నిదానస్థుడు

0
10

[dropcap]“ఒ[/dropcap]క్కసారి వచ్చి మిమ్మల్ని కలుసుకోమని ప్లీడర్ గారి అమ్మాయి శారద కబురు చేశారు” – అని నౌకరు చెప్పాడు.

సత్యవతి మధ్యతరగతి అమ్మాయి. వాళ్లది బ్రాహ్మల వీధి. అందులో సగానికి పైగా ఇళ్ళు ఆ లాయర్ పరమేశ్వరం గారి కుటుంబానివే. ఆ ఊర్లో వారి ప్రాక్టీస్‌కి తిరుగులేదు. ఆయా కారణాల చేత సత్యవతి వాళ్ళ ఇంటికి పోవడం రివాజు.

సత్యవతిని చూడగానే శారద మొహం చాటంత అయింది.

శారద ఎందుకు పిలిపించిందో కారణం సత్యవతికి తెలుసు. ఆమెకి పెళ్లి సంబంధాలు వచ్చినట్లే వచ్చి ఏదో కారణం చేత ఆగిపోతున్నాయి.

“ఏంటి కథ?” అని అడిగింది సత్యవతి.

“ఎప్పుడూ ఉన్న సొదే” అని ప్రారంభించింది శారద.

“నేను అందగత్తెల కోవకి చెందను. అలాగని అనాకారిని కాను. చామన చాయకు ఒక వన్నె తక్కువ —. అనేవి నీకు తెలుసు. ప్రతిభ కానరావడం లేదని మా నాన్న నన్ను టెన్త్ క్లాస్‌తో చదువు ఆపించాడు. తోబుట్టువులంతా ఇంజనీరింగ్ లోనూ, మెడిసిన్ లోను చేరారు. అందుకు నాకు అసూయ లేదు వారిని అభినందిస్తూనే ఉంటాను. వాళ్లకి నా ప్రేమ ఉంది. ఇక పెళ్లై నా బ్రతుకు నేను బ్రతుకుదామంటే, ఏవో కారణాల వల్ల నన్ను నచ్చిన వాడు నాకు నచ్చడు –. నాకు నచ్చిన వాడికి నేను నచ్చను. నా తలరాత ఇలా ఉంది” అని వాపోయింది.

“నీకేం 60 వచ్చాయా? 70 వచ్చాయా? ఎందుకు అలా కుమిలిపోతావ్? రెప్పలు నెరిసిన అప్పలు వృద్ధ కన్యలు ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్లతో పోలిస్తే మనం ఎంతో పసివాళ్ళం. ఊరికే బెంగ పెట్టుకోకు. దైవ ఘటన ఉంటే కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు” అని గడ్డి పెట్టింది సత్యవతి.

అంత నైరాశ్యం లోను శారదకి నవ్వు ఆగలేదు. “మరి నీ సంగతి ఏమిటే?”  అని ప్రశ్నించింది శారద.

“తెలుసుగా – మా నాన్న పురోహితుడు. మా అన్న సోంబేరి. మా అక్కకి చిరుతిళ్ళు ఉంటే చాలు. చదువు జోలికి వెళ్ళదు. ఏదో ఒక రోజు గంతకు తగ్గ బొంత ఎవడితోనో లేచిపోయే బాపతు. నేను పరోపకారి పాపన్న లాగా నాలుగువీధుల పేటలో అందరికీ ఏ సహాయం అడిగినా తలలో నాలికలాగా చేసి పెడుతూ ఉంటాను. హస్తకళలు కొత్తవి ఏమి కనిపించినా నేర్చుకుని వాటితో వాణిజ్యం చేస్తూ ఉంటాను. అందువల్ల మా నాన్న దృష్టిలో నేను బంగారు గుడ్లు పెట్టే బాతుని. నాకు పెళ్లి చేసి నా చాకిరీని, నన్ను వదులుకొనే మూర్ఖుడు కాడు. అందువల్ల నా జీవితం ఒక తెగిన గాలిపటం. నేను బాధకి, సంతోషానికి అతీతంగా సన్యాసిని లాగా జీవితం గడుపుతానేమో!” అని ముగించింది సత్యవతి.

“చాలాసేపు అయింది. ఇంక వెళ్లి వస్తాను. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. కారణం కానున్నది కాక మానదు. ఎల్లవేళలా సంతోషంగా ఉండు.” అని చెప్పి నిష్క్రమించింది.

***

ఇది జరిగిన రెండు నెలలకి లాయర్ గుమస్తా రామచంద్రం బజార్లో సైకిల్ పై వస్తుంటే అనతి దూరంలో మందు నెమ్మదిగా పోతున్న ఆటో రిక్షాను వెనక నుండి వచ్చి ఒక తాగుబోతు డ్రైవరు వ్యాన్తో గుద్ది, భయంతో దిగి పారిపోయాడు. అందరూ చోద్యం చూస్తున్నారు గాని, ఎవరూ సహాయానికి ముందుకు వెళ్ళలేదు. రామచంద్రం సైకిల్‌ని కిళ్లీ షాపు వాడికి అప్పచెప్పి, పక్కన పెట్టి, ఆటోలోకి తొంగి చూశాడు. అందులో ఒక అమ్మాయి స్పృహ తప్పి పడి ఉంది. అతను వెంటనే ఆటో డ్రైవర్‌తో చెప్పి దగ్గరలో ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆమెను చేర్చాడు. డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసిన మందులే కాక పళ్ళు, గ్లూకోజ్ కూడా కొని పక్కన పెట్టాడు. హఠాత్ సంఘటన వల్ల ఆమె షాక్ తిన్నదని, దెబ్బలు తగలలేదని రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకున్నాక పంపిస్తామని హాస్పిటల్ వాళ్లు చెప్పారు.

ఆమెకి తెలివి రాగానే “నేను ఎక్కడ ఉన్నాను?” అని అడిగింది. రామచంద్రం జరిగింది వివరించాడు.

ఇంతకీ తేలిన విషయం ఏమంటే ,ఆమె లాయర్ పరమేశం గారి అమ్మాయి శారద అని. రామచంద్రం ఆయన వద్దనే పనిచేస్తున్నా వాళ్ళ అమ్మాయిని ఎప్పుడూ పరికించి చూడలేదు. కానీ ఆ అమ్మాయికి అతను ఎవరో తెలుసు.

రామచంద్రం వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి కబురు చెప్పాడు. గాబరా పడవద్దని, నెమ్మదిగా ఎవరో ఆడవాళ్ళలో ఒకరు సహాయానికి వస్తే బాగుంటుందని చెప్పాడు. కాసేపు పోయాక లాయర్ గారి భార్య పార్వతమ్మ వచ్చారు. కూతురు యోగక్షేమాలు తెలుసుకునే లోగా రామచంద్రం అన్నీ వివరంగా చెప్పి, తాను తెచ్చిన సామాన్లు అప్పగించి మళ్లీ సాయంత్రం వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. “నాన్నగారి గుమస్తా రామచంద్రం” అని శారద చెప్పింది.

“పరోపకారి, ఆపద వచ్చినా తొణకక, బెణకక ధైర్యంగా నిలబడే నిదానస్థుడు. యోగ్యుడు” అని పార్వతమ్మ అతను వెళ్ళిపోయాక తన అభిప్రాయం చెప్పింది .

***

సాయంత్రం వచ్చిన సత్యవతితో శారద అన్ని విషయాలను చెప్పింది. అంతలో–

“ఆయన వస్తున్నారు” అన్నది శారద.

“ఓహ్.! అంతవరకు వచ్చిందా? ఇక నేం?” అన్నది సత్యవతి రహస్యంగా.

“చీ- ఫో” అన్నది శారద.

పరిచయాలైనాక పని ఉన్నదని సత్యవతి వెళ్ళిపోయింది.

“ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది?” అడిగాడు రామచంద్రం.

“స్వస్థత చిక్కినట్లే ఉంది. రేపు డిశ్చార్జ్ చేస్తాను అన్నారు డాక్టర్ గారు” అంది శారద.

“తాగి బండి నడిపిన వ్యాన్ డ్రైవర్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చారు పోలీస్ ఇన్స్పెక్టర్. మీరు షాక్‌ని ధైర్యంగానే తట్టుకున్నారు” అని రామచంద్రం ప్రశంసించాడు.

శారద బుగ్గలు ఎరుపెక్కాయి. ఆమె సిగ్గుల మొగ్గ అయింది.

“మా ఇంట్లో అందరూ నన్ను పిరికిదాన్ని అని ఏడిపిస్తారు” అన్నది శారద.

ఇద్దరూ కబుర్లలో పడ్డారు. కాలానికి రెక్కలు వచ్చాయి.

***

అంతవరకు శారద పెళ్లి సంబంధాలు మాట్లాడి, పంచాంగాలు, జాతకాల కట్ట చంకలో పెట్టుకొని మెట్లు దిగుతున్న పెళ్లిళ్ల పేరయ్యకి రామచంద్రం ఎదురయ్యాడు. అతడిని చూడగానే పంతులుకి స్పార్క్ వెలిగింది. అతడి వివరాలు అడిగి తెలుసుకున్నాడు.

తిరిగి మెట్లు ఎక్కి లాయర్ గారిని కలుసుకున్నాడు. రామచంద్రం వివరాలు చెబుతుండగా పార్వతమ్మ గారు కూడా వచ్చారు–

“అతనిది తూర్పుగోదావరి జిల్లా వేగేశ్వరపురం– అగ్రహారం లాంటిది. అతని తాతగారు నూరు ఎకరాల మాగాణి గల బుగత. పేరుగాంచిన ఘనాపాఠి. ఆయన ఇల్లొక గురుకులం. ఆయన ఎంతోమంది బీద విద్యార్థులను చేరదీసి వేద వేదాంగాలు, శాస్త్రాలు బోధించేవారు. అటువంటిది ఈనాటి తన పరిస్థితిని ఒక పద్యంలో చెప్పాడు రామచంద్రం :

ఆనాటి అగ్రహారము/ మానాటికి మాన్య మాయె మరి క్షీణించంగా/మీనాటి కండ్రికాయను నానాటికి తీసి కట్టు నాగంభొట్లూ! అని”

“కొండంత మీ ప్రాపు ఉండంగా అతని కేం లోటు?” –అన్నది పార్వతమ్మ.

“అంటే ఇరస్తా పరస్తా లేని ఏకాకిని ఇల్లరికం తెచ్చుకోమంటావా?” అన్నారు లాయరు గారు.

“పెళ్లి పీటల మీద కూర్చోవడానికి వేలు విడిచిన మేనమామ ఉన్నాడట.”

“బాగానే ఉంది భాగోతం” అని కండువా భుజం పైన వేసుకొని లోనికి వెళ్లిపోయారు లాయర్.

పార్వతమ్మ, పంతులు మొహమహాలు చూసుకున్నారు ఏమీ పాలు పోక.

***

ఆ తరువాత స్థిమితంగా బాగోగులు ఆలోచించి లాయరు సమాధానపడ్డాడు. పెళ్లిళ్ల పంతులు అనుసంధాన కర్త. ఆయనకి ఎదురుపడిన శారదతో “శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు” అని చెయ్యెత్తి దీవించాడు. రుక్మిణి వంటి శారదకు ఆయన అగ్నిద్యోతనుడై భాసించాడు. ఆమె ఆనందానికి పట్ట పగ్గాలు లేవు. ఒక్క నమస్కారం తప్ప ఆమె అతనికి ఏమి ఇవ్వగలదు?

***

ముహూర్తం దగ్గర్లోనే కుదిరి పెళ్లి పనులు చక చకా సాగిపోయాయి. సత్యవతి తనకు తెలిసిన కళా నైపుణ్యంతో శారదకు స్వయంగా పెళ్ళికూతురు ముస్తాబు చేసింది. పెళ్లి ఒకరకంగా ఘనంగానే సాగింది. రామచంద్రం మరొక గది తీసుకొని సంసారం ప్రారంభించాడు. దైవ బలం వల్ల అతనికి మరొక పెద్ద పట్టణంలో పెద్ద ఉద్యోగమే దొరికింది. ఆనందాశ్రువుల మధ్య శారద సత్యవతికి వీడ్కోలు చెప్పింది. అప్పుడప్పుడు వస్తూ ఉంటామని భరోసా ఇచ్చి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here