నిజాయితీ

0
12

[బాలబాలికల కోసం ‘నిజాయితీ’ అనే చిన్న కథని అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ.]

[dropcap]అ[/dropcap]వంతి రాజ్య కోశాధికారి కార్యాలయానికి భోజన సమయంలో వచ్చిన మంత్రి సుబుధ్ధి “కోశాధికారి గారూ, నేడు మన ఉద్యోగులు అందరికి జీతాలు అందే ఏర్పాట్లు చేయించారా?” అన్నాడు.

“నమస్కారం మత్రివర్యులకు. ఉదయమే అన్ని శాఖలవారికి ధనం పంపించాను” అన్నాడు కోశాధికారి.

“భోజన సమయం కదా, భోజనం చేసారా?” అన్నాడు మంత్రి.

“లేదు మంత్రివర్యా, ఇంటి వద్ద నా భార్యకు ఆరోగ్యం సరిగా లేనందున వంట చేయలేదు. ఆలస్యం అవుతుందని వేగంగా రావడంతో నా రొంటిలో దోపుకునే ధనం సంచి ఇంటివద్దే మరచి పోయాను” అన్నాడు కోశాధికారి.

“మీ కోశాగారంలో లక్షల వరహలు ఉన్నాయి. వాటిలో మీకు కావలసిన ధనం తీసుకుని ఏ సైనికుని చేతనైనా ఆహరం తెప్పించుకోపోయారా” అన్నాడు మంత్రి.

“మంత్రివర్యా, అది ప్రజాధనం. పాలకవర్గం వాళ్ళు ఆ ధనానికి రక్షకులుగా, జవాబుదారులుగా ఉండాలి. ప్రజాధనాన్ని నా సొంత పనులకు వినియోగించుకోవడం తప్పుకదా! నేడు ఈ అవసరానికి ధనం వాడుకుంటే రేపు మరో అవసరానికి మళ్ళీ తీయాలనిపిస్తుంది. నిజాయితీ కోల్పోయిన వ్యక్తి బ్రతికున్న శవంతో సమం” అన్నాడు కోశాధికారి.

“అటువంటి పరిస్ధితుల్లో రెండు రోజులు సెలవు తీసుకోవచ్చుకదా” అన్నాడు మంత్రి.

“మంత్రివర్యా, వేలమంది ఈ రోజు అందే జీతాల కొరకు ఎదురు చూస్తుంటారు. నేను సెలవు పెడితే వేలమందికి ఇబ్బంది, నిరాశ కలుగుతుంది. ఇందరి కోసం నేనొక్కడినే కష్టపడినా బాధ లేదు అని పనిచేయడానికి వచ్చాను” అన్నాడు కోశాధికారి.

చేరువలోని సైనికుని పిలిచి రాజవైద్యులకు కబురు పంపి, భోజనం తెప్పించి, కోశాధికారితో తను కలసి భోజనం చేశాడు మంత్రి.

ఇంతలో రాజవైద్యుడు రావడంతో “వైద్యులు గారూ, తమరు వెంటనే కోశాధికారితో కలసి వారి ఇంటికి వెళ్ళండి. అక్కడ అనారోగ్యంతో ఉన్న కోశాధికారి గారి భార్యకు చికిత్స అందించండి” అని చెప్పి, “అయ్యా, కోశాధికారిగారూ, మీ భార్యకు ఆరోగ్యం కుదుటపడేవరకు మీరు రానవసరం లేదు. తమరి పదవీ బాధ్యతలు నేను స్వీకరిస్తాను” అన్నాడు మంత్రి.

సంతోషంగా తల ఊపిన కోశాధికారి మంత్రికి తాళాలు అందించి వైద్యునితో కలసి తన ఇంటికి బయలుదేరాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here