నిజాయితీ

0
8

[ఈ కథ 2000 రూపాయల నోట్లను ఉపసంహరిస్తున్నట్టు RBI ప్రకటన వెలువడడానికి 3 నెలల ముందరి కాలానిది.]

[dropcap]అ[/dropcap]నిరుధ్ ఎప్పటిలాగే తనకు అలవాటయిన హోటల్‌కి వెళ్ళేడు. తనకిష్టమయిన కార్నర్ సీట్‌లో కూర్చున్నాడు. అది చిన్న టేబుల్, డిస్టర్బన్స్ ఉండదు, పైగా హోటల్ ఎంట్రన్స్, మెయిన్ రోడ్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ కూర్చుని తింటూ వచ్చి పోయే వాళ్ళని గమనించడం అతనికి సరదా. తెల్సిన సర్వర్ కుర్రవాడు గణేష్‍ని పిలిచి ఆర్డర్ ఇచ్చాడు. గణేష్ చాలా మంచివాడు. ఎప్పుడూ నవ్వుతూ కస్టమర్స్‌ని రిసీవ్ చేసుకుంటాడు. అనిరుధ్‌కి గణేష్ అంటే ఒక మంచి అభిప్రాయం.

గణేష్ ఆర్డర్ ప్రకారం టిఫిన్ తెచ్చేడు. టిఫిన్ తింటూ, పక్కకి చూసేడు అనిరుధ్. పక్క టేబుల్ దగ్గర ఒక వ్యక్తి చాలా నీట్‍గా కనిపించాడు. అతను బ్లాక్ ప్యాంటు, బ్లూ షర్ట్ టక్ చేసుకుని, టై కట్టుకుని, షూస్ వేసుకుని వున్నాడు. అతను గణేష్‍ని బిల్ అడుగుతున్నాడు.

గణేష్ బిల్ ఇచ్చేడు. అతను పర్సు లోంచి 200 నోట్ తీసి ఇచ్చేడు. గణేష్ కౌంటర్ దగ్గర బిల్ కట్టేసి, చిల్లర ఇచ్చేసేడు. ఆ వ్యక్తి వెళ్ళిపోతూ చిల్లర పర్సులో పెట్టుకుంటూ ఒక 2000 రూపాయల నోట్ జారవిడుచుకున్నాడు. అది గమనించిన అనిరుధ్ నోరు తెరిచి అతన్ని పిలిచే లోపే, అతను ఆ నోట్‍ని బూటుతో తొక్కుకుంటూ గబా గబా వెళ్ళిపోయాడు.

చుట్టూ చూసేడు అనిరుధ్. జనం పెద్దగా లేరు హోటల్‍లో. అయితే గణేష్ కూడా 2000 నోట్ పడిపోవడం చూసేడు.

గణేష్ పరుగున వచ్చి ఆ నోట్ తీసాడు. అప్పటికే ఆ పెద్దమనిషి గేట్ దాటుతున్నాడు. నోట్ మీద బూటు మరక తుడుస్తూ, పరుగున వెళ్లి కౌంటర్ వద్ద వున్న యజమానికి విషయం చెప్పి, అతనికి ఇచ్చి వస్తానని, వేగంగా బైటికి వెళ్లి, ఆ వ్యక్తిని సమీపించేడు.

“సర్, మీ డబ్బులు పడిపోయాయి, ఇదుగోండి” అని అన్నాడు.

అప్పుడు అతను వెనుకకు తిరిగాడు.

“సర్ మీ 2000 రూపాయల నోట్, పాడేసుకున్నారు” అంటూ అందించాడు. ఆ వ్యక్తి గణేషుని అభినందిస్తూ, ఆ నోట్ తీసుకుని, తిరిగి కౌంటర్ వద్దకు వచ్చేడు. కౌంటర్ దగ్గర వున్న యజమాని చూస్తుండగా, గణేష్‍ని ఉద్దేశించి ఇలా అన్నాడు.

“నీలాంటి నిజాయితీపరుడు ఉండడం మీ ఓనర్ గారి అదృష్టం. నీకు బహుమతి ఇచ్చి వెళ్లాలని వుంది” అన్నాడు.

హోటల్ యజమానికి విషయం అల్రెడీ తెలుసు కనుక, నవ్వుతూ, అతని వైపు చూసేడు.

కస్టమర్స్ శాటిస్ఫాక్షన్ తన బిజినెస్‌కి శ్రీ రామ రక్ష అని అతని ఉద్దేశం.

“మా గణేష్ బంగారం సార్” అన్నాడు హోటల్ యజమాని.

ఆ వ్యక్తి ఆ 2000 నోట్‌ని యజమానికి ఇచ్చి, “ఇతనికి ఒక 500 ఇవ్వండి, నాకు 1500 ఇవ్వండి. ఇలాంటి పిల్లల్ని ఎంకరేజ్ చెయ్యాలి” అన్నాడు. యజమాని వెంటనే 500 రూపాయల నోట్లు మూడు అతనికి ఇచ్చి, ఒక నోట్ గణేష్‌కి ఇచ్చేడు. ఆ నోట్లు జేబులో పెట్టుకుని, ఆ వ్యక్తి మళ్ళీ ఇలా అన్నాడు.

“ఏమి అనుకోకపోతే, మరో 2000 నోట్‍కి కూడా చిల్లర ఇవ్వగలరా, చిల్లర లేక ఇబ్బంది అయిపోతోంది.”

సరే అని, ఆ 2000 తీసుకుని 500 రూపాయల నోట్లు మరో 4 అతనికి ఇచ్చేడు యజమాని. ‘థాంక్స్’ అని చెప్పి అతను వెళ్లిపోయాడు.

గణేష్ మొహం వెలిగిపోయింది. ఇదంతా గమనిస్తున్న అనిరుధ్ కూడా గణేష్‍ని మెచ్చుకున్నాడు. తన బిల్ పే చేసి, గణేష్‍కి 20 రూపాయలు టిప్ ఇచ్చేడు.

***

మరునాడు రాత్రి ఇంటి దగ్గర్లోని ఎటిఎంకి వెళ్ళేడు అనిరుధ్. అది ఒక ఈ-జంక్షన్. అక్కడ, ఎటిఎంలు, కాష్ డిపాజిట్ మెషీన్లు, చెక్ బుక్ ప్రింటింగ్ అన్నీ ఉంటాయి.

అక్కడ వుండే రామయ్యని గమనిస్తూ ఉంటాడు అనిరుధ్. రామయ్యకి ఓ ఏభయ్యేళ్ళు ఉండొచ్చు. చాలా సిన్సియర్‍గా డ్యూటీ చేస్తాడు. వచ్చిన వాళ్లకు సహాయం కూడా చేస్తూ ఉంటాడు. అలాగే, వచ్చిన వాళ్ళని ఓ కంట గమనిస్తూ ఉంటాడు. ఎటిఎం దగ్గర అనుమానాస్పదంగా వుండే వాళ్ళని గదమాయిస్తూ ఉంటాడు. తాను డ్యూటీలో ఉండగా ఆ ఈ-జంక్షన్‌లో ఏ తప్పూ జరగకూడదు అన్నట్లు చూసుకుంటూ ఉంటాడు. అతని రెస్పాన్సిబిలిటీ, హడావిడీ వెళ్ళినప్పుడల్లా అనిరుధ్ చూస్తూనే ఉంటాడు.

అనిరుధ్ వెళ్ళేటప్పటికి, రాత్రి 8.30 అయింది. తెలిసినవాడు అవడంతో రామయ్య పలకరింపుగా నవ్వేడు. తిరిగి నవ్వేడు అనిరుధ్.

ఎటిఎం మెషిన్ దగ్గర ఇద్దరు వ్యక్తులు క్యూలో వున్నారు. తన వంతు కోసం వెయిట్ చేస్తున్నాడు అనిరుధ్.

రామయ్య ఫోన్‍లో మాట్లాడుతున్నాడు. ఎవరితోనో గట్టిగా అంటున్నాడు – “నా దగ్గర ఇప్పుడు 500 లేవు. జీతం పడడానికి ఇంకా 4 రోజులు వుంది. జీతం వచ్చేక చూదాం లే”. బహుశా అవతలి వైపు అతని భార్య ఏమో అనుకున్నాడు అనిరుధ్.

ఇంతలో తన టర్న్ వచ్చి అనిరుధ్ ఎటిఎం దగ్గరకు వెళ్ళేడు. అప్పటికి ఈ-జంక్షన్‍లో రామయ్య, అనిరుధ్ తప్ప ఎవరూ లేరు.

డబ్బు తీసుకుని, స్లిప్ కోసం వెయిట్ చేస్తుండగా, అనిరుధ్‍కి చిత్రమయిన ఆలోచన వచ్చింది.

‘రామయ్యకి ఇప్పుడు 500 రూపాయలు అవసరం ఉందని తెలుస్తోంది. అవసరంలో నిజాయితీ వుంటుందా?’ Test చెయ్యాలని అనిపించింది.

డబ్బు తీసి పర్సులో పెట్టుకుంటూ ఒక 500 నోట్ జారవిడిచాడు, చూడనట్లు గుమ్మం వైపు కదిలాడు.

‘ఒక వేళ ఆ డబ్బు తీసుకుంటే, అవసరంలో వున్న పేదవాడికి అవసరం తీరుతుంది, లేదూ తిరిగి ఇచ్చేడా, మెచ్చుకుని ఇద్దాము’ అనుకున్నాడు.

రామయ్య చూడనే చూసేడు. “సర్ మీరు డబ్బులు పాడేసుకున్నారు” అన్నాడు.

అప్పుడే చూసినట్లు రామయ్య వైపు తిరిగేడు అనిరుధ్. పడిన నోట్ తీసి తెచ్చి అనిరుధ్‌కి ఇచ్చేడు.

“నీ నిజాయితీ నచ్చింది, ఇంకొకళ్ళయితే కామ్‌గా తీసుకుని జేబులో పెట్టుకునే వాళ్ళు” అన్నాడు అనిరుధ్.

“ఎందుకు బాబూ పరుల సొమ్ము పాము లాంటిది” అన్నాడు రామయ్య.

“పోనీలే రామయ్య.. ఏదో అవసరం ఉన్నట్లుంది, వుంచు” అన్నాడు.

“వద్దు బాబూ” అని వెనక్కి తిరిగేడు రామయ్య. రామయ్య ఆత్మాభిమాని అని అర్ధం అయింది.

మాట కలుపుతూ.., “నీ నిజాయితీ చూస్తే ముచ్చట వేస్తోంది. పిల్లలు ఏం చేస్తున్నారు?” అన్నాడు అనిరుధ్.

“ఏం నిజాయితీ సార్, అలా మా పెద్దలు నేర్పేరని పాటిస్తున్నాం కానీ..” అని, ఒకసారి ఆగి నిట్టూరుస్తూ.. “ఇదే నిజాయితీ నా కొడుక్కి తలనెప్పులు తెచ్చింది” అన్నాడు.

“అదేమిటి?” ఆశ్చర్య పడుతూ అడిగేడు అనిరుధ్.

“మా అబ్బాయి హోటల్‍లో సర్వర్‍గా చేస్తాడు బాబు. నిన్న ఎవడో పెద్దమనిషి టిఫిన్ తిని యెల్లిపోతూ 2000 నోట్ పాడేసుకున్నాడుట. ఆ 2000 నోట్ తీసి ఇచ్చి, మావోడు నిజాయితీ నిరూపించుకున్నాడు. అయన ఆ 2000 నోట్‌కీ మరో 2000 నోట్‌కీ కూడా యజమాని దగ్గర చిల్లర తీసుకుని, మావోడికి 500 ఇచ్చి మిగిలిన డబ్బు జేబులో ఏసుకుని యెల్లి పోయాడుట. మధ్యాహ్నం గల్లాపెట్టిలో డబ్బు బ్యాంకుకి పంపించేడు యజమాని. అప్పుడు తెలిసింది, ఆ 2000 నోట్లు దొంగ నోట్లుట. మా వాడిని తిట్టి, ఆడి దగ్గర వున్న 500 లాగేసుకున్నాడు యజమాని. పైగా ఇంకో అనుమానం పెట్టేడుట. మావోడు, ఆ పెద్దమనిషి కూడా బలుక్కుని దొంగ నోట్లు మారుస్తున్నారేమో, పోలీసుల్ని పిలుస్తా.. వాళ్ళే తెలుస్తారు అన్నాడుట. మా వోడు కళ్ళమ్మట నీళ్ళెట్టుకుని బతిమాలితే వదిలేసాడుట. అందరిముందు జరిగిన అవమానంతో మా వోడు ఈరోజు నుండి పని మానేసేడు బాబూ” అన్నాడు రామయ్య.

అనిరుధ్‌కి నిన్న తాను హోటల్‌లో చూసిన సంఘటన గుర్తుకు వచ్చింది.

“మీ వాడి పేరు గణేశా?” అన్నాడు.

“అవును బాబూ, మీకు మావోడు తెల్సా” అన్నాడు రామయ్య.

అనిరుధ్ తాను నిన్న హోటల్‌లో చూసిన విషయం చెప్పేడు.

అనిరుధ్‌కి చాలా జాలి వేసింది గణేష్ మీద. నిజాయితీకి శిక్ష పడకూడదు అనిపించింది.

“మా ఆఫీస్ డాబాగార్డెన్స్ లోనే ఉంటుంది, ఈ విజిటింగ్ కార్డు మీ అబ్బాయికి ఇచ్చి, నా దగ్గరికి పంపించు. మా ఆఫీస్‍లో అటెండర్ వుద్యోగం ఖాళీగా వుంది. నీ కొడుకు లాంటి నిజాయితీపరుడు నాకు కావాలి” అన్నాడు అనిరుధ్.

రామయ్య ముఖం వెలిగిపోయింది.

“చానా సంతోషం బాబూ, దర్మ ప్రభువులు.. నా కొడుకుని మీ దగ్గరకి పంపిస్తా” అన్నాడు సంతోషంగా.

సమాప్తం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here