[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
[dropcap]’నీ[/dropcap]లమత పురాణం’లో ‘పరశురాముడి’ గాథ చదువుతుంటే ఒక సందేహం వస్తుంది. 21 మార్లు భూప్రదక్షిణ చేసి క్షత్రియులను సంహరించిన రాముడు భృగువు సంతానం అని ఉంది ‘నీలమత పురాణం’లో. కానీ, మనకు పరిచయం ఉన్న పురాణాల ప్రకారం పరశురాముడు జమదగ్ని, రేణుకల సంతానం. జానపద గాథల ప్రకారం పరశురాముడు యెల్లమ్మ సంతానం. ఇపుడు ‘నీలమత పురాణం’ ప్రకారం భృగు సంతానం. భృగు సప్తర్షులలో ఒకడు. బ్రహ్మ సృజించిన ప్రజాపతులలో ఒకడు. మానసపుత్రుడు. బ్రహ్మావర్తంలో దృశద్వతి నదికి ఉపనది అయిన వసుధార నదీ తీరంలో ఇతని ఆశ్రమం ఉంది. ఈ ప్రాంతం రాజస్థాన్, హర్యానాల సరిహద్దు ప్రాంతం అని పలువురు భావిస్తున్నారు. కానీ నీలమత పురాణం ప్రకారం ‘గృధకూటం’పై ఇతని ఆశ్రమం ఉంది. పలు పురాణాలలో ఇలా పలు విభిన్న రకాలుగా ఉండడం కొందరికి పురాణాలపై అపనమ్మకం కలిగించింది. పురాణ గాథలు నమ్మదగ్గవి కావన్న భావన కలిగించింది. దాంతో వారు పురాణాలు చరిత్రే కాదు, పురాణాలలో ఉన్నదాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని తీర్మానించారు. వారి అడుగుజాడల్లో నడిచే భారతీయ మేధావులు కూడా ఇదే తీర్మానాన్ని ఈనాటికీ వల్లె వేస్తూ తాము మేధావులమని నిరూపించుకుంటున్నారు. విదేశీ వ్యాఖ్యలను ఉదహరిస్తూ తమ పాండిత్యాన్ని నిర్ధారించుకుంటున్నారు. పాశ్చాత్య దేశాల గాథలతో భారతీయ గాథలను పోల్చి తీర్మానిస్తున్నారు.
ఇక్కడ గమనించాల్సిందేమిటంటే, భారతదేశంలో ఒక రాష్ట్రం యూరప్‌లోని ఒక దేశం కన్నా ఎక్కువ విస్తీర్ణం, ఎక్కువ జనాభా కలవి. జనాభా లెక్కలలో మార్పులు ఉండవచ్చు కానీ భూవిస్తీర్ణంలో మార్పు లేదు. ఇంత విశాలమూ, ఇంత విభిన్నమైన భాషలు, పద్ధతులు ఉన్న దేశంలో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికే ప్రత్యేకమైన పద్ధతులు, సంస్కృతులు, అచారాలు, నమ్మకాలు ఉన్నాయి. ఈ విభిన్నమయిన వాటన్నింటినీ పూలను దారంతో గుచ్చి మాలగా తయారు చేసినట్టు భారతీయ ధర్మం ఏకత్రితం చేస్తోంది. ఆనాడూ, ఈనాడూ ఇప్పుడు, సాంకేతికంగా ఇంతగా అభివృద్ధి చెందిన కాలంలో కూడా ఒక సంఘటనకు పలు వ్యాఖ్యానాలు, పలు విభిన్నమైన కోణాలు ప్రచారంలోకి వస్తున్నాయి. కళ్ళ ఎదురుగా కనబడుతున్న దానిని కూడా, దానికి విభిన్నమైన ఆలోచనలు, ఊహలు చలామణీలోకి వస్తున్నాయి. అలాంటప్పుడు కేవలం మౌఖికంగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాప్తి చెందే గాథలలో మౌలిక గాథ మారకున్నా, దాని చుట్టూ ఉండే కథలలో మార్పు ఉండడం స్వాభావికం. ఎవరికి వారు తమకు అర్థమైన రీతిలో, ప్రాంతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లను అనుసరించి గాథలను చెప్పుకోవడం సహజంగా జరుగుతుంది. అంటే, ఒక ప్రాంతం గాథ మరో ప్రాంతం గాథకూ నడుమ తేడా ఉంటే, రెండూ పనికిరానివి అని కొట్టేయడం మూర్ఖత్వం మాత్రమే కాదు, విలువైన నిజాలను కావాలని అబద్ధాలుగా భావించి వదిలివేయడం అవుతుంది. పరశురాముడు జమదగ్ని కుమారుడు. నీలమత పురాణం భృగువు తనయుడు అంటోంది. ఇలాంటి సందర్భాల్లో మూలాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. అనువాదాలను విశ్లేషించాల్సి ఉంటుంది. ఎందుకంటే పలు సందర్భాలలో పదాలను అన్వయించటంలో పొరపాట్లు జరుగుతూంటాయి. దాంతో అర్థాలు మారుతూంటాయి. మూలం చదవలేని వారు అనువాదాలను ప్రామాణికాలుగా తీసుకుని వ్యాఖ్యానాలు, వాదనలు నిర్మించుకుంటారు. చివరికి మూలం మూలన పడుతుంది. వాదనలు, వ్యాఖ్యానాలు మిగులుతాయి.
ఆశ్రమస్వామినాప్నోక్తం పర్వతాదవతారితామ్।
స్వదేశ పార్శ్వో రామేణ భార్గవేణ మహాత్మనా॥
దీని ఆంగ్ల అనువాదం ఈ శ్లోకం, ఇంకో శ్లోకాన్ని కలిపి ఇలా చేశారు:
1209-1210
And by seeing the auspicious image called Asramaswami, erected by Bhrgu on Grdhakuta and brought down from the hill to the vicinity of his place, by the high minded Rama, the son of Bhrgu – one is freed from all sins. There is no doubt here in.
ఇదీ అనువాదం. రామేణ భార్గవేణ – son of Bhrgu – అయింది. అంటే, భృగువు తనయుడు. భృగువు సంతానం.
మూలంతో పోల్చకుండా అనువాదం ఆధారంగా తీసుకుంటే దేశంలో ప్రచారంలో ఉన్న పురాణాలకు, నీలమత పురాణానికీ నడుమ తేడా వస్తుంది. దాంతో పురాణాలు ఎవరికి తోస్తే వారు ఏదో రాశారని, బ్రాహ్మణులు తమ ఇష్టం వచ్చినట్టు, తమకు ఎలా ఉంటే లాభం కలుగుతుందో అలా ప్రక్షిప్తాలు, నిక్షిప్తాలతో మన పురాణాలను భ్రష్టు పట్టించారని దూషించే వీలు చిక్కుతుంది. పుక్కిటి పురాణాలను నమ్మే భారతీయులు ఎంత మూర్ఖులో అని ఓ పీఠంపై తమని తాము ఊహించుకుంటూ, మిగతా అంతా దీనులు, హీనులు, తెలివి లేని పశు సమానులు అని వ్యాఖ్యానించే వీలు చిక్కుతుంది.
పరశురాముడిని భార్గవరాముడు అని కూడా అంటారు. అతడు భృగుకులోత్పన్నుడు. అంటే భృగు వంశానికి చెందినవాడు. ఎలాగయితే కురువంశంలో పుట్టినవారు కౌరవులో, భృగు వంశంలో జన్మించినవారు భార్గవులు. పాంచాలురు, పాండవులు, యాదవులు, రాఘవులు, ఇలా వంశాల పేర్లు ఆయా వంశాలలో జన్మించిన వారికి ఆపాదిస్తారు. కులం, వంశం వంటివన్నీ నిర్దిష్టమైన అర్థాలున్న పదాలు. అయితే దశరథ సుతుడు దాశరథి, వసుదేవుడి సుతుడు వాసుదేవుడు ఇలా కూడా తండ్రి పేరు ద్వారా సంతానాన్ని గుర్తిస్తారు. దాశరథి అన్న పేరు రాముడికే కాదు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకి కూడా వర్తిస్తుంది. కాని పెద్దవాడు కాబట్టి రాముడినే అధికంగా ‘దాశరథి’ అనటం కనిపిస్తుంది. కాబట్టి భార్గవ అంటే భృగువు కొడుకు అని పొరపడే అవకాశం ఉంది. ఇక్కడ అనువాదంలో కూడా ఇలాంటి పొరపాటు జరిగింది. భార్గవ అనగానే భృగు సంతానం – son of Bhrgu – అని అనువదించారు. కానీ ఇతర పురాణాలు చూస్తే పరశురాముడు జమదగ్ని సంతానం అని స్పష్టమవుతోంది. భార్గవ అంటే భృగు సంతానమే కానక్కరలేదు. భృగువు సంతతికి చెందినవాడు, భృగు వంశానికి చెందినవాడు అని కూడా తీసుకోవచ్చు. కాబట్టి ‘son of Bhrgu’ అనే బదులు ‘descendant of Bhrgu’ అని కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక పదానికి అర్థం చెప్పుకునే సందర్భంలో పలు విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్న మాట. ఎప్పుడయితే ‘son of Bhrgu’ ను ‘descendant of Bhrgu’ అని అర్థం చేసుకుంటామో, అప్పుడు నీలమత పురాణానికి ఇతర పురాణాలకీ నడుమ ఎలాంటి తేడా రాదు. అన్ని పురాణాలు ఒకటే గాథను ఒకే రకంగా చెప్తున్నాయి. భారతీయ పురాణాల విషయంలో నెలకొని ఉన్న అపోహలు, దురూహలు, దుష్ప్రచారాలు, దుర్వ్యాఖ్యానాలకు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఇది. అందుకే పాశ్చాత్యుల వ్యాఖ్యలు, అనువాదాలు ఎన్ని ఉన్నా మన పురాణాలను మన దృష్టితో మనమే విశ్లేషించి వివరించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.
ఇప్పుదు గోనందుడి సందేహాలకి సమాధానం వైపు దృష్టి సారిద్దాం.
(ఇంకా ఉంది)