉంది. ముందు విశ్రమించండి…. చెప్పండి మీకు నేనేం సేవ చెయ్యగలను?

పేదవ్యక్తి : సేవ చేసే అవసరం లేదు. ఇలా ఈ మారువేషాన్నే ఉండనీయండి. నిన్న సాయంత్రం నుండి నేను మీ గ్రామంలోని వారి ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ, తిరుగుతున్నాను. మారువేషంలో కొందరు అంగరక్షకులు కూడా ఉన్నారు. నిశ్చింతగా ఉండండి..

వరాహమిహిరుడు : నేనేం చెయ్యాలో మీరు ఆజ్ఞ ఇస్తే….

(చేతిలో ఫలాలతో నిండిన పల్లెం తీసుకుని ఖనా ప్రవేశం. ఆచార్యులవారు ఎవరో అపరిచితులతో సభాషిస్తూండడం చూసి కాస్త తత్తరపడి, అక్కడే ఆగివారి సంభాషణ వింటూ నిల్చుంటుంది.)

పేదవ్యక్తి : గౌడ ప్రదేశాన్ని ఎన్ని దినాల నుండో వర్షం ముంచెత్తుతోంది. పరిస్థితి అదుపులో లేదు. ఆ ప్రదేశాన్ని సామ్రాజ్యంలో భాగం చెయ్యడానికి, ఉజ్జయిని ఎంత నష్టపోయిందో మీకు అవగతమే కదా! ఇంత కాలానికి అక్కడి ప్రజలలో ఈ సామ్రాజ్యం పైన నమ్మకం కుదిరింది. దానిని ఈ వర్షం కడిగేస్తుందా? వారి నమ్మకం పూర్తిగా సడలిపోతుందా ఆచార్యా?

(ఆచార్యుల వారు తీవ్రమైన ఆలోచనలో మునిగి పోతారు.)

ఖనా: (కాస్తంత ముందుకి వచ్చి, ఆలోచనలలో మునిగినట్లున్నా, స్పష్టమైన గొంతుకతో) హేమంత ఋతువులో ఎడతెగని వాన? అంటే చాతుర్మాసాలు అయేక కూడా ఎడతెగని వాన… అంటే వేరే ఋతువులో ఎడతెగని వాన… అదీ ఏడు దినాలు దాటి కూడా వాన… అంటే ఘోర అపశకునం… వినాశనం…. రాజు గారికి మృత్యువు … రక్తపాతం… రాజు గారికి మృత్యువు…. నిస్సందేహంగా రాజుగారికి మృత్యువే…..

(ఆచార్య వరహామిహిరుడు. పేదవ్యక్తి, ఉలిక్కిపడి ఆమెను చూస్తూంటారు. ఇద్దరూ ఆమె మాటల్ని పూర్తిగా విన్నారు. పేదవ్యక్తి లేచి నిల్చుంటాడు; ఖనాను గుచ్చి గుచ్చి చూస్తాడు. ఖనా మాత్రం తన ఆలోచనల ప్రవాహంలో మునిగి ఉంది. ఖనా పేద వ్యక్తి వైపు కన్నెత్తకుండా ఫలాలుంచిన పళ్లాన్ని ఆచార్యుల వారివద్ద ఉంచుతుంది.)

ఖనా : (తనను తాను అదుపు చేసుకుంటూ, ఆచార్యుల వారిని సంబోధిస్తూ) మామయ్య గారూ! దయచేసి స్వీకరించండి.

వరాహమిహిరుడు : (తొట్రుపడుతూ, పేదవ్యక్తి వంక చూస్తూ) బాలిక… పృథు యశస్సు భార్య… జ్యోతిష్యం అంటే ఇష్టం…. ఈ వయస్సులో ఉత్సాహం ఉరకలు వేస్తూనే ఉంటుందిగదా!

(ఏం చెయ్యాలో తెలియక కంగారు పడుతూ) ఈ సమయంలో, ఇంతకన్న ఎక్కువ… నేనేం చెప్ప…

పేదవ్యక్తి : (ఏదో పోగట్టుకున్నవాడిలా) అర్థం అవుతోంది… ఇక నేవెళ్ళొస్తాను.

(పేదవ్యక్తి నిష్క్రమణ)

వరాహమిహిరుడు :- (వెనకాతలే దాదాపు పరిగెడుతున్నట్లు) ఆగండాగండి… నామాట కాస్త….

(ఇద్దరూ రంగస్థలం నుండి బైటకు వెళ్తారు.)

ఖనా : (ఆశ్చర్యపోతూ) ఇదేం దృశ్యం? ఆచార్య వరాహమిహిరులంతటి వారు ఒక పేద వ్యక్తి వెనక… అదీ ఏదో విన్నవించుకుంటున్న ధోరణిలో… పాదరక్షలు కూడా ధరించకుండా… నిజమే మామయ్యగారు అన్నట్లు ఆయన రెండు జీవితాలు జీవిస్తున్నారు!

(ఫలాలుంచిన పళ్లెం వైపు వెళ్లి, దానిని తీస్తుంది. తిరిగి ఏదో ఆలోచన వచ్చినట్లు అక్కడే పెడుతుంది. ఆలోచనల్లో మునిగిపోతుంది)

ఇంతకీ ఈ పేద వ్యక్తి ఎవరో… సామ్రాజ్యం గురించి చింతించే ఈతడు! ఆజానుబాహువైన ఆయన నిర్ధనుడా?

(ఖనా ముందు తన తలను ‘కాదుకాద’న్నట్లు అడ్డంగా ఊపి, అటుపైన అక్కడే ధ్యానంలో మునిగి నిల్చుంటుంది.)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here