తెలంగాణ మలితరం కథకులు కథనరీతులు-10 – నిఖిలేశ్వర్: అనుభవాల సారంలోంచి రూపుదిద్దుకున్న కథలు

0
8

[box type=’note’ fontsize=’16’] రాజకీయ దృక్పథం, సమస్యలపై స్పందన లేకుండా ఉత్తమ సాహిత్య సృష్టి ఏనాడు జరగలేదు” అని విశ్వసించే నిఖిలేశ్వర్ కథలను విశ్లేషిస్తున్నారు కె.పి. అశోక్ కుమార్. [/box]

[dropcap]”రా[/dropcap]జకీయ దృక్పథం, సమస్యలపై స్పందన లేకుండా ఉత్తమ సాహిత్య సృష్టి ఏనాడు జరగలేదు” అని విశ్వసించే నిఖిలేశ్వర్ అసలు పేరు కె. యాదవరెడ్ది. ఒకనాటి నల్లగొండ జిల్లా భువనగిరి సమీపాన వీరవెల్లి గ్రామంలో శ్రీ కుంభం నర్సయ్య, నర్సమ్మ దంపతులకు 1938లో జన్మించారు. వీరి విద్యాభ్యాసమంతా హైదరాబాదులోనే కొనసాగింది. చిన్నతనంలోనే హిందీలో విశారద, భూషణ్ పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. తర్వాతి కాలంలో బి.ఎ., బి.ఇ.డి పూర్తి చేశారు.

వారు 1960లో సైన్యంలో (ఎఒసి సెంటర్) మూడు సంవత్సరాల పాటు సివిలియన్ స్కూలు మాస్టారుగా, తాంబరం ఎయిర్‌పోర్టులో మూడు నెలలపాటు క్లర్క్‌గా, గోలకొండ పత్రికలో (1964-66) సబ్ ఎడిటర్‌గా, 1966 నుండి 1996 దాకా ముప్ఫై సంవత్సరాల పాటు కేశవ మెమోరియల్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పని చేసి పదవీ విరమణ చేశారు.

కె. యాదవరెడ్డిగా 1956లోనే గోలకొండ పత్రికలో తొలి రచన అచ్చుకాగా, ఆ తర్వాత అనువాదాలతో, స్వీయ రచనలతో 1960 నుండి 1965 దాకా ప్రారంభ దశలో ప్రేమ కవిత్వం, వచన కవితలు, ఆనాటి అనుభవాలు – సామాజిక సమస్యల అభివ్యక్తిని కనబరిచారు. 1965 నుంచి నిఖిలేశ్వర్‌గా దిగంబర కవిత్వ ఉద్యమాలలో. తర్వాత విరసం, జనసహితి సంస్థాపక సభ్యుడిగా, ప్రజా సాహితి పత్రికకు సంపాదకుడిగా (1980-82) వ్యవహరించారు. ఇవే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ పౌరహక్కుల సంఘం, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ సంస్థ, గ్రామీణ పేదల సంఘం, భారత చైనా మిత్రమండలిలో క్రియాశీలక పాత్రను నిర్వహించారు.

నిఖిలేశ్వర్ దిగంబర కవిగా సుప్రసిద్ధుడు. దిగంబర కవి కావడానికి ముందే ఆయన రచయిత. దాదాపు ఐదు దశాబ్దాల సాహిత్య జీవితంలో అనేకానేక రచనలు చేశారు. కవిగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా, ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట స్థానం సంపాదించుకున్నారు. మూడు దిగంబర కవితా సంపుటాలు కాకుండా, విడిగా తొమ్మిది కవితా సంపుటాలను వెలువరించారు. విమర్శకుడిగా అయిదు పుస్తకాలను తీసుకువచ్చారు. హిందీలో నుండి తెలుగులోకి, తెలుగు నుండి హిందీలోకి తొమ్మిది పుస్తకాలను అనువాదం చేశారు. తమ జైలు జ్ఞాపకాలను “గోడల వెనుక” పేరుతో ప్రచురించారు. కథకుడిగా 1961 నుంచి 2001 వరకు దాదాపుగా 40 కథల వరకు రాశారు. ఇందులోంచి 22 కథలను ఎంపిక చేసి, విశాలాంధ్ర వారు “నిఖిలేశ్వర్ కథలు” పేరిట 2002లో ఒక సంపుటిగా తీసుకువచ్చారు. ఇందులో లోకం అని – మధ్యతరగతి మనస్తత్వాన్ని తెలియజేసే కథలున్నాయి. దేశభక్తి – సైనికుల వీరగాథలున్నాయి. ఉద్యమ అవసరాన్ని – ఉద్యమ నిబద్ధతను తెలియజేసే కథలున్నాయి. ఒంటరితనం – పరాయితనాన్ని వివరించే కథలున్నాయి.

ఇందులో బతకలేని బడిపంతులు ఆత్మారావు కవి కూడా. తను ఎవరికీ అవసరం లేదు. తన కవిత్వం ఎవరికీ పట్టదు.  ఏ నెల కా నెల అప్పులు చేయడంతో, వడ్డీలను కట్టడంతో, మిగిలిపోయిన సత్తువతో బతుకు భారమైపోతుంది. ఇన్ని బాధలూ, ఇంత సిగ్గులేనితనం, ఇంత ఆత్మాభిమానం, చచ్చిన జీవితంతో మిగిలిన తనకు మిగిలింది లోపల కాలుతుండే ఆత్మ ఒక్కటే. సమస్యలు ఏ రాత్రికి ఆ రాత్రి వచ్చి కరిచి, రక్తం తాగి, రంధ్రాల్లో మత్తుగా పడి ఉండే నల్లుల్లా ఏ నెల కా నెల కరుస్తూనే ఉన్నాయి. ఈ నల్లులకు భయపడి పలాయానం చిత్తగిస్తే, దేశం నిండా ఉన్న ‘నల్లులు’ ఏ మాత్రం వదలవు. వాటి నుండి పారిపోవడం కాదు, వాటిని నాశనం చేయాలని ఆత్మారావు నిర్ణయించుకోవడంతో కథ ముగుస్తుంది. రచయిత ఈ కథలో సమస్యలకు ప్రతీకలుగా నల్లులను తీసుకున్నారనేది పాఠకుడు గ్రహించగలుగుతాడు.

మధ్య తరగతి మనిషి రేపటి కోసం – తనకు కావలసిన అదనపు సౌకర్యాల కోసం లంచాలు ఇచ్చి ఎలాగైనా పైకి పోదామనే ఆదుర్దాతో, పక్కనే సమాధి అవుతున్న యితరుల్ని ఆదుకునే గుండె ధైర్యం కోల్పోతున్నాడు. ‘రేపటి భయం’ లోంచి పోరాటాలు పుడతాయనే సంగతి రాజారావుకు కొంచెం తెలుసు. కాని మధ్య తరగతి ఆశల్లో రేపటి సౌకర్యాల కోసం మౌనంగా రాజీ పడిపోతున్నాడు. ఈ రెండు కథలు మధ్య తరగతి మనస్తత్వాన్ని – వారు కోరుకునే భద్ర జీవితాన్ని గురించి తెలియజేస్తాయి.

1962లో చైనాతో జరిగిన యుద్ధం, 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్న భారతీయ సైనికుల వీరత్వాన్ని, త్యాగాన్ని ప్రశంసిస్తూ దేశభక్తిని ప్రబోధించే కథలు మూడు ఇందులో ఉన్నాయి.  ‘ఆరని మంటలు’ కథలో లద్దాక్ సరిహద్దుల నుండి చుబుల్ విమాన స్థావరాన్ని కాపాడుకోడానికి మన పటాలం వెనుదిరుగుతుంది. సాయంత్రం మంచులో నడుస్తున్న ఆ పటాలం మీద దాడి  మొదలవుతుంది. గాయంతో చిక్కిపోయిన మేజర్‌ను చైనావాళ్ళు చంపివేస్తారు. పది రోజుల తర్వాత కొండదిగువన నది గట్టు పక్క నుండి చీలిన సన్నదారి గుండా వస్తున్న చైనా సైనికులను నిర్దాక్షిణ్యంగా చంపివేసి మన జవాన్లు ప్రతీకారం తీర్చుకుంటారు. అలాగే చైనా ఇన్‍ఫాంట్రీ బెటాలియన్ ఒకటి మెక్‌మోహన్ లైన్ దాటి  ముందుకు వస్తున్నదని తెలుస్తుంది. భారతీయ సైనికులు తమ ప్రాణాలు అర్పించి చైనీయులను, వారి స్థావరాన్ని నాశనం చేయడం ‘గ్రెనేడియర్స్’లో కనిపిస్తుంది. ‘మనిషి-మట్టి’ కథలో లాహోర్‌కి దగ్గరలో వున్న బర్కీ టవున్ పైకి భారత బాంబర్లు దాడి చేస్తాయి. ప్రజలంతా పట్టణం ఖాళీ చేసి పోతుంటే, మసీదు దగ్గర వున్న ఒక పూరి గుడిసెలో ఇద్దరు ముసలి అన్నాచెల్లెళ్ళు మిగిలిపోతారు. అక్కడకు వచ్చిన భారత సైనికులు ఆ వృద్ధులను ఆదరిస్తారు. దేశంగా విడిపోయినప్పటికీ మతం పేరు మీద మారణకాండ జరపాల్సిందేనా అని ఆ వృద్ధుడు ప్రశ్నిస్తాడు. అతనికి జవాన్ల మధ్య మతం – మానవత్వం – దేశభక్తిల మీద చర్చ జరుగుతుంది. అంతలో పాక్ బాంబర్ల దాడిలో  మసీదు కూలి ఆ వృద్ధుడు మరణిస్తాడు. చెల్లెలు ఖైరున్నీసా పాకిస్తానీయుల బారి నుండి భారత సైనికులను కాపాడి ప్రాణాలు విడుస్తుంది. బోలెడంత సెంటిమెంటు, అతి నాటకీయత కలిపితేనే దేశభక్తి కథలు రక్తి కడతాయని రచయిత మరోమారు నిరూపించారు.

విద్యార్థులు జ్ఞానార్జన కంటే ఉత్తీర్ణులు కావడమే ముఖ్యంగా, ఎక్కువ మార్కులు తెచ్చుకోవడమే ధ్యేయంగా మారిపోయింది. దాని కోసం ఎలాంటి వక్రమార్గాలనయినా అనుసరించడానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు వెనుదీయడం లేదు. నీతిని, మంచి నడవడికను నేర్పించవలసిన చదువు దగ్గరే అవినీతిని, అక్రమాలని నేర్పించే చాకచక్యాన్ని బోధించడం, తరతమ భేదాలున్న సమాజం మూలంగానే జరుగుతున్నదనీ – రేపటి రక్షణ లేని బతుకు భయం చాలామందిని అక్రమాల వైపు నెడుతున్నాయని ‘అక్రమాల అంచులపై’ నిలబడి టీచర్ రామారావు గ్రహిస్తాడు. ఇంకో కథలో విద్యాలయాలు, దేవాలయాల కంటే పవిత్రమైనవని గాఢంగా నమ్మిన ప్రకాశం ఉపాధ్యాయ వృత్తిలో చేరతాడు. “మరి ఆ నమ్మకానికి ఇప్పుడు చెదలు పడుతోందా? విద్యాలయాలు కూడా దేవాలయాలుగానే ఏవో పూజా పునస్కారాల తంతు కోసమే మిగిలిపోయినట్లా?” అనే ప్రశ్న ప్రకాశాన్ని తరచుగా పీడించేది. ప్రకాశం కళ్ళ ఎదుటే చాలామంది టీచర్ల జీవితం బెల్లు -బిల్లుకే పరిమితమైపోయింది. ఇది ఒక వైపు, మరో వైపు ఉపాధ్యాయులు ఎన్నో సమస్యలు ఎదుర్కుంటున్నారు. ముఖ్యంగా ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయులకు జీతాలు సరిగా రావు. ఒక స్కూల్లో మూడు నెలల నుంచి జీతాలు లేని పరిస్థితి. దీనికి తోడుగా రిటైరయిన వాళ్ళ సర్వీసులోని పాతకాలం నాటి ప్రావిడెంటు ఫండ్ డబ్బు కొంతమేర మేనేజ్‌మెంట్ దగ్గరే వుండిపోయింది. ప్రధానోపాధ్యాయుడు భగీరథస్వామి అది ఎంతకీ తేల్చకపోవడంతో తిరిగి తిరిగి రాజారావు మేస్టారు గుండె ఆగి చనిపోవడం ‘విద్యయామృత మశ్నుతే’లో కనిపిస్తుంది. ఈ రెండు కథలు విద్యా విధానంలోని అవకతవకలను చిత్రీకరించినప్పటికీ – మొదటి కథను విద్యార్థుల కోణం నుండి రాయగా, రెండవ కథలో ఉపాధ్యాయుల జీవితాలను చిత్రీకరించారు.

దేవుడు – మతం పేరిట తమలో తాము కలహించుకునేవాళ్ళు, ‘పిచ్చి కుక్క’ కనిపిస్తే చాలు అందరూ కలిసి దాన్ని చంపేవరకు ఊరుకోరు. ఇంకో వైపు మంచికి, చెడుకు మధ్య ఉన్న సన్నని గీతను చెరిపేసిన ‘గడ్డం మనిషి’ వ్యక్తిత్వం, అతని ప్రవర్తన కొత్త వాళ్ళకు విచిత్రంగానే వుంటుంది. ‘కర్ర ఉన్నవాడిదే బర్రె’ అనే నానుడిని ఈ రెండు కథలు ఋజువు చేస్తాయి.

నగరంలో రద్దీగా వున్న బస్సులో జేబుదొంగలు వుంటారనీ కండక్టరుకు, పోలీసులకు, చివరకు ప్రయాణీకులకు కూడా తెలుసు. ఎవరికి వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎప్పుడో ఒకసారి జేబుదొంగల చేతివాటానికి చిక్కక తప్పదని తన అనుభవం ద్వారా వీరాస్వామి తెలుసుకోవడమే ‘జాలి’ కథగా రూపొందింది. ‘బాయి ఆగమైపోయింది’ కథలో అమాయకులు, నిరక్షరాశ్యులైన రైతుల అవసరాలను ఆసరా చేసుకుని అధికారులు తెలివిగా మోసం చేస్తారు. అది తెలిసినా న్యాయస్థానాలు ఏమీ చేయలేకపోతే, అలాంటి మోసాలు కొనసాగుతూనే వుంటాయి. ‘నిరాశ్రయులు’ కథలో జైలు నుండి పారిపోయి వచ్చిన సత్యం, మసీదులోని ఫకీరు దగ్గర తల దాచుకుంటాడు. “జైలు ఒక చిన్న నరక కూపం. అందులోంచి బయటపడి ప్రపంచం అనే పెద్ద నరకంలోకి అడుగుపెడుతున్నావు. బతికి బయటపడి గానుగెద్దు జీవితం గడపడంలో ఏమున్నది? పోలీసులకు దొరికితే మరణశిక్ష తప్పదు. నీలాంటివాళ్ళు, సమాజానికి పనికిరాని నాలాంటివాళ్ళు బ్రతికి ఏం ప్రయోజనం? ఎక్కువ మోతాదులో నల్లమందు మింగి చద్దాం” అని ఆ ఫకీరు ప్రతిపాదిస్తాడు. ముగింపును పాఠకులకే వదిలేయడం బాగా వచ్చింది. సున్నితమైన విషయాలకు అతిగా స్పందించి మతకల్లోలాలకు దారితీసే పాతనగరంలో, దుండగుల బారి నుంచి జంగయ్యను కాపాడే ప్రయత్నంలో హుసేను ప్రాణాలు పోగొట్టుకుంటాడు. మత సామరస్యాన్ని ప్రబోధించే ‘పొగ చూరిన నెలవంక’ అనే ఈ కథ అతి నాటకీయతతో కూడుకుని వుంది.

ప్రజారాజ్యం పేరిట ప్రజాకంటకులు అధికారంలో కొనసాగుతున్నారు. అధికారం వున్నవాడికి ఎదురు తిరగనంత కాలం, అణగిమణగి వున్నంత కాలం, బానిసగా ఉన్నంత కాలం ప్రమాదం లేదు. వ్యక్తులు నోట్లుగా మారి కొందరి సుఖాల్ని, భోగాల్ని, అఘాయిత్యాల్నీ, అధికారాల్ని నిలబెడుతుంటే నాకేం ఫర్వాలేదు, ఫర్వాలేదు అనే సర్దుబాటు బానిసత్వాన్ని విదిలించుకుని సూర్యం దళంలో చేరాడు. కొన్ని గ్రామాలను కలిపే అడవిలో శిక్షణ పొందుతాడు. మనల్ని ధనవంతుడైన బలవంతుడు తన కోసం బలి చేయకముందే తామే ఆ కొద్దిమందిని నేలమట్టం చేస్తే మంచిదనే నిర్ణయానికి వస్తాడు. రైతులందరికీ పెద్ద వర్గశత్రువుగా తయారైన గురవారెడ్డిని ఖతం చేస్తాడు. దోపిడి రూపంలో ఉండే ఏ మనిషికయినా ఆ శిక్ష తప్పదు. ఈ వ్యవస్థలో ఏదో రూపంలో దోపిడి అంతం కావాలి. అందుకే తనలో పశ్చాత్తాపం లేదు. మొన్నటి వరకు పరాయి పాలన రూపుమాపడానికి కొందరు ప్రాణాలు ఇచ్చారు. ఇప్పుడు పెత్తనం చెలాయిస్తున్న దోపిడి శక్తులను తుదముట్టించడానికి – మరికొందరు ప్రాణాలు ఇస్తున్నారు. శత్రువు అన్ని విధాలా, అన్ని రంగులు పులుముకుని దోపిడి చేస్తుంటే, తమకు ఎందుకు పట్టింపులు వుండాలని తలపోస్తాడు. ఈ ఆలోచనా క్రమంలో జైల్లోంచి పారిపోవాలనే దుందుడుకు ప్రయత్నంలో ‘సూర్యుడు’ దుర్మరణం పాలవుతాడు. ఈ సమాజాన్ని ఏ విధంగానయినా మార్చాలనే తపన రమేశ్‌ను ఉద్యమంలోకి నడిపిస్తుంది. కాలేజీ నుంచి బయటకు వచ్చి రోడ్ల మీద ఖాళీ జీవితాలను కళ్ళారా చూస్తాడు. ఈ వ్యవస్థలో వాళ్ళు ఇలాగే బతకవలసిందేనా? ఫుట్‌పాత్‌ల మీద, చెట్ల క్రింద సమసిపోవాల్సిందేనా? రాజకీయ పరిష్కారం కావాలి. దీనికి యువకులే నడుం కట్టాలి. కొందరికి త్యాగం తప్పదనే ఆదర్శంతో దళంలో కలిసిపోతాడు. అసలు ప్రజలను వాళ్ళ సమస్యల పరంగా సమాయాత్తం చేయకపోతే తమ త్యాగం నిరర్ధకమవుతుమ్దనే అంశాన్ని ఆ వేడిలో గ్రహించలేకపోతాడు. ఫలితం రమేశ్ పోలీసులకు చిక్కి, చిత్రహింసలు అనుభవించి, ఎన్‌కౌంటర్ అవుతాడు. అలా ‘విరుచుకు పడిన కెరటం’ అణగారిపోతుంది. ఒక ఫ్యాక్టరీలోని కార్మిక సంఘ సభ్యులు ‘విప్లవం’, ‘కార్మికరాజ్యం’ అంటూ తీవ్రవాద రాజకీయాలు మాట్లాడుతూ హింసను, అశాంతిని రెచ్చగొడుతున్నారు. చట్టబద్ధంగా ఎన్నుకోబడ్డ ఈ ప్రభుత్వాన్ని దౌర్జన్య పద్ధతులలో కూలదోయాలని కుట్ర పన్నుతున్నారు అంటూ స్పెషల్ బ్రాంచి పోలీసులు కార్మికుడైన కాంతారావును కలిసి ఒక మంచి పౌరుడిగా, కార్మికుడిగా, దేశభక్తుడిగా తమతో సహకరించి వారి రహస్యాలను తెలియజేయమని కోరగా, కాంతారావు వాళ్ళని తిట్టి తరిమేస్తాడు. జీవితమంతా అన్ని స్థాయిల్లో అన్యాయంతో రాజీపడకుండా  నడిచి వెళ్ళవలసిందే. అలా నడిచిపోవడమే ఆనందం అని తలపోస్తాడు. వెంటబడిన పోలీసు ‘నీడలతో నడిచినప్పుడు’ ఈ కథ జరుగుతుంది.

అది ‘మూడు రోడ్ల కూడలి’. ఒక దారి అటు దూరంగా చెట్ల మధ్యకు ప్రకృతి ఒడిలోకి. రెండో దారి ఇటు జనారణ్యంలో సుఖాల వేటలోకి. మూడో దారి ప్రజా విముక్తి పోరాటంలోలి. ఎలాంటి ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తపరచకుండా రాకేష్ మూడో దారిని ఎంచుకుంటాడు. ఆచరణ లేని ఉత్తుత్తి ఆలోచనలన్నీ వ్యర్థమేనన్న రాకేష్ ఎన్‌కౌంటర్‌లో చనిపోతాడు. పోరాటల్లో వ్యక్తిగతమైన తెగింపు అవసరమే కాని ప్రజా సమీకరణ లేనిచోట కేవలమ్ ఒంటరి కాళ్ళ బాటగా పారిపోతే ఎవరికి ప్రయోజనం? త్యాగాలు నిష్ప్రయోజనమైతే తర్వాత మిగిలేవాళ్ళు ఎంతమంది? దూరదృష్టి లేని దుస్సాహసాల వల్ల ‘విరుచుకు పడిన కెరటం’లో రమేశ్, ‘మూడు రోడ్ల కూడలి’లో రాకేష్ పోలీసులకు పట్టుబడి చిత్రహింసలతో చంపబడుతారు. వారి మరణం వారికే కాదు, ఉద్యమానికి కూడా నష్టమని వారు తెలుసుకోలేకపోయారు.

అగ్రకులాలయినా, మిగతా ఏ కులాలయినా సమిష్టి బలంతో న్యాయమైనా, అన్యాయమైనా జరిపించవచ్చు. ముఠాలతో తగాదాలు పెట్టి తలలు పగలగొట్టవచ్చు. ఇతర కులాల కష్టజీవులకు మంచి చేయాలనుకున్నప్పుడు సొంత కులాన్ని, ఆ కుల అహంకారాన్ని ఎదుర్కోక తప్పదు. పైకి ఎంతో అభివృద్ధి జరిపినట్టు కనబడినా రాజిరెడ్డి, సాయన్న లంటి రైతులు మాత్రం ప్రతినిత్యం కులం – అధికారదర్పం అనే కొండలను ఢీ కొంటూనే వున్నారు. ఆ కొండలను తొలగించి రేపటి దారిని నిర్మించుకునే నమ్మకం వాళ్ళకు వుందనే ఆశాభావంతో ‘కొండ కింది భూమి’ కథను ముగిస్తారు. తండ్రి కంటే, తండ్రి పెంపకం కంటే పరిసరాలు, స్నేహితుల ప్రభావం కొడుకును దారి మళ్ళిస్తున్నాయి. ఆ తరుణ ప్రాయంలో, ఎటు వెళ్ళాలో తెలియని మలుపు దగ్గరే కొడుకును ఆదుకోవాలి. లేకపోతే వాడు ఏమైపోతాడో? అని తండ్రి విచారిస్తాడు. కాని తను ఆ వయసులో చిన్ననాడు తెలుసుకోలేని అనేకమైన విషయాలను ఈనాడు కొడుకు తెలుసుకుంటున్నాడు. ప్రభుత్వం, సమాజం తమ సమస్యలకు సరి అయిన పరిష్కారం చూడడం లేదని రోడ్ల మీదకు వస్తున్నాడు. విద్యార్థులతో తన గురించి కాక, సమాజం గురించి తన కొడుకు ఆలోచిస్తున్నాడని తండ్రి సంతోషపడతాడు. ‘మా అబ్బాయి నా బాల్యానికి తండ్రి’ అని పొంగిపోతాడు. సమస్యలకు పరిష్కారంగా ఈ రెండు కథలు ఎదిరింపు చైతన్యాన్ని, పోరాడే మార్గాన్ని సూచిస్తాయి.

ఇద్దరు పిల్లల తల్లి వసంతానికి, ఇరవై ఆరు సంవత్సారల క్రితం విడాకులు ఇచ్చిన భర్త – ఇప్పటి వరకు ఆమె గురించి, పిల్లల గురించి పట్టించుకోలేదు. ఇప్పుదు రెండో భార్య తప్ప పిల్లలు లేని ఆ భర్త ‘వసంతం ఇల్లెక్కడ’ అని వెతుక్కుంటూ వస్తాడు. తన అపరాధ భావనను తొలగించుకోవడానికి సగం ఆస్తిని పిల్లల పేరు మీద రాస్తానని వస్తే, వసంతం, ఆమె కొడుకు నిర్ద్వందంగా తిరస్కరించి, తమ ఆత్మాబిమానాన్ని చాటుకోవడం చక్కగా చిత్రీకరించారు. కెనడాలో యాంత్రికంగా, అతి వేగంగా ఎవడి పనిలో వాడు. ఎవడి గొడవ వాడి సొంత ప్రైవేటు వ్యవహారం. ఆ ప్రైవేటు జీవితంలోకి తొంగి చుసే ఆసక్తి, తీరిక ఎవరికీ వుండవు. అవసరాలను బట్టి అన్నీ మారిపోతుంటాయి. అదే ఈ దేశంలో, ఈ గందరగోళంలోనే లెక్కలేనన్ని రోజూవారీ సమస్యలకు ఎదురీదుతూ జీవితం గడిపేస్తున్నారు. ఇక్కడి జీవితం ఎంత నిష్ఠూరమో, ఎంత ఓపికతో ఈ జనం రేపటిపై ఆశలు పెట్టుకున్నారో చూసి కెనడా నుండి వచ్చిన డాక్టర్ సురేష్ ఆశ్చర్యపడతాడు. ఇరువైపులా పోల్చుకుని తనదే ‘పరాయి బతుకు’ అని తెలుసుకుంటాడు. ‘ముక్తి’ వెంటాడుతున్న అశాంతి నుంచా? భౌతిక సుఖాల కోసమా? ఎవరి నుంచి? ఎవరి కోసం? ‘ముక్తి’ మన స్వార్థం నుంచి, సుఖ భోగాల పరుగు నుంచి కావాలే తప్ప, ఎక్కడో దేవుని సన్నిధిలోకి చేరి స్వర్గసుఖాలను అనుభవిస్తామనుకోవడం ఆత్మవంచన. చివరకు మానవ సేవలోనే ముక్తి దాగి ఉందని తెలుసుకోవడంతో కథ ముగుస్తుంది. ఒంటరితనం గురించి, పరాయీకరణ గురించి తెలియజేసే ఈ మూడు కథలను వైవిధ్యభరితంగా చిత్రీకరించడంలో రచయిత చూపిన ప్రతిభ ప్రశంసనీయం.

నిఖిలేశ్వర్ రాసిన కథల నుండి వస్తు వైవిధ్యం గల కథలను ఎంపిక చేసుకుని ఈ సంకలాన్ని వెలువరించారు. ఈ కథలన్నీ నిఖిలేశ్వర్ అనుభవాల నుండి రూపొందినవే. అప్పట్లో ఒకసారి చైనా, మరోసారి పాకిస్తాన్ మన దేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు జరిగిన యుద్ధ సందర్భాలలో రచయిత రక్షణశాఖలో పని చేస్తుండడం వలన దేశభక్తిని ప్రబోధించే కథలు ముఖ్యంగా సైనికుల పోరాతాలు – సాహసాలను వివరించే కథలను రాయగలిగారు. ‘నల్లులు’ అనే ప్రతీకాత్మక కథలో, రచయిత స్వయంగా ఆ ప్రతీకను వివరించడం కంటే పాఠకులకే వదిలేసి ఉంటే బాగుండేది. అన్వేషణ, తాత్త్విక చర్చలతో కూడిన ‘ముక్తి’ అనే కథ నేతి, నేతి ధోరణిలో కొనసాగడం బాగా వచ్చింది. ఇందులో కొన్ని కథలు ఎదిరింపు చైతన్యాన్ని సూచిస్తే, చాలా కథలు ఆశావహ దృక్పథంతో ముగియడం విశేషం. మంచి పఠనీయతా గుణం కలిగిన ఈ కథలు పాఠకుడ్ని ఆసక్తిగా చదివింపజేస్తాయి. నిరంతర అధ్యయనశీలి, ఎన్నియో ఉద్యమాలలో ఆరితేరిన నిఖిలేశ్వర్ గారు తమ అనుభవాల గాఢతలోంచి మరిన్ని కథలు వెలువరించాల్సిన అవసరముంది. వారు ఆ దిశగా ఆలోచిస్తారని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here