నిదురను మింగేసిన వాన

2
9

[dropcap]వా[/dropcap]నకెందుకో ఆ ఇంటిమీద చెప్పలేనంత ప్రేమ
తన కొప్పుగా కూనపెంకుల్ని కప్పుకుందనో ఏమో

పగలంతా
చినుకుల తలంబ్రాలతో తడిపింది చాలక
రాత్రివేళ
ఆ చీకటిగదుల్లోకి తొంగి చూడాలనీ
చిత్రంగానూ చిలిపిగానూ అనుకుంటుంది
చెదిరిన పెంకుల వరుసల్లో కరిగిన మట్టికుదురుల్లో
దారి వెతుక్కుంటూ జాడ చూసుకుంటూ
ఎక్కడెక్కడినుంచో ఎన్నెన్ని చోటుల నుంచో
ఆత్రంగా దూకేస్తుంటుంది నేలను ముద్దాడేందుకు

పడకేసిన పక్కల్లో ఒక్కసారిగా చలనం
టప్పని వినిపించిన చప్పుడుకో
చల్లగ తాకిన చిరుబిందువుల చెమ్మదనానికో
ఉలిక్కిపడి లేస్తాయి అవి అన్నీ ఒక్కమ్మడిగా
పక్కకు తప్పుకున్న ఆ పక్కలన్నీ
వత్తిని మింగేసి మత్తుగా ఊగుతూ
పొదుపుగా వెలుగుతోన్న  దీపం బాధ్యతలో
పాత్రలకై, గిన్నెలకై వెదుకులాట మొదలెడతాయి

తడి అంచనా త్వరత్వరగా పసికట్టి
అక్కడొకటి ఇక్కడొకటి అలా అలా
కుదురుకున్న ఖాళీ పాత్రలు, గిన్నెలు,
నీటిచుక్కల్ని పట్టే వలలవుతాయి

నిద్రను పక్కకు నెట్టేసిన
నాలుగో ఐదో ఆ ఇంటి శరీరాలు
చెమ్మ చేరని, నీటితడితో నేస్తం కట్టని
జాగాల్లో జాగ్రత్తగా పాగావేస్తాయి
సాగదీసుకునేందుకు సరిపోని ఆ స్థలాల్లో
ముడుచుకుని ముచ్చటగా మూడంకె వేస్తాయి

టప్పు టప్పుల చప్పుళ్ళతో
నిట్ట నిలువునా దూకేసిన నీటిపాపలు
అలా అలానో ఆబగానో పాత్రల్లోని ఖాళీని
తాపీగా తమకంగా తాగేస్తూంటాయి
మెల్లమెల్లగా మందబలం పెంచుకుంటుంటాయి
కరుగిపోతున్న రాత్రి కాపలాగా
అంచులను తాకుతోన్న ఆ ఐకమత్యం
బయటకు తొంగి చూస్తూ బొళుక్ బొళుక్ మంటూ
ఆనందంగా బృందగానం చేస్తుంది

స్వరతీవ్రత మారిన జలగానానికి
కలచెదిరి, కలత చెందిన ఓ పెద్దతనం
కళ్ళునులుముకుంటుంది ఒళ్ళు విరుచుకుంటుంది
నిదురకళ్ళ నిష్ఠూరాల మధ్య
దీపం వెలుగులో ఇంటిని దీనంగా చూస్తూ
పాత్రల ఒడి నిండుగా నిండి
ఖాళీని ఖాయంగా కప్పేసిన నీటిమూటల్ని
భద్రంగా బయటకు రవాణా చేస్తుంది
విసురుగా విసిరేసి తలుపులు మూసేస్తుంది
నిదురను మింగేసిన వానకు వీడ్కోలు చెబుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here