స్ఫూర్తిదాయక జీవితం ‘నిక్’

1
11

[dropcap]శ[/dropcap]రీరంలో ఏదో ఒక అవయవం లేకపోతేనే చాలా కష్టం అనుకుంటాం. రెండు అవయవాలు లేకపోతే క్రుంగిపోతాం. నిరాశ, నిస్పృహలకు లోనవుతాం. అలాంటిది రెండు చేతులూ, రెండు కాళ్ళూ లేని వ్యక్తి – తన మీద తాను జాలిపడకుండా – ధైర్యంగా జీవించి – తాను అనేక రంగాలలో రాణిస్తూ, తోటి దివ్యాంగులకే కాకుండా వేలాదిమందికి ప్రేరణగా నిలవడం అంటే ఆషామాషి కాదు. తన మీద తనకి విపరీతమైన నమ్మకం, మనోబలం, వీడని పట్టుదల ఉంటే కాని సాధ్యం కాదిది. దీన్ని సుసాధ్యం చేసి చూపించాడు ‘నిక్’.

నికోలస్ జేమ్స్ వుయిచిచ్ ఆస్ట్రేలియాలో స్థిరపడిన సెర్బియన్ వలసవాదులైన దుష్క, నికోలస్ బోరీస్ వుయిచిచ్ దంపతులకు జన్మించాడు. నిక్ జన్మించినప్పుడు తొలిసారిగా ఆ బిడ్డను చూసినప్పుడు క్రుంగిపోయారా దంపతులు. స్వయంగా నర్సు అయిన దుష్క – గర్భం ధరించినప్పటి నుంచి అన్నీ జాగ్రత్తలు తీసుకున్నా అలాంటి బిడ్డ జన్మించడం నమ్మలేకపోయింది. భర్త ఆ పసివాడి రూపాన్ని చూసి విస్తుపోయాడు. ఆసుపత్రిలో కొన్ని రోజుల పాటు బిడ్డని తల్లికి ఇవ్వలేదట. అవయవాలు సరిగా లేకపోయినా ఆ చిన్నారికి ఆకలి బాధ తప్పలేదు. దుఃఖాన్ని దిగమింగిన తల్లి బిడ్డని అక్కున చేర్చుకుని ఆకలి తీర్చింది. బాబుని చూడడానికి బంధువులు ఎవరూ రాకపోయినా చింతించలేదు. తమ బిడ్డ అలా పుట్టడానికి టెట్రా ఫోకోమెలియా సిండ్రోమ్ కారణమని, కోటి మందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధి అది అని తెలుసుకున్నారు. ధైర్యం తెచ్చుకున్నారు, నిపుణుల సలహాలు తీసుకున్నారు. బాబు ఎదగడంలో అండగా నిలవాలనుకున్నారా తల్లిదండ్రులు.

అదృష్టవశాత్తు తొడకి అతుక్కునిపోయిన పాదాన్ని వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా వేరు చేయగలిగారు. అది నిక్‌కి ఎంతో మేలు చేసింది. ఆ పాదమే అతని ఆయుధమైంది. దైవ ప్రేరణేమో గాని శైశవం నుంచే నిక్ తనకి తానుగా సర్వశక్తూలూ కూడదీసుకుంటూ నిలబడడానికీ, నిలదొక్కుకోడానికి ప్రయత్నించాడు. అది గమనించిన తల్లిదండ్రులు తమ వంతు సాయం చేశారు. నిక్‍ని అమితంగా ప్రోత్సహించారు. నిక్ స్వంతంగా తన పనులు చేసుకునేందుకు వీలుగా కొన్ని రకలా పరికరాలను అందించారు. ప్రతీ రోజూ పోరాటమే అని గ్రహించి, తన లోపాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తూ, చిన్న చిన్న విజయాలు సాధించాడు చిన్నారి నిక్.

తల్లి చిన్నారి నిక్‍కి నోటితో కలం పట్టుకుని రాయడం నేర్పింది. కాలి వేలికి పెన్ అమర్చుకునే పరికరం తొడిగింది. దానిలో పెన్ పెట్టుకుని రాయగలిగేవాడు నిక్.

నిక్‌ని చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి ఓ మామూలు బడిలో చేర్పించారు. అక్కడ తోటి పిల్లలు హేళన చేయడం, శారీరకంగా హింసించడం వంటి పనులు చేశారు. ఉపాధ్యాయులు ఆ పిల్లలకు నచ్చజెప్పడానికి ప్రయత్నించేవారు.

తల్లి ఉద్యోగ వేళలు భిన్న రకాలుగా ఉండడం వల్ల నిక్ సంరక్షణా భాధ్యతలు తండ్రి బోరిస్ కూడా పంచుకున్నారు.

నిక్‌ తమ్ముడు, చెల్లెలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేవారు. వాళ్ళు నిక్‍ని జాగ్రత్తగా చూసుకునేవారు.

కానీ నిక్‍లో ఒకసారి ఆత్మన్యూనతాభావతం తలెత్తి బాత్ టబ్‍లో మునిగి జీవితాన్ని అంతం చేసుకుందామనుకున్నాడు. తోబుట్టువులు చూసి అరవడంతో తండ్రి సకాలంలో వచ్చి కాపాడేడు. నిక్‍‍ని ఓదార్చి జీవితం పట్ల భరోసా కల్పించారు. అయితే ఆటల్లో మజా గ్రహించిన నిక్ ఆటలలో పడి తన వైకల్యం గురించి తాత్కాలికంగా మరిచిపోయేవాడు. హాస్యధోరణి అలవర్చుకోడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో తండ్రి సాయంతో ఈత నేర్చుకున్నాడు. షార్క్ చేప దాడిలో చేయి కోల్పోయినా, సర్ఫింగ్ క్రీడని మానని ‘బేతని హేమల్టన్’తో నిక్‌కి పరిచయం అయింది. ఆమె నిక్‌కెంతో స్ఫూర్తినిచ్చింది.

బాల్యం దాటి కౌమారంలో అడుగుపెట్టిన నిక్ మరోసారి తీవ్రమైన క్రుంగుబాటుకి లోనవగా, అతని తల్లి ఒక వార్తాకథనాన్ని చదివి వినిపించి నిక్‍కి కొండంత ధైర్యాన్నిచ్చింది. తనలాంటి వారు ఇంకా కొందరున్నారనీ, వారంతా జీవితంలో నెగ్గడానికి ప్రయత్నిస్తున్నారని గ్రహించిన నిక్ జీవితం అక్కడ్నించి మలుపు తిరిగింది. హేళనలు, అవమానాలను దిగమ్రింగుతూ చదువులో రాణించాడు. డబుల్ గ్రాడ్యుయేషన్ చేశాడు. స్వంతంగా డబ్బు సంపాదించే స్థితికి వచ్చాడు.

ప్రేరణోపన్యాసకునికిగా, మతబోధకుడిగా పని చేశాడు. శ్రోతలని ‘ఎందుకు?’ అని ప్రశ్నించుకోమనేవాడు. అలా ప్రశ్నించుకుంటే ఎన్నో ప్రశ్నలకు జవాబులు దొరికి సమస్యలు పరిష్కారమవుతాయని జనాలకి చెప్పేవాడు. ప్రేరణ ఉపన్యాసాలిస్తూ వీలైనన్ని దేశాలు తిరిగాడు. తనకి ప్రేరణనిచ్చిన ‘ఫిలిఫ్ టోత్’ గురించి అందరికీ చెప్పేవాడు. జీవితంలో ఎదుగుతూ వచ్చిన నిక్ ఎన్నో సంస్థలు స్థాపించాడు. ఎందరికో సాయం చేశాడు, మార్గదర్శనం చేశాడు. తన ఉపన్యాసాల ద్వారానే కాకుండా 8 పుస్తకాలు రచించి వాటి ద్వారా మరెందరికో ప్రేరణగా నిలిచాడు. ఎన్నో మోటివేషనల్ వీడియోలు రూపొందించాడు.

టెక్సాస్‍లో పరిచయమైన ‘కానే మియహారా’ను వివాహం చేసుకున్నాడు నిక్. వారికి ఆరోగ్యవంతమైన కొడుకు జన్మించినగానే నిక్ ఆనందానికి అంతు లేకపోయింది. ఆ అబ్బాయికి ‘కీయోషీ’ అని పేరు పెట్టారు. తర్వాత మరో కొడుకు, ఇద్దరు కవల అమ్మాయిలు పుట్టారా దంపతులకు. నిక్ జీవితం పరిపూర్ణతని పొందింది.

***

ఈ పుస్తకంలో రచయిత్రి ఒక అధ్యాయంలో బోరిస్ రచించిన ‘Raising the Perfectly Imperfect Child’ అనే పుస్తకం గురించి వివరించారు. అలాగే మరో అధ్యాయంలో నిక్ లాగే ఏదో ఒక లోపంతో జన్మించి జీవితంలో విశేషంగా రాణించిన మరొకొందరి గురించి తెలిపారు. పుస్తకం చివర్లో నిక్ పలు రంగాలలో సాధించిన విజయాలను ఒక్కో వాక్యంలో ప్రస్తావించారు.

నిక్ విజయగాథ ఎందరికో స్ఫూర్తి గాథ. పిల్లల కోసం ఉద్దేశించినప్పటికీ, పెద్దలు కూడా చదవదగ్గ రంగుల సచిత్ర రచన ఇది.

***

నిక్ అంటే ప్రేరణ:
రచన: సమ్మెట ఉమాదేవి
ప్రచురణ: కవీర్ణ ప్రచురణలు
పేజీలు: 128
వెల: ₹ 250/-
ప్రతులకు:
సమ్మెట ఉమాదేవి
C/O శ్రీ బి.డి కృష్ణ,
ఇంటి నెంబర్ 3-2-353, సెకండ్ ఫ్లోర్,
స్వామి వివేకానంద స్ట్రీట్,
ఆర్ పి రోడ్, సికింద్రాబాద్-500003,
మొబైల్ నెంబర్:9849406722
sammetaumadevi@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here