నిర్ణయం

0
10

[dropcap]ప[/dropcap]దవీ విరమణ చేసిన తరువాత మా అమ్మాయి గోల పడలేక మా శ్రీమతితో కలిసి అమెరికాలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఎంతో సాదరంగా ఆహ్వానించారు కూతురు, అల్లుడు. ఇక మా మనుమరాలు మిహిత సరేసరి ‘తాతయ్యా’ అంటూ మెడల మీదే నాట్యం చేసింది. దానికి తెలుగు ధారాళంగా రాదు, దాని ఆంగ్ల భాషా పటిమ నాకు అర్థం కాదు. ఆంగ్లంలో కొద్దో, గొప్పో ప్రవేశం ఉన్నా ఆ ఉచ్చారణ మనకు అంతుబట్టేది కాదని నాకు అర్థమయిపోయింది. ఇక మా శ్రీమతి సరేసరి. మనవరాలు చెప్పేది తనకు, తను చెప్పేది మనుమరాలికి అర్థంకాక వాళ్ళు మౌనాన్ని ఆశ్రయించారు. ఇహ లాభం లేదనుకుని నా మనుమరాలికి తెలుగు నేర్పాలనే నిర్ణయానికి వచ్చాను. కానీ మనసులో ఒక సందేహం మెదులుతోంది. నా ఆలోచన నా అల్లుడికి నచ్చుతుందో, లేదో. ఎందుకంటే తెలుగు మాతృభాష అయిన చోటే తెలుగులో మాట్లాడడం పెద్ద అవమానంగా భావిస్తున్నారు. బొడ్డు ఊడినప్పటి నుంచి తల్లులు ‘అమ్మా’ అని పిలిపించుకుంటే సిగ్గని ‘మమ్మీ’ అని పిలిపించుకుంటూ, ప్రతి వస్తువు పేరును, పదాలను ఆంగ్లంలో నేర్పుతూ, తెలుగు బిడ్డకు తెలుగంటే తెలియకుండా చేస్తున్నారు. అందుకని ఎందుకైనా మంచిది, అడిగి చేస్తే పోలేదా అనిపించింది నాకు. ఒకరోజు భోజనాల సమయంలో కదిలించాను అమ్మాయిని, అల్లుడిని.

“బాబూ వాత్సవా. మిహిత తెలుగు అంత బాగా మాట్లాడలేక పోతున్నది. వాళ్ళ అమ్మమ్మకు దానితో మాట్లాడాలనే ఆరాటం. కానీ దానికా ఆంగ్లం రాదు. మిహితకు తెలుగు అర్థం కాక వాళ్ళ అమ్మమ్మ ఏంచెప్పినా “ఓకె అమ్మమ్మా” అని ఒక నవ్వు నవ్వి అక్కడి నుంచి పారిపోతున్నది. నేనేదో వచ్చీరాని భాషతో సర్దుకుంటున్నాననుకో. అందుకని….”

“ఏమిటి మామయ్యగారు ఆపారు. చెప్పండి”

“మిహితకు ఇప్పుడు సెలవులే కదా. కొద్దిగా తెలుగు అక్షరాలు నేర్పి, మాట్లాడడం కూడా అలవాటు చేద్దామని”

“ఈ మాట మీనోటి నుంచి వస్తే బాగుండునని ఎదురు చూస్తున్నాము నాన్నా. మా ఇద్దరి ఉద్యోగాలతో, వంటపని, ఇంటిపనితో దానికి తెలుగు నేర్పే అవకాశమే దొరకటం లేదు. అదికూడ స్కూలులో అంతా ఆంగ్లమే కావడంతో తెలుగును అంతగా పట్టించుకోవడం లేదు. అప్పటికీ మీ అల్లుడు గారు ఆదివారాలంతా అందరమూ తెలుగులోనే మాట్లాడుకోవాలని నియమం పెట్టడంతో, ఆ మాత్రమైనా పొడిపొడి మాటలు దానికి వచ్చాయి”

“మామయ్యగారు. నాకు మీ అంత ఓర్పు లేదు. మీరు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు కనుక మీరైతే ఓర్పుగా మిహితకు నేర్పగలరు. ఇంటికొచ్చిన మీకు ఇలాంటివి చెబితే ఏమనుకుంటారోనని, మేము అడగలేదు. మీకు అంగీకారమైతే మాకు అంతకంటే ఏంకావాలి. తెలుగుబిడ్డకు తెలుగురాదంటే అవమానమని మేము దిగులుపడని రోజు లేదు. ఆనందంగా నేర్పండి”

ఇద్దరూ తమ అంగీకారం తెలపడంతో ఒక శుభముహూర్తాన మిహితకు తెలుగు అక్షరాలు నేర్పడం మొదలుపెట్టాను. బుద్ధిగా చెప్పినట్లల్లా చేసేది. నెలరోజులకల్లా అక్షరాలన్నీ వచ్చాయి. చిన్నచిన్న పదాలు నేర్పుతూ, అర్ధంకాని వాటిని ఆంగ్లంలో చెప్పి, దాన్ని తెలుగులోకి తర్జుమా చేసి అర్ధమయ్యేలా చెప్పేవాడిని. దాంతో అది సులభంగానే అర్ధం చేసుకుని మాట్లాడేది. అలా అలా రెండు నెలలలో గుణింతాలు కూడ నేర్చుకునేసింది.

మధ్య మధ్యలో దానికి వేమన శతకాన్ని రాగయుక్తంగా పాడుతూ, మిహిత చేత పాడించేవాడిని. అది కూడ చాలా ఇష్టంగా నేర్చుకునేది. భావమేమిటో కూడ చెప్పేవాడిని. తెలుగులోనే సంస్కారము ఇమిడి ఉందని నమ్మేవాడిని కనుక, నా మనుమరాలు కూడ అమెరికాలో ఉన్నా మంచి సంస్కారవంతురాలిలా తయారవాలనే ఆశ. అలా రెండు నెలలు గడిచిపోయాయి. ఇంట్లో అందరం తెలుగులోనే మాట్లాడుకోవడం అలవాటు చేసుకున్నాం, మిహితతో సహా.

***

“నాన్నా మీకో శుభవార్త. మీరు పాడే పద్యాలు విని, మీ గాత్రంలోని మాధుర్యానికి అబ్బురపడి పై అంతస్తులోని ఆంగ్లయువతి నన్ను పిలిచి అడిగింది, ‘ఏమిటవి’ అని.  అది తెలుగని, అవి గొప్ప కవి వ్రాసిన శతకాలని, నాన్నగారు పాపకు నేర్పుతున్నారని చెప్పాను. ఆమె నాన్నగారు ‘నాకు కూడ నేర్పుతారా’ అని అడిగింది. మిమ్మల్ని అడిగి చెబుతానన్నాను” ఇంట్లోకి అడుగు పెడుతూనే చెప్పింది నా కూతురు శ్రీహిత.

నా మనసు ఆనందంతో నిండిపోయింది. నా భాషకున్న సౌందర్యం ఎంత గొప్పదో అర్థమయింది. ఒక్క ముక్క అర్థం కాకున్నా భాషలోని మాధుర్యానికి పరాయిభాష వాళ్ళు ముగ్ధులై తెలుగు నేర్చుకోవాలని ఆరాటపడుతున్నారంటే నాకు గర్వంగా అనిపించింది. నా భాషను పరాయి దేశంలో పరిచయం చేసే భాగ్యం కలగడం నా అదృష్టంగా భావించి ‘సరే’ అన్నాను. వారం గడిచేసరికల్లా ఆ అమ్మాయితో పాటు మరో నలుగురు జత అయ్యారు. వచ్చీరాని యాసతో వాళ్ళు ఒక పది పద్యాల వరకు నేర్చుకున్నారు. ఈ మధ్యలోనే మా చిచ్చర పిడుగు తన స్నేహితులతో చెప్పిందేమో, దాని స్నేహితులలో గల తెలుగు రాష్ట్రాల పిల్లలు ఒక అయిదుగురు తెలుగు నేర్పమని వచ్చారు. దాంతో పగలు పిల్లలుకు తెలుగు, సాయంత్రం పూట ఆంగ్ల వనితలకు వేమన శతకాలు నేర్పుతూ ఆరునెలలను ఆరు రోజులులా గడిపేశాను.

***

ఆ రోజు అమెరికా నుంచి మా తిరుగు ప్రయాణం. నా శిష్యజనమంతా వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. వచ్చే సంవత్సరం మరల రావాలని, కావాలంటే మా ప్రయాణ ఖర్చులు వాళ్ళే భరిస్తామని చెప్పారు. అందరు పిల్లలు తెలుగులోనే మాట్లాడారు. మా శ్రీమతి మనమరాలితో ముచ్చట్లలో పడిపోయింది. చిన్న పిల్లలంతా “తాతయ్యా మరల ఎప్పుడొస్తారు?” అని చుట్టుముట్టారు.

“మామయ్య గారు. మీరు రావడం వల్ల నా బిడ్డకే కాదు, తనలాంటి మరికొందరు తెలుగుబిడ్డలకు తెలుగును పరిచయం చేయటం జరిగింది. ఇప్పుడు వీళ్ళంతా వారు నేర్చుకుంటున్న విద్యను మధ్యలో ఆపుకుంటున్నామని బాధపడుతున్నారు. దీన్ని అర్ధాంతరంగా ఆపకుండా మీరే ఏదైనా మార్గం ఆలోచించండి. అంటే ఇది నా మాట కాదు. ఆ పిల్లల తల్లిదండ్రులు మిమ్మల్ని అడగమన్నారు. కావాలంటే కొంత మొత్తాన్ని గురుదక్షిణగా సమర్పిస్తామన్నారు” చెప్పలేక చెప్పాడు మా అల్లుడు.

“వాత్సవా నా తెలుగుభాషను డబ్బు తీసుకుని నేర్పడమా.  అంత పాపం చెయ్యలేను. పాపకు ఎలాగూ అంతర్జాలంలో వీడియో ద్వారా తెలుగు నేర్పడం కొనసాగిస్తానని శ్రీహితకు చెప్పాను. మిహిత స్నేహితులను కూడ వచ్చి తనతో పాటు నేర్చుకోమని చెప్పు. నేనెలాగు ఖాళీనే కనుక అందరికీ వీలైన సమయం చెబితే నేను సిద్ధమయి ఉంటాను. ఆ రకంగానైనా నా తెలుగు భాషకు నా వంతు సేవ చేసిన వాడిని అవుతాను. అది నా మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది” అని నా అంగీకారాన్ని తెలియచేశాను.

ఇంతలో నా వద్ద శతకాలు నేర్చుకుంటున్న అమ్మాయిలు కూడ వచ్చారు. అందరూ పూలగుత్తులిచ్చి నా పాదాలకు నమస్కారం చేశారు. వాళ్ళ సంస్కారం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళకు నా ఫోను నెంబరు ఇచ్చి, మీరు  ఎప్పుడు ఖాళీగా వుంటే అప్పుడు నాకు ఒక్క ఫోను చేస్తే చాలు, పద్యాలు నేర్పుతానని హామీ ఇచ్చి, అందరినీ సాగనంపాను. ఆ క్షణంలో వాళ్ళ కన్నులలో కనిపించిన కృతజ్ఞతా భావం నా మనసును కదిలించింది. దేశం కాని దేశంలో నా తెలుగుతల్లి, మన సాంప్రదాయాలు ఇంత గొప్పగా చూడబడుతుంటే, ఎందుకు మనదేశంలో వాళ్ళు మన భాషను, సంప్రదాయాన్ని అంత అవహేళన చేస్తారో నాకు అంతుబట్టలేదు.

అప్పుడే నా మదిలో ఒక ఆలోచన తలుపుతట్టింది. పదవీ విరమణ చేసిన తరువాత ఇక నా అవసరం సమాజానికి లేదని ఇన్నాళ్ళూ అనుకున్నాను. కానీ అసలు అవసరం ఇప్పుడే మొదలయింది. ఇకనుంచి నా శేషజీవితాన్ని పరాయిదేశంలోనే కాదు, నా దేశంలో కూడ భాషాభ్యుదయ సాధనానికి అంకితం చేస్తాను. నా తెలుగుతల్లికి గత వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి నావంతు కృషిచేస్తానని మనసులోనే నిర్ణయం తీసుకుని, మిహితను ఎత్తుకుని లోపలికి వెళ్ళాను, మిగిలిన సామాన్లు సర్దుకుందామని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here