నిరాశ్రయి

0
6

[dropcap]ఎ[/dropcap]డమొహం పెడమొహం
పీఠమేసి కూచున్న గుట్టల నడుమ
ఎండిపోయిన నారుమడిలా
ఒక పాడుబడిన ఊరు…
చావుమత్తు లాంటి చీకటి గడపలో
జోగుతుండే నిరాశల నిరాశ్రయి…
ఆ ఊరిని అంటిపెట్టుకుని
జీవం లేని కొన్ని జీవాలు!

కంపు కోనేరు దాపున
ఈదరగా వినిపించే గాలిహోరులో
చెట్ల సందులు పల్లికిలిస్తుంటాయి
కొన్నాయి మెట్టలు దాటెళ్తే
కల్లు కుంపాల చాటున జీడిమామిడి తోటలు
గాలి అలల్లో తూలిపోతుంటాయి

ఏళ్లుగా నగరం ఏటిలోకి ఎగబడిన
సుమతులన్నీ కాలమతుల్ని తోడ్కొనిపోగా
మందమతులు చిక్కడిపోయిన
అడుగంటిన చెరువులా
ఒక్కొక్కరూ విడిచిపోతున్న
ఆ ఊరు మాత్రం
బూడిద బుస్సన్నల నిట్టాడి కొంపలా మిగిలింది
అనామకుల సమాధుల్ని వదలలేక –
శ్మశానం చెట్టుకు వేలాడే ఎండుకొమ్మ
ఆ ఊరికి ఆనవాలు చెప్తుంది

విశాల ప్రపంచానికి
పరిచయమవ్వక మునుపే
అక్కడి కుర్ర మట్టి కనుమాసిపోతుంది
కాలేయాన్ని కొరుక్కుతినే వ్యసనం
నాలుగు పదులు దాటిన
ఒక్క మీసాన్ని కూడా
ఊపిరితో ఉండనివ్వదు
పురాతన వృద్ధతరాన్ని చూసి
కొండకళ్లు కొయ్యబారిపోతాయి
మట్టి ఒళ్ళు మొద్దుబారిపోతుంది
రాలుగింజలు తలదాచుకున్న పొలంగట్లు
ఒరిగిపోయాయో? కుమిలిపోయాయో?
తలెత్తుకు చూసే ఒక్క మొలక జాడ కూడా
మచ్చుకైనా కనిపించదు

బతుకులో చిగురాశైనా
కాస్త పచ్చగా నిలుపుకోవడానికి
కొండదాటి గుట్టదాటి
చూపు సారించడం తప్పదనుకుంటే
ఆకలి తీరక అలసిపోయిన దృష్టి…!?
మందగించిన కళ్లజోడుకు
గాజుకళ్లు అమర్చినా
చూపు ఆనడం లేదు!

రెక్కల తూనిక లేని పిట్టలు
ఏవో కొన్ని బిక్షపు గింజలకోసం
కళ్ళు కాయలుకాచేలా
ఎదురుచూపులవుతుంటాయి
కన్నీళ్లు గడ్డకట్టిన కోవల్లో
ఎవ్వరికీ అక్కర లేని పూల పాదులు
రాతిగుండెల్లో కప్పెట్టిన పరిమళాలను
పదిల పరుచు కుంటుంటాయి
తాళాలు పడిన ఇళ్లు
తోరణాలకు ముఖం వాచిన వీధులు
దశాబ్దాల నిరాదరణతో
కునారిల్లిన పల్లె బతుకులు
కనుచూపు మేర దాటే చోట
కొండలా పోగుపడిన చీకటి చావిడిలో
పొయ్యి వెలిగించే ఓ నిప్పుకణం కోసం
పొగరాజేస్తూ…పొగరాజేస్తూ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here