నిదర్శనం

0
8

[box type=’note’ fontsize=’16’] కర్తార్ సింగ్ దుగ్గల్ రాసిన పంజాబీ కథని ‘నిదర్శనం’ అనే పేరుతో తెలుగులో అందిస్తున్నారు మౌద్గల్యస. [/box]

[dropcap]“గు[/dropcap]రునానక్ అలా సంచరిస్తూ హసన్ అబ్దాల్ అడవిలోకి ప్రవేశించారు. అప్పుడు మిట్టమధ్యాహ్నపు ఎండ నిప్పులు చెరుగుతోంది. కన్ను పొడుచుకున్నా నాలుగువైపులా జనసంచారం లేదు. అంతటా నిశ్శబ్దం.. అప్పడప్పుడు వీస్తున్న చల్లగాలికి చెట్ల ఆకులు రాపిడికి గురవుతూ వింత శబ్దాన్ని చేస్తున్నాయి…”

“ఆ తర్వాత ఏం జరిగిందమ్మా?” ఉత్కంఠను ఆపుకోలేక నేను మధ్యలోనే అడ్డుపడి అడిగాను.

“ఆలోచనల్లో నిమగ్నుడైన నానక్… తన వెనక నడుస్తున్న మర్దానా ఉనికిని పట్టించుకోవడం లేదు. మర్దనా గొంతు పిడచకట్టుకుపోయి దాహంతో అలమటిస్తున్నాడు. ఆ ప్రాంతంలో నీళ్లు దొరికే ఆస్కారమే లేదు.

కాసేపటి తర్వాత “మర్దానా.. కొంచెం ఓపిక పట్టు. కాసేపటికి పక్క గ్రామం చేరతాం. అక్కడ నీకు కావలసినంత నీరు లభ్యమవుతుంది.” అని నచ్చచెప్పే ప్రయత్నం చేయబోయాడు. అవేవీ వినే పరిస్థితిలో లేడతను. అతని మనసు నిండా నీటి గురించిన ఆలోచనలే. దట్టమైన ఆ అటవీ ప్రాంతంలో కనీస నీడి జాడ లేదు.

“భగవంతుడి నిర్ణయమిది. ఈ చుట్టుపక్కల ఎక్కడా నీరనే మాటేలేదు. నా మాట విని కాస్త ఓర్పు వహించు” అని మరోసారి చెప్పినా మర్దనాకు ఆ మాటలు చెవికెక్కలేదు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని వాడిలా అక్కడే కూలబడిపోయాడు.

మర్దానా అవస్థ చూసి ఎందుకో తెలీదు గానీ నానక్‌కు జాలిపుట్టింది. చిరునవ్వు నవ్వుతూ అతని వైపు చూసి.. ఆ తర్వాత కొద్దిసేపు ధ్యానంలో నిమగ్నమయ్యాడు. ఆ తర్వాత కళ్లు తెరిచి చూసేసరికి మర్దానా పరిస్థితి నీటి నుంచి బయటపడిన చేపలా ఉంది.

మందస్మిత వదనంతో అతని వైపు చూసి చెప్పసాగాడు నానక్.

“భాయీ.. ఎదురుగా ఉన్న కొండ మీద ఓ గుడిసె ఉంది. అక్కడ వలీ కంథారి అని ఉలేమా (మత పెద్ద) ఉన్నాడు. నువ్వక్కడికి చేరుకోగలిగితే నీకు దాహం తీరే అవకాశం ఉంది. ఆ ఒక్క చోట తప్ప, చుట్టుపక్కల ఎక్కడా మంచి నీటి ఉనికే లేదు.”

“అప్పుడు మర్దానాకు మంచినీరు దొరికిందా?” నాలో తర్వాత ఏమైందో తెలుసుకోవాలన్న ఆత్రం అధికమై అమ్మను అడిగాను. ఆమె చెప్పటం కొనసాగించింది.

“మర్దానాకు ఆ విషయం తెలియగానే ఎగిరి గంతేశాడు. కొండ వైపు పరుగు తీశాడు. ఓ వైపు చుర్రుమనిపించే ఎండ.. మరో వైపు భరించలేనంతగా దాహం… ఎంత అవస్థపడి ఆ కొండ దగ్గరకు చేరాడో అతనికే తెలియదు. వలీకి పరిచయ నమస్కారం చేసి, ఆ తర్వాత మంచినీరు కావాలని కోరాడు.

కంథారి అతనికి బావి చూపించి వెళ్లి నీళ్ల తాగమని సూచించాడు. అంతలో అతని మెదడులోకి ఏం అనుమానం పురుగు ప్రవేశించిందో గానీ.. “బాబూ.. ఇంతకూ నువ్వెవరు? ఎక్కడ నుంచి వచ్చావు?” అని ఆరా తీశాడు.

“నేను బాబా గురునానక్ అనుయాయిని. మేమిద్దరం అలా నడుచుకుంటూ ఇటు వచ్చాం. దాహంతో నా గొంతు పిడచకట్టుకుపోతోంది. అక్కడెక్కడా నీళ్లు అందుబాటులో లేకపోవడంతో ఇక్కడకు వచ్చాను” మర్దానీ చెప్పటం పూర్తికాలేదు.

నానక్ పేరు వినగానే అతనిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మర్దానీని గుడిసెలో నుంచి విసురుగా బయటకు నెట్టాడు.

ఉసూరుమంటూ కొండదిగువకు వచ్చిన మర్దానీ… నానక్‌తో జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. ఇప్పుడు తన దాహం తీరే దారేదీ చెప్పవలసిందిగా ప్రార్థించాడు.

అతను చెప్పిందంతా నానక్ సావధానంగా విన్నక మృదువుగా చెప్పాడు.

“ఈ సారి హృదయం నిండుగా కరుణ నింపుకుని వెళ్లు. ఔలియా నానక్ శిష్యుడిని అని చెప్పి ప్రయత్నించి చూడు” అన్నాడు.

నానక్ మాట జవదాటని మర్దానీ ధైర్యాన్నికూడగట్టుకని ఆయన చెప్పినట్టే చేశాడు. ఎలాగైనా నీటిని దక్కించుకోవాలనేది అతని ఆశ.

ముక్కుతూ మూలుగుతూ వెళ్లిన మర్దానీని వలీ కనికరించలేదు. “అలాంటి అరాచకవాది మనిషికి గుక్కెడు నీళ్లు కూడా ఇచ్చేది లేదు.” అంటూ తెగేసి చెప్పటమే కాదు. తూలనాడి తరిమేశాడు.

మర్దానీ తిరిగొచ్చేసరికి అతని పరిస్థితి ఘోరంగా తయారైంది. రూపం మారిపోయింది. ముఖమంతా నల్లగా కమిలిపోయింది. పెదాలు ఎండిపోయాయి. శరీరమంతా చెమట దట్టంగా అల్లుకుంది. అప్పుడే ఆ నిముషంలోనో.. మరు నిముషంలోనూ కుప్పకూలేటట్టుగా తయారయ్యాడు.

“రూపరహితుడైన ఆ పరమాత్ముడిని ప్రార్థించు. నీకు అంతా మంచే జరుగుతుంది” అని హితబోధ చేసి మరోసారి ప్రయత్నించమన్నాడు నానక్.

ఆ మాటలకు కట్టుబడి ముందడుగు వేశాడు మర్దానీ. “తనెలాగూ పై దాకా వెళ్లి గుడిసె వరకూ చేరలేడు. మార్గమధ్యంలోనే తన ప్రాణం ‘హరీ’ మనటం ఖాయం” అనుకుని మనసుని బండరాయి చేసుకుని ఆయాసపడుతూ కొండ ఎక్కడం ప్రారంభించాడు.

చివరకు ఎలాగైతేనేం వలీ కాంథారి గుడిసె దగ్గరకు చేరాడు. అయితే వలీ ఏ మాత్రం కనికరం చూపలేదు. కోపంతో బుసకొడుతూనే ఉన్నాడు.

“నానక్ తనేదో మహాత్ముడిని. పవిత్రుడినని ప్రవచిస్తాడు. తన శిష్యుడికి ఆ మాత్రం కాసిని మంచి తీర్థం కూడా ప్రసాదించలేడా?” అని నోటికొచ్చినట్టు హేళనగా మాట్లాడాడు.

అది భరించలేని మర్దాని తీవ్ర నిస్పృహకు గురై వెనక్కి వచ్చేశాడు. గురునానక్ పాదాలపైన ఒరిగిపోయాడు. కాసేపటికే అతనికి స్పృహ తప్పింది.

నానక్ అతని వెన్నును ప్రేమతో నిమిరి ఓదార్చి తమ ఎదురుగా ఉన్న పక్కనే ఉన్న బండరాయిని తొలగించమని చెప్పాడు.

గురువు చెప్పినట్టే చేశాడు మర్దానీ.

అలా రాయిని తీయగానే ఒక్కసారిగా జల పైకి ఎగతన్నింది. క్షణాల్లో ఆ ప్రాంతమంతా ఎటుచూసినా నీళ్లే.

అదే సమయంలో వలీ కంథారికి నీరు అవసరమై బావి దగ్గరకు వెళ్లాడు. ఆ బావిలో ఒక్క చుక్కనీరు కూడా లేదు. అతను ఒక్కసారిగా దిగ్ర్భాంతికి గురయ్యాడు. అంతే కాదు. కొండ దిగువంతా కనుచూపుమేర అంతా విస్తారమైన నదిపారుతున్నట్టుగా కనిపించింది.

ఓ ముళ్లచెట్టు కింద కూర్చున్న నానక్, అతని శిష్యుడు మర్దానీ కనిపించారు.

అంతే… వలీ కంథారి కోపంతో రగిలిపోయాడు. తన శక్తినంతా కూడదీసుకుని పెద్ద బండరాయిని కొండ మీద నుంచి వారి పైకి నెట్టాడు.

తమ మీదకు దూసుకొస్తున్న పెద్ద బండరాయి వల్ల మృత్యువు తప్పదన్న భయాందోళనలకు గురయిన మర్దానీ.. ప్రాణభయంతో కేకలు పెట్టాడు.

కానీ గురునానక్ అతన్ని ఊరడించి.. “రూపరహితుడైన ఆ దైవాన్ని ప్రార్థించు” అంటూ ఎప్పటి మాదిరిగానే ధైర్యవచనాలు చెప్పాడు.

ఆ పెద్ద బండరాయి తన సమీపానికి రాగానే గురునానక్ తన అరచేతిని అడ్డుపెట్టి దానిని నిలువరించాడు.

హసన్ అబ్దాల్ అడవిలోని ఈ ప్రాంతాన్ని ఇప్పుడు పంజా సాహిబ్ అని పిలుస్తారు. ఇప్పటికీ గురునానక్ అరచేతి ముద్రలున్న ఆ కొండ అక్కడ కనిపిస్తుంది.”

అప్పటి వరకూ ఈ కథను ఎంజాయ్ చేస్తున్నవాడినల్లా… అమ్మ చెప్పిన ఈ చివరి మాటలు నాకెందుకో అసంతృప్తి కలిగించాయి. అరచేతితో కొండంత బండరాయిని గురునానక్ ఆపటమనే విషయం నమ్మశక్యంగా అనిపించలేదు. ఒక మనిషి బండరాయిని నిలువరించటం సాధ్యమయ్యే పనేనా? పైగా ఆ రాయి మీద చేతిముద్రలు ఈనాటికీ ఉండటమా? ఇందులో ఏదో తిరకాసు ఉన్నట్టనిపించింది. ఎవరో కొండ మీద ఈ ముద్రలు చెక్కి ఆ విషయాన్ని ప్రజల్లోకి వ్యాపింపచేసుంటారనుకున్నాను.

చాలాకాలంపాటు ఈ విషయమై అమ్మతో వాదిస్తూ వచ్చాను. రాయి కింద నుంచి జల ఊరటమనేది సైన్సు కూడా నిరూపించిన విషయమే. అది అసత్యం కావటానికి వీల్లేదు. అదే సమయంలో దొర్లుతూ వచ్చిన కొండరాయిని గురునానక్ ఆపేశారనటం మాత్రం అభూతకల్పనే అని నిశ్చయంగా అనుకున్నాను.

ఆ రోజే కాదు. అనేక సందర్భాల్లో ఈ విషయం నా మనసులో మెదులుతూ వచ్చింది. గురుద్వారాలో తరచూ ఈ కథ నా చెవిన పడుతూండేది. కథ చివర్లోని ఈ సంఘటన తరచూ నాలో అపనమ్మకాన్ని పెంచుతూండేది.

ఓ సందర్భంలో స్కూలులో మా మాస్టారు ఈ కథ చెప్పినప్పుడూ.. ఆయనతోనూ తగువు పడ్డాను. “అద్భుత శక్తులను ప్రదర్శించే అవధూతలకు ఏదీ అసాధ్యం కాదు” అని ఆయన నా నోరు మూయించాడు. ఆ నిముషంలో నేను మౌనం దాల్చినా, నానక్ అరచేతిలో కొండరాయిని ఆపగలగటాన్ని మాత్రం అప్పటికీ ఒప్పుకోలేకపోయాను. ఒక మనిషి ఇలా చేయటం సాధ్యమా అని నా అంతరంగం ఘోషించింది.

ఆ తర్వాత… పంజా సాహిబ్‌లో జరిగిన ఒక చారిత్రక సంఘటన నా చెవిన పడటానికి ఎంతో కాలం పట్టలేదు. ఆ రోజుల్లో అలాంటి సంఘటనలు చాలా జరిగేవని చెప్పుకునేవారు. ‘సాకా’ పర్వదినం రోజున ఎవరూ భోజనాలు వండుకోరు. నేల మీదే నిద్రిస్తారు. అసలు ‘సాకా’ అంటే ఏమిటో మాత్రం నాకు తెలీదు.

మా గ్రామం పంజా సాహిబ్‌కు ఎంతో దూరంలో లేదు. ఆ సంఘటనలు మా చెవిన పడగానే మా అమ్మ.. నన్ను, మా చెల్లిని తీసుకుని అక్కడకు బయలుదేరింది. ఆమె కళ్లవెంట నీరు ధారాళంగా ప్రవహిస్తోంది. ఆమె దుఃఖపడే అంశమేమిటో పసివాళ్లమైన మా ఇద్దరికీ అర్థం కాలేదు.

పంజాసాహిబ్ చేరగానే ఓ చిత్రమైన కథ మా చెవిన పడింది.

దూరప్రాంతంలో ఓ చోట విదేశీయులు.. నిరాయుధలయిన భారతీయులపై తుపాకిగుళ్లు ప్రయోగించి చాలా మందిని హతమార్చారు. ఇందులో పెద్ద, చిన్న, ముసలి, ముతక, ఆడా మగా అన్ని వయస్సుల వారు ఉన్నారు. ఇందులో ప్రాణాలతో బతికి బయట పడ్డవారిని ఖైదీలుగా ఓ రైలులో తరలిస్తున్నారు. ఆకలి, దాహంతో అలమటిస్తున్నవారు ప్రయాణిస్తున్న రైలు పంజాబ్ సాహిబ్ మీదుగా సాగుతుంది. అయితే దాన్ని ఎక్కడా ఆపకూడదని పై అధికారుల ఆదేశం.

పంజాసాహిబ్ వాసుల చెవిన ఈ వార్త పడగానే వారంతా ఆగ్రహంతో ఊగిపోయారు. అంతమంది గాయాలతోనూ ఆకలిదప్పులతో అలమటిస్తూ.. మర్దానా దాహం తీర్చిన గురునానక్ ఉన్న ఈ ప్రాంతాన్ని దాటి వెళతరా? ఎలాగైనా ఈ రైలుని ఇక్కడ ఆపించవలసిందే అని పట్టుదలగా అనుకున్నారు. రాతపూర్వకంగా స్టేషన్ మాస్టరుకు వినతులు సమర్పించారు. టెలిగ్రామ్‌లు పంపారు. దీనిని తిరస్కరిస్తూ విదేశీ పెద్దలు కఠినమైన ఆదేశాలు జారీచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైలు ఆపటానికి వీల్లేదని చెప్పారు.

రైలులో ఉన్నవారంతా స్వాతంత్ర్య సమరయోధులు. ఆకలి, దాహంతో నానా అవస్థపడుతున్నవారు. వారి ఇబ్బందులు తొలగించేందుకు ఎలాంటి ఏర్పాట్లు లేవు.

ఆంక్షలమాట ఎలా ఉన్నా రైలు ఇక్క ఆగి తీరవలసిందే అన్న పట్టుదల పంజాసాహిబ్ వారిది. రైల్వే స్టేషన్లో పెద్ద ఎత్తున పూరీలు, కూర, ఖీర్ వంటి ఏర్పాట్లు చేసుకుని సిద్ధమై ఉన్నారు.

రైలు తుపానులా వచ్చి ఉప్పెనలా దూసుకుపోతుంది. దాన్ని ఆపేదెవరు?

మా అమ్మ స్నేహితురాలు ఒకామె ఈ సంఘటనను వివరించింది.

“మొట్టమొదట రైలు పట్టాల మీద పడుకోటానికి సిద్ధపడింది మా ఆయనే. ఆ తర్వాత ఆయన స్నేహితులు, ఆ పక్కన వాళ్ల భార్యలు, తర్వాత నా పిల్లలు.

రైలు కూత ఎక్కడో దూరాన వినపడింది. కాసేపటికి మా ముందెక్కడో ఆగినట్టనిపించింది. రైలు ఆగటానికి సహజంగా కొంత సమయం పడుతుంది కదా.. నా భర్త , ఆయన స్నేహితులు, వాళ్ల భార్యల మీదుగా సాగి రైలు నాముందుకు వచ్చింది. నేను కళ్లు తెరిచేటప్పటికి నా తలకు అత్యంత సమీపంలో రైలు ఆగి ఉంది.

నా గుండె చప్పుడు నాకు స్పష్టంగా వినిపిస్తోంది. దానితో పాటు ‘రూపరహితుడయిన ఆ దైవాన్ని ఆరాధించండి.. ఆయననే నిత్యం కొలవండి..’ అన్న ప్రార్థనలు నా చెవిలో పడ్డాయి.

రైలు కొద్దిగా వెనక్కి వెళ్లింది. చక్రాల కింద పడిన మృతదేహాలు మరింతగా ఛిద్రమయ్యాయి. రైలు పట్టాలు రెండు వైపులా రక్తసిక్తంగా మారాయి. ఎగజిమ్మిన ఆ రక్తాన్ని స్వయంగా నా కళ్లతో చూశాను. వంతెన కల్వర్టు వరకూ ఎటుచూసినా రక్తపు ఛాయలే.”

ఈ కథను నేను ఆసక్తిగా విన్నాను. ఒళ్లు గగుర్పాటుకు లోనయ్యింది. ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను. తిండి సయించలేదు. గుక్కెడునీళ్లు తాగటం కూడా కష్టమైపోయింది.

ఆ సాయంత్రం మేము మా గ్రామం తిరిగి వెళుతున్న సమయంలో మా అమ్మ మళ్లీ కథ చెప్పటం ప్రారంభించింది. అది పాత కథే. పంజాసాహిబ్ గొప్పతనాన్ని వర్ణించే కథ. మర్దానాతో పాటు.. గురునానక్ ఆ ప్రాంతానికి వచ్చిన సమయంలో మర్దానా దాహంతో అలమటించటం, నానక్ అతన్ని మూడు సార్లు వలీ కాంథారి దగ్గరకు పంపటం, ప్రతిసారీ అతను భంగపాటుకు గురై తిరిగి రావటం, తర్వాత నానక్ ఒక చిన్నరాయిని తొలగించమని చెప్పటం, అనంతరం జల ఉప్పొంగటం, కంథారి ఆగ్రహంతో బండ రాయిని దొర్లించబోతే.. రూపరహితుడైన భగవంతుడిని ధ్యానించమని నానక్ చెప్పి ఆ బండరాయిని నిలువరించటం..

“అంత పెద్ద కొండలాంటి రాయిని ఎవరైనా ఎలా ఆపగలరు?” సందేహం వ్యక్తం చేస్తూ.. కథ చెబుతున్న మా అమ్మకు మధ్యలోనే అడ్డుపడింది మా చెల్లి.

“ఎందుకు సాధ్యం కాదు” ఎదురుప్రశ్నవేశాను నేను.

“ఉప్పెనలా దూసుకొస్తున్న రైలును ఆపటమే సాధ్యమయినప్పుడు.. ఒక బండరాయినే అడ్డుకోవటం వీలుకాదా?” అనడిగాను.

పరిగెడుతున్న రైలును ఆపేందుకు తమ అద్భుతశక్తులను ప్రదర్శించిన ఆ త్యాగమూర్తుల సేవను మనసులో కొనియాడకుండా ఉండలేకపోయాను.

ఎంత సాహసం చేశారు. ఆకలి, దాహంతో అలమటిస్తున్న మన దేశవాసుల కోసం తిండి, నీరందించేందుకు ఎంత పనిచేశారు. తమ ప్రాణాలనే పణంగా పెట్టారు కదా..

అస్పష్టంగా మనసులో వాళ్ల రూపాలు..

ఏకధారగా నా కంట జలజలా కన్నీళ్లు..

~

మూల రచయిత: కర్తార్ సింగ్ దుగ్గల్

అనువాదం- మౌద్గల్యస

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here