నీలమత పురాణం – పరిచయం

    0
    5

    [box type=’note’ fontsize=’16’] “కశ్మీరుకు చెందిన అతి పురాతనమైన గ్రంథం నీలమత పురాణానికి తెలుగు అనువాదం. [/box]

    [dropcap]”నీ[/dropcap]లమత పురాణం” గురించి భారతదేశంలో అతి కొద్ది మందికి తెలుసు. ‘కల్హణ కశ్మీర రాజతరంగిణి’ చదివిన వారికి దానిలో కల్హణుడు అతి ప్రాచీనమైన నీలమత పురాణాన్ని ప్రస్తావించి, తాను కశ్మీర్ ప్రాచీన రాజుల వివరాలు నీలమత పురాణం నుంచే సేకరించానని చెప్పటం వల్ల కశ్మీర్‌కు ప్రత్యేకమైన “నీలమత పురాణం” అంటూ ఒక పురాణం ఉందని తెలుస్తుంది.

    కాశ్మీర్ ఆవిర్భావ గాథను కల్హణుడు నీలమత పురాణం నుంచీ గ్రహించాడు. ముఖ్యంగా కశ్మీరును పాలించిన ప్రాచీన రాజుల వివరాలు, ఆచార వ్యవహారాలు, ప్రజల జీవన విధానం, స్థితిగతులు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు వంటి వివరాలన్నీ కల్హణుడు ‘నీలమత పురాణం’ నుంచి సేకరించాడు. అయితే, నీలమత పురాణం ప్రసక్తి రాజతరంగిణిలో వచ్చింది కానీ, అనేకులకు నీలమత పురాణం లభించలేదు. రాజతరంగిణిని అనువదించి పరిష్కరించినవారు సైతం నీలమత పురాణాన్ని తాము చూడలేదని రాశారు. చివరికి, 1924లో నీలమత పురాణం తొలి ప్రతి ప్రచురితమయింది. అప్పటి నుంచి పరిశోధకులు నీలమత పురాణాన్ని అధ్యయనం చేస్తున్నారు, విశ్లేషిస్తున్నారు.

    ఈ గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించారు చరిత్ర రచయిత వేద్ కుమారి. ‘రాజ తరంగిణి కశ్మీరు రాజకీయ చరిత్రను తెలుసుకోవడంలో ప్రధానపాత్ర పోషిస్తే, కశ్మీరు సాంస్కృతిక చరిత్రను తెలుసుకోవడంలో నీలమత పురాణం ప్రాధాన్యం వహిస్తుంద’ని అభిప్రాయపడ్డారు. అంతే కాదు, నీలమత పురాణాన్ని రాజతరంగిణితో కలిపి కశ్మీర్, పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్, ఖొరోసాన్, తజకిస్థాన్ వంటి ప్రాంతాల జాతీయ పౌరణిక గాథగా పరిగణించవచ్చంటారు.

    కశ్మీర్ ఆవిర్భావం, కశ్మీరుని పార్వతికి ప్రతిరూపంగా భావించటం, కశ్మీరులో పలు శైవ క్షేత్రాలు వెలయటం వంటి పలు విషయాలకు సమాధానం నీలమత పురాణంలో లభిస్తుంది. ఆ కాలం నాటి ప్రపంచ పటం, ఆనాటి నదులు, ప్రజలు, వివిధ జాతులు, వారి వ్యవహారాలు, ఆచారాలు, ధార్మికత వంటి విషయాలు, సామాజిక జీవనంతో పాటు పలు ఆసక్తికరమైన అంశాలు నీలమత పురాణం ద్వారా తెలుస్తాయి. అంతేకాదు, సమాజంలో ఆనాడు స్త్రీలకు ఉన్న ప్రధాన పాత్ర, నిర్ణయాత్మకమైన రీతిలో ఉండే వారి వ్యవహారం వంటి అనేక విషయాలు మనకు నీలమత పురాణం ద్వారా తెలుస్తాయి. నీలమత పురాణంలో సాంఖ్యతత్వం ప్రధానంగా కనిపిస్తుంది. శైవ ప్రాధాన్యం ప్రస్ఫుటంగా ఉంటుంది. ప్రపంచం సతీ స్వరూపం అన్న భావన ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే నీలమత పురాణం, కల్హణ రాజ తరంగిణిని మరింతగా అర్థం చేసుకోడానికి తోడ్పడుతుంది.

    ప్రాచీన భారతీయ వాఙ్మయము గురించి ఉన్నట్టే, నీలమత పురాణం గురించి కూడా పలు అపోహలున్నాయి. వివాదాలు ఉన్నాయి. రాజ తరంగిణి 11వ శతాబ్దంలో వ్రాసినది కాబట్టి నీలమత పురాణం క్రీ.శ. 6 నుంచి క్రీ.శ. 8వ శతాబ్దం నడుమ రాసినట్టు చరిత్రకారులు తీర్మానించారు. అయితే చరిత్రకారుల తీర్మానాలు, సిద్ధాంతాల జోలికి పోకుండా ‘నీలమత పురాణాన్ని’ ఒక చారిత్రక పత్రంలా భావించి చదివి విశ్లేషిస్తే కశ్మీర్ గురించే కాదు, భారతదేశం గురించి అనేక ఆసక్తికరమైన విషయాలూ తెలుస్తాయి. ఆ కాలంలో దేశం నలుమూలల నుంచి పండితులు కశ్మీర్ చేరడం, కశ్మీర్ నుంచి ప్రజలు మిగతా దేశంలోని పలు తీర్థ ప్రదేశాలకు యాత్ర చేయడం వంటి విషయాలు తెలుస్తాయి. అంటే, ఈనాడు, సంఖ్యాబలం చూపించి ‘కశ్మీర్ మాది’ అని ‘మతం’ ఆధారంగా ‘ప్రత్యేకత’ను కోరుతున్న పరిస్థితులలో, కశ్మీరు భారతదేశంలో భౌగోళికంగానే కాదు, సాంప్రదాయికంగా, ధార్మికంగా, సాంస్కృతికంగా, తాత్వికంగా ఒక అవిభాజ్యమైన అంగం అని భారతదేశం ప్రజలందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. భారతీయాత్మ కశ్మీర్ అన్న విషయం తెలుసుకుని, కశ్మీరును కాపాడుకోసం ఉద్యుక్తులవాల్సిన అవసరం ఉంది.

    భారతదేశ ప్రజలకు కశ్మీర్ భారతదేశంలో అవిభాజ్యమైన అంగం అని నిరూపించేందుకు ‘కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు’ ను గతంలో వెలువరించాను. అది పుస్తక రూపంలో వచ్చింది. సహృదయులైన పాఠకులను అలరిస్తూ, ఆలోచనలను రగిలిస్తూ సాహిత్య ప్రపంచంలో తనదైన సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది.

    కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ‘నీలమత పురాణం’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నాను.

     నేను రచించిన కళణ కశ్మీర రాజతరంగిణి కథలు చదివి ఎంతో ప్రభావితుడయిన శ్రీ రామగిరి లక్ష్మీనరసిమ్హం గారు, నేను నీలమతపురాణాన్ని కూడా తెలుగువారికి అందించాలనిపట్టుబట్టారు. నేను వారిమాటలను సీరియస్ గా తీసుకోలేదు. ఆయన రెండుమూడుమార్లు అడిగిన తరువాత తప్పించుకోవటానికి నీలమతపురాణం అందుబాటులోలేదని తప్పించుకోవాలని ప్రయత్నించాను. కానీ, ఆయన నీలమతపురాణం పుస్తకాన్ని నాకు అందించటమేకాక, నేను దాన్ని అనువదించి ప్రచురించేవరకూ నన్ను అడుగుతూనేవున్నారు . వారి ప్రోద్బలమే  ఈ అనువాదం తెలుగు పాఠకులకు చేరేందుకు ప్రధాన కారణం. వారికి ధన్యవాదాలు. ఇది కశ్మీర్ ‘మనది’  అన్న తీవ్రమైన భావన ఏ ఒక్కరిలో కలిగించి, ‘కశ్మీర్‌ను కాపాడుకుందాం’ అన్న ఆలోచన కలిగిస్తే చాలు, ఈ ప్రయత్న లక్ష్యం నెరవేరినట్టే.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here